లోకాయుక్త సోదాలు
ఐదుగురు అధికారుల ఇళ్లపై దాడులు
ఓ ఐఎఫ్ఎస్ అధికారి ఇంటిపై కూడా
సాక్షి, బెంగళూరు : అక్రమ మార్గంలో ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు ఐదుగురు ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో లోకాయుక్త ఏక కాలంలో గురువారం సోదాలు నిర్వహించింది. ప్రతి ఒక్కరూ అదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వివరాలను కర్ణాటక లోకాయుక్త అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్.ఎన్ సత్యనారాయణరావు మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి హరికుమార్ ఝా మైసూరు సేల్స్ ఇంటర్ నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతని వద్ద రూ.2.17 కోట్ల స్థిరాస్తులు, రూ.48.42 లక్షల చరాస్తులు ఉన్నాయి. వీటి విలువ నిందితుని సంపాదన కంటే దాదాపు 100 రెట్లు అధికం.
ప్రజాపనుల శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్న బీఎల్ రవీంద్రబాబు, అతని కుటుంబ సభ్యుల పేరుపై రూ.8.23 కోట్ల విలువైన భవంతులు, పొలాలు, ఇంటిస్థలాలు ఉన్నాయి. వీటితో పాటు రూ.2.48 కోట్ల బంగారు, వెండి, నగదు ఉన్నట్లు లోకాయుక్త సోదాల్లో బయటపడ్డాయి. అతని సంపాదన కంటే 324 రెట్ల ఎక్కువ ఆస్తులున్నట్లు తేలింది.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డెరైక్టర్‌గా (ఫైనాన్స్) విధులు నిర్వర్తిస్తున్న పద్మనాభన్ వద్ద రూ.2.96 కోట్ల స్థిర, రూ.19.50 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. అతని సంపాదనతో పోలిస్తే 107 రెట్ల ఆస్తులు అధికంగా ఉన్నట్లు తేలింది.
కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్‌లో అసిస్టెంట్ సెక్రెటరీగా పని చేస్తున్న ఆర్ భాస్కర్ కలిగి ఉన్న స్థిర, చరాస్తుల విలువ అతని సంపాదన కంటే 127 రెట్లు ఎక్కువగా ఉంది.
రాష్ట్ర అబ్కారీ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసమూర్తి వద్ద 207 రెట్ల ఆక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.