NEET results
-
డాక్టర్ సీటొచ్చినా.. కూలి పనికి
తుంగతుర్తి: డాక్టర్ కావాలన్నది ఆ అనాథ బిడ్డ తపన. అందుకోసం కూలీ పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్ పరీక్షలో 507 మార్కులు సాధించింది మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. కానీ కనీసం పుస్తకాలు, దుస్తులు, ఫీజు చెల్లించడానికి డబ్బులు లేక ఎప్పటిలాగే తాత, నానమ్మతో కలిసి కూలీ పనులకు వెళ్తోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి తన మూడేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో గౌతమిని తాత శిగ రాములు, నాయనమ్మ వెంకటమ్మ కూలి పనులు చేస్తూ పోషించారు. గ్రామంలోని సర్కారు బడిలో ఐదో తరగతి వరకు, పసునూర్ ఆదర్శ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివించారు. గౌతమి పదో తరగతిలో 10/10 జీపీఏ, ఇంటర్ బైపీసీలో 992/1000 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. వైద్యురాలు కావాలనే కోరికతో నీట్‌కు హాజరై మొదటి ప్రయత్నంలోనే దంత వైద్య కళాశాలలో సీటు సాధించింది. దంత వైద్యురాలు కావడం ఇష్టం లేక మళ్లీ నీట్ రాయాలనుకున్న ఆమెకు ఆర్థిక సమస్యలు గుదిబండగా మారాయి. అయినప్పటికీ నానమ్మ పుస్తెలతాడు తాకట్టుపెట్టి హైదరాబాద్‌లో కోచింగ్‌కు పంపారు. గౌతమి డాక్టర్ కావాలనే లక్ష్యంతో తాత, నానమ్మతో కలిసి కూలి పనులకు వెళ్తూనే రెండోసారి నీట్‌కు సిద్ధమైంది. ఈసారి నీట్లో 507 మార్కులు సాధించి ఇటీవల జరిగిన ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌లో మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాధించింది. కానీ ఎంబీబీఎస్ చదవడానికి ఏడాదికి రూ.1,50,000 ఖర్చు అవుతుందని, అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో చేసేది లేక కూలి పనులకు వెళ్లున్నట్లు శిగ రాములు తెలిపారు. ఫీజుకోసం అమ్మటానికి కూడా వారికి ఎలాంటిఆ ఆస్తులు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశ నెరవేరుతుందని గౌతమి తాత, నానమ్మ వేడుకుంటున్నారు. సహాయం చేయాలనుకున్న దాతలు ఫోన్ పే నంబర్ 93989 19127కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. -
‘నీట్’ టాపర్లలోంచి మనోళ్లు ఔట్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత, ప్రవేశపరీక్ష (నీట్–యూజీ 2024)కు సంబంధించి తాజాగా విడుదలైన రెండోసారి సవరించిన (రీరివైజ్డ్) ఫలితాలు తెలంగాణ విద్యార్థులకు కాస్త నిరాశ మిగిల్చాయి. తొలిసారి ఫలితాల్లో జాతీయ స్థాయిలో టాప్–100 ర్యాంకుల్లో నిలిచిన మన విద్యార్థులు.. తాజా ఫలితాల్లో మాత్రం ఆ జాబితాలోనే లేరు. గత ఫలితాల్లో జాతీయ స్థాయిలో 77వ ర్యాంకుతో రాష్ట్ర టాపర్‌గా నిలిచిన అనురాన్ ఘోష్ తాజా ఫలితాల్లో ఏకంగా 137వ ర్యాంకుకు పరిమితమయ్యాడు.అలాగే ఎస్టీ కేటగిరీలో ఆలిండియా టాప్ ర్యాంకర్ తెలంగాణకు చెందిన గుగులోత్ వెంకట నృపేష్ సవరించిన ఫలితాల్లోనూ టాపర్‌గానే ఉన్నారు. కానీ అతని జాతీయ ర్యాంకు అప్పుడు 167 ఉండగా తాజా ఫలితాల్లో 219కు పడిపోయింది. అలాగే ఎస్టీ జాతీయ రెండో ర్యాంకర్‌గా నిలిచిన లావుడ్య శ్రీరామ్ నాయక్ ఇప్పుడు నాలుగో ర్యాంకుకు పరిమితమయ్యాడు. నీట్–యూజీ ఎంట్రన్స్‌లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో సుప్రీంకోర్టు ఆదేశంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుమారు 1,500 మందికి మళ్లీ ‘నీట్’నిర్వహించి సవరించిన ఫలితాలను కూడా ప్రకటించింది.కానీ ఫిజిక్స్ విభాగంలో అడిగిన ఓ ప్రశ్నకు గతంలో రెండు ఆప్షన్లను సరైన సమాధానంగా పరిగణించిన ఎన్టీఏ ఆ మేరకు రెండు రకాల సమాధానాలు ఇచ్చిన విద్యార్థులందరికీ ఐదు మార్కులు ఇచి్చంది. అయితే దీనిపై తాజాగా సుప్రీంకోర్టు నియమిత నిపుణుల బృందం ఆ రెండింటిలో ఒక దాన్నే సరైన సమాధానంగా గుర్తించడంతో ఆ ప్రశ్నకు రెండో సమాధానాన్ని ఎంచుకున్న విద్యార్థులకు 5 మార్కుల కోత పెట్టింది. దీంతో విద్యార్థుల ర్యాంకుల్లో తేడా వచి్చంది. తెలంగాణ నుంచి మొదటిసారి విడుదల చేసిన ఫలితాల్లో 47,371 మంది అర్హత సాధించగా తాజాగా సవరించిన ఫలితాల్లో 47,356 మంది అర్హత సాధించారు. త్వరలో రాష్ట్రస్థాయి ర్యాంకులు... ఆలిండియా ర్యాంకులు ప్రకటించిన ఎన్టీఏ... త్వరలో రాష్ట్రాలవారీగా అభ్యర్థుల జాబితాను రూపొందించనుంది. ముందుగా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం ఆలిండియా ర్యాంక్ ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేయనుంది. తగ్గిన కటాఫ్ మార్కు... సవరించిన ఫలితాల్లో కటాఫ్ మార్కు తగ్గింది. జనరల్ కేటగిరీ/ఈడబ్ల్యూఎస్ కింద తొలిసారి ఫలితాల్లో కటాఫ్ 164గా ఉండగా ఇప్పుడు 162కు తగ్గింది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీహెచ్, ఎస్సీ అండ్ పీహెచ్‌ల అర్హత మార్కులు కూడా 129 నుంచి 127కు తగ్గాయి. అన్ రిజర్వ్డ్/ఈడబ్ల్యూఎస్ అండ్ పీహెచ్‌ల అర్హత మార్కు సైతం 146 నుంచి 144కు తగ్గింది. ఎస్టీ అండ్ పీహెచ్‌లోనూ 129 నుంచి 127కు తగ్గింది. గతేడాది రాష్ట్రంలో 459 మార్కులు వచ్చిన వారికి జనరల్ కేటగిరీలో కనీ్వనర్ కోటాలో సీటు రాగా ఈసారి 500 మార్కులు దాటిన వారికి కూడా కనీ్వనర్ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉంది. -
నీట్ యూజీ తుది ఫలితాల్లో గందరగోళం
న్యూఢిల్లీ: నీట్ యూజీ 2024 తుది ఫలితాల విడుదలో గందరగోళం నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తుది ఫలితాలను ప్రకటించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించగా.. కేంద్ర విద్యామంత్రిత్వశాఖ మాత్రం సవరించిన మర్కులకు సంబంధించిన ఫలితాలను తాము ఇంకా విడుదల చేయలేదని పేర్కొంది.విద్యార్ధులు ఫలితాలను ఇప్పుడే చూసుకోలేరని, తాము త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఇప్పుడు వైరల్ అవుతున్న లింక్ పాతదని స్పష్టం చేసింది. కాగా నీట్ యూజీ-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సవరించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఫిజిక్స్ విభాగంలో ఓ ప్రశ్నకు తప్పుడు సమాధానం ఎంచుకున్న కొంత మంది విద్యార్ధులకు కలిసిన గ్రేస్ మార్కులను తొలగించి.. తాజా ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు తుది ఫలితాలను విడుదల చేసింది. దీని ఆధారంగా 4 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. కాగా ఫిజిక్స్‌లోని ఓ ప్రశ్నకు 12వ తరగతి ఎన్సీఈఆర్టీ పాత సిలబస్ ప్రకారం తప్పుగా సమాధానం ఇచ్చిన కొంతమంది విద్యార్ధులకు ఎన్టీఏ అదనంగా మార్కులను కలిపింది. అయితే, కచ్చితమైన ఒక సమాధానాన్ని మాత్రమే అంగీకరించాలని, ఇతర సమాధానాలకు మార్కులు ఇవ్వరాదని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఇప్పటికే ఇచ్చిన మార్కులను ఉపసంహరించుకోవాలని తెలిపింది.అయితే సుప్రీంకోర్టులో నీట్ వ్యవహారంపై విచారణ సందర్బంగా ఫిజిక్స్ విభాగంలో 29వ ప్రశ్నకు ఒకటి మాత్రమే సరైన సమాధానం అయినప్పుడు.. రెండు ఆప్షన్లు ఎంచుకున్న విద్యార్ధులకు ఎన్టీయే అదనపు మార్కులు కలిపిందని ఓ పిటిషనర్ లేవనెత్తాురు.దీనిపై స్పందించిన సుప్రీం దర్మాసనం.. ముగ్గురు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి మరుసటి రోజు మధ్యాహ్నానికి ఫిజిక్స్ ప్రశ్నకు సరైన సమాధానానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది. అనంతరం ఐటీ ఢిల్లీ యొక్క నివేదిక ఆధారంగా ఆప్షన్ 4 మాత్రమే సరైన సమాధానం అని తెలిపింది. దీంతో ఆప్షన్ 4 ఎంపిక ేసిన విద్యార్ధులకు మాత్రమే మార్కులు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.ఇక ఈ ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా జరిగిన నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. -
నీట్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా
ఢిల్లీ: నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, రద్దు చేసి తిరిగి నిర్వహించాలని దాఖలైన పదుల సంఖ్యలో పిటిష్లున్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు జేబీ పార్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా పరీక్ష సెంటర్ల వారీగా విడుదల చేసిన ఫలితాల్లో కూడా గందరగోళం ఉందన్న పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి గుజరాత్ నుంచి బెల్గావి వెళ్లి పరీక్ష రాస్తే.. 700పైగా మార్కులు వచ్చాయని చెప్పారు. ఎన్టీఏ నుంచి బ్యాంక్ లాకర్లకు పేపర్లు చేరడానికి మధ్యలో ఏదో జరిగిందని తెలిపారు.విచారణ సందర్భంగా.. ఫిజిక్స్ పేపర్లోని 19వ ప్రశ్నకు రెండు ఆప్షన్లు సరైనవిగా ఎన్సీఈఆర్టీ పేర్కొందని, కొత్త ఎన్సీఈఆర్టీ ఎడిషన్ ప్రకారం, ఆప్షన్ 4 సరైన సమాధానం అని ఉంటే, మునుపటి ఎడిషన్ల ప్రకారం ఆప్షన్ 2 సరైనదిగా పేర్కొన్న విద్యార్థులకు కూడా షనల్ టెస్టింగ్ ఏజెన్సీ గ్రేస్ మార్కులు కలిపిందని పిటిషనర్ తన న్యాయవాది ద్వారాకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.దీనికిసీజేఐ బదులిస్తూ.. తాజా ఎన్సీఈఆర్టీ ఎడిషన్‌లోని సూచనలే పరిగణలోకి తీసుకోవాలని, అయితే ఆప్షన్‌కు సమాధానం ఇచ్చిన వారికి పూర్తి మార్కులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఎందుకు ఎన్టీయే అలా చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. అయితే రెండూ సాధ్యమయ్యే సమాధానాలేనని ఎస్జీ బదులిచ్చారు.అయితే ఇది సరైనది కాదని, ఏదైనా ఒక ఆప్షన్‌ను మాత్రమే ఎంపిక చేయాలని, రెండూ సరైన సమాధానాలు కాలేవని సీజేఐ పేర్కొన్నారుఈ సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ ఐఐటీ నుంచి నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని డీవై చంద్రచూడ్ తెలిపారు. "సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి ముగ్గురు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఐఐటీT ఢిల్లీ డైరెక్టర్‌ను కోరారు. ఈ నిపుణుల బృందం సరైన ఆప్షన్‌పై అభిప్రాయాన్ని రూపొందించి, రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు రిజిస్ట్రార్‌కు తెలియజేయవలసిందిగా ఆదేశించారు. మరోవైపు.. నీట్ పరీక్ష తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదన్న కేంద్రం పేర్కొంది. ఇరు వర్గాల సుధీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణను సర్వోన్నత న్యాయ స్థానం రేపటికి(మంగళావారం) వాయిదా వేసింది.ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వారీగా నీట్ పరీక్ష ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్టీఏ) విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్ష రద్దు కోరుతూ 38 పిటిషన్లు దాఖలు కాగా.. అదేవిధంగా పలు రాష్ట్రాలోని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరిన ఎన్టీఏ రెండు పిటిషన్లపైనా సుప్రీం విచారణ జరపుతోంది. -
Supreme Court: సెంటర్లవారీగా ఫలితాలు
సాక్షి, న్యూఢిల్లీ: పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా నీట్–యూజీ, 2024 ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సమగ్ర ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఎన్టీఏ వెబ్సైట్లో పొందుపరచాలని తెలిపింది. నీట్–యూజీ పేపర్ లీక్, నిర్వహణలో అవకతవకలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం విచారించింది. పరీక్షను రద్దుచేసి కొత్తగా నిర్వహించాలని, కోర్టు పర్యవేక్షణలో లీకేజీ ఉదంతంపై దర్యాప్తు జరగాలని వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. ‘‘ పరీక్షలో సెంటర్లవారీగా విద్యార్థులు పొందిన మార్కుల వివరాలను బహిర్గతంచేయండిగానీ అభ్యర్థుల ఐడెంటిటీ కనిపించకూడదు. గోప్యత పాటించండి. డమ్మీ రోల్ నంబర్లు వేసి అభ్యర్థుల మార్కుల వివరాలు ఇవ్వండి. ప్రశ్నాపత్రం సోషల్‌మీడియా ద్వారా ఎక్కువ మందికి షేర్ అయి, విస్తృతస్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతింటేనే పరీక్షను మరోమారు నిర్వహించేందుకు అనుమతిస్తాం. అంతేగానీ ఒకటి రెండు కేంద్రాలకు మాత్రమే లీకేజీ పరిమితమైతే రీటెస్ట్‌కు ఒప్పుకోం. కేసు సీబీఐ చేతికి వెళ్లకముందు బిహార్ పోలీసులు సేకరించిన ఆధారాలు, సమర్పించిన ఆర్థికనేరాల విభాగ నివేదికను రేపు సాయంత్రం ఐదింటికల్లా మాకు అందజేయండి’ అని కోర్టు ఆదేశించింది. తర్వాత కొందరు పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది నరేందర్‌హూడా వాదించారు. ‘‘ పరీక్షను రద్దుచేయాల్సిందే. ఎందుకంటే లీకేజీ వ్యవస్థీకృతంగా జరిగింది. హజారీబాగ్‌లో ప్రశ్నపత్రాలు ఆరురోజులపాటు ఒక ప్రైవేట్ కొరియర్ కంపెనీ అ«దీనంలో ఉండిపోయాయి. ఎగ్జామ్ సెంటర్‌కు ఒక సాధారణ ఈ–రిక్షాలో తరలించారు. ఈ ఉదంతంలో ఆ సెంటర్ ప్రిన్సిపల్‌ను ఇప్పటికే అరెస్ట్‌చేశారు’ అని అన్నారు. అయితే ప్రశ్నపత్రం లీక్ కాలేదని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ‘ కేవలం 1.08 లక్షల మంది అడ్మిషన్ పొందే ఈ పరీక్ష కోసం 23.33 లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టలేం. పటా్న, హజారీబాగ్ సెంటర్లలో మాత్రమే లీకేజీ అయినట్లు ప్రాథమిక సాక్ష్యాలను బట్టి తెలుస్తోంది. గుజరాత్‌లోని గోధ్రాలోనూ ఇది జరిగి ఉండొచ్చు. అయితే దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీ అయిందనే బలమైన ఆధారాలు, సాక్ష్యాలు ఉంటేనే రీ టెస్ట్‌కు ఆదేశాలిస్తాం. అయినా పేపర్ లీకేజీకి, పరీక్ష ప్రారంభానికి మధ్య ఎంత సమయం ఉంది? ఎంత మందికి పేపర్ చేరవేశారు? అనేవి కీలక అంశాలపై స్పష్టత రావాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా వేసింది. -
‘సెంటర్లవారీగా ఫలితాలు వెల్లడించండి’.. సుప్రీంకోర్టులో నీట్ విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ పేపర్ లీక్‌పై సుప్రీం కోర్టులో విచారణ సోమవారానికి(జులై 22కి) వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ ముగించే ముందు.. సెంటర్ల వారీగా ఫలితాలు విడుదల చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది. శనివారం మధ్యాహ్నాం కల్లా ఫలితాల్ని వెబ్సైట్లో ఉంచాలన్న ధర్మాసనం.. విద్యార్థుల పేర్లు మాత్రం బయటపెట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే తదుపరి విచారణలో ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. ఇక ఇవాళ్టి విచారణ టైంలోనూ సీజేఐ త్రిసభ్య న్యాయమూర్తుల బెంచ్.. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని మరోసారి స్పష్టం చేసింది. ‘‘సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు మేం ప్రాముఖ్యత ఇస్తాం. ఈ వ్యవహారంలో కోర్టు నుంచి చివరకు ఎలాంటి తీర్పు వస్తుందోనని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అలాగే పిటిషనర్లు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మరింత సమాచారాన్ని అడిగారు. అలాగే.. మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? పిటిషన్లు వేసిన విద్యార్థులు పొందిన కనీస మార్కులు ఎన్ని? అసలు ఎంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు?అని న్యాయవాదుల్ని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు.‘‘పరీక్ష రాసిన 23 లక్షల మందిలో లక్ష మంది మాత్రమే వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందుతారు. విస్తృతస్థాయిలో పేపర్ లీక్ జరిగిందని తేలితే.. రీ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది. మాకు దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాలు బయటపెడితే.. దర్యాప్తుపై ప్రభావం పడుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక.. నీట్ ప్రశ్నపత్రం లీకైనమాట వాస్తవమని తేలడంతో ఇందులో అవకతవకలు జరిగాయనడంలో ఎటువంటి సందేహం లేదని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొన్న తెలిసిందే.ల -
నీట్ రీఎగ్జామ్ అనేది లాస్ట్ ఆప్షన్ మాత్రమే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైందని, అయినప్పటికీ తిరిగి పరీక్ష నిర్వహించడం అనేది చివరి ఆప్షన్‌గానే ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలన్న పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైంది. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ, ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ఆ ప్రశ్నాపత్రం ఎంత మందికి చేరింది?. ఎంత మంది ఆ లీకేజీతో లాభపడ్డారు?. ఇప్పటివరకు ఎంత మందిని గుర్తించారు?. పేపర్ లీక్‌తో ఇంకా లాభపడ్డవాళ్లు ఎవరైనా ఉన్నారా?. ఈ కేసులో ఇంకా తప్పు చేసిన వాళ్లను గుర్తించాల్సి ఉందా?.. పేపర్ లీక్‌తో లాభపడిన విద్యార్థుల్ని ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎంత మంది ఫలితాల్ని హోల్డ్‌లో పెట్టారు?. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ఆ నివేదిక మాకు సమర్పించాలి అని కేంద్రాన్ని, ఎన్టీఏని కోర్టు ఆదేశించింది. అలాగే పేపర్ లీక్‌లకు సంబంధించిన లోపాలను పసిగట్టేందుకు దేశవ్యాప్తంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా మూడు అంశాలపై ఎన్టీఏ నుంచి మాకు స్పష్టత కావాలిలీక్ ఎలా జరిగింది.. ఎక్కడకెక్కడ జరిగింది?పేపర్ లీక్‌కు, పరీక్షకు మధ్య ఎంత సమయం ఉందిపేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితులను ట్రేస్ చేసేందుకు ఎన్టీఏ తీసుకున్న చర్యలేంటి?.. ఇది తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీరింగ్‌లు కావాలన్న మధ్యతరగతి కుటుంబాల కలకు సంబంధించిన వ్యవహారాన్ని మేం విచారణ జరుపుతున్నాం. సుమారు 23లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశం ఇది. అందుకే నీట్ పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా లేదంటే నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా మేం నీట్ రీ-టెస్ట్‌కు ఆదేశిస్తాం. లీకైన ప్రశ్నపత్రం సోషల్‌మీడియాలో వ్యాప్తి చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. కానీ, రీ-టెస్ట్‌కు ఆదేశించే ముందు.. లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉంది’’ అని ధర్మాసనం తెలిపింది. ఈ తరుణంలో విచారణను గురువారానికి వాయిదా వేస్తూ.. ఆరోజు పిటిషనర్ల వాదనలు వింటామని సుప్రీం ధర్మాసనం చెప్పింది. వాదనల సందర్భంగా.. ముందుగా కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి కొన్ని వివరాలను సీజేఐ బెంచ్ ఆరా తీసింది.. నీట్ పేపర్ సెట్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ కు ఎలా పంపించారు ?: సీజేఐప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్షా కేంద్రానికి ఎలా పంపారు ?: సీజేఐఏ తేదీలలో ఈ ప్రక్రియ జరిగింది ?: సీజేఐదీనికి అడిషనల్ సోలిసిటర్ జనరల్ సమాధానమిస్తూ.. ఒకే సెంటర్ లో పేపర్ లీక్ అయ్యిందన్నరు. అంటే నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టం అయ్యింది: సీజేఐఈ అంశంపై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది: సీజేఐ23 లక్షల మంది భవిష్యత్తును పరిరక్షించాల్సిందే: సీజేఐపరీక్ష మళ్లీ ఎందుకు నిర్వహించకూడదు?: కేంద్రంతో సీజేఐఅక్రమార్కులను గుర్తించకపోతే తిరిగి పరీక్ష నిర్వహించడం మినహా మరేదైనా మార్గం ఉందా ?: సీజేఐపేపర్ లీక్ పై ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి : పిటిషనర్లుఒకే సెంటర్ లో పేపర్ లీక్ అయ్యింది : ప్రభుత్వంపరీక్షకు మూడు గంటల ముందు పేపర్ లీక్ అయ్యింది: ఎన్టీఏ NEET-UG 2024 exam: Supreme Court observes that one thing is clear that leak (of question paper) has taken place. The question is, how widespread is the reach? The paper leak is an admitted fact. pic.twitter.com/qyfZQESMsx— ANI (@ANI) July 8, 2024నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకైందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో గత నెల రోజుల వ్యవధిలో వేర్వేరు రోజుల్లో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని విచారణకు స్వీకరించిన కోర్టు.. ఆయా సందర్భాల్లో కేంద్రానికి, ఎన్టీఏకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఆ పిటిషన్లను మొత్తంగా కలిపి ఇవాళ(జులై 8వ) విచారణ చేపట్టింది కోర్టు. సుప్రీం విచారణతోనే.. ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశాల మేరకు ఇటీవల గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. జులై6వ తేదీన కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. అయితే కౌన్సెలింగ్‌ను కోర్టు వాయిదా వేయకపోయినప్పటికీ.. నీట్ ఆందోళనల పరిణామాల నేపథ్యంలో ఎన్టీఏనే వాయిదా వేసింది. -
దేశానికి నీట్ అవసరం లేదు.. నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు
చెన్నై: వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నిర్వహణపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ, పేపర్ లీక్ అయినట్లు విద్యార్ధులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అటు విపక్షాలు సైతం నీట్ అక్రమాలపై పార్లమెంట్లో చర్చ జరపాలని పట్టుబడుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ నీట్ వివాదంపై స్పందించారు. నీట్ పరీక్ష వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేపర్ లీక్ కారణంగా ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. వివాదాస్పద నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు.ఇటీవల జరిగిన పదోతరగతి, పన్నెండవ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రదానోత్సవం రెండో దశ కార్యక్రమంలో తమిళనాడు వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడైన విజయ్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దుకోసం తమిళనాడు స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. ఈ సమస్యకు పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు.‘నీట్ పరీక్షపై ప్రజలకు నమ్మకం పోయింది. దేశానికి నీట్ అవసరం లేదు. నీట్ నుంచి మినహాయింపు ఒక్కటే పరిష్కారం. రాష్ట్ర అసెంబ్లీలో నీట్కి వ్యతిరేకంగా ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాను. తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితా కిందకు తీసుకురావాలి.నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో పెద్ద సంఖ్యలో పేద, అర్హులైన, అట్టడుగున ఉన్న విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించలేకపోతున్నారు’.అని తెలిపారు ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా ప్రత్యేక ఉమ్మడి జాబితాను రూపొందించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు. దానికింద విద్య, ఆరోగ్యాన్ని చేర్చాలన్నారు.Chennai, Tamil Nadu | Speaking at a party event, TVK chief and actor, Vijay says, "People have lost faith in NEET examination. The nation doesn't need NEET. Exemption from NEET is the only solution. I wholeheartedly welcome resolution against NEET which was passed in the State… pic.twitter.com/PatKO7MSWU— ANI (@ANI) July 3, 2024 ఇక నీట్ పరీక్షను రద్దు చేయాలని తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో డీఎంకే ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. వైద్యసీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని, మునుపటిలా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. -
నీట్ రద్దుపై ప్రధాని మోదీ, ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ
నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై వివాదం కొనసాగుతున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ స్థాయిలో ఈ వ్యవస్థను తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.వైద్య విధ్యలో విద్యార్ధుల ఎంపిక ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా ప్లస్ 2(12వ తరగతి) మార్కుల ఆధారంగా మాత్రమే ఉండాలని కోరారు. ఇది విద్యార్ధులపై అనవసరమైన అదనపు ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్పారు."దీనికి సంబంధించి, తమిళనాడును నీట్ నుండి మినహాయించాలని మరియు 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు అందించాలని మేము మా శాసనసభలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాము. ఇది రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాం. అయితే ఇంకా పెండింగ్‌లో ఉంది," అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశారు. ఇటీవల నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై రాష్ట్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని సీఎం తెలిపారు. నీటి తొలగింపుపై ఇతర రాష్ట్రాలు కూడా కోరుతున్నాయని పేర్కొన్నారు.పై విషయాలను పరిగణనలోకి తీసుకుని, నీట్ నుంచి తమిళనాడును మినహాయించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం తన సమ్మతిని అందించాలని, జాతీయ స్థాయిలో వైద్య కమిషన్ చట్టాన్ని కూడా సవరించాలని కోరుతూ తమిళనాడు శాసనసభ శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందని చెప్పారు.కాగా.. నీట్‌ను రద్దు చేయడానికి తమ తమ అసెంబ్లీలలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడాన్ని పరిశీలించాలని కోరుతూ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని సీఎంలను స్టాలిన్ లేఖల ద్వారా కోరారు. -
నీట్ పేపర్ లీక్.. బిహార్, మహారాష్ట్ర.. బయటపడిన ఢిల్లీ కనెక్షన్
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ కేసులో ఇద్దరు మహారాష్ట్ర స్కూల్ టీచర్లపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఇద్దరు టీచర్లను సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఉమర్ఖాన్ పఠాన్లుగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) గుర్తించింది.వీరు జిల్లా పరిషత్ పాఠశాలల్లో టీచింగ్ చేసేవారని, లాతూర్‌లో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కూడా నడుపుతున్నట్లు తేలింది. అనేక గంటలు విచారణ అనంతరం జలీల్ ఉమర్ఖాన్ పఠాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, సంజయ్ తుకారాం జాదవ్ పరారీలో ఉన్నారు.వీరి ఫోన్లలో పలువురు విద్యార్థుల అడ్మిట్ కార్డులు, వాట్సాప్ చాట్లను పోలీసులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు దేశ రాజధాని ఢిల్లీలో ఒక వ్యక్తితో రెగ్యులర్ కాంటాక్ట్‌లో ఉన్నారు. ఢిల్లీకి చెందిన గంగాధర్... విద్యార్ధులు సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఉమర్ఖాన్ పఠాన్లను సంప్రదించడానికి సహాయం చేసినట్లు తేలింది.మహారాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో గంగాధర్, నాందేడ్‌లోని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనర్‌గా పనిచేస్తున్న ఈరన్న కొంగళ్వార్ల పేర్లు కూడా ఉన్నాయి. మోసం, నేరపూరిత కుట్ర అభియోగాలపై వీరిపై కేసు నమోదు చేశారు.విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో శనివారం నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. డార్క్ నెట్లో పేపర్లు లీక్ కావడం, విక్రయించడం వంటి అక్రమాలపై కూడా ఇది విచారణ చేస్తోంది.అదే విధంగా పోటీ పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీక్‌లను అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని కూడా అమలు చేసింది. నేరస్తులకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా విధించడం వంటి కఠిన చర్యలు విధిస్తుంది. కాగా నీట్ యూజీ పరీక్షకు ఒక రాత్రి ముందు ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు అంగీకరించిన నలుగురిని బీహార్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసి విచారిస్తున్నారు.. -
పేపర్ లీక్ అయినా నీట్ పరీక్ష రద్దు చేయరా?
న్యూఢిల్లీ: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్-యూజీ 2024 పరీక్షపై వివాదంం రోజురోజుకీ ముదురుతోంది. పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ, పేపర్ లీక్ అయ్యిందంటూ విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పరీక్షతో పాటు త్వరలో జరగబోయే కౌన్సింగ్ ప్రక్రియను రద్దు చేసి కొత్తగా ఎగ్జామ్ నిర్వహించాలనే డిమాండ్ వెల్లువెత్తోంది.అయితే గతంలో నీట్ పేపర్ లీక్ అయినప్పుడు పరీక్షను రద్దు చేశారు. మరి ఈ దఫా అందుకు ఒకవైపు కేంద్రం.. మరోవైపు ఈ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ససేమిరా అంటోంది. అందుకు కారణం ఏంటో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ‘‘పేపర్ లీక్ పరిమిత సంఖ్యలో విద్యార్థులను మాత్రమే ప్రభావితం చేసిందని చెప్పారు. పరీక్షను రద్దు చేయడం వల్ల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది’’ అని అన్నారాయన. అలాగే ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తోందని, కోర్టే తీసుకునే నిర్ణయమని, తుది నిర్ణయమని చెప్పారు. అయితే 2004, 2015లో విస్తృతమైన లీక్‌లు జరగడం వల్ల అప్పటి పరీక్షలను రద్దు చేయడానికి దారితీసినట్లు చెప్పారు.కాగా నీట్ యూజీ పరీక్షలో 67 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించడంతో వివాదం చెలరేగింది. ప్రశ్నపత్రం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు, తప్పుడు ప్రశ్నలు రావడం కారణంగా కొంతమంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది.మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను దాదాపు 24 లక్షల మంది విద్యార్ధులు రాశారు. జూన్ న4న విడుదల ఫలితాల్లో 67 మంది అభ్యర్ధులకు 720 మార్కులు సాధించారు. దీంతో ప్రశ్న పత్రం లీక్ అయ్యిందంటూ, 1500 మంది విద్యార్ధులకు గ్రేస్ మార్కులు కలపడంపై వివాదం చెలరేగింది. పరీక్షకు ఒక రోజు ముందు పేపర్ లీకవడంపై పలువురిని అరెస్ట్ చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయితే పరీక్షను రద్దు చేయడానికి కేంద్రం నిరాకరించింది. ఈ వివాదాల నడుమనే జులై మొదటి వారంలో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఎన్టీఏ సన్నాహకాలు చేస్తుండగా.. సుప్రీం కోర్టు సైతం కౌన్సెలింగ్ వాయిదా వేయాలన్న అభ్యర్థలను తోసిపుచ్చుతూ వస్తోంది. -
నీట్ వివాదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన
నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై బిహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. పరీక్ష పేపర్ లీకేజ్‌పై పూర్తి స్థాయి రిపోర్టు అడిగామని తెలిపారు. దోషులెవరైనా వదిలి పెట్టమని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నీట్ వ్యవహారంపై ఉన్నస్థాయి కమిటీ వేస్తున్నామని చెప్పారు.దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష నీట్-యూజీ. ఈ సంవత్సరం మే 5న నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 24లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించారు. కాగా 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో వీటిని కలిపారు. దీంతోపాటు అనేకమంది పూర్తి స్థాయి మార్కులు రావడంతో నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు, పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది. -
'నీట్ పేపర్ లీక్‌తో.. తేజస్వి అనుచరుడికి సంబంధం'
పాట్నా: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. జూన్ 4న వెలువడిన నీట్ యూజీ ఫలితాల్లో ఏకంగా 67 మందికి 720 మార్కులు రావడం, వీరిలో ఆరుగురు హర్యానాలోని ఒకే సెంటర్లో పరీక్ష రాయడం సందేహాలకు దారి తీసింది. దీంతో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని.. మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్ధులు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో కొనసాగుతోంది. మరోవైపు కేసులో బిహార్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేయగా.. ఇప్పటివరకు 14 మంది అరెస్టయ్యారు.తాజాగా నీట్ పేపర్ వ్యవహారంపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. పేపర్ లీక్‌తో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడికి సంబంధం ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈ విషయంపై డిపార్ట్మెంటల్ విచారణ జరిపినట్లు తెలిపారు.గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతం కుమార్ బిహార్ రోడ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ (ఆర్సీడీ) ఉద్యోగి ప్రదీప్‌తో మాట్లాడినట్లు తెలిపారు. సికందర్ ప్రసాద్ యాదవెందు అనే ఇంజినీర్ కోసం ఎన్హెచ్ఏఐ గెస్ట్ హౌస్‌లో రూమ్ బుక్ చేయమని చెప్పాడని ఆరోపించారు.పరీక్ష జరగడానికి నాలుగురోజుల ముందు ఈ కాల్ వెళ్లినట్లు చెప్పారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారికి అధికారం లేకపోయినా.. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. పట్నాలోని ఎన్హెచ్ఏఐ గెస్ట్‌హౌస్‌లో ఆ రూమ్ బుక్ చేసిన ఆర్సీడీ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు సిన్హా చెప్పారు.మరోవైపు నీట్ నిందితులు తమ గెస్ట్ హాస్‌లో బస చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను ఎన్హెచ్ఏఐ ఖండించింది. పాట్నాలో తమకు గెస్ట్ హౌస్ సౌకర్యం లేదని ప్రకటించింది. -
విచారణ జరిపించాలి..
డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదివి ‘నీట్’ పరీక్షకు హాజరైన లక్షలాది విద్యార్థుల ఆశలపై ఆ పరీక్షల ఫలితాలు నీళ్లు చల్లాయి. ఎన్నడూ లేనివిధంగా 67 మందికి 720 మార్కులకు 720 రావడం, అలా వచ్చినవారిలో పలువురు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడం విద్యార్థులనే కాక, వారి తల్లి తండ్రులనూ నిరుత్తరులను చేసింది.దీనికి తోడు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వందలాదిమందికి పరీక్షానిర్వహణ సంస్థ ఎన్టీఏ గ్రేస్ మార్కులను ఇవ్వడం కూడా విమర్శలకు దారితీసింది. ప్రజల ఆందోళనల నేపథ్యంలో చివరికి గ్రేస్ మార్కులను ఎన్టీఏ ఉపసంహరించుకుంది. కాని, పరీక్షల నిర్వహణలో మాత్రం ఎటువంటి అవకతవకలూ జరగలేదని అనడమే విడ్డూరంగా ఉంది.ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే’ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని... కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడకపోవడం విద్యార్థుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. నీట్ పరీక్ష మాత్రమే కాక దేశంలోని ఎన్నో పోటీ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా దానిపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది.ప్రతిసారీ ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువగా ర్యాంక్‌లు రావడం, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తక్కువ ర్యాంకులు రావడంపై దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అనేక అనుమానాలు కల్గుతున్నాయి.ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి అవకతవకలు ఉన్నవని తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా లబ్ధిపొందిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. నీట్లో జరిగిన అక్రమాల కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. – గడ్డం శ్యామ్, పీడీఎస్‌యూ తెలంగాణ ఉపాధ్యక్షుడు -
నీట్ ఎగ్జామ్‌లో సత్తా చాటిన తండ్రి, కూతురు!..50 ఏళ్ల వయసులో..
కూతురు అటెన్షన్‌తో చదవాలని ఏకంగా 50 ఏళ్ల వయసులో ఆమె తోపాటు నీట్ ఎగ్జామ్‌కి ప్రిపేరయ్యాడు ఓ తండ్రి. అతడిది ఇంజీనరింగ్ బ్యాగ్రౌండ్ అయినా సరే కూతురితో పోటీపడి మరీ చదివాడు. తన కూతరిని ఇన్స్పేర్ చేసేలా ప్రిపేరయ్యి మరీ విజయం సాధించాడు. అతడి కూతురు కూడా మంచి మార్కులతో ఈ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణురాలయ్యింది. ఆ తండ్రి కూతుళ్లు విజయగాథ ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుంమా..!ఆ తండ్రి పేరు వికాస్ మంగ్రోత్రా. ఆయన ఢిల్లీలో కార్పొరేట్ ఉద్యోగిగా పనిచేన్నారు. అతడికి 18 ఏళ్ల మిమాన్సా అనే కూతురు ఉంది. ఆయన తన కూతురు నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించేలా చేసేందుకు ఓ తండ్రిగా ఈ ఏజ్‌లో చేసిన సాహసంగా చెప్పొచ్చు. వికాస్ తన కూతరికి నీట్ ఎగ్జామ్‌లో పలు సందేహాలు తీర్చేవాడు. ఆమె కూతురు పడుతున్న టెన్షన్, ఇబ్బందులు చూసి..ఆమెకు తానే స్పూర్తి కలిగించేలా చేద్దామన్న ఉద్దేశ్యంతో ఆమెతో కలిసి ఈ నీట్ ఎగ్జామ్‌కి అప్లై చేశాడు. ఇద్దరు కలిసి పోటీపడి మరీ ప్రిపేరయ్యేవారు. నిజానికి వికాస్ 90లలో డాక్టర్ కావాలనుకుని ప్రీ మెడికల్ టెస్ట్‌లకు అప్లై చేశాడు. అయితే మార్కులు తక్కువ రావడం తోపాటు కొన్నీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంజనీరింగ్ చదవాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం తన కూతురు కోసమే గాక తన సామర్థ్యాన్ని కూడా పరీక్షించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఇలా ఈ నీట్ ఎగ్జామ్ రాసినట్లు వికాస్ చెప్పుకొచ్చారు. తన కూతురు ప్రిపరేషన్లో ఎదురయ్యే సందేహాలను తీరుస్తున్నప్పుడు వాళ్లు ఫీల్ అవుతున్న ఇబ్బందులును గ్రహించి..ఎలా ఈ ఎగ్జామ్‌ని ఛాలెంజింగ్‌గా తీసుకోవాలో చెప్పాలనే ఉద్దేశ్యంతో కూతురి తోపాటు ప్రిపేర్ అయ్యానని అన్నారు. చివరికి ఇద్దరూ ఈ ఎగ్జామ్‌లో మంచి ర్యాంకులతో పాసయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ ఆయన తన కూతురుని ఎగ్జామ్‌లో బాగా ప్రిపేర్ చేసేందుకు ఒక ఏడాది పాటు సెలవులు పెట్టిమరీ ప్రిపేర్ చేయించారు. ఇక ఆయన కూడా ఆఫీస్ పనివేళ్లలు పూర్తి అయిన తర్వాత కొద్ది గంటలు ఈ ఎగ్జామ్‌కి కేటాయించి మరీ ప్రీపేర్ అయ్యినట్లు తెలిపారు. అయితే వికాస్ నీట్ ఎగ్జామ్‌ని 2022లో కూడా అటెంప్ట్ చేశానని అలాగే యూపీఎస్సీ, జేకేసెట్, సీఎస్ఈ వంటి ఇతర పరీక్షలు కూడా సరదాగా రాసేవాడినని చెప్పుకొచ్చారు. అంతేగాదు మన పిల్లలు పాఠ్యాంశాలు బాగా చదివేలా తల్లిదండ్రులుగా మనమే ముందుకొచ్చి సహకరించాలని అన్నారు. (చదవండి: లెమన్‌గ్రాస్ టీతో ఎన్ని లాభాలో తెలుసా..!) -
నీట్ పరీక్షలో అక్రమాలు.. ఎన్డీయే సర్కార్‌ను ప్రశ్నించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నీట్ పరీక్ష విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నలు సంధించారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలను ప్రభావితం చేసే సున్నితమైన, అతి ముఖ్యమైన విషయం నీట్ పరీక్ష. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది?. స్పష్టంగా పరిష్కరించాల్సిన పెద్ద సమస్య ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రి ఎందుకు కఠినంగా తిరస్కరించారు’ అంటూ కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ జత చేసి ప్రశ్నలు సంధించారు.అలాగే, నీట్‌పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలన్నారు. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అనుమానాలకు తావిస్తోంది. నీట్లో అవకతవకలపై ప్రధాని మోదీ మౌనం వీడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. Why is the NDA Govt so callous on a such a sensitive & important matter that affects lakhs of students and their families who have taken the NEET examination Why the stringent denial by the Education Minister when clearly there is a huge problem which needs to be addressed?… https://t.co/LYWjOUkkmz pic.twitter.com/7mRojL3uxG— KTR (@KTRBRS) June 17, 2024 -
ఆందోళన వద్దు.. నీట్‌పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)- యూజీ 2024 వివాదంపై కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ వివాదంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు భయపడొద్దని తెలిపారు.పేపర్ లీక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, వెల్లువెత్తుతున్న ఆరోపణలపై అధికారులు వాటిని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అంశంలో సంబంధిత అధికారుల విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు కోసం జూలై 8 వరకు వేచి చూద్దాం. దాచడానికి ఏమీ లేదు అని ఆయన అన్నారు.భారీ స్థాయిలో దేశ వ్యాప్తంగా 4,700 కేంద్రాలలో 14 విదేశాలలో 13 భాషలలో 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని ప్రధాన్ తెలిపారు. రెండు కేంద్రాలపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి చేశారు. -
NEET-UG 2024: లీక్ కాలేదు, రిగ్గింగ్ జరగలేదు: ప్రధాన్
న్యూఢిల్లీ: నీట్–యూజీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ వచి్చన ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖండించారు. అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని అన్నారు. పేపర్ లీక్గానీ, రిగ్గింగ్ గానీ జరగలేదని చెప్పారు. పేపర్ లీక్ అయ్యే అవకాశమే లేదని పేర్కొన్నారు. ఏ ఒక్క అభ్యరి్థకీ అన్యాయం జరగకూడదన్నదే తమ ఉద్దేశమని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు ఎంతో విశ్వసనీయత ఉందని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. -
NEET-UG 2024: సీబీఐతో దర్యాప్తు జరిపించాలి: ఖర్గే
న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పేపర్ లీక్‌లు, పరీక్షల్లో రిగ్గింగ్‌లతో కోట్లాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని మండిపడ్డారు. నీట్లో గ్రేసు మార్కులు మాత్రమే సమస్య కాదని, పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని, పేపర్ లీక్ అయ్యిందని, పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. నీట్ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాత దర్యాప్తునకు తాము డిమాండ్ చేస్తామని తెలిపారు. -
నీట్ రద్దుకు సుప్రీం నిరాకరణ.. ఎన్టీఏకు నోటీసులు
న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ) పరీక్షను రద్దు చేయాటలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. దీనిపై జస్టిన్ విక్రమ్ నాథ్, జస్టిస్ అమనుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది.మే 5న జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని పిటిషన్లు కోరుతున్నారని.. దీనిపై సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే నీట్ పరీక్షను రద్దు చేయడం అంత సులువు కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.విచారణ సందర్బంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది మీరు అనుకున్నంత సులభం కాదు. ఇది పవిత్రమైనది. అలా చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం, పవితత్ర దెబ్బతింటుంది. అందువల్ల ఈ ఆరోపణలపై మాకు సమాధానాలు కావాలి. ఎప్పటిలోగా సమాధానం చెబుతారు? కాలేజీల రీఓపెనింగ్ జరిగిన వెంటనే చెబుతారా? లేదంటే ఈలోగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ మొదలవుతుంది’ అని ఎన్టీఏ న్యాయవాదిని ఉద్ధేశించి జస్టిస్ అమానుల్లా పేర్కొన్నారు. దీనిపై స్పందన తెలియజేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేశారు.ఇక ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఆలోగా ఎన్టీఏ తమ సమాధానం తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.దీనికి ఎన్ టీఏ తరఫు అడ్వొకేట్ స్పందిస్తూ ఇప్పటికే దాఖలైన మరో కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారిస్తోందని.. మే 17న తమకు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఆ కేసు విచారణ జులై 8కి వాయిదా పడినందున ఈ కేసును కూడా అదే కేసుకు జత చేయాలని కోరారు. అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది.కాగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ - 2024 పరీక్షలో అవతవకలు జరిగినట్లు గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. జూన్ 4న వెలువడిన ఈ ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా మొదటి ర్యాంక్ రాగా, వారిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది.దీంతో పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వస్తున్నందున పరీక్షను రద్దు చేసి తిరిగి కొత్తగా నిర్వహించేలా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో ఆరోపణలపై విచారణకు యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి -
‘నీట్’పై టెన్షన్
సాక్షి, హైదరాబాద్: వైద్యవిద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రవేశ పరీక్ష సందర్భంగా లోపాలు తలెత్తడం... ఫలితాల వెల్లడి సమయంలో మార్కుల్లో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో ఏం జరుగుతుందా అన్న చర్చ జరుగుతోంది. అవకతవకలు జరిగినట్లు భావిస్తున్న అనేకమంది విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.దేశవ్యాప్తంగా వందలాది మంది కోర్టుల్లో పిటిషన్లు వేశారు. దీంతో అసలు నీట్ ఫలితాలు ఇవే ఉంటాయా? వాటిని రద్దు చేస్తారా? మళ్లీ నీట్ పరీక్ష ఏమైనా పెడతారా? అన్న ఆందోళనలు విద్యార్థుల్లో నెలకొన్నాయి. మరోవైపు నీట్ ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక కమిటీని ఏర్పాటు చేయడంతో సందిగ్ధ పరిస్థితి నెలకొంది. రద్దు ఉండకపోవచ్చని... దానివల్ల విద్యార్థులు మరింత నష్టపోతారని అధికారులు అంటున్నారు. ఎన్టీఏపై విమర్శల వెల్లువ మే 5న నీట్ పరీక్ష జరగ్గా, ఫలితాలను జూన్ 14న ప్రకటిస్తామని ఎన్టీఏ ముందుగానే ప్రకటించింది. కానీ జూన్ 4న దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే... అదే రోజు చడీచప్పుడు కాకుండా నీట్ ఫలితాలను ఎన్టీఏ ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. అంత హడావుడిగా ప్రకటించాల్సిన అవసరం ఏమొచి్చందనే విమర్శలు వస్తున్నాయి. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, పక్కదారి పట్టించేందుకు ఆరోజు విడుదల చేశారన్న చర్చ జరుగుతోంది. అలాగే ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులకు ముందే అవకాశం కలి్పంచారు. అయితే, ఆలిండియా ర్యాంకులు.. మార్కులు.. ఫలితాల సమగ్ర సమాచారాన్ని మాత్రం ఆరోజు మరింత ఆలస్యం చేసి ఇచ్చారు. ఇలా అనుమానాలకు తావిచ్చేలా ఎన్టీఏ వ్యవహరించిందన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లోనూ ఆలస్యం ఇక పలువురు విద్యార్థులకు ఎన్టీఏ గ్రేస్ మార్కులు ఇచి్చన అంశంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నీట్ పరీక్ష సమయం 3 గంటల 20 నిమిషాలు. కొన్ని కేంద్రాల్లో ప్రశ్నాపత్రాల అందజేతలో ఆలస్యం, చిరిగిన ఓఎంఆర్ పత్రాలు తదితర కారణాల నేపథ్యంలో సమయం వృథా అయ్యిందంటూ కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పంజాబ్, ఢిల్లీ, ఛతీస్‌గఢ్, హరియాణ న్యాయస్థానాల్లో రిట్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను ఎన్టీఏ సమీక్షించి వారికి గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు తెలిపింది. అలాగైతే దేశంలో అనేకచోట్ల విద్యార్థులకు ఆలస్యంగా పరీక్ష పేపర్ ఇచ్చారు. వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.హైదరాబాద్ మాదాపూర్‌లోని మెరీడియన్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలోని ఒక రూంలో ప్రశ్నపత్రాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చారు. ఆ గదిలో గడియారం ఆగిపోవడం... తప్పుగా చూపించడకపోవడంతో ఆలస్యం చేశారు. తప్పు సిబ్బందిదే అయినా కానీ విద్యార్థులకు అదనపు సమయం ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు అనేకమంది ప్రశ్నలు రాయలేకపోయారు. అంత సమయం పోవడం వల్ల తమకు మార్కులు తగ్గుతాయని, రావాల్సిన సీటు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. మరి వారికెందుకు గ్రేస్ మార్కులు కలపలేదని ప్రశి్నస్తున్నారు. -
నీట్ పరీక్ష ఫలితాల వివాదం : రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్- యూజీ పరీక్ష- 2024లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్ధుల తరుపున ఇదే అంశంపై పార్లమెంట్లో గళమెత్తుతామని స్పష్టం చేశారు. నీట్ పరీక్షల్లో లోపాల కారణంగా సుమారు 67మంది ప్రథమ ర్యాంక్ రావడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందే నీట్ పరీక్షల కారణంగా 24 లక్షమంది విద్యార్ధులు, వారి కుటుంబాలను నాశనం చేసింది. ఒకే పరీక్షా కేంద్రంలోని 6 మంది విద్యార్థులు గరిష్ట మార్కులతో పరీక్షలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. చాలా మంది విద్యార్ధులకు టెక్నికల్‌గా సాధ్యం కాని విధంగా మార్కులు వచ్చాయి. అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అయినప్పటికీ నీట్ పేపర్ లీక్ అయ్యిందని కేంద్రం ఒప్పుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ బలమైన ప్రణాళికను రూపొందించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా పేపర్ లీకేజీలు కాకుండా ఉండేలా చట్టం చేస్తే.. పేపర్ లీకేజీల నుంచి విద్యార్ధులను పేపర్ లీక్ నుండి విముక్తి చేస్తామని హామీ ఇచ్చాము అని ఆయన అన్నారు.లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు నేను దేశంలోని విద్యార్థులందరికీ పార్లమెంటులో మీ వాయిస్‌గా మారుతా. మీ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను గట్టిగా లేవనెత్తుతానని హామీ ఇస్తున్నాను అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. -
‘నీట్’పై ఉన్నత కమిటీ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)–అండర్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్షలో ఈ ఏడాది పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా 67 మంది అభ్యర్థులకు మొదటి ర్యాంకు రావడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు అభ్యర్థులున్నారు. అందుకే నీట్–2024ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 1,500 మందికిపైగా విద్యార్థులకు కేటాయించిన గ్రేసు మార్కులపై పునఃసమీక్ష చేయడానికి యూజీసీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కేంద్ర విద్యా శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబో«ద్‌కుమార్ సింగ్ శనివారం వెల్లడించారు. కమిటీ వారంలోగా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుందని అన్నారు. గ్రేసు మార్కులతో అర్హత ప్రమాణాలపై ప్రభావం ఉండదన్నారు. కొందరు అభ్యర్థుల ఫలితాలను పునఃసమీక్ష చేయడం వల్ల ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరగలేదన్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, కొన్ని సెంటర్లలో ఇచి్చన గ్రేసు మార్కుల కారణంగానే అభ్యర్థులకు ఈ ఏడాది ఎక్కువ మార్కులొచ్చాయని వివరించారు. ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలా వద్దా అనేది కమిటీ తేలుస్తుందన్నారు. పేపరు లీక్ కాలేదన్నారు. నీట్ విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గ్రేసు మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, అందుకే చాలామందికి ఫస్టు ర్యాంకు వచి్చందని తల్లిదండ్రులు ఆరోపిస్తుండటం తెలిసిందే. ఆరు సెంటర్లలో పరీక్ష నిర్వహణలో జాప్యం జరగడంతో అక్కడ రాసిన విద్యార్థులకు గ్రేసు మార్కులు ఇచ్చారు. మేఘాలయా, హరియాణాలోని బహదూర్గఢ్, ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, బాలోద్, గుజరాత్‌లోని సూరత్‌తోపాటు చండీగఢ్‌లో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈసారి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ రాశారు. ఈ నెల 4న ఫలితాలు వెల్లడయ్యాయి. -
NEET Row: గ్రేస్ మార్కులపై ఎన్డీఏ కీలక ప్రకటన
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ 2024 ఫలితాలపై రగడ కొనసాగుతున్న వేళ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డ్యామేజ్ కంట్రోల్‌కు దిగింది. విద్యార్థులకు అదనంగా కలిపామని చెబుతున్న గ్రేస్ మార్క్‌లను సమీక్షించడానికి అంగీకరించింది. ఇందుకోసం విద్యాశాఖ ఓ కమిటీ వేసిందని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ శనివారం మీడియాకు తెలిపారు.నీట్ యూజీ పరీక్ష నిర్వహణ.. ఫలితాల వెల్లడిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ‘‘సుమారు 1,500 మందికి ఇచ్చిన గ్రేస్మార్క్ల్ని సమీక్షించేందుకు విద్యాశాఖ నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం తర్వాతఘ ఆ 1,500 మంది ఫలితాలను సవరించే అవకాశం ఉంటుంది. అయితే.. గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హత ప్రమాణాలపై ప్రభావం పడబోదు. ప్రభావిత అభ్యర్థుల ఫలితాల సమీక్ష అడ్మిషన్ ప్రక్రియపై ప్రభావం చూపించదు’’ అని అన్నారాయన. అలాగే.. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. పేపర్ లీక్ కాలేదని, అవకతవకలేమీ జరగలేదన్న ఆయన దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టంచేశారు.ఇక.. NCERT పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్ మార్కుల వల్లే ఆ విద్యార్థులు అధిక మార్కులు సాధించడానికి కారణాలని వివరించారు. అయితే, సమీక్ష అనంతరం ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించే నిర్ణయం కూడా కమిటీ సిఫారసులను బట్టి ఉంటుందన్నారు.‘‘ప్రతి విషయాన్ని పారదర్శకంగా విశ్లేషించి నీట్ యూజీ 2024 ఫలితాలను ప్రకటించాం. మొత్తం 4,750 కేంద్రాల్లో 6 కేంద్రాలకే ఈ సమస్య పరిమితం అయింది. అలాగే, 24 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కాగా, అందులో 1,600 మంది విషయంలోనే సమస్య ఉంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష సమగ్రతకు భంగం వాటిల్లలేదు. ఏ పరీక్ష కేంద్రంలో కూడా పేపర్ లీకేజీ జరగలేదు’’ అని ఎన్ టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.విమర్శలు ఇలా.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ పరీక్షల్లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం అనుమానాలకు తావిచ్చింది. దీనితో తోడు ఈసారి చాలామంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్లో (+4, -1) మార్కింగ్ విధానం ఉంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావడం సాధ్యమయ్యే పని కాదన్నది చాలామంది వాదన. దీని గురించి ఎన్ఈటీని ప్రశ్నిస్తే 'గ్రేస్ మార్కులు' ఇచ్చామని చెబుతోంది. కొంతమంది విద్యార్థులకైతే 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చామని అంటోంది. ఇప్పుడు విమర్శల నేపథ్యంలో ఆ మార్కులనే సమీక్షించబోతోంది. ఇక పరీక్ష నాడు ప్రశ్నాపత్రాలు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో వందల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తాము తక్కువ టైంలో పరీక్ష రాయాల్సి వచ్చిందని కొందరు వాపోయారు. అయితే కేవలం ఆరు సెంటర్లలో మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైందని ఎన్ఈటీ ఇప్పుడు అంటోంది. మరోవైపు గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంభించారన్నది NTA చెప్పకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అలాగే.. నీట్ ఫలితాలను ప్రిపోన్ చేసి ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా విడుదల చేయటం కూడా రాజకీయ విమర్శలకు తావిచ్చింది. -
ఉర్దూ మీడియంలో చదివి.. 'నీట్' టాపర్‌గా..!
‘నీట్’ ఎగ్జామ్‌లో ఆలిండియా టాప్ ర్యాంకర్‌గా నిలవడం సామాన్యం కాదు. ముంబైలో ఓ బేకరి వర్కర్ కుమార్తె అయిన అమీనా ఆరిఫ్ పది వరకూ ఉర్దూ మీడియంలో చదివింది. ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంతో ఇబ్బంది పడింది. అయినా నీట్ 2024లో 720 కి 720 తెచ్చుకుని టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. ఆమె స్ఫూర్తిదాయక కథనం...‘మెహనత్ కర్నా హై... మోటివేట్ రెహనా హై (కష్టపడాలి... ప్రేరణతో ఉండాలి) అని చెప్పింది అమీనా ఆరిఫ్ తన విజయం గురించి. వైద్యవిద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్’లో 2024 సంవత్సరానికి 720 మార్కులకు 720 మార్కులతో టాప్ 1 ర్యాంకు సాధించింది అమీనా. ఈసారి దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది పరీక్ష రాస్తే వారిలో 67 మందికి టాప్ 1 ర్యాంకు వచ్చింది. వారిలో 14 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో మిగిలిన వారితో పోల్చితే అమీనా గెలుపు కాస్త భిన్నమైనది. ఎందుకంటే 10వ తరగతి వరకూ ఆమె ఉర్దూ మీడియంలో చదివింది.బేకరి వర్కర్ కుమార్తె..ముంబై పశ్చిమ శివార్లలో ఉండే జోగేశ్వరి ప్రాంతం అమీనాది. తండ్రి బేకరీలో పని చేస్తాడు. అక్కడ ఉన్న మద్నీ హైస్కూల్ మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో పేరు గడించింది. ఉర్దూ మీడియంలో బోధన సాగే ఆ స్కూల్లోనే అమీనా పది వరకు చదివింది. ఆ తర్వాత పార్లెలోని మితిబాయి కాలేజీలో బైపీసీలో చేరింది. ‘అంతవరకూ ఉర్దూ మీడియంలో చదవడం వల్ల బైపీసీ ఇంగ్లిష్ మీడియం చదవడం కష్టమైంది. ఇంగ్లిష్‌లో నా వెనుకంజ నా చదువునే వెనక్కు నెట్టకూడదని గట్టిగా కష్టపడ్డాను’ అని తెలిపింది అమీనా. ఆమెకు ఇంటర్లో 95 శాతం మార్కులు వచ్చాయి.మళ్లీ ప్రయత్నించి..‘అమ్మా నాన్నా నన్ను బాగా చదువుకోమని ప్రోత్సహించారు. లాక్డౌన్ వల్ల మొదటిసారి నీట్ రాసినప్పుడు నాకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చేంత ర్యాంక్ రాలేదు. నిస్పృహ చెందకుండా ప్రయత్నించాను. ఈసారి కోచింగ్ తీసుకున్నాను. ఆరు గంటలు కోచింగ్, ఇంట్లో మరో నాలుగైదు గంటలు సెల్ఫ్ స్టడీ... ఇలా సాగింది నా కృషి.కోచింగ్ సెంటర్లో మాక్ టెస్ట్‌లు రాసేటప్పుడు 700 మార్కులకు తరచూ 620 వచ్చేవి. అప్పుడే అనుకున్నాను... కచ్చితంగా 700 దాటుతానని ముందే అనుకున్నాను’ అని తెలిపింది అమీనా. ఆమెకు వచ్చిన ర్యాంక్‌కు దేశంలోని ఏ మెడికల్ కాలేజీలో అయినా సీట్ వస్తుంది కానీ అమీనా మాత్రం ఢిల్లీ ఎయిమ్స్‌లో చదవాలనుకుంటోంది.