Narasapuram MLA
-
టీడీపీ ఎమ్మెల్యేపై కేసు పెట్టిన లాయర్లు
నరసాపురం: స్వాతంత్య్ర దినోత్సవం రోజున న్యాయమూర్తి, న్యాయవాదులతో దురుసుగా ప్రవర్తించిన నరసాపురం టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఆయన అనుచరులపై స్థానిక పోలీసుస్టేషన్ లో బార్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15న అదనపు జిల్లా న్యాయమూర్తి పి.కల్యాణరావు, న్యాయవాదులపై ఎమ్మెల్యే మాధవనాయుడు, ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడారు. ఈ ఘటనను నిరసిస్తూ ఈనెల 19న జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. శాసనసభ్యుని దురుసు ప్రవర్తనను సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, ఎన్నికల కమిషన్, న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రాలు పంపినట్లు బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. -
'జడ్జిపై నరసాపురం ఎమ్మెల్యే దౌర్జన్యం'
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కోర్టు ఆవరణ వద్ద అదనపు జడ్జి కల్యాణరావుతో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆవరణలో షాపులు ఖాళీచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జడ్జిపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారని నరసాపురం బార్ అసోసియేషన్ ఆరోపించింది. ఎమ్మెల్యే రౌడీలా ప్రవర్తించారని మండిపడింది. జడ్జిని ఏకవచనంతో సంబోధించడంతోపాటు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించింది. ఎమ్మెల్యే దౌర్జన్యానికి నిరసనగా బుధవారం విధులు బహిష్కరిస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోలిశెట్టి బాబ్జి తెలిపారు. అయితే జడ్జి పట్ల తాను దురుసుగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే మాధవనాయుడు వివరణయిచ్చారు. ప్రత్యామ్నాయం చూపకుండా జడ్జి స్వయంగా షాపులు ఖాళీ చేయిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఆయన జడ్జి అని తనకు తెలియదని చెప్పారు.