Over-the-top
-
సినిమాలు మన సంస్కృతిలో భాగమే – ఎంపీ రఘునందన్ రావు
‘‘ఎవరు ఎంత బిజీగా ఉన్నా సినిమాలు చూడటం అనేది మన సంస్కృతిలో ఓ భాగమే. కరోనా తర్వాత అందరూ ఓటీటీకి అలవాటు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ‘కళింగ’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఈ సినిమా భారీ విజయం సాధించి, నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు. ధృవ వాయు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కళింగ’. ప్రగ్యా నయన్ కథానాయిక. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎం.రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ధృవ వాయు మాట్లాడుతూ–‘‘కళింగ’ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ‘కాంతార, విరూ΄ాక్ష, మంగళవారం’ సినిమాల్లా ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ సరికొత్త కాన్సెప్ట్‌తో మా సినిమా రూ΄÷ందింది’’ అన్నారు. ‘‘కళింగ’ అద్భుతంగా వచ్చింది’’ అని దీప్తి కొండవీటి పేర్కొన్నారు. ‘‘మా చిత్రాన్ని అందరూ చూసి, ఆదరించాలి’’ అని పృథ్వీ యాదవ్ కోరారు. నటీనటులు ప్రగ్యా నయన్, ప్రీతి సుందర్, తిరువీర్, సంజయ్ మాట్లాడారు. -
Savi Movie Review: ఫ్రెంచ్ సావిత్రి కథ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే చిత్రాలు చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘సావి’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఓ సినిమా కథ బావుంటే ఆ కథకి ఏ భాషా హద్దు కాదు. అలాగే ఏ దేశమూ సరిహద్దు కాదు. దానికి సరైన ఉదాహరణ ‘సావి’ సినిమా. ‘సావి’ గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాకి మూలం తెలుసుకోవడం చాలా అవసరం. 2008లో ఫ్రెంచ్ దర్శకుడు ఫ్రెడ్ కవాయే ‘ఎనీథింగ్ ఫర్ హర్’ అనే సినిమా నిర్మించారు. ఆ సినిమాను 8 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే, ఆరు మిలియన్ డాలర్ల రాబడితో సరిపెట్టుకుంది. అదే మూల కథతో సరిగ్గా రెండేళ్ళ తరువాత... అంటే 2010లో రస్సెల్ క్రోవ్ వంటి సీనియర్ నటుడుతో హాలీవుడ్ దర్శకుడు పాల్ హాగిస్ ‘ది నెక్ట్స్ త్రీ డేస్’ అనే సినిమా నిర్మించారు. ఈ సినిమాను 30 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే దాదాపు 67 మిలియన్ డాలర్లు సాధించి, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ కథ ఫ్రెంచ్‌లో ప్రారంభమై హాలీవుడ్ చుట్టి 14 ఏళ్ళ తరువాత బాలీవుడ్‌కి ‘సావి’గా అడుగుపెట్టింది. అంతలా ఈ కథలో ఏముందో చూద్దాం. అందమైన ఓ చిన్న కుటుంబం. భార్య, భర్త, ఓ చిన్న పిల్లాడు. వీరే కథకు పాత్రధారులు. అనుకోని ఓ ఘటన వల్ల ఒక హత్య కేసులో ఇరుక్కుని జీవిత ఖైదీగా శిక్ష పడుతుంది భార్యకు. దేశం కాని దేశంలో తన బిడ్డకు తల్లిని దూరం చేయలేక ఆ భర్త శిక్ష అనుభవిస్తున్న తన భార్యను జైలు నుండి తప్పించి కుటుంబమంతా ఎలా వేరే దేశం చేరుకుంటారు అనేదే కథ. ‘సావి’లో పెద్ద మార్పేంటంటే భార్య బదులు భర్తను ఖైదీగా మార్చారు. పైగా ఇండియా సెంటిమెంట్ ప్రకారం సావి అంటే సావిత్రి అని దర్శకుడు అభినయ్ డియో సినిమా ఆఖర్లో చెప్పిస్తాడు. సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అనిల్ కపూర్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో దివ్య ఖోస్లా టైటిల్ రోల్ చేశారు. థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడే వాళ్ళకు ‘సావి’ మంచి ఛాయిస్. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. – ఇంటూరు హరికృష్ణ -
ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది.. ఇంత దూరం వస్తాననుకోలేదు!
నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘రౌతు కా రాజ్’. ఆనంద్ సుర్పూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలిపారు. ఇంకా ‘సాక్షి’తో నవాజుద్దీన్ పంచుకున్న విశేషాలు. → హీరో పాత్ర, అతను ఓ కేసును పరిశోధన చేసే విధానం... ఈ రెండూ ‘రౌతు కా రాజ్’లో వీక్షకులకు కొత్తగా అనిపిస్తాయి. సినిమాలోని మర్డర్ మిస్టరీ, గ్రామీణ నేపథ్యం ఆసక్తికరంగా, సహజత్వంతో ఉంటుంది. ఈ సినిమాకు సక్సెస్ టాక్ వచ్చిందంటే ఈ ఫలితం నా ఒక్కడిదే కాదు... దర్శకుడు, ఇందులో భాగమైన నటీనటులు అందరి భాగస్వామ్యం వల్లే సాధ్యమైంది. → నేను ప్రధానంగా లీడ్ రోల్స్‌లోనే నటిస్తున్నాను. ఏదైనా కథ, అందులోని పాత్ర ఎగ్జైట్ చేసినప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాను. కథలోని నా పాత్రకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలనుకుంటాను. ఆ లక్షణాలకు నా నటన తోడైనప్పుడు ప్రేక్షకులు మెచ్చుకుంటారు. ఆడియన్స్‌ను మెప్పించే క్రమంలో నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నా ఓకే. నటుడుగా నాకెలాంటి పశ్చాత్తాపం లేదు. ఇండస్ట్రీలో ఇంత దూరం వస్తానని, ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. → ప్రస్తుతం కస్టమ్ ఆఫీసర్‌గా ఓ సినిమా, సెక్షన్ 108 మూవీలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను. దక్షిణాదిలో రజనీకాంత్‌గారి ‘పేటా’, వెంకటేశ్‌గారి ‘సైంధవ్’ సినిమాలో నటించాను. మళ్లీ దక్షిణాది సినిమాలు చేయాలని ఉంది. కథలు వింటున్నాను. ఇక యాక్టింగ్ కాకుండా వ్యవసాయం అంటే ఇష్టం. వీలైనప్పుడల్లా మా ఊరు వెళ్లిపోయి (ఉత్తరప్రదేశ్‌లోని బుడానా) వ్యవసాయం చేస్తుంటాను. -
Abha Sharma: పెద్ద వయసులో.. పెద్ద గుర్తింపు
చిగుళ్ల వ్యాధి వల్ల 35 ఏళ్ల వయసులో పళ్లు కోల్పోయింది అభా శర్మ. 45 ఏళ్ల వయసులో ఆమెకు అవయవాలు కంపించే అరుదైన వ్యాధి వచ్చింది. అయినా నటి కావాలన్న కోరికను ఆమె చంపుకోలేదు. నాటకాల్లో పాత్రలు వేయసాగింది. ఇప్పుడు ‘పంచాయత్ 3’ వెబ్ సిరీస్‌లో పల్లెటూరి అమ్మగా నటించి దేశం మొత్తానికి అభిమాన నటి అయ్యింది. 75 ఏళ్ల వయసులో విజయాన్ని చూసిన అభా శర్మ పరిచయం.ఉత్తర ప్రదేశ్‌లోని ‘ఫుల్వారా’ అనే పల్లెటూళ్లో ఒక ముసలామె పంచాయతీ ఆఫీస్‌కు వచ్చి– ‘నా కొడుకు నన్ను ఇంట్లోంచి తరిమి కొట్టాడు. నాకో ఇల్లు మంజూరు చేయి నాయనా’ అని పంచాయతీ ఆఫీసర్ని ప్రాధేయపడుతుంది.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప్రకారం ఊరికి 11 ఇళ్లు మంజూరై ఉంటాయి. వాటిని ఎవరెవరికి ఇవ్వాలనేది సర్పంచ్, పంచాయతీ ఆఫీసర్ నిర్ణయించాలి. ఈ ముసలామెకు ఇల్లు మంజూరు చేద్దామా అనుకుంటాడు ఆఫీసర్. కాని పల్లెల్లో అదంత సులభం కాదు. ‘నిజంగానే ముసలామెను కొడుకు తరిమి కొట్టాడా లేదా’ అనే ఎంక్వయిరీ జరుగుతుంది. ఊరి జనం కూడా ముసలామె ఇంటి మీద నిఘా పెడతారు. కొడుకు కాపురం ఒక గదిలో ఉంటే ముసలామె వేరొక గుడిసెలో అవస్థలు పడుతూ ఉంటుంది. ఇదంతా నిజమని భావించిన ఆఫీసర్ ముసలామెకు ఇల్లు మంజూరు చేస్తాడు. కాని ఇదంతా అబద్ధమని తేలుతుంది. ‘పేదవాడైన నా కొడుక్కి ఒక ఇల్లు ఇచ్చి వెళితే వాడు సుఖపడతాడని ఈ నాటకం అంతా ఆడాను’ అంటుంది ముసలామె. కాని ‘ఇంటి కోసమని నా కొడుకు, కోడలు, మనవణ్ణి వదిలి వేరే కుంపటి పెట్టి ఎలా బతకగలను’ అని బాధ పడుతుంది.ఒక వైపు పేదరికపు దీనత్వం, మరోవైపు బాంధవ్యాల దృఢత్వం... ఇవి ‘పంచాయత్ 3’ సిరీస్‌లోని ‘ఘర్’ అనే ఎపిసోడ్లో కనిపిస్తాయి. ఈ ఎపిసోడ్‌లోని ‘అమ్మాజీ’గా నటించిన అభా శర్మ ఇప్పుడు దేశంలో చాలామందికి అభిమాన నటిగా మారింది.75 ఏళ్ల వయసులో...అభా శర్మది లక్నో. ఇప్పుడామె వయసు 75 సంవత్సరాలు. ఈ వయసులో ఆమె ఎర్రటి ఎండల్లో మధ్యప్రదేశ్‌లో ఔట్డోర్కు వెళ్లి షూట్ చేయడమే కాదు అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది. ‘నాకు చిన్నప్పటి నుంచి నటించాలనే కోరిక ఉంది. కాని మా అమ్మ పడనివ్వలేదు. నేను టీచర్‌గా పని చేస్తూ ఆ కోరికను మనసులోనే అదిమేశాను. కాని మా అమ్మ చనిపోయాక నా 47వ ఏట నటన మొదలెట్టాను. లక్నోలోని నాటక బృందాలతో నాటకాలు ఆడాను. నాకు 54 ఏళ్ల వయసున్నప్పుడు మొదటిసారి ఒక అడ్వర్టైజ్మెంట్లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాను. కాని ఇప్పుడు పంచాయత్ 3లో నేను చేసిన వేషం ప్రపంచమంతా చూసింది. నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. ఎంతో ఆనందంగా ఉంది. 75 ఏళ్ల వయసులో నేను ఇంత గుర్తింపు పొందడం చూశాక– ఎవరైనా సరే తమ కలలను చివరి వరకూ నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలని చె΄్పాలనిపించింది’ అని చెప్పింది అభా శర్మ.జీవితంలో సవాళ్లుతండ్రి చనిపోయాక అభా శర్మకు తల్లిని చూసుకునే బాధ్యత వచ్చింది. ఆమె కోసం అభా శర్మ వివాహం చేసుకోలేదు. కాని 35వ ఏట ఆమెకు చిగుళ్ల వ్యాధి వచ్చి పళ్లు ఊడిపోయాయి. అంటే కాలక్రమంలో కృత్రిమ పళ్లు పెట్టడానికి కూడా వీలు కాని స్థితి. సాధారణంగా స్త్రీలు ఇలాంటి స్థితిలో నలుగురి ముందుకు రావడానికి ఇష్టపడరు. కాని అభా ఒక వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు తల్లిని చూసుకుంది. ఆమె మరణించాక నాటకాల్లోకి వచ్చింది. అయితే ఆమెకు శరీర అవయవాలు కంపించే అరుదైన వ్యాధి కూడా వచ్చింది. దాని వల్ల ఆమె మాట్లాడే విధానం చాలా స్లో అయిపోయింది. ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ నటించాలనే పట్టుదలతో నటించి విజయం సాధించింది అభా శర్మ.పంచాయత్ అంటే...టి.వి.ఎఫ్. నిర్మాణ సంస్థ అమేజాన్ కోసం తీసిన కామెడీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’. ఇప్పటికి రెండు సిరీస్‌లు ఘన విజయం సాధించి ఇప్పుడు మూడో సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. భారతదేశంలోని చిన్న ఊళ్లలో మనుషుల అమాయకత్వం, వారి చిన్న చిన్న ఆకాంక్షలు, రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా వారికి అందాల్సిన సాయాల్లో వచ్చే ఆటంకాలు... ఇవన్నీ ఈ సిరిస్‌లో సహజంగా చూపించడంతో సూపర్ హిట్ అయ్యింది. రఘవీర్ యాదవ్, నీనా గు΄్తా, జితేంద్ర కుమార్ ప్రధాన తారాగణం. -
18 ఓటీటీలపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: అసభ్యకర, అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేసినందుకుగాను 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, వాటికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయనున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, వీటికి సంబంధం ఉన్న 19 వెబ్సైట్లు, 10 యాప్‌లు, 57 సోషల్ మీడి యా ఖాతాలను దేశంలో ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండవని పేర్కొంది. తొలగించే 10 యాప్‌లలో ఏడు గూగుల్ ప్లే స్టోర్, 3 యాపిల్ యాప్ స్టోర్‌లో ఉండేవి. వేటుపడిన 18 ఓటీటీలివే.. డ్రీమ్స్ ఫిలిమ్స్, వూవీ, యెస్మా, అన్‌కట్ అడ్డా, ట్రీఫ్లిక్స్, ఎక్స్ప్రైమ్, నియోన్ ఎక్ వీఐపీ, బేషరమ్స్, హంటర్స్, రబ్బిట్, ఎక్స్‌ట్రామూడ్, న్యూఫ్లిక్స్, మూడ్ ఎక్స్, మోజోఫ్లిక్స్, హాట్ షాట్స్ వీఐపీ, ఫుగీ, చికూఫ్లిక్స్, ప్రైమ్ప్లే వంటి ఓటీటీ సోషల్ మీడియా ఖాతాలను తొలగించారు. తొలగించిన వాటిలో 12 ఫేస్బుక్ ఖాతాలు, 17 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, 16 ఎక్స్ ఖాతాలు, 12 యూట్యూబ్ ఖాతాలు సోషల్ మీడియా ద్వారా అశ్లీలతను ప్రసారం చేస్తున్నాయి. -
ఓటీటీని ఆస్వాదిస్తున్న నెటిజన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ వినియోగదార్లలో 86 శాతం మంది ఓటీటీ (ఓవర్ ది టాప్) ఆడియో, వీడియో సేవలను ఆస్వాదిస్తున్నారు. వీరిలో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారని ఓ నివేదిక వెల్లడించింది. లక్షదీ్వప్ మినహా కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన 90,000 పైచిలుకు గృహాల నుంచి సమాచారాన్ని సేకరించి నివేదికలో పొందుపరిచారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఐఎంఏ), మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ కాంటార్ సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. స్మార్ట్ టీవీ, స్మార్ట్ స్పీకర్స్, ఫైర్‌స్టిక్స్, క్రోమ్కాస్ట్ల పెరుగుదల ద్వారా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సేవలు 2021తో పోలిస్తే 2023లో 58 శాతం ఎగసింది. 18.1 కోట్ల మంది సంప్రదాయ టీవీ వీక్షణ సాగిస్తే, ఇంటర్నెట్ ఆధారిత పరికరాల ద్వారా వీడియో కంటెంట్‌ను 20.8 కోట్ల మంది ఆస్వాదిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం ఇలా.. ఇంటర్నెట్ వినియోగదార్లలో కమ్యూనికేషన్స్ కోసం 62.1 కోట్ల మంది, సామాజిక మాధ్యమాలను 57.5 కోట్ల మంది వాడుతున్నారు. 2023 నాటికి యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య భారత్‌లో 82.3 కోట్లు ఉంది. జనాభాలో 55 శాతంపైగా గతేడాది ఇంటర్నెట్ వాడారు. 2022తో పోలిస్తే గతేడాది ఈ సంఖ్య 8 శాతం ఎక్కువ. మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో గ్రామీణ ప్రాంతాల వారు అత్యధికంగా 44.2 కోట్ల (53 శాతంపైగా) మంది ఉన్నారు. స్థానిక భాషల్లో కంటెంట్‌ను వీక్షించేందుకే 57 శాతం యూజర్లు మొగ్గు చూపుతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషలకు అధిక డిమాండ్ ఉంది. ఇక 2015లో మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో పురుషులు 71 శాతం కాగా, స్త్రీలు 29 శాతం నమోదయ్యారు. 2023లో పురుషుల వాటా 54 శాతానికి వచ్చి చేరింది. స్త్రీల వాటా 46 శాతానికి ఎగసింది. దేశంలోని లింగ నిష్పత్తికి దాదాపు సమంగా ఉంది. -
లావణ్య మిస్ పర్ఫెక్ట్
లావణ్యా త్రిపాఠి, అభిజీత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘న్యూ ఇయర్‌ను పర్ఫెక్ట్గా మొదలు పెట్టబోతున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు లావణ్యా త్రిపాఠి. ‘‘ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేసే మిస్టర్ పర్ఫెక్ట్ల గురించి మాట్లాడుకుంటుంటాం. కానీ మిస్ పర్ఫెక్ట్గా ఓ అమ్మాయి ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది? ఎలా పని చేయిస్తుంది? అనే అంశాలను హిలేరియస్‌గా ఈ వెబ్ సిరీస్‌లో చూపించబోతున్నాం’’ అన్నారు విశ్వక్ ఖండేరావ్. ‘‘అనుకోకుండా ఏర్పరచుకునే కొన్ని అనుబంధాలు మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అనే ప్రేమకథతో ‘మిస్ పర్ఫెక్ట్’ని రూపొందించాం’’ అన్నారు సుప్రియ యార్లగడ్డ. ఈ సిరీస్‌కు సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, కెమెరా: ఆదిత్య జవ్వాదా. -
దూత ఓ కొత్త అనుభూతి
‘‘థ్యాంక్యూ’ సినిమా తర్వాత ‘దూత’ వెబ్ సిరీస్ గురించి నాగచైతన్యతో చెప్పాను. హారర్, థ్రిల్లర్ నేపథ్యం అంటే నాకు భయం అన్నాడు. కథ వినమన్నాను. ఆ తర్వాత కథ నచ్చడంతో చేస్తానని చెప్పాడు. సూపర్ నేచురల్, ఊహాతీతమైన అంశాలతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ అన్నారు. హీరో నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీశంకర్, ్రపాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శరత్ మరార్ నిర్మించిన ఈ సిరీస్ డిసెంబరు 1 నుంచి అమేజాన్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎనిమిది ఎపిసోడ్స్‌గా ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విక్రమ్ కె. కుమార్ చెప్పిన విశేషాలు. ► ‘దూత’ పూర్తిగా కల్పిత కథ. ‘దూత’ అంటే ఏదైనా సమాచారాన్ని చేరవేసేవాడు. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాగర్ పాత్రలో నాగచైతన్య అద్భుతంగా నటించాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటేనే సవాల్‌తో కూడుకున్నది. సంచలనం సృష్టించిన ఓ ఘటన తాలూకు వాస్తవాలను సాగర్ ఎలా పాఠకుల ముందు ఉంచాడు? ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? అనేది ప్రేక్షకులు అంచనా వేయలేరు. తన కంఫర్ట్ జోన్ నుండి బయటకి వచ్చి, ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రని సవాల్‌గా తీసుకుని చేశాడు నాగచైతన్య. ►‘దూత’లో మూడు సినిమాలు తీసేంత కథ ఉంది. అందుకే వెబ్ సిరీస్‌గా తీశాం. పైగా సినిమాగా తీస్తే మన ప్రేక్షకులకు మాత్రమే చేరువ అవుతుంది. ఓటీటీలో ప్రసారం చేయడం ద్వారా ఇతర దేశాల్లోని వారు కూడా మన ఇండియన్ వెబ్ సిరీస్‌లు చూసే అవకాశం ఉంటుంది. ►షార్ట్ ఫిలిం, వెబ్ ఫిల్మ్, సినిమా.. దేని కష్టం దానికి ఉంటుంది. అయితే సినిమా తీయడం సులభమే.. కానీ, మంచి మూవీ తీయడం చాలా కష్టం. -
ఓటీటీలు డబ్బు కట్టకుండా 5జీని వాడుకుంటున్నాయ్
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు ఎలాంటి చెల్లింపులు చేయకుండా 5జీ నెట్‌వర్క్‌ను వాడుకుంటున్నాయని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఆరోపించారు. వాటిని వాడుకుంటున్నందుకు గాను ఆయా సంస్థలు తమకు వచ్చే లాభాల్లో కొంతైనా టెల్కోలకు చెల్లించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘టెల్కోలు తమ వాయిస్, డేటా ట్రాఫిక్ కోసం నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తాయి. అయితే, ఓటీటీ సంస్థలు మాత్రం భారీ డేటా చేరవేత కోసం ఈ నెట్‌వర్క్‌లపై పెను భారం మోపుతున్నాయి. కంటెంట్ ప్రొవైడర్స్ నుంచి తీసుకున్న డేటాను తమ ప్లాట్‌ఫాం ద్వారా యూజర్లకు చేరవేస్తాయి. ఈ ప్రక్రియలో ఉపయోగించుకునే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన సంస్థలకు మాత్రం పైసా చెల్లించడం లేదు‘ అని కొచర్ చెప్పారు. ఓవైపున 5జీ వంటి అధునాతన టెక్నాలజీ నెట్‌వర్క్‌ల ఏర్పాటు కోసం భారీగా పెట్టుబడులు పెట్టలేక టెల్కోలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మాత్రం వాటితో లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసి, నిర్వహిస్తున్నందుకు గాను టెల్కోలకు ఓటీటీలు తమకు వచ్చే లాభాల్లో సముచిత వాటాను ఇవ్వాలని కొచర్ పేర్కొన్నారు. నెట్‌వర్క్‌లు, డిజిటల్ కనెక్టివిటీ, స్మార్ట్ఫోన్ల వినియోగం మెరుగుపడిన నేపథ్యంలో భారత్‌లో వీడియో ఓటీటీ మార్కెట్ 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీలైవ్ వంటి ఓటీటీ సంస్థలకు భారత్‌లో పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు. -
టెల్కోల వాయిస్ కాల్స్‌కు ఓటీటీ దెబ్బ
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో టెల్కోల ఆదాయంలో వాయిస్ కాల్స్ వాటా 80 శాతం, ఎస్ఎంఎస్ల వాటా 94 శాతం పడిపోయింది. అయితే, డేటా వాటా 10 రెట్లు పెరిగింది. ఓటీటీలను నియంత్రణ పరిధిలోకి తెచ్చే క్రమంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపొందించిన చర్చాపత్రంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2013 జూన్ త్రైమాసికం – 2022 డిసెంబర్ త్రైమాసికం మధ్య కాలంలో గణాంకాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం.. గత దశాబ్ద కాలంలో మెసేజింగ్, వాయిస్ కమ్యూనికేషన్ కోసం ఓటీటీ యాప్‌ల వినియోగం పెరగడం వల్ల అంతర్జాతీయంగా టెల్కోలకు వాయిస్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే ఆదాయాలు .. క్రమంగా డేటా వైపునకు మళ్లాయి. దేశీయంగా చూస్తే టెల్కోలకు సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయానికి (ఏఆర్పీయూ) సంబంధించి డేటా విభాగం తప్ప మిగతా అన్నింటి వాటా తగ్గిపోయింది. 2013 జూన్ క్వార్టర్లో టెల్కోల ఆదాయంలో డేటా వాటా 8.1 శాతంగా ఉండగా 2022 డిసెంబర్ త్రైమాసికంలో 10 రెట్లు పెరిగి 85.1 శాతానికి చేరింది. మరోవైపు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడమా లేక నిర్దిష్టంగా కొన్ని కాలింగ్, మెసేజింగ్ యాప్‌లను నిలిపివేయడమా అనే చర్చనీయాంశాన్ని కూడా చర్చాపత్రంలో ట్రాయ్ స్పృశించింది. ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్స్‌ను పూర్తిగా షట్‌డౌన్ చేయడం వల్ల ఎకానమీకే కాకుండా విద్యా, వైద్యం వంటి కీలక సేవలకు కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అల్లర్లు రేపేందుకు ఉగ్రవాదులు లేదా విద్రోహ శక్తులు ఉపయోగించే అవకాశమున్న నిర్దిష్ట ఓటీటీ యాప్‌లు, వెబ్సైట్లను మాత్రమే నిషేధించడం శ్రేయస్కరం కావచ్చని ట్రాయ్ పేర్కొంది. -
తండ్రి నిర్మాత.. కుమార్తె కథానాయిక
‘అలాంటి ఇలాంటి లాంచింగ్ కాదు.. ఓ రేంజ్లో ఉండాలి’ అన్నట్లు కుమార్తె సుహానా ఖాన్ వెండితెర అరంగేట్రానికి షారుక్ ఖాన్ రంగం సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే సుహానా నటిగా మేకప్ వేసుకుంది. జోయా అక్తర్ దర్శకత్వంలో ‘ది ఆర్చీస్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఈలోపు సుహానా వెండితెరపై పరిచయం కావడానికి ఓ సినిమా సైన్ చేసిందని సమాచారం. కుమార్తె అరంగేట్రం అట్టహాసంగా జరగాలనే ఆలోచనతో తనకు ఇటీవల ‘పఠాన్’లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాలని షారుక్ అనుకుంటున్నారట. అది మాత్రమే కాదు.. అతిథి పాత్ర కూడా చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం కథ రెడీ అవుతోందని సమాచారం. ఇంకా దర్శకుడి ఎంపిక జరగలేదని టాక్. -
నిజాలను చూడటం కష్టం!
‘‘కొన్నిసార్లు నిజాలను చూడటం చాలా కష్టం.. మరి మీరు ఆమె చీకటి ప్రపంచాన్ని చూడ్డానికి రెడీ అవుతారా?’’ అంటూ సోనమ్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘బ్లైండ్’ విడుదల తేదీని ప్రకటించారు. జూలై 7 నుంచి ఈ చిత్రం ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. కొరియన్ మూవీ ‘బ్లైండ్’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో సోనమ్ అంధురాలిగా నటించారు. ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోడానికి ఓ లేడీ పోలీసాఫీసర్ చేసే ప్రయత్నం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. బ్లైండ్ పోలీసాఫీసర్‌గా సోనమ్ అద్భుతంగా నటించారని చిత్ర యూనిట్ పేర్కొంది.. షోమ్ మఖీజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కాగా ఓటీటీ ప్లాట్ఫామ్లో సోనమ్ కనిపించనున్న తొలి చిత్రం ఇదే కాగా, తల్లయ్యాక (గత ఏడాది ఆగస్ట్ 20న ఓ బాబుకి జన్మనిచ్చారు) కనిపించనున్న చిత్రం కూడా ఇదే అవుతుంది. -
ఓటీటీ .. పరిశ్రమ సూపర్ హిట్.. ఆదాయంలో దక్షిణాది సినిమాల జోరు!
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) కంటెంట్ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ విలువ రూ.10,000 కోట్లుగా ఉంటే, 2030 నాటికి రూ.30,000 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2024 మార్చి నాటికి రూ.12,000 కోట్లకు చేరుకుంటుందని, ఏటా 20 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఐఎన్10మీడియా సీవోవో, సీఐఐ దక్షిణ్ స్టీరింగ్ కమిటీ సభ్యుడైన అనూప్ చంద్రశేఖరన్ తెలిపారు. ఓటీటీ పరిశ్రమపై చెన్నైలో దక్షిణాది మీడియా, ఎంటర్టైన్మెంట్ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సీఐఐ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలవుతున్న వాటితో పోలిస్తే.. వచ్చే 12 నెలల్లో దక్షిణాది భాషల్లో పెద్ద సంఖ్యలో వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి’’అని స్టార్/డిస్నీ ఇండియా బిజినెస్ హెడ్ కృష్ణన్ కుట్టి తెలిపారు. దక్షిణాది సినిమాల జోరు దేశం మొత్తం మీద దక్షిణాది సినిమాలు అత్యధిక ఆదాయాన్ని సృష్టిస్తున్నాయి. 2022లో దక్షిణాది సినిమాలు రూ.7,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. అంతకుముందు ఏడాది ఆదాయంతో పోలిస్తే రెట్టింపు అయింది. అంతేకాదు గతేడాది దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఆదాయంలో దక్షిణాది సినిమాల వాటాయే 50 శాతంగా ఉండడం గమనార్హం. ఈ వివరాలను సీఐఐ దక్షిణాది విభాగం రూపొందించిన నివేదికలో పేర్కొంది. ‘తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంతో కూడిన దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆదాయం 2022లో రూ.7,836 కోట్లుగా ఉంది. 2021లో ఆదాయం రూ.3,988 కోట్టే. 2022లో మొత్తం భారత సినీ పరిశ్రమ ఆదాయం రూ.15,000 కోట్లు. దక్షిణాదిలోనూ తమిళ సినిమా రూ.2,950 కోట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ.2,500 కోట్లతో తెలుగు సినీ పరిశ్రమ ఉంటే, కన్నడ పరిశ్రమ ఆదాయం రూ.1,570 కోట్లు, మలయాళ పరిశ్రమ ఆదాయం రూ.816 కోట్లు. ముఖ్యంగా కన్నడ నాట కేజీఎఫ్:చాప్టర్ 1, కాంతార సినిమాలు బంపర్ వసూళ్లతో పరిశ్రమ రూపాన్ని మార్చేశాయి’అని నివేదిక తెలిపింది. మలయాళ పరిశ్రమ స్థానికంగా, విదేశాల్లోనూ ఆదాయాన్ని పెంచుకుంది. దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ఒక్కటే రూ. 1,200 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కమల్ హాసన్ విక్రమ్, మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాలు తమిళనాట ఆదాయాన్ని పెంచాయి. 2022 లో దక్షిణాదిన 916 సినిమాలు విడుదలయ్యాయి. థియేటర్, ఓటీటీలో విడుదలైనవీ ఇందులో ఉన్నాయి. కంటెంట్‌కు డిమాండ్ స్క్రిప్ట్‌ను అందించేందుకు తాము ఒక నెల సమయం తీసుకుంటున్నామని అర్హ మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ సహ వ్యవస్థాపకుడు అజిత్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం ఏటా వివిధ ప్లాట్‌ఫామ్‌ల కోసం 60 ఒరిజినల్స్ అవసరం ఉంటోందన్నారు. నిర్మాతలు దీన్ని అవకాశంగా తీసుకోవాలని కోరారు. ‘‘తమిళం, తెలుగు ఓటీటీపైనే జీ ఓటీటీ ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించింది. ప్రస్తుతం కన్నడ ఓటీటీ మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. మలయాళం ఓటీటీ పరిశ్రమకు కావాల్సిన కంటెంట్‌ను ప్రస్తుతం నిర్మాతలు అందించే స్థితిలో ఉన్నారు’’అని జీ5 ఓటీటీ చీఫ్ క్లస్టర్ ఆఫీసర్ సిజు ప్రభాకరన్ వివరించారు. -
ఆహా సీఈవోగా రవికాంత్ సబ్నవీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ సీఈవోగా రవికాంత్ సబ్నవీస్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆ స్థానంలో ఉన్న అజిత్ ఠాకూర్ .. బోర్డ్ డైరెక్టరుగా పదోన్నతి పొందారు. సబ్నవీస్ నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఆయన అపార అనుభవం ఆహా వృద్ధికి తోడ్పడగలదని సంస్థ ప్రమోటర్ రాము రావు జూపల్లి తెలిపారు. కంపెనీకి ప్రత్యేక గుర్తింపు తేవడంలో అజిత్ కీలక పాత్ర పోషించారని, ఇకపైనా ఆహా స్టూడియో మొదలైన అంశాల్లో ఆయన మార్గదర్శకత్వం వహిస్తారని ఆహా ప్రమోటర్ అల్లు అరవింద్ పేర్కొన్నారు. విశిష్టమైన ప్రోగ్రామ్‌లతో వీక్షకులకు ఆహాను మరింత చేరువ చేసేందుకు ఆహా బృందం కృషి చేస్తుందని సబ్నవీస్ చెప్పారు. స్టార్ టీవీ, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, హెయిన్జ్ ఇండియా వంటి పలు రంగాల సంస్థల్లో వివిధ హోదాల్లో సబ్నవీస్కు 30 ఏళ్ల పైగా అనుభవం ఉంది. -
యూసేజ్ ఫీజు సహేతుకమే
న్యూఢిల్లీ: యూసేజీ ఫీజు అంశంపై ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీస్ సంస్థలు, టెల్కోల మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా ఓటీటీ సంస్థలు యూసేజీ ఫీజు కట్టాలంటూ తాము చేస్తున్న డిమాండ్ ’సముచితమైనది, సహేతుకమైనదే’ అని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ స్పష్టం చేశారు. ఇది ఎకానమీ వృద్ధికి దోహదపడుతూనే డిజిటల్ ఇన్ఫ్రాను మెరుగుపర్చుకునేందుకు కూడా తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. టెలికం సేవల వినియోగం ద్వారా యూజర్లను పొందుతున్నందున తమకు ఆదాయంలో వాటా ఇవ్వాలంటూ టెల్కోలు కోరడాన్ని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఐఎంఏఐ) తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఇది నెట్ న్యూట్రాలిటీ విధానానికి విరుద్ధమని ఏఐఎంఏఐ ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో కొచర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూసేజీ ఫీజుల అంశాన్ని కొన్ని శక్తులు స్వలాభం కోసం పక్కదారి పట్టిస్తున్నాయని ఏఐఎంఏఐ పేరు ప్రస్తావించకుండా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కొచర్ వ్యాఖ్యానించారు. లైసెన్సింగ్ నిబంధనల ప్రకారం టెల్కోలన్నీ నెట్ న్యూట్రాలిటీకి (ఇంటర్నెట్ సేవలందించడంలో పక్షపాతం చూపకుండా తటస్థంగా ఉండటం) కట్టుబడి ఉన్నా యని ఆయన స్పష్టం చేశారు. టెలికం సంస్థలు మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రం కోసం భారీగా వెచ్చిస్తాయని, రకరకాల పన్నులు చెల్లిస్తాయని, నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని కొచర్ చెప్పారు. దానికి విరుద్ధంగా భారీ విదేశీ కంపెనీలు నిర్వహించే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు టెల్కోల నెట్వర్క్ ఉచితంగా వాడుకుంటూ, యూజర్లను పెంచుకుని, ప్రకటనల ద్వారా ప్రత్యక్షంగా.. పరోక్షంగా లబ్ధి పొందుతున్నాయని ఆయన తెలిపారు. ఆయా ప్లాట్‌ఫాంలు ప్రస్తుతం టెలికం చట్ట పరిధిలో లేనందున ఆదాయాలపై భారత్‌లో పన్నులు కట్టే పరిస్థితి ఉండటం లేదని చెప్పారు. -
ఓటీటీలకు షాక్: సీవోఏఐ కొత్త ప్రతిపాదన
న్యూఢిల్లీ: ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్స్ సేవలు అందించే సంస్థలకు కూడా లైసెన్సింగ్ విధానం, తేలికపాటి నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఉండాలని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. టెల్కోల నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుని ఈ సేవలు అందిస్తున్నందున అవి నేరుగా తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. టెలికం బిల్లు ముసాయిదాలో ఓటీటీ కమ్యూనికేషన్స్ సేవలకు సంబంధించిన నిర్వచనం విషయంలో తాము ఈ మేరకు సిఫార్సులు చేసినట్లు సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. టెల్కోలకు ఓటీటీ సంస్థలు పరిహారం చెల్లించే అంశానికి సంబంధించి.. ఆదాయంలో వాటాల విధానాన్ని పరిశీలించవచ్చని ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు ఆయన వివరించారు. భవిష్యత్‌లో ఇతర ఓటీటీలకు (అన్ని కేటగిరీలు) కూడా డేటా వినియోగం ఆధారిత ఆదాయ పంపకం సూత్రాన్ని వర్తింప చేయవచ్చని కొచర్ చెప్పారు. -
అందుకే అరవై షార్ట్ ఫిలింస్ తీశా!
‘‘నేటి యువత చదువు, నా కుటుంబం, నా ఉద్యోగం, నా సంపాదన అంటూ ఉరుకులు పరుగులు పెడుతోంది. అలాంటి యువతరానికి విలువల గురించి చెప్పాలని తీసిన చిత్రం ‘కవి సమ్రాట్’. విలువల కోసం యువత పరుగులు పెడితే భారతదేశం గతం కంటే వంద రెట్లు బాగుంటుంది’’ అని ప్రముఖ రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్ అన్నారు. పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారగ్రహీత, కవి విశ్వనాథ సత్యనారాయణ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కవి సమ్రాట్’. ఎల్బీ శ్రీరామ్ టైటిల్ రోల్లో నటించి, నిర్మించారు. సవిత్ సి. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 22 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ పంచుకున్న విశేషాలు. ► పాఠశాల స్థాయిలోనే నాటకాలు రాసి, దర్శకత్వం వహించి, నటించేవాణ్ణి. సామాజిక అంశాలపైనే నా నాటక రచనలు ఉండేవి. ఆ తర్వాత నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. అయితే నటుల మధ్య ఎక్కువ పోటీ ఉండటంతో పన్నెండేళ్ల పాటు రచయితగా చేశాను. నా గురువు ఈవీవీ సత్యనారాయణగారి వద్ద చాలా సినిమాలకు రచయితగా చేశాను. ► ఈవీవీగారి ‘చాలా బాగుంది’ నటుడిగా నాకు బ్రేక్ ఇచ్చింది. అయితే ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాలో నా పాత్ర సీరియస్‌గా ఉండటంతో అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చేవి. ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. డైరెక్టర్లు చెప్పినట్లు చేస్తే డబ్బులు వస్తాయి.. కానీ, డబ్బుకన్నా సంతృప్తి ముఖ్యం. దాంతో చాలా సినిమాలు వదులుకున్నాను. నా మనసుకు నచ్చిన, విలువలతో కూడిన అంశాలను ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను. అందుకే అరవై షార్ట్ ఫిలింస్ తీశాను. ► భారతదేశంలోని ధ్వజస్తంభాల్లాంటి మహనీయుల్లో కొందరి చరిత్రలైనా చెబుదామనిపించింది. ఈ క్రమంలో యువతని ప్రోత్సహించాలనుకున్నాను. ప్రతిభావంతులైన తొమ్మిది మందిని ఎంచుకుని, కథలు రాయమన్నాను. వాటిల్లో విశ్వనాథ సత్యనారాయణగారిపై సవిత్ సి. చంద్ర రాసిన కథ నచ్చడంతో తన దర్శకత్వంలోనే ‘కవి సమ్రాట్’ నిర్మించాను. తన తాతగారు సి. సుందరరామ శర్మగారు విశ్వనాథ సత్యనారాయణగారిపై రాసిన పుస్తకం ఆధారంగా సవిత్ ‘కవి సమ్రాట్’ కథని రాసి, అద్భుతంగా తెరకెక్కించాడు. ► విశ్వనాథ సత్య నారాయణగారి ఆశీర్వాదాలతోనే ఆయన పాత్రలో నటించి, నిర్మించాను. విశ్వనాథ సత్యనారాయణగారిపై కథ రాసుకుని నా వద్దకు వచ్చిన సవిత్కి, ఇలాంటి విలువలున్న చిత్రాన్ని ‘ఆహా’లో విడుదల చేసే అవకాశం కల్పించిన అల్లు అరవింద్‌గారికి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ► నేటి యువత తమను తాము నిరూపించుకోవాలనే ఆకాంక్షతో ఇండస్ట్రీకి వస్తున్నారు. అయితే వారు తమ ఆకాంక్షను బలమైన సంకల్పంగా మార్చుకున్నప్పుడే విజయం సాధిస్తారు. ప్రస్తుతం నా టీమ్‌లో నేను తప్ప మిగిలిన వారందరూ పాతికేళ్లలోపు కుర్రాళ్లే. వారి కొత్త ఆలోచనలకు నేను తోడుగా నిలబడి నటించడంతో పాటు నిర్మించి వారికి ధైర్యం ఇస్తున్నా. ► ముప్పై ఏళ్ల నా సినీ ప్రయాణంలో ఒక నటుడిగా ఇప్పటికీ నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలు మాత్రమే చేయాలనే ఆలోచన నాకు లేదు. అందుకే.. షార్ట్ ఫిలింస్ ద్వారా సమాజానికి ఉపయోగపడే కథలను ప్రేక్షకులకు చెబుతున్నాను. సినిమాల్లో సంపాదించిన డబ్బుని షార్ట్ ఫిలింస్‌కి ఖర్చు చేసేశాను. ఈ జర్నీలో లాభ, నష్టాల గురించి ఆలోచించను.. ఈ ప్రయాణాన్ని ఆపను. మూడు నాలుగు సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. అవి రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. మరికొన్ని కథలు వింటున్నాను. ► గతంలో నేను పోటీ పడ్డ తోటి హాస్యనటుల్లో చాలామంది ఇప్పుడు లేరు. అలాగే నాకు విరివిగా అవకాశాలు ఇచ్చి, ప్రోత్సహించిన దర్శకులు కూడా లేరు. పైగా గతంతో పోలిస్తే ప్రస్తుత సినిమాల్లో హాస్యనటులకు ప్రాధాన్యం ఉండటం లేదు.. అలా వచ్చి, వెళ్లిపోయే చిన్న చిన్న పాత్రలు రాస్తున్నారు. ఈ మధ్య నాకు వస్తున్న పాత్రలు మూస ధోరణిలో ఉండటంతో ఒప్పుకోవడం లేదు.. అందుకే నేను బిజీగా ఉండటం లేదు (నవ్వుతూ). వైవిధ్యమైన పాత్రలొస్తే నేనెప్పుడూ సిద్ధమే. -
ఓటీటీలకూ భారీ షాక్.. ఇకపై అలా కుదరదండి!
న్యూఢిల్లీ: కమ్యూనికేషన్ సేవలు అందించే సంస్థలన్నింటికీ ఒకే రకం నిబంధనలు అమలు చేయాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డిమాండ్ చేసింది. తమకు వర్తింపచేస్తున్న నిబంధనలను ఓటీటీ (ఓవర్–ది–టాప్) కమ్యూనికేషన్ యాప్స్‌కు కూడా వర్తింపచేయాలని కోరింది. అలా చేయని పక్షంలో తమ లైసెన్సులు, నియంత్రణపరమైన నిబంధనలనైనా సడలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అన్ని ‘ఓటీటీ కమ్యూనికేషన్ సేవల విషయంలో అన్ని టెక్నాలజీలకు సమానంగా రూల్స్‌ను అమలు చేయాలి. తద్వారా పరిశ్రమలో సముచితమైన, ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది‘ అని ఒక ప్రకటనలో సీవోఏఐ పేర్కొంది. ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసులను కూడా ఇటీవలి టెలికమ్యూనికేషన్స్ బిల్లు ముసాయిదాలో పొందుపర్చడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఈ తరహా సేవల విషయంలో ఎటువంటి గందరగోళం లేకుండా స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని కోరుకుంటున్నామని వివరించింది. టెలికం సంస్థలు స్పెక్ట్రం కొనుగోలు చేయం మొదలుకుని నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకోవడం వరకూ భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, అనేక నిబంధనలను పాటించాల్సి ఉంటోందని సీవోఏఐ తెలిపింది. మరోవైపు ఓటీటీలు మాత్రం టెలికం సర్వీసులను ఇలాంటి బాదరబందీలేమీ లేకుండా, ఎలాంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేకుండా అందించడం ద్వారా ప్రయోజనాలు పొందుతున్నాయని పేర్కొంది. సీవోఏఐలో టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొదలైనవి సభ్యులుగా ఉన్నాయి. వాట్సాప్ వంటి ఓటీటీ కమ్యూనికేషన్ యాప్‌లు .. ఇంటర్నెట్ టెక్నాలజీ ఆధారంగా టెలికం సంస్థల తరహాలోనే వాయిస్, వీడియో కాలింగ్ సేవలను అందిస్తున్నాయి. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
వీడియోలు, ఓటీటీ కంటెంట్.. 70 శాతం మంది ఆ వయసు వారే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ దైనందిన జీవితంలో భాగమైంది. ఖాళీ సమయాల్లో 63.36 శాతం మంది యువత మొబైల్ ఫోన్లతో గడుపుతున్నారని ఇన్ఫోటైన్మెంట్ యాప్ వే2న్యూస్ సర్వేలో తేలింది. ఇందులో 51 శాతం మంది వీడియోలు, 29 శాతం ఓటీటీ కంటెంట్ చూస్తున్నారు. మిగతావారు మ్యూజిక్ వింటున్నారు. ప్రజల ప్రాధాన్యతలు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేపట్టిన ఈ సర్వేలో 3,50,000 మందికిపైగా పాల్గొన్నారు. ఇందులో 88 శాతం మంది పురుషులు 12 శాతం స్త్రీలు ఉన్నారు. అభిప్రాయాలు వెల్లడించిన వారిలో 70 శాతం మంది 21–30 సంవత్సరాల లోపువారే. మొత్తంగా తెలంగాణ నుంచి 53 శాతం మంది ఉండగా మిగిలిన వారు ఏపీకి చెందినవారు. షాపింగ్ తీరుతెన్నులు ఇలా.. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో షాపింగ్ చేస్తున్నట్లు 31 శాతం మంది చెప్పారు. వస్తువులను ఆఫ్‌లైన్ స్టోర్లలో భౌతికంగా చూసి, బట్టలను ట్రయల్ చేసి, ఎలక్ట్రానిక్స్ చెక్ చేసిన తర్వాతే కొనేందుకు మొగ్గు చూపుతున్నామని 29.5 శాతం మంది తెలిపారు. కోవిడ్ 19 ఆంక్షలు, లాక్ డౌన్, ప్రజల్లోని భయాలతో విక్రయాలు తగ్గి ఇటీవలి సంవత్సరాల్లో తీవ్ర నష్టాలు చూసిన ఔట్లెట్లకు ఇప్పుడిప్పుడే వాక్–ఇన్స్ పెరుగుతుండటం ఉపశమనం కలిగించే అంశం. సొంత వాహనాల్లో.. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ఆంక్షలు లేవు. దీంతో అందరూ తిరిగి ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 50.71 శాతం ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. చాలాకాలం పాటు దేశ ప్రజల ప్రయాణ ప్రాధాన్య క్రమంలో ఉన్న రైళ్ల వైపు ఇప్పుడు కేవలం 26 శాతం మంది మళ్లుతుండగా బస్సులను మరింత తక్కువగా 14 శాతం ఎంచుకుంటున్నారు. కోవిడ్ ప్రభావం గురించి ప్రజలకు అవగాహన పెరగడంతో జాగ్రత్తగా ప్రయాణాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు దీన్నిబట్టి అర్థమవుతోంది. కాగా, తెలంగాణలో అధికంగా మహబూబ్ నగర్ నుంచి 39,073 మంది, నల్లగొండ 32,403, ఏపీలో వైజాగ్ 21,872, శ్రీకాకుళం నుంచి 20,921 మంది సర్వేలో పాలు పంచుకున్నారు. -
టెలికం పరిధిలోకి ఓటీటీ సంస్థలు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ కాలింగ్, మెసేజింగ్ వంటి సర్వీసులు అందించే ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సంస్థలను కూడా టెలికం లైసెన్సుల పరిధిలోకి తీసుకువచ్చేలా టెలికమ్యూనికేషన్ బిల్లు 2022 ముసాయిదాను కేంద్రం ఆవిష్కరించింది. దీంతో వాట్సాప్, జూమ్, గూగుల్ డ్యువో వంటి ఓటీటీ సంస్థలు ఇకపై దేశీయంగా కార్యకలాపాలు సాగించాలంటే లైసెన్సులు తీసుకోవాల్సి రానుంది. ముసాయిదా ప్రకారం, ఒకవేళ టెలికం లేదా ఇంటర్నెట్ ప్రొవైడింగ్ సంస్థలు తమ లైసెన్సులను వాపసు చేస్తే అవి కట్టిన ఫీజులను టెలికం శాఖ రిఫండ్ చేస్తుంది. సందర్భాన్ని బట్టి .. టెలికం నిబంధనల కింద నమోదు చేసుకున్న సంస్థ లేదా లైసెన్సుదారుకు సంబంధించి ఎంట్రీ ఫీజులు, లైసెన్సు ఫీజులు, రిజిస్ట్రేషన్ ఫీజులు లేదా ఇతరత్రా ఏవైనా ఫీజులు లేదా చార్జీలు, వడ్డీలు, అదనపు చార్జీలు, పెనాల్టీ మొదలైన వాటిని కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగానైనా రద్దు చేయవచ్చు. ‘ముసాయిదా టెలికం బిల్లు 2022పై అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం‘ అంటూ టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు అక్టోబర్ 20 ఆఖరు తేదీ. పరిశ్రమలో నవకల్పనలకు మార్గదర్శ ప్రణాళిక: అశ్విని వైష్ణవ్ టెలికం పరిశ్రమ పునర్వ్యవస్థీకరణకు, నవకల్పనలను ఆవిష్కరించేందుకు కొత్త టెలికం బిల్లు స్పష్టమైన మార్గదర్శ ప్రణాళిక కాగలదని మంత్రి వైష్ణవ్ చెప్పారు. వచ్చే ఏడాదిన్నర–రెండేళ్లలో డిజిటల్ నియంత్రణ వ్యవస్థను సమూలంగా మార్చే ప్రక్రియ పూర్తి కాగలదని పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. సామాజిక లక్ష్యాలు, వ్యక్తుల బాధ్యతలు.. హక్కుల మధ్య సమతౌల్యం పాటించడం, ఎలాంటి టెక్నాలజీలకైనా వర్తించే విధానాలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. -
బబ్లీ చాన్స్ రావడం నా అదృష్టం
‘‘తెలుగు సినిమా అంటే గర్వంగా ఫీలవుతాను. ఎందుకంటే నా ప్రయాణం తెలుగు నుంచే మొదలైంది. రాజమౌళి, సుకుమార్‌గార్లతో పాటు చాలామంది దర్శకులు మన భారతీయ మూలాలకు చెందిన కథలనే తీసుకుంటుంటారు. ఇప్పటికీ మన భారతీయ సినిమాను ఎమోషన్సే నడిపిస్తున్నాయి’’ అన్నారు తమన్నా. మధూర్ భండార్కర్ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బబ్లీ బౌన్సర్’. స్టార్ స్టూడియోస్, జంగిలీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో తమన్నా మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో హరియానాకు చెందిన యువతిగా నటించాను. తొలిసారి లేడీ బౌన్సర్ కాన్సెప్ట్‌తో ఉన్న ఈ సినిమా చేసే చాన్స్ నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్లో ఇది బెస్ట్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మధూర్ బండార్కర్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లకు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఉత్తరాదిలో కొంతమంది లేడీ బౌన్సర్స్ స్ఫూర్తితో ఈ సినిమా కథ రాసుకున్నాను. లేడీ బౌన్సర్‌గా తమన్నా ది బెస్ట్ అనిపించింది’’ అన్నారు మధూర్ భండార్కర్. -
మల్టీప్లెక్స్‌ను దాటనున్న ఓటీటీ
ముంబై: దేశీ ఓవర్ ది టాప్ (ఓటీటీ) మార్కెట్ త్వరలో మల్టీప్లెక్స్ పరిశ్రమను అధిగమించనుంది. 2018లో రూ. 2,590 కోట్లుగా ఉన్న ఓటీటీల మార్కెట్ 2023 నాటికి రూ. 11,944 కోట్లకు పెరగనుంది. ఏటా 36 శాతం వృద్ధి సాధించనుంది. తద్వారా ఒకప్పుడు వీసీఆర్‌లు, వీసీపీ, వీసీడీలను కనుమరుగయ్యేలా చేసిన మల్టీప్లెక్స్‌లను దెబ్బతీయనుంది. ఎస్బీఐ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 1980లలో తెరపైకి వచ్చిన వీసీఆర్, వీసీపీలు ఆ తర్వాత డీవీడీల్లాంటివి .. 2000ల తొలినాళ్లలో మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్‌లు కుప్పతెప్పలుగా వచ్చే వరకూ హవా కొనసాగించాయి. ఆ తర్వాత సాంకేతికాంశాలు, మల్టీప్లెక్స్‌ల ధాటికి అవి కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ఓటీటీల హవాతో మల్టీప్లెక్స్‌లకు కూడా అదే గండం పొంచి ఉందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. ఓటీటీలు ఇప్పటికే వినోద రంగంలో 7–9 శాతం వాటాను దక్కించుకున్నాయని, అన్ని భాషల్లోనూ ఒరిజినల్ కంటెంట్ అందిస్తూ 40 పైచిలుకు సంస్థలు నిలకడగా వృద్ధి చెందుతున్నాయని వివరించింది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం ప్రస్తుతం దేశీయంగా 45 కోట్ల పైచిలుకు ఓటీటీ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారని, 2023 ఆఖరు నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు చేరవచ్చని గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. స్మార్ట్ టీవీలు, క్రోమ్‌కాస్ట్ వంటి ఆప్షన్లు సంప్రదాయ సినీ వినోదంపై గణనీయంగా ప్రభావం చూపాయని పేర్కొన్నారు. చౌక ఇంటర్నెట్ .. డిస్కౌంట్ల ఊతం.. ఇంటర్నెట్ వినియోగించే వారు పెరుగుతుండటం, చౌకగా వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ లభిస్తుండటం, డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరుగుతుండటం తదితర అంశాలు ఓటీటీల వృద్ధికి దోహదపడుతున్నాయి. ఆయా సంస్థలు డిస్కౌంటు రేటుకే సర్వీసులు అందిస్తుండటం కూడా ఇందుకు తోడ్పడుతోంది. డిస్నీ+హాట్‌స్టార్ (14 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్), అమెజాన్ ప్రైమ్ వీడియో (6 కోట్ల మంది), నెట్‌ఫ్లిక్స్ (4 కోట్లు), జీ5 (3.7 కోట్లు), సోనీలివ్ (2.5 కోట్లు) తదితర సంస్థలు అమెరికాతో పోలిస్తే 70–90 శాతం చౌకగా తమ ప్లన్స్ అందిస్తున్నాయి. వూట్, జీ5, ఆల్ట్‌బాలాజీ, హోయ్‌చోయ్ లాంటి స్థానిక, ప్రాంతీయ ఓటీటీలకు కూడా డిమాండ్ బాగా ఉంటోంది. 50 శాతం మంది ఓటీటీలను నెలకు 5 గంటల పైగా వినియోగిస్తుండటంతో ఆ మేరకు థియేటర్ల లాభాలకు గండిపడనుంది. సాంప్రదాయ విధానాల్లో సినిమాల నిర్మాణంతో పోలిస్తే ఓటీటీల కోసం స్ట్రీమింగ్ సిరీస్‌లు, సినిమాలను తీయడమే లాభసాటిగా ఉంటోందని పెద్ద నిర్మాణ సంస్థలు గుర్తించాయి. తమ సొంత ఓటీటీలు ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాయి. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా లేని విధంగా కోవిడ్ కాలంలో థియేటర్లు మూతబడటం.. ఓటీటీలకు లాభించింది. ఈ వ్యవధిలో 30 పైగా హిందీ సినిమాలు డిజిటల్ ప్రీమియర్ జరుపుకున్నాయి. ప్రస్తుతం ప్రాంతీయ వెబ్ సిరీస్‌లు, సినిమాలపై అంతర్జాతీయ సంస్థలు కూడా మరింతగా దృష్టి పెడుతున్నాయి. ►ఇప్పటికీ ఉచితంగా సర్వీసులు అందిస్తున్న ఓటీటీలే (యాడ్ ఆధారిత) ముందంజలో ఉంటున్నాయి. 2017లో వీటి వినియోగదారుల సంఖ్య 18.4 కోట్లుగా ఉండగా ఇది ఈ ఏడాది 35.1 కోట్లకు, 2027 నాటికి 46.6 కోట్లకు చేరనుంది. ►పే–పర్–వ్యూ సెగ్మెంట్లో సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 2018లో 3.5 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది 8.9 కోట్లకు, 2027లో 11.7 కోట్లకు చేరనుంది. ►రాబోయే రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫాంలు విద్య, ఆరోగ్యం, ఫిట్నెస్ తదితర రంగాల్లోకి కూడా విస్తరించనున్నాయి. తద్వారా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నాయి. ఓటీటీలతో కంటెంట్ క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి -
కథ విని ఆశ్చర్యపోయాను
హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో అశోక్ తేజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. దర్శకుడు సంపత్ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లేతో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో హెబ్బా పటేల్ మాట్లాడుతూ – ‘‘సంపత్ నందిగారు చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాను. నా కెరీర్లో నేను చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. సవాల్‌గా తీసుకుని చేశాను. నటిగా ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను’’ అన్నారు. ‘‘ఓదెల రైల్వేస్టేషన్’ క్రైమ్ థ్రిల్లర్. 50 రోజుల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినా కోవిడ్ వల్ల రిలీజ్ కాస్త ఆలస్యమైంది’’ అన్నారు రాధామోహన్. ‘‘నాకు దర్శకుడిగా చాన్స్ ఇచ్చిన సంపత్ నందిగారికి రుణపడి ఉంటాను. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వస్తుంది’’ అన్నారు అశోక్ తేజ్. ‘‘ఈ సినిమా కథ విన్నపుడు థ్రిల్ అయ్యాను. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది’’ అన్నారు వశిష్ఠ సింహ. ‘‘ఇప్పటివరకు ఎక్కువగా సాఫ్ట్ పాత్రలు చేసిన నేను ఇందులో సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా చేశాను’’ అన్నారు సాయి రోనక్. ఈ కార్యక్రమంలో ‘ఆహా’ ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
షరతులు వర్తిస్తాయి..: ఓటీటీ.. ఇంకాస్త చౌకగా!
(మంథా రమణమూర్తి) మిగిలిన దేశాలు వేరు. ఇండియా వేరు. ఇక్కడ రేటే రాజు. నాణ్యత, సర్వీసు వీటన్నిటిదీ ఆ తరువాతి స్థానమే. ధర కాస్త తక్కువగా ఉంటే... ఓ అరకిలోమీటరు నడిచైనా వెళ్లి తెచ్చుకునే మనస్తత్వం సగటు భారతీయ వినియోగదారుది. వినోదాన్ని నట్టింట్లోకి తీసుకొచ్చిన ఓటీటీ సంస్థలన్నీ ఇపుడిపుడే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నాయి. కోవిడ్ కాలంలో వీక్షకుల సంఖ్య పెంచుకోవటమే లక్ష్యంగా ఎడాపెడా ఆఫర్లిచ్చేసి... కంటెంట్ కోసం వందల కోట్లను ఖర్చు చేసిన ఓటీటీలు... పరిస్థితులిపుడు సాధారణ స్థాయికి రావటంతో ఆదాయంపై దృష్టి పెట్టాయి. లాభాలు రావాలంటే సబ్స్క్రిప్షన్ ఫీజు మాత్రమే సరిపోదనే ఉద్దేశంతో... సినిమాలు, షోల మధ్యలో ప్రకటనలు ప్రసారం చేసి భారీ ఆదాయాన్ని ఆర్జించేలా ప్రణాళికలు వేస్తున్నాయి. దీనికోసం ఉచితం... ప్రీమియం.. పే–పర్ వ్యూ వంటి పలు మోడళ్లను వీక్షకులకు అందుబాటులో ఉంచనున్నాయి. ఇదే జరిగితే... ఓటీటీ యుగంలో మరో దశ మొదలైనట్లే. వినియోగదారులకు మరింత నాణ్యమైన కంటెంట్... మరింత తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌కు తత్వం బోధపడింది.... ప్రపంచ ఓటీటీ రారాజు నెట్‌ఫ్లిక్స్‌లో... ఎన్నటికీ ప్రకటనలు ఉండవని సీఈఓ రీడ్ హేస్టింగ్స్ కొన్నాళ్ల కిందటి వరకూ పదేపదే చెప్పారు. 2011 నుంచీ ప్రతి ఏటా రెండంకెలకు తగ్గని ఆదాయ వృద్ధి... అసలు సబ్స్క్రయిబర్లు తగ్గటమనేదే లేని చరిత్ర నెట్‌ఫ్లిక్స్‌ది. అదే ధీమాతో ఇటీవల రేట్లు పెంచేసి, పాస్వర్డ్ షేరింగ్‌కు ప్రత్యేక ఛార్జీలు విధించారు. దీంతో జనవరి–మార్చి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్‌కు 2 లక్షల మంది గుడ్‌బై కొట్టేశారు. ఇది ఊహించని షాక్. ఒక్కసారిగా షేరు పడిపోవటమే కాదు... వందల కొద్దీ ఉద్యోగాలూ పోయాయి. ఏప్రిల్– జూన్‌లోనూ ఈ షాక్ కొనసాగింది. ఏకంగా 10 లక్షల మంది మైనస్ కావటంతో సంస్థ పునరాలోచనలో పడింది. సబ్స్క్రిప్షన్ ఆదాయంపైనే ఆధారపడితే కష్టమని... అవసరమైతే చార్జీలు తగ్గించి ప్రకటనలు కూడా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ‘ప్రకటనల విషయంలో కాస్త పరిణతి ఉన్న మార్కెట్లలో ముందు మొదలుపెడతాం’ అన్నారు రీడ్. యాడ్ మార్కెట్ విషయంలో ఇండియా పరిణితి చెందిందో లేదో తెలీదు గానీ.. ఇక్కడ వచ్చే ఏడాది మొదటి నుంచీ నెట్‌ఫ్లిక్స్ తెరపైప్రకటనలు మాత్రం కనిపించబోతున్నాయి. అమెజాన్‌కు ఆ అవసరం లేదా? ప్రకటనతో కూడిన వీడియో ఆన్ డిమాండ్ (ఏవీవోడీ) సేవలపై స్ట్రీమింగ్ దిగ్గజాల్లో ఒకటైన అమెజాన్ ఇప్పటిదాకా ఏ ప్రకటనా చేయలేదు. డిస్నీ హాట్‌స్టార్ ఇప్పటికే ఏవీవోడీ మోడల్‌ను అమలు చేసి భారతీయుల మది గెలుచుకుంది. నెంబర్–1 స్థానంతో పాటు 3.6 కోట్ల యాప్ డౌన్‌లోడ్స్‌తో దేశంలో అత్యధిక వాటానూ సొంతం చేసుకుంది. ఎంఎక్స్ ప్లేయర్, జీ, ఊట్, సోనీ లివ్, సన్ నెక్స్›్ట వంటి ఇతర స్ట్రీమింగ్ సంస్థలు కూడా డిస్నీ మాదిరిగా సబ్స్క్రిప్షన్ ఆదాయం ఒక్కటే అయితే కష్టమన్న ఉద్దేశంతో ప్రకటనలకు ఎప్పుడో గేట్లు తెరిచేశాయి. యాడ్స్ ఆదాయం భారీగా వస్తుండటంతో ఇంతటి పోటీని సైతం తట్టుకోగలుగుతున్నాయి. దీనిపై ట్రస్ట్ రీసెర్చ్ అడ్వయిజరీ (ట్రా) సీఈఓ చంద్రమౌళి నీలకంఠన్‌ను ‘సాక్షి’ సంప్రతించగా.. ‘‘అవును! ధర తగ్గితే మధ్య మధ్యలో కొన్ని ప్రకటనలొచ్చినా మన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అందుకే ఓటీటీ కంపెనీలు అవసరమైన మోడళ్లను తెచ్చే పనిలోపడ్డాయి. అమెజాన్ మాత్రం తన ప్రైమ్ వీడియో తెరపై ప్రకటనలకు చోటివ్వకపోవచ్చు. ఎందుకంటే దాని ప్రధాన వ్యాపారం వీడియో కంటెంట్ కాదు. తన సభ్యులకిస్తున్న రకరకాల సర్వీసుల్లో ఇదీ ఒకటి. దానికి నిధుల కొరత కూడా లేదు’’ అని అభిప్రాయపడ్డారు. ఓటీటీ తెరపై ప్రకటనలు ఇపుడిపుడే పెరుగుతున్నాయని. వచ్చే ఏడాది కాలంలో దీనికొక రూపం రావచ్చని చెప్పారాయన. ‘‘ఇండియా మిగతా దేశాల్లాంటిది కాదు. ఇక్కడ ప్రాంతీయ భాషల బలం ఎక్కువ. వీడియో కంటెంట్‌లోనూ వాటికి ప్రాధాన్యముంది. అందుకే స్థానిక చానెళ్లు కూడా ప్రకటనల విషయంలో ఓటీటీలకు గట్టి పోటీనే ఇస్తాయి’’ అన్నారు. ఆహా... నెట్‌ఫ్లిక్స్ దారిలోనే తెలుగు కంటెంట్‌కు ప్రత్యేకమైన స్ట్రీమింగ్ సంస్థ ‘ఆహా’ కూడా ఇపుడు ఏవీవోడీ వైపు చూస్తోంది. దీనిపై సంస్థ బిజినెస్ స్ట్రాటజీ హెడ్ రామ్‌శివ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘మన మార్కెట్ చాలా భిన్నం. తక్కువ ధరకో, ఫ్రీగానో వచ్చే కంటెంట్‌లో కొన్ని యాడ్స్ ఉన్నా వీక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం మరికొన్ని ప్లాన్లను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అన్నారాయన. ప్రీమియం కోరుకునేవారి కోసం ప్రస్తుత ప్లాన్లు యథాతథంగా ఉంటాయని స్పష్టంచేశారు. యాప్ యానీ సంస్థ 2022 నివేదికలో... దేశంలో డిస్నీ హాట్‌స్టార్‌కు 3.6 కోట్లు, అమెజాన్‌కు 1.7 కోట్ల యూజర్లు ఉన్నట్లు వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్‌కు 43–45 లక్షల సభ్యులుంటారనేది మార్కెట్ వర్గాల అంచనా. ఇది దేశీ టాప్–10లోనూ లేదు. యాడ్స్‌ను స్కిప్ చేయాలని ఉన్నా... అందుకోసం ప్రీమియం మొత్తాన్ని వెచ్చించాలంటే మాత్రం చాలా మంది వెనకాడుతున్నారని, అందుకే ఏవీవోడీ ద్వారా ఓటీటీ సంస్థలు భారీ ఎత్తున ఆదాయాన్ని ఆర్జించనున్నాయని డెలాయిట్ 2022 నివేదిక తెలిపింది. ‘‘ఏవీవోడీ మార్కెట్ మున్ముందు ఎస్వీవోడీని దాటిపోతుంది. 2021 లో 1.1 బిలియన్ డాలర్లుగా (రూ.8,800 కోట్లు) ఉన్న ఏవీవోడీ మార్కెట్ 2026 నాటికి 2.4 బిలియన్ డాలర్లకు (రూ.19,200 కోట్లు) చేరుతుంది. ఇదే సమయంలో ఎస్‌వీవోడీ మాత్రం 80 లక్షల డాలర్ల్ల (రూ.6,400 కోట్లు) నుంచి 2.1 బిలియన్ డాలర్లకు (రూ. 16,800 కోట్లు) చేరుతుంది’’ అని డెలాయిట్ అంచనా వేసింది. మొత్తంగా దేశంలో ఓటీటీ మార్కెట్ వచ్చే పదేళ్లలో 20% కాంపౌండింగ్ వృద్ధిని సాధిస్తుందని సంస్థ పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 10.2 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు ఉండగా 2026 నాటికి వీరి సంఖ్య 22.4 కోట్లకు చేరుతుందని డెలాయిట్ తెలిపింది. యాడ్స్ నుంచి ప్రీమియంవైపు కూడా...! చేతిలో కంటెంట్ ఉన్నపుడు దాన్ని యాడ్స్‌తో... యాడ్స్ లేకుండా ఎలాగైనా చూపించవచ్చన్నది ఓటీటీ సంస్థల ఉద్దేశం. అందుకే అగ్రిగేషన్ సేవలు కూడా అందిస్తూ ఏవీవోడీ మార్కెట్లో చెప్పుకోదగ్గ వాటా ఉన్న ఎంఎక్స్ ప్లేయర్.... ఇటీవలే రూ.299 వార్షిక సభ్యత్వ రుసుముతో ఎంఎక్స్ గోల్డ్ పేరిట ప్రీమియం సేవలు ఆరంభించింది. ప్రస్తుతం భారతీయ ఏవీవోడీ మార్కెట్లో ఎంఎక్స్ ప్లేయర్, యూట్యూబ్, డిస్నీ హాట్‌స్టార్‌దే హవా. ఈ 3 సంస్థలకూ ఉమ్మడిగా 65 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇవి వినోద కంటెంట్‌తో పాటు అగ్రిగేషన్, స్పోర్ట్స్ కూడా అందిస్తుండటం వీటికి కలిసొస్తోంది. నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్లేయర్లు కూడా వస్తే ఏ మార్పులొస్తాయో తెరపై చూడాల్సిందే!. -
టైటిల్ పాజిటివ్‌గా ఉంది
‘‘హైవే’ టైటిల్ పాజిటివ్‌గా ఉంది. ట్రైలర్ చూడగానే ‘ఆవారా, రాక్షసుడు’ చిత్రాలు చూసినట్టుంది. ఇలాంటి మంచి సినిమాలు తీస్తున్నందుకు నిర్మాత వెంకట్‌గారికి థ్యాంక్స్’’ అని హీరో నాగశౌర్య అన్నారు. ఆనంద్ దేవరకొండ, మానస జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హైవే’. నార్త్‌స్టార్ సమర్పణలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, వెంకట్ తలారి ప్రొడక్షన్స్‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను నాగశౌర్య విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నాకు లవర్ బాయ్ అని ప్రేక్షకులు ట్యాగ్ ఇచ్చారు. కానీ ఆనంద్కి ఎలాంటి ట్యాగ్ లేకపోవడంతో వేర్వేరు జానర్ల సినిమాలను చేస్తున్నారు.. అది చాలా గొప్ప లక్షణం’’ అన్నారు. ‘‘హైవే’ చక్కని ప్రయోగాత్మక చిత్రం’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ‘‘సరికొత్త కథాంశంతో రూపొందిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తా రని ఆశిస్తున్నాను’’ అన్నారు కేవీ గుహన్. ‘‘అద్భుతమైన థ్రిల్లర్ చిత్రం ఇది’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. ‘ఆహా’ మార్కెటింగ్ హెడ్ కార్తీక్, హీరోయిన్ మానస మాట్లాడారు.