‘పృథ్వీ-2’ మరోసారి సక్సెస్
బాలాసోర్(ఒడిశా): స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధిపర్చిన పృథ్వీ-2 అణ్వస్త్ర క్షిపణి మరోసారి సత్తా చాటింది. ఒడిశాలోని చాందీపూర్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మంగళవారం ఉదయం 10:05 గంటలకు క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. మొబైల్ లాంచర్ నుంచి సాల్వో మోడ్ పద్ధతిలో క్షిపణిని పరీక్షించగా.. క్షిపణి మార్గాన్ని రాడార్లు, ట్రాకింగ్ వ్యవస్థలు పర్యవేక్షించాయని, ఈ పరీక్ష అన్నిరకాలుగా విజయవంతమైందని ఐటీఆర్ డెరైక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ తెలిపారు.
రక్షణ పరిశోధన , అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) పర్యవేక్షణలో సాధారణ వినియోగ పరీక్షల్లో భాగంగా సైన్యానికి చెందిన వ్యూహాత్మక బలగాల విభాగం ఈ పరీక్ష నిర్వహించిందన్నారు. 1,000 కిలోల వరకూ వార్హెడ్లను మోసుకుపోతూ 350 కి .మీ. దూరంలోని లక్ష్యాలను పృథ్వీ-2 ఛేదించగలదు. ఈ క్షిపణి 2003లోనే సైన్యం అమ్ములపొదికి చేరింది.