హెలీప్యాడ్ నిర్మాణ పనుల పరిశీలన
వర్గల్: ప్రధాని పర్యటన నేపథ్యంలో వర్గల్ మండలం నెంటూరు శివారులో హెలిప్యాడ్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. కోమటిబండ మిషన్ భగీరథ పథకం సంప్‌నకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నెంటూరు శివారు ప్రభుత్వ భూమిలో మొత్తం నాలుగు హెలిప్యాడ్ నిర్మాణాలు చేస్తున్నారు.
ఒకటి ప్రధాన మంత్రి కోసం, రెండోది ప్రధానమంత్రి కార్యాలయ అధికారులకు, మూడోది సిబ్బంది కోసం నిర్మిస్తున్నారు. వీటికి కొద్ది దూరంలో సీఎమ్ కోసం ప్రత్యేకంగా నాలుగో హెలిప్యాడ్ నిర్మిస్తున్నారు. ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ బాలప్రసాద్ పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే ఖాళీ స్థలంలో తుప్పలు తొలగించి చదును చేసారు. కంకర్, వెట్‌మిక్స్ వేసి రోలర్‌తో బాగా తొక్కించారు. సబ్‌రోడ్డు పనులను వేగవంతం చేసారు. ఆదివారం హెలిప్యాడ్లను తారుతో తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా డిప్యూటీ ఈఈ తెలిపారు. శనివారం గడా ఓఎస్డీ హన్మంతరావు నెంటూరు సందర్శించారు. హెలిప్యాడ్ నిర్మాణ పనులు పరిశీలించారు. డిప్యూటీ ఈఈ బాలప్రసాద్‌తో మాట్లాడి పనుల పురోగతి సమీక్షించారు. పలు సూచనలు చేసారు.