JEE Mains
-
జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)మెయిన్స్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీ్టఏ) సోమవారం విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను రెండు సెషన్ల (జనవరి, ఏప్రిల్)లో జేఈఈ మెయిన్స్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 28 నుంచి నవంబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది.వచ్చే నెల 22వ తేదీ రాత్రి 11.50 గంటలల్లోగా ఫీజు చెల్లించేందుకు గడువుగా పేర్కొంది. జనవరి మొదటి వారంలో పరీక్ష కేంద్రాలను ప్రకటించనుంది. పరీక్ష తేదీకి మూడు రోజులు ముందుగా ఎన్టీఏ వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతామని ఎన్టీఏ తెలిపింది. జనవరి 22 నుంచి 31వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు షిఫ్టుల్లో కంప్యూటర్‌పై పరీక్షను నిర్వహించనున్నట్టు వివరించింది. ఫిబ్రవరి 12న తుది ఫలితాలు వెల్లడించనుంది. జేఈఈ మెయిన్స్‌ను 13 ప్రాంతీయ భాషల్లో చేపట్టనుంది. -
జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు
-
జేఈఈ మెయిన్స్‌లో తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్/జహీరాబాద్ టౌన్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన తొలి విడత ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్–1)లో తెలుగు విద్యార్థులు ఈ ఏడాది కూడా సత్తా చాటారు. ఫలితాలను ఎన్టీఏ మంగళవారం వెల్లడించింది. తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్ సూరజ్ సహా పదిమంది వంద శాతం స్కోర్‌ను సాధించారు. వీరిలో తెలంగాణ విద్యార్థులు ఏడుగురు, ఏపీకి చెందిన ముగ్గురున్నారు. మొత్తమ్మీద టాప్–23లో పది మంది తెలుగు విద్యార్థులు చోటు దక్కించుకోవడం విశేషం. హరియాణాకు చెందిన ఆరవ్ భట్ దేశంలో టాపర్‌గా నిలిచారు. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో 544 కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. తొలి విడత మెయిన్స్‌కు 12,21,624 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 11,70,048 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిదశలో కేవలం స్కోరు మాత్రమే ప్రకటించారు. రెండో దశ జేఈఈ మెయిన్స్ పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఆ తరువాత ఫలితాలతో కలిపి రెండింటికి ర్యాంకులను ప్రకటిస్తారు. 300కు 300 మార్కులు జేఈఈ మెయిన్స్ 300 మార్కులకు 300 మార్కులు సాధించిన మొదటి 23 మంది వివరాలను ఎన్టీఏ వెల్లడించింది. 100 శాతం సాధించిన వారిలో తెలంగాణ విద్యార్థులు రిషి శేఖర్ శుక్లా, రోహన్ సాయి పబ్బా, ముత్తవరపు అనూప్, హందేకర్ విదిత్, వెంకట సాయితేజ మాదినేని, శ్రీయషాస్ మోహన్ కల్లూరి, తవ్వా దినేష్ రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనిష్ రెడ్డి ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో తెలంగాణకు చెందిన శ్రీ సూర్యవర్మ దాట్ల, దొరిసాల శ్రీనివాసరెడ్డి 99.99 స్కోర్‌తో టాపర్లుగా నిలిచారు. పీడబ్ల్యూడీ కోటాలో తెలంగాణకు చెందిన చుంచుకల్ల శ్రీచరణ్ 99.98 స్కోర్‌తో టాపర్‌గా నిలిచారు. పురుషుల కేటగిరీలోనూ పదిమంది తెలుగు విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. కష్టపడితే అసాధ్యమనేది ఉండదు: హందేకర్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని మల్చెల్మ గ్రామానికి చెందిన హందేకర్ అనిల్‌కుమార్ కుమారుడు హందేకర్ విదిత్ 300 మార్కులకు 300 మార్కులు సాధించాడు. జేఈఈ పరీక్ష కోసం రోజూ 15 గంటలపాటు ప్రణాళికాబద్దంగా చదివినట్లు విదిత్ చెప్పాడు. నమ్మకం, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యమనేది ఉండదన్నాడు. -
నేటి నుంచి జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్స్–2024 తొలి విడత దేశవ్యాప్తంగా బుధ వారం నుంచి మొదలవుతుంది. జాతీయ స్థాయిలో ఈ పరీక్షకు 12.3 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే అడ్మిట్ కార్డులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని పేర్కొంది. తొలి మూడు రోజులు బీఆర్క్ (పేపర్–1) నిర్వహిస్తారు. తర్వాత రోజుల్లో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్ష ఉంటుంది. ఈసారి పరీక్ష కేంద్రాల వివరాలను ముందే వెల్లడించారు. దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకుంటే బాగుంటుందని ఎన్టీఏ సూచించింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరో సెషన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష చేపడుతున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి అనుమతించరు. ప్రతి కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా రు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అనుసరిస్తు న్నారు. మధ్యలో బయటకు వెళ్లి వచ్చినా ఇది తప్పనిసరి. విద్యార్థులు ముందే డిజి లాకర్లో రిజి స్టర్ అవ్వాలి. ఈ సందర్భంగా ఎన్టీఏ విద్యార్థుల కోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ♦ ఎ–4 సైజ్‌లో అడ్మిట్ కార్డును కలర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్లో అంటించిన పాస్‌పోర్టు ఫొటో ఒకటి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, రేషనల్ కార్డు, ఆధార్, గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రానికి వెళ్లాలి. గుర్తింపు కార్డు లేకుంటే కేంద్రంలోకి అనుమతించరు. దివ్యాంగులు విధిగా సంబంధిత అధికారి జారీ చేసిన పత్రాలను వెంట తెచ్చుకోవాలి. వీరికి అదనంగా 20 నిమిషాలు పరీక్ష రాసేందుకు కేటాయిస్తారు. ♦ మీడియం, సబ్జెక్టుతో కూడిన ప్రశ్నపత్రంలో తప్పులుంటే తక్షణమే ఇన్విజిలేటర్ దృష్టికి తేవా లి. బీఆర్క్ పరీక్ష రాసే వారు అవసరమైన జామె ట్రీ బాక్స్, పెన్సిల్స్, ఎరేజర్, కలర్ పెన్సిల్స్, క్రెయాన్స్‌ను సొంతంగా సమకూర్చుకోవాలి. ♦ ఎలాంటి టెక్ట్స్ మెటీరియల్, పెన్సిల్స్‌ను భద్ర పరిచే బాక్సులు, హ్యాండ్‌బ్యాగ్, పర్సు, తెల్ల పేపర్లు అనుమతించరు. సెల్ఫోన్లు, మైక్రో ఫోన్లు, ఇయర్ ఫోన్లు, క్యాలిక్యులేటర్, వాచీలను హాళ్లలోకి తీసుకెళ్లే వీల్లేదు. పరీక్ష గదిలో అవ సరమైన తెల్ల పేపర్‌ను కేంద్రం నిర్వహకులే అందజేస్తారు. దీనిపై అభ్యర్థి రోల్ నంబర్ వేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత దీన్ని చెత్త బుట్టలో పడేయాల్సి ఉంటుంది. డయాబెటిక్ సహా అత్యవసర వైద్యానికి వాడే మందులను వెంట తెచ్చుకొనేందుకు మాత్రం అనుమతి ఉంది. -
జేఈఈ మెయిన్స్‌కు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్–1 పరీక్ష ఈ నెల 24 నుంచి ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 1వ తేదీ వరకూ ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. జేఈఈ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది. మొదటి మూడు రోజులు ఆర్కిటెక్చర్ (పేపర్–1) ఉంటుంది. ఈ పరీక్ష రాసే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు ఇప్పటికే ఆన్లైన్లో ఉంచినట్టు ఎన్టీఏ తెలిపింది. జేఈఈ ఇంజనీరింగ్ విభాగానికి ఈ నెల 27 నుంచి పరీక్ష ఉంటుంది. ఈ విద్యార్థుల అడ్మిట్ కార్డులు 25 లోగా ఆన్లైన్లో ఉంచే అవకాశముంది. రెండు విభాగాలకు కలిపి దేశవ్యాప్తంగా ఈ ఏడాది 12 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది పరీక్ష రాస్తారని సమాచారం. జేఈఈ మెయిన్స్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని, భద్రత కల్పిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. మొదటి షిప్టు ఉదయం 9 నుంచి, రెండో షిప్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉంటుంది. ప్రతీ సెషన్ మూడు గంటల వ్యవధితో ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని ఎన్టీఏ ప్రకటించింది. ఈసారి భద్రత వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఫేషి యల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు. 11 కేంద్రాల్లో మెయిన్స్ తెలంగాణలో 11 కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వ హించనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. హైదరాబా ద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబా ద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌తోపాటు ఏపీలోని 30 కేంద్రాల్లో పరీక్షలు ఉన్నట్టు అధికారులు వివరించారు. పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్ సహా మొత్తం 10 భాషల్లో నిర్వహిస్తారు. రెండో దశ పరీక్షలు ఏప్రిల్ లో చేపడతారు. ఈసారి పరీక్ష కోసం సిలబస్ తగ్గించారు. కోవిడ్ సమయంలో కేంద్ర విద్యా సంస్థల్లో టెన్త్ రాసినవారు ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ కు హాజరవుతున్నారు. ఆ సమయంలో వీళ్లకు సిలబస్ కుదించారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని 25% సిలబస్‌ను మెయిన్స్ నుంచి తొలగించారు. గణితంలో సుదీర్ఘ ప్రశ్నలను తొలగించారు. ఈ కారణంగా మెయిన్స్ రాసే వారి సంఖ్య పెరగుతోంది. నెగెటివ్ మార్కులతో జాగ్రత్త జేఈఈ మెయిన్స్‌లో నెగెటివ్ మార్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నా రు. సమాధానం కచ్చితంగా రాస్తే 4 మార్కులు ఉంటాయి. తప్పుగా టిక్ పెడితే మైనస్–1 అవుతుంది. కాబట్టి తెలియని ప్రశ్నలకు ఊహించి రాసేకన్నా, వదిలేయడమే మంచిదని గణిత శాస్త్ర నిపుణులు ఎంఎన్ రావు తెలిపారు. కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నల కోసం ముందే సమయం వృథా చేయకూడదని, వాటి గురించి ఆఖరులో ఆలోచించాలని ఆయన సూచించారు. అనవసర ప్రశ్నలకు తలబాదుకుంటూ కూర్చుంటే ఆ ప్రభావం తెలిసిన ప్రశ్నలపై పడే అవకాశం ఉంటుందని భౌతిక శాస్త్ర నిపుణుడు విక్రమ్ సింగ్ చెప్పారు. ముందుగానే జేఈఈ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన పత్రాలన్నీ (సెల్ఫ్ డిక్లరేషన్, అండర్ టేకింగ్ ఫాం) దగ్గర ఉంచుకోవాలని ఎన్టీఏ సూచించింది. వాటర్ బాటిల్స్, హ్యాండ్ శానిటైజర్లు, మాసు్కలు, బాల్ పాయింట్ పెన్నులను అనుమతిస్తామని తెలిపింది. -
ఇంకా ‘సెట్’ కాలేదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి పరీక్షల (సెట్ల)పై ఇంకా కసరత్తు మొదలుకాలేదు. ఎంసెట్ సహా పాలిసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్ పరీక్షల షెడ్యూల్‌పై అయోమయం నెలకొంది. ఏ ప్రవేశపరీక్షను ఏ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలి? ఏ పరీక్షకు కన్వీనర్ ఎవరనే సందిగ్ధత కొనసాగుతోంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో నెలకొన్న గందరగోళమే దీనికి కారణమని.. దీంతో ఈసారి ప్రవేశపరీక్షల నిర్వహణ ఆలస్యం కావొచ్చని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మొదలుకావాల్సి ఉన్నా.. ఏటా జనవరిలో ఎంసెట్ సహా ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. ఆయా పరీక్షలను నిర్వహించే యూనివర్సిటీలను, కన్వీనర్లను ఖరారు చేస్తారు. ఆ వెంటనే ఆయా కన్వీనర్లు, యూనివర్సిటీల ఆధ్వర్యంలో పరీక్షలకు సంబంధించిన కసరత్తు, ఏర్పాట్లు మొదలవుతాయి. కానీ ఈసారి జనవరి మూడోవారం ముగుస్తున్నా.. షెడ్యూల్ విడుదలకు సంబంధించిన ఎలాంటి కసరత్తు మొదలుకాలేదు. ఎంసెట్‌పై కసరత్తు ఏదీ? జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ మెయిన్స్‌ను ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్నారు. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం జూన్ నుంచి జోసా కౌన్సెలింగ్ చేపట్టేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సాధారణంగా జేఈఈ తేదీలకు అనుగుణంగా రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేస్తారు. షెడ్యూల్ ప్రకటన తర్వాత.. ఎంసెట్ జరిగి, ఫలితాలు వచ్చి, కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికి విశ్వవిద్యాలయాలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు చేసి.. అర్హత ఉన్నవాటికి అనుబంధ గుర్తింపు ఇస్తాయి. సాధారణంగా మేలో ఎంసెట్ నిర్వహించి, అదే నెలలో ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఈసారి గందరగోళంతో ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలు కూడా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోందని విద్యావేత్తలు చెప్తున్నారు. హడావుడిగా జరిగితే ఇబ్బందులే.. సాధారణంగా ఉమ్మడి ప్రవేశపరీక్షల ప్రక్రియ ఏటా నవంబర్ నుంచే మొదలవుతుంది. వర్సిటీల వీసీలతో ఉన్నత విద్యా మండలి సమావేశం ఏర్పాటు చేసి.. సెట్స్‌కు కన్వీనర్లను ఎంపిక చేయాలి. వారు ప్రశ్నపత్రాల తయారీపై దృష్టి పెడతారు. ప్రశ్నల రూపకల్పనకు సంబంధించి నిపుణులను పిలిపిస్తారు. కంప్యూటర్ బేస్డ్గా దాదాపు పది రకాల ప్రశ్నపత్రాలను రూపొందిస్తారు. ఇందులో కఠినమైనవి, తేలికైనవి అత్యంత గోప్యంగా తయారు చేయాలి. తర్వాత వాటన్నింటినీ కలిపి కంప్యూటర్ సాయంతో ఫైనల్ పేపర్‌ను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారు. తర్వాత పరీక్ష కేంద్రాల ఎంపిక, ప్రశ్నపత్రాల సగటు పరిశీలన ఉంటాయి. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, ర్యాంకుల క్రోడీకరణకు ఎక్కువ సమయం పడుతుంది. పలు దఫాలుగా వీసీలు, ప్రొఫెసర్లు సమావేశాలు జరుపుతూ ఉంటే.. ఇవన్నీ సాఫీగా సాగుతాయి. ఈసారి ఇప్పటికీ విద్యా మండలి సమావేశమే జరగలేదు. ఆలస్యంగా ప్రక్రియ మొదలుపెట్టి హడావుడిగా చేస్తే.. ఎక్కడైనా లోపం జరిగితే.. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల సన్నద్ధతకూ ఇబ్బంది ఎంసెట్ ఆలస్యం వల్ల విద్యార్థుల సన్నద్ధతకు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఇబ్బంది రావొచ్చని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్ రాసే విద్యార్థుల్లో చాలా వరకు జేఈఈ మెయిన్స్‌కు కూడా సిద్ధమవుతారు. మెయిన్స్ రెండో దశ ఏప్రిల్‌లో జరుగుతుంది. అది పూర్తయ్యాక మేలో ఎంసెట్ రాస్తుంటారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎంసెట్ కోసం ప్రత్యేక కోచింగ్ తీసుకుంటారు. ఎంసెట్ ఆలస్యమైతే ఇబ్బందులు వస్తాయని, కోచింగ్ కేంద్రాల వారు అదనపు ఫీజులు వసూలు చేస్తారని విద్యార్థులు వాపోతున్నారు. ఎన్ఐటీల్లో సీట్ల కౌన్సెలింగ్ నాటికి ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలవకపోతే.. కోరుకున్న కాలేజీలో సీట్లు వస్తాయా? రావా? అన్న ఆందోళన కూడా ఉంటుందని పేర్కొంటున్నారు. ఉన్నత విద్యా మండలిలో గందరగోళం! రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశపరీక్షలకు సంబంధించి డిసెంబర్లోనే యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యా మండలి అధికారులు సమావేశం కావాలని నిర్ణయించారు. తేదీ కూడా ఖరారు చేశారు. సెట్ కన్వీనర్ల ఎంపికకూ రంగం సిద్ధమైంది. ఈలోగా కొత్త ప్రభుత్వం మండలి చైర్మన్‌తోపాటు, వైస్ చైర్మన్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించడంతో.. వీసీలతో సమావేశం వాయిదా పడింది. అయితే ప్రభుత్వం కొత్తవారిని నియమించలేదు. తొలగిస్తున్నట్టు ప్రకటించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఇంకా అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. ఉన్నత విద్యకు సంబంధించి సీఎం సమీక్షల్లో సరైన సమాచారం ఇవ్వడానికి మండలిలో ఎవరూ లేకపోవడంతో.. వారిని కొనసాగిస్తున్నట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు. వీరినే తిరిగి నియమించే అవకాశం ఉందనీ అంటున్నారు. సమావేశాలకు వీసీల విముఖత ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్లను తొలగించిన నేపథ్యంలో.. అధికారికంగా సమావేశాలు నిర్వహించేందుకు వీలుకావడం లేదని మండలి వర్గాలు చెప్తున్నాయి. దీనికితోడు ఉమ్మడి ప్రవేశపరీక్షలపై చర్చించేందుకు వెళ్లడానికి వర్సిటీల వీసీలూ సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నాయి. సెట్స్ కోసం కన్వీనర్లను సూచించాలని మండలి నుంచి లేఖలు వచ్చినా.. యూనివర్సిటీల వీసీలు నిర్లిప్తంగా ఉంటున్నారు. ‘‘ముందు చైర్మన్, వైస్ చైర్మన్లను కొనసాగిస్తారా? కొత్తవారిని తెస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేం సెట్స్ కన్వీనర్ల పేర్లు ఇచ్చినా.. కొత్త చైర్మన్ వస్తే మార్పులు ఉంటాయి..’’ అని ఓ వర్సిటీ వీసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదరణ పెరుగుతున్నా..! కొన్నేళ్లుగా ఎంసెట్ రాసే వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రస్థాయిలో సీట్లు ఎక్కువగా ఉండటం, ఉపాధి కోసం, విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లడానికి అవకాశం ఉండటంతో చాలా మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. 2018లో 2.20 లక్షల మంది ఎంసెట్ రాస్తే.. 2023 నాటికి ఈ సంఖ్య 3 లక్షలు దాటింది. పరీక్ష రాసేవారి సంఖ్య ఏటా 20శాతం దాకా పెరుగుతోంది. నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఎంసెట్ (మెడికల్ అండ్ అగ్రికల్చర్) తప్పనిసరి చేయడంతోనూ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎంసెట్‌కు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య ఇదీ.. ఏడాది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ 2018 1,47,912 73,078 2019 1,42,218 74,981 2020 1,43,326 78,981 2021 1,64,963 86,641 2022 1,61,552 88,156 2023 1,95,275 1,06,514 త్వరలో నిర్ణయం.. నా కొనసాగింపుపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇస్తుందని విశ్వసిస్తున్నాను. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సకాలంలోనే నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నాం. ఆ దిశగా త్వరలో షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
జేఈఈ వైపు విద్యార్థుల చూపు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్ష మొదలవనుంది. ఫిబ్రవరి 1 వరకు ఇది కొనసాగుతుంది. పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా జరిగే మెయిన్స్‌కు ఈ ఏడాది దరఖాస్తులు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా గత ఏడాది 11.62 లక్షల మంది దరఖాస్తు చేస్తే, ఈ ఏడాది (2024) 12.30 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2022లో వచ్చిన దరఖాస్తులు 10.26 లక్షలే కావడం గమనార్హం. 2014 తర్వాత నుంచి మెయిన్స్ రాసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. క్లాసులు సరిగా జరగకపోవడం ఒక కారణమైతే, కోచింగ్ కేంద్రాలు లేకపోవడం మరో కారణం. అయితే, 2022 నుంచి పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. దీంతో మెయిన్స్‌కు పోటీ పెరిగింది. సిలబస్‌లో మార్పులూ కారణమే.. కొన్నేళ్లుగా జేఈఈ మెయిన్స్ అంటే విద్యార్థులు భయపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మేథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు కష్టంగా ఉంటున్నాయి. గణితంలో ప్రశ్నలు సుదీర్ఘంగా ఉంటున్నాయి. ప్రిన్సిపుల్స్ ఆఫ్ మేథమెటికల్ ఇండక్షన్ అండ్ సింపుల్ అప్లికేషన్స్, మేథమెటికల్ రీజనింగ్, ప్లేన్ అండ్ డిఫరెంట్ ఫామ్స్‌తో మొత్తం 10 చాప్టర్స్‌లో ప్రశ్నలకు జవాబులు రాబట్టడానికి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో ఇతర సబ్జెక్టుల్లో ప్రశ్నలకు జవాబులు రాసేందుకు సమయం తక్కువగా ఉండటంతో విద్యార్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. కెమిస్ట్రీ సులభంగా ఉన్నప్పటికీ మేథ్స్ సమయం తినేయడంతో ఇందులో సరిగా ఆన్సర్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని నిపుణులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దృష్టికి తెచ్చారు. దీంతో మేథ్స్‌లో పది చాప్టర్ల నుంచి ఈసారి ప్రశ్నలు ఇవ్వడం లేదు. ఇదే పరిస్థితి ఫిజిక్స్‌లోనూ ఉంది. 12 చాప్టర్ల నుంచి ప్రశ్నలివ్వడం మానేసినట్టు ఎన్టీఏ ప్రకటించింది. జియో స్టేషనరీ శాటిలైట్స్, డాప్లర్ ఎఫెక్ట్‌ఇన్ సౌండ్, కలర్ కోడ్ ఫర్ రెసిస్టర్స్ వంటి చాప్టర్లు ఇందులో ముఖ్యమైనవి. కెమిస్ట్రీలో కష్టంగా ఉన్న 9 చాప్టర్లను మినహాయించారు. పాలిమర్స్, స్టేట్ ఆఫ్ మ్యాటర్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ వంటి కీలకమైన చాప్టర్లున్నాయి. అదీగాక, తెలంగాణ, ఏపీ మినహా చాలా రాష్ట్రాల్లో స్థానిక ఎంసెట్ నిర్వహించడం లేదు. జేఈఈ ర్యాంకు ఆధారంగానే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. ఈ కారణంగా జేఈఈ రాయడం అనివార్యంగా మారింది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఈసారి జేఈఈ మెయిన్స్ నిర్వహణకు ఎన్టీఏ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల బయోమెట్రిక్‌ను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు పరీక్ష మధ్యలో వాష్‌రూంకు వెళ్లి, తిరిగి వచ్చినా బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తున్నట్టు వెల్లడించింది. కొన్నేళ్లుగా సాంకేతిక సమస్యలు తలెత్తతున్న కేంద్రాలను గుర్తించి, ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఒకవేళ సాంకేతిక సమస్య వచ్చినా అప్పటికప్పుడు కంప్యూటర్ ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. -
జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తు గడువు రేపే
సాక్షి, హైదరాబాద్: ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(జేఈఈ మెయిన్స్)కు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 1వ తేదీన మొదలైంది. జేఈఈ మెయిన్స్ తొలివిడత పరీక్ష దేశవ్యాప్తంగా 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ జరుగుతుంది. రెండోవిడత ఏప్రిల్‌లో జరుగుతుంది. ఫిబ్రవరి 12న మెయిన్స్ ఫలితాలు వెల్లడిస్తారు. కోవిడ్‌కాలంలో ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈ సిలబస్ తగ్గించారు. దీంతో ఈసారి కొన్ని టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఇవ్వడాన్ని మినహాయించినట్టు ఎన్టీఏ ప్రక టించింది. ఇందుకు సంబంధించిన సిలబస్‌నూ విడుదల చేసింది. మ్యాథ్స్‌లో కూడా సుదీర్ఘ జవాబులు రాబట్టే విధానానికి సడలింపు ఇచ్చారు. ఫలితంగా ఈసారి ఎక్కువమంది మెయిన్స్ రాసే వీలుందని అంచనా వేస్తున్నారు. -
లాజిక్ పసిగట్టు.. జేఈఈ ర్యాంక్ కొట్టు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ అత్యంత కీలకమైంది. వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్‌లో ఈ పరీక్ష జరుగుతుంది. ఇందులో అర్హత కోసం ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తారు. మెయిన్స్‌లో మంచి ర్యాంకు వ చ్చి, అడ్వాన్స్‌డ్‌లో రాకపోయినా ఆనందించే వాళ్లూ ఉంటారు. అయితే, జేఈఈలో విజయం సాధించడానికి కృషితో పాటు కొన్ని లాజికల్ అంశాలు తెలుసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. చాలామందికి ఏ ర్యాంకుతో ఎక్కడ, ఏ బ్రాంచీలో సీటు వస్తుందనే అవగాహన ఉండదు. మెయిన్స్ ర్యాంకుతో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఈసారి మారిన సిలబస్ కొంత ఒత్తిడిని తగ్గించే వీలుంది. కాబట్టి మెయిన్స్ ర్యాంకుల పట్ల ఉన్న అపోహలు దూరం చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది విద్యార్థులు 10,000 లోపు ర్యాంకు ఉంటేనే ఎన్ఐటీల్లో సీట్లు వస్తాయని భావిస్తారు. దీంతో తుది దశ కౌన్సెలింగ్ వరకూ ఉండకుండా ఎంసెట్‌పై దృష్టి పెడతారు. ర్యాంకర్లు కూడా రాష్ట్ర కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లకు ప్రయత్నిస్తారు. కౌన్సెలింగ్ జిమ్మిక్కు పూర్తిగా అర్థమైతే తప్ప దీని నుంచి బయటపడటం కష్టం. అందుకే మెయిన్స్‌కు వెళ్లే విద్యార్థులు గత కొన్నేళ్ల ర్యాంకులు, సీట్ల వివరాలపై ముందే కొంత కసరత్తు చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కాలేజీ కూడా లక్ష్యం కావాలి..: మెయిన్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ముందస్తు సన్నద్ధతను బట్టి ఓ అంచనాకు రావాలి. మూడేళ్ల కటాఫ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ ర్యాంకు వస్తుందో గుర్తించాలి. దీని ఆధారంగానే ఏయే కాలేజీల్లో ఎంత వరకూ సీట్లు వచ్చాయనేది తెలుసుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఐఐటీల్లో 16,050 సీట్లు, ఎన్ఐటీల్లో 23,056 సీట్లు, ఐఐఐటీల్లో 5,643 సీట్లు, కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో 5,620... వెరసి 50,369 సీట్లు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాయి. అడ్వాన్స్‌డ్‌తో భర్తీ చేసే 16,050 ఐఐటీ సీట్లను పక్కనబెడితే మిగిలిన 34,319 సీట్లను జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారానే భర్తీ చేస్తారు. కొన్నేళ్లుగా సీట్ల కేటాయింపును పరిశీలిస్తే, వరంగల్ నిట్‌లో సీఎస్ఈకి అబ్బాయిలకు 3,089 ర్యాంకు, అమ్మాయిలకు 3,971 వరకూ సీటు వస్తుంటే, ఏపీలో అబ్బాయిలకు 14,000 ర్యాంకు, అమ్మాయిలకు 28,000 ర్యాంకు వరకు సీటు వస్తోంది. ఒబీసీలకు వరంగల్‌లో గరిష్టంగా 13,000 వరకూ, ఏపీలో 33,000 ర్యాంకు వరకూ సీట్లు వస్తున్నాయి. ఎస్సీ కేటగిరీకి గరిష్టంగా 97,139 వరకూ, ఎస్టీలకు 48,000 ర్యాంకు వరకూ సీట్లు దక్కాయి. సిలబస్ మారడంతో ఈసారి కొంత పోటీ ఉండొచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ర్యాంకు, కాలేజీని టార్గెట్‌గా పెట్టుకోవాలన్నది జేఈఈ అధ్యాపకుల సూచన. బ్రాంచే టార్గెట్ అనుకుంటే... చాలామంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీ కోసం ఎదురు చూస్తారు. అందుకే ఓపెన్ కేటగిరీలో ఈ బ్రాంచీ సీట్లకు పోటీ ఉంటుంది. ఒకవేళ బ్రాంచీనే లక్ష్యమైతే ఫలానా కాలేజీలో కావాలనే టార్గెట్ పెట్టుకోకూడదు. కొన్ని ఎన్ఐటీల్లో ఓపెన్ కేటగిరీకి కూడా 40,000 ర్యాంకు వ చ్చినా సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇవేంటో విద్యార్థులు తెలుసుకోవాలి. మెకానికల్ డివిజన్లో ఓపెన్ కేటగిరీలోనే వరంగల్ నిట్‌లో 17,000 వరకూ, ఏపీలో 75,000 వరకూ ర్యాంకులకు సీటొచ్చే వీలుంది. రిజర్వేషన్ విభాగంలో ఏకంగా 2,96,201 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. తిరు చ్చి, సూరత్కల్, క్యాలికట్, నాగపూర్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఐటీల్లో ఓపెన్ కేటగిరీ విద్యార్థులు కూడా జేఈఈ ర్యాంకు గరిష్టంగా 50,000 దాటినా సీటు సంపాదించిన ఉదంతాలున్నాయి. కాబట్టి కోరుకున్న బ్రాంచీ, ఏ కాలేజీలో వస్తుందనే కసరత్తు చేయడం ముఖ్యం. ఈ లాజిక్ తెలిస్తే ప్రిపరేషన్ అందుకు తగ్గట్టుగా ఉండే వీలుందని నిపుణులు అంటున్నారు. -
మార్పుతో మేలు జరిగేనా?
సాక్షి, హైదరాబాద్: ఈసారి జరిగే జేఈఈ మెయిన్స్‌లో గణనీయమైన మార్పులు తెచ్చారు. ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కొన్ని టాపిక్స్ ఎత్తేశారు. ఈ పరిణామంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జనవరిలో జరిగే జేఈఈ మెయిన్స్‌కు ఇప్పటికే విద్యార్థులు సన్నద్ధమయ్యారు. ఈ దశలో సిలబస్ మార్పులను ఎన్టీఏ ప్రకటించడంతో ఇది రాష్ట్ర విద్యార్థులపై కొంత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సిలబస్ నుంచి తొలగించిన టాపిక్స్‌కు కూడా విద్యార్థులు ప్రిపేరయ్యారు. ఇప్పుడు వాటిని తప్పించడంతో మిగిలిన టాపిక్స్‌లో పోటీ తీవ్రంగా ఉండే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సిలబస్‌తో ఇంటర్ చేసే వాళ్లు మరికొంత శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని... అలాగే వారంతా ఏప్రిల్‌లో జరిగే రెండో దశ మెయిన్స్‌కు హాజరు కావడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగేనా? సిలబస్ తగ్గించడంతో ఈసారి మెయిన్స్ రాసేవారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కటాఫ్ మార్కుల విషయంలోనూ కొన్ని మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు. వాస్తవానికి జేఈఈ రాసేవారి సంఖ్య కొన్నేళ్లుగా తగ్గుతోంది. 2014లో దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుకాగా 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. వాస్తవానికి రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉండగా ప్రస్తుతం 1.30 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో రాష్ట్ర ఎంసెట్ రాసేవారి సంఖ్య 2018లో 1.47 లక్షలు ఉండగా 2022లో ఇది 1.61 లక్షలకు పెరిగింది. రాష్ట్ర ఎంసెట్ ద్వారా విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందుతారు. జేఈఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీల్లో సీట్లు దక్కించుకుంటారు. సిలబస్ కఠినంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుసరించే సిలబస్ చదివితే తప్ప మెయిన్స్ గట్టెక్కలేమనే భావన విద్యార్థుల్లో ఎక్కువవుతోంది. దీంతో చాలా మంది రాష్ట్ర స్థాయిలోని ఎంసెట్‌ను ఎంచుకుంటున్నారు. సిలబస్‌లో మార్పులు తేవడంతో ఈసారి జేఈఈ రాసే వారి సంఖ్య కొంతమేర పెరిగే వీలుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. మేథ్స్ ఇక కఠినం కానట్టేనా? కొన్నేళ్లుగా జేఈఈ మెయిన్స్ రాస్తున్న వారు ఎక్కువగా గణితం కష్టంగా ఉందని చెబుతున్నారు. కెమిస్ట్రీ నుంచి ఎక్కువగా స్కోర్ చేస్తున్న అనుభవాలున్నాయి. ఫిజిక్స్ నుంచి వచ్చే ప్రశ్నలు మధ్యస్తంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఇది దక్షిణాది విద్యార్థులకన్నా ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులను కలవరపెడుతోంది. మేథ్స్‌లో దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు పట్టు ఉంటోంది. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సరైన శిక్షణ అందుకోలేకపోతున్నారు. జేఈఈలో ఇచ్చే గణితంలో సుదీర్ఘ ప్రశ్నలుంటున్నాయి. దీనివల్ల ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని చెబుతున్నారు. మేథ్స్‌లో ట్రిగ్నామెట్రిక్ ఈకే్వ షన్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ప్రిన్సిపుల్ ఆఫ్ మేథమెటికల్ ఇండక్షన్ వంటి టాపిక్స్ వచ్చే అవకాశం లేదని ఎన్టీఏ తెలిపింది. దీనివల్ల తేలికగానే జేఈఈ మెయిన్స్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. గురువారం ఉదయం నుంచి మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకూ కొనసాగుతుంది. పరీక్ష కేంద్రాలను జనవరి రెండో వారంలో వెల్లడిస్తామని ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థుల హాల్ టికెట్లు పరీక్షకు మూడు రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశానికి రెండు దశల ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకును బట్టి ఐఐటీల్లో సీట్లు వస్తాయి. మిగతా జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. తొలి దశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ ఉంటుంది. రెండో దశ ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఏ సెషన్‌కైనా, లేదా రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష పలితాలను ఫిబ్రవరి 12వ తేదీన వెల్లడిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో జేఈఈ మెయిన్స్ ఉంటుంది. ప్రతీ సబ్జెక్టులోనూ 10 టాపిక్స్, ఫిజిక్స్‌లో 12 టాపిక్స్ తీసివేత కోవిడ్ సమయంలో ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈ సిలబస్‌ను కుదించారు. దీంతో కొన్ని టాపిక్స్‌లో బోధన జరగలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని జేఈఈ మెయిన్స్ సిలబస్‌లోనూ ఈసారి భారీ మార్పులు చేశారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ల్లో పది చొప్పున, ఫిజిక్స్‌లో 12 చొప్పున టాపిక్స్‌ను జేఈఈ మెయిన్స్‌లో ఇవ్వకూడదని నిర్ణయించారు. జేఈఈ పరీక్ష కఠినంగా ఉంటోందనే సంకేతాలు రావడంతో ఈసారి పరీక్ష పేపర్ కూర్పులోనూ మార్పులు చేశారు. ముఖ్యంగా గణితంలో సుదీర్ఘ పద్ధతిలో సమాధానాలు రాబట్టే ప్రశ్నల నుంచి కొంత వెసులుబాటు ఇచ్చారు. మాథ్స్‌లో కఠినంగా భావిస్తున్న ట్రిగా్నమెట్రిక్స్ ఈక్వేషన్స్, మేథమెటికల్ రీజనింగ్‌ను తొలగించారు. దీనివల్ల సమాధానాలు రాబట్టేందుకు సమయం కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. -
జేఈఈ మెయిన్స్ తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రిపుల్ ఐటీ ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ కాలంలో 4 దఫాలుగా నిర్వహించిన ఈ పరీక్షను 2024– 25లో మాత్రం రెండు విడతలుగానే నిర్వహిస్తున్నట్టు తెలిపింది. తొలి విడతను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ మధ్య చేపట్టాలని నిర్ణయించింది. రెండో దఫా జేఈఈ మెయిన్స్ ను ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ మధ్య నిర్వహించబోతున్నట్టు వెల్లడించింది. దీంతో పాటే మే 5న నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్–యూజీ), మే 15–31 తేదీల మధ్య కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ), మార్చి 11–28 మధ్య సీయూఈటీ–పీజీ, జూన్ 10–21 మధ్య యూజీసీ–నెట్ పరీక్షలను నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేసింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారంగానే ఉంటాయని పేర్కొంది. అయితే, సమగ్ర వివరాలతో కూడిన షెడ్యూల్‌ను ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. 2021 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్ష కోవిడ్ కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. గత ఏడాది మాత్రం జనవరి, ఏప్రిల్ నెలల్లోనే నిర్వహించారు. అయితే, తేదీల ఖరారులో మాత్రం ఆలస్యమైంది. ఈ సంవత్సరం కోవిడ్ కన్నా ముందు మాదిరిగానే మూడు నెలల ముందే తేదీలను వెల్లడించారు. మెయిన్స్ దరఖాస్తులు పెరిగేనా? కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల వైపు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో జేఈఈ మెయిన్స్ రాసే వారి సంఖ్య ప్రతీ సంవత్సరం తగ్గుతోంది. ఈ స్థానంలో రాష్ట్ర ఎంసెట్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. 2014లో జేఈఈ మెయిన్స్ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుంటే, 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. 2023లో మాత్రం ఈ సంఖ్య 11 లక్షలకు పెరిగింది. కోవిడ్ సమయంలో టెన్త్ పరీక్షలు లేకుండా ఉత్తీర్ణులైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. వాస్తవానికి మన రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉంటే, ఇప్పుడు 1.30 లక్షలకు పడిపోయింది. రాష్ట్రంలో ఎంసెట్ రాసేవారి సంఖ్య 2018లో 1.47 లక్షలుంటే, 2022లో ఇది 1.61 లక్షలకు పెరిగింది. కాగా, గత రెండేళ్లుగా రాష్ట్రంలో హాస్టళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, జేఈఈపై దృష్టి పెడుతున్న వారి సంఖ్య పెరగడంతో ఈ సంవత్సరం కూడా జేఈఈ రాసే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
జేఈఈ రాకున్నా... ఐఐటీ చదువు
సాధారణంగా దేశంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో చదవాలంటే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు కొట్టాల్సిందే. కానీ ఇక మీదట సాదాసీదా డిగ్రీ విద్యార్థులు కూడా ఐఐటీల్లో కోర్సులు పూర్తి చేయవచ్చు. జాతీయ స్థాయిలో ఈ తరహా కసరత్తు వేగంగా ముందుకెళ్తోంది. కోవిడ్ కాలంలో మొదలైన ఈ ఆలోచన ఇప్పుడు అనేక రూపాల్లో విద్యార్థులకు అందుబాటులోకి వస్తోంది. దేశంలో ఏటా లక్షల మంది ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చేస్తున్నారు. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న సీట్లు 50 వేల లోపే. అందులోనూ ఐఐటీల్లో ఉన్నవి 16 వేలు మాత్రమే. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే ఐఐటీల్లో ఏ కోర్సు చేసినా మంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో అవసరమైన కొన్ని కోర్సులను ఐఐటీల ద్వారా సర్టిఫికేట్ కోర్సులుగా అందించాలని ఐఐటీలు కార్యాచరణ సిద్ధం చేశాయి. – సాక్షి, హైదరాబాద్ కోవిడ్ కాలంలో.. కోవిడ్ సమయంలో విద్యార్థులు ఆన్లైన్ విద్యకు అలవాటు పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోర్సులను డిజైన్ చేసినట్లు ఐఐటీలు చెబుతున్నాయి. విద్యార్థులు కూడా ఈ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని మద్రాస్ ఐఐటీ ఇటీవల తెలిపింది. ఈ సంస్థ ప్రతినిధులు వివిధ రాష్ట్రాలోని కాలేజీలకు వెళ్లి ఆన్లైన్ కోర్సుల ప్రాధాన్యతను వివరించారు. మిగతా ఐఐటీలు సరికొత్త సర్టిఫికెట్ కోర్సులను తెరపైకి తెచ్చాయి. ఇవీ కోర్సులు.. ఎంటెక్‌లో ఆన్లైన్ కోర్సులకు ఐఐటీ హైదరాబాద్ గతేడాది సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెరి్నంగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి మార్కెట్ డిమాండ్ కోర్సులను ఈ ఏడాది తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. మరికొన్ని ఐఐటీలు ఈ సంవత్సరం నుంచి మార్కెట్ వర్గాల డిమాండ్‌కు అనుగుణంగా ఎంటెక్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను తీసుకొస్తున్నాయి. 2020లో ఐఐటీ మద్రాస్ బీఎస్సీ డేటా సైన్స్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ కోర్సులో 18 వేల మంది చేరినట్లు ఆ సంస్థ తెలిపింది. నాలుగేళ్ల బీఎస్సీ ఎల్రక్టానిక్స్ కోర్సును ఆన్లైన్ ద్వారా అందించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఐఐటీ బాంబే డిజిటల్ మార్కెటింగ్ అండ్ అప్లైడ్ అనలిటిక్స్, డిజైన్ థింకింగ్, మెషీన్ లెరి్నంగ్ అండ్ ఏఐ విత్ పైథాన్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అందిస్తున్నట్లు ప్రకటించింది. పట్నా ఐఐటీ ఎంటెక్ ఇన్ బిగ్ డేటా అండ్ బ్లాక్‌చైన్, ఎంటెక్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను మరింత ఆధునీకరిస్తూ అందిస్తోంది. అయితే వాటిని ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు అందించాలని నిర్ణయించింది. ఢిల్లీ ఐఐటీ కూడా జాతీయ, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న సర్టిఫికెట్ కోర్సులను అందించనుంది. ఇందులో సేల్స్ అండ్ మార్కెటింగ్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, మెషీన్ లెరి్నంగ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ స్టార్టప్ బూట్‌క్యాంప్, న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ కోర్సులున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సులువు.. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎప్పటికప్పుడూ నైపుణ్యానికి పదును పెట్టాల్సిందే. ఇలాంటి మళ్లీ వారు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అంతర్జాతీయ ప్రమాణాలున్న ఐఐటీ సంస్థల్లో సర్టిఫికెట్ కోర్సులు చేయవచ్చు. ఐఐటీ ద్వారా సర్టిఫికెట్ కోర్సు చేస్తే మంచి ఫ్యాకల్టీ ద్వారా పాఠాలు వినడమే కాకుండా ఆ సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లకు విలువ ఉంటుంది. మరింత మెరుగైన ఉపాధికి ఆస్కారం ఉండే వీలుంది. ట్రెండ్ మంచిదే... అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి. ఇదే బాటలో ఐఐటీలు మంచి కోర్సులు ఆఫర్ చేయడం మంచిదే. అయితే ఇవి కేవలం సర్టిఫికెట్ల జారీకే పరిమితం కాకూడదు. కోర్సు నేర్చుకొనే విద్యార్థులు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటేనే అంతర్జాతీయంగా మంచి ఉద్యోగాలు పొందడానికి వీలుంటుంది. –ప్రొ.శ్రీరాం వెంకటేష్ (ఓయూ ఇంజనీరింగ్ విభాగం ప్రిన్సిపల్) -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2023 ఆదివారం (నేడు) జరగనుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.9 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఐఐటీ గౌహతి నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్ల కింద పేపర్–1, పేపర్–2 పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు రెండు పేపర్లను రాయాల్సి ఉంటుంది. ఉదయం సెషన్ ఉ.9 నుంచి మ.12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ పరీక్ష మ.2.30 నుంచి 5.30 వరకు జరుగుతుంది. ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు.. 2021లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1.6 లక్షల మంది, 2022లో 1.7 లక్షల మంది రిజిస్టర్ కాగా.. ఈసారి మరో 20వేల మందికి పైగా అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మహిళా అభ్యర్థుల సంఖ్య 25 శాతం వరకు పెరిగినట్లు ఐఐటీ గౌహతి విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. అత్యధికంగా ఏపీ, తెలంగాణల నుంచి అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ రెండు రాష్ట్రాల నుంచే దాదాపు 50వేల మంది వరకు అభ్యర్థులు ఉండనున్నారు. హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. జేఈఈ మెయిన్‌కు గతంలో కన్నా ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరగడంతో అదే స్థాయిలో అడ్వాన్స్‌డ్‌కు కూడా అభ్యర్థుల సంఖ్య పెరిగినట్లు అంచనా. మెయిన్ 2 సెషన్లలో కలిపి 11,13,325 మంది పరీక్ష రాశారు. ఇందులో కటాఫ్ మార్కులు సాధించిన వారిలో టాప్ 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పించారు. బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులుంటేనే.. ఇక ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతో పాటు అభ్యర్థులకు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన ఉండేది. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు సరిగా నిర్వహించని సమయంలో ఈ నిబంధన నుంచి రెండేళ్లుగా మినహాయింపునిచ్చారు. ఇప్పుడా పరిస్థితులు చక్కబడడంతో ఈసారి బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధించడాన్ని మళ్లీ పునరుద్ధరించారు. అలాగే, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఆన్లైన్ మోడ్ (కంప్యూటర్ బేస్డ్)లో నిర్వహించనున్నారు. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్ల పరీక్షలూ రాయాల్సి ఉంటుంది. మరోవైపు.. జేఈఈ అడ్వాన్స్డ్–2023 సిలబస్‌లో పలు మార్పులు చేశారు. అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా బోర్డు పరీక్షల్లో ఉండే ఎన్సీఈఆర్టీ సిలబస్‌లోని అంశాలను ఎక్కువగా పొందుపరిచారు. జేఈఈ మెయిన్‌లోనూ ఇవే అంశాలు ఉండగా కొంత లోతైన తీరులో అడ్వాన్స్‌డ్‌లో ప్రశ్నల సరళి ఉండనుంది. ఈ విధానంవల్ల విద్యార్థులు అటు బోర్డు పరీక్షలు, ఇటు మెయిన్ పరీక్షలతో పాటు అడ్వాన్స్డ్ పరీక్షలకు ఒకేరకమైన సిలబస్‌ను అధ్యయనం చేయడం ద్వారా ఒత్తిడికి గురవ్వకుండా ఉండేలా ఈ సిలబస్‌లో మార్పులు చేశారు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐఐటీ గౌహతి సంస్థ అడ్మిట్ కార్డులలో వివరంగా పొందుపరిచింది. మే 29న అడ్వాన్స్డ్ వెబ్సైట్లో అడ్మిట్ కార్డులను పొందుపరిచింది. ఈనెల 4వరకు వీటిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘ఒక్క నిమిషం’ నిబంధన అమలు ► అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవాలని నిర్వహణ సంస్థ సూచించింది. పరీక్ష కేంద్రంలోకి నిర్దేశించిన సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించరు. ► అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డు, అధికారిక ఫొటో ఐడీ కార్డును విధిగా తీసుకురావాలి. ► అడ్మిట్‌కార్డు జిరాక్సు కాపీని ఇన్విజిలేటర్లకు అందించి ఒరిజినల్ కాపీని తమ వద్దనే భద్రపరచుకోవాలి. ► అభ్యర్థులు అడ్మిట్‌కార్డులో, అటెండెన్స్ షీటులో తమ వేలిముద్రను వేసేముందు వేలుని శుభ్రం చేసుకోవాలి. ► అభ్యర్థులకు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్ కూడా అమలుచేయనున్నారు. షూలు ధరించి రాకూడదు. ► అలాగే, పెద్ద బటన్‌లతోని వస్త్రాలను, ఫుల్‌స్లీవ్ వస్త్రాలను, బంగారపు ఆభరణాలను ధరించరాదు. ► బాల్‌పాయింట్ పెన్నును వినియోగించాలి. ► పెన్సిల్, ఎరేజర్లను తెచ్చుకోవచ్చు. అలాగే, సాధారణమైన వాచీని ధరించవచ్చు. ఇతర డిజిటల్ వాచీలు, పరికరాలను అనుమతించబోరు. ► అడ్మిట్‌కార్డులో నమోదు చేసిన పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటివి సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. -
అడ్వాన్స్డ్ ఆషామాషీ కాదు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ ఫలితాల తర్వాత ఇప్పుడు అందరి దృష్టీ అడ్వాన్స్‌డ్‌పై ఉంది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. ఈ పరీక్ష జూన్ 4వ తేదీన జరగనుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. అయితే కష్టపడకపోతే అడ్వాన్స్‌డ్‌లో గట్టెక్కడం అంత తేలికైన విషయమేమీ కాదని నిపుణులు అంటున్నారు. మంచి ర్యాంకు సాధిస్తేనే ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఇంజనీరింగ్ చేసే అవకాశం దక్కుతుందని, ఇందుకోసం పూర్తిస్థాయిలో సబ్జెక్టులపై పట్టు సాధించాల్సి ఉంటుందని చెబుతున్నారు. 99 పర్సంటైల్ వచ్చి న వాళ్ళ సంఖ్య ఈసారి వేలల్లో ఉంది కాబట్టి అడ్వాన్స్‌డ్‌లో నెట్టుకురావాలంటే ప్రిపరేషన్ గట్టిగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. గణితంపై దృష్టి పెట్టాల్సిందే జేఈఈ మెయిన్స్‌లో గణితం పేపర్ ప్రతి ఏటా కఠినంగానే ఉంటోంది. అడ్వాన్స్‌డ్‌లో ఇది మరింత కష్టంగా ఉంటోంది. ప్రతి సబ్జెక్టుకూ 120 మార్కులుంటాయి. అయితే గణితంలో 20 మార్కులు సాధించడం గగనమవుతోంది. గత సంవత్సరం అడ్వాన్స్డ్ రాసిన వాళ్ళల్లో ఈ మేరకు సాధించినవారు కేవలం 1,200 మంది మాత్రమే ఉన్నారు. ఇక రసాయన శాస్త్రంలో 20 మార్కులు దాటిన వాళ్ళు 2 వేలు, భౌతిక శాస్త్రంలో 4 వేల మంది ఉన్నారు. అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 2.5 లక్షల మందిలో ఐఐటీ సీట్లకు కేవలం 55 వేల మందినే ఎంపిక చేస్తారు. అందువల్ల వడపోత కఠినంగానే ఉంటుంది. ఈసారి ఎక్కువమంది జేఈఈ మెయిన్స్ రాయడంతో కటాఫ్ కూడా పెరిగింది. కాబట్టి వడపోతకు వీలుగా అడ్వాన్స్డ్ పేపర్లు కాస్త కఠినంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బోంబేదే హవా ఐఐటీల్లో బోంబేకే విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇందులో సీటు కోసం పోటీ పడుతుంటారు. తొలి 50 ర్యాంకుల్లో 46 మంది బోంబేలోనే చేరడం గమనార్హం. మొదటి వెయ్యి ర్యాంకుల్లో 246 మంది ఇక్కడ ప్రవేశం పొందారు. గత ఏడాది 3,310 మంది బాలికలకు ఇందులో సీట్లు దక్కాయి. ఇక అత్యధికంగా తిరుపతి ఐఐటీలో 20.7 శాతం మంది సీట్లు పొందారు. అతి తక్కువగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 17.7 మంది సీట్లు పొందారు. విదేశీ విద్యార్థులు 145 మంది అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైతే 66 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. కాగా తొలి వెయ్యి ర్యాంకుల్లో ఢిల్లీలో 210, మద్రాసులో 110, కాన్పూర్‌లో 107, ఖరగ్‌పూర్‌లో 93, గువాహటిలో 66, రూర్కీలో 60, హైదరాబాద్‌లో 40, వారణాసిలో 31, ఇండోర్‌లో ఏడుగురు, రోవర్లో ఒకరు చేరారు. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు తేజాలు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయస్థాయి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఈ ఫలితాల్లో జాతీయస్థాయిలో మొదటి రెండు ర్యాంకులను మన తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం ఉదయం ఈ పరీక్ష తుది ఫలితాలను, స్కోర్లు, ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో 100 పర్సంటైల్ సాధించిన వారు 43 మంది ఉండగా అందులో 16 మంది తెలుగు వారే కావడం విశేషం. వీరిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ వారు కాగా.. మిగిలినవారు తెలంగాణ నుంచి రిజిస్టరై పరీక్ష రాసిన అభ్యర్థులు. టాప్–10 ర్యాంకుల్లో తొలిస్థానాన్ని దక్కించుకున్న శింగరాజు వెంకట కౌండిన్య తెలంగాణ నుంచి రిజిస్టరై పరీక్ష రాసిన ఏపీ విద్యార్థి కాగా.. రెండో స్థానంలోని కాళ్లకూరి సాయినా«థ్ శ్రీమంత్ ఏపీ నుంచే పరీక్ష ర్యాంకు దక్కించుకున్నాడు. 12వ ర్యాంకర్ పునుమల్లి లోహిత్ ఆదిత్యసాయి, 35వ ర్యాంకర్ సి. మిఖిల్, 37వ ర్యాంకు సాధించిన నిమ్మకాయల ధర్మతేజారెడ్డి, 38వ ర్యాంకర్ దుగ్గినేని వెంకట యుగేష్లు ఏపీకి చెందిన విద్యార్థులే. ఇక తెలంగాణకు సంబంధించి అల్లం సుజయ్ (6వ ర్యాంకు), వావిలాల చిద్విలాసరెడ్డి (7వ ర్యాంకు), బిక్కిని అభినవ్ చౌదరి (8వ ర్యాంకు), మాజేటి అభినీత్ (10వ ర్యాంకు), గుత్తికొండ అభిరామ్ (17వ ర్యాంకు), ఎంఎల్ మాధవ్ భరద్వాజ్ (18వ ర్యాంకు), పాలూరి జ్ఞాన కౌశిక్‌రెడ్డి (20వ ర్యాంకు), రామేష్ సూర్యతేజ (21వ ర్యాంకు), నందిపాటి సాయి దుర్గేశ్రెడ్డి (40వ ర్యాంకు), ఈవూరి శ్రీధరరెడ్డి (41వ ర్యాంకు) సాధించారు. వెనుకబడ్డ బాలికలు.. ఈసారి జేఈఈ మెయిన్ టాప్ ర్యాంకుల సాధనలో బాలికలు బాగా వెనుకబడ్డారు. టాప్–10లో ఒక్కరూ లేరు. కర్ణాటకకు చెందిన ఒకేఒక్క అమ్మాయి రిధి కమలేష్‌కుమార్ మహేశ్వరి 100 స్కోరు మార్కులతో 16వ ర్యాంకులో నిలిచింది. బాలికల్లో ఏపీ నుంచి మీసాల ప్రణతి శ్రీజ, రామిరెడ్డి మేఘన, పైడల వింధ్య, సువ్వాడ మౌనిష నాయుడు, వాకా శ్రీవర్షిత టాప్ ర్యాంకుల్లో నిలిచారు. తెలంగాణ నుంచి కుక్కల ఆశ్రితరెడ్డి టాప్ ర్యాంకులో ఉన్నారు. వెయ్యిలోపు ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులే అధికం.. టాప్–10లోనే కాకుండా టాప్–500 ఆపై వెయ్యి ర్యాంకుల్లో కూడా తెలుగు విద్యార్థులే అత్యధిక శాతం మంది ఉన్నారు. ఎన్టీఏ విడుదల చేసిన స్కోరు మార్కులు, తుది ర్యాంకుల ఆ«ధారంగా తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులే ఎక్కువమంది ఈ ర్యాంకులను కైవసం చేసుకున్నట్లు ఆయా విద్యాసంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. గురుకుల విద్యార్థులకు ర్యాంకులు.. ఇక ఏపీలోని వివిధ గురుకులాల్లో, రెసిడెన్షియల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి ర్యాంకులే వచ్చాయని ఆయా విభాగాల అధికారులు చెబుతున్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించడం, తొలినుంచి పోటీ పరీక్షల దృష్టితో వారిని సన్నద్ధం చేయడంతో ర్యాంకులు దక్కాయంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, ఇతర సంస్థల్లో ఇంటర్మీడియెట్ చదువుతున్న వారిలో 25 మందికి పైగా మంచి ర్యాంకులు సాధించినట్లు ప్రాథమిక గణాంకాల ప్రకారం చెబుతున్నారు. ఈసారి పెరిగిన కటాఫ్ మార్కులు.. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించేందుకు ఎన్టీఏ ప్రకటించిన కటాఫ్ మార్కులు ఈసారి గణనీయంగా పెరిగాయి. 2022లో జనరల్ కటాఫ్ 88.41 కాగా.. ఇప్పుడది 90.77కి చేరింది. ఈడబ్ల్యూఎస్ విభాగంలో కటాఫ్ మార్కులు 63.11 నుంచి 75.62కు.. ఓబీసీ కటాఫ్ 67.00 నుంచి 73.61కి.. ఎస్సీలది 43.08 నుంచి 51.97కి, ఎస్టీలది 26.77 నుంచి 37.23కి పెరగడం గమనార్హం. ఈసారి మెయిన్‌లో ప్రశ్నల సరళి మారడంతో కటాఫ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఫలితాలపై చివరి వరకు ఉత్కంఠ.. ఈసారి జేఈఈ మెయిన్ తుది ఫలితాల కోసం విద్యార్థులు గత కొన్నిరోజులుగా చాలా ఉత్కంఠతో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేఈఈ మెయిన్ పరీక్షలను ఎన్టీఏ రెండు విడతలుగా నిర్వహించిన సంగతి తెలిసిందే. తొలివిడత పరీక్షలను జనవరి 24 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించింది. రెండో సెషన్‌ను ఏప్రిల్ 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో పూర్తిచేసింది. రెండు విడతల్లోనూ కలిపి మొత్తం 11,62,398 మంది రిజిస్టర్ కాగా 11,13,325 మంది రాశారు. బాలురు 7,74,359 మంది రాయగా బాలికలు 3,38,963 మంది పరీక్ష రాశారు. బీఆర్క్, బీ ప్లానింగ్‌కు సంబంధించిన పేపర్–2 ఫలితాలను తరువాత ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. నేటినుంచి అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షల మందికి ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ అడ్వాన్సుడ్–2023ని రాసేందుకు అర్హత దక్కుతుంది. వీరు ఆదివారం (నేడు) నుంచి అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను నిర్వహణ సంస్థ అయిన ఐఐటీ గౌహతి ఇప్పటికే ప్రకటించింది. ఈ పరీక్ష జూన్ 4న జరుగుతుంది. -
జేఈఈ మెయిన్ తొలి విడతలో బాలుర హవా
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ తొలివిడత పరీక్షల ఫలితాల్లో బాలురు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 100 స్కోర్ పాయింట్లు సాధించిన 20 మందీ బాలురే కావడం గమనార్హం. 100 స్కోర్ పాయింట్లతో పాటు ఆ తర్వాత అత్యధిక స్కోర్ పాయింట్లు సాధించిన విద్యార్థుల్లో సగం మంది వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పరీక్షలకు హాజరైనవారేనని గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. విద్యార్థుల మార్కుల ఆధారంగా స్కోర్ పాయింట్లతో ఈ ఫలితాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి వావిలాల చిద్విలాసరెడ్డి, దుగ్గినేని వెంకట యుగేష్, గుత్తికొండ అభిరామ్, బిక్కిన అభినవ్ చౌదరి, ఎన్కే విశ్వజిత్, అభినీత్ మాజేటిలు 100 స్కోర్ పాయింట్లు సాధించినవారిలో ఉన్నారు. జనరల్‌లో 14 మంది, ఓబీసీల్లో నలుగురు, జనరల్ ఈడబ్ల్యూఎస్‌లో ఒకరు, ఎస్సీల్లో ఒకరు 100 స్కోర్ పాయింట్లు సాధించారు. బాలికల్లో టాప్ తెలుగు అమ్మాయిలే.. కాగా 100 స్కోర్ పాయింట్లు తర్వాత మంచి పాయింట్లు సాధించినవారిలో బాలికలు నిలిచారు. బాలికల విభాగం.. టాప్ టెన్‌లో 99.99 నుంచి 99.97 స్కోర్ పాయింట్లు సాధించిన పది మంది పేర్లను ఎన్టీఏ ప్రకటించింది. వారిలో టాప్‌లో మీసాల ప్రణీతి శ్రీజ, రామిరెడ్డి మేఘన, మేథా భవానీ గిరీష్, సీమల వర్ష, అయ్యాలపు రితిక, పీలా తేజ శ్రీ, వాకా శ్రీవర్షిత, గరిమా కల్రా, గున్‌వీన్ గిల్, వాణి గుప్తా ఉన్నారు. వీరిలో తెలుగు అమ్మాయిలే అధికం కావడం విశేషం. ఇక ఓబీసీ కేటగిరీలో బావురుపూడి రిత్విక్, ఈడబ్ల్యూఎస్‌లో మల్పాని తుషార్, దుంపల ఫణీంద్రనాధరెడ్డి, పెందుర్తి నిశ్చల్ సుభాష్, ఎస్సీ కేటగిరీలో కొమరాపు వివేక్ వర్థన్, ఎస్టీల్లో ధీరావత్ తనూజ్, ఉద్యావత్ సాయి లిఖిత్, దివ్యాంగుల్లో బి.శశాంక్, తుమ్మల తిలోక్‌లున్నారు. రెండో విడత దరఖాస్తులకు మార్చి 7 చివరి తేదీ.. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పేపర్–1కు 8,60,064 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 8,23,967 (95.80 శాతం) మంది పేపర్–1 రాశారు. అలాగే బీఆర్క్, బీప్లానింగ్ కోర్సులకు ఉద్దేశించిన పేపర్–2కు 46,465 మంది దరఖాస్తు చేశారు. పేపర్–2ను 95 శాతానికి పైగా రాశారు. ఇంగ్లిష్‌తోపాటు హిందీ, తెలుగుతోపాటు పలు ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసుకునే అవకాశం కల్పించారు. కాగా జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మంగళవారం (ఫిబ్రవరి 7) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆరంభమైంది. మార్చి 7 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి నాలుగో వారంలో అభ్యర్థుల అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నారు. -
మేథ్స్‌లో తిప్పలు... కెమిస్ట్రీలో స్కోర్..
సాక్షి, హైదరాబాద్ః కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్) తొలి రోజు మంగళవారం దేశవ్యాప్తంగా జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీ వరకూ జరిగే ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. తెలంగాణలో 1.5 లక్షల మంది జేఈఈ మెయిన్స్ రాస్తున్నారు. రాష్ట్రంలోని 17 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతోంది. మంగళవారం ఉదయం, సాయంత్రం జరిగిన పరీక్షలపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కువ భాగం క్రితం సంవత్సరాల్లో ఇచ్చిన ప్రశ్నలు వచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. అయితే గణితంలో ఇచ్చిన ప్రశ్నలు కష్టంగానే ఉన్నట్టు చెప్పారు. ఫిజిక్స్ మధ్యస్తంగా ఉందని, కెమిస్ట్రీలో ఎక్కువ స్కోర్ చేసే వీలుందని తెలిపారు. పూర్తిగా ఆన్లైన్ మోడ్‌లో జరిగిన ఈ పరీక్షలో మేథ్స్ కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందన్నారు. రీజనింగ్ ఈజీనే... మేథమెటిక్స్‌లో కొన్ని బేసిక్ ప్రశ్నలకు తేలికగా సమాధానాలు ఇవ్వగలిగారు. అయితే చాలా ప్రశ్న లకు సుదీర్ఘంగా విశ్లేషించక తప్పలేదని చెప్పారు. త్రీడీ, వెక్టర్‌ఆల్‌జీబ్రా, మేథమెటికల్ రీజనింగ్ ప్రశ్న లకు కష్టపడకుండా సమాధానాలు ఇవ్వగలి గారు. ఫిజిక్స్‌లో ఎక్కువ ప్రశ్నలు సెమీ కండక్టర్స్, ఎలక్ట్రో స్టాటిస్టిక్స్, మ్యాగ్నటిజం, మోడ్రన్ ఫిజిక్స్, ఈఎంఐ, ఫిక్షన్ న్యూక్లియర్ ఫిజిక్స్, ఏసీ కరెంట్ నుంచి వచ్చాయి. థియరీ ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి ఇచ్చారు. కెమిస్ట్రీలో ఎన్సీఈఆర్టీ పుస్తకా లు అనుసరించిన వారికి పేపర్ తేలికగానే ఉన్నట్టు కెమిస్ట్రీ అధ్యాపకులు చెబుతున్నారు. ఆర్గా నిక్, ఇన్ ఆర్గానిక్, కెమికల్ కైనటిక్స్, గ్రాఫ్ బేస్డ్ ప్రశ్నలు, కెమికల్ బాండింగ్ ప్రశ్నలు తేలికగానే సమాధానా లిచ్చే స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. -
జేఈఈ మెయిన్స్ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు శని, ఆదివారాల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో పరీక్ష కేంద్రం వివరాలు, సమయం పేర్కొంటారు. పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎన్టీఏ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి అడ్మిట్ కార్డు పొందవచ్చు. జేఈఈ పరీక్షకు తెలంగాణ నుంచి 2 లక్షల మంది హాజరుకానున్నారు. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా 21 పట్టణాల్లో పరీక్ష నిర్వహించగా.. ఈసారి వీటిని 17కు తగ్గించారు. జేఈఈ పరీక్ష కేంద్రాల జాబితాను ఎన్టీఏ ఇది వరకే ప్రకటించింది. ఇందులో హయత్‌నగర్, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ ఉన్నాయి. ఈసారి అన్ని విభాగాల్లోనూ నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. దీంతో పాటు మెయిన్స్ సిలబస్‌లోనూ మార్పు చేశారు. మేథ్స్‌లో ప్రపోర్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ (యాజ్ సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్)ను పూర్తిగా తొలగించారు. సెట్స్, రిలేషన్స్, స్టాటిస్టిక్స్, త్రీ డైమెన్షన్, జామెట్రీలో లైన్స్ అండ్ ప్లేన్స్‌పై కొంత భాగాన్ని మేథ్స్‌లో కొత్తగా చేర్చారు. ఫిజిక్స్‌లో యంగ్స్ మాడ్యూల్స్ బై సియర్లస్ మెథడ్‌ను తొలగించారు. కెమిస్ట్రీలో న్యూక్లియర్ కెమిస్ట్రీ, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ ఆఫ్ రెస్పిరేషన్ ఆఫ్ మోనో–ఫంక్షనల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫ్రమ్ బైనరీ మిక్చర్స్ తొలగించారు. వీటితో పలు అంశాలపై సిలబస్‌లో స్పష్టత ఇచ్చారు. -
జేఈఈ అర్హతలో స్వల్ప మార్పులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ అర్హత నిబంధనల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. జేఈఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశాలు పొందేప్పుడు ఇంటర్లో 75 శాతం మార్కులు పొంది ఉండాలని ఎన్టీఏ తొలుత పేర్కొంది. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వివాదం చెలరేగింది. ఆయా రాష్ట్రాల్లో ఇంటర్, 10 ప్లస్‌టులో గరిష్టంగా 60 శాతం పర్సంటైల్ మాత్రమే వస్తోంది. దీంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇంటర్, ప్లస్ టులోని సబ్జెక్టుల్లో 75 మార్కులు లేదా టాప్ 20 పర్సంటైల్ ఉన్నవారు జాతీయ సీట్ల కేటాయింపునకు అర్హులని ఎన్టీఏ మార్పు చేసింది. ఎస్సీ, ఎస్టీలు ఇంటర్, ప్లస్‌టులో 65 మార్కులు పొంది ఉంటే సరిపోతుందని నిర్ణయించింది. -
జేఈఈలో ప్రాంతీయ భాషలకు పెరుగుతున్న ఆదరణ
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలకు ఆదరణ పెరుగుతోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆధ్వర్యంలో జేఈఈని తొలుత ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహించేవారు. 2016లో గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో కూడా ప్రారంభించారు. ఆ తరువాతి ఏడాది మరాఠీ, ఉర్దూను ఉపసంహరించారు. 2020లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి జేఈఈ పరీక్ష బాధ్యతలను చేపట్టాక ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ భాషల్లో నిర్వహించారు. ఇతర భాషలకు ప్రాధాన్యమివ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో పాటు జాతీయ నూతన విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆ తరువాత నుంచి ఇంగ్లిష్, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తోంది. 2021లో నాలుగు దఫాలుగా నిర్వహించిన జేఈఈ మెయిన్‌కు 9.39 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో 1,49,621 మంది ప్రాంతీయ భాషలను ఎంచుకున్నారు. బెంగాలీలో 24,841 మంది, గుజరాతీలో 44,094 మంది, హిందీలో 76,459 మంది దరఖాస్తు చేయగా తెలుగులో 371, తమిళం 1264, కన్నడ 234, మలయాళం 398, మరాఠీ 658, ఒడియా 471, పంజాబీ 107, ఉర్దూ 24, అస్సామీ 700 మంది ఉన్నారు. నాలుగు దఫాలకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య ఇది. మొత్తం దరఖాస్తుదారుల సంఖ్య (యూనిక్ సంఖ్య)ప్రకారం చూస్తే 70 వేలు. వీరిలో ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసిన వారు 45 వేలు. 2022లో జేఈఈకి మొత్తం 10.26 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో ప్రాంతీయ భాషల్లో రాసేందుకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య 80 వేలకు పైగా ఉంది. వీరిలో 50 వేల మంది వరకు ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాశారు. బెంగాలీ, గుజరాతీ, హిందీ భాషల్లోనే ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యారు. 2022లో తెలుగులో పరీక్ష రాసిన వారి సంఖ్య 1,200 వరకు పెరిగింది. 2023లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే వారి సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. ఆయా భాషల్లో ప్రశ్నపత్రాల్లో సందేహాలు ఉంటే ఆంగ్ల ప్రశ్న పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవలసి ఉంటుంది. (క్లిక్ చేయండి: అనకాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు) -
జేఈఈ మెయిన్ సిలబస్ ఖరారు
సాక్షి, అమరావతి: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 సిలబస్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం.. మ్యాథమెటిక్స్‌లో 16 టాపిక్‌లు, ఫిజిక్స్ సెక్షన్–ఏలో 20 టాపిక్స్, సెక్షన్–బిలో ప్రయోగ నైపుణ్యాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇక కెమిస్ట్రీలోని ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీల్లో 10 చొప్పున టాపిక్స్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ తదితర మాధ్యమాల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించనున్నారు. విద్యార్థులు ఏ భాషలో పరీక్ష రాయాలనుకుంటున్నారో ముందుగానే దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో భాగంగా బీఈ, బీటెక్‌లో ప్రవేశాలకు పేపర్–1, బీఆర్క్ కోసం పేపర్–2ఏ, బీప్లానింగ్‌కు పేపర్–2బీని నిర్వహిస్తారు. పేపర్–1లో మూడు సెక్షన్ల కింద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రశ్నలుంటాయి. కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు జరుగుతాయి. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఉంటాయి. అలాగే నెగిటివ్ ఆన్సర్‌కు 1 మార్కు కోత ఉంటుంది. పేపర్–1లో మూడు సెక్షన్లలో 300 మార్కులకు 90 బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలుంటాయి. పేపర్–2ఏలో 400 మార్కులకు 82 ప్రశ్నలు ఇస్తారు. పేపర్–2బీలో 400 మార్కులకు 105 ప్రశ్నలుంటాయి. జనవరి, ఏప్రిల్‌లో రెండు సెషన్లుగా పరీక్షలు.. కాగా జేఈఈ మెయిన్ పరీక్షలను జనవరి, ఏప్రిల్‌లలో రెండు సెషన్లుగా నిర్వహించేలా ఎన్టీఏ షెడ్యూల్ విడుదల చేసింది. తొలి సెషన్ జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనుంది. ఇప్పటికే తొలి సెషన్‌కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే జనవరి సెషన్ పరీక్షల తేదీల్లోనే పలు ఇంటర్మీడియెట్ బోర్డులు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నాయి. ఒకే తేదీల్లో ఈ రెండు పరీక్షలు రావడం వల్ల తమకు నష్టం కలుగుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా జనవరి సెషన్‌కు సన్నద్ధం కావడానికి తక్కువ సమయం ఇచ్చారని, ఈ తేదీలను పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే కరోనా సమయంలో రద్దు చేసిన ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధనను పునరుద్ధరించడం వల్ల కూడా ఎక్కువ మందికి నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ నిబంధనను కూడా సడలించాలని కోరుతున్నారు. -
జనవరిలో ఎంసెట్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించడం... ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో తెలంగాణ ఎంసెట్ నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది. 2023 జనవరిలో పరీక్షల తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికోసం మండలి అధికారులు త్వరలో సమావేశం కానున్నారు. సాధ్యమైనంత వరకు ఎంసెట్ పరీక్ష మే రెండు, మూడు వారాల్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్ సన్నద్ధతకు కనీసం 45 రోజుల కాలపరిమితి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ లెక్కన మేలో ఎంసెట్‌కు అనువైన తేదీలను ఖరారు చేసే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. జేఈఈ మెయిన్స్ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు జరుగుతాయి. రెండో విడత ఏప్రిల్ 6 నుంచి 12 వరకు ఉంటుంది. జేఈఈ పూర్తయిన తర్వాత కూడా ఎంసెట్‌కు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులకు సమయం దొరుకుతుంది. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా ఎంసెట్ ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సకాలంలో విద్యా సంవత్సరం కొనసాగింది. దీంతో జేఈఈ మెయిన్స్ కూడా గతం కన్నా ముందే పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ను త్వరగా నిర్వహించి జూన్‌లో ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆగస్టు చివరి నాటికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగించాలని యోచిస్తున్నారు. ఈసారి కూడా ఇంటర్ మార్కుల వెయిటేజీ లేనట్టేనని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. మేలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత నెల రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన వారికి, మార్కులు తక్కువగా వచ్చినవారికి మేలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఫలితాలు ప్రకటించిన రోజే ఆయా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అడ్వాన్స్డ్ పరీక్షలు రాసే వారు కూడా ఎంసెట్ పరీక్షలు రాసేందుకు అర్హులే. ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా, పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ మొదటివారంలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చిలోనే ముగియనుండగా, ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలను ప్రారంభించాలని ఎస్సెస్సీబోర్డు అధికారులు భావిస్తున్నారు. 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించగా, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీవోను ప్రభుత్వం జారీచేయాల్సి ఉంది. ఈ జీవో జారీ అయితేనే తుది షెడ్యూల్ ఖరారుచేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
ఇంటర్లో 75 శాతం సాధిస్తేనే జేఈఈ మెయిన్‌కు అర్హత
సాక్షి, అమరావతి: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈసారి పలు మార్పులు చేసింది. కరోనా సమయంలో సడలింపులిచ్చిన అంశాలను పునరుద్ధరించింది. కొన్ని కొత్త సడలింపులను ప్రకటించింది. జేఈఈ మెయిన్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండటం సహా పలు నిబంధనలను పెట్టింది. సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు నిబంధనల ప్రకారం ఎన్ఐటీ, ఐఐఐటీ, సీఎఫ్‌ఐటీ తదితర సంస్థల్లో ప్రవేశానికి అభ్యర్థులు జేఈఈలో ఆలిండియా ర్యాంకుతో పాటు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే ఇంటర్మీడియెట్‌లోని ప్రతి సబ్జెక్టులోనూ అభ్యర్థి నిర్ణీత అర్హత మార్కులను సాధించాలి. అందువల్ల మెయిన్‌కు 75 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. మరికొన్ని నిబంధనలు జేఈఈ మెయిన్ తొలి దశ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు, రెండో దశ ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. తొలి దశ పరీక్షలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. రెండో దశ రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 7న ప్రారంభమవుతాయి. అభ్యర్ధులు రెండు విడతల పరీక్షలకు వేర్వేరుగా దరఖాస్తు చేయాలి. ఒక సెషన్‌కు ఒక్క దరఖాస్తే సమర్పించాలి. ఒకటికి మించి దరఖాస్తులు ఇస్తే.. ఆ తరువాత ఎప్పుడు దాన్ని గుర్తించినా ఆ అభ్యర్థిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఎన్టీఏ స్పష్టంచేసింది. 2021, 2022 సంవత్సరాల్లో ఇంటర్మీడియెట్, తత్సమాన బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి వయోపరిమితిని విధించకుండా బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణతను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటోంది. అయితే, అడ్మిషన్ల సమయంలో విద్యా సంస్థలు నిర్ణయించే వయోపరిమితి నిబంధనలను అభ్యర్థులు అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే డ్రాపర్ల (గత ఏడాది మెయిన్‌లో ఫెయిలై, మళ్లీ ఈ ఏడాది రాసే వారు, ఇంటర్మీడియెట్ పూర్తి చేసి కొన్ని సంవత్సరాలు వ్యవధి ఇచ్చి జేఈఈకి దరఖాస్తు చేసేవారు)కు వయోపరిమితిని సడలించి వరుసగా మూడుసార్లు మెయిన్‌కు అవకాశం కల్పించింది. ముందుగానే రిజర్వు తేదీల ప్రకటన రెండు దశల పరీక్షల తేదీల్లో మార్పులు చేయాల్సి వచ్చినా, ఇతర పరీక్షలకు ఆటంకం లేకుండా కొన్ని రిజర్వు తేదీలను కూడా ఎన్టీఏ ఈసారి ముందుగానే ప్రకటించింది. తొలివిడత పరీక్షలకు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలను రిజర్వుగా ప్రకటించింది. రెండో విడతకు ఏప్రిల్ 13, 15 తేదీలను రిజర్వు తేదీలుగా పేర్కొంది. తగ్గిన పరీక్ష కేంద్రాలు కరోనా సమయంలో భౌతిక దూరం పాటించడం, ఇతర నిబంధనల కారణంగా మెయిన్ పరీక్షలను ఎక్కువ నగరాల్లో నిర్వహించింది. గత ఏడాది కూడా దేశవ్యాప్తంగా 514 నగరాలు, పట్టణాల్లో నిర్వహించింది. ఈసారి వాటిని 399కు కుదించింది. ఇతర దేశాల్లో పరీక్షల కేంద్రాలు గత ఏడాది 24 కాగా ఈసారి 13కు తగ్గించింది. రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు రిజిస్ట్రేషన్ల ఫీజులను కూడా ఎన్టీఏ పెంచింది. జనరల్ కేటగిరీ అభ్యర్థుల ఫీజు రూ.650 నుంచి రూ.1,000కి పెంచింది. మహిళలకు రూ.800 చేసింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఫీజును రూ.325 నుంచి రూ.500కు పెంచింది. ఇతర దేశాల అభ్యర్థుల ఫీజును రూ.3 వేల నుంచి రూ.5 వేలకు, మహిళల ఫీజును రూ.1500 నుంచి రూ.3 వేలకు పెంచింది. అభ్యర్థులు జేఈఈ మెయిన్ ఆన్లైన్ దరఖాస్తులో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఈమెయిల్, మొబైల్ నంబర్లు తదితర వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని, లేదంటే రిజిస్ట్రేషన్ పూర్తి కాదని ఎన్టీఏ స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా కరోనా పరిస్థితులు సద్దుమణిగినా గతంలోని పరిస్థితుల ప్రభావం ఇంకా ఉన్నందున, ఇంటర్మీడియెట్‌లో 75% మార్కుల నిబంధనను ఈసారి కూడా మినహాయించాలని అభ్యర్థులు కోరుతున్నారు. తొలివిడత సెషన్ పరీక్షలకు వ్యవధి తక్కువగా ఉందని, దీనినీ పునఃపరిశీలన చేయాలని అభ్యర్థిస్తున్నారు. -
JEE Main 2023: వచ్చే నెలలో జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష (జేఈఈ మెయిన్–2023) నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసింది. రెండు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతాయి. తొలి విడత వచ్చే ఏడాది జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో ఉంటుంది. రెండో విడత జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు ఉంటాయి. పరీక్ష ఎప్పటిలాగే ఆన్లైన్ విధానంలో ఉంటుందని, ఇంగ్లిష్, హిందీ, తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తామని ఎన్టీఏ వెల్లడించింది. దరఖాస్తుల స్వీకరణ షురూ.. జేఈఈ మెయిన్ మొదటి విడతకు దరఖాస్తులు గురువారం రాత్రి నుంచే మొదలయ్యాయి. జనవరి 12వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్‌లో జరిగే రెండో విడత పరీక్షలకు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చే ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం ఎన్టీఏ వెబ్సైట్ చూడాలని, లేదా 011 40759000/ 011 69227700 నంబర్లకు ఫోన్ చేయవచ్చని ఎన్టీఏ తెలిపింది. రెండు నెలల్లోనే.. 2019 వరకు జేఈఈ మెయిన్స్ జనవరి, ఏప్రిల్ నెలల్లోనే నిర్వహించారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లు నాలుగు విడతలుగా మే, జూలై నెలల్లోనూ నిర్వహించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. అయితే 2 నెలల్లోనే మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడం విశేషం. 2022 జేఈఈ మెయిన్స్‌కు 10.26 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 9,05,590 మంది పరీక్ష రాశారు. తొలి విడత షెడ్యూల్ ఇదీ.. దరఖాస్తుల స్వీకరణ: ఈ నెల 16 (గురువారం) నుంచి జనవరి 12 వరకు.. అడ్మిట్ కార్డుల విడుదల: 2023 జనవరి మూడో వారంలో. పరీక్షలు: 2023 జనవరి 24, 25, 27, 28, 29, 30, 31