నేడు శివచార్యమహా స్వామికి పాదపూజ
నారాయణఖేడ్: శ్రావణమాస అనుష్టాన కార్యక్రమంలో భాగంగా నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న జగద్గురు శ్రీ భీమశంకర లింగ శివాచార్య మహాస్వామి సోమవారం కల్హేర్ మండలం మాసాన్‌పల్లి చౌరస్తాలోని కేతకీ సంగమేశ్వర దేవాలయానికి రానున్నారని, ఈ సందర్భంగా పాదపూజ, ఆశీర్వచనం, ఆహ్వాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు జంగమ సమాజం నారాయణఖేడ్ తాలూకా అధ్యక్షుడు సిద్దయ్యస్వామి తెలిపారు. ఆదివారం నారాయణఖేడ్‌లో జగద్గురు భీమశంకర లింగ శివాచార్య మహాస్వామి అనుష్టాన బ్యానర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సమాజం సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని జంగమ సమాజం సభ్యులంతా విధిగా కార్యక్రమంలో పాల్గొని పాదపూజ విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు 3వ తేదీనుంచి సెప్టెంబర్ 2వ తేదీవరకు హైదరాబాద్‌లోని శంకర్‌మఠ్, బిచ్కుంద సంస్థానమఠ్లో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో వీరశైవులంతా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఖేడ్ మండలశాఖ అధ్యక్షుడు ప్రవీణ్‌స్వామి, ప్రధాన కార్యదర్శి రేవణయ్య స్వామి, నరేష్‌స్వామి, జగదీశ్వర్ స్వామి, మన్మథకిషోర్, సిద్దయ్యస్వామి, విజయ్‌కుమార్ స్వామి, శివకుమార్ స్వామి, పర్వయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.