‘ఒత్తిడి’ వ్యూహం!
విజయవాడ సిటీ : పెద అవుటపల్లి జాతీయ రహదారిపై బుధవారం జరిగిన గంధం నాగేశ్వరరావు, అతని కుమారులు పగిడి మారయ్య, మారయ్యల హత్య కేసు దర్యాప్తులో నిందితుల పట్టివేతకు పోలీసులు ‘ఒత్తిడి’ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నిందితులు అనివార్యంగా పోలీసుల వద్దకు వచ్చే విధంగా దర్యాప్తు కొనసాగించాలని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ముందుకు వెళుతున్నారు. వీరి ముగ్గురి హత్యలో ముంబయికి చెందిన నలుగురు కిరాయి హంతకులతో పాటు ఇక్కడివారు ఆరుగురు పాల్గొన్నట్టు గుర్తించారు.
భూతం శ్రీనివాసరావు, పురాణం గణేష్, ఎస్సీ శ్రీనివాస్‌తో పాటు మరో ముగ్గురు స్థానికులు పాల్గొన్నట్టు నిర్ధారించారు. శ్రీనివాస్‌లు ఇద్దరితో పాటు గణేష్ గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని తొందరగా దొరికే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. మిగిలిన ముగ్గురిపై ఒత్తిడి పెంచడం ద్వారా ఇక్కడికి రప్పించి కీలక పాత్రధారులను పట్టుకునే ప్రయత్నాల్లో దర్యాప్తు బృందాలు ఉన్నాయి. వీరి సమీప బంధువులు, కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా సెంటిమెంటు అంశాలపై ఎక్కువ దృష్టిసారించారు. పోలీసు విచారణ శైలిని నిందితులకు చేరేలా అవసరమైన చర్యలు తీసుకున్నారు. తద్వారా కేసులో అనవసరంగా ఇరుక్కున్నామనే అభిప్రాయం నిందితుల్లో వచ్చి పోలీసుల వద్దకు వస్తారనేది పోలీసుల వ్యూహంగా ఉంది.
ఆస్తులపై గురి...
ఆస్తులు పోతాయనే భయం కలిగించడమే మార్గమని పోలీసు అధికారులు చెబుతున్నారు. నగర డెప్యూటీ పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్ నేతృత్వంలో శుక్రవారం పినకడిమి గ్రామాన్ని జల్లెడపట్టి పెద్ద మొత్తంలో నగదు, నగలు, ఇతర విలువైన పత్రాలు స్వాధీనం చేసుకోవడం ఇందుకు నిదర్శనం. నిందితులు రాకుంటే ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామనే సంకేతాలు పంపుతున్నారు.
ఏళ్లతరబడి కూడబెట్టిన ఆస్తులు పోతాయంటే నిందితులు పోలీసులకు చిక్కక తప్పదని చెబుతున్నారు. హత్యలు జరిగిన మరుసటి రోజు నుంచే నిందితులు ఉపయోగించినట్టుగా చెబుతున్న మొబైల్ ఫోన్లు ఆపేశారు. కొత్త నంబర్లతో ఏలూరుకు చెందిన కొందరు న్యాయవాదులతో నిందితులు టచ్‌లో ఉన్నట్టు పోలీసు అధికారులకు సమాచారం అందింది. ఇందులో భాగంగా కొందరు న్యాయవాదుల కదలికలపై పోలీసు వర్గాలు సమాచారం సేకరిస్తున్నాయి.