లాకర్లలో బంగారంపై.. అదంతా తప్పుడు ప్రచారమే!
''పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇక బ్యాంకులో లాకర్లను టార్గెట్ చేయబోతున్నారు.. తహసీల్దార్ సమక్షంలో లాకర్లు తెరుస్తారు. ఒక మహిళకు 600 గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉన్నా, లెక్కలు చూపించని బంగారం ఉన్నా దాన్ని స్వాధీనం చేసుకుంటారు'' అని ఈమధ్య వాట్సప్‌లో ఒక సందేశం తెగ సర్క్యులేట్ అయ్యింది. కానీ.. అసలు అలాంటిదేమీ లేదని, బ్యాంకు లాకర్లను తెరవాలని గానీ, బంగారాన్ని స్వాధీనం చేసుకోవాలని గానీ నిర్ణయం కాదు కదా అసలు చర్చ కూడా ఏమీ లేదని తేలిపోయింది. ఈ విషయమై ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ట్వీట్లో స్పష్టీకరణ ఇచ్చింది. దాంతో ఇప్పటివరకు వాట్సప్ లాంటి సోషల్ మీడియాలో దానిపై జరిగినదంతా ఉత్తుత్తి ప్రచారమేనన్న విషయం తేలిపోయింది.
దొంగల పనేనా?
నిజానికి లాకర్లలో పెట్టిన బంగారం గురించి ఇలాంటి వదంతులు వ్యాపింపజేస్తే, అప్పుడు లాకర్లలో ఉన్న బంగారాన్ని ఇళ్లకు తీసుకొచ్చేస్తారని, దాంతో తమ పని సులభం అవుతుందని భావించిన కొందరు దొంగలే ఇలాంటి ప్రచారం మొదలుపెట్టి ఉంటారన్న అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి. పాతనోట్లు చెల్లకపోవడం, కొత్త నోట్లు ఇంకా పెద్ద మొత్తంలో బయటకు రాకపోవడంతో కొన్నాళ్లుగా దొంగలకు చేతిలో పనిలేకుండా పోతోంది. అందుకే బంగారం అయితే సులభంగా తీసుకెళ్లొచ్చన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
विमुद्रीकरण पर भ्रम टूटा pic.twitter.com/cEgRBI30pt
— Ministry of Finance (@FinMinIndia) 18 November 2016