Krishna University
-
అరచేతిలో ఈ- పాఠం
మచిలీపట్నం: రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికతతో విద్య, అభ్యసన వ్యవస్థల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలకు వరకూ అంతా డిజిటల్ పాఠానికి అలవాటు పడ్డారు. అందుకు తగ్గట్లుగా విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు అందరికీ ఉపయోగపడేలా కృష్ణా యూనివర్సిటీ అధికారులు ఈ–విజ్ఞాన భాండాగారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్ అబ్దుల్ కలామ్ పేరిట అత్యాధునిక సౌకర్యాలతో డిజిటల్ లైబ్రరీని గత విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. తద్వారా డిగ్రీ, పీజీ పట్టాలతో బయటకు వెళ్లే విద్యార్థులు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా సాంకేతికతతో కూడిన విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అవకాశం కలి్పంచారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, వివిధ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు అభ్యసించే సుమారు వెయ్యి మంది విద్యార్థులు సెంట్రల్ లైబ్రరీ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో సాంకేతికతను జోడించారు. చదువుతున్న కోర్సులకు రిఫరెన్స్‌గా సుమారు ఒక లక్షకు పైగా ఈ–బుక్స్ అందుబాటులో ఉంచారు. కంప్యూటర్ల ద్వారా విద్యార్థులు వీటిని వినియోగించుకునేలా తగిన ఏర్పాట్లు చేశారు. ఒకే సారి వందమంది విద్యార్థులు లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుకునేలా సీటింగ్ సమకూర్చారు. అంతేకాక ఇక్కడ లభ్యమయ్యే ఈ–బుక్స్ విద్యార్థులు తమ మొబైల్ లేదా వ్యక్తిగత కంప్యూటర్ ద్వారా ఎక్కడి నుంచైనా ఓపెన్ చేసుకుని చదువుకునే వెసులుబాటును కల్పించారు. విద్యార్థి ఐడీ నంబర్‌తో పాటు లైబ్రేరియన్ ఇచ్చే పాస్‌వర్డ్‌తో ఈ–బుక్స్ ఓపెన్ అయ్యే విధంగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులో ఉంచారు. అలాగే లైబ్రరీలో ఉచిత వైఫై అందుబాటులో ఉండటం విద్యార్థులకు మేలు చేకూరుస్తోంది. పరిశోధనలకు వీలుగా.. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లకు కృష్ణా యూనివర్సిటీ వేదికగా నిలుస్తుండటంతో పరిశోధన విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. వీరికి సౌకర్యవంతంగా ఉండేలా సెంట్రల్ లైబ్రరీలో 20 వేలుకు పైగా ఈ–జర్నల్స్ అందుబాటులో ఉంచారు. స్కాలర్స్‌తో పాటు బోధన చేసే అధ్యాపకులు కూడా వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా ఉపయోగం.. ప్రతి రోజూ లైబ్రరీకి వస్తాను. సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. లైబ్రరీలో ఎన్నో సాహిత్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతో పాటు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నాలాంటోళ్లకు లైబ్రరీ ఎంతో ఉపయోగపడుతుంది. – వి. రాశీ వేణి, ఎంఏ ఇంగ్లిష్ విద్యార్థి, క్యాంపస్ కాలేజీ మ్యాగజైన్లతో ఎంతో మేలు.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెలువడే మ్యాగజైన్స్‌ను తెప్పిస్తున్నాం. వివిధ పోటీ పరీక్షల మెటీరియల్ కూడా లైబ్రరీలో ఉంది. వీటి వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. వర్సిటీ వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ లైబ్రరీ నిర్వహణపై ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. – డాక్టర్ జ్యోతిర్మయి, లైబ్రరీ కో–ఆర్డినేటర్ విద్యార్థులకు ప్రయోజనం.. క్యాంపస్ చదువులపై ఎంతో ఇష్టపడి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మేలు చేసేలా వర్సిటీ ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నాం. డాక్టర్ ఏపీజే అబ్డుల్ కలామ్ లైబ్రరీ విద్యార్థులకు ఎంతో ఉపయోపడుతుంది. ఇకపై ఎక్కువ పుస్తకాలు ఈ–బుక్స్గానే అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కువ మంది విద్యార్థులు సది్వనియోగం చేసుకునేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. – డాక్టర్ ఎం రామిరెడ్డి, రిజిస్ట్రార్, కృష్ణా యూనివర్సిటీ -
కృష్ణా యూనివర్సిటీకి యూజీసీ 12–బీ గుర్తింపు
మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీకి యూజీసీ 12–బీ గుర్తింపు దక్కింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నుంచి గురువారం ఉత్తర్వులు అందాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవతో 2008లో మచిలీపట్నం కేంద్రంగా ఈ యూనివర్సిటీ ప్రారంభమైంది. రాష్ట్రంలో 14 యూనివర్సిటీలు ఉన్నాయి. కృష్ణా తప్ప మిగతావన్నీ 12–బీ గుర్తింపు సొంతం చేసుకున్నాయి. ఇటీవల వరకు అద్దె భవనాల్లోనే (ఆంధ్ర జాతీయ కళాశాలలో) కొనసాగడం, వర్సిటీ అభివృద్ధిని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో 12–బీ గుర్తింపు దక్కలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది పెత్తందారులు చేసిన రాజకీయ క్రీడతో వర్సిటీ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో 12–బీ సాధనకు ఇదే సరైన సమయమని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కె.బి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ రామిరెడ్డి తమ బృదానికి దిశానిర్దేశం చేశారు. దీంతో 14 ఏళ్ల తరువాత అరుదైన గుర్తింపు సొంతమైంది. ఇకపై వర్సిటీ కార్యకలాపాలకు 80 శాతం నిధులు యూజీసీ నుంచి మంజూరవుతాయి. ఉన్నత విద్యకు ఊపిరి ► 2008–09లో అద్దె భవనాల్లో ప్రారంభమైన యూనివర్సిటీ ప్రస్తుతం రుద్రవరం వద్ద 102 ఎకరాల సువిశాల ప్రదేశంలో సొంతభవనాల్లో నడుస్తోంది. ► వర్సిటీకి అనుబంధంగా యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు కలిపి164 కాలేజీల్లో ఏటా సుమారు 53 వేల మంది చదువుతున్నారు. ► వర్సిటీ క్యాంపస్‌లో ఆర్ట్స్అండ్ సైన్సు కోర్సులతో పాటు, ఇంజినీరింగ్, బీ–ఫార్మసీ కోర్సులను సైతం అందిస్తున్నారు. 2011–12 విద్యా సంవత్సరం నుంచి ఎన్ఎస్ఎస్ యూనిట్ అందుబాటులో ఉండగా, ఇటీవలనే వంద మంది విద్యార్థుల సామర్థ్యంతో ఎన్సీసీ యూనిట్ ఏర్పాటైంది. ► వర్సిటీలో ఆరు డిపార్టుమెంట్లు, నూజివీడులో మూడు డిపార్టుమెంట్లు పనిచేస్తున్నాయి. పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చేలా కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రయోగాలకు అవకాశం 12–బీ గుర్తింపుతో విద్యార్థులతో పాటు, బోధనా సిబ్బందికీ మేలు జరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రయోగాలు చేయవచ్చు. ఇందుకయ్యే నిధులను యూజీసీ సమకూరుస్తుంది. ఈ గుర్తింపు సాధన కమిటీలో నేనూ కూడా ఓ సభ్యుడిని అయినందుకు ఆనందంగా ఉంది. కృష్ణా యూనివర్సిటీ ప్రయోగాలకు కేంద్రంగా నిలువనుంది. – డాక్టర్ డి.రామశేఖర్‌రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ నాక్ గుర్తింపుపై దృష్టి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే 12–బీ గుర్తింపు సాధ్యమైంది. ఈ గుర్తింపు సాధనలో ఉన్నత విద్యామండలి పెద్దల సహకారంతో ఎంతో ఉంది. 2020–21 విద్యా సంవత్సరంలో ఐఎస్ఓ 9001–2015 సర్టిఫికెట్ సొంతం చేసుకున్నాం. నా హయాంలో 12–బీ గుర్తింపు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నాక్ గుర్తింపుపై దృష్టిపెట్టాం. – కె.బి.చంద్రÔశేఖర్, వైస్ చాన్స్‌లర్ విద్యార్థుల అభివృద్ధే లక్ష్యం కృష్ణా యూనివర్సిటీలో చదువుకునేందుకు ఎక్కువగా పేదవర్గాల విద్యార్థులు వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆశయా లకు అనుగుణంగా విద్యార్థుల అభివృద్ధే లక్ష్యంగా అంతా సమన్వయంతో పనిచేస్తున్నాం. సొంత భవనాల్లో మౌలిక సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి. వర్సిటీ మరింత అభివృద్ధికి యూజీసీ 12–బీ గుర్తింపు ఊతమిస్తుంది. – డాక్టర్ ఎం.రామిరెడ్డి, రిజిస్ట్రార్ -
New Education Policy: డిగ్రీ ఇక నాలుగేళ్లు
సాక్షి, మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో డిగ్రీ కోర్సు ఇకపై నాలుగేళ్లు ఉండనుంది. 2022–23 విద్యా సంవత్సరం నుంచే దీనిని ప్రారంభించేలా వర్సిటీ అకడమిక్ సెనేట్ కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ సమావేశ మందిరంలో మంగళవారం అకడమిక్ సెనేట్ సమావేశమైంది. వైస్ చాన్స్‌లర్ కేబీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. రామిరెడ్డి, సీడీసీ డీన్ సుందరకృష్ణ పాటు కమిటీలో 32 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. 2021–22 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను సభ్యుల ముందు ఉంచారు. అదే విధంగా 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ కార్యకలాపాలు, తదితర 50 అంశాలపై చర్చించి, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. విద్యా పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ►నూతన విద్యా పాలసీకి అనుగుణంగా యూనివర్సిటీ అనుబంధ కాలేజీలన్నింటిలోనూ నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూడు ఏళ్లు పూర్తయ్యాక పదినెలల ఇంటర్న్‌షిప్ ఉండేలా సిలబస్‌ను రూపొందించనున్నారు. దీనిని 2022–23 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. ►డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లిష్ మీడియంలో బోధన, పరీక్షల నిర్వహణకు నిర్ణయించారు. ►డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో పరీక్షల నిర్వహణలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించారు. ►కాలేజీల్లో నాణ్యమైన విద్యాబోధన చేపట్టేలా అన్ని చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ పెంచ నున్నారు. ►నాలుగేళ్ల డిగ్రీతో బయటకు వచ్చే ప్రతి విద్యార్థి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తప్పనిసరిగా పొందేలా బోధనకు ప్రాధాన్యం ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సెనేట్ సభ్యులు సూచించారు. ►అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ జయశంకర్ ప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించగా, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. రామిరెడ్డి సెనేట్ అజెండా, వర్సిటీలో నూతన విద్యా విధానం అమలు తీసుకుంటున్న చర్యలపై వివరించారు. -
ఆ నలుగురు ఔట్..!
మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీలో పనిచేస్తున్న నలుగురు ప్రొఫెసర్లను ఉద్యోగాల నుంచి రిలీవ్ చేస్తూ వైస్ చాన్సలర్ కేబీ చంద్రశేఖర్ ఆమోదంతో గురువారం రాత్రి ఇన్చార్జి రిజిస్ట్రార్ వైకే సుందరకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నలుగురు ప్రొఫెసర్లు ప్రస్తుతం సెలవులో ఉండటంతో ఉత్తర్వులను వారి వ్యక్తిగత మెయిల్‌కు పంపడంతో పాటు శుక్రవారం వాటిని సొంత ఊరు అడ్రస్‌కు పోస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వర్సిటీ పాలక మండలి నియామక నోటిఫికేషన్ రద్దు చేసిందన్న విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురు ప్రొఫెసర్ల ఉద్యోగాలు పోయినట్లే. అయితే వాటిని కాపాడుకునేందుకు సదరు ప్రొఫెసర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనంతపురం జేఎన్టీయూ మాదిరే తమకు కూడా హైకోర్టు ధర్మాసనం సానుకూలమైన తీర్పు ఇస్తుందని ఎదురుచూస్తున్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా సుందరకృష్ణ కృష్ణా యూనివర్సిటీ నుంచి సాగనంపే నలుగురు ప్రొఫెసర్లలో ఒకరైన టి. హైమావతి ప్రస్తుతం ఇక్కడ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్ల నియామకం, తొలగింపు... రిజిస్ట్రార్ సంతకంతోనే జరగాల్సి ఉంది. ఇది చిక్కు తెచ్చిపెట్టింది. వర్సిటీ వైస్ చాన్సలర్ కేబీ చంద్రశేఖర్ దీనిపై తీవ్ర తర్జన భర్జన అనంతరం వైకే సుందరకృష్ణను ఇన్చార్ట్ రిజిస్ట్రార్‌గా నియమించి, అతనితో ఆ నలుగురు ప్రొఫెసర్లకు తొలగింపు ఉత్తర్వులు ఇప్పించారు. తొలగించిన వారు వీరే.. ♦డాక్టర్ తాళ్ల హైమావతి, అప్లైడ్ మాథమెటిక్స్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ (రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు) ♦డాక్టర్ వి. వెంకట్రాము, ఫిజిక్స్ డిపార్ట్మెంటు, అసిస్టెంట్ ప్రొఫెసర్, యోగి వేమన యూనివర్సిటీ (నూజివీడు పీజీ సెంటర్ స్పెషల్ ఆఫీసర్‌గా, వర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ బాధ్యతలు చూస్తున్నారు.) ♦డాక్టర్ ఈదర దిలీప్, ఇంగ్లిష్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ద్రవిడన్ యూనివర్సిటీ (ఇంగ్లిష్ డిపార్ట్ట్మెంట్ హెచ్ఓడీగా, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్‌గా ఉన్నారు.) ♦డాక్టర్ వైఏవీఏఎస్‌ఎన్ మారుతి బయోసైన్స్ అండ్ బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్, ప్రొఫెసర్, గీతం యూనివర్సిటీ ( కాలేజీ అభివృద్ధి కమిటీ (సీడీసీ) డీన్‌తో పాటు క్యాంపస్‌లో ఉన్న ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు). ఈసీ ఆదేశాలకు అనుగుణంగానే కృష్ణా యూనివర్సిటీ ఎగ్జిక్వూటివ్ కౌన్సిల్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్యలు తీసుకున్నాము. నిపుణుల సలహాలు తీసుకొనే ఆ నలుగురు ప్రొఫెసర్లును రిలీవ్ చేశాము. ఇన్చార్జ్ రిజిస్ట్రార్ నియామకం తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. – కేబీ చంద్రశేఖర్, వైస్ చాన్సలర్, కృష్ణా యూనివర్సిటీ చదవండి: ‘గ్రామీణ వికాసం’లో ఏపీ టాప్ తుపాన్లతో దెబ్బతిన్న రోడ్లకు వేగంగా మరమ్మతులు -
కృష్ణాలో కొత్త ఉషస్సు!
సాక్షి, మచిలీపట్నం: జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పం మేరకు 2009లో కృష్ణా యూనివర్సిటీ ఏర్పాటైంది. వైఎస్సార్ మరణానంతర పరిణామాలతో దాదాపు పదేళ్ల పాటు ఈ వర్సిటీ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. సుమారు రూ.90 కోట్ల అంచనా వ్యయంతో బందరు మండలం రుద్రవరం గ్రామంలో నిర్మించిన కొత్త క్యాంపస్‌లోకి వర్సిటీని తరలించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేని దుస్థితి కొనసాగింది. వర్సిటీలో అంతర్గత కుమ్ములాటలతో విద్యాప్రమాణాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.కృష్ణారెడ్డి వర్సిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇన్చార్జి వైస్‌చాన్సలర్ ప్రొ.సుందర కృష్ణతో కలిసి రిజిస్ట్రార్ కృష్ణారెడ్డి వర్సిటీలో విద్యాప్రమాణాలను మెరుగుపర్చడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2020 జనవరిలో కొత్త క్యాంపస్‌లో అడుగుపెట్టడంతో పాటు వివిధ జాతీయ, అంతర్జాతీయ వర్సిటీలతో కలిసి పనిచేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఆయా వర్సిటీలతో అవగాహన ఒప్పందాల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విద్యా ప్రమాణాలను అందిపుచ్చుకోవడం ద్వారా అంతర్గత నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు బాటలు వేస్తున్నారు. తైవాన్ వర్సిటీతో ఎంఓయూ తైవాన్ నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీతో ఇటీవలే కృష్ణా వర్సిటీకి అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల కృష్ణా వర్సిటీకి అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. ఇక్కడ పీజీ పూర్తి చేసిన విద్యార్థులు పీహెచ్డీ చేయడానికి, పీహెచ్డీ పూర్తి చేసిన వారు పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ చేయడానికి తైవాన్ యూనివర్సిటీకి వెళ్లే అవకాశం అందిపుచ్చుకోనున్నారు. కృష్ణా వర్సిటీలోని ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు దోహదపడనుంది. ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు కొనసాగనుంది. మరో వైపు తైవాన్ దేశానికి చెందిన చంగ్జున్ క్రిస్టియన్ యూనివర్సిటీతో కూడా ఎంఓయూ చేసుకోనుంది. కల్చరల్ ఎక్సే్ఛంజ్ తో పాటు సైంటిఫిక్ అండ్ అకడమిక్ ఎబిలిటిస్ను పెంపొందించుకునేందుకు దోహదపడనుంది. మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎఐటీ)తో అవగాహన ఒప్పందం చేసుకుంటోంది. దీని ద్వారా ఆక్వా జియో సైన్సెస్ కోర్సులను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇరు వర్సిటీలను బలోపేతం చేసుకునేందుకు ఉపకరిస్తుంది. విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్‌తో.. విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్‌తో కూడా అవగాహన ఒప్పందం చేసుకోనుంది. దీని ద్వారా ఎట్మాస్పియర్ నేచురల్–వెదర్ డైనమిక్స్ అండ్ ఎడ్వాన్స్డ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌గా వర్సిటీని అభివృద్ధి చేసుకునేందుకు దోహదపడనుంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్పేస్ సెంటర్ సమకూర్చనుంది. మరోవైపు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)తో జియో స్పేర్, బయోస్పేర్, అటా్మస్పియర్ యాక్టివిటీస్ అభివృద్ధిపై అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఇండియన్ మెట్రాలాజికల్ డిపార్టుమెంట్ (ఐఎండీ)తో కూడా ఎంఓయూ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఒప్పందంతో కోస్తా తీరంలో డాప్లర్ వెదర్ రాడార్స్ నుంచి డేటా తీసుకుని ఫోర్కాస్టింగ్ ఆఫ్ ది టెంపరేచర్ వెదర్ పేరా మీటర్స్‌పై వర్సిటీ రీసెర్చ్ చేయనుంది. వచ్చే ఆర్నెల్లలో వరుసగా మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం ద్వారా కృష్ణా వర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న సంకల్పంతో పనిచేస్తున్నట్టు రిజి్రస్టార్ ప్రొ. కృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
వీసీ నియామకంపై కుమ్ములాట
సాక్షి, మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీ ఇన్చార్జి వీసీగా సుందరకృష్ణ నియామకాన్ని ఆహ్వానిస్తూనే కొంతమంది ప్రొఫెసర్లు ప్రస్తుతం ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ఉన్న డాక్టర్ ఎన్. ఉషను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎనిమిది సీనియర్ రెగ్యూలర్ ప్రొఫెసర్లు సంతకాలు చేసిన లేఖను గురువారం ఇన్చార్జి వీసీ సుందరకృష్ణకు అందజేశారు. ప్రొఫెసర్లు, పాలనాధికారులతో ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ సుందరకృష్ణ గురువారం సమావేశం నిర్వహించారు. అయితే సమావేశం అనంతరం కొంతమంది సీనియర్ ప్రొఫెసర్లు ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్‌ను కలసి వర్సిటీకి నూతన రిజిస్ట్రార్‌ను నియమించాలని కోరారు. ఆ లేఖను రిజిస్ట్రార్‌కు ఇవ్వాలని ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ సూచించగా, రిజిస్ట్రార్‌ను మార్చాలనే డిమాండ్‌తో లేఖ ఇస్తున్నందున నేరుగా మీకే అందజేస్తున్నామని ప్రొఫెసర్లు తెలిపారు. దీంతో ఇన్చార్జి వీసీ వారు ఇచ్చిన లేఖను తీసుకున్నారు. ఆ సమయంలో ప్రస్తుతం ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఎన్. ఉష కూడా అక్కడే ఉండటం గమనార్హం. దీనిపై స్పందించిన ఇన్చార్జి వీసీ పరిశీలన చేస్తామని వారికి హామీ ఇచ్చారు. -
కృష్ణ.. కృష్ణా!
సాక్షి,మచిలీపట్నం : జిల్లాకు తలమానికంగా నిలవాల్సిన కృష్ణా యూనివర్సిటీ గత పాలకుల నిర్వాకంతో గాడి తప్పింది. టీడీపీ ప్రభుత్వ పాలనలో కొంతమంది ప్రజా ప్రతినిధులు సాగించిన రాజకీయ క్రీడతో యూనివర్సిటీ బ్రష్టు పట్టిపోయింది. చదువుల వాడగా కీర్తిగాంచిన కృష్ణా జిల్లాలో ఉన్నత విద్యను కూడా చేరువలోకి తీసుకొచ్చేందుకు మచిలీపట్నం కేంద్రంగా దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణా యూనివర్సిటీ నెలకొల్పారు. ప్రస్తుతం యూనివర్సిటీలో పాలన గందరగోళ పరిస్థితుల్లోకి జారిపోయింది. కృష్ణా యూనివర్సిటీ బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాల (ఏజే కాలేజీ) ప్రాంగణంలో 2008 అక్టోబర్ 13న యూనివర్సిటీ అకడమిక్, పరిపాలనాపరమైన కార్యకలాపాలను ప్రారంభించింది. దశాబ్ధకాలం ముగిసినప్పటికీ, పాలనా పురోభివృద్ధి ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నింటినీ రాజకీయ వేదికలుగా ఉపయోగించుకున్న క్రమంలో మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ కూడా వారి చర్యలకు బలైపోవాల్సి వచ్చింది. పాలనా వ్యవహారాలను చక్కదిద్దే వర్సిటీ వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ వంటి కీలక పోస్టుల్లో తమకు అనుకూలంగా ఉన్న వారికి ఇంచార్జి హోదాలను కట్టబెట్టడంతో పాలన పూర్తిగా పక్కదారి పట్టింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావటంతో ఇప్పటి వరకు అడ్డగోలు పాలన సాగించిన ఒక్కొక్కరు పలాయనం చిత్తగించే క్రమంలో రాజీనామా బాట పట్టినప్పటికీ, వారి పాలనలో సాగించిన అడ్డగోలు విధానాల వల్ల వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయింది. ఆ ప్రభావం కృష్ణా యూనివర్సిటీపై కూడా పడింది. ప్రస్తుతం వర్సిటీ దిక్కులేనదైంది. ప్రొఫెసర్లకు అందని వేతనాలు.. యూనివర్సిటీలో పని చేస్తున్న ప్రొఫెసర్లకు మూడు నెలలుగా వేతనాలు అందలేదు. రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేసే 22 మందికి ఏప్రిల్ నెల నుంచి జీతాలు చెల్లించాల్సి ఉంది. వేతనాలపై ఆధారపడి, ఇక్కడ పని చేస్తున్న ప్రొఫెసర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వర్సిటీ పాలనాధికారుల నిర్వాకం వల్ల తమ కుటుంబాలు పస్తులతో ఉండాల్సి వస్తోందని, పిల్లలను పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించే సమయంలో ఇటువంటి పరిస్థితులు దాపురించటం మనో వేదనకు గురి చేస్తోందని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సీనియర్ ప్రొఫెసర్ ఆవేదన వెలిబుచ్చారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి వీసీగా వ్యవహరించిన వేగేశ్న రామచంద్రరాజు కృష్ణా యూనివర్సిటీకి కూడా ఇంచార్జి వైస్ చాన్స్‌లర్‌గా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పదవీ యోగం దక్కించుకున్న ఆయన, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావటంతో రాజీనామా చేశారు. దీంతో కృష్ణా యూనివర్సిటీకి ప్రస్తుతం ఇంచార్జి వీసీ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇంచార్జి రిజిస్ట్రార్‌గా ఉన్న అధికారి సైతం దీనిపై ఏ మాత్రం పట్టించుకోవటం లేదని ప్రొఫెసర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నూతన భవనాలు వినియోగంలోకి వచ్చేనా.. యూనివర్సిటీకి సుమారు రూ.80 కోట్ల వ్యయంతో పట్టణానికి సమీపంలోని రుద్రవరంలో శాశ్వత భవనాలను నిర్మించారు. ఇవి పూర్తి అయినప్పటికీ, వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు మాత్రం వర్సిటీ అధికారులు దృష్టి సారించటం లేదు. నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్‌కు రూ.10 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉండటంతో, ఆ భవనాలను వర్సిటి అధికారులకు అప్పగించనట్లుగా తెలిసింది. పరిస్థితి ఇలా ఉంటే, ఎన్నికల గిమ్మిక్కుల్లో భాగంగా ఫిబ్రవరి 7న మచిలీపట్నం వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వర్సిటీ భవనాలను ప్రారంభించేయటం గమనార్హం. 102 ఎకరాల విస్తీర్ణం వర్సిటీ కోసమని కేటాయించగా, ఇందులో నిర్మాణాలు మాత్రం సరైన రీతిలో చేపట్టకపోవటంతో వర్సిటీ కార్యకలాపాలకు సవ్యంగా ఉపయోగపడతాయా అనే సందేహాలు సైతం ఉన్నాయి. విశాలమైన స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ, అపార్ట్మెంట్ మాదిరే దీనిని నిర్మించారని, దీని వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయని వర్సిటీ అధికారులు బాహాటంగానే అంటున్నారు. -
కబడ్డీ చాంప్ ఎస్ఆర్ఆర్
విజయవాడ స్పోర్ట్స్/విజయవాడ రూరల్ : కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల కబడ్డీ చాంపియన్‌షిప్‌ను విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల జట్టు కైవసం చేసుకుంది. విజయవాడ రూరల్ మండలం నున్నలోని వికాస్ బీపీఈడీ కళాశాలలలో కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలు బుధవారం ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో జగ్గయ్యపేట ఎస్జీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టుపై 28-32 తేడాతో ఎస్ఆర్ఆర్ కళాశాల జట్టు ఘన విజయం సాధించింది. ఎస్ఆర్ఆర్ కళాశాల క్రీడాకారులు శ్రావణ్, సందీప్, కుమార్, సర్దార్, నరసింహ ఆల్‌రౌండ్ ప్రతిభ కనపరిచి జట్టుకు విజయాన్ని అందించారు. నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. ఎస్జీఎస్ జట్టు ద్వితీయ స్థానం పొందింది. మూడు నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల జట్టుపై 28-34 తేడాతో విజయా బీపీఈడీ కళాశాల జట్టు వియజం సాధించింది. ఈ పోటీల్లో టి.శ్రావణ్‌కుమార్ (ఎస్ఆర్ఆర్) బెస్ట్ రైడర్‌గా, కె.నవీన్ (జగ్గయ్యపేట ఎస్జీఎస్) బెస్ట్ డిఫెన్స్ ప్లేయర్ అవార్డుల కింద రూ.2వేల నగదు బహుమతిని అందుకున్నారు. అంతర్ కళాశాలల పోటీల్లో ప్రోత్సాహాక నగదు బహుమతులు ఇవ్వడం ఇదే ప్రథమం. పోటీల అనంతరం జరిగిన కార్యక్రమంలో కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.సూర్యచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నున్న సర్పంచ్ కర్రె విజయకుమార్, కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు, వికాస్ విద్యా సంస్థల చైర్మన్ నరెడ్ల నర్సిరెడ్డి, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవి, న్యాయవాది రాజేశ్వరరావు, వికాస్ బీపీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి టి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా హ్యాండ్‌బాల్ మహిళల జట్టు ఎంపిక
విజయవాడ (వన్‌టౌన్) : కృష్ణా విశ్వవిద్యాలయం హ్యాండ్‌బాల్ (మహిళలు) జట్టును ఎంపిక చేసినట్లు కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల క్రితం తమ కళాశాలలో జరిగిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల (మహిళల) హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ ముగిసిన తరువాత ఎంపిక కమిటీ విశ్వవిద్యాలయం జట్టును ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర లయోల కళాశాలకు చెందిన జె.సుశ్రీ, టి.నవ్య, ఎన్.మనీషా, కేబీఎన్ కళాశాలకు చెందిన టి.సాయివినీత, జి.సాయిలక్ష్మి, ఎస్.గౌరీపార్వతి, సిద్ధార్థ మహిళా కళాశాలకు చెందిన డి.తారాబాయి, ఎస్.దివ్యవల్లి, మారీస్ స్టెల్లా కళాశాలకు చెందిన కె.వంశీప్రియ, నూజివీడు ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్‌కు చెందిన ఈ.కల్యాణి, విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు చెందిన ఎం.కోటేశ్వరి, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాలకు చెందిన పి.అశ్విని తదితులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. స్టాండ్‌బైస్‌గా పి.శివనాగలక్ష్మి (కేబీఎన్), కె.సుష్మాస్వరాజ్, జె.రాణి (ఆంధ్ర లయోల), ఎస్.శాంతి (మారీస్ స్టెల్లా), వీఎల్ భవ్య (సిద్ధార్థ మహిళా)ఎంపికైనట్లు వివరించారు. వీరు తమళనాడు సేలంలోని పెరియార్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి నిర్వహించే అంతర్ విశ్వవిద్యాలయ హ్యాండ్‌బాల్ పోటీలకు కృష్ణా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. -
కృష్ణా యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక
పటమట (ఆటోనగర్) : కృష్ణా విశ్వవిద్యాలయం బాస్కెట్ బాల్ జట్టు ఎంపికైంది. ఇటీవల యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల జట్ల మధ్య జరిగిన బాస్కెట్ బాల్ టోర్నీలో ప్రతిభచాటిన క్రీడాకారులతో యూనివర్సిటీ జట్టు ఎంపిక గురువారం మారిస్ స్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కుల్రేఖ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ నల్లూరు శ్రీనివాసరావు, గౌరవ అతిథిగా ఆల్ ఇండియా బాస్కెట్ బాల్ గోల్డ్ మెడలిస్ట్ జి.ఎస్.సి.బోసు హాజరయ్యారు. మ్యారీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల బాస్కెట్ బాల్ టోర్నమెంట్లో సిద్ధార్ధ మహిళా కళాశాల మొదటి స్థానం, మ్యారీస్ స్టెల్లా కళాశాల రెండో స్థానం, కేబీఎన్ కాలేజీ మూడవ స్థానం, నున్న విజయ కాలేజీ నాలుగో స్థానంలో నిలిచాయి. ఎంపికైన జట్టు సిద్ధార్థ మహిళా కళాశాల నుంచి ఎస్.కె.ఎస్తేరు రాణి, ఎస్.దివ్యవల్లి, వి.ఎల్.భవ్య, చంద్రలేఖ, తారాబాయి, మ్యారిస్ స్టెల్లా కళాశాల నుంచి రూబి అమూల్య, మౌనిక, నిహారిక, కె.భానుశ్రీ , కేబీఎన్ కాలేజీ నుంచి వాణి, కల్యాణి, నున్న విజయ కళాశాల నుంచి శ్రీలక్ష్మి ఎంపియ్యారు. సెలెక్షన్ కమిటీ సభ్యులుగా ఆంధ్రా లయోల కళాశాల ఫిజికల్ లెక్చరర్ జె.వి.ఎన్.ప్రసాద్, నూజివీడు డీఏఆర్ కళాశాల మహమ్మద్ అంజాద్ ఆలీ వ్యవహరించారు. -
వాలీబాల్ విజేత సిద్ధార్థ కళాశాల
మచిలీపట్నం : అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలలో విజయవాడ పీబీ సిదార్ధ కళాశాల ప్రధమస్థానాన్ని సాధించింది. రెండు రోజులుగా కృష్ణా యూనివర్సిటీలో జరుగుతున్న అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు శనివారంతో ముగిశాయి. ద్వితీయ స్థానంలో గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల, విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల తృతీయ స్థానం, ఏఈఅండ్ ఎస్జీ కళాశాల నాల్గవస్థానంలో నిలిచాయి. వాలీబాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు డిసెంబరు 2 నుంచి 7వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, కొట్టాయంలో జరిగే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ మెన్ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొంటారని యూనివర్సిటీ వీసీ ఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఈ పోటీలను యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, కో–ఆర్డినేటర్ జయశంకరప్రసాద్, రిజిష్ట్రార్ డి సూర్యచంద్రరావు పర్యవేక్షించారు. -
కేయూ మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు
విజయవాడ స్పోర్ట్స్ : చెన్నై సత్యభామ యూనివర్సిటీలో శనివారం ముగిసిన సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళా క్రికెట్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన కృష్ణా యూనివర్సిటీ జట్టును వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సుంకరి కృష్ణారావు అభినందించారు. ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళా క్రికెట్ టోర్నీకి ఎంపికైన సందర్భంగా కేయూ ఫిజికల్ డైరెక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన స్థానిక ఓ హోటల్లో ఆదివారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీసీ మాట్లాడుతూ మహిళా క్రికెట్ జట్టు సౌత్ ఇండియా స్థాయిలో రన్నరప్‌గా నిలవడంపై హర్షం వ్యక్తంచేశారు. జట్టులోని ప్రతి క్రికెటర్‌కు రూ.3వేల నగదు ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. జట్టును విజయపథంలో నడిపిన కోచ్ బి.ఉదయ్‌కుమార్, మేనేజర్ జి.సుధారాణిని వీసీ అభినందించారు. కేయూ పీజీ సెంటర్ ప్రత్యేక అధికారి మండవ బసవేశ్వరరావు మాట్లాడుతూ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నీలో విజేతగా నిలిస్తే జట్టులోని ప్రతి సభ్యురాలికి రూ.5,116 చొప్పున అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పీడీల అసోసియేష్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.డేవిడ్, వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
విశ్వవిద్యాలయాన్ని అగ్రగామిగా నిలపాలి
మచిలీపట్నం(చిలకలపూడి): పోటీ ప్రపంచంలో కృష్ణా విశ్వవిద్యాలయాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అందరూ కృషి చేయాలని వైస్‌చాన్స్‌లర్ సుంకరి రామకృష్ణారావు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జాతీయ విద్యాసంస్థల ర్యాకింగ్ ప్రక్రియ విధివిధానాలు అనే అంశంపై సమావేశాన్ని గురువారం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలన్నీ తమ కళాశాలల పూర్తి వివరాలను వెబ్సైట్లో రిజిష్టర్ చేసుకోవాలన్నారు. జాతీయ ర్యాకింగ్ సిస్టమ్‌లో కళాశాల ర్యాకింగ్ను మెరుగుపరుచుకోవాలన్నారు. యూనివర్సిటీ రిజిష్ట్రార్ డి సూర్యచంద్రరావు మాట్లాడుతూ డిజిటల్ ఇండియా విధానంలో అన్ని విద్యాసంస్థలు కృషి చేసి విశ్వవిద్యాలయాన్ని ర్యాకింగ్ సిస్టమ్‌లో ప్రధమస్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కళాశాలలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఎన్ఐఆర్ఎఫ్ కమిటీ సభ్యులు జి కృష్ణమోహన్, కె హనుమంతరావు, మధుసూదనరావు, వివిధ కళాశాలల ప్రతినిధులు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
వర్సిటీ నిర్మాణం.. ఎడతెగని జాప్యం
మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీ భవనాల నిర్మాణం ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించటం లేదు. భూమి పరీక్షలు తదితర కారణాలు చూపి ఏళ్లతరబడి భవనాల నిర్మాణం చేపట్టకుండా జాప్యం చేస్తున్నారు. బందరు మండలం రుద్రవరం పంచాయతీ పరిధిలోని కోన రోడ్డు వెంబడి 102.86 ఎకరాల భూమిని ప్రభుత్వం యూనివర్సిటీకి 2010లో కేటాయించింది. యూనివర్సిటీ భవనాల నిర్మాణం కోసం రూ.72 కోట్లతో అంచనాలు రూపొందించారు. 2014 అక్టోబరులో ఈ పనులను విజయవాడకు చెందిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ విభాగానికి అప్పగించారు. అక్టోబరులో ఈ పనులను సీపీడబ్ల్యూడీకి అప్పగిస్తూ మొదటి విడతగా రూ.7.17 కోట్ల చెక్కును అప్పట్లో అందజేశారు. ఇక్కడ రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకడమిక్ భవనాలను నిర్మించాలని అంచనాలు రూపొందించారు. మొదటి విడతలో 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలను నిర్మిస్తామని ప్రకటించారు. అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని మొదటి విడతలో 85 వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు చెప్పారు. జీ+2 భవనాలు నిర్మించాలని నమూనాలు తయారుచేయగా మొదటి విడతలో జీ+1 భవనాల నిర్మాణం చేయాలని నిర్ణయించారు. యూనివర్సిటీకి కేటాయించిన భూములు లోతట్టుగా ఉండటంతో ఇటీవల రూ.50 లక్షల వ్యయంతో కొంతమేర భూమిని మెరక చేశారు. దీంతో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా అంతర్గత రోడ్లను మెరక చేయించారు. సీపీడబ్ల్యూడీకి ఈ పనులు అప్పగించిన అనంతరం 18 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ఇంతవరకు టెండర్ల దశను దాటకపోవటం గమనార్హం. భూమి పరీక్షల పేరుతో జాప్యం 2010లో కృష్ణా యూనివర్సిటీకి రుద్రవరం వద్ద 102 ఎకరాలను కేటాయించారు. ఈ భూముల పక్కనే ఉన్న గురుకుల జూనియర్ కళాశాలకు మూడంతస్తుల భవనాలను ఇటీవలే నిర్మించారు. యూనివర్సిటీ భవనాల నిర్మాణం విషయంలో భూమి పరీక్షలు చేస్తున్నామని, భూమి లోపల మట్టి మెత్తగా ఉండి బరువును తట్టుకునేందుకు అవకాశం లేదని తదితర కారణాలు చూపి భవనాల నిర్మాణం చేయకుండా జాప్యం చేస్తున్నారు. తొలుత భూమి లోపల 100 అడుగుల లోతు నుంచి మట్టిని సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ భవనాలు నిర్మించడానికి అనుకూలంగానే ఉందని తేల్చారు. అయితే మూడు, నాలుగు అంతస్తులు నిర్మిస్తే త్వరితగతిన భవనాలు పాడైపోయే అవకాశం ఉన్నందున నూతన సాంకేతిక పరిజ్ఞానంతో భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. గిలకలదిండి హార్బర్‌ను నిర్మించిన సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్మించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇన్ని భూమి పరీక్షలు చేసి నివేదికలు సమర్పించినా సీపీడబ్ల్యూ అధికారులు ఇంతవరకు ఈ పనులకు టెండర్లు పిలవకపోటవం గమనార్హం. వారం రోజుల క్రితం కృష్ణా యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ డి.సూర్యచంద్రరావు సీపీడబ్ల్యూ అధికారులతో మాట్లాడి ఈ పనులను వేగవంతం చేయాలని సూచించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కృష్ణా యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రావాలంటే టెండర్ల దశ పూర్తవ్వాలని యూనివర్సిటీ ప్రతినిధులు చెబుతున్నారు. 2008 నుంచి అద్దె భవనాల్లోనే... 2008 ఏప్రిల్ 23న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా యూనివర్సిటీని ప్రారంభించారు. ఆంధ్ర జాతీయ కళాశాలలోని 20 గదుల్లో నిర్మలా కాన్వెంట్ సమీపంలోని ఓ భవనంలో యూనివర్సిటీని అద్దెకు నడుపుతున్నారు. వర్సిటీకి హాస్టళ్ల సదుపాయం లేకపోవటం, రీసెర్చ్ స్కాలర్స్‌కు వసతి లేకపోవటం తదితర కారణాల నేపథ్యంలో ఇది ఇంతవరకు అభివృద్ధి చెందలేదు. రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా యూనివర్సిటీకి అత్యంత ప్రాధాన్యత సమకూరినా భవనాలు నిర్మించకుండా జాప్యం చేయటం గమనార్హం. -
దొంగబుద్ధి ఉన్నవ్యక్తికి సెక్యూరిటీ బాధ్యతలా !
బ్లాక్‌మెయిలింగ్ ముఠాలో కీలక వ్యక్తి అయిన జాటోతు కృష్ణ యూనివర్సిటీ ఆస్తులను రక్షించే సెక్యూరిటీ విభాగానికి చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండడం గమనార్హం. బ్లాక్‌మెయిలింగ్‌తోనే ఇతడు మొదటి నుంచి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నతాధికారులను తన గుప్పిట్లో ఉంచుకుంటున్నాడనే ఆరోపణలున్నాయి. ఇటీవల హెచ్ఆర్ఎం విభాగానికి చెందిన ఓ పార్టటైం లెక్చరర్ తన బైక్ పాడైందని ఎస్డీఎల్సీఈ ఆవరణలో పార్క చేయగా ఆ బైక్‌ను కృష్ణ ఎత్తుకెళ్లాడు. ఆ బైక్ రూపురేఖలను మార్చి దర్జాగా తిరుగుతుండగా సదరు లెక్చరర్ స్నేహితుడొకరు చూసి అతడికి సమాచారమిచ్చాడు. దీంతో అతడిని పిలిచి నిలదీయగా బైక్ వదిలేసి వెళ్లిపోయిన ఘటన కూడా ఇటీవల క్యాంపస్‌లో చర్చనీయాంశమైమంది. యూనివర్సిటీలో సుమారు 30 మంది సెక్యూరిటీ గార్డులు విధులకు హాజరుకాకున్నా వారితో రిజిష్టర్లలో సంతకాలు చేయించి, జీతాల బిల్లు చేయిస్తూ అందులో సగం ఇతడే స్వాహా చేస్తున్నట్లు తెలిసింది. రోజూ విధులకు హాజరయ్యే సెక్యూరిటీ గార్డుల వద్ద కూడా వేతనం తీసుకునే సమయంలో రూ.1000 నుంచి రూ.2 వేల వరకు కమీషన్ల రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా అతడి జీతం రూ.30 వేలు పోనూ నెలకు సుమారు రూ.లక్షన్నరకు పైగా ఇతడు అక్రమంగా సంపాదిస్తున్నట్లు పలువురు సెక్యూరిటీ గార్డులు వాపోయారు. ఇతడి వ్యవహారంపై యూనివర్సిటీ ఉన్నతాధికారికి పలుమార్లు ఫిర్యాదులు వెళ్లినా ఆయన మౌనంగా ఉంటూ కాపాడుతూ రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోమారు కృష్ణను విచారిస్తే మరిన్ని అంశాలు వెలుగుచూసే అవకాశం ఉంది. -
వీసీ పోస్టుకు తెరవెనుక మంత్రాంగం
మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం తెరవెనుక మంత్రాంగం నడుస్తోంది. ప్రస్తుతం వీసీగా విధులు నిర్వహిస్తున్న ఉన్నం వెంకయ్య ఈనెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటివరకు ఈ యూనివర్సిటీకి ఇద్దరు వీసీలు పనిచేయగా, వారు ఓసీ సామాజిక వర్గానికి చెందినవారు. రొటేషన్ పద్ధతిలో ఈ సారి బీసీలకు లేదా ఎస్సీ మహిళకు వీసీ పోస్టు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్లు వీసీ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర, మచి లీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఇద్దరూ బీసీలే కావడంతో వారి కనుసన్నల్లోనే బీసీనే వీసీగా నియమించే అవకాశం ఉంటుందని ప్రొఫెసర్లు చెప్పుకొంటున్నారు. కృష్ణా వర్సిటీతో పాటు నాగార్జున యూనివర్సిటీ వీసీ వియన్నారావు కూడా ఈ నెలలోనే పదవీ విరమణ చేయనున్నారు. వీసీ వెంకయ్య ఉన్నత పదవి! హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దీర్ఘకాలం పనిచేసిన ఉన్నం వెంకయ్య పదవీ విరమణకు సమీపంలోకి వచ్చిన అనంతరం కృష్ణా వర్సిటీ వీసీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ పదవి కోసం ఆయన ప్రయత్నాలు చేసుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. జిల్లా మంత్రులతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే సీఎం రమేష్, కేంద్రమంత్రి సుజనాచౌదరి ద్వారా ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారన్న ప్రచారం వినిపిస్తోంది. వీసీగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకలకు కొంతమేర అడ్డుకున్నారని ప్రొఫెసర్లు చెప్పుకొంటున్నారు. అయితే యూనివర్సిటీకి సంబంధించిన భవనాల నిర్మాణం ప్రారంభించలేకపోయారు. కృష్ణా యూనివర్సిటీకి వీసీని నియమించాలంటే సెర్చ్ కమిటీ ఆమోదం తెలపాలని, భారీ తతంగం ఉంటుందని పలువురు ప్రొఫెసర్లు చెబుతున్నారు. రిజిస్ట్రార్ పోస్టు కోసం పోటాపోటీ ప్రస్తుతం కృష్ణా వర్సిటీ రిజిస్ట్రార్‌గా డి.సూర్యచంద్రరావు కొనసాగుతున్నారు. ఈ పోస్టులో మూడేళ్ల తరువాత కొత్తవారిని నియమించాలి. అయితే సూర్యచంద్రరావు ఐదేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు. యూని వర్సిటీ పరిధిలోని నూజివీడు పీజీ సెంటర్ ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న బసవేశ్వరరావు రిజిస్ట్రార్ పోస్టు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. యూనివర్సిటీలో ప్రొఫెసర్లు రెండు వర్గాలుగా విడిపోయి ఒక వర్గం సూర్యచంద్రరావును కొనసాగించాలని, మరోవర్గం బసవేశ్వరరావును రిజిస్ట్రార్‌గా ఇక్కడకు తీసుకురావాలని మంత్రాంగం నడపడం గమనార్హం. భవనాల నిర్మాణం ఎప్పటికో.. మచిలీపట్నంలో 2008లో కృష్ణా యూనివర్సిటీని ప్రారంభించారు. ఏడేళ్లుగా ఆంధ్ర జాతీయ కళాశాలలోని 21 గదుల్లోనే వర్సిటీ కొనసాగుతోంది. భాస్కరపురంలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని అక్కడ కొన్ని తరగతులను నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే యూనివర్సిటీకి రుద్రవరంలో 102 ఎకరాలు, గూడూరులో 44 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రూ.77కోట్లతో యూనివర్శిటీ భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు చెబుతున్నా ఇంతవరకు శంకుస్థాపనకు నోచలేదు. ఈ పనులు ఎప్పటికి ప్రార ంభిస్తారనే అంశంపైనా స్పష్టత లేదు. యూనివర్సిటీ ప్రారంభం నుంచి ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకేతర సిబ్బంది బాగోగులను పట్టించుకునే వారు లేరన్న వాదన ఉంది. ఇన్ని ఇబ్బందుల మధ్య ప్రభుత్వం తక్షణమే కొత్త వీసీని ప్రకటించే అవకాశం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు. -
కృష్ణావర్సిటీ భవనాల నిర్మాణానికి రూ.7.17 కోట్లు
ఆరు వారాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి తొలుత అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణం కృష్ణా వర్సిటీ వీసీ పున్నం వెంకయ్య వెల్లడి మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీకి సొంత భవనాల నిర్మాణం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వర్సిటీ ఉపకులపతి ఆచార్య వున్నం వెంకయ్య తెలిపారు. యూనివర్సిటీలోని వీసీ చాంబరులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఇం దుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బందరు మండలం రుద్రవరం పంచాయతీ పరిధిలోని కోన రోడ్డు వెంబడి 102.86 ఎకరాలను గతంలో ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిందని చెప్పారు. ఈ భూమిలో రూ.72 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. భవనాల నిర్మాణ పనులను సీపీడబ్ల్యూడీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సీపీడబ్ల్యూడీ ఎస్ఈ ఈఎం గామిట్, ఈఈ నాగేశ్వరరావులకు మొదటి విడతగా రూ.7.17 కోట్ల చెక్కును ఈ సందర్భంగా వీసీ అందజేశారు. 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకడమిక్ భవనం అకడమిక్ భవనాన్ని రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని అంచనాలు రూపొందించామని వీసీ తెలిపారు. మొదటి విడతలో 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని మొదటి విడతలో 85 వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు వివరించారు. జీ+2 పద్ధతిలో ఈ భవనాలు నిర్మించాలని నమూనాలు తయారు చేశారని, అయితే మొదటి విడతలో మాత్రం జీ+1 పద్ధతిలో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. నిధుల వెసులుబాటును బట్టి మిగిలిన పనులను పూర్తి చేస్తామన్నారు. యూనివర్సిటీకి కేటాయించిన భూములు లోతట్టు ప్రాంతంలో ఉండంతో రోడ్డుకు మూడున్నర అడుగుల ఎత్తులో మెరక చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ భూముల్లో పటిష్టమైన నిర్మాణాల కోసం 70 అడుగుల లోతుకు వెళ్లి భూ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇంజినీరింగ్ నిపుణుల సూచనల మేరకు భూమిపై శ్లాబు వేసి, దానిపై భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను హైదరాబాదుకు చెందిన జేఎన్టీయూ సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. రూ.72 కోట్ల వ్యయంతో భవన నిర్మాణం చేపడతామని, రోడ్లు, విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. కాన్పూర్ యూనివర్సిటీ తరహాలో ఇక్కడ భవనాల నిర్మాణం జరుగుతుందని, 100 సంవత్సరాల పాటు మన్నికగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవన నిర్మాణం కోసం మొదటి విడతగా సీపీడబ్ల్యూడీపీకి 10శాతం నిధులను సమకూర్చాల్సి ఉన్న నేపథ్యంలో మొదటి విడతగా రూ. 7.17 కోట్లను ఇంజినీరింగ్ అధికారులకు అందజేసినట్లు వీసీ వివరించారు. నగదు అందజేసిన అనంతరం టెండర్ల ప్రక్రియకు ఆరు వారాల సమయం పడుతుందని, డిసెంబరు లేదా జనవరిలో పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సీపీడబ్ల్యూడీ ఎస్ఈ ఈఎం గామిట్ మాట్లాడుతూ పనులు ప్రారంభించిన 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను డీడీ రూపంలో అందజేసేందుకు జిల్లా ట్రెజరీ అధికారి నందిపాటి నాగేశ్వరరావు, సిబ్బంది తమకు సహకరించారని తెలిపారు. పబ్లిక్ లెక్చర్ సిరీస్ కృష్ణా యూనివర్సిటీ ద్వారా పబ్లిక్ లెక్చర్ సిరీస్‌ను నవంబరులో నిర్వహించనున్నట్లు వీసీ తెలిపారు. నవంబరులో నిర్వహించే 3వ పబ్లిక్ లెక్చర్ కార్యక్రమానికి కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఫర్ ఆసియా డెరైక్టర్ డాక్టర్ సంజయ్‌మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేస్తారని వీసీ తెలిపారు. నాలుగో లెక్చర్‌కు నాక్ మాజీ చైర్మన్ రామ్తక్వాలే ముఖ్య అతిథిగా హాజరై దేశంలోని ఉన్నత విద్య విధానంపై ఉపన్యసిస్తారని చెప్పారు. కృష్ణా యూనివర్సిటీ నవంబరు మొదటి వారంలో స్మారక ఉపన్యాసం జరుగుతుందని రఘుపతి వెంకటరత్నం నాయుడు పేరున ఈ స్మారకోపన్యాసాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా తరంగ్-2014 యువజనోత్సవాలను నవంబరులోనే యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఆన్లైన్ పరీక్షా విధానం అమలు కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తామని వీసీ చెప్పారు. పరీక్షా కేంద్రానికి 40 నిమిషాల ముందు ప్రశ్నాపత్రాన్ని ఆన్లైన్లో పంపుతామని, ఈ ప్రశ్నాపత్రాన్ని తెలుసుకునేందుకు పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎం.టెక్ కోర్సు ప్రారంభం కృష్ణా వర్సిటీలో ఈ ఏడాది నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సును ప్రారంభించినట్లు వీసీ చెప్పారు. పీజీ ఇంజినీరింగ్ కామెన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డి.సూర్యచంద్రరావు, జిల్లా ట్రెజరీ అధికారి నందిపాటి నాగేశ్వరరావు, ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు పాల్గొన్నారు. -
కార్పొరేట్ల చేతుల్లోకి ఉన్నత విద్య!
విజయవాడ: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలనే రాష్ట్రప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకవైపు ప్రైవేటు వర్సిటీల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా మరోవైపు దానిని విరమించుకోవాలంటూ విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు వర్సిటీలవల్ల రాష్ట్రంలో ఉన్నత విద్య కూడా కార్పొరేట్ విద్యాసంస్థల చేతుల్లోకి వెళ్లిపోతుందనే ఆందోళన క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్య కార్పొరేట్ విద్యాసంస్థల అధీనంలో కి పూర్తిగా వెళ్లిపోయింది. ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఇంటర్ విద్యను శాసిస్తుండడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు క్రమంగా కనుమరుగయ్యే దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీలు ఏర్పాటైతే ఉన్నత విద్య కూడా కార్పొరేట్పరమయ్యే పరిస్థితి నెలకొంటుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల కోసమేనా... అసలు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటే కార్పొరేట్ విద్యా సంస్థల కోసమన్న వాదన బలంగా వినిపిస్తోంది. కొందరు కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. పలు విద్యా సంస్థలకు చెందిన వ్యక్తులు ప్రభుత్వానికి బాగా దగ్గరగా ఉన్నారు. ఎన్నికల్లో వీరంతా టీడీపీకి అన్ని విధాలుగా సహకరించారనే విమర్శలున్నాయి. వీరి ఒత్తిడి వల్లే ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు దిశగా చకచకా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతోపాటు మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ యూనివర్సిటీల ఏర్పాటుతో ఉన్నత విద్య పురోగమిస్తుందని పదేపదే చెబుతుండడం గమనార్హం. ఈ యూనివర్సిటీలింతేనా.. రాష్ట్రంలో ఇప్పటికే 20 ప్రభుత్వ యూనివర్సిటీలున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉన్నత విద్యను పేదలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో జిల్లాకో యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ క్రమంలోనే కృష్ణా, నన్నయ, వేమన తదితర వర్సిటీలు ఏర్పడ్డాయి. అయితే వాటిల్లో చాలావరకూ ఇంకా బాలారిష్టాలతో సతమతమవుతున్నాయి. మౌలిక సదుపాయాలు లేకపోవడం, బోధన సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని వర్సిటీలకైతే ఇంతవరకూ పూర్తిస్థాయి క్యాంపస్‌లు కూడా సమకూరలేదు. భూములు లేనందున మచిలీపట్నంలోని కృష్ణా వర్సిటీ ఇంకా ఆంధ్ర జాతీయ కళాశాలలోనే కొనసాగుతోంది. ఈ వర్సిటీలను పట్టించుకోని ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీలకోసం తపిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొత్తగా 11 కేంద్ర విద్యా సంస్థలు రాష్ట్రంలో ఏర్పా టు కానున్నాయి. ఉన్న వర్సిటీల్లో సమస్యలను పరిష్కరించి గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకుంటే.. వాటితోపాటు కొత్తగా వచ్చే విద్యా సంస్థలతో రాష్ట్రంలో ఉన్నత విద్యను పటిష్టంగా మలి చే వీలుంది. కానీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా ప్రైవేటు వైపు అడుగులేస్తుండడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. -
కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవ సభ
రాజకీయ నేతల భాషాజాలంలో మార్పు రావాలి నిత్య విద్యార్థిగా ఉంటేనే బంగారు భవిత కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవ సభలో జస్టిస్ పీసీ రావు ఘనంగా వర్శిటీ రెండో స్నాతకోత్సవం సాక్షి, విజయవాడ : సమాజంలోని వాస్తవికతను గుర్తించి దానికి అనుగణంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అంతర్జాతీయ సముద్ర జల ట్రిబ్యునల్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ పత్తిబండ్ల చంద్రశేఖర్‌రావు (జర్మనీ) సూచించారు. నిరంతర అధ్యయనం, సునిశిత పరిశీలన, నిత్య విద్యార్థిగా ఉండటం ద్వారానే సమాజంలో విద్యార్థులు రాణించగలుగుతారన్నారు. శుక్రవారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణా యూనివర్శిటీ రెండో స్నాతకోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తొలుత విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో జన్మించిన తాను కృష్ణా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ అందుకోవటం ఆనందంగా ఉందన్నారు. డిగ్రీలు అందుకుని నూతన జీవితంలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులు తమ సామాజిక బాధ్యతను విస్మరించకుండా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా అనేక చట్టాలు చేస్తున్నాయని, దీని ఆధారంగానే సామాజిక మార్పు వస్తుందని అందరు భావిస్తున్నారని చెప్పారు. కానీ, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించటంతోపాటు వాటిని అమలు చేస్తేనే కొంతైనా మార్పు వస్తుందన్నారు. అమలులో ఉన్న చట్టాల ప్రకారం ఎవరు పనిచేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోటారు వాహనాల చట్టాన్ని పాటిస్తే ట్రాఫిక్ జామ్‌తో పాటు ప్రమాదాలు తగ్గుతాయని హితవు పలికారు. తాను 1988 నుంచి 1996 వరకు ఆరుగురు ప్రధానమంత్రుల వద్ద పనిచేశానని, ఆ సమయంలో న్యాయశాస్త్ర అభ్యున్నతి కోసం ఎంతగానో శ్రమించానని చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాజకీయ నేతల భాషాజాలం సక్రమంగా లేదని, విమర్శలు చేసేందుకు ఉపయోగించే భాష అభ్యంతరకరంగా ఉందని, ఇది సమాజంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. న్యాయమూర్తుల నియామకాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు కొలిజియం జడ్జీలతో కమిటీ ఉందని, దీని స్థానంలో నేషనల్ జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనలు చట్టసభల ద్వారా వస్తున్నాయని చెప్పారు. వర్శిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పి.వెంకయ్య మాట్లాడుతూ ఆరేళ్ల కిందట ఆవిర్భవించిన కృష్ణా వర్శిటీ అంచెలంచెలుగా ముందుకు సాగుతోందని, రెండో స్నాతకోత్సవంలో 16వేల మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తున్నామని చెప్పారు. పీజీ, డిగ్రీ కోర్సులతోపాటు క్రీడలు, ఎన్ఎస్ఎస్, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నామని వర్శిటీ ప్రగతి నివేదిక వివరించారు. రుద్రవరంలో 71.75 కోట్లతో భవనాలు నిర్మించనున్నామని చెప్పారు. అనంతరం జస్టిస్ పీసీ రావును యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు. స్నాతకోత్సవంలో కళాశాల విద్య రాష్ట్ర కమిషనర్ కె.సునీత, వర్శిటీ డీన్లు ప్రొఫెసర్ డి.సూర్యచంద్రరావు, ఎంవీ బసవేశ్వరరావు, వైకే సుందరకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంఏ తెలుగు విభాగంలో కొల్లూరి కల్పన, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మల్లాది దీప్తిలకు బంగారు పతకాలు బహూకరించారు. -
నేడు కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవం
16 వేల మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం ముఖ్యఅతిథిగా జర్మనీ న్యాయమూర్తి పి.సి.రావు రాక మూడు బంగారు పతకాలు విద్యార్థినులకే వైస్ చాన్సలర్ ఆచార్య వి.వెంకయ్య వెల్లడి సాక్షి, విజయవాడ : కృష్ణా యూనివర్సిటీ చరిత్రలోనే ప్రథమంగా పీజీ విద్యార్థులతోపాటు డిగ్రీ విద్యార్థులకు స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తున్నామని వైస్ చానల్సర్ ఆచార్య వి.వెంకయ్య చెప్పారు. గురువారం స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో స్నాతకోత్సవ వివరాలను వెల్లడించారు. ఆరేళ్ల కిందట ఆవిర్భవించిన యూనివర్సిటీ 2012 డిసెంబర్ 9న మొదటి స్నాతకోత్సవం జరుపుకొందని, శుక్రవారం రెండో స్నాతకోత్సవం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని వివరించారు. వర్సిటీలో ఇంజినీరింగ్, మెడిసిన్ మినహా అన్ని డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయని తెలి పారు. ఈ ఏడాది 16 వేల మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తున్నామని, వీరిలో 2,276 మంది పీజీ విద్యార్థులు, 14,286 మంది డిగ్రీ విద్యార్థులు ఉన్నారని వివరించారు. ఈసారి డిగ్రీ విద్యార్థులకు కూడా స్నాతకోత్సవంలో పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. పాస్ పర్సెంటేజ్లో విద్యార్థినులే అధికంగా ఉన్నారన్నారు. పీజీ కోర్సులో ఎం.ఫార్మసీ, ఎంఏ తెలుగు, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ తదితర కోర్సుల్లో మూడు బంగారు పతకాలు ప్రదానం చేస్తున్నామని, వీటికి విద్యార్థినులే ఎంపికయ్యారని వివరించారు. విజయవాడలో స్నాతకోత్సవం ... విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో వర్సిటీ స్నాతకోత్సవం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. ముఖ్య అతిథిగా జర్మనీ దేశంలోని హేంబర్గ్‌లో ఉన్న అంతర్జాతీయ సముద్ర జల ట్రిబ్యునల్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ పి.చంద్రశేఖర్‌రావు (పి.సి.రావు) ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. బంగారు పతక విజేతలు.. ఎంఫార్మసీలో బండి సుస్మితకు, ఎంఏ తెలుగు విభాగంలో కొల్లూరి కల్పనకు, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో మల్లాది దీప్తికి బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర గవర్నర్ పర్యటన ఇంకా ఖరారు కావాల్సి ఉందని చెప్పారు. -
ఎన్నాళ్లీ కష్టాలు
బాలారిష్టాలు దాటని కృష్ణా యూనివర్సిటీ సొంత భవనాలు లేవు ప్రొఫెసర్లు, సిబ్బంది కొరత హాస్టళ్లు, ల్యాబ్ సౌకర్యాలు నిల్ రేపు ద్వితీయ స్నాతకోత్సవం మచిలీపట్నం : ఉన్నత ఆశయంతో ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా కృష్ణా యూనివర్సిటీ మాత్రం బాలారిష్టాలను దాటడం లేదు. భూమి కేటాయించినా, నిధులు మంజూరు చేసినా పాలకుల నిర్లక్ష్యం కారణంగా యూనివర్సిటీకి సొంత భవనాల నిర్మాణం కలగానే మిగిలింది. యూనివర్సిటీ పరిధిలో జిల్లాలోని 143 కళాశాలలు ఉన్నాయి. నూజివీడులో పీజీ సెంటర్ ఉంది. యూనివర్సిటీని ప్రొఫెసర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. 42 మంది ప్రొఫెసర్లకు గానూ కేవలం 21 మంది మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. 50 మంది సిబ్బందికి గానూ ఇద్దరే పర్మినెంటు ఉద్యోగులు ఉన్నారు. మరో 15 మంది అవుట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్నారు. స్థలం, నిధులు కేటాయించినా... జిల్లాకో యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశంతో 2008, ఏప్రిల్ 23వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మచిలీపట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. వైఎస్ మరణానంతరం యూని వర్సిటీని పట్టించుకునే వారే కరువయ్యారు. వర్సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు బందరు మండలం రుద్రవరంలో 102 ఎకరాలు, గూడూరు మండలంలో 44 ఎకరాలు, ప్రస్తుతం యూనివర్శిటీ నడుస్తున్న ఆంధ్ర జాతీయ కళాశాల ప్రాంగణంలో 24 ఎకరాలను కేటాయించారు. భవనాల నిర్మాణానికి రూ.70 కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ విభాగం నిపుణులు భవనాల నిర్మాణానికి నమూనాలు తయారు చేశారు. అయినప్పటికీ భవన నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కావటం లేదు. ఏడాది క్రితం భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన యూనివర్శిటీ పాలకులు అనంతరం ఆ విషయాన్ని మరిచిపోయారు. అయితే గత ఐదేళ్లుగా యూనివర్శిటీ భవనాల నిర్మాణంపై ఎవరూ దృష్టిసారించటం లేదు. యూనివర్శిటీకి భవనాల నిర్మాణానికి బిల్డింగ్ అడ్వయిజరీ ఎక్స్పర్ట్ కమిటీని నియమించినా ఫలితం లేకపోయింది. హాస్టల్ భవనాలు, ల్యాబ్‌లు లేవు యూనివర్శిటీ అభివృద్ధి చెందాలంటే హాస్టల్ భవనాలు ఉండాలి. విద్యార్థినులు, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ కోసం మూడు వేర్వేరు హాస్టల్స్ ఉండాలి. ఆరేళ్లు గడుస్తున్నా హాస్టల్ భవనాల నిర్మాణం ఊసే లేదు. ఆంధ్ర జాతీయ కళాశాల భవనంలోని 20 గదుల్లో, నిర్మలా కాన్వెంట్ సమీపంలోని ఓ భవనంలో యూనివర్శిటీని నడుపుతున్నారు. తరగతి గదులనే ల్యాబ్‌లుగా మార్చారు. ఆర్గానిక్ కెమెస్ట్రీ విభాగంలో ప్రస్తుతం 60మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్, ఫిజికల్ కెమీస్ట్రీ, ఇన్స్ట్రుమెంటేషన్ కోసం నాలుగు ప్రత్యేక ల్యాబ్‌లు ఉండాలి. ఉన్న ఒకే ల్యాబ్‌ను ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం రెండో సంవత్సరం విద్యార్థులకు ఉపయోగిస్తున్నారు. బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, ఎం.ఫార్మసీ విభాగాలకు తరగతి గదులు లేవు. వారికి ల్యాబ్‌లనే తరగతి గదులుగా ఉపయోగిస్తున్నారు. గత ఏడాది ఎం.ఫిల్, పీహెచ్‌డీలో అభ్యర్థులను చేర్చుకున్నారు. వీరికి ప్రత్యేక వసతి గృహం, ల్యాబ్‌లు అవసరం. స్కాలర్స్‌కు యూనివర్శిటీలో పాఠ్యాంశాలు బోధించే అవకాశం కల్పించి వారికి నెలకు కొంత మొత్తాన్ని అందజేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ యూనివర్శిటీలో అమలుకావటం లేదు. పరీక్షల విభాగానికి ప్రత్యేక గది కేటాయించాల్సి ఉండగా, తరగతి గదినే ఇందుకు ఉపయోగిస్తున్నారు. పరీక్షల విభాగంలో రెగ్యులర్ ప్రొఫెసర్లకు బదులు, అవుట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్న ప్రొఫెసర్లే విధులు నిర్వర్తిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ప్రొఫెసర్లు క్లాసులు చెప్పిన అనంతరం కూర్చునేందుకు ఒక టేబుల్, కుర్చీ కూడా ఇవ్వకపోవటం ఇక్కడ దుస్థితికి నిదర్శనం. హాస్టల్ భవనాలు, లేబొరేటరీలు సక్రమంగా లేకపోవటంతో ఈ యూనివర్శిటీలో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. భవనాల నిర్మాణం ప్రశ్నార్థకమే.. యూనివర్శిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రుద్రవరం గ్రామంలో 102 ఎకరాలను కేటాయించింది. ఇక్కడే రూ. 70 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మిస్తామని ఈ నెల 21వ తేదీన యూనివర్శిటీ వీసీ వున్నం వెంకయ్య వెల్లడించారు. వర్షాకాలం కావటంతో ఇక్కడ భవనాలు నిర్మించేందుకు అవకాశం లేదు. ఈ 102 ఎకరాల్లో మూడువేల మీటర్ల మేర ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది మట్టి రోడ్లను నిర్మించారు. యూనివర్శిటీకి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఈ భూమి అభివృద్ధి కోసం ఖర్చు చేయకపోవటం గమనార్హం. ఈ భూమి లోతట్టు ప్రాంతంలో ఉండటంతో వర్షాకాలంలో నీరు నిలబడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భవనాల నిర్మాణం ఎలా చేపడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. గవర్నర్ దృష్టి సారిస్తే మేలు కృష్ణా వర్సిటీ మొదటి స్నాతకోత్సవం 2012, డిసెబర్ 9వ తేదీన నిర్వహించారు. రెండో స్నాతకోత్సవాన్ని ఆగస్టు ఒకటో తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా యూనవర్శిటీకి ప్రాధాన్యత పెరిగింది. అయినప్పటికీ అటు యూనివర్శిటీ ప్రతినిధులు, పాలకులు ఈ యూనివర్శిటీని అభివృద్ధి చేసేందుకు ఇప్పటి వరకు ఏ మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో ద్వితీయ స్నాతకోత్సవానికి యూనివర్సిటీ కులపతి హోదాలో హాజరువుతున్న గవర్నర్ నరసింహన్ అన్ని అంశాలపై దృష్టిసారించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. గవర్నర్ దృష్టిసారించి యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
1న కేయూ ద్వితీయ స్నాతకోత్సవం
గవర్నర్ నరసింహన్ రాక వీసీ వెంకయ్య మచిలీపట్నం : కృష్ణా విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవ వేడుకలను 1వ తేదీన నిర్వహించనున్నట్లు కృష్ణా విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్ వున్నం వెంకయ్య తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయంలోని ఆయన చాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం 4గంటలకు ద్వితీయ స్నాతకోత్సవం ప్రారంభమవుతుందన్నారు. స్నాతకోత్సవ వేడుకలకు కృష్ణా యూనివర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ సీఎస్ఎల్.నరసింహన్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. ముఖ్యఅతిథిగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత జస్టిస్ డాక్టర్ పి.చంద్రశేఖర్‌రావు పాల్గొంటారన్నారు. స్నాతకోత్సవంలో మొత్తం 16,562 మంది పట్టభద్రులకు సర్టిఫికెట్లు ఇస్తారన్నారు. పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 2,276 మంది, గ్రాడ్యుయేషన్‌లో 14,286 మందికి పట్టాలు అందిస్తామన్నారు. ఈ స్నాతకోత్సవంలో ముగ్గురికి ముఖ్యఅతిథి చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. గూడపాటి మంగరాజు అందిస్తున్న గోల్డ్‌మెడల్‌ను కొల్లూరి కల్పనకు, కోటేశ్వరరావు అందిస్తున్న గోల్డ్‌మెడల్‌ను మల్లాది దీప్తికి, సంజిత్‌నాధ్ అందిస్తున్న గోల్డ్‌మెడల్‌ను బండి సుస్మితకు అందజేస్తారని చెప్పారు. పది వారాల్లో భవన నిర్మాణ పనులు... మరో పది వారాల్లో విశ్వవిద్యాలయం భవన నిర్మాణాలు పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని వైస్‌చాన్సలర్ వున్నం వెంకయ్య అన్నారు. రూ. 70 కోట్లతో ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే యూనివర్సిటీ భవనాలు నిర్మించే ప్రాంగణంలో నీటి సౌకర్యం కోసం రెండున్నర ఎకరాల విస్తీర్ణం గల చెరువును ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించామన్నారు. త్వరలో మచిలీపట్నంలో విశ్వవిద్యాలయ స్థాయిలో పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వీసీ తెలిపారు. కృష్ణా యూనవర్సిటీ రిజిష్ట్రార్ సూర్యచంద్రరావు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యకు ప్రణాళిక
కృష్ణా వర్సిటీ వీసీ వెల్లడి నాలుగు నెలల పాటు సెమినార్లు, వర్క్‌షాపుల నిర్వహణ మచిలీపట్నం, న్యూస్‌లైన్ : కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రణాళిక రూపొందించామని వర్సిటీ వీసీ వున్నం వెంకయ్య తెలిపారు. స్థానిక తన చాంబర్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వర్సిటీ పరిధిలోని 144 కళాశాలలు, వర్సిటీ క్యాంపస్, నూజివీడులోని పీజీ సెంటర్ ద్వారా నాణ్యమైన విద్యనందించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలోని కేవీఎస్ఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్‌లో రెండురోజుల పాటు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామన్నారు. కృష్ణా వర్సిటీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సీహెచ్ఈ) సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎసెస్మెంట్ అండ్ ఎక్రిడిటేషన్ ఏ టూల్ టు ఎన్హేన్స్ క్వాలిటీ అండ్ ఎక్సలెన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై ఈ వర్క్‌షాప్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి కళాశాలలోనూ నాణ్యతతో కూడిన విద్యనందించటం కళాశాలలో ఉన్న సౌకర్యాలు గుర్తించటం, అటానమస్ కళాశాలలుగా గుర్తింపు ఎలా పొందాలి తదితర అంశాలపై విద్యారంగంలో నిష్ణాతులు ప్రసంగిస్తారని చెప్పారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు కార్యక్రమాలు... ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలోని ఎస్డీఎంఎస్ఎం కళాశాలలో ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ 21 సెంచరీ’ అనే అంశంపై కృష్ణా యూనివర్సిటీ అనే అంశంపై రెండు రోజుల పాటు సెమినార్ నిర్వహించనున్నట్లు వీసీ చెప్పారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో కృష్ణా వర్సిటీ బయోటెక్నాలజీ విభాగంలో ‘కాన్సెప్ట్వల్ అడ్వాన్సెస్ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ ప్లాంట్ డెలివర్డ్ డ్రగ్స్ ఆన్ హ్యూమన్ డిసీజెస్’ అనే అంశంపై జాతీయస్థాయి సెమినార్ ఈ నెల 21, 22 తేదీల్లో జరుగుతుందన్నారు. మార్చి 27, 28 తేదీల్లో కృష్ణా యూనివర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో క్యాంపస్‌లో ప్రత్యేక సెమినార్ జరుగుతుందన్నారు. ఏప్రిల్‌లో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో జాతీయస్థాయి సెమినార్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జాతీయస్థాయి సెమినార్‌ను నిర్వహించేందుకు యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్ణయించామన్నారు. తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘కృష్ణాజిల్లాలో జానపద కళారీతులు - ఉపన్యాసపూర్వక ప్రదర్శన’ ఉంటుందని చెప్పారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో ‘ప్రసార మాధ్యమాల్లో తెలుగు’ అనే అంశంపై రెండు రోజుల పాటు సదస్సు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర అధికారిక భాషా సంఘం ఆధ్వర్యంలో మార్చి మూడో వారంలో వర్సిటీ క్యాంపస్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ విద్యాసంవత్సరంలో వర్సిటీ కొత్త కోర్సులు... 2014-15 విద్యాసంవత్సరం నుంచి యూనివర్సిటీ పరిధిలో నూతన కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వీసీ తెలిపారు. ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎంబీఏ ఇన్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్, ఎమ్మెస్సీ ఇన్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ఇన్ ఇనార్గిన్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ఇన్ ఆప్టో ఎలక్ట్రానిక్స్, షార్ట్ టర్మ్ కోర్స్ ఇన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సర్టిఫికెట్/డిప్లమో ప్రోగ్రాం ఇన్ యోగా అనే కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఎమ్మెస్సీ ఇన్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ కోర్సును విజయవంతంగా నడిపేందుకు మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీతో టై అప్ అయినట్లు వివరించారు. ఈ కోర్సు ప్రవేశపెట్టేందుకు సోమవారమే బెల్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డి.సూర్యచంద్రరావు, పీఆర్వో సీఎం వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యుత్తమం భారతీయ సంస్కృతి
వన్‌టౌన్, న్యూస్‌లైన్ : ప్రపంచానికే భారతీయ సంస్కృతి దిక్సూచి వంటిదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అంత మహోన్నతమైన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడానికి విద్యార్థులంతా కంకణం కట్టుకోవాలని కోరారు. మూడు రోజుల పాటు జరిగే కృష్ణా విశ్వవిద్యాలయం ‘కృష్ణాతరంగ్-2013’ అంతర్ కళాశాల యువజనోత్సవాలు శనివారం కేబీఎన్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. జ్యోతి వెలిగించి యువజనోత్సవాలను వెలంపల్లి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి యావత్ సాంస్కృతిక రంగంలోనే ఇమిడి ఉందన్నారు. ముఖ్యఅతిథిగా హజరైన విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ ఆచార్య డీ.సూర్యచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న కళాత్మకతను వెలికి తీసేందుకే విశ్వవిద్యాలయం ప్రతి ఏటా కృష్ణాతరంగ్ పేరుతో యువజనోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుందన్నారు. యువజనోత్సవాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు ఈ మూడు రోజుల పాటు వివిధ సాహితీ, సాంస్కృతిక, వైజ్ఞానిక అంశాల్లో తమ ప్రతిభను చాటి చెప్పనున్నారని చెప్పారు. గౌరవ అతిథిగా హజరైన ఉన్నత విద్యాశాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ గీతాంజలి మాట్లాడుతూ యువత నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలను సద్వినియోగించుకుని మరింత ఉన్నతస్థానాలకు చేరుకోవాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన నూజివీడు పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.బసవేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలు అన్ని రంగాల్లోనూ ప్రతిభను ప్రదర్శిస్తూ తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటుతున్నారన్నారు. ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో అనేక మంది ప్రముఖులను జల్లా అందించిందని చెప్పారు. అటువంటి సాంస్కృతిక రంగంలో యువత సైతం అద్భుత ప్రతిభను కనబరుస్తూ ముందుకు సాగడం అభినందనీయమని చెప్పారు. విశ్వవిద్యాలయం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరకృష్ణ, హిందూహైస్కూల్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, కేబీఎన్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు ఉప్పల సాంబశివరావు తదితరులు ప్రసంగించారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు... కృష్ణాతరంగ్-2013 అంతర్ కళాశాలల యువజనోత్సవ పోటీల్లో తొలి రోజు శనివారం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వివిధ పోటీల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, జాతీయ బృందగానం, పాశ్చాత్య బృందగానం, క్విజ్ ప్రిలిమ్స్, స్పాట్ ఫొటోగ్రఫీ, క్లేమోడలింగ్, శాస్త్రీయ నృత్యం, జానపద వాద్యం, వక్తృత్వం తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. విజయవాడ, మచిలీపట్నం, తిరువూరు, మొవ్వ, ఉయ్యూరు. నందిగామ, నూజివీడు తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పోటీలకు హజరయ్యారు. -
యువతపైనే దేశ భవిష్యత్ : సీపీ
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉంటుందని నగర పోలీసు కమిషనర్ బీ శ్రీనివాసులు అన్నారు. స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాలలోకృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, క్రీడల్లో రాణించిన వారికి పేరు ప్రఖ్యాతులొస్తాయని తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటాయన్నారు. కేవలం చదువే కాకుండా క్రీడల్లో ప్రవేశం ద్వారా పనిలో వత్తిడి తగ్గుతుందన్నారు. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని చెప్పారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆటల్లో రాణించి దేశ ఉన్నత పదవులు చేపట్టినవారెందరో ఉన్నారన్నారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్ .శ్రీనివాసరావు మాట్లాడుతూ సిద్ధార్థ అకాడమీ క్రీడాకారులకు కావాల్సిన మౌలిక సదుపాయలు కల్పిస్తుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మారావు మాట్లాడుతూ సాధించాలనే పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాశాల పీడీ పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.సజీవరెడ్డి, అకాడమీ పరిపాలనా అధికారి వై.చక్రధర్‌రావు, డెరైక్టర్ వీ బాబూరావు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మహిళల విభాగంలో మేరిస్ స్టెల్లా కళాశాల, ఎస్వీడీ లా కళాశాల జట్లు ఫైనల్స్‌కు చేరుకోగా, పురుషుల విభాగంలో డీఏఆర్ కళాశాల (నూజివీడు), పీబీ సిద్ధార్థ కళాశాల జట్లుఫైనల్స్కు చేరుకున్నాయి. లీగ్ మ్యాచ్ లు: పురుషుల విభాగంలో ఆంధ్ర లయోల కళాశాల జట్టు 3-0 తేడాతో ఎస్జీఎస్ కళాశాల (జగ్గయ్యపేట)పై, నలందా డిగ్రీ కళాశాల 3-0 తేడాతో శాతవాహన కళాశాలపై, డీఏఆర్ కళాశాల (నూజివీడు) 3-1 తేడాతో మడోనా కళాశాల జట్టుపై, పీబీ సిద్ధార్థ కళాశాల 3-0 సప్తగిరి కళాశాల జట్టుపై, ఆంధ్ర లయోలా కళాశాల జట్టు 3-0 తేడాతో కేబీఎన్ కళాశాల జట్టుపై గెలుపొందాయి. నూజివీడు డీఏఆర్ కళాశాల జట్టు 3-1 తేడాతో ఆంధ్ర లయోల కళాశాలపై, పీబీ సిద్ధార్థ జట్టు 3-0 తేడాతో విశ్వభారతి డిగ్రీ కళాశాల (జగ్గయ్యపేట)జట్టుపై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మహిళల విభాగంలో..నందిగామ కేవీఆర్ కళాశాల జట్టు 2-0 తేడాతో నలందా డి గ్రీ కళాశాలపై, ఆంధ్ర లయోల కళాశాల జట్టు 2-0 తేడాతో పీబీ సిద్ధార్థ కళాశాలపై, ఎస్వీడీ లా కళాశాల జట్టు 2-0 తేడాతో గుడివాడ ఏఎన్ఆర్ డిగ్రీ కళాశాల జట్టుపై, సిద్ధార్థ మహిళా కళాశాల జట్టు 2-0 తేడాతో నూజివీడు డీఏఆర్ కళాశాల జట్టుపై, స్టెల్లా కళాశాల జట్టు 2-0 తేడాతో నందిగామ కేవీఆర్ కళాశాల జట్టుపై, ఎస్వీడీ లా కళాశాల జట్టు 2-1 తేడాతో సిద్ధార్థ పై గెలుపొందాయి.