India@75
-
నెల్లూరు జిల్లాకు జాతీయ అవార్డు
నెల్లూరు (పొగతోట): అజాదీకా అమృత్ మహోత్సవం కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా 780 జిల్లాలో120 రోజులపాటు ఈ కార్యక్రమాల అమలు తీరును కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. ఉత్తమ పనితీరు కనబర్చిన టాప్ 10 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 4వ స్థానంలో నిలిచింది. త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఢిల్లీలో ఈ అవార్డు అందుకోనున్నారు. చదవండి: (దశాబ్దాల స్వప్నం సాకారం) -
గాంధీ గురించి ఈ తరం పిల్లలకు తెలియాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: 75 ఏళ్ల స్వాతంత్య్ర ఫలాలను భారత ప్రజలు ఆస్వాదిస్తున్న వేళ.. నాటి అమరవీరులను త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎల్బీ స్టేడియంలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. 'ఎంతో మంది త్యాగాలతోనే స్వాతంత్య్రం వచ్చింది. గాంధీ గురించి ఈ తరం పిల్లలకు తెలియాల్సి ఉంది. దేశాన్ని ఉన్మాద స్థితిలోకి మారుస్తున్నారు. దీన్ని చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు. దేశం అనుకున్నంత పురోగతి సాధించలేదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సరైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటుందని' సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: (సీఎం జగన్ నిర్ణయంతో మంచి జరుగుతుందని భావిస్తున్నా: ఉండవల్లి) -
రగిలింది విప్లవాగ్ని ఈరోజే!
భారత స్వాతంత్య్ర ఉద్యమానికి అతివాద, మితవాద, విప్లవ వాద మార్గాలను ఎన్నుకున్న అనేకమంది దేశ భక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. ఈ ఉద్యమ స్రవంతుల్లో ఆయుధం పట్టి బ్రిటిష్‌వాళ్ల భరతం పట్టాలన్న వర్గానికి చెందినవారు అల్లూరి సీతారామరాజు. అమాయక గిరిజనుల బాధలను దగ్గర నుంచి గమనించి, విజ్ఞాపనల ద్వారా వారి సమస్యలు పరిష్కారం కావని గ్రహించారు. అందుకే మన్యం ప్రాంతంలో అద్భుతమైన గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అల్లూరి సీతారామరాజు చేసిన ఈ సంచలన యుద్ధానికి నేటితో నూరు వసంతాలు. ► అడవి నుంచీ, పూర్వీకుల నుంచీ వచ్చిన స్వేచ్ఛా జీవనానికి సంకెళ్లు వేయాలని చూసిన చట్టాలకు ప్రతిఘటనలే గిరిజనోద్యమాలు. దేశం నలుమూలలా జరిగిన అలాంటి ఉద్యమాలలో 1922–24 నడుమ విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు (శ్రీరామరాజు) నిర్వహించిన పోరాటం ప్రత్యేకమైనది. అవన్నీ కొండా కోనా మీద హక్కు కోసం కొన్ని తరాల ఆదివాసీలు పడిన తపన, వేదనలే. స్థానిక సమస్యల మీద తలెత్తినట్టు కనిపించినా నిజానికి అవి ప్రభుత్వాల మీద యుద్ధాలే. విశాఖ మన్య పోరాటంలో మైదాన ప్రాంత రాజకీయ స్పృహ, సైద్ధాంతిక ఛాయ ఉన్నాయి. ► శ్రీరామరాజు ఉద్యమకారునిగా అవతరించడం ఒక చారిత్రక నేపథ్యంలో జరిగింది. మొదటి ప్రపంచయుద్ధం, గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపు, ఉపసంహరణ; ఉత్తర భారత యాత్ర ఆ నేపథ్యాన్ని ఇచ్చాయి. తన కుటుంబం తునిలో ఉన్నప్పుడే 1915లో ఉద్యోగాణ్వేషణ పేరుతో రామరాజు ఉత్తర భారతదేశం వెళ్లారు. ఆ యాత్రలోనే రామరాజు కలకత్తా వెళ్లి ప్రముఖ జాతీయ ఉద్యమ నేత సురేంద్రనాథ్ బెనర్జీని కలుసుకున్నారు. ఆ తరువాత అల్లూరి తూర్పు కనుమలలోని కృష్ణ్ణదేవిపేటకు 1917 జూలై 24న ఒక ఆధ్యాత్మికవేత్తగా చేరుకున్నారు. ఈ ఊరే ఆయన కార్యక్షేత్రమయింది. ఇక ఆయన ఆయుధం పట్టి, ఉద్యమం ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ► 1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపూ, ‘ఒక్క ఏడాదిలోనే స్వాతంత్య్రం’ అన్న నినాదమూ ఇచ్చారు. రాళ్లపల్లి కాశన్న, నర్సీపట్నం ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలు కృష్ణదేవిపేటలోనూ సహాయ నిరాకరణోద్యమ ప్రచారం చేశారు. 1921లో రామరాజు కాలినడకన నాసికాత్రయంబకం వెళ్లారు. అక్కడ ‘అభినవ్ భారత్’ విప్లవ సంస్థ ప్రభావం ఆయనపై గాఢంగా పడింది. అప్పటికే రామరాజు మన్యవాసులలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. గాంధీజీ కార్యక్రమమంతటిలోను మద్యపాన నిషేధం, కోర్టుల బహి ష్కారం... ఈ రెండూ ఆయనకు నచ్చాయి. ఇవే రామరాజు ‘సహాయ నిరాకరణ వాది’ అన్న అనుమానం కలిగించాయి. ► మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన తర్వాత కరవు విజృంభించ డంతో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆకలి దాడులు జరిగాయి. ప్రభుత్వం ఉపాధి కల్పన ఆరంభించింది. మన్యంలో రోడ్ల నిర్మాణం అందులో ఒకటి. ఆసియా చరిత్రలోనే ఈ రోడ్ల నిర్మాణం ఓ అమానుష ఘట్టం. ఇందుకు బాధ్యుడు గూడెం డిప్యూటీ తహసీల్దార్ అల్ఫ్ బాస్టియన్. నిజానికి 1882 చట్టంతో అడవిలో ప్రవేశం కోల్పోయిన ఆదివాసీలు కూలీలుగా మారిపోయారు. పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు), బట్టిపనుకుల మునసబు గాం గంతన్న దొర, అతని తమ్ముడు గాం మల్లు దొర, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటివారు 1922 జనవరిలో రాజు దగ్గరికి వచ్చి గోడు వినిపించుకున్నారు. ► బాస్టియన్ మీద పై అధికారులకు శ్రీరామరాజు ఫిర్యాదు రాశారు. రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడన్న ఆరోపణకు ఈ ఫిర్యాదు దోహదం చేసింది. రామరాజును ఆ ఫిబ్రవరి 3న నిర్బంధంలోకి తీసుకున్నది కూడా సహాయ నిరాకరణవాది అన్న ఆరోపణతోనే! ఆ ఒకటో తేదీనే సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. 5వ తేదీన జరిగిన ‘చౌరీచౌరా’ ఉదంతంతో గాంధీ ఆ పిలుపును ఉపసంహరించుకున్నారు. అహింసాయుతంగా పోరాడే సంస్కారం భారతీయులకు లేదని నింద మోపారు. ఇదే యువతను ఇతర పంథాల వైపు నడిపించింది. అలాంటి వారిలో రామరాజు ఒకరు. ► సంప్రదాయ, ఆధునిక ఆయుధాలతో గెరిల్లా పోరు జరపాలని అనుకున్న రాజు... ఆయుధాల కోసం మన్యంలోని పోలీస్ స్టేషన్లను దోచుకోవాలని నిర్ణయించారు. అనుచరులను మూడు దళాలుగా విభజించారు. 1922 ఆగస్ట్ 22న పట్టపగలు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద 300 మందితో దాడి చేశారు. ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి వచ్చారు రాజు. తొలి దాడితోనే మన్య ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. కొండదళం ‘వందేమాతరం... మనదే రాజ్యం’, ‘గాంధీజీకి జై’ అంటూ నినదించింది. ► ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. ఆగస్ట్ 24న రాజవొమ్మంగి స్టేషన్ (తూర్పు గోదావరి)ను ఎంచు కున్నారు. లాగరాయి పితూరీని సమర్థించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్యదొర అప్పుడు ఆ స్టేషన్లోనే ఉన్నారు. ఆయనను విడిపించడం కూడా ఈ దాడి ఆశయాలలో ఒకటి. తొలి రెండు దాడులతోనే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్ఏ గ్రాహవ్ుకు టెలిగ్రావ్ులు వెళ్లాయి. 26 తుపాకులు, వేలాది తూటాలు కొండదళం చేతికి చిక్కాయి. ఎంత ప్రమాదం! ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరిం టెండెంట్ సాండర్స్, కలెక్టర్ వాయువేగంతో నర్సీపట్నం చేరు కున్నారు. నర్సీపట్నం కేంద్రంగా మన్యం ఖాకీవనమైంది. ► అలాంటి వాతావరణంలోనే జైపూర్ మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్ 3న ఒంజేరి ఘాట్‌లో రాజుదళం వశం చేసుకుంది. తరువాత జరిగిన ఘటన మద్రాస్ ప్రెసిడెన్సీని మరీ కలవరపెట్టింది. రామరాజు పేరు మొదటిసారి తెలుగునేలంతా వినిపించింది. దామనపల్లి అనే కొండమార్గంలో 1924 సెప్టెంబర్ 24న గాలింపు జరుపుతున్న స్కాట్ కవర్ట్, నెవెల్లి హైటర్ అనే ఒరిస్సా పోలీసు ఉన్నతాధికారులను రాజు దళం చంపింది. వీరిలో హైటర్ మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. తరువాత అడ్డతీగల, చోడవరం, మల్కనగిరి, పాడేరు స్టేషన్ల మీద చేసిన దాడులు విఫల మయ్యాయి. బ్రిటిష్‌వాళ్లు ఆయుధాలను ట్రెజరీలకు పంపి జాగ్రత్త పడ్డారు. మన్యం మీద పట్టు బిగించడానికి మద్రాస్ ప్రెసిడెన్సీ మరొక అడుగు ముందుకు వేసి, 1922 సెప్టెంబర్ 23న మలబార్ పోలీసు దళాలను దించింది. కానీ రామవరం అనే చోట ఆ దళమూ వీగిపోయింది. ► 1922 డిసెంబర్ 6న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం మీద లూయీ ఫిరంగులతో మలబార్ దళం యుద్ధానికి దిగింది. ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఆ డిసెంబర్ 23న ఉద్యమకారుల తలలకు ప్రభుత్వం వెలలు ప్రకటించింది. నాలుగు మాసాల అనంతరం 1923 ఏప్రిల్ 17న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాంగాన్ని కలవరపరిచింది. ఆ సంవత్సరం డిసెం బర్లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు రామరాజు మారువేషంలో హాజరయ్యారు. నడిపేది గిరిజనోద్యమమే అయినా, ఆయన మైదాన ప్రాంత ఉద్యమాన్ని గమనిస్తూనే ఉన్నారు. ► 1924 జనవరికి అస్సాం రైఫిల్స్‌ను దించారు. వీరికి మొదటి ప్రపంచ యుద్ధంలో అనుభవం ఉంది. అస్సాం రైఫిల్స్ అధిపతే మేజర్ గుడాల్. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్ జార్జ్ రూథర్‌ఫర్డ్‌ను ఆ ఏప్రిల్‌లో మన్యం స్పెషల్ కమిషనర్‌గా నియమిం చారు. మే ఐదు లేదా ఆరున ‘రేవుల కంతారం’ దగ్గర పోలీసుల దాడి నుంచి తప్పించుకున్న రాజు ఒక్కడే రాత్రివేళ ‘మంప’ అనే గ్రామం వచ్చి, ఒక చేనులోని మంచె మీద గడిపారు. మే 7వ తేదీ వేకువనే ఓ కుంటలో స్నానం చేస్తుండగా రాజును ఈస్ట్‌కోస్ట్ దళానికి చెందిన కంచుమేనన్, ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆళ్వార్‌నాయుడు అరెస్టు చేశారు. రాజును ఒక నులక మంచానికి కట్టి, కృష్ణదేవిపేటకు పయన మయ్యారు. దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే మేజర్ గుడాల్... రాజుతో మాట్లాడాలని గుడారంలోకి తీసుకువెళ్లాడు. ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. జూన్ 7న గాం గంతన్నను కాల్చి చంపారు. ► దాదాపు రెండేళ్ల ఉద్యమం, పోలీస్ వేధింపులతో మన్యవాసులు భీతిల్లి పోయారు. కొందరు ఉద్యమకారులను స్థానికులే చంపారు. పోలీసు లకు పట్టించారు. సరైన విచారణ లేకుండానే 270 మంది వరకు ఉద్యమకారులకు శిక్షలు విధించింది మిలిటరీ ట్రిబ్యునల్. 12 మందిని అండమాన్ పంపారు. చివరిగా... దేశం కోసం పోరాడిన ఏ వర్గం త్యాగమైనా విలువైనదే. అవన్నీ నమోదైతేనే స్వరాజ్య సమర చరిత్రకు పరిపూర్ణత. ఉద్యమ నూరేళ్ల సందర్భం ఇచ్చే సందేశం అదే! డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (అల్లూరి సీతారామరాజు పోరాటానికి నూరు వసంతాలు) -
Peddavadugur: గాంధీజీ మెచ్చిన ఊరు
అనంతపురం జిల్లా గుత్తికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెద్ద వడుగూరు’ గ్రామం స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించింది. ఆ ఊళ్లో గొప్ప పారిశ్రామికవేత్త కె. చిన్నారప రెడ్డి. ఎన్నో ఆదర్శ భావాలు కలిగినవాడు. ఆయన పనిపై మద్రాస్ వెళుతూ ఉండేవారు. 1934లో ఒకరోజు ఆయన మద్రాసు మెరీనా బీచ్‌లో మహాత్మాగాంధీ ఉపన్యాసం విన్నారు. ఆ రోజు గాంధీ ఉపన్యసిస్తూ స్వాతంత్ర పోరాటానికి నిధులు కొరతగా ఉన్నాయనీ, దాతలు సహాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. ఆ మాటలు నారపరెడ్డిని ఆలోచనలో పడవేశాయి. తమ ఊరికి రావాలని గాంధీజీని సంప్రదించారు. స్వాతంత్రోద్య మానికి రూ. 12 వేల నిధి ఇస్తే వస్తానని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే బాపు 1934 సెప్టెంబర్ 21న మద్రాసు నుండి రైలులో ఉదయం 7 గంటలకు గుత్తి రైల్వేస్టేషన్లో దిగారు. ప్రజలు పెద వడుగూరుకు ఘన స్వాగతం పలికారు. చిన్నారప రెడ్డే గాంధీకి వసతి చేకూర్చారు. తిరుపతిరావు అనే వ్యక్తి గాంధీజీని తన భుజస్కంధాలపై ఎత్తుకొని వేదికపైకి చేర్చాడు. హిందీ పండిట్ సత్యనారాయణ... గాంధీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. నిధులు అందించి స్వాతంత్ర పోరాటాన్ని విజయవంతం చేయాలని అక్కడ చేరిన ప్రజలను కోరారు గాంధీ. అందరూ కలిసి దాదాపు రూ. 27 వేలు ఇచ్చారు. సభాస్థలికి 11 కిలోమీటర్ల దూరం నుంచి విచ్చేసిన భూస్వామి హంపమ్మ రూ. 1,116 అంద జేశారు. ఆమె అంతటితో ఆగకుండా మరో అరగంట గడుస్తుండగా తన ఒంటిపై ఉన్న బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేశారు. అలా ఒకరికొకరు పోటీలు పడుతూ దాదాపు 5 కేజీల బంగారాన్ని గాంధీకి ఇచ్చారు. ఈ ఊరిని కేంద్రంగా చేసుకుని గాంధీ అనేక గ్రామాలు సందర్శించారు. ఉరవకొండ, హిందూపురం, కదిరి సమావేశాల్లో కూడా ప్రసంగించారు. రాత్రి అయ్యే సరికి తిరిగి పెద్ద వడుగూరులోని తన విడిది గృహానికి చేరుకునేవారు. ఈ నాలుగు రోజులూ గాంధీ చిన్నారప రెడ్డి కారులోనే తిరిగేవారు. ఆఖరు రోజున చిన్నారప రెడ్డి తనకున్న 32 ఎకరాల పొలాన్ని, తన కారును కూడా విరాళంగా ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు. గాంధీజీని గ్రామానికి పిలవద్దని కూడా అప్పట్లో బ్రిటిష్‌వాళ్లు ఆయనను బెదిరించారు. అయినా ఆయన భయపడకుండా ధైర్యంగా నిలబడి తన నిర్ణయాన్ని అమలుపరిచారు. ఇక్కడ ఇల్లూరి కేశమ్మ అనే మహిళను కూడా మనం స్మరించుకోవాలి. ఇల్లూరు కేశమ్మ పోలీసుల బెదిరింపులకు భయపడకుండా గ్రామ గ్రామం తిరిగి, గాంధీ సభలకు రావాల్సిందిగా వేసిన కరపత్రాలు పంచింది. ఆమెను ఒకసారి అరెస్టు కూడా చేశారు. అయినా జడవక విడుదల కాగానే తిరిగి ప్రచారం మొదలు పెట్టింది. గాంధీ వెంట నారాయణమ్మ, సుభద్రమ్మ అనే మహిళలు సైతం 4 రోజులు తిరిగారు. ఆరోజు గాంధీ సభకు తోరణాలు కట్టి, అలంకరణ చేసి అందరికీ మంచినీళ్లు అందించిన వెంకటరెడ్డి వయసు నేడు 110 ఏళ్లు. ఆ గ్రామానికి 3 దశాబ్దాలు సర్పంచ్‌గా సేవలందించిన శరభా రెడ్డి కూడా ఆ కాలంలో గాంధీకి రూ. 1,116 విరాళంగా ఇచ్చారు. ఆయన కొడుకు సూర్యనారాయణరెడ్డి (88 ఏళ్ళు)... గాంధీ తమ ఊరికి వచ్చినపుడు తాను చిన్న పిల్లవాడిననీ, అప్పటి విశేషాలు ఎన్నో తన మనసులో దాగివున్నాయనీ పూస గుచ్చినట్లు వివరించారు. 1947 ఆగస్టు 15న గ్రామమంతా పండుగ చేసుకున్నామనీ, అందరికీ పిప్పరమెంట్లు, బోరుగులు పంచామనీ చెప్పుకొచ్చారు. గాంధీజీ పెద వడుగూరును ప్రశంసిస్తూ తన డైరీలో ప్రత్యేకంగా రాసుకున్నారనీ ఆయన అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆనాటి కోట్లాదిమందిని స్మరిస్తూ, జీవించివున్న స్వాతంత్య్ర సమరయోధులకు పాదాభివందనాలు తెలియజేద్దాం. (క్లిక్: ఉద్యమ వారసత్వమే ఊపిరి) - డాక్టర్ సమ్మెట విజయ్‌కుమార్ సామాజిక శాస్త్రవేత్త -
వజ్రోత్సవాల్లో జాతీయ పతాకాల వినియోగం.. వాటిని ఇప్పుడేం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా దేశమంతా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఇంటింటికీ త్రివర్ణ పతాకాలను పంపిణీ చేసింది. స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇంటింటింకే కాదు.. తమ దేశ భక్తి చాటుకోడానికి వాహనాలకు, పబ్లిక్ ప్లేస్ల్లో, పార్కులలో, కార్యాలయాల్లో విస్తృతంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ఈసారి పంద్రాగస్టున లక్షల సంఖ్యలో జెండాలను ఘనంగా రెపరెపలాడించారు. కానీ జాతీయ జెండా అతి గౌరవప్రదమైనది. జెండాను ఎగురవేయడంలో, వినియోగించడంలో ఫ్లాగ్ కోడ్ విధిగా పాటించాలి. వజ్రోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తున్నారు. అనంతరం ఈ జెండాలను ఏ విధంగా పరిరక్షిస్తారు, ఫ్లాగ్ కోడ్ నిబంధనలకు అనుగుణంగా అగౌరవపరచకుండా జాగ్రత్తగా భద్రపరచాల్సిన అంశాలపైన అవగాహాన పెరగాల్సిన అవసరముంది. చదవండి: ‘పతాక’ స్థాయిలో పొరపాట్లు! జెండాల పంపిణీలో ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘనలు పరిరక్షణ బాధ్యతలపై వెలువడని మార్గదర్శకాలు.. ఇంటింటికీ ఎగరేసిన జెండాలను జాగ్రత్తగా, గౌరవంగా చూసుకోవాల్సిన భాద్యత ఆ ఇంటి వారిదే అని నిపుణులు చెబుతున్నారు. ర్యాలీల పేరుతో వాహనాలకు కూడా జాతీయ జెండాను వినియోగించారు. వజ్రోత్సవాల అనంతరం వీటినన్నింటినీ జాగ్రత్తగా భద్రపరచాల్సిన అవసరముంది. ఈ విషయంలో మరింత అవగాహాన పెరగాలని, లేదంటే ఘనంగా నిర్వహించిన వేడుకల పేరుతో జాతీయ పతాకాన్ని అగౌరవపరిచినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్‌లలో, పార్క్‌లు, వీధులు, పాఠశాలలు, కళాశాలలు, ఫుట్‌పాత్, ఫ్లైఓవర్, గ్రౌండ్స్, కూడళ్ల వద్ద భారీస్థాయిలో జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. మరికోద్ది రోజుల్లో వజ్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా జాతీయ జెండా గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదన్న విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. జెండాను అమర్చిన ప్రదేశం, సంస్థలను బట్టి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ నుంచి ఇంకా ఎలాంటి మార్గ నిర్దేశకాలు విడుదల కాలేదు. జాతీయ పతాకాన్ని ఏ మాత్రం అగౌరవ పరచినా చట్టపరమైన చర్యలు, శిక్షలు తప్పవు. కాబట్టి జెండాల విషయంలో పౌరులు సంబంధిత సంస్థలు బాధ్యతాయుంగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. చదవండి: రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఎప్పుడేం జరిగింది? -
భరతమాత తొలి వెలుగులకు దూరమైన తెలంగాణ
1600 సంవత్సరంలో భారత గడ్డపై వ్యాపార నిమిత్తం కాలు మోపి, ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ, భారతీయుల, పాలకుల అమాయకత్వాన్ని తమకు అనువుగా మలచుకొంటూ సాగిన ఈస్ట్ ఇండియా కంపెనీ జైత్రయాత్ర ప్లాసీ యుద్ధం అనంతరం మరింతగా విస్తరించి, బెంగాల్ ప్రాంతాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంది. భారతదేశ స్వయం సిద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ప్రకృతిని కాపాడుకుంటూ సాగే జీవన విధానం, విద్యా వ్యవస్థ మరియు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచే ధార్మిక మూలాలు, వాటి విశిష్టతని అర్థం చేసుకున్న కంపెనీ పాలకులు, వారి వ్యాపార విస్తరణకు అడ్డుగా ఉంటుందన్న భావనతో దేశం మొత్తాన్ని ముందుగా తమ చేతుల్లోకి తీసుకుంది. అనంతరం భారతీయ మూలాల్ని పెకిలించే కంపెనీ ప్రక్రియ యథేఛ్చగా సాగడం వల్ల దేశ ప్రజల్లో రాజుకున్న స్వతంత్ర కాంక్ష 1857 లో సిపాయి రెబెల్లియన్గా ,తొలి స్వాతంత్య్ర పోరాటంగా మారడం గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం, అఖండ భారత పాలన కేవలం కంపెనీతో సాధ్య పడదని తెలుసుకుని నేరుగా దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. భారతీయులకి ఈ స్థితి నేరుగా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యింది. మెల్లిమెల్లిగా రాజుకుంటున్న స్వాతంత్ర కాంక్షని ముందుగానే అంచనా వేసిన బ్రిటిష్ ప్రభుత్వం 1861, 1892, 1909, 1919 లలో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ రూపంలో దేశ ప్రజలకి ఎంగిలి మెతుకుల్ని విదిల్చినట్టు అధికారంలో, పాలనలో తమకు అడ్డు రాకుండా కొద్దిపాటి భాగ స్వామ్యాన్ని కల్పించింది. అరకొరగా ఇచ్చిన పాలనా భాగస్వామ్యం ప్రజల్లో పెరుగుతున్న స్వాతంత్య్ర భావనని తగ్గించక పోగా మరింత తీవ్రరూపం దాల్చడంతో ఇండియన్ యాక్ట్ 1935 రూపంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకి పూర్తి పాలన స్వేఛ్చని ఇచ్చినట్లు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అత్యంత దారుణమైన స్థితి ఏంటంటే తమ సోదరులు, మిగిలిన భారతీయులు తమ స్వాతంత్య్రాన్ని చాటుతూ ముందుకు సాగుతుంటే, తెలంగాణ, మరట్వాడ మరియు కల్యాణ కర్ణాటక (ఉత్తర కర్ణాటక ) ప్రాంత వాసులు మాత్రం, 1724 లో మొగలు రాజుల నుండి సొంత జెండా ఎగరవేసిన అసిఫ్ జాహి నిజాం పాలకుల కబంధ హస్తాల్లోకి వెళ్లి, విద్యకి ,వైద్యానికి, చివరికి తమ సంస్కృతి సాంప్రదాయాల్ని, మత స్వేచ్ఛని కోల్పోయి మానవ సమాజంపై జరిగే దాడి నుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో మునిగి పోయారు.15 ఆగష్టు, 1947, దేశం పూర్తి స్వేచ్చా వాయువుల్ని పీల్చుకునే సమయంలో హైదరాబాద్ సంస్థానం మాత్రం రజాకార్ల రూపంలో ఉన్న మానవ మృగాల పైశాచిక దాడిని ఎదుర్కొంటూ, తమను తాము రక్షించేకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. విలాసాలు , వినోదాలతో సాగిన నిజాం పాలన ప్రజల కనీస హక్కులు కాలరాస్తూ సాగి, చివరకి అప్పు కట్టలేక తన రాజ్యాన్ని కొద్ది కొద్దిగా ముక్కలు చేస్తూ, కంపెనీకి , బ్రిటిష్ పాలకులకు అప్పగించే స్థితి దాపురించింది . 1768లో మచిలీపట్టణం సంధి ద్వారా కోస్తా ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించిన నిజాం, 1903 లో బేరార్ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలకులకి అప్పజెప్పాడు. ఇదే క్రమంలో సీడెడ్ ప్రాంతాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. జులై 4 1946 వరంగల్ జిల్లాలోని కడవేని గ్రామంలో దొడ్డ కొమరయ్య అనే రైతు హత్య ఘటన, నిజాం అనుచరులైన దొరలపై రైతుల తిరుగుబాటుకి దారి తీసింది. రజాకార్ల పైన ఆత్మ రక్షణ యుద్ధంలో తెలంగాణ ప్రజలంతా ఏకమై, కుల సంఘాలు, వామపక్షాలు, రైతులు, విద్యావంతులు గెరిల్లా యుద్దాన్ని చేబట్టారు. గోండు జాతిని రక్షించే బాధ్యత, 1900-1949 సమయంలో కొమరం భీంపై పడి, జమిందార్ లక్ష్మణ్ రావు దాష్టికాలపై, నిజాంపై 1900-1949 మధ్య కాలంలో సాగిన అస్తిత్వ పోరాటం..‘జల్, జంగిల్ జమీన్’ నినాదంతో సాగి 1940 లో భీం ప్రాణాలని హరించింది. విసునూరు రామ చంద్రా రెడ్డి విశృంఖల దౌర్జన్యానికి, నిజాం దోపిడీ విధానానికి వ్యతిరేకంగా సాగిన చాకలి ఐలమ్మ పోరాటం మనకి సదా ప్రాతఃస్మరణీయం. ఈ హైదరాబాద్ సంస్థాన వాసుల దయానీయ స్థితిని గమనించిన భారత ప్రభుత్వం, మన ప్రథమ హోం శాఖామాత్యులు, స్వర్గీయ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో సాగించిన పోలీస్ ఆక్షన్ 13 సెప్టెంబర్ 1948 లో మొదలై 17 సెప్టెంబర్ 1948న నైజాం దాస్య శృంకలాల నుంచి స్వేఛ్చ వాయువుల్ని పీల్చుకునే వరకు సాగింది. దేశం ఎన్నో బలిదానాల ఫలితంగా ఏర్పడ్డ స్వాతంత్రం, ఆ మధురమైన అమృత ఘడియలు, ఆ అద్భుత మైన అనుభూతికి దూరంగా, హైదరాబాద్ సంస్థాన వాసులు మాత్రం తీర్చలేని వెలితితో భరతమాత తొలి వెలుగులకు దూరంగా ఉండిపోయింది. దొర్లి పోయిన కాలంలో గాయపడ్డ తెలంగాణ మరకలు అలాగే మిగిలి పోయాయి. -వేముల శ్రీకర్, ఐఆర్ఎస్, కమిషనర్, ఇన్‌కంటాక్స్ -
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా కొన్ని సంగతులు...
►1947, ఆగస్ట్ 15న దేశమంతా స్వాతంత్య్ర సంబురాల్లో మునిగి ఉంటే గాంధీ మాత్రం ఆ వేడుకలకు దూరంగా ఉండిపోయారు. బెంగాల్లో చెలరేగిన మతకలహాలకు నిరసనగా నిరహార దీక్ష చేస్తూ. ►రవీంద్రనాథ్ టాగోర్ ‘జనగణ మన’ను 1911లో రచించారు. అది జాతీయ గీతంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది 1950, జనవరి 24 నుంచి. రవీంద్రుడే రాసిన (1905) ‘అమోర్ సోనార్ బంగ్లా’లోని మొదటి పదిలైన్లను తీసుకొని బంగ్లాదేశ్ తన జాతీయ గీతంగా పాడుకుంటోంది. అంతేకాదు శ్రీలంక జాతీయ గీతమైన ‘శ్రీలంక మాతా’ గీతానికి, స్వరకల్పనకూ రవీంద్రనాథ్ టాగోర్ సాహిత్యం, సంగీతమే స్ఫూర్తి. ►స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1973 వరకు ఆగస్ట్ 15న గవర్నర్లే ఆయా రాష్ట్రాల్లో జెండా వందనం చేసేవారు. ఈ పద్ధతిని కాదని ఆగస్ట్ 15న ముఖ్యమంత్రులే జెండా వందనం చేయాలనే కొత్త సంప్రదాయాన్ని సూచించింది ఎమ్. కరుణానిధి.. 1974లో. ►ప్రతి ఆగస్ట్ 15న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులే జెండా వందనం చేస్తే బాగుంటుందని.. ఈ సంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి లేఖ రాశారట. ఆ ప్రతిపాదనను ఆమె ప్రభుత్వం ఒప్పుకుంటూ 1974 నుంచి అమల్లోకి తెచ్చింది. ►మన జాతీయ పతాకం తయారయ్యేది ఒకే ఒక్క చోట. కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఉన్న ‘కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగసంయుక్త సంఘ (కేకేజీఎస్సెస్)’లో తయారయ్యి దేశమంతా పంపిణీ అవుతుంది. అదీ బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిర్ధారించిన ప్రమాణాల్లో. -
కస్టమర్లకు ఎస్బీఐ స్వాతంత్య్ర దినోత్సవ కానుక: కొత్త స్కీం
సాక్షి,ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య దినోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఖాతాదారులకు ఒక కొత్త పథకాన్ని లాంచ్ చేసింది. "ఉత్సవ్ డిపాజిట్" అనే ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంలో అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తోంది. అయితే ఇది పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ ఒక ట్వీట్లో వెల్లడించింది. చదవండి: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి ఉత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో, 1000 రోజుల కాలవ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 6.10శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు సాధారణ రేటు కంటే 0.50శాతం అదనపు వడ్డీ రేటును పొందేందుకు అర్హులు. ఈ రేట్లు 15 ఆగస్టు 2022 నుండి అమలులోకి వస్తాయి. ఇఇది 75 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. A delightful offer especially for our customers to celebrate 75 years or Azadi. With ‘Utsav’ Deposit, get higher interest rate on Fixed Deposits. #SBI #UtsavDeposit #FixedDeposits #AmritMahotsav pic.twitter.com/DhPQnis568 — State Bank of India (@TheOfficialSBI) August 15, 2022 -
76 వ ఇండిపెండెన్స్ డే: తొలిసారి మేడిన్ ఇండియా గన్
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్ర్య దినోత్సవం మరో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆగస్టు 15న ఎర్రకోట వద్ద గౌరవ వందనం కోసం మేడ్-ఇన్-ఇండియా తుపాకీని తొలిసారి ఉపయోగించారు. ఇప్పటి వరకు సెర్మోనియల్ సెల్యూట్ కోసం బ్రిటీష్ తుపాకులను ఉపయోగించారు. అంతేకాదు ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తొలిసారిగా ఎంఐ-17 హెలికాప్టర్లు ఎర్రకోటపై పూల వర్షం కురిపించాయి. స్వదేశీ అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ హోవిట్జర్ గన్ను కేంద్రం ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) రూపొందించింది. ఈ గన్‌తోనే స్వాతంత్ర్య దినోత్సవం రోజున చారిత్రాత్మకమైన ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకానికి 21-షాట్ల గౌరవ వందనం లభించింది. "మనం ఎప్పటినుంచో వినాలనుకునే శబ్దాన్ని 75 ఏళ్ల తర్వాత వింటున్నాం. 75 ఏళ్ల తర్వాత ఎర్రకోట వద్ద తొలిసారిగా భారత్‌లో తయారు చేసిన తుపాకీతో త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం లభించింది" అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈ మేడ్-ఇన్-ఇండియా తుపాకీ గర్జనతో భారతీయులందరూ స్ఫూర్తి పొంది, మరింత శక్తివంతం అవుతారని మోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌ను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నందుకు సాయుధ దళాల సిబ్బందిని ప్రధాని ప్రశంసించారు. #WATCH | Made in India ATAGS howitzer firing as part of the 21 gun salute on the #IndependenceDay this year, at the Red Fort in Delhi. #IndiaAt75 (Source: DRDO) pic.twitter.com/UmBMPPO6a7 — ANI (@ANI) August 15, 2022 For the first time, MI-17 helicopters shower flowers at the Red Fort during Independence Day celebrations. #IDAY2022 #IndependenceDay2022 #स्वतंत्रतादिवस pic.twitter.com/j1eQjIoZAn — PIB India (@PIB_India) August 15, 2022 -
వజ్రోత్సవాల వేళ ఆంటిలియాకు కొత్త కళ: మనవడితో అంబానీ సందడి
సాక్షి, ముంబై: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగు తున్నాయి. దేశవ్యాప్తంగా పిల్లా పెద్దా అంతా త్రివర్ణ పతాకాలు చేబూని, మాతృదేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా ఈ సంబరాల్లో పాలు పంచుకున్నారు. భార్య నీతా అంబానీ, మనవడు పృథ్వీ అంబానీతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా దేశంలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలు త్రివర్ణ కాంతులతో దేదీప్యమానంగా ఆకర్ణణీయంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేశ్ అబానీ ఇల్లు ఆంటిలియా కూడా త్రివర్ణ పతాక కాంతులతో వెలిగిపోతోంది. యాంటిలియా వెలుపల ఉన్న రహదారి మొత్తం త్రివర్ణ వెలుగులతో అందంగా ముస్తాబు చేశారు. దీంతో జనం తమ కార్లను ఆపి మరీ సెల్ఫీలు తీసుకోవడం విశేషం. అంతేకాదు ఆంటిలియా ఇంటి బయట శీతల పానీయాలు, చాక్లెట్లు అందిస్తున్నారు. దీంతో అటు సెల్ఫీలు, ఇటు కూల్ డ్రింక్స్, చాక్లెట్లతో జనం ఎంజాయ్ చేస్తున్నారు. #WATCH | Reliance Industries chairman Mukesh Ambani along with his wife Nita Ambani and grandson Prithvi Ambani celebrates Independence Day pic.twitter.com/QNC8LmtoHL — ANI (@ANI) August 15, 2022 -
ఇండియా@75: ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా
మొదటి స్వాతంత్య్ర దినం నేను మర్చిపోలేని రోజు. ఆ రోజు మా మామయ్య దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుంచి జాలువారిన ‘ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా’ అనే దేశభక్తి గేయాన్ని 1947 ఆగస్టు 15 న పొద్దున్న ఆరుగంటలకి మద్రాసు రేడియోలో లైవ్ పాడాను. తరవాత తొమ్మిది గంటలకి ఆంధ్ర విజ్ఞాన సమితిలో పాడాను. 10 గం.లకి వై.యమ్.సి.ఏ.లో పాడాను. సాయంత్రం నాలుగు గంటలకి ఆంధ్ర మహిళా సభలోను, ఆరు గంటలకి ఆంధ్ర మహాసభలోను, రాత్రి 8 గం.లకి రేడియో వారు చేసిన స్వాతంత్య్ర రథం కార్యక్రమంలోను ఒకే రోజున అన్ని లైవ్‌లు పాడాను. ఊరంతా పండగలా అలంకరించారు. దేశమంతా వంద దీపావళులలాగ సంబరాలు చేసుకున్నారు. అలంకరించారు. ఆ రోజే మరో చిత్రమైన సంఘటన. నాకు అలంకారం అంటే చాలా ఇష్టం. నేనే ఒక ఫ్యాషన్ క్రియేట్ చేశాను. 5 గజాల తెల్ల చీర కొనుక్కుని వచ్చి; ఎరుపు, ఆకుపచ్చ రంగుల శాటిన్ రిబ్బన్లు పొడవుగా కట్‌చేసి చీర మీద నిలువు చారలుగా వేసుకున్నాను. జాకెట్కి కూడా బోర్డర్ వేసుకున్నాను. టైలర్ని రాత్రింబవళ్లు కూచోపెట్టి దగ్గరుండి కుట్టించుకున్నాను. నా పాటలాగే నా డ్రస్కూడా హిట్అయ్యింది. – కీ. శే. వింజమూరి అనసూయ, గాయని -
చిన్నవాణ్ణని వదిలేశారు
జాతీయోద్యమంలో గాంధీ శకం మొదలయ్యాక ఉద్యమ కార్యాచరణకు కేంద్రస్థానం సబర్మతి ఆశ్రమం అయింది. తెలుగు జాతీయోద్యమకారుడు, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని నిరాహారదీక్ష చేసి అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములు సబర్మతి ఆశ్రమంలో చాలాకాలం ఉన్నారు. అలా ఉన్న కొంతమంది ఉద్ధండులను వారి వారి ప్రదేశాలకు వెళ్లి సామాన్యుల్లో సైతం చైతన్యవంతం చేయవలసిందిగా సూచించారు గాంధీజీ. ఆయన సూచనలను చిత్తశుద్ధితో అనుసరించేవారిలో పొట్టి శ్రీరాములు కూడా ఉన్నారు. అంతటి శ్రీరాములును దగ్గరగా చూడడం, ఆయనతో కలిసి నడవటం వల్ల జాతీయస్ఫూర్తిని పెంపొందించుకుని ఉద్యమాల్లో పాల్గొన్న ఓ కుర్రాడు కోన వెంకట చలమయ్య! ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆ ‘కుర్రాడు’ సాక్షి తో పంచుకున్న కొన్ని జ్ఞాపకాలివి. మా ఇంట్లో ఉండేవారు ‘‘మాది తిరుపతి (ఉమ్మడి చిత్తూరు) జిల్లా వాయల్పాడు. నెల్లూరులో మా మేనమామ దేవత చెంచు రాఘవయ్య దగ్గర పెరిగాను. మా మామ లాయరు. ఆయనకు పొట్టి శ్రీరాములు గారికి మంచి స్నేహం ఉండేది. అలా శ్రీరాములు గారు నెల్లూరులో మా ఇంట్లో ఉండేవారు. గాంధీజీ ఆదేశంపై జాతీయోద్యమాన్ని వాడవాడలా విస్తరింపచేయడానికి శ్రీరాములు గారు సబర్మతి నుంచి వచ్చిన సందర్భం అది. నాకు వారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వారితో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఆ స్ఫూర్తితో విదేశీ వస్త్ర బహిష్కరణలో.. నెల్లూరు పట్టణంలో జొన్నలగడ్డ వారి వీథి, అత్తి తోట అగ్రహారంలో ఇళ్లకు వెళ్లి విదేశీ వస్త్రాలను సేకరించి మంటల్లో వేశాను. ‘‘బ్రిటిష్ వారి పరిపాలనను మనం అంగీకరించడం లేదనే విషయాన్ని వాళ్లకు తెలిసేలా చేయాలంటే ఇదే మంచి మార్గం’’ అని మహిళలకు చెప్పేవాళ్లం. వాళ్లు వెంటనే లోపలికి వెళ్లి.. ఇంట్లో ఉన్న ఫారిన్ చీరలు, చొక్కాలు, పంచెలు అన్నింటినీ బయటవేసే వాళ్లు. అప్పట్లో మద్రాసులో పొత్తూరి అయ్యన్న శెట్టి అనే వ్యాపారి విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ ఉద్యమంలో పాల్గొనలేదు. విదేశీ వ్యాపారంతోపాటు, ఆ దుస్తులు చాలా ఖరీదైనవి ధరించేవారు. సాటి వైశ్యులు ఆయనను కుల బహిష్కరణ చేశారు. జాతీయత భావన అంత తీవ్రంగా ఉండేది. అప్పుడు అలా మొదలైన ఖాదీ వస్త్రధారణను నేను వదల్లేదు. మాకు ఖాదీ మీద ఎంత ఇష్టం ఉండేదంటే నేను ఒక దుకాణంలో నెలకు యాభై రూపాయలకు పని చేస్తూన్న రోజుల్లో పండుగకు నూట యాభై రూపాయలు పెట్టి పట్టు ఖాదీ దుస్తులు కొనుక్కుని అపురూపంగా దాచుకుని ముఖ్యమైన రోజుల్లో ధరించేవాడిని. అప్పట్లో చొక్కా గుండీలు కూడా ఖాదీవే. నూలుతో బఠాణీ గింజ సైజులో అల్లేవారు. ఎడ్ల బాధ చూడలేక నేను గాంధీజీని దగ్గరగా చూసిన సందర్భాలు రెండు మూడు ఉన్నాయి. ఒకసారి నెల్లూరులో రైలు దిగి పల్లిపాడులోని గాంధీ ఆశ్రమానికి ఎడ్ల బండి మీద వస్తున్నారు. పెన్నా నదిలో నీళ్లు లేవు, ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు నది మధ్య ఇసుకలో బండిని లాగడానికి ఎడ్లు ఇబ్బంది పడుతున్నాయి. గాంధీజీ ఆ సంగతి గమనించిన వెంటనే ఇక బండిలో ఉండలేకపోయారు. వెంటనే బండి దిగి నడక మొదలు పెట్టారు. మరో సందర్భంలో నాయుడు పేటలో ఒక సభలో ఆయన ప్రసంగం విన్నాను. మెరీనా బీచ్ సంఘటన చాలా ముఖ్యమైనది. గాంధీజీ ప్రసంగం వినడానికి జనం పోటెత్తారు. ఆ జనంలో దూరంగా ‘హరిజనులకు ఆలయ ప్రవేశం’ అని రాసి ఉన్న ఒక ప్లకార్డు కనిపించింది. ఆ ప్లకార్డు పట్టుకున్నవారు పొట్టి శ్రీరాములు. ఆయన్ని వేదిక మీదకు పిలిచి సభకు పరిచయం చేస్తూ ‘శ్రీరాములు వంటి ఏడుగురు సైనికుల్లాంటి దేశభక్తులు నా దగ్గర ఉంటే, మనదేశానికి ఎప్పుడో స్వాతంత్య్రం వచ్చి ఉండేది’ అన్నారు గాంధీజీ. ఆయన అన్న ఆ మాట ఆ తర్వాత చాలా ప్రభావాన్ని చూపించింది. అప్పట్లో ఉద్యమ సమాచారం అంతా ఉత్తరాల ద్వారానే జరిగేది. శ్రీరాములు గారికి గాంధీజీ స్వహస్తాలతో రాసిన ఉత్తరం నా దగ్గర ఇప్పటికీ ఉంది. లాఠీ దెబ్బలే దెబ్బలు మా సమావేశాలు ఎక్కువగా తిప్పరాజు వారి సత్రంలో జరిగేవి. పెద్ద నాయకుల నుంచి ఉత్తరాల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక నాయకులు ఒక్కో ఉద్యమాన్ని ఎలా నిర్వహించాలనే వివరాలను ఆ సమావేశాల్లో చెప్పేవారు. వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో నేను పోలీసులకు దొరకలేదు, కానీ సహాయ నిరాకరణోద్యమంలో లాఠీ దెబ్బలు బాగా తిన్నాను. ఆందోళనలు ఒకరోజుతో పూర్తయ్యేవి కాదు, పట్టణంలో ఒక్కోరోజు ఒక్కోచోట. నగరంలో ఎక్కడ జరుగుతున్నా సరే.. వెళ్లి నినాదాలివ్వడం, దెబ్బలు తినడమే. మాలో కొంతమందిని జైల్లో పెట్టారు. అప్పుడు నన్ను చూసి ‘చిన్నవాడు’ అని వదిలేశారు. అనేకానేక ఉద్యమాల తర్వాత పోరాటం ఇంకా తీవ్రమయ్యేదే తప్ప శాంతించే పరిస్థితి లేదనే నిర్ధారణకు వచ్చేశారు బ్రిటిష్ వాళ్లు. మనకు స్వాతంత్య్రం వచ్చేస్తోందని మా పెద్దవాళ్లు చెప్పారు. నెల్లూరు పట్టణ వీథుల్లో లైట్లు, రంగురంగులుగా కాగితాలతో కోలాహ లంగా ఉంది వాతావరణం. మేమంతా ఆనం దంతో గంతులు వేశాం. స్వాతంత్య్రం ప్రకటిం చారనే వార్త వినడం కోసం నిద్రను ఆపుకుంటూ ఎదురు చూశాం’’ అని చెప్పారు స్వాతంత్య్ర సమర యోధులు కె.వి. చలమయ్య. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
నెహ్రూ టు నరేంద్ర
భారత స్వాతంత్య్ర సమరం, స్వాతంత్య్రం వచ్చిన సందర్భం, రెండో ప్రపంచ యుద్ధానంతర పరిణామాలు, ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం, ప్రపంచ పరిస్థితులు కలసి భారత ప్రధానమంత్రి పదవికి రూపురేఖలను ఇచ్చాయి. దేశంలో బ్రిటిష్ వలస వాసనలు, మారిన రాజకీయ తాత్త్వికతలను అవగతం చేసుకుంటూ, అవి తెచ్చిన సమస్యలను అధిగమిస్తూ దేశాన్ని పునర్నిర్మాణం చేసే గురుతర బాధ్యతను మన ప్రధానులు నిర్వహించారు. 1947 నుంచి 2022 వరకు భారతీయులు 14 మంది ప్రధానుల పాలనను వీక్షించారు. ఒక్కొక్క ప్రత్యేకతతో ఒక్కొక్క ప్రధాని చరిత్ర ప్రసిద్ధులయ్యారు. 1947–1977 ప్రథమ ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ. 16 ఏళ్ల 286 రోజుల నెహ్రూ పాలనా కాలమే ఇప్పటికి వరకు రికార్డు. తరువాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ హయాం 11, 4 సంవత్సరాలతో రెండో స్థానంలో నిలిచారు. రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మూడో స్థానంలో నిలుస్తారు. లాల్ బహదూర్‌శాస్త్రి (19 నెలలు), గుల్జారీలాల్ నందా (రెండు పర్యాయాలు ఆపద్ధర్మ ప్రధాని, 27 రోజులు), రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు (ఐదేసి సంవత్సరాలు) ప్రధాని పదవిలో ఉన్నారు. మొత్తంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రధానులే దాదాపు 56 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలన్న నిర్ణయం తరువాత ఏర్పడిన జాతీయ ప్రభుత్వానికి (1946) నాయకత్వం వహించినవారు నెహ్రూయే. ఆపై 1947 ఆగస్ట్ 15 నుంచి స్వతంత్ర భారత తొలి ప్రధాని. దేశ విభజన నాటి నెత్తుటి మరకలు ఆరకుండానే 1947 అక్టోబర్‌లో పాకిస్తాన్ తో యుద్ధం చేయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన, అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు, ఐఐటీలు, భారీ నీటిపారుదల పథకాలు, భారీ పరిశ్రమలు ఆయన హయాం ప్రత్యేకతలు. 1962లో ఆయన పాలనలోనే చైనాతో యుద్ధం జరిగింది. అది చేదు ఫలితాలను మిగిల్చింది. 1964 లో నెహ్రూ మరణంతో లాల్ బహదూర్‌శాస్త్రి ప్రధాని అయ్యారు. 1965లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఓడిన పాకిస్తాన్ తో శాంతి ఒప్పందం మీద సంతకాలు చేయడానికి తాష్కెంట్ (సోవియెట్ రష్యా) వెళ్లిన శాస్త్రి అక్కడే అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు. జైజవాన్ జై కిసాన్ ఆయన నినాదమే. తరువాత 1966లో ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఇందిర పాలన అంటే కొన్ని వెలుగులు, ఎక్కువ చీకట్ల సమ్మేళనం. ఆమె బ్యాంకులను జాతీయం చేశారు. రాజభరణాలు రద్దు చేశారు. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నికలో ఆమె నిర్వహించిన విధ్వంసక భూమికతో కాంగ్రెస్ చీలిపోయింది. పార్టీ నిర్ణయించిన నీలం సంజీవరెడ్డిన ఓడించి, తాను నిలబెట్టిన వీవీ గిరిని ‘ఆత్మ ప్రబోధం’ నినాదంతో గెలిపించిన అపకీర్తి ఆమెది. 1971లో ఇందిర కూడా పాకిస్తాన్ తో యుద్ధం చేశారు. ఆ యుద్ధ ఫలశ్రుతి భారత్ గెలుపు, బంగ్లాదేశ్ ఆవిర్భావం. ఇందిర హయాంకు మకుటాయమానమైనది 1974 నాటి పోఖ్రాన్ అణపరీక్ష (స్మైలింగ్ బుద్ధ). దీనితో భారత్ ప్రపంచంలోనే అణుపాటవం ఉన్న ఆరోదేశంగా ఆవిర్భవించింది. 1975లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఇందిర చరిత్రలో తన స్థానాన్ని తానే చిన్నబుచ్చుకున్నారు. అలా కాంగ్రెస్‌కు ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించి పెట్టిన ఘనత కూడా ఆమెదే. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత 1977లో జనతా పార్టీ ఏర్పడింది. అందులో భారతీయ జనసంఘ్ భాగస్వామి అయింది. ద్వంద్వ సభ్యత్వం కారణంగా జనతా పార్టీని వీడిన జనసంఘ్ సభ్యులు 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. భారత రాజకీయాలలో జాతీయ స్థాయి పార్టీగా కాంగ్రెస్‌కు ఉన్న స్థానాన్ని కూలదోసిన పార్టీగా బీజేపీ ఎదగడం చరిత్ర. జనతా పార్టీ, ప్రభుత్వం కుప్ప కూలిపోవడంతో 1980లో మధ్యంతర ఎన్నికలు జరిగి ఇందిర మళ్లీ ప్రధాని అయ్యారు. ఇది కూడా చరిత్రలో ఒక అనూహ్య ఘట్టమే. అత్యవసర పరిస్థితి తరువాత ఘోరంగా ఓడిపోయిన పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. రెండో దశ ఏలుబడిలో ఆమె చేసిన సాహసోపేత నిర్ణయం అమృత్సర్ స్వర్ణాలయం మీద ఆపరేషన్ బ్లూ స్టార్, పేరిట సైనిక చర్య. కానీ అది సాహసం కాదు, దుస్సాహసమేనని చరిత్ర రుజువు చేసింది. ఆ చర్య నుంచి వచ్చిన ప్రతీకార జ్వాలకే ఆమె 1984లో ఆహుతయ్యారు. అంగరక్షకులే కాల్చి చంపారు. ఇందిర భారత తొలి మహిళా ప్రధానిగానే కాదు, హత్యకు గురైన తొలి ప్రధానిగా కూడా చరిత్రకు ఎక్కారు. 1977–1980 ఈ కొద్దికాలంలోనే భారతదేశం ఇద్దరు ప్రధానులను చూసింది. ఒకరు మొరార్జీ దేశాయ్, మరొకరు చౌధురి చరణ్‌సింగ్. నెహ్రూతో, ఇందిరతో ప్రధాని పదవికి పోటీ పడిన మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ గెలిచిన తరువాత ప్రధాని పదవిని చేపట్టారు. స్వాతంత్య్ర సమరస్ఫూర్తి, గాంధేయవాదం మూర్తీభవించిన ప్రధాని ఆయన. వరసగా పది కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత ఉన్న మొరార్జీ ప్రధానిగా రెండు సంవత్సరాల నాలుగు నెలలు మాత్రమే పదవిలో ఉన్నారు. జనతా పార్టీ పతనమే ఇందుకు కారణం. ద్వంద్వ సభ్యత్వం, రాజ్ నారాయణ్ రగడ, మాజీ జనసంఘీయుల నిష్క్రమణ వంటి కారణాలు ఆయన రాజీనామాకు దారి తీశాయి. తరువాత చౌదరి చరణ్‌సింగ్ ప్రధాని అయ్యారు. ప్రధానిగా పార్లమెంట్‌కు వెళ్లకుండా రాజీనామా చేసిన ప్రధానిగా మిగిలారు. భారత్‌కు సంకీర్ణ ప్రభుత్వాలు తప్పవన్న సంకేతం ఈ కాలం ఇచ్చింది. 1984–1996 ఇందిర హత్య తరువాత ఆమె పెద్ద కుమారుడు రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యారు. తల్లి హత్యతో ప్రధాని పదవిని అధిష్టించిన రాజీవ్, మాజీ ప్రధానిగా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో హత్యకు గురయ్యారు. షాబోనో కేసు, హిందువుల కోసం అయోధ్య తలుపులు తెరవడం, భోపాల్ విషవాయువు విషాదం, బోఫోర్స్ తుపాకుల అవినీతి వ్యవహారం ఆయన హయాంలోనే జరిగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతానికి ఆయన కృషి ఆరంభించారు. రాజీవ్ మంత్రివర్గంలోనే ఆర్థిక, రక్షణ శాఖలను నిర్వహించిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ బోఫోర్స్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి, జనతాదళ్ కూటమి బలంతో ప్రధాని పదవిని చేపట్టారు. ఉపప్రధాని దేవీలాల్‌తో వీపీ సింగ్‌కు విభేదాలు తీవ్రమైనాయి. అలాంటి సందర్భంలో సింగ్ మండల్ కమిషన్ నివేదికను బయటకు తీశారని చెబుతారు. ఎల్‌కె అడ్వాణిని అయోధ్య రథం మీద నుంచి దించడంతో వీపీ సింగ్‌ను ప్రధాని పదవి నుంచి బీజేపీ దించివేసింది. సింగ్ తరువాత చంద్రశేఖర్ కాంగ్రెస్ ‘బయటి నుంచి మద్దతు’తో ప్రధాని అయ్యారు. చంద్రశేఖర్ సమాజ్‌వాదీ జనతా పార్టీ మైనారిటీ ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా ఆమోదింప చేయలేకపోయింది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఈ ప్రభుత్వం బంగారాన్ని కుదువ పెట్టవలసి వచ్చింది. చంద్రశేఖర్ తరువాత తెలుగువారు పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ఒక తీవ్ర సంక్షోభం నుంచి బయటపడవేసిన వారు పీవీ. కానీ అయోధ్య వివాస్పద కట్టడం ఆయన హయాంలోనే కూలింది. మైనారిటీ ప్రభుత్వమే అయినా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఘనత పీవీ ప్రభుత్వానికి ఉంది. 1996–2004 ఒక రాజకీయ సంక్షుభిత దేశంగానే భారత్ కొత్త మిలీనియంలోకి అడుగు పెట్టింది. కాంగ్రెస్ ప్రభను కోల్పోతుండగా, బీజేపీ బలపడుతున్న కాలమది. అలాగే హంగ్ యుగం కూడా. ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితి చిరకాలం కొనసాగింది. 1996లో జరిగిన ఎన్నికలలో అతి పెద్ద మెజారిటీ సాధించిన పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ హంగ్ లోక్‌సభ ఏర్పడింది. వాజపేయి తొలిసారి 1996 మే 16 న ప్రధానిగా ప్రమాణం చేశారు. 1996 జూన్ 1 న రాజీనామా చేశారు. తరువాత హెచ్డి దేవెగౌడ ప్రధాని అయ్యారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. సీతారాం కేసరి నాయకత్వంలోని కాంగ్రెస్ యథాప్రకారం బయట నుంచి మద్దతు ఇచ్చింది. కానీ 11 మాసాలకే ఆయన ప్రభుత్వం పడిపోయింది. దేవెగౌడ వారసునిగా ఇందర్‌కుమార్ గుజ్రాల్ పదవీ స్వీకారం చేశారు. విదేశ వ్యవహారాలలో దిట్ట అయిన గుజ్రాల్ కూడా 11 మాసాలు మాత్రమే అధికారంలో ఉన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో భారత్ సంబంధాల గురించి గుజ్రాల్ సిద్ధాంతం పేరుతో ఒక విధానం ప్రసిద్ధమైంది. 1998లో మళ్లీ మధ్యంతర ఎన్నికలను దేశం ఎదుర్కొనవలసి వచ్చింది. ఈసారి చాలా పార్టీలు బీజేపీ వెనుక నిలిచాయి. నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ కూటమి ఏర్పడి, వాజపేయి ప్రధాని అయ్యారు. కూటమిలో భాగస్వామి అన్నా డీఎంకే మద్దతు ఉపసంహరించుకొనడంతో ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోయింది. 1999లో మళ్లీ ఉప ఎన్నికలు జరిగి ఎన్ డీఏ విజయం సాధించింది. వాజపేయి ప్రధానిగా ప్రమాణం చేశారు. కొద్ది నెలలు మినహా పూర్తి సమయం అధికారంలో కొనసాగారు. తన పదమూడు మాసాల పాలనలోనే వాజపేయి పోఖ్రాన్ 2 అణుపరీక్ష జరిపించారు. మూడోసారి ప్రధాని అయినప్పుడు పాకిస్తాన్ తో కార్గిల్ సంఘర్షణ జరిగింది. లాహోర్ బస్సు దౌత్యం వంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. 2004–2022 2004లో జరిగిన ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికమంత్రి, ఆర్థిక సంస్కరణల శిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. 2009 ఎన్నికలలో కూడా మళ్లీ యూపీఏ గెలిచి ఆయనే ప్రధాని అయ్యారు. యూపీఏ మొదటి దశ సజావుగానే సాగినా, రెండో దశ అవినీతి ఆరోపణలను మూటగట్టుకుంది. 2014 ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. 2019లో జరిగిన ఎన్నికలలో మరొకసారి మోదీకే భారతీయులు పట్టం కట్టారు. ముప్పయ్ ఏళ్ల తరువాత తిరుగులేని మెజారిటీ సాధించిన పార్టీగా 302 సీట్లు బీజేపీ సాధించింది. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా ఎంపిక చేసిన ఘనతను కూడా బీజేపీ దక్కించుకుంది. – డా. గోపరాజు నారాయణరావుఎడిటర్, ‘జాగృతి’ (చదవండి: మహాత్మా మన్నించు..) -
భారత్.. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: చరిత్ర విస్మరించిన స్వాతంత్ర్య యోధులను ఇవాళ భారత దేశం గౌరవించుకుంటోంది అని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. సోమవారం ఉదయం ఎర్రకోట నుంచి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కర్తవ్య మార్గంలో తమ ప్రాణాలను అర్పించిన బాపు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్ తదిరత మహోన్నతులకు దేశ పౌరులం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పోరాడిన వీరనారీమణులకు సెల్యూట్. ఈ పోరాటంలో ఎంతో మంది ప్రముఖులు దేశాన్ని జాగృతం చేశారు. త్యాగధనుల పోరాటల ఫలితమే మన స్వాతంత్రం. మంగళ్ పాండే, తాత్యా తోపే, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, బ్రిటిష్ పాలన పునాదిని కదిలించిన మన అసంఖ్యాక విప్లవకారులకు ఈ దేశం కృతజ్ఞతలు తెలుపుతోంది. మాతృ భూమి కోసమే అల్లూరి సీతారామరాజు జీవించారు. గిరిజనలు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రసంగం.. 76th Independence Day ఇవాళ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. సంబురాలలో మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతం ఇవాళ ఓ మైలు రాయిని దాటింది. ఈ 75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం. ఎలాంటి సమస్య వచ్చినా ఓటమిని అంగీకరించలేదు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది. భారతదేశం తన 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, తనకు అమూల్యమైన సామర్థ్యం ఉందని నిరూపించుకుంది. ఈ 75 ఏళ్ల ప్రయాణంలో, ఆశలు, ఆకాంక్షలు, ఎత్తులు, కనిష్ఠాల మధ్య అందరి కృషితో మేము చేయగలిగిన చోటికి చేరుకున్నాము. 2014లో, పౌరులు నాకు బాధ్యత ఇచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన నాకు.. ఎర్రకోట నుండి ఈ దేశ పౌరులను ప్రశంసించే మొదటి వ్యక్తిగా ఓ అవకాశాన్ని ఇచ్చారు. పేదవాళ్లకు సాయం అందించడమే నా లక్ష్యం. దేశ ప్రజలు పునరుత్తేజంతో ఉండడమే మన బలం. మన ముందు ఉన్న మార్గం కఠినమైంది. ప్రతీ లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇప్పుడు నవసంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని మోదీలో తొమ్మిదవ సారి నరేంద్ర మోదీ పతాకాన్ని ఆవిష్కరించారు. వచ్చే 25 ఏళ్లు ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి వచ్చే 25 ఏళ్లులో ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. 1. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి 2. బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయండి 3. మన దేశ చరిత్రి, సంస్కృతిని చూసి గర్వ పడాలి 4. ఐకమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి 5. ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి #WATCH Live: Prime Minister Narendra Modi addresses the nation from the ramparts of the Red Fort on #IndependenceDay (Source: DD National) https://t.co/7b8DAjlkxC — ANI (@ANI) August 15, 2022 -
ఏపీ పోలీసులకు పతకాల పంట
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి చెందిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్ పి.వెంకట్రామిరెడ్డి సేవలను గుర్తించిన కేంద్ర హోం శాఖ ఆయనకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ ప్రకటించింది. ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఈ పతకాలు ప్రకటిస్తుంది. ఏపీకి చెందిన ఏఏసీ మండ్ల హరికుమార్కు పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ (పీఎంజీ), జేసీ ముర్రే సూర్యతేజకు ఫస్ట్ బార్ టు పీఎంజీ, జేసీ పువ్వుల సతీష్‌కు పీఎంజీ ప్రకటించింది. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శాంతారావు (ఎస్ఎస్జీ ఐఎస్‌డబ్ల్యూ, విజయవాడ), ఎస్ఐ వి.నారాయణమూర్తి (ఎస్ఐబీ, విజయవాడ)లకు పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. -
ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండా ఆవిష్కరణ
Independence Day celebrations ఢిల్లీ అప్డేట్స్ ►వచ్చే 25 ఏళ్లు ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి: ప్రధాని మోదీ ►1. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి ►2. బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయండి ►3. మన దేశ చరిత్రి, సంస్కృతిని చూసి గర్వ పడాలి ►4. ఐకమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి ►5. ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి ►మనదేశం టెక్నాలజీ హబ్‌గా మారుతోంది ►జై జైవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్‌తో పాటు జై అనుసంధాన్ ►ప్రజలంతా నిలదొక్కుకోవడమే ఆత్మ నిర్బర్ లక్ష్యం ►డిజిటల్ ఇండియాతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి ►వాళ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. ►సంబురాలలో మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతం ఇవాళ ఓ మైలు రాయిని దాటింది. ►ఈ 75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం. ఎలాంటి సమస్య వచ్చినా ఓటమిని అంగీకరించలేదు. ►భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది. ► స్వాతంత్రం కోసం పోరాడిన యోధులను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాలి. నారీ శక్తికి ప్రత్యేకంగా గౌరవం ప్రకటించుకోవాలి. ► దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ సంబురాలు జరుగుతున్నాయి. ► ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ #WATCH PM Narendra Modi hoists the National Flag at Red Fort on the 76th Independence Day pic.twitter.com/VmOUDyf7Ho — ANI (@ANI) August 15, 2022 ►ఎర్రకోట వేదికకు చేరుకున్న ప్రధాని మోదీ ► ఎర్రకోటలో ఇంటర్ సర్వీసెస్, పోలీస్ గార్డ్ ఆఫ్ హానర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ తనిఖీ చేశారు. Delhi | PM Modi inspects the inter-services and police Guard of Honour at Red Fort pic.twitter.com/IxySt0G0r4 — ANI (@ANI) August 15, 2022 ► ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఆయన ఎర్రకోట ప్రాకారం వైపు వెళ్తున్నారు. ► 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా.. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ Delhi | PM Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on the 76th Independence Day pic.twitter.com/1UFpkoVoAR — ANI (@ANI) August 15, 2022 ► భారత స్వాతంత్రం 1947 సంవత్సరపు మొదటి వేడుకలను కలిపి చూసుకున్నా.. ఇప్పుడు భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది 76వ ఏడాది వేడుకలు. ► 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు మార్చి 2021లో ప్రారంభమైన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే మెగా కార్యక్రమం ద్వారా గుర్తించబడుతున్నాయి. ► 75 వసంతాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకుని 76వ వడిలోకి అడుగుపెట్టింది భారత్. దేశం మొత్తం గత నాలుగైదు రోజులుగా సందడి వాతావరణం నెలకొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
IDAY2022: ఈ పాటలు విన్నప్పుడల్లా ఉప్పొంగే దేశభక్తి
పంద్రాగస్టు దేశానికి పెద్ద పండుగ. కుల, మత, జాతి, వర్గాలన్నీ కలిసి చేసుకునే సందర్భం. స్కూల్ పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా అందరినీ.. ఏళ్ల తరబడి అలరిస్తూ వస్తున్న కొన్ని దేశభక్తి సినీ గేయాలను ఈ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గుర్తు చేసుకుందాం. సగటు భారతీయుడి నరనరాలను కదలించి.. దేశభక్తిని ఉప్పొంగేలా చేశాలు కొన్ని సినీ గేయాలు.. -
అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఎటు చూసినా మువ్వన్నెల రెపరెపలే. ఎవరిని కదిలించినా అమృతోత్సవ సంగతులే. ఊరూ వాడా, పల్లె పట్నం మూడు రంగుల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. స్వాతంత్య్ర సంబరాల ముచ్చట్లతో మురిసిపోతున్నాయి. స్వాతంత్య్ర భానూదయానికి 75 ఏళ్లు పూర్తవుతుండటం ఈసారి పంద్రాగస్టు ప్రత్యేకతను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో దేశమంతా త్రివర్ణ శోభితమైంది. నెలల తరబడి సాగుతున్న స్వాతంత్య్ర అమృతోత్సవాలకు అద్భుతమైన ముగింపు ఇచ్చేందుకు అన్నివిధాలా ముస్తాబైంది. గోల్కొండ కోటపై జాతీయజెండా ఎగరేయనున్న సీఎం కేసీఆర్ దేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని చరిత్రాత్మక గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తైనా.. దేశం అన్ని రంగాల్లో వెనుకబడి ఉండటాన్ని, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను సీఎం తన ప్రసంగంలో ఎండగట్టే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ముందున్న సవాళ్లు, కర్తవ్యాలు వివరించడంతో పాటు.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సాధించిన పురోగతిని, భవిష్యత్ కార్యక్రమాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. త్రివర్ణ శోభితమైన గోల్కొండ కోట కాగా రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల పెన్షన్లు జారీ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొందరు లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ స్వయంగా పెన్షన్ కార్డులు అందజేసే అవకాశం ఉంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీలను విడుదల చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం ఖైదీలు విడుదల కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం గోల్కొండ కోటను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. మిగతా జిల్లాల్లో స్థానిక మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులు జాతీయ జెండా ఎగురవేయనున్నారు. త్రివర్ణ శోభితమైన చార్మినార్ చదవండి: స్వతంత్ర భారత సందేశం -
స్వతంత్ర భారత సందేశం
స్వతంత్ర భారతావనికి నేటితో డెబ్భై అయిదు వసంతాలు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశ సాఫల్య వైఫల్యాలు అనేకం. కులం, మతం, జాతి, భాష లాంటి లోటుపాట్లు బోలెడున్నా, ఈ 75 ఏళ్లలో గణనీయమైన విజయాల విషయంలో మనం రొమ్ము విరుచుకోవచ్చు. కానీ, చేసిన పొరపాట్లతో పాటు ఉద్దేశపూర్వకమైన తప్పులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ఉన్న సమస్యలకు మరికొన్ని చేర్చుకున్నాం. గత ఎనిమిదేళ్లుగా వ్యతిరేక స్వరాలను ఆలకించే సహనం మనలో చచ్చిపోయింది. తోటి పౌరులైన ముస్లిమ్‌లను పక్షపాత దృష్టితో చూడడం మొదలుపెట్టాం. ఇవన్నీ సిగ్గుతో తలదించుకునేలా చేసేవే! ఇవన్నీ సమీక్షించుకొని, సరిదిద్దుకొని, సమైక్యంగా ముందుకు సాగాల్సిన సందర్భం ఇది. మన భారతదేశం స్వతంత్రమై నేటితో 75 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఒక దేశంగా మనం సాధించిన విజయాలేమిటి? చవిచూసిన వైఫల్యాలేమిటి? అని సమీక్షించుకునేందుకు తగిన సందర్భం ఇది. అలాగే, ఇదే సందర్భంలో మనం ఏ రకమైన దేశాన్ని నిర్మించుకున్నామన్నదీ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రశ్నలకు ఏవో స్పష్టమైన, కచ్చితమైన సమాధానాలు లభిస్తాయని కాదు. ఒక్కొక్కరి మదిలో ఒక్కో సమాధానం కచ్చితంగా ఉంటుంది. వారికి అదే సరైనదని కూడా అనిపిస్తుంది. అదే స్ఫూర్తితో నా దృష్టిలో మన దేశ సాఫల్య వైఫల్యాలను వివరించాలని అనుకుంటున్నా. ఒకవేళ దానివల్ల ప్రత్యేకించి ప్రయోజనమేదీ లేకున్నా... అది మీలో మరిన్ని ఆలోచనలు రేకెత్తించవచ్చు. ► కులం, మతం, జాతి, భాష లాంటి లోటుపాట్లు బోలెడున్నప్పటికీ, ఈ 75 ఏళ్లలో మన సాధనల విషయంలో మనం కొంచెం గర్వంగా రొమ్ము విరుచుకోవచ్చు. ఈ తేడాలు దేశాన్ని నాశనం చేస్తాయని 1960లలో పాశ్చాత్యులు కూడా విమర్శించారు. అయినా సరే... మనం ఒక్కతాటిపై నిలిచాం. అన్నింటినీ తట్టుకుని మనగలిగాం. అత్యవసర పరిస్థితులను అధిగమించి, దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది. ఎన్నికలు సక్రమంగా జరుపుకోగలిగాం. ప్రభుత్వాలు మారాయి. ప్రజాగ్రహం శక్తిమంతమైన పరిపాలనా వ్యవస్థలను కూడా నియంత్రణలో ఉంచగలిగింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల మాదిరిగా దేశం సైనిక పాలనను అనుభవించాల్సిన అవసరం రాలేదు. ► అక్షరాస్యత, ఆయుః ప్రమాణాల విషయానికి వస్తే 1947కూ, ప్రస్తుతానికీ అస్సలు సారూప్యతే లేదు. అక్షరాస్యత అప్పటి కన్నా నాలుగు రెట్లు పెరిగింది. అలాగే, ఆయుః ప్రమాణం రెట్టింపు అయ్యింది. సాధించాల్సింది ఇంకా ఎంతో ఉన్నా... సాధించింది తక్కువేమీ కాదని స్పష్టంగా చెప్పవచ్చు. తిండిగింజల కోసం అంగలార్చిన దేశం ఈ రోజు వాటిని ఎగుమతి చేసే దశకు చేరిందంటే అంతకంటే గొప్ప విజయం ఇంకోటి ఉండదు. నౌకల్లో దిగుమతి అయితేనే నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లే పరిస్థితి ఉండేది అప్పట్లో! ఇప్పుడు ఆహార ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి మన దేశం. పాల ఉత్పత్తిలో మనది అగ్రస్థానం. బియ్యం, గోదుమల ఉత్పత్తిలో రెండో స్థానం. బియ్యం ఎగుమతి చేసే దేశాల్లోనూ తొలిస్థానం మనదే! మన అంతరిక్ష పరిశోధనా కార్యక్రమం, పదమూడు మంది ప్రపంచస్థాయి సీఈవోలను అందించిన మన ఐఐటీలు, ప్రపంచ ప్రేక్షకాదరణ కలిగిన క్రికెట్ టోర్నమెంట్లు, సినిమా పరిశ్రమ... ఇలాంటివన్నీ తృతీయ ప్రపంచదేశాల్లో మనల్ని ప్రత్యేకంగా నిలిపే అంశాలు. ఇంతటి వైవిధ్యభరితమైన దేశం మరొకటి ఉండదు. ► దురదృష్టవశాత్తూ మనం చేసిన పొరపాట్లు, మన లోటుపాట్లు, చివరకు ఉద్దేశపూర్వకమైన తప్పులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, వరుసగా అనేక ప్రభుత్వాలు దేశ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడంలో విఫలమయ్యాయని స్పష్టంగా చెప్పవచ్చు. భారీ నీటి ప్రాజెక్టులు కట్టుకున్నా... ఉక్కు కర్మాగారాలను నిర్మించినా... సోషలిజానికి ఇచ్చిన ప్రాధానంతో ఒక రేటు అభివృద్ధిలోనే చిక్కుబడి, దేశ ప్రజల్లో పారిశ్రామిక స్ఫూర్తిని ఉద్దీపింపజేయలేకపోయింది. ► 1984, 2002లలో జరిగిన సంఘటనలు అహింసా వాదులమని చెప్పుకొనే మన వాదనలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతాయి. చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌లపై ఆర్థిక ఆంక్షలు ఉన్నా 1947 నాటికి వాటి జాతీయ ఆదాయం, మన దేశ జాతీయ ఆదాయం దాదాపుగా ఒకే స్థాయిలో ఉండేవి. డెబ్భై అయిదేళ్ళ తరువాత ఒక్కసారి ఈ దేశాల ఆదాయాలను భారత్‌తో పోల్చి చూసినప్పుడు మనం ఎంతో వెనుకబడ్డ విషయం స్పష్టమవుతుంది. 1990లో ఆర్థిక సంస్కరణలు ఓ మూడు దశాబ్దాల ముందే ప్రారంభమై ఉంటే భారత్ పరిస్థితి ఇంకోలా ఉండేది. ► అయితే ఏమంటారు అని అడిగితే ఒక సలహా ఇస్తా. భారతదేశం ఎంతో సాధించేసిందని మాత్రమే గట్టిగా నమ్ముతూ... ఎన్నిసార్లు దారితప్పామో మరచిపోతే అది అవివేకమే అవుతుంది. పచ్చిగా చెప్పాలంటే మనం ఎంత సాధించామో, అంతేస్థాయిలో తప్పటడుగులూ వేశాము. అలాగైతే మనమిప్పుడు ఏ రకమైన దేశంగా అవతరించామన్న ప్రశ్న వస్తుంది. పాత సమస్యలు ఇప్పటికీ చాలానే వెంటాడుతున్నాయి. దళితులు, ఆదివాసీలు ఇప్పటికీ అత్యంత అణగారిన వర్గాలుగానే కొనసాగుతున్నారు. వారి కన్నీళ్ళు తుడవడంలో విఫలమయ్యాం. ‘అస్పశ్యత’ను చట్టం ద్వారా నిషేధించినా... సమాజంలో అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. ఆకలి, కరవు వంటివి గత చరిత్రే కావచ్చు కానీ... దేశ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారు. వాస్తవం ఏమిటంటే... పదేళ్లుగా పేదరికం స్థాయి ఏమిటన్నది కూడా తెలుసుకోవడం మానివేశాం మనం. ► ఉన్న సమస్యలకు మరికొన్ని చేర్చుకున్నాం కూడా! ఎనిమిదేళ్లుగా వ్యతిరేక స్వరాలను ఆలకించే సహనం చచ్చిపోయింది మనలో! మన పోకడల్లో ఆధిపత్యవాదన ఎక్కువైంది. తోటి పౌరులైన ముస్లిమ్‌లను పక్షపాత దృష్టితో చూడడం మొదలుపెట్టాం. జనహనన బెదిరింపులు ఇప్పుడు బహిరంగంగానే జరిగిపోతున్నా ప్రభుత్వం చెవులు మూసుకుని ఉండేందుకే మొగ్గు చూపుతోంది. ఇవన్నీ 1940, ’50లలో ఊహించను కూడా ఊహించలేము. ఇవన్నీ మనల్ని సిగ్గుతో తలదించుకునేలా చేసేవే! కానీ కొంతమంది ఇలాంటివి కొన్ని ఉన్నాయని కూడా ఒప్పుకోరు. ► సరే... మరి స్వతంత్ర భారతావని 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ రోజున మనం దేన్ని నొక్కి చెబుదాం? మన ఘనతల్ని మరోసారి నెమరేసుకుంటాం. తప్పులేదు. అయితే గట్టిగా చెప్పుకోలేకపోయినా, చేసిన తప్పులను కూడా ఒక్కసారి మననం చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ తప్పులన్నీ మనం నిర్దేశించుకున్న విలువలు, ఆర్థిక సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోకపోవడం వల్ల జరిగినవే! ఇంకోలా చెప్పాలంటే మనం రాసుకున్న రాజ్యాంగానికి కట్టుబడి ఉండకపోవడం వల్ల జరిగినవే! అందుకే ప్రమాణపూర్తిగా ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి! ఈ స్వతంత్ర భారత ఉత్సవాల సందర్భంగా మనం చేయాల్సింది అదే! కరణ్ థాపర్ వ్యాసకర్త ప్రసిద్ధ పాత్రికేయులు -
అమృతోత్సవ భారతం
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికి నిండా డెబ్బయి ఐదేళ్లు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర అమృతోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రజల్లో దేశభక్తి ప్రజ్వరిల్ల చేయడానికి కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవానికి కొద్ది నెలల ముందుగానే ‘హర్ ఘర్ తిరంగా’– అంటే, ‘ఇంటింటా మువ్వన్నెలు’ నినాదాన్ని హోరెత్తించడం ప్రారంభించింది. ఎలాగైతేనేం, దేశమంతటా ఊరూవాడా మువ్వన్నెల రెపరెపలతో మెరిసిపోతున్నాయి. డెబ్బయి ఐదేళ్ల కిందట సాధించుకున్న స్వాతంత్య్రం మనకు తేలికగా దక్కలేదు. దశాబ్దాల తరబడి సాగిన పోరాటంలో ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితమే మనకు దక్కిన ఈ స్వాతంత్య్రం. ప్రజాపక్షపాతుల బలిదానాల ఫలితంగా దక్కిన స్వాతంత్య్రాన్ని మనం ఎంత పదిలంగా కాపాడుకోవాలి? కష్టనష్టాలకు ఎదురీది, నెత్తురు చిందించి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను అట్టడుగు ప్రజానీకానికి అందేలా చేయడానికి ఎంతటి దీక్షాదక్షతలను చాటుకోవాలి? గడచిన డెబ్బయి ఐదేళ్లలో దేశంలోని సామాన్యుల కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పగల పరిస్థితులు లేవు. అలాగని ఇన్నేళ్లలో సాధించినది శూన్యం అని చెప్పడానికీ లేదు. అయితే, మనం సాధించిన పురోగతి కొంతేనని, సాధించాల్సినది ఎంతోనని నిస్సందేహంగా చెప్పవచ్చు. దేశాన్ని అట్టుడికించిన స్వాతంత్య్ర సమరంలో ఎందరెందరో కవులు, రచయితలు ప్రజల పక్షాన నిలిచారు. బ్రిటిష్ దుష్పరిపాలనను ఎదిరించారు. పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారు. జైళ్లకు వెళ్లారు. శిక్షలు అనుభవించారు. దుర్భర దారిద్య్ర బాధలను అనుభవించారు. స్వాతంత్య్రం వచ్చాక స్వాతంత్య్రోద్యమంలో త్యాగాలు చేసిన రచయితలు, కవుల్లో చాలామందికి దక్కాల్సినంత గౌరవం దక్కకపోవడమే చారిత్రక విషాదం. ఇందుకు కొందరు తెలుగు ప్రముఖుల ఉదాహరణలనే చెప్పుకుందాం. స్వాతంత్య్ర సమరం ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో ‘మాకొద్దీ తెల్లదొరతనము– దేవ– మాకొద్దీ తెల్లదొరతనము’ అంటూ గరిమెళ్ల సత్యనారాయణ రాసిన ధిక్కారగీతం తెలుగునాట నలుచెరగులా ఊరూవాడా మార్మోగింది. జనంలోకి చొచ్చుకుపోయిన ఆ పాట తెల్లదొరలకు వెన్నులో వణుకు పుట్టించింది. అప్పటి బ్రిటిష్ కలెక్టర్ బ్రేకన్, గరిమెళ్లను పిలిపించుకుని, ఆ పాటను ఆయన నోటనే విన్నాడు. భాష అర్థం కాకపోయినా, పాటలోని తీవ్రతను గ్రహించి, ఆయనకు ఏడాది జైలుశిక్ష విధించాడు. స్వాతంత్య్రం వచ్చాక మన పాలకులు ఆయనను తగినరీతిలో గౌరవించిన పాపాన పోలేదు. దుర్భర దారిద్య్రంతోనే ఆయన కన్నుమూశారు. ఆయన మరణానంతరం మన పాలకులు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయన పట్ల భక్తిప్రపత్తులను చాటుకున్నారు అంతే! గరిమెళ్లకు సమకాలికుడైన తొలితరం దళితకవి కుసుమ ధర్మన్న అదేకాలంలో ‘మాకొద్దీ నల్లదొరతనము’ పాట రాశారు. అప్పట్లో కాంగ్రెస్‌లో కొనసాగుతూనే ఆయన ఈ పాట రాశారంటే, స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కొందరు ఉద్యమనేతల అవినీతి, ద్వంద్వప్రవృత్తి ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. కుసుమ ధర్మన్న స్వాతంత్య్రానికి వ్యతిరేకి కాదు గాని, అణగారిన దళిత వర్గాల అభ్యున్నతిపై నిబద్ధత, చిత్తశుద్ధి లేని నాయకుల చేతికి అధికారం దక్కితే జరగబోయే అనర్థాలను ముందుగానే గుర్తించిన దార్శనికుడు ఆయన. స్వాతంత్య్రం వచ్చాక కుసుమ ధర్మన్నకు కూడా ఎలాంటి గౌరవమూ దక్కలేదు. పరాయి పాలనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన తెలుగు కవులలో చిలకమర్తి లక్ష్మీనరసింహం అగ్రగణ్యుడు. ఆయన ‘భరతఖండంబు చక్కని పాడియావు/ హిందువులు లేగదూడలై యేడ్చుచుండ/ తెల్లవారను గడుసరి గొల్లవారు/ పితుకుచున్నారు మూతులు బిగియగట్టి’ పద్యాన్ని రాశారు. ఇక్కడి సంపదను బ్రిటిష్‌వారు దౌర్జన్యంగా కొల్లగొట్టుకుపోతుండటంపై ఆయన సంధించిన పద్యాస్త్రం అప్పట్లో విపరీతంగా ప్రభావం చూపింది. ఇక సహాయ నిరాకరణోద్యమ సమయంలో చీరాల–పేరాల ఉద్యమానికి నేతృత్వం వహించిన ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆనాడు రగిలించిన స్ఫూర్తి తక్కువేమీ కాదు. సహజ చమత్కారి అయిన దుగ్గిరాల బ్రిటిష్ పాలనను మాత్రమే కాదు, నాటి కాంగ్రెస్ నేతల సంకుచిత స్వభావాలను ఎండగడుతూ చాటువులు రాయగలిగిన సాహసి. సహాయ నిరాకరణోద్యమంలో జైలుపాలై, విడుదలయ్యాక మద్రాసు చేరుకుని అక్కడ ఇచ్చిన ఉపన్యాసంలో ‘న యాచే రిఫారం– నవా స్టీలు ఫ్రేముం/ న కౌన్సిల్ న తు ప్రీవి కౌన్సిల్ పదం వా/ స్వరాజ్యార్తి హన్తాంగ్లరాజ్యే నియన్తా/ ఫరంగీ ఫిరంగీ దృగంగీ కరోతు’ అంటూ నాటి పరిస్థితులపై చమత్కారాస్త్రాన్ని సంధించగల చతురత దుగ్గిరాలకే చెల్లింది. చిలకమర్తి, దుగ్గిరాల– ఇద్దరూ స్వాతంత్య్రానికి ముందే కన్నుమూశారు. స్వాతంత్య్రానంతర ప్రభుత్వాలు వారికి సముచిత గౌరవం కల్పించే చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. ఈ సందర్భంగా గరిమెళ్ల మాటలను గుర్తు చేసుకోవాలి. ‘కొందరు త్యాగము చేయవలె, కొందరు దారిద్య్రముతో నశించవలె, పూర్తిగా నాశనమైనగాని దేశమునకు స్వరాజ్యము రాదు’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరంలో త్యాగాలు చేసిన ఇలాంటి కవులు, రచయితలు ఎందరో ఉన్నారు. స్వాతంత్య్ర సమరంలో స్ఫూర్తి రగిలించిన కవులు, రచయితల సాహిత్యాన్ని భావితరాలకు అందించేందుకు ఇప్పటికైనా నడుం బిగిస్తే బాగుంటుంది. స్వాతంత్య్ర పోరాటంలో తమ వంతు పాత్ర పోషించినా, గుర్తింపు దక్కించుకోలేకపోయిన కవులు, రచయితల కృషిని వెలుగులోకి తెచ్చేందుకు విశ్వవిద్యాలయాలు, అకాడమీలు ఇప్పటికైనా చిత్తశుద్ధితో కృషి ప్రారంభించినట్లయితే, స్వాతంత్య్ర అమృతోత్సవాలకు సార్థకత దక్కినట్లవుతుంది. -
శతమానం భారతి: స్వర్ణశకం
అమృత మహోత్సవం ముగిసింది! స్వర్ణ శకం ప్రారంభమైంది! కొత్త సంకల్పాలతో, కొత్త సంతోషాలతో, నవయుగంలోకి ప్రవేశిస్తున్నాం. వచ్చే 25 ఏళ్ల ప్రయాణాన్ని గతిశక్తితో, అగ్నిపథంలో ఆరంభిస్తున్నాం. ఈ స్ఫూర్తి 130 కోట్ల ప్రజల సమీకరణ, అనుసంధానం ద్వారా స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను చేపట్టడంతో మొదలైంది. ఈ వేడుకల ప్రధాన స్ఫూర్తి ప్రజా భాగస్వామ్యమే. ఈ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం ఒక జాతీయ పండుగగా మారి, స్వాతంత్య్ర సమర స్ఫూర్తి, త్యాగం, అంకిత భావం నేటి తరానికి అనుభవంలోకి వచ్చాయి. తద్వారా ఈ మహోత్సవం సనాతన భారత ఆత్మవిశ్వాసం సాక్షాత్కరించే పండుగగా రూపుదాల్చింది. అమృత మహోత్సవంలో భాగమైన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు దేశాన్ని సమైక్యంగా ఉంచేవి. మరికొన్ని దేశానికి పురోగతిని అందించేవి. ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్, వినియోగదారులకు సాధికారత, విద్యార్థుల ద్వారా ప్రధానికి పోస్ట్ కార్డులు రాయించడం, ఎర్రకోట వద్ద వేడుకలు.. దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి, భవిష్యత్తు తరాల జాతీయ భావనకు ప్రేరణనిస్తాయి. ‘‘ఈ 21 వ శతాబ్దంలో ప్రపంచం వేగంగా మారిపోతోంది. కొత్త అవసరాలకు అనుగుణంగా భారతదేశ ప్రజానీకంలో, యువతరంలో ఆశలు, ఆకాంక్ష పెరిగిపోతున్నాయి. వాటిని నెరవేర్చవలసిన ప్రజాస్వామ్య వ్యవస్థల్ని వచ్చే పాతికేళ్ల కోసం సంసిద్ధం చేసుకోవాలి. అందుకు ఈ అమృత మహోత్సవాల కృషి, చిత్తశుద్ధి తోడ్పడతాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు. మనం ఇక కలిసికట్టుగా స్వర్ణోత్సవ స్వాతంత్య్ర భారతంలోకి పయనించవలసిన తరుణం ఆసన్నమైంది. (చదవండి: ఆ రోజు.. ఐదు నదులకు పోటీగా పంజాబ్‌లో నెత్తురు పారింది!) -
చిత్రం.. భళారే త్రివర్ణం!
అణువణువున రగిలే దేశభక్తిని కళ్లకు కట్టినట్టు చూపడం, తన ముఖం త్రివర్ణ రూపమని చాటి చెప్పడం, ఆకలివేట సాగించే పక్షి ఆతృతను ఒడిసి పట్టుకోవడం, పచ్చని పంట పొలాల్లో సైతం త్రివర్ణ రెపరెపలు కనువిందు చేయడం, సముద్రపు నీటిరాళ్లపై త్రివర్ణాలు అద్దడం.. లాంటి అద్భుతమైన చిత్రాలను కడప నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయం విద్యార్థులు తీసి ఆకట్టుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో సమన్వయకర్త సతీష్ ఆధ్వర్యంలో విద్యార్థులు కడప నగరంలోని పాతకడప తదితర ప్రాంతాల్లో తీసిన చిత్రాలు.. భళా అనిపించేలా ఉన్నాయి. వీరి కళను ఇన్చార్జి వైస్ చాన్సలర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డి అభినందించారు. – ఏఎఫ్‌యూ -
ఆ రోజు.. ఐదు నదులకు పోటీగా పంజాబ్‌లో నెత్తురు పారింది!
నేడు ‘విభజన భయానక జ్ఞాపకాల దినం’... 2021 ఆగస్టు 14న భారత ప్రధాని మోదీ ఈ ‘డే’ని ప్రకటించారు. విషాదాలను మరిచిపోకూడదని, అవి పునరావృతం కాకుండా చూసుకోడమే ఈ విభజన భయానక జ్ఞాపకాల దినం (పార్టిషన్ హారర్స్ రిమంబరెన్స్ డే) ఉద్దేశం అని ఆయన వివరించారు. తేనెపట్టును తలపిస్తూ రైళ్లను ముసురుకున్న మానవ సమూహాలు, కిలోమీటర్ల మేర ఎడ్లబళ్లు, మంచం సవారీ మీద వృద్దులు, భుజాల మీద పిల్లలు, బరువైన కావళ్లు, ఓ ఎత్తయిన ప్రదేశంలో తల పట్టుకుని కూర్చొన్న బాలుడు, కలకత్తా వీధులలో దిక్కులేకుండా పడి ఉన్న శవాల గుట్టలు.. ఇవీ విభజన జ్ఞాపకాలు. ఇవన్నీ అప్పటి ఫొటోలలో చూసి ఉంటాం. ఇంతకు మించిన విభజన ఘోరాలు కూడా ఉన్నాయి. అవి పుస్తకాలలో అక్షరబద్ధం అయ్యాయి. మతావేశాలలో చెలరేగిన ఆ కల్లోలంలో కోటి నుంచి రెండు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. మృతులు పది లక్షల మంది అని అంచనా. అపహరణకు గురైనవారు, అత్యాచారాలకు బలైనవారు.. బాలికలు, యువతుల 75 నుంచి లక్ష వరకు ఉంటారు. తమస్ (భీష్మ సహానీ), ఎ ట్రెయిన్ టు పాకిస్థాన్ (కుష్వంత్ సింగ్), ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్ (ఊర్వశీ బుటాలియా), ఎ టైమ్ ఆఫ్ మ్యాడ్ నెస్, మిడ్నైట్ చిల్డ్రన్ (సల్మాన్ రష్దీ), పార్టిషన్ (బార్న్‌వైట్, స్పున్నర్), ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ (ల్యారీ కోలిన్, డొమినక్ లాపిరె), మిడ్నైట్ ఫ్యూరీస్ (నిసీద్ హజారీ) వంటి నవలలు, చరిత్ర పుస్తకాలలో; అమృతా ప్రీతమ్, ఇస్మత్ చుగ్తాయ్, గుల్జార్, సాదత్ హసన్ మంటో వంటి వారి వందలాది కథలలో విభజన విషాదం స్పష్టంగా కనిపిస్తుంది. హిందువులు, ముస్లింలు ఒకరిని ఒకరు చంపుకున్నారు. సిక్కులు, ముస్లింలు ఒకరిని ఒకరు చంపుకున్నారు. ముస్లింలీగ్ నేత జిన్నా 1946లో ఇచ్చిన ‘ప్రత్యక్ష చర్య’ పిలుపుతో ఉపఖండం కనీవినీ ఎరుగని రీతిలో హత్యాకాండను చూసింది. ఆ సంవత్సరం బెంగాల్ రక్తసిక్తమైంది. 1947లో ఐదు నదులకు పోటీగా పంజాబ్‌లో నెత్తురు పారింది. 1947 ఆగస్ట్ 15న స్వాతంత్య్రం ఇస్తున్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించినా, సరిహద్దుల నిర్ణయం ఆగస్టు 17కు గాని జరగలేదు. ఆ నలభై, యాభై గంటలలో జరిగిన ఘోరాలు భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి మీద అనేక ప్రశ్నలను సంధిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు చేసిన ఘోరాల కంటే ఆ సమయంలో ఇక్కడ జరిగిన ఘోరాలు దారుణమైనవని ఆ యుద్ధంలో పని చేసి వచ్చిన బ్రిటిష్ సైనికులూ పత్రికా విలేకరులూ చెప్పడం విశేషం. అంతటి విషాదాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, అలాంటిది మరొకటి జరగకుండా జాగ్రత్త పడేందుకు. జాగృతం అయ్యేందుకు. -
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రారంభించిన కార్యక్రమమే.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. భారత స్వాతంత్య్ర దినోత్సవం 2022 ఆగస్టు 15 కు 75 వారాల ముందుగా ఈ మహోత్సవ్ ప్రారంభమైంది. నేటితో ముగుస్తోంది. కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో 250 మందికిపైగా రాజకీయ, వ్యాపార, క్రీడా తదితర రంగాల ప్రముఖులతో అమృత్ మహోత్సవ్ జాతీయ అమలు కమిటీ ఏర్పాటైంది. డెబ్బయ్ ఐదు వారాల పాటు దేశ వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఈ కమిటీ దిగ్విజయంగా అమలు చేసింది. ఇందులో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను, ప్రజల్ని భాగస్వాములను చేసింది. దండియాత్ర జరిగిన మార్చి 12 నుంచి ఈ ఉత్సవాల నిర్వహణ ప్రారంభం అయింది. వేడుకలను ప్రారంభించే చరిత్రాత్మక ప్రాంతాలను పురావస్తు శాఖ గుర్తించింది. ఆ మేరకు ఢిల్లీలోని ఖిలా రాయ్ పిథోరా వద్ద వేడుకలు ప్రారంభం అయ్యాయి. అనంతరం గ్వాలియర్ కోట, ఢిల్లీలోని హుమయూన్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, ఐజ్వాల్‌లోని భువనేశ్వరి ఆలయం, ముంబయిలోని అగాఖాన్ ప్యాలెస్, ఒడిశాలోని కొణార్క్ ఆలయం, ఝాన్సీ కోట, జైపూర్ ప్యాలెస్ వంటి చారిత్రక ప్రదేశాల వద్ద వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. -
స్వతంత్ర భారత గణతంత్ర సారథులు
భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. త్రివిధ దళాధిపతి. దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి రాష్ట్రపతి. కొన్ని సందర్భాలలో, కొందరు రాష్ట్రపతులు ప్రధానితో విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ విషయంలోనే ఇది రుజువైంది. ఒక బలమైన ప్రధానితోనే ఆయన తన మనోగతాన్ని వ్యక్తీకరించడానికి వెనుకాడలేదు. తరువాత కూడా అలాంటి సందర్భాలు ఉన్నాయి. చదవండి: జెండా ఊంఛా రహే హమారా! రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా నాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్ కొన్ని బిల్లులను వెనక్కి తిప్పి పంపారు.అందులో తపాలా బిల్లు ఒకటి. వాస్తవానికి కేంద్ర మంత్రి మండలి సిఫారసు చేసిన ఏ అంశాన్నయినా రాష్ట్రపతి ఆమోదించవలసి ఉంటుంది. ప్రణబ్‌కుమార్ ముఖర్జీ రాష్ట్రపతి పదవీకాలం పూర్తయిన తరువాత నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు! స్వాతంత్య్ర సమరయోధులు, ప్రపంచ ప్రఖ్యాత విద్యావంతులు, రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు, దౌత్యవేత్తలు, న్యాయ నిపుణులు రాష్ట్రపతి పదవిని అలంకరించారు. జూలైలో పదవీ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము భారతదేశానికి 15వ రాష్ట్రపతి. 1950లో భారత్ గణతంత్ర దేశమైన తరువాత ఆ పదవిలోకి వచ్చిన 15 మందిలో ఎనిమిది మంది రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వారే. వారిలో ఆరుగురు కాంగ్రెస్ మద్దతుతో గెలిచినవారు. పన్నెండు మంది ఐదేళ్లు పదవిలో ఉన్నారు. దేశంలో అధికార పార్టీ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే సంప్రదాయమే ప్రధానంగా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు రాష్ట్రపతులయ్యారు. వారే రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్. ఆయన అధ్యాపకుడు, న్యాయవాది. గాంధేయవాది. నెహ్రూతో సమంగా గాంధీజీతో కలసి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. రాజ్యాంగ పరిషత్‌కు అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. రెండవసారి రాష్ట్రపతి పదవికి ఎన్నికైన ఏకైన రాజనీతిజ్ఞుడు రాజెన్ బాబు. ప్రథమ ప్రధాని వలెనే, తొలి రాష్ట్రపతి రాజేన్ బాబు కూడా పన్నెండేళ్ల నూట ఏడు రోజులు ఉన్నారు. ఇప్పటి వరకు అదే రికార్డు. హిందూ కోడ్ బిల్లు విషయంలో నెహ్రూతో విభేదించారు. సోవ్‌ునాథ్ ఆలయం ప్రతిష్టకు తాను హాజరు కావడంపై నెహ్రూ అభ్యంతరాలను త్రోసిపుచ్చారు. రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.ఆయన తత్త్వశాస్త్ర వ్యాఖ్యాత. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేశారు. యునెస్కోకు అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. మూడవ రాష్ట్రపతి డాక్టర్ జకీర్ హుస్సేన్. ఆయన రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి ముస్లిం. అలీగఢ్ విశ్వవిద్యాలయం చాన్సలర్‌గా పనిచేశారు. ఆయన పదవిలో ఉండగానే కన్నుమూశారు. నాల్గవ రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి. కార్మికోద్యమం నుంచి వచ్చారు. ఈయన ఎన్నిక వివాదాస్పదమైన మాట నిజమే. కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని నాటి ప్రధాని ఇందిర కూడా పార్టీ సమావేశంలో ఆమోదించారు. కానీ తరువాత వీవీ గిరిని అభ్యర్థిగా నిలిపారు. పార్టీ అభ్యర్థి నీలం ఓడిపోయారు. గిరి విజయం సాధించారు. ఐదవ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. జకీర్ హుస్సేన్ మాదిరిగానే ఈయన కూడా పదవిలో ఉండగానే చనిపోయారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద అంశం అత్యవసర పరిస్థితి విధింపు. ఆ ఆదేశాల మీద మారు మాట లేకుండా అర్ధరాత్రి సంతకం చేసి పంపిన రాష్ట్రపతిగా ఈయన గుర్తుండిపోయారు. ఆరో రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి. దేశ చరిత్రలో ఏకగీవ్రంగా ఎన్నికైన రాష్ట్రపతి. తెలుగువారు. స్వాతంత్య్ర సమరయోధుడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నిక తరువాత దాదాపు అజ్ఞాతం లోకి వెళ్లిన నీలం సంజీవరెడ్డి జనతా పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ నుంచి గెలుపొందారు. 42 లోక్‌సభ స్థానాలకు గాను, 41 కాంగ్రెస్ గెలుచుకుంది. నంద్యాల స్థానం మాత్రం జనతా పార్టీ గెలిచింది. ఆ గెలుపు నీలం సంజీవరెడ్డిది. ఏడవ రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్. సిక్కు వర్గం నుంచి ఎన్నికైన తొలి రాష్ట్రపతి. స్వర్ణాలయం మీద ఆపరేషన్ బ్లూస్టార్ సైనిక చర్య, ఇందిరా గాంధీ హత్య, వెంటనే దేశవ్యాప్తంగా సిక్కుల మీద హత్యాకాండ ఆయన రాష్ట్రపతిగా ఉండగానే జరిగాయి. ఎనిమిదో రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్. ఈయన కూడా స్వాతంత్య్ర పోరాట యోధుల తరానికి చెందినవారే. తామ్రపత్ర గ్రహీత కూడా. కె. కామరాజ్ నాడార్ మీద ఆయన రాసిన పుస్తకానికి గాను సోవియెట్ రష్యా సోవియెట్ ల్యాండ్ పురస్కారం ఇచ్చింది. తొమ్మిదో రాష్ట్రపతి డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ. గొప్ప న్యాయ నిపుణుడు. న్యాయ వ్యవస్థకు ఆయన చేసిన సేవలకు ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్ ‘లివింగ్ లెజెండ్ ఆఫ్ లా అవార్డ్ ఆఫ్ రికగ్నిషన్’ బహూకరించింది. పదవ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. దళిత వర్గం నుంచి తొలిసారిగా ఆ పదవిని అధిరోహించిన వారు. రాష్ట్రపతి అయిన తొలి మలయాళి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ సంస్థలో విద్యాభ్యాసం చేశారు. 1980–1984 మధ్య అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు. పదకొండవ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం. రాజకీయాలలో సంబంధం లేని వ్యక్తి. రోహిణి ఉపగ్రహాలు, అగ్ని, పృథ్వి క్షిపణులు ఆయన పర్యవేక్షణలోనే విజయవంతంగా ప్రయోగించారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి గడించారు. అలాగే పోటీ చేసిన గెలిచిన రాష్ట్రపతులందరి కంటే ఎక్కువ ఓట్లు సాధించినవారు కలాం. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో 1998లో జరిపిన రెండో పోఖ్రాన్ అణు పరీక్షలో కలాం కీలకపాత్ర వహించారు. పన్నెండవ రాష్ట్రపతి ప్రతిభాసింగ్ పాటిల్. ఆ పదవిని అలంకరించిన తొలి మహిళ. సుఖోయి విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి. పదమూడవ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్‌కుమార్ ముఖర్జీ. పద్నాల్గవ రాష్ట్రపతి రావ్‌ునాథ్ కోవింద్. పదిహేనవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆ పదవిని అలంకరించిన తొలి ఆదివాసీ మహిళ. వీవీ గిరి (1969), హిదయ్‌తుల్లా (1969), బసప్ప దాసప్ప జెట్టి (1977) తాత్కాలిక అధ్యక్షులుగా పనిచేశారు. అప్పుడు వీరు ఉపరాష్ట్రపతులుగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. – డా. గోపరాజు నారాయణరావు ఎడిటర్, ‘జాగృతి’