ముసుగు మ్యూజిక్.. హౌస్ ఫుల్..
సాక్షి,వీకెండ్: ‘ముసుగు వేయొద్దు మనసు మీద...’ అంటూ ఓ తెలుగు సినీ రచయిత చెబితే... ‘ముసుగు వేస్తాను ముఖం మీద..’ అంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు మార్ష్ మెల్లో. యూరోపియన్ డీజే మార్‌్షమెల్లో ముసుగు వీరుడు. ఇప్పటిదాకా మాస్క్ తీయకుండా ప్లే చేసిన ఈ డీజే ఎవరు? ఎలా ఉంటాడనేది ఫుల్ సస్పెన్స్. నగరంలో నిర్వహించనున్న సన్‌బర్న్ 10వ ఎడిషన్ ఈవెంట్ ఈసారి మోసుకొస్తున్న సంచలనం ఇది.
– ఎస్.సత్యబాబు
అత్యంత భారీ మ్యూజికల్ ఈవెంట్‌గా ప్రసిద్ధి చెందిన సన్‌బర్న్ మరోసారి నగరంలో సందడి చేయనుంది. ఎప్పుడూ సిటీలోని పార్టీ ప్రియుల మధ్య టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఉండే సన్‌బర్న్ ఈ సారి కూడా తన దైన శైలిలో ఆసక్తి రేపుతోంది. మాదాపూర్ హైటెక్స్‌లో శనివారం నిర్వహించనున్న ఈ ఈవెంట్లో మంత్రముగ్ధుల్ని చేసే ఎస్ఎఫ్ఎక్స్ ఒక స్పెషల్.
డీజేల ధమాకా.. మాస్క్‌మ్యాన్ తడాఖా
ప్రపంచ ప్రసిద్ధ డీజే ద్వయం డీవీఎల్‌ఎం ఈ ఈవెంట్లో పాల్గొననుండడం విశేషం. తొలిసారి నగరానికి వస్తున్న ఈ బెల్జియానికు చెందిన ఇద్దరు డీజేలు డిమిత్రి వెగాస్, లైక్మైక్లకు ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్కు సంబంధించి ట్రాక్స్‌ను కదం తొక్కించడంలో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. వీరిద్దరు మాత్రమే కాకుండా మాస్క్ వేసుకొని మ్యూజిక్ ప్లే చేసే డీజే మార్‌్షమెల్లో సైతం సిటీకి వస్తుండడం మరో విశేషం. ఇప్పటిదాకా అతనెలా ఉంటాడనేది? ఎవరికీ తెలీదు.
అదొక మిస్టరీ. యూరోపియన్ డీజేలలోనే లేటెస్ట్ సెన్సేషన్‌గా మారిన మార్‌్షమెల్లో ఇండియాకి రావడం ఇదే మొదటిసారి. పూర్తిగా తల భాగాన్ని కవర్ చేస్తూ ఆయన ధరించే హెడ్ కవరింగ్ యాక్ససరీని మార్‌్షమెల్లో హెల్మెట్ అంటారు. గతేడాది ఆన్లైన్ ద్వారా మ్యూజిక్ ట్రాక్స్ విడుదల చేస్తూ బాగా పాపులరైన మార్‌్షమెల్లో... ‘జెడ్స్ బ్యూటీఫుల్ నవ్, జాక్ యూస్ వేర్ ఆర్ యూ నవ్’ లాంటి ట్రాక్స్‌ను రీమిక్స్ చేయడం ద్వారా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
బుకింగ్స్ ఫుల్...
సన్‌బర్న్ అంటేనే డీజే మ్యూజిక్. ఈసారి వెరైటీ డీజేలను సమర్పిస్తున్న సన్‌బర్న్ పార్టీ సంగీత ప్రియులను సంపూర్ణంగా అలరించనుందని, శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్ రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని ఈవెంట్ నిర్వాహక సంస్థ ఓలా ప్రతినిధి విజయ్ అమృత్‌రాజ్ చెప్పారు. ఈ ఈవెంట్‌కు కనీసం 8 నుంచి 10 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు.