medchal district
-
జీడిమెట్లలో కారు బీభత్సం.. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు
సాక్షి, మేడ్చల్ జిల్లా: జీడిమెట్లలో కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును ఢీకొట్టింది. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. కారును డ్రైవ్ చేస్తోన్న మహేష్ గౌడ్ అతివేగం, మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డును ఢీకొట్టాడు.కారులో మొత్తం ఆరుగురు విద్యార్థులే కాగా, ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయిన ఐదుగురు యువకులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతి చెందిన గోపి సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జీడిమెట్లలో రాజీవ్ గాంధీనగర్‌లో ఉంటున్నారు. -
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో కారు బీభత్సం
-
ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ హత్య కేసులో సంచలనం
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ లో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్‌ను కొందరు దుండగులు హత్య చేశారు. 2024, జూన్ 17వ తేదీ నుంచి మహేశ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా. గడ్డం మహేష్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. జేసీబీ సాయంతో ఘట్కేసర్ డంపింగ్ యార్డ్‌లో కారును పాతి పెట్టినట్లు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహం కోసం డంపింగ్ యార్డులో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మేడిపల్లి పీఎస్‌లో బండి సంజయ్‌పై కేసు
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బండి సంజయ్‌పై కేసు నమోదైంది. చెంగిచర్లలో పిట్టల బస్తి బాధితులను పరామర్శించడానికి బండి సంజయ్, అతని అనుచరులు రాగా, పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో కింద పడిన నాచారం సీఐ నందిశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. సీఐ ఫిర్యాదుతో బండి సంజయ్‌తో పాటు మరో పది మందిపై 332, 353, 143, 149 ఐపీసీ 3, 4పీడీపీపీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్ ఎంపీగా సానియా మీర్జా పోటీ?! -
పదేళ్లలో మేడ్చల్‌పై పట్టుసాధించిన మర్రి, మల్లారెడ్డి
మేడ్చల్: తమ వ్యాపారాలతో మేడ్చల్ జిల్లాకు ప్రవేశించిన మామా అల్లుళ్లు పదేళ్ల క్రితం రాజకీయరంగ ప్రవేశం చేసి ప్రతికూల పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి మేడ్చల్‌పై పట్టు సాధించారు. మేడ్చల్ మండలం మైసమ్మగూడ, కండ్లకోయ, శివార్లలోని బోయిన్పల్లి, సూరారంలో మల్లారెడ్డి విద్యాసంస్థలు, మెడికల్ కళాశాలలు, ఆస్పత్రులు, ఫంక్షన్‌హాళ్లు, వివిధ రకాల వ్యాపారాలు చేసి పదేళ్ల క్రితం వరకు వ్యాపారవేత్తగా పేరుగాంచారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మేడ్చల్ పక్కనే ఉన్న దుండిగల్ మండలంలో ఇంజినీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాల, వివిధ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి మామ చాటు వ్యాపారవేత్తగా ఎదిగారు. 2014లో మల్లారెడ్డి అనూహ్యంగా టీడీపీలో చేరి మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. కేవలం వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మల్లారెడ్డి పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బీఆర్ఎస్లో చేరారు. 2018లో మేడ్చల్ బీఆర్ఎస్ టికెట్ సాధించి అసెంబ్లీకి ఎన్నికై తన బలంతో మంత్రి అయ్యారు. అదే సమయంలో తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇప్పించి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో అల్లుడు ఓడిపోయినా జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సహకరించకపోయినా అల్లుడిని తన వెంట బెట్టుకుని మేడ్చల్ కేంద్రంగా రాజకీయం నడిపాడు. తాను మంత్రిగా ఉంటూ అల్లుడికి లోకల్ రాజకీయాలు అప్పగించి రాజకీయం నుంచి దూరం కాకుండా మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి పదవి ఇప్పించి ఫుల్ టైం రాజకీయ నాయకుడిని చేశారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. రాజకీయంలో అందివచి్చన ప్రతి అవకాశాన్ని మల్లారెడ్డి, ఆయన కుటుంబం ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ రాజకీయ జీవితంలో సక్సెస్ అయ్యారు. అల్లుడు పార్లమెంట్ ఇన్చార్జిగా, పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉంటూ రాజకీయం తన కుటుంబం దాటకుండా చూసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఖరారైనా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి వ్యవహారంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆచితూచి అడుగులేసిన మల్లారెడ్డి చాకచక్యంగా తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి బీఆర్ఎస్ టికెట్ సాధించాడు. ఒకవైపు మేడ్చల్‌లో తాను పోటీచేస్తూ మరోవైపు మల్కాజిగిరిలో అల్లుడిని పోటీలోకి దింపి ఇద్దరు ఎమ్మెల్యేలు కావడంతో ఐదు నియోజకవర్గాల్లో రెండింటిలో మామా అల్లుళ్లు గెలిచి జిల్లాపై పూర్తి పట్టుసాధించారు. ఇద్దరు వ్యాపారులు కావడం, ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకపోవడం, మంచి పేరు ఉండటం, ఇద్దరికీ కేసీఆర్, కేటీఆర్ దగ్గర నుంచి కార్యకర్త వరకు పూర్తిగా పలుకుబడి ఉండటం, ప్రధానంగా నాయకుల బలం, విద్యార్థుల బలం, మానవవనరులు పుష్కలంగా ఉండటంతో అన్నీ సద్వినియోగం చేసుకుని మేడ్చల్ జిల్లాలో మామా అల్లుళ్లు వ్యాపారం నుంచి మొదలై రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగి ఏ రంగంలోనైనా తమకు ఎదురులేదని నిరూపించుకున్నారు. జిల్లాలో ఉద్దండ రాజకీయ నాయకులు, ఏళ్లుగా రాజకీయం చేస్తున్నా మామా అల్లుళ్లు మాత్రం వారిని మట్టి కరిపించి తమకు తిరుగులేదని అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. తన మార్కు ఉండేలా 2018 వరకు మామచాటు అల్లుడిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఆ తర్వాత జిల్లాలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మార్కు ఉండేలా తమకు మద్దతు ఇచ్చిన వారికి మేయర్లు, చైర్మన్లు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పదవులు ఇచ్చుకుని వారిని తమ అనుచరులుగా మార్చుకున్నారు. తన మార్క్ రాజకీయం చేస్తూనే మామకు బంటుగా ఉండిపోయారు. మామ మంత్రిగా ఉన్నా అధికారం పూర్తిగా అల్లుడు తీసుకుని కావాల్సిన పనులన్నీ చేశారు. మొత్తం మీద మేడ్చల్ రాజకీయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా తమదే ఆధిపత్యం అని మామా అల్లుళ్లు మరోసారి నిరూపించుకున్నారు. -
మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు?
సాక్షి, మేడ్చల్ జిల్లా: బరిలో నిలిచేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? అనే చర్చ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఊపందుకుంది. అనూహ్యంగా అధికార బీఆర్ఎస్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీలో నిలిపే వారి పేర్లను ఖరారు చేయటంతో అభివృద్ధి కార్యక్రమాలతో పేరుతో ప్రచార హోరుతో ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని కొత్త వారికి ఇవ్వగా.. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్ ఇచ్చినప్పటికీ, తనయుడికి మెదక్ టికెట్ కేటాయించలేదని అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఇద్దరు సిట్టింగ్‌లు బీఆర్ఎస్లో ఇమడలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిలో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో పక్క అధికార పక్షం అభ్యర్థులకు దీటుగా.. విపక్షాలు ఎవరిని రంగంలోకి దింపుతాయనే ఉత్కంఠ అందరిలో ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలేంటి అన్న చర్చ కూడా జోరుగా సాగుతుండగా.. ఆ పారీ్టలకు చెందిన ఆశావహులు మాత్రం పలు రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ తమకే లభిస్తుందనే ధీమాతో వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోగా, అధిష్టానం వడపోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అధిష్టానం ప్రకటించినా.. తనయుడు రోహిత్‌కు మెదక్ టికెట్ కేటాయించలేదన్న అసంతృప్తితో మంత్రి హరీష్‌రావుపై నిప్పులు చెరిగారు. ఈ విషయంలో మైనంపల్లి తీరుపై సీఎం కేసీఆర్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రుగా ఉండగా, అధిష్టానం కూడా ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు బీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. బీఆర్ఎస్లో ఉండలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిని మైనంపల్లి ఎదుర్కొంటుండగా, అధిష్టానం కూడా మైనంపల్లిపై చర్యలకు సిద్ధపడకుండా మెత్తపడినట్లు ప్రచారం. ఒకవేళ అధిష్టానం మైనంపల్లి హన్మంతరావుపై సీరియస్‌గా వ్యవహరిస్తే.. మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి లేదా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును బరిలో దింపవచ్చనే చర్చ సాగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు నాయకులు దరఖాస్తు చేసుకున్నా పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌కే దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో ఇద్దరు అన్నె వెంకట సత్యనారాయణ, బోనగిరి సురేష్‌యాదవ్ ఉన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కొత్తగా పార్టీలో చేరిన ఆకుల రాజేందర్, యువమోర్చా నాయకుడు భానుప్రకాష్ పోటీ పడుతున్నారు. మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డికి మళ్లీ మేడ్చల్ టికెట్ దక్కడంతో బలమైన పోటీదారుడుగా ప్రచార పర్వంలో ముందువరుసలో ఉన్నారు. గడపగడపకూ కాంగ్రెస్ అనే నినాదంతో పీసీసీ ఉపాధ్యాక్షుడు తోటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం వీరితోపాటు రోయ్యపల్లి మల్లేష్‌గౌడ్, పిసరి మహిపాల్‌రెడ్డి, పి.బాలేష్, గువ్వ రవి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే తొటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే హరివర్ధన్‌రెడ్డికి దక్కవచ్చనే ప్రచారం ఆ పారీ్టలో సాగుతోంది. బీజేపీ నుంచి పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్‌రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రంరెడ్డితో సహా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉప్పల్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని, బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్కు అధిష్టానం టికెట్ కేటాయించడంతో కార్యకర్తల సమావేశాల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తానేని తప్పు చేశానో చెప్పకుండా.. టికెట్ నిరాకరించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి పది రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్న తీరుపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాత్రం ప్రజల మద్దతు పొందేందుకు అనుచరులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఉప్పల్ టికెట్ కోసం ఆరుగురు నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎం.పరమేశ్వర్‌రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మేకల శివారెడ్డి, పసుల ప్రభాకర్‌రెడ్డి, అమరిశెట్టి నరేందర్ ఉన్నారు. టికెట్ విషయంలో ముగ్గురి మధ్యే పోటీ ఉండగలదని పారీ్టలో ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటు మరో నాయకుడు పద్మారెడ్డి పోటీ పడుతున్నారు. అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వైపు మొగ్గు చూపవచ్చనే ప్రచారం పారీ్టలో సాగుతోంది. కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి కూకట్‌పల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ నుంచి కూకట్పల్లి టికెట్ కోసం 16 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో గొట్టిముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం, గాలివీర రామచంద్రబాలాజీ, పటోళ్ల నాగిరెడ్డి, వెలగపూడి వీవీస్ చౌదరి, మన్నె సతీష్‌కుమార్, ఆశపల్లి విజయచంద్ర, జాఫర్ అలీ, కొండకింది పుప్పారెడ్డి, దండుగుల యాదగిరి, మెడికొండ వెంకటమురళీ కృష్ణ, భక్త వత్సలం, జూలూరి ధనలక్ష్మీగౌడ్, పోట్లూరి శ్రీనివాస్‌రావు, దెరాటి మధుసాగర్, గొట్టిముక్కల పద్మరావు ఉన్నారు. కూకట్‌పల్లిలో బీజేపీ నుంచి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పి.హరీష్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు, కొత్తగా పార్టీలో చేరిన ప్రేమ్‌కుమార్ పోటీ పడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకాందగౌడ్‌కు బీఆర్ఎస్ మళ్లీ టికెట్ కేటాయించడంతో.. అభివృద్ధి పనుల పేరుతో ప్రజల వద్దకు వెళ్తుండగా, కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. నర్సారెడ్డి భూపతిరెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, కందాడి జ్యోత్సదేవి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, ఉసిరిక అప్పిరెడ్డి, మహ్మద్ నిజాముద్దీన్, గుంజ శ్రీనివాస్, బండి సత్యంగౌడ్, దూళిపాక సాంబశివరావు, పోలీసు సుమిత్రారెడ్డి, అహ్మద్ నిజామొద్దీన్, బోనగిరి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. -
అక్కకు 95, తమ్ముడికి 85
సుభాష్‌నగర్: సుదీర్ఘకాలంగా మంచానికే పరిమితమైన అక్కతో రాఖీ కట్టించుకొని ఆమె ముఖంలో ఆనందం నింపాడొక తమ్ముడు. సూరారం ప్రాంతానికి చెందిన అనసూయ (95) కొంత కాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. గురువారం రాఖీ పండుగ కావడంతో.. ఆమె సోదరుడైన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కోల ఈశ్వరయ్య (85) అక్క వద్దకు వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. సోదరుడు రాఖీ కట్టించుకోవడానికి రావడంతో అనసూయ కన్నీటి పర్యంతమైంది. తమ్ముడికి మిఠాయి తినిపించి ఆశీర్వచనాలు అందజేసింది. -
ఘట్కేసర్ శ్రీనిధి కాలేజీలో ఉద్రిక్తత.. ఫర్నిచర్, అద్ధాలు ధ్వంసం
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాలేజీ ఫర్నిచర్, అద్ధాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. వర్శిటీ గుర్తింపు వస్తుందంటూ వసూలు చేసిన డబ్బు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ స్టూడెంట్ కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కడంతో కలకలం రేగింది. తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకున్నారు. చదవండి: కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. కారణం ఇదే.. -
వివాహేతర సంబంధం.. భర్త హత్యకు ప్లాన్.. వైన్స్‌లో మందు కొని..
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడిన భార్య.. భర్తను హత్య చేసింది. వృత్తిరీత్యా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న కొట్టగొల్ల తుక్కప్ప(55) తన భార్యతో కలిసి సంగారెడ్డిలో జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య ఈశ్వరమ్మ ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అనారోగ్యంతో ఉన్న తుక్కప్పను మెరుగైన వైద్యం అంటూ కౌకూర్ దర్గా వద్దకు ఈశ్వరమ్మ తీసుకొచ్చింది. అనంతరం ఘట్కేసర్లో డాక్టర్ వద్దకు వెళ్దామని మాయ మాటలు చెప్పి యంనంపేట చౌరస్తాకు తీసుకొచ్చిన భార్య.. డాక్టర్ అందుబాటులో లేడని చెప్పింది. రోజు మద్యం సేవించే అలవాటు ఉన్న భర్తకు పక్కనే ఉన్న వైన్ షాప్‌లో మద్యాన్ని ఈశ్వరమ్మ కొనుగోలు చేసింది. చదవండి: మీ అమ్మాయికి ధనపిశాచి పట్టిందని.. బెడ్రూంలో గుప్తనిధులు..! ఘట్కేసర్ బస్టాండ్ సమీపంలో ఫెర్టిలైజర్ షాప్‌లో ఈశ్వరమ్మ ప్రియుడు శ్రీనివాస్ పురుగుల మందు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. రహస్యంగా మద్యంలో పురుగుల మందు కలిపిన భార్య.. భర్తకు తాగించింది. భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లేసరికి ఏమీ తెలియనట్టుగా పక్కనున్న వారి సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించిన భార్య ఈశ్వరమ్మ తరలిచింది. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం అసలు విషయం బయటకొచ్చింది. భార్య ఈశ్వరమ్మను, ప్రియుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
అల్లుడు పక్కా స్కెచ్.. భార్యను ఇంటికి పంపకపోవడంతో..
రంగారెడ్డినగర్(మేడ్చల్ జిల్లా): భార్యను ఇంటికి పంపేందుకు అత్తమామలు నిరాకరించడంతో కక్ష పెంచుకున్న అల్లుడు తన స్నేహితులతో కలిసి మామను హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.. పోలీసులు తెలిపిన మేరకు.. దుండిగల్ మున్సిపాలిటీ చర్చిగాగిల్లాపూర్‌కు చెందిన షేక్ నాసిర్ (31) అదే ప్రాంతానికి చెందిన రమేష్(37) కుమార్తె మహాలక్ష్మిని కిడ్నాప్ చేసి ముంబయ్‌కు తీసుకువెళ్లాడు. అనంతరం తన బంధువుల ఇంట్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో అప్పట్లో దుండిగల్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ క్రమంలో బెయిల్‌పై విడుదలైన నాసిర్ శిక్ష పడటం ఖాయమని భయపడి బాధితురాలు మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇరువురు చర్చిగాగిల్లాపూర్‌లోని సర్వే నెంబరు 214లో కాపురం పెట్టారు. అయితే పెళ్లైన రెండు నెలల పాటు వీరి సంసారం సజావుగా కొనసాగింది. అనంతరం భార్యపై అనుమానం పెంచుకున్న నాసిర్ తరచూ ఆమెను హింసించడం మొదలు పెట్టాడు. దీంతో మహాలక్ష్మి తండ్రి వద్దకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో భార్యను ఇంటికి పంపేందుకు నిరాకరించిన మామ రమేష్‌పై కక్షపెంచుకున్న నాసిర్ భార్యతో పాటు మామను సైతం చంపేందుకు పథకం పన్నాడు. తన స్నేహితులు కోటేశ్వరరావు(24), కంచేరి మహేందర్(22)లు మెదక్ జిల్లా గడ్డపోతారం నుండి నాలుగు కత్తులను తెచ్చుకుని హత్య చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 2022 డిసెంబరు 16న రమేష్ ఇంటికి వచ్చిన నాసిర్ భార్య మహాలక్ష్మిని ఇంటికి పంపాలని అడగగా నిరాకరించడంతో గొడవ పడ్డాడు. చదవండి: హైదరాబాద్‌లో మహిళా టీచర్ మిస్సింగ్.. అసలేం జరిగింది? ఈ క్రమంలో చర్చిగాగిల్లాపూర్‌లోని నిర్మానుష్య ప్రాంతం నుండి వెళ్తున్న రమేష్‌పై దాడి చేసి ఛాతి, వీపు భాగాల్లో కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న దుండిగల్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం నాసిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారం మేరకు మిగతా నిందితులు కోటేశ్వరరావు, కంచేరి మహేందర్లను సైతం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి మూడు కత్తులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు పంపారు. -
Artist Vijaya Lakshmi: సంకల్పానికి చిత్రరూపం
ఆమె చిత్రలేఖనంలో మనకు కనిపించేది ఒక రూపం కాదు... అనేకం. బుద్ధుడి బొమ్మలో కేవలం బుద్ధుడు మాత్రమే కాదు... బ్రష్ పట్టుకుని... తదేక దీక్షతో బుద్ధుడి బొమ్మ వేస్తున్న ఓ టీనేజ్ అమ్మాయి కూడా ఉంటుంది. రవివర్మ కుంచెకు అందిన అందం... విజయలక్ష్మి చిత్రాల్లో ద్యోతకమవుతుంది. తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్– మల్కాజ్గిరి జిల్లా, శామిర్ పేట మండలంలో ఉంది తుర్కపల్లి. ఆ ఊరిలో అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి చిత్రలేఖనంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది. కళారత్న, అబ్దుల్ కలామ్ అవార్డులతోపాటు లెక్కలేనన్ని పురస్కారాలు, ప్రశంసలు ఆమె సొంతమయ్యాయి. తన రంగుల ప్రస్థానాన్ని, ఒక చిత్రంలో లెక్కకు మించిన వివరాలను పొందుపరచడంలో తన అభిరుచిని, బొమ్మల పట్ల తన ఇష్టాన్ని సాక్షితో పంచుకున్నారు విజయలక్ష్మి. అసాధారణమైన ప్రతిభ ‘‘నా జీవితంలో బొమ్మలు ఎప్పుడు ప్రవేశించాయో స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే నా దృష్టిని ఆకర్షించిన దృశ్యాలకు చిత్రరూపం ఇవ్వడం నా బాల్యంలోనే మొదలైంది. నన్ను స్కూల్‌కి మా అన్న తీసుకు వెళ్లి, తీసుకువచ్చేవాడు. నాకు చదువంటే చాలా ఇష్టం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పుస్తకాలే నా లోకం. అందులోని బొమ్మలే నా స్నేహితులు. అందరి పిల్లల్లా ఆడుకోవడం నాకు కుదరదు కదా. అందుకే చదువుకుంటూ, బొమ్మలేసుకుంటూ పెరిగాను. టెన్త్‌క్లాస్ తర్వాత కాలేజ్కెళ్లడం కష్టమైంది. కొన్నేళ్ల విరామంలో సైకాలజీ, ప్రముఖుల బయోగ్రఫీలు, భగవద్గీత... అదీ ఇదీ అనే తేడా లేకుండా నాకు దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివాను. ఆ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేశాను. చదివేకొద్దీ నా ఆలోచన పరిధి విస్తృతం కాసాగింది. నా గురించి నేను ఆలోచించడమూ ఎక్కువైంది. ఒక వ్యక్తి అసాధారణమైన నైపుణ్యాలను సాధించినప్పుడు ఆ వ్యక్తిని ఆ ప్రత్యేకతలతోనే గుర్తిస్తారు. ఇతర లోపాలున్నా సరే అవి తొలుత గుర్తుకురావు. నాకు ఎడమ చెయ్యి మాత్రమే మామూలుగా పని చేస్తుంది. రెండు కాళ్లు, కుడి చెయ్యి చిన్నప్పుడే పోలియో భూతం బారిన పడ్డాయి. నా పేరు విన్న వెంటనే కాన్వాస్ మీద అద్భుతాలు సృష్టించగలిగిన ఒక చిత్రకారిణి గుర్తుకురావాలి. సమాజం ఒక సాధారణ వ్యక్తిని సాధారణంగానే గుర్తిస్తుంది. ఒక నైపుణ్యమో, వైకల్యమో ఉన్నప్పుడు వ్యక్తిగా గుర్తించడానికంటే ముందు నైపుణ్యం, వైకల్యాలతోనే పరిగణనలోకి తీసుకుంటుంది. పోలియో బాధితురాలిగా ఐడెంటిఫై కావడం కంటే విజయలక్ష్మి అంటే చిత్రలేఖనం గుర్తుకు వచ్చేటంతగా రాణించాలనుకున్నాను. అందుకోసమే అహర్నిశలూ శ్రమించాను. నేను చూసిన దృశ్యాల నుంచి నా బొమ్మల పరిధిని విస్తరించాను. నేను చదివిన పుస్తకాల నుంచి ఇతివృత్తాలను రూపుదిద్దుకున్నాను. అన్నింటికీ మించి రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందాను. రవీంద్రభారతిలో పురస్కారాలు చిత్రకారిణిగా గుర్తింపు రావడమే కాదు, పురస్కారాలను రవీంద్రభారతిలో అందుకోగలిగాను. రవీంద్రభారతిలో అందుకోవడం కూడా ఒక పురస్కారంగానే భావిస్తాను. 2019లో నా చిత్రాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే అవకాశం వచ్చింది. అలాగే హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, సాలార్జంగ్ మ్యూజియంతోపాటు ఢిల్లీలోనూ ప్రదర్శితమయ్యాయి. మనలో ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష, సంకల్పబలం ఉంటే భగవంతుడు అవకాశం ఇచ్చి తీరుతాడని నమ్ముతాను. ఓ సంస్థ నా అవసరాన్ని గుర్తించి డెబ్బై వేల విలువ చేసే ఎలక్ట్రానిక్ వీల్‌చైర్ విరాళంగా ఇచ్చింది. అది కూడా భగవంతుడు పంపినట్లే. స్ఫూర్తిప్రదాతగా... నేను రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందితే, నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్న కొత్తతరం ఉండడం నాకు సంతోషంగా ఉంది. నేను చదువుకున్న స్కూల్లో నా బొమ్మలను ప్రదర్శించినప్పుడు నాకా సంగతి తెలిసింది. జీవితాన్ని నిస్సారంగా గడిపేయకూడదు, స్ఫూర్తిమంతంగా ఉండాలని కోరుకుంటాను. సోషల్ మీడియాను నూటికి నూరుశాతం వినియోగించుకున్నాననే చెప్పాలి. సోషల్ మీడియా వేదికగానే ఇన్‌ఫ్లూయెన్సర్‌ని కాగలిగాను. తలసేమియా వ్యాధిగ్రస్థులకు రక్తం కోసం ఏడాదికి మూడుసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నాను. మా ఊరి కుర్రాళ్లు ‘ఏం చేయాలో చెప్పక్కా, మేము చేసి పెడతాం’ అని ఉత్సాహంగా సహాయం చేస్తున్నారు. ‘వీల్‌చైర్ నుంచి నేను ఇన్ని చేస్తుంటే హాయిగా నడవగలిగిన వాళ్లు ఎందుకు చేయలేరు. స్థిరచిత్తం ఉంటే ఏదైనా సాధ్యమే’నని వీడియోల్లో చెబుతుంటాను’’ అని సంతోషంగా తన బొమ్మలలోకాన్ని వివరించింది విజయలక్ష్మి. బుద్ధుడి వెనుక యువతి విజయలక్ష్మి చిత్రలేఖనంలో ఉన్న అమ్మాయి అచ్చమైన తెలుగుదనంతో ఒత్తైన జడ వేసుకుని ఉంటుంది. ఆ జడను అలంకరించి పూలు కూడా అచ్చం పూలను పోలినట్లే తెల్లటి పువ్వులో పసుపువర్ణంలో పువ్వు మధ్యభాగం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి చెవి జుంకీలకున్న నగిషీలు కూడా. అలాగే మరో చిత్రలేఖనం ఇంకా అద్భుతం... మన దృష్టి అభయ ముద్రలో ఉన్న బుద్ధుడి మీద కేంద్రీకృతమవుతుంది. బుద్ధుని పాదాల వద్దనున్న కమలం మీద, బుద్ధుడి శిఖ, శిఖ వెనుకనున్న కాంతివలయాన్ని కూడా చూస్తాం. ఆ తర్వాత మన దృష్టికి వస్తుందో అద్భుతం. ఆ బుద్ధుడి బొమ్మ ఉన్నది కేవలం కాన్వాస్ మీద కాదు. ఒక యువతి వీపు మీద. అటువైపు తిరిగి కూర్చుని ఉన్న యువతిని చిత్రీకరించిన తర్వాత ఆమె వీపు మీద చూపరులకు అభిముఖంగా ఉన్న బుద్ధుడిని చిత్రించింది విజయలక్ష్మి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మేడ్చల్: పీర్జాదిగూడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
-
బీఆర్ఎస్లో తిరుగుబావుటా.. మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు బేఖాతరు!
అధికార పార్టీ బీఆర్ఎస్లో తిరుగుబాటు జెండా ఎగురుతోంది. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లో సొంత పార్టీ మేయర్లు, చైర్మన్ల పైనే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు అందజేయడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 13 పురపాలక సంఘాలు ఉండగా, మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసులు సమర్పించడంపై బీఆర్ఎస్ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. సొంత బంధువులు ప్రాతినిధ్యం వహిస్తున్న పురపాలక సంఘాల్లో కూడా కౌన్సిలర్లు మంత్రి మల్లారెడ్డి గీత దాటడంతో పాటు విపక్షాలతో చేతులు కలపడం వంటి విషయాలు రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక పురపాలక సంఘాలు కలిగిన శాసన సభా నియోజకవర్గంగా మేడ్చల్‌కు పేరుంది. ఇక్కడనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఆదేశాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాటించక పోవడంతో పట్టును కోల్పోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో వ్యక్త మవుతోంది. అలాగే మేడ్చల్ నియోజకవర్గంలోని పలు పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా అదే పార్టీకి చెందిన మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన మంత్రి మల్లారెడ్డి వివిధ మార్గాల ద్వారా అసమ్మతి వాదులను బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. బుధవారం ‘మన ఊరు–మన బడి’ కింద మరమ్మతులు పూర్తయిన ప్రభుత్వ పాఠశాలల భవనాల ప్రారం¿ోత్సవానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి పోచారం, పీర్జాదిగూడ, బోడుప్పల్ పురపాలక సంఘాల్లోని అసమ్మతి వాదులతో సమావేశమై.. బుజ్జగింపుల పర్వానికి తెర లేపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా... మంత్రి మల్లారెడ్డిపై దాదాపు నెల రోజుల కిందట మల్కాజిగిరి ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశమైన జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలు ఆరోపణలతో తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతరు చేయకుండా నామినేటెడ్ పదవులను మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. అలాగే తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు విషయంలో కలెక్టర్‌ను మంత్రి పక్కదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు అప్పట్లోనే మీడియా సమావేశంలో ప్రకటించారు. జవహర్‌నగర్ బాటలో మరికొన్ని.. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 20 మంది కార్పొరేటర్లు ఇటీవల కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మర్రి దీపికపై 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానానికి సంబంధించిన నోటీసు కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 సె క్షన్ 37 అనుసరించి నో కాన్ఫిడెన్స్ మోషన్ పిటిషన్ చైర్మన్‌కు వ్యతిరేకంగా సమర్పిస్తున్నట్లు వారు నోటీసులో పేర్కొన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మరో 4 పురపాలక సంఘాలకు చెందిన అధికార బీఆర్ఎస్కు చెందిన అ మ్మతి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసులు కలెక్టర్ కు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. -
తమిళిసై వద్ద పెండింగ్‌లో ఫైల్.. పురసారథులకు ‘పరీక్ష’
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ మేడ్చల్‌జిల్లా: నగర/పురపాలికల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేస్తోంది. మూడేళ్ల పదవీకాలం ముగియనుండటంతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే దిశగా పావులు కదులుతున్నాయి. ఇందుకు వ్యూహరచన చేస్తుండటంతో ప్రస్తుత పాలక వర్గాలు పదవిని కాపాడుకునేందుకు.. వైరి వర్గం కుర్చీ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నగర, పురపాలక సంఘాల్లో అవిశ్వాస పరీక్షలకు మూడేళ్ల కాల పరిమితిని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టంలో పొందుపర్చింది. దీన్ని నాలుగేళ్లకు సవరిస్తూ గత ఏడాది అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. గవర్నర్ తమిళిసై పరిశీలనకు వెళ్లిన ఈ బిల్లుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీంతో పాత చట్టమే మనుగడలో ఉందని భావిస్తున్న అసంతృప్తి నేతలు, అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. నగర/పురపాలక సంఘాలు పగ్గాలు చేపట్టి ఈ నెల 26 నాటికి మూడేళ్లు ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పురపాలికలపై కన్నేసిన ఆశావహులు ఎత్తులు వేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో కొంతకాలంగా విందు, విహార యాత్రలతో బిజీగా ఉన్న ఈ నేతలు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నారు. నగర శివారులోని దాదాపు మెజారిటీ మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో.. ► మేడ్చల్ జిల్లాలో నిజాంపేట్, బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార పార్టీ సభ్యులే వైరి వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత పాలక వర్గాలకు మూడేళ్లు పూర్తి కావడంతో పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నిజాంపేట్ కార్పొరేటర్లు ఇటీవల శ్రీశైలం వేదికగా, జవహర్‌నగర్ నగరపాలక సంస్థ పాలక సభ్యులు ఉభయ గోదావరి జిల్లాలు వేదికగా క్యాంపు రాజకీయాలు నెరిపారు. ► బోడుప్పల్ కార్పొరేషన్‌లోనూ గ్రూపు రాజకీయాలు అధికమయ్యాయి. ఇక్కడ కూడా అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేడ్చల్ మున్సిపాలిటీలో కొంత కాలంగా మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై మంత్రి సమక్షంలో పలుమార్లు అసంతృప్తి వెళ్లబుచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలోని ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగారం మున్సిపాలిటీలో చైర్మన్‌పై అవిశ్వాసానికి అంతర్గంగా పావులు కదుపుతున్నట్లు అధికార టీఆర్ఎస్ కౌన్సిర్లలోనే చర్చ జరుగుతోంది. దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీల్లోని అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో.. ► ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టేందుకు అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో పదవీ కాలం ఒప్పందాలు కుదుర్చుకున్న సభ్యులు కూడా పట్టు వీడకపోవడంతో కొన్ని చోట్ల విశ్వాస పరీక్షలకు దారితీస్తోంది. ఇంకొన్ని చోట్ల పదవీ నుంచి దిగేందుకు ససేమిరా అనడం కూడా ఈ పరిస్థితులకు కారణంగా మారుతోంది. ► తుర్కయంజాల్‌లో మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకున్న కాంగ్రెస్.. రెండు వర్గాలుగా విడిపోయింది. పదవుల పంపకంపై ఇరుపక్షాలు బెట్టు దిగకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సీను ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ కనిపిస్తోంది. గులాబీ శిబిరంలో కీచులాటలతో చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంతనాలు సాగిస్తున్నారు. ► మరోవైపు ఆదిబట్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కౌన్సిలర్ దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో స్థానిక ఎమ్మెల్యేలతో చైర్‌పర్సన్‌కు పొసగడం లేదు. దీంతో ఆమెను గద్దె దింపే దిశగా ఎమ్మెల్యే వర్గీయులు చక్రం తిప్పుతున్నారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు.. బండ్లగూడ నగర పాలక సంస్థలోనూ చైర్మన్‌గిరీ విషయంలో మడతపేచీ నెలకొంది. ఇక్కడ కూడా రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు. తాజా పరిణామాలతో పోస్టు నుంచి తప్పుకొనేందుకు నో చెబుతుండడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. (క్లిక్ చేయండి: కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి) -
వీబీఐటీ కేసు: వల వేసి.. సవాల్ విసిరి.. పోలీసులకు చిక్కాడు
సాక్షి, మేడ్చల్-మల్కాజిగిరి: ఘట్కేసర్ మండలం అవుషాపూర్ వీబీఐటీ(విజ్ఞానభారతి ఇంజినీరింగ్) కాలేజ్ అమ్మాయిలపై వేధింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేధింపులకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు(?) ప్రదీప్‌ను ఎట్టకేలకు పోలీసులు ట్రేస్ చేశారు. దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు సవాల్ విసిరిన ఈ హ్యాకర్‌ను.. పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం విశేషం. ప్రదీప్‌తో పాటు ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన మరో ఇద్దరిని సైతం శుక్రవారం ఘట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ విజయవాడకు చెందిన ప్రదీప్.. వీబీఐటీ కాలేజీ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి.. న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో.. వాట్సాప్ డీపీలతో పాటు ఏకంగా ఫోన్ డాటా మొత్తాన్ని హ్యాక్ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. సేకరించిన డాటాను డార్క్‌నెట్‌లో పెట్టి డబ్బు సంపాదించడంతో పాటు ఫేక్ ఫొటోల ద్వారా వాళ్లపై వేధింపులకు పాల్పడాలని యత్నించాడట ప్రదీప్. అయితే.. వేధింపులను భరించలేక యువతులు ఈ విషయాన్ని డిసెంబర్ 31వ తేదీకి ముందే కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ యాజమాన్యం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ దశలో ధర్నాకు దిగగా.. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు విద్యార్థినులకు మద్ధతుగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యువతి వల్లే ఇదంతా! ఈ మొత్తం వ్యవహారం వెనుక వీబీఐటీలోనే చదివే ఒక అమ్మాయి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తు ద్వారా తేల్చారు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయిని ట్రాప్ చేసిన ప్రదీప్.. ఆమెతో చాలాకాలం ఛాటింగ్ చేశాడు. ఇద్దరూ బాగా దగ్గరయ్యాక.. ఆమె ద్వారా యువతి ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో చేరాడు. ఆపై మిగిలిన అమ్మాయిల నెంబర్లు సంపాదించాడు కూడా. ఇక ప్రదీప్‌కు ఘనితో పాటు మరో స్నేహితుడు తోడయ్యారు. ఈ ముగ్గురూ వాట్సాప్ గ్రూపుల్లోని తరచూ ఏదో ఒక నెంబర్లకు ఫోన్లు చేశారు. అవి అమ్మాయిల పర్సనల్ నెంబర్లే అని నిర్ధారించుకునేదాకా.. పదే పదే ఫోన్ చేశారు. ఆపై పరిచయం పెంచుకుని స్నేహం ప్రారంభించారు. వాళ్ల వాట్సాప్ డీపీలుగా ఉన్న ఫోటోలను సేకరించారు. అదే సమయంలో ‘‘ఎంటర్ ది డ్రాగన్, కింగ్ ఈజ్ బ్యాక్’’ ల పేరుతో వాట్సప్ గ్రూప్‌లను క్రియేట్ చేశారు. ఆ గ్రూప్‌లో వీబీఐటీ స్టూడెంట్స్‌ను సైతం యాడ్ చేశారు. ఇక అపరిచిత లింకులను ఆ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి.. అవి క్లిక్ చేసిన అమ్మాయిల ఫోన్లోని డాటాను హ్యాకింగ్ చేశారు ప్రదీప్ అండ్ కో. సుమారు 43 మంది డాటాను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు సవాల్ మరోవైపు ఏడు నెంబర్ల నుంచి అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్ మెయిల్ దిగాడు. ఇక ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేపట్టిన సమయంలోనూ ప్రదీప్ పోలీసులకు, బాధిత యువతులకు చుక్కలు చూపించాడు. దమ్ముంటే తమను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరాడు. అలాగే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నెట్లో ఆ ఫొటోలు పెడతానని అమ్మాయిలను బెదిరించిన సైబర్ ఛీటర్ ప్రదీప్.. అన్నంత పని చేయబోయాడట. అయితే.. సరైన సమయంలో ప్రదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మరికొందరి డాటా డార్క్‌నెట్‌లో అప్లోడ్ కాకుండా నిలువరించగలిగారట. ఇక ప్రదీప్‌కు నేరంలో సహకరించిన ఫస్ట్ ఇయర్ యువతిని సస్పెండ్ చేసే యోచనలో కాలేజీ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. కాలేజీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.. స్టూడెంట్స్‌కు సంక్రాంతి సెలవులు ముందుగానే ప్రకటించింది యాజమాన్యం!. -
75 బృందాలు..100 రోజులు
సాక్షి,మేడ్చల్ జిల్లా: రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే నెల 18న కార్యక్రమం ప్రారంభం కానుండగా, ఇప్పటికే గ్రామీణ, పట్టణ జనాభాకు అనుగుణంగా వైద్య బృందాల నియామకం పూర్తయింది. ఈ మేరకు నేత్ర వైద్య సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. వంద రోజుల పాటు నిర్వహించే కంటివెలుగుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. వారానికి అయిదు రోజుల పాటు నిర్దేశించిన కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. 2018లో మొదటి విడత కంటివెలుగు నిర్వహించిన సమయంలో పరీక్షలు నిర్వహించి దృష్టి లోపం ఉన్నవారిలో కొందరికే శస్త్రచికిత్స చేశారు. ఈసారైనా శస్త్రచికిత్స చేసి కంటి అద్దాలు పంపిణీ చేస్తారని కంటి రోగులు ఆశిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి శస్త్రచికిత్స చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒక్కో బృందంలో ముగ్గురు.. మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో 27,75,067 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 40 డివిజన్ల పరిధిలో 20,92,711 మందికి పరీక్షలు చేపట్టాలని నిర్ణయించగా, ఇందుకు 43 బృందాలను నియమించారు. జిల్లాలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్,నిజాంపేట నగర పాలక సంస్థలు , మేడ్చల్, గుండ్లపోచంపల్లి ,దుండిగల్ ,కొంపల్లి, తూముకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీ పరిధిలో మొత్తంగా 289 డివిజన్లు/ వార్డులు ఉండగా, 5,36,567 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో 18 బృందాలను నియమించారు. అలాగే, 61 గ్రామ పంచాయతీల్లో సుమారు 1,45,789 జనాభా ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు అంచనా వేసి, 10 బృందాలను నియమించారు. జిల్లావ్యాప్తంగా మొత్తంగా 75 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో వైద్యుడు, నేత్ర వైద్య సహాయకుడు, ఆపరేటర్ ఉంటారు. వీరికి స్థానికంగా ఉండే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు సహకరిస్తారు. ఇటీవలే వైద్య బృందాలకు శిక్షణ ఇచ్చారు. సెలవు దినాలు మినహా వారానికి అయిదు రోజుల చొప్పున 100 రోజుల పాటు వైద్య పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షించే పరికరాలను, ఆటో రిఫ్రాక్టర్(ఏఆర్) మీటర్లను ప్రభుత్వం సమకూరుస్తుంది. నిరంతరాయంగా శిబిరాలు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కంటివెలుగు కార్యక్రమం నిర్వహణకు వైద్యఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. ఇటీవలి కాలంలో కంటి సంబంధిత సమస్యలతో బాధ పడే వారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో కంటివెలుగు కార్యక్రమం అధికారులు చెబుతున్నారు. వైద్య పరీక్షలతో సరిపెట్టకుండా లోపాలున్న ఇకపై నిరంతరాయంగా కొనసాగుతుందని వారందరికీ శస్త్రచికిత్స నిర్వహిస్తేనే పేదలకు ప్రయోజనం కలగనుంది. ఈసారైనా శస్త్రచికిత్సలు జరిగేనా.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో తొలి విడతలో 1,27,146 మందిని పరీక్షించగా 82,157 మందికి మాత్రమే కంటి అద్దాలు అందజేశారు. జిల్లాలో 42,148 మందికి అధిక దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించటంతోపాటు కంటి ఆపరేషన్లు చేయాలని నిర్ణయించినప్పటికిని, 545 మందికి మాత్రమే కంటి ఆపరేషన్లు చేశారు. మిగతా వారందరికి విడతల వారిగా శస్త్రచికిత్సలు చేస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు.బాధితులు శస్త్రచికిత్స కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ప్రతి ఒక్కరికీ పరీక్షలు.. జిల్లాలో కంటివెలుగు నిర్వహణ కోసం వైద్య బృందాలను నియమించాం. పరికరాలు, ఇతర వనరులపై ప్రభుత్వానికి నివేదించాం. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి -
మా సమావేశానికి కారణం మంత్రి మల్లారెడ్డే: ఎమ్మెల్యే మైనంపల్లి
-
రహస్య భేటీ కాదు.. మంత్రి మల్లారెడ్డే కారణం: ఎమ్మెల్యే మైనంపల్లి
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం అయిన విషయం తెలిసిందే. మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతితోనే ఈ ఎమ్మెల్యేలు భేటీ నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ(శేరిలింగంపల్లి), వివేక్ గౌడ్ (కుత్బుల్లాపూర్), మాధవరం కృష్ణారావు(కూకట్పల్లి), బి సుభాష్‌రెడ్డి(ఉప్పల్) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. తమ సమావేశానికి మంత్రి మల్లారెడ్డే కారణమని తెలిపారు. పదవులు తీసుకున్న వాళ్లే 3,4 పదవులు తీసుకున్నారని మైనంపల్లి ఆరోపించారు. కార్యకర్తల సమస్యలపై ఎమ్మెల్యేలు కలవడం తప్పా అని ప్రశ్నించారు. ప్రతి దాన్నీ రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఇది రహస్య సమావేశం కాదని.. కార్యకర్తల కోసమే భేటి అయినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కేడర్ ఇబ్బందులు పడుతోందని, కేడర్ గురించి మాట్లాడకపోతే డమ్మీలవుతామని అన్నారు. చదవండి: మేడ్చల్ బీఆర్ఎస్లో కోల్డ్‌వార్.. మంత్రి మల్లారెడ్డిపై కేటీఆర్ దగ్గరకు ఎమ్మెల్యే పంచాయితీ! కార్యకర్తల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మంత్రికి లేదా అని మైనంపల్లి ప్రశ్నించారు. కేడర్ కష్టపడి పనిచేస్తోందని.. వారికి న్యాయం జరగాలని అన్నారు. ఎవరో చేసిన దానికి పార్టీ డ్యామేజ్ అవుతోందని ఆరోపించారు. నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. పనిచేసే క్యాడర్‌ను కాపాడుకోవాలని, సిస్టమ్‌లో మార్పు రావాలని ఆకాక్షించారు. ‘ఎవరో ఒకరు చెప్పకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయి. మా సమావేశం తప్పేమీ కాదు. మంత్రి కేటీఆర్‌ను కలవాలనుకున్నాం. ఈ సమస్య అన్ని పార్టీలో ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలోనూ కేడర్‌తో ఎమ్మెల్యేలకు సమస్యలు ఉన్నాయి. కొంతమంది మంత్రులు తమ వాళ్లకు పదవులు ఇప్పించుకున్నారు. నా కొడుకు కోసం మీటింగ్ అన్న ప్రచారం నన్ను హర్ట్ చేసింది’ అని ఎమ్మెల్యే తెలిపారు. -
మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
-
మంత్రి మల్లారెడ్డిపై ఆ నలుగురి ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ ఎమ్మెల్యే, తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలు ఈ మేరకు సోమవారం భేటీ అయినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి వైఖరిపై రగిలిపోతున్నారు ఆ నలుగురు.. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని యత్నిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, జిల్లా పదవులన్నీ తీసుకెళ్లిపోయారని ఆ నలుగురు మండిపడుతున్నారు. ఈ మేరకు ఉప్పల్, కూకట్పల్లి, శేరిలింగం పల్లి ఎమ్మెల్యేలు.. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో భేటీ అయ్యారు. మల్లారెడ్డిపై అసమ్మతితోనే ఈ భేటీ నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. నామినేటెడ్ పోస్టులు మల్లారెడ్డికి సంబంధించిన అనుచరణ గణానికే ఇప్పించుకుంటున్నారని, మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ పోస్టుపై విషయంలో వాళ్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పోస్టులు ఒకే నియోజకవర్గానికి వెళ్లిపోయాయి. జిల్లా పదవులన్నీ మంత్రి తీసుకెళ్లారు. మంత్రి మల్లారెడ్డి మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ప్రభుత్వం, పార్టీ తీరుపై కాకుండా.. కేవలం మంత్రి మల్లారెడ్డి అంశంలోనే వాళ్లంతా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి మల్లారెడ్డి జోగులాంబ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిపై ఆయన స్పందించాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో మల్లారెడ్డి అంశంపై పంచాయితీని మంత్రి కేటీఆర్ దగ్గరకు తీసుకెళ్లాలని ఆ నలుగురు భావిస్తున్నారు. -
అమానుష ఘటన.. అపార్ట్మెంట్ వద్ద పసికందును వదిలేసిన వ్యక్తులు
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో అమనుష ఘటన చోటుచేసుకుంది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో పరిధిలోని కమలానగర్లో గుర్తు వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లారు. రెండ్ అపార్టమెంట్ల మధ్య ఆవరణలో కేవలం ఒకరోజు వయసున్న శిశువును వదిలి వెళ్లారు. దీనిని గమనించిన స్థానికులు.. పసికందు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి తక్షణమే పోలీసులకు సమాచారం అందజేశారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ సాయికుమార్ తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అపార్ట్మెంట్ వద్ద పసికందును చూసి చలించిపోయిన ఎస్సై స్వయంగా తన చేతుల్లోకి తీసుకొని వైద్యం నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పసికందుకు ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. శిశువు పట్ల మానవాత్వం చాటుకున్న ఎస్సైని స్థానికులు కొనియాడారు. చదవండి: పెళ్లి పేరుతో యువకుడికి ‘మాయలేడి’ వల.. రూ.31లక్షలకు టోకరా -
ఇదేం చోద్యం.. ఏకంగా చెరువు భూమినే తనఖా పెట్టేశారు!
పట్టాదారులమంటూ.. కోర్టు ఆదేశం ఉందంటూ పోలీసులు బందోబస్తుతో నాడెం చెరువు తూమును ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకోవడంతో ధ్వంసం చేయించిన వారు తోక ముడిచారు. ఆ తర్వాత బుల్డోజర్ను సీజ్ చేసి కారకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా మూడు నెలల క్రితం జరిగిన సంఘటన. తాజాగా హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ బ్యాంకులో చెరువు భూమిని తనఖా పెట్టి రూ.12కోట్ల రుణం తీసుకోవడంతో నాడెం చెరువు పేరు తిరిగి తెరపైకి వచ్చింది. ఘట్కేసర్: చెరువులు, కుంటలు, జల వనరుల సంక్షరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి వారి మాటలకు భిన్నంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు లేకపోవడంతో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. తాజాగా వెంకటాపూర్ నాడెం (నల్ల) చెరువులోని భూమిని తనఖా పెట్టి కొందరు రూ.12 కోట్ల రుణం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. నాడెం చెరువుపై ఆధారపడి వెంకటాపూర్‌కు చెందిన 105 మంది ముదిరాజ్ మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. నీటిని తొలగించే అధికారం లేకున్నా... రెవెన్యూ రికార్డులో ఉన్న చెరువును అందులో ఉన్న నీటిని తొలగించే అధికారం నీటి పారుదల శాఖ అధికారులకే ఉంది. నాడెం చెరువులో నీరు లేదంటూనే చెరువులో చేపలు పట్టొందంటూ కొందరు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్డు ఆర్డర్ ఉందని ఆగస్టు 3, 2022న పోలీస్‌బందో బస్తుతో చెరువు కల్వర్టును ధ్వంసం చేశారు. మత్స్యకారులు చెరువులోకి దిగితే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారని మత్స్యకారులు గతంలో ఆరోపించారు. తక్షణమే రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కోర్టు ఆదేశం చూపించాలని కోరడంతో తోక ముడుచుకున్నారు. పోలీసుల అండతోనే ధ్వంసం.. చెరువులో చేపలు పడితే కేసు పెడతామని గతంలో పోలీసులు బెదిరించారని మత్స్యకారులు పేర్కొన్నారు. పోలీసుల అండతోనే అక్రమార్కులు కల్వర్టు ధ్వంసం చేశారని అప్పట్లో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. మత్స్యకారుల నుంచి విషయం తెలుసుకున్న అధికారులు తూము ధ్వంసాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్రమార్కులపై రెవెన్యూ, ఇరిగేషన్, రోడ్డు భవనాల శాఖాధికారులు ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఎన్ఓసీ ఇవ్వలేదు ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ పరమేశ్‌ను వివరణ కోరగా బ్యాంకు రుణం కోసం మేము ఎటువంటి ఎన్ఓసీ ఇవ్వలేదని తెలిపారు. బ్యాంకు డాక్యూమెంట్లు చూస్తే కాని ఏమి చెప్పలేమని పేర్కొన్నారు. చెరువు విస్తీర్ణం 62 ఎకరాలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ సర్వేనంబర్ 814, 816లో 62 ఎకరాల విస్తీర్ణంలో నాడెం చెరువును నీటి పారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఘట్కేసర్ పరిసరాల్లో భూమి విలువ పెరగడంతో అక్రమార్కుల కన్ను చెరువుపై పడింది. రాజకీయ నాయకుల అండతో నీటిని తొలగించి చెరువు లేకుండా చేయాలని యత్నిస్తున్నారు. చెరువులోని భూమికి రుణం ఎలా ఇచ్చారు.? భూమి పరిశీలించకుండానే చెరువులో నీట మునిగిన భూమికి బ్యాంకు ఎలా రుణం ఇచ్చిందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. లక్ష రుణం కోసం చెప్పులరిగేలా తిప్పుకునే బ్యాంకు అధికారులు నీటిలో ఉన్న భూమికి రుణం ఇవ్వడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!) -
Hyderabad: 15 నియోజకవర్గాల్లో 2.79 లక్షల ఓట్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 2.79 లక్షల ఓటర్లను తొలగించారు. గత జనవరి 5వ తేదీ నుంచి ముసాయిదా ఓటరు జాబితా తయారీ వరకు తొలగించిన ఓట్లు ఇవి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 29,591 ఓటర్ల పేర్లు తొలగించారు. ఓటర్ల జాబితాలో పేర్లున్న వారిలో మృతి చెందినవారు, చిరునామా మారిన వారు, ఒకటి కంటే ఎక్కువ పర్యాయాలు పేర్లున్న వారిని తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం ఓటర్లు 41.46 లక్షలు హైదరాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం జనవరిలో 43, 67,020 మంది ఓటర్లుండగా.. తొలగింపులు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారిని పరిగణనలోకి తీసుకొని రూపొందించిన తాజా ఓటర్ల ముసాయిదా జాబితాలో41,46,965 మంది ఓటర్లున్నారు. అంటే గడచిన పదినెలల్లో 2,20,055 మంది ఓటర్లు తగ్గారు. ఇందులో కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు 59,575 మందికాగా, తొలగించినవారు 2,79,630 మంది. సగటున 5.04 శాతం ఓటర్లు తగ్గారు. తొలగించిన ఓటర్లు నియోజకవర్గాల వారీగా.. వీరిలో మృతులు 78 మంది కాగా, చిరునామా మారిన వారు 3966 మంది, ఒకటి కంటే ఎక్కువ ఓట్లున్నవారు 275586 మంది ఉన్నారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితాను సంబంధిత ఈఆర్ఓలు విడుదల చేశారు.ఈ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలను డిసెంబర్ 8 వరకు స్వీకరిస్తారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలన చేసుకునేందుకు సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారిని సంప్రదించవచ్చని తెలిపారు. ఆన్లైన్ ద్వారా www. nvsp.com, www.ceotelangana.nic.in పోర్టల్స్ ద్వారా, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కూడా పరిశీలన చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
హైదరాబాద్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో విషాదం
-
విషాదం.. చెరువులోకి మునిగి టీచర్‌తోపాటు ఐదుగురు విద్యార్థుల మృతి
సాక్షి, మేడ్చల్: ఈత సరదా ఐదుగురు విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. వారిని రక్షించడానికి వెళ్లిన మదరసా టీచర్ సైతం మృత్యువాత పడ్డారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ విషాదకర ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ కాచిగూడ ప్రాంతానికి చెందిన హనీఫా మదరసాలో చదువుకునే దాదాపు 40 మంది విద్యార్థులు శనివారం డీసీఎం వాహనంలో వారి టీచర్ యహియా (25)తో కలసి జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారంలో ఓ గృహప్రవేశానికి హజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో కొందరు ఫంక్షన్ జరుగుతున్న ఇంట్లోకి వెళ్లగా మరికొందరు బయట ఆడుకుంటున్నారు. వీరిలో ఆరుగురు విద్యార్థులు సమీపంలో ఉన్న ఎర్రగుంట చెరువులో సరదాగా ఈతకు వెళ్లారు. నీటిలోకి దిగిన విద్యార్థులు ఈతరాక ఒక్కొక్కరుగా మునిగిపోయారు. వీరిని గమనించిన ఉపాధ్యాయుడు యహియా వేగంగా వచ్చి నీళ్లలోకి దిగి పిల్లలను కాపాడేప్రయత్నం చేశారు. అయితే పిల్లలు ఆయనను గట్టిగా పట్టుకోవడంతో అందరూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. వీరిలో ఒక విద్యార్థిని అక్కడే ఉన్న స్థానికుడు రక్షించి ఒడ్డుకు చేర్చాడు. ఈ లోగా టీచర్ యహియాతో పాటు ఐదుగురు విద్యార్థులు.. ఇస్మాయిల్ (11), జాఫర్ (10), సోహెల్ (09), అయాన్ (09), రియాన్(12)లు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న కుషాయిగూడ ఏసీపీ సాధన రశ్మీ పెరుమాల్, జవహర్‌నగర్ సీఐ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్లను రప్పించి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చదవండి: నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా?.. వీడియో బయటపెడతా భయాందోళనలో తోటి విద్యార్థులు మదరసా నుంచి గృహప్రవేశానికి వచి్చన విద్యార్థులు సరదాగా గడుపుతున్న సమయంలో టీచర్‌తోపాటు ఐదుగురు స్నేహితులు జలసమాధి అయిన విషయం తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు. తోటి విద్యార్థులు నీటిలో మునిగిపోయారని కన్నీరుమున్నీరయ్యారు. ఆగ్రహించిన స్థానికులు ఎర్రగుంట చెరువులో పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆ ప్రాంతంలోని చెరువుల్లో మునిగి చనిపోయారని, వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంబర్‌పేటలో విషాదఛాయలు మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కారం ఎర్రగుంట చెరువులో శనివారం ఈతకు వెళ్లి మృతి చెందిన ఐదుగురు విద్యార్థులు అంబర్‌పేట నియోజకవర్గం హడ్డికార్ఖానా, సుందర్‌నగర్, నెహ్రూనగర్ ప్రాంతాలతో పాటు అంబర్‌పేటకు చెందినవారు కావడంతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కాచిగూడ పోలీసులు హడ్డికార్ఖానా ప్రాంతంలోని మదరసా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌లు పరామర్శించారు. కాగా, గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్దకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ పిల్లల మృతదేహాలను చూసి భోరున విలపించారు. ఈ సందర్భంగా మృతదేహాలకు పోస్టుమార్టం వద్దని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు మార్చురీ అద్దాలను ధ్వంసం చేశారు. అయితే ఎమ్మెల్యే, కార్పొరేటర్ నచ్చజెప్పడంతో వారు శాంతించారు. చదవడి: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని.. యువకుడు మృతి