Panyala Jagannatha Das
-
Russia- Ukraine: అసలు భయం అదే.. భారీ జనహనన ఆయుధాల వల్ల!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొద్దిరోజులుగా అంతర్జాతీయ మీడియాను అట్టుడికిస్తోంది. ఈ రెండు దేశాల నడుమ ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం పర్యవసానాలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం రోజులు గడిచే కొద్ది మరింతగా ముదిరి మూడో ప్రపంచయుద్ధానికి దారితీసే అవకాశాలు లేకపోలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆధునిక ప్రపంచం ఇప్పటికే రెండు ప్రపంచయుద్ధాలను చవిచూసింది. రెండో ప్రపంచయుద్ధం ఏకంగా అణుబాంబు ధాటి ఎలా ఉంటుందో మచ్చు చూపింది. మూడో ప్రపంచయుద్ధం ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియకపోయినా, ఇదివరకటి రెండు ప్రపంచయుద్ధాలు మిగిల్చిన అనుభవాల నేపథ్యంలో అగ్రరాజ్యాలే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం ఇతోధికంగా సైనికశక్తిని, ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన జనహనన ఆయుధాలు యుద్ధంలో వినియోగంలోకి వస్తే, అప్పుడు భూమ్మీద జరగబోయే విలయం అంచనాలకు అందనిరీతిలో ఉంటుంది. ప్రపంచ జనాభాలో శాంతిని కోరుకునే సామాన్యులే ఎక్కువగా ఉన్నా, పాలకుల పుణ్యాన యుద్ధాలు సంభవిస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయ వేదికలపై శాంతి ప్రవచనాలు వల్లించే అగ్రరాజ్యాలు సైనిక పాటవాన్ని, ఆయుధ సంపత్తిని విచ్చలవిడిగా పెంచుకుంటున్నాయి. అక్కడితోనే ఆగకుండా, స్వయంగా అధునాతన ఆయుధాలను తయారుచేసుకోలేని దేశాలకు ఆయుధాలను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. వనరుల కోసం చిన్న దేశాల్లో చిచ్చు రేపుతున్నాయి. చరిత్రను పరిశీలిస్తే, ప్రపంచంలో శాంతి నెలకొన్న కాలం తక్కువే. రాజ్యాల ఉనికి మొదలయ్యాక ఎక్కడో ఒకచోట యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆధునిక చరిత్రనే తీసుకుంటే, రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత సోవియట్ రష్యా–అమెరికాల నడుమ ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగిన కాలాన్ని(1945–91) సుదీర్ఘ శాంతికాలంగా చరిత్రకారులు పరిగణిస్తున్నారు. ఇది కూడా సంపూర్ణమైన శాంతికాలం కాదు, ‘సాపేక్షిక’ శాంతికాలం అనే వారు చెబుతున్నారు. సోవియట్ యూనియన్ ముక్కలయ్యాక అంతర్జాతీయంగా తలెత్తిన పరిణామాలతో అప్పటివరకు నెలకొన్న ‘సాపేక్షిక’ శాంతికాలానికి కూడా కాలం చెల్లింది. అప్పటి నుంచి ప్రపంచదేశాల సైనిక వ్యయం భారీగా పెరుగుతూ వస్తోంది. గడచిన రెండు దశాబ్దాలుగా సైనిక వ్యయం మరింతగా పెరిగింది. గడచిన ఏడాది లెక్కల ప్రకారం ప్రపంచ దేశాల సైనిక వ్యయం 2 ట్రిలియన్ డాలర్లను అధిగమించినట్లు ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ వెల్లడించింది. అంటే, ఈ మొత్తం మన భారతదేశ బడ్జెట్‌కు దాదాపు నాలుగు రెట్లు. అందులోనూ ఈ మొత్తంలో అమెరికా వాటానే అత్యధికంగా 39 శాతం వరకు ఉండటం గమనించాల్సిన అంశం. రష్యా–అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న కాలంలోనే చైనా తృతీయ సైనికశక్తిగా ఆవిర్భవించింది. ప్రపంచ సైనిక శక్తుల్లో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సైనిక వ్యయంలో మాత్రం భారత్ మూడో స్థానంలో నిలుస్తోంది. ఈ అంశంలో తొలి రెండు స్థానాల్లోను అమెరికా, చైనా నిలుస్తుండగా, రష్యా ఐదో స్థానంలో ఉండటం విశేషం. అణ్వాయుధాలతోనే అసలు భయం అణ్వాయుధాల వ్యాప్తి నిరోధానికి ఎన్ని అంతర్జాతీయ ఒడంబడికలు జరిగినా, పలు దేశాలు యథాశక్తి అణ్వాయుధాలను సమకూర్చుకుంటూనే ఉన్నాయి. అదను చూసుకుని అడపా దడపా అణ్వాయుధ పరీక్షలు జరుపుతూనే ఉన్నాయి. వర్తమాన ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా, అణ్వాయుధ ప్రయోగం జరిగే అవకాశాలను కొట్టిపారేయలేని పరిస్థితి. ఈ అంశమే యుద్ధం పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కిపడేలా చేస్తోంది. ఎందుకంటే ఒక్కో అణ్వాయుధం కలిగించే విధ్వంసం మామూలుగా ఉండదు. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా ప్రయోగించిన అణుబాంబుల విధ్వంసం ఎరిగినదే. అప్పటి అణుబాంబులతో పోల్చుకుంటే, ఇప్పటికాలంలో వివిధ దేశాలు సమకూర్చుకున్న అణ్వాయుధాలు చాలా శక్తిమంతమైనవి. వీటిలో కొన్ని భారీస్థాయిలో విధ్వంసం సృష్టించగల ‘సూపర్ న్యూక్లియర్ బాంబులు’ కూడా ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల వద్ద 13,080 అణ్వాయుధాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యా వద్దనే అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ యుద్ధంలో రష్యా సంయమనం కోల్పోయి, విచక్షణా రహితంగా అణ్వాయుధ దాడికి దిగితే, జరగబోయే నష్టం కేవలం ఉక్రెయిన్‌కి మాత్రమే పరిమితం కాదు. దాని చుట్టుపక్కల దేశాల మీద కూడా ఆ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుంది. అణ్వాయుధ ప్రభావాన్ని భౌగోళిక, రాజకీయ సరిహద్దులు, కంచెలు అడ్డుకోలేవు. అవసరమైతే ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలనూ ప్రయోగిస్తామనే రీతిలో రష్యా చేస్తున్న బెదిరింపు ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అమెరికా–సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగిన కాలంలో ఉభయ దేశాల మధ్య అణ్వాయుధాల పోటీ విపరీతంగా ఉండేది. ఒకదానితో మరొకటి పోటీ పడుతూ ఇబ్బడి ముబ్బడిగా అణ్వాయుధాలను తయారు చేసుకుని, పోగేసుకున్నాయి. ఈ రెండు దేశాల మధ్య 1980లలో అణ్వాయుధ పోటీ పెచ్చుమీరిందని, 1986లో తారస్థాయికి చేరుకుందని ‘బులెటిన్ ఆఫ్ అటామిక్ సైంటిస్ట్స్’ నివేదిక వెల్లడించింది. 1986లో రష్యా వద్ద 40 వేలకు పైచిలుకు, అమెరికా వద్ద 23 వేలకు పైచిలుకు అణ్వాయుధాలు ఉండేవి. ప్రచ్ఛన్నయుద్ధం కాస్త ప్రత్యక్షయుద్ధంగా పరిణమిస్తే, ఎదుటి దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలనే లక్ష్యంతోనే ఉభయ దేశాలూ పోటాపోటీగా అణ్వాయుధాలను పోగేసుకున్నాయి. సోవియట్ రష్యా 1991లో ముక్కలవడంతో ప్రచ్ఛన్నయుద్ధానికి తెరపడింది. ఆ తర్వాత అమెరికా, రష్యాలు వేలాది అణ్వాయుధాలను నిర్వీర్యం చేసుకున్నాయి. అయినప్పటికీ, ఈ రెండు దేశాల వద్దే ఇప్పటికీ అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాలకు తోడు అత్యంత శక్తిమంతమైన ఇతర రకాల బాంబులు, క్షిపణులు వంటివి కూడా ఈ దేశాలు పెద్దసంఖ్యలోనే పోగేసుకుంటున్నాయి. అణ్వేతర బాంబుల్లో అమిత శక్తిమంతమైనవి అణ్వేతర బాంబుల్లో అత్యంత శక్తిమంతమైన బాంబులు కొన్ని భారీ విధ్వంసాన్ని సృష్టించగలిగినవి ఉన్నాయి. అమెరికా 2003లో ‘జీబీయూ–43/బీ మాసివ్ ఆర్డ్‌నన్స్ ఎయిర్ బ్లాస్ట్’ (ఎంఓఏబీ) అనే భారీ బాంబును రూపొందించుకుంది. దీనిని ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’గా ప్రకటించుకుంది. ఏకంగా 9,800 కిలోల బరువుగల ఈ బాంబు పేలితే 11 టన్నుల టీఎన్టీ శక్తి విడుదలవుతుంది. అమెరికాకు పోటీగా రష్యా 2007లో ‘ఏవియేషన్ థర్మోబేరిక్ బాంబ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ పవర్’ (ఏటీబీఐపీ) అనే భారీ బాంబును రూపొందించుకుంది. దీనిని ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’గా ప్రకటించుకుంది. దీని బరువు 7,100 కిలోలు కాగా, ఇది పేలితే 44 టీఎన్టీ శక్తి విడుదలవుతుంది. దీనికంటే ముందు, సోవియట్ యూనియన్‌గా ఉన్న సమయంలోనే రష్యా ‘జార్ బాంబా’ను రూపొందించుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బాంబు. దీని బరువు 27 వేల కిలోలు. ఇది పేలితే 50–58 మెగాటన్నుల టీఎన్టీ శక్తి విడుదలవుతుంది. గతంలో దీనిని పరీక్షించిన వీడియోను రష్యా 2020లో ‘యూట్యూబ్’లో విడుదల చేసింది. ఇదిలా ఉంటే, అమెరికాకు చెందిన ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’, రష్యాకు చెందిన ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ తరహాలోనే చైనా కూడా భారీస్థాయి బాంబును సొంతంగా రూపొందించుకున్నట్లు మూడేళ్ల కిందట కథనాలు వచ్చాయి. అయితే, ఆ బాంబు శక్తిసామర్థ్యాల వివరాలేవీ వెలుగులోకి రాలేదు. చైనా ఆ వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. అంతకంటే ముందు ఇజ్రాయెల్ నుంచి భారత్ ‘స్పైస్’ (స్మార్ట్ ప్రిసైస్ ఇంపాక్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్) బాంబును భారత వైమానిక దళం కోసం కొనుగోలు చేసింది. దీని బరువు 907 కిలోలు. భారత్ సమకూర్చుకున్న ‘స్పైస్’బాంబుకు పోటీగానే చైనా తనదైన భారీ బాంబును స్వయంగా రూపొందించుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారీ జనహనన ఆయుధాలు అగ్రరాజ్యాలు సహా పలు దేశాలు ఇప్పటికే అణ్వాయుధాలు సహా అనేక భారీ జనహనన ఆయుధాలు కలిగి ఉన్నాయి. అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు, జైవ ఆయుధాలు వంటివి భారీ జనహనన ఆయుధాల (వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్) కిందకే వస్తాయి. మొదటి ప్రపంచయుద్ధంలో జైవ, రసాయనిక ఆయుధాల వినియోగం వ్యాప్తిలోకి వచ్చింది. ఈ ఆయుధాలు భారీ జననష్టాన్ని కలిగించడంతో 1925లో జెనీవా ఒడంబడిక జైవ, రసాయనిక ఆయుధాల వినియోగాన్ని నిషేధించింది. అయినా, ఇటలీ 1935లో ఈ నిషేధాన్ని బేఖాతరు చేస్తూ, ఇథియోపియాపై జరిపిన దాడుల్లో ‘మస్టర్డ్ గ్యాస్’ అనే రసాయనిక ఆయుధాన్ని ప్రయోగించింది. ఐక్యరాజ్య సమితి చొరవతో 1970లో అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒడంబడిక (ఎన్పీటీ) ఉనికిలోకి వచ్చింది. చివరగా 2016 నాటికి 191 దేశాలు ఇందులో భాగస్వాములయ్యాయి. ఈ ఒడంబడికపై సంతకాలు చేసిన అగ్రరాజ్యాలేవీ తమ అణ్వాయుధాలను పూర్తిగా వదులుకోకపోవడం గమనార్హం. దీనిపై భారత్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, దక్షిణ సూడాన్ దేశాలు మాత్రం ఇప్పటివరకు సంతకాలు చేయలేదు. ఉక్రెయిన్–రష్యా పోరు పరిస్థితులు ఉక్రెయిన్‌పై రష్యా ఈ ఏడాది ఫిబ్రవరి 24న దండెత్తింది. అప్పటి నుంచి ఉభయ దేశాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ పోరును యుద్ధంగానే గుర్తిస్తున్నా, రష్యా మాత్రం దీనిని సైనికచర్యగానే చెప్పుకుంటోంది. ఈ పోరులో అవసరమైతే ప్రయోగించడానికి సిద్ధంగా అణ్వాయుధాలను కూడా యుద్ధక్షేత్రానికి తరలిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడంతో అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్–రష్యాల మధ్య మూడునెలలుగా కొనసాగుతున్న ఈ పోరులో ఇప్పటికే భారీనష్టం వాటిల్లింది. లక్షలాదిమంది ఉక్రెయిన్ పౌరులు దేశాన్ని విడిచిపెట్టి పొరుగు దేశాలకు వలసపోయారు. రష్యా సైనికదాడుల్లో వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. రష్యా దాడులపై ఉక్రెయిన్ సైన్యం ఇంకా ప్రతిఘటన కొనసాగిస్తూనే ఉంది. నిజానికి రష్యా–ఉక్రెయిన్ల మధ్య గొడవ ఈనాటిది కాదు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియా, లుహాన్స్క్, దోనెత్స్క్ ప్రాంతాల కోసం 2014 నుంచే ఉభయ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఉక్రెయిన్‌పై ‘సైనిక చర్య’ను నిలిపివేయాలంటే క్రిమియా ప్రాంతాన్ని తమకు అప్పగించాలని, లుహాన్స్క్, దోనెత్స్క్ ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించాలని రష్యా పట్టుబడుతోంది. ఉక్రెయిన్ ‘నాటో’లోను, యూరోపియన్ యూనియన్‌లోను చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు తమ భద్రతకు ముప్పు కలిగించేవిగా ఉన్నాయని కూడా రష్యా ఆరోపిస్తోంది. పోరు మొదలైన తర్వాత పోలండ్–బెలారస్ సరిహద్దుల్లో రష్యా–ఉక్రెయిన్ ప్రతినిధులు జరిపిన శాంతిచర్చలు విఫలం కావడంతో ఇప్పటికీ ఉభయ బలగాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ మార్చి 2న సమావేశమైనప్పుడు ఉక్రెయిన్‌పై పోరును విరమించుకోవాలని మెజారిటీ సభ్య దేశాలన్నీ రష్యాను డిమాండ్ చేశాయి. ఈ అంశంపై జరిపిన ఓటింగులో రష్యాకు వ్యతిరేకంగా 140 దేశాలు ఓటు వేశాయి. ఉక్రెయిన్‌లో జరుగుతున్న హింసకు, మానవతా సంక్షోభానికి రష్యా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐక్యరాజ్య సమితిలోని అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ తేల్చి చెప్పారు. అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా, రష్యా ఏమాత్రం పట్టించుకోకుండా ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్య సమితి గొంతును పట్టించుకోని రష్యా అధ్యక్షుడు పుతిన్, ఏదో ఒక దశలో సంయమనం కోల్పోయి, ఎన్పీటీని కూడా తుంగలోకి తొక్కి అణుదాడికి ఆదేశాలు జారీచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే, ప్రపంచంలో అనేక విపరిణామాలు తప్పవు. పరిస్థితిని చక్కదిద్దడానికి అంతర్జాతీయ సమాజం అప్పుడు ఏం చేసినా, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగానే ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు బాసటగా ‘నాటో’ రంగంలోకి దిగినట్లయితే, తదనంతర పరిణామాలు మూడో ప్రపంచయుద్ధానికి దారితీసే అవకాశాలూ లేకపోలేదు. సైనిక వ్యయంలో టాప్–5 దేశాలు (2021 సంవత్సరం) దేశం - వ్యయం (బిలియన్ డాలర్లలో) అమెరికా - 801.0 చైనా - 293.0 భారత్ - 76.6 యునైటెడ్ కింగ్డమ్ - 68.4 రష్యా - 65.9 ఈ పట్టికలోని మొత్తాల కంటే చైనా, రష్యాల సైనిక వ్యయం వాస్తవానికి మరింత ఎక్కువగానే ఉంటుందని, పరిమిత సరఫరాదారులు గల ఆయుధాల మార్కెట్, కరెన్సీల కొనుగోలు శక్తిలోని వ్యత్యాసాల కారణంగానే ఈ రెండు దేశాల సైనిక వ్యయం డాలర్లలో తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని ‘ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటెజిక్ స్టడీస్’ (ఐఐఎస్ఎస్) విశ్లేషిస్తోంది. ఆ దేశాల వద్దనున్న సైనిక బలగాలు, ఆయుధాలు, సైనిక వాహనాలు వంటి అంశాలను పరిశీలిస్తే, ఈ విషయం తేలికగానే అవగతమవుతుంది. ‘గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్’ లెక్క ప్రకారం సైనిక పాటవాన్ని అంచనా వేయడంలో 0.0000 స్కోర్ అత్యుత్తమం. అయితే, దీనిని సాధించడం ఏ దేశానికైనా అసాధ్యం. త్రివిధ దళాల్లోని సైనికుల సంఖ్య, ఆయుధ సంపత్తి, త్రివిధ సైనిక వాహనాలు, సాంకేతిక సామర్థ్యం సహా యాభై వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకుని, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్–2022 ప్రకటించిన జాబితా ప్రకారం ప్రపంచంలోని తొలి ఐదు బలమైన సైనికశక్తులు. దేశం పవర్ ఇండెక్స్ స్కోర్ అమెరికా 0.0453 రష్యా 0.0501 చైనా 0.0511 భారత్ 0.0979 జపాన్ 0.1195 ఏ దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయంటే... రష్యా- 6,257 (క్రియాశీలమైనవి: 1,458, అందుబాటులో ఉన్నవి: 3,039, కాలం చెల్లినవి: 1,760) అమెరికా- 5,550 (క్రియాశీలమైనవి: 1,389, అందుబాటులో ఉన్నవి: 2,361, కాలం చెల్లినవి: 1,800) యునైటెడ్ కింగ్డమ్- 225 (అందుబాటులో ఉన్నవి) ఫ్రాన్స్- 290 (అందుబాటులో ఉన్నవి) చైనా- 350 (అందుబాటులో ఉన్నవి– చురుగ్గా అణ్వాయుధాలను పెంచుకుంటోంది) పాకిస్తాన్- 165 (అందుబాటులో ఉన్నవి) భారత్- 156 (అందుబాటులో ఉన్నవి) ఇజ్రాయెల్- 90 (అందుబాటులో ఉన్నవి) ఉత్తర కొరియా- 40–50 (అంచనా మాత్రమే. అసలు లెక్క ప్రపంచానికి తెలియదు) -∙పన్యాల జగన్నాథదాసు -
అపురూపం
దేవతార్చన కోసం, మంత్రజపం కోసం వివిధ రకాల మాలలు వాడుతుంటారు. వీటిలో ఒక్కో మాలకు ఒక్కో ప్రత్యేకత ఉంది. జపమాలలుగా వినియోగించే వాటిలో తులసిమాలకు విశిష్టమైన స్థానం ఉంది. తులసి విష్ణువుకు ప్రీతికరమైనది. తులసిమాలను జపమాలగా వినియోగించినట్లయితే శీఘ్రంగా కేశవానుగ్రహ ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. తులసిమాలను జపమాలగా వినియోగించినట్లయితే మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. దురాలోచనలు దూరమవుతాయి. ఆత్మప్రక్షాళనకు మార్గం సుగమమవుతుందని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. తులసిమాలల వినియోగం వల్ల కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. లక్ష్మీకటాక్షం కలుగుతుంది. తులసిమాలను మెడలో ధరించినట్లయితే మనసులోని భయాందోళనలు తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. సాధారణ గ్రహదోషాల వల్ల కలిగే ఈతిబాధలు దూరమవుతాయి. తులసిమాల ధారణ వల్ల పీడకలలు రాకుండా ఉంటాయని, మరణానంతరం నరకబాధలు తప్పుతాయని కూడా పురాణాలు చెబుతున్నాయి. – పన్యాల జగన్నాథదాసు -
చెరకు వేరు
♦ చెరకును శుభకార్యాల్లో వినియోగించడం అందరికీ తెలిసిందే. చెరకురసాన్ని పానీయంగానే కాకుండా, అభిషేకాలకు కూడా వినియోగిస్తారు. చెరకుగడ మాత్రమే కాదు, చెరకు వేరు కూడా చాలా శుభప్రదమైనది. చెరకువేరును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ♦ దీపావళి రోజున లక్ష్మీపూజ చేసేవారు ఉదయాన్నే చెరకువేరును సేకరించి, వాటిని శుభ్రపరచి పసుపు కుంకుమలతో అలంకరించి, పూజమందిరంలోని లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం ముందు పెట్టి పూజించాలి. ఇలా పూజించిన చెరకువేరును ఎర్రని వస్త్రంలో చిన్న మూటలా కట్టి ఇంట్లోనైనా, దుకాణాల వంటి వ్యాపార సంస్థల్లోనైనా నగదు భద్రపరచే చోట ఉంచడం వల్ల ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ♦ దీపావళి రోజున పూజించిన చెరకు వేరును తాయెత్తులో పట్టే పరిమాణంలో ముక్కలుగా చేసి, ఒక ముక్కను వెండితాయెత్తులో ఉంచి, దానిని మెడలో ధరించడం వల్ల జనాకర్షణ పెరుగుతుంది. సంపాదన మెరుగుపడుతుంది. చెరకువేరు ముక్కను తాయెత్తుగా ధరించలేని వారు కనీసం దానిని ఎర్రవస్త్రంలో చుట్టి పర్సులో భద్రపరచుకున్నా మంచిదే. – పన్యాల జగన్నాథ దాసు -
పసుపు గవ్వలు
♦ సముద్రం ఒడ్డున దొరికే గవ్వల్లో రకరకాలు ఉంటాయి. వైకుంఠపాళి వంటి ఆటల్లో, జూదక్రీడల్లో వీటిని ఉపయోగిస్తారనే సంగతి తెలిసినదే. వీటిలో కొంత అరుదుగా దొరికే పసుపు గవ్వలకు విశేష ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది ♦ ఇవి లేత పసుపురంగులో కాస్త చిన్నగా ఉంటాయి. పసుపు గవ్వలతో బగళాముఖి మాతను ఆరాధిస్తే శత్రుపీడ తొలగుతుంది ♦ జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నవారు, రాహు కేతు దోషాలు ఉన్నవారు పసుపు గవ్వలను పూజమందిరంలో ఉంచి, వాటికి ధూప దీపాలను సమర్పించడం వల్ల ఉపశమనం దొరుకుతుంది ♦ ఎలాంటి పూజల్లోనైనా పసుపు గవ్వలను బేసి సంఖ్యలో ఉపయోగించడమే మంచిది ♦ పదకొండు పసుపు గవ్వలను పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి, శుక్రవారం రోజున పూజించి, ఆ గవ్వల మూటను డబ్బు దాచుకునే చోట ఉంచినట్లయితే ఆర్థిక పురోగతి మెరుగుపడుతుంది. – పన్యాల జగన్నాథ దాసు -
కామాఖ్య సిందూరం
కామాఖ్య సిందూరాన్ని ‘కామియా’ అని కూడా అంటారు. అస్సాంలోని కామాఖ్యపీఠంలో ఏడాదికి ఒకసారి మాత్రమే దొరికే అత్యంత అపురూపమైన ప్రసాదం ఇది. గడ్డకట్టిన నెత్తుటి రంగులో గట్టిగా రాళ్లలా దొరికే ఈ సిందూరాన్ని పొడిలా తయారు చేసుకుని, ఆవునేతిలో రంగరించి నుదుట తిలకంలా ధరించాలి. ఈ సిందూరాన్ని ధరించే ముందు దీనిని పూజ పీఠంలో ఉంచి, ధూప దీపాలతో పూజించాలి. దీనిని ధరించడం వల్ల సమస్త దృష్టిదోషాలు, క్షుద్రప్రయోగాల పీడలు తొలగిపోతాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. శత్రుబాధలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. కామాఖ్య సిందూరాన్ని ప్రతిరోజూ ధరిస్తూ ఉన్నట్లయితే జనాకర్షణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థుల నుంచి తలెత్తే సమస్యలు సమసిపోతాయి. విద్యార్థులు దీనిని ధరించినట్లయితే ఉన్నత విద్యావంతులవుతారు. ఘనవిజయాలను సాధిస్తారు. అవివాహితులు ధరించినట్లయితే త్వరలోనే తగిన వారితో వివాహం జరుగుతుంది. – పన్యాల జగన్నాథదాసు -
కృష్ణహరిద్రం
కృష్ణహరిద్రం అంటే నల్లపసుపు. పసుపులోని ఒకజాతికి చెందిన ఈ పసుపుకొమ్ములు నల్లగా ఉంటాయి. గ్రహదోషాల నివారణకు, తాంత్రిక ప్రయోగాల విరుగుడుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. నల్లపసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ణకేదార అని కూడా పిలుస్తారు. ఈ పసుపుకొమ్ము లోపలిభాగం ముదురునీలం లేదా ముదురు ఊదా రంగులో ఉంటుంది. తెలియని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు నల్లపసుపు కొమ్మును జేబులో ఉంచుకుంటే ఎలాంటి దుష్టశక్తులూ సోకవని ప్రతీతి. నల్లపసుపును దంచి, దానిని గోమూత్రంతో కలిపి ముద్దలా తయారు చేసి, ఆ ముద్దను నొసట తిలకంలా ధరిస్తే జనాకర్షణ శక్తి పెరుగుతుంది. నల్లపసుపును చందనంతో రంగరించి నుదుట తిలకంలా ధరిస్తే, నరదృష్టి వల్ల కలిగే ఇబ్బందులు నశిస్తాయి. నల్లపసుపుకొమ్మును ముక్కలుగా లేదా పొడిగా చేసి, తాయెత్తులో భద్రపరచి నల్లదారంతో మెడలో ధరిస్తే శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఏదైనా శనివారం రోజున నల్లపసుపు కొమ్మును పూజలో ఉంచి, ఆ తర్వాత దానిని సిందూరం రంగుగల వస్త్రంలో చుట్టి డబ్బు భద్రపరచేచోట ఉంచినట్లయితే, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. – పన్యాల జగన్నాథ దాసు -
స్ఫటికం
అత్యంత స్వచ్ఛంగా, పారదర్శకంగా కనిపించే స్ఫటికాలు సహజమైన మణుల జాతికి చెందుతాయి. ఆధ్యాత్మికంగా స్ఫటికం చాలా విశేషమైనది. స్ఫటికమాలలను జపమాలలుగా వినియోగించడం అందరికీ తెలిసిందే. లలిత, లక్ష్మీ ఆరాధన చేసేవారు స్ఫటికమాలను జపమాలగా వినియోగించడం వల్ల ఆర్థిక అభివృద్ధి, వంశాభివృద్ధి, కుటుంబ శాంతి చేకూరుతాయి. స్ఫటికమాలను మెడలో ధరించినట్లయితే, మానసిక అలజడి తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. స్ఫటికమాలను ధరించాలనుకునేవారు ఏదైనా శుక్రవారం రోజున తారాబలం చూసుకుని ధరించడం మంచిది. స్ఫటిక ధారణ వల్ల శుక్రగ్రహ దోషం వల్ల కలిగే వైవాహిక సమస్యలు సద్దుమణుగుతాయి. స్ఫటికాన్ని సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా పరిగణిస్తారు. శివారాధన చేసేవారు స్ఫటిక శివలింగాన్ని ఆరాధించినట్లయితే శీఘ్ర ఫలితం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. స్ఫటిక శివలింగాన్ని ఎవరైనా ఏ వేళలోనైనా పూజించవచ్చు. దీనికి ఎలాంటి నిషేధాలూ లేవు. – పన్యాల జగన్నాథ దాసు -
నా వాదం ధన్యవాదం
కృతజ్ఞతాభావాన్ని దినచర్యలో భాగంగా సాధన చేయాలి. కృతజ్ఞతాభావం కలిగిన మనుషుల మనసు శక్తివంతంగా ఉంటుంది. గౌతమ బుద్ధుడు ఉపకారం చేసిన వారికి అవసరం ఏర్పడినప్పుడు ప్రత్యుపకారం చేయడం, ఉపకారం చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం కనీస మానవ ధర్మాలు. ప్రపంచంలోని అన్ని మతాలూ కృతజ్ఞతను ఉత్తమ లక్షణంగా పరిగణిస్తాయి. పంచభూతాల పట్ల, సమస్త ప్రకృతి పట్ల కృతజ్ఞతలు వెలిబుచ్చే అనేక శ్లోకాలు మన ప్రాచీన వాంగ్మయంలో ఉన్నాయి. పురాణేతిహాసాలు రచించిన మహర్షులందరూ ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేసిన వారే! ఆధునికుల్లో కృతజ్ఞతాభావం అడుగంటిపోతోంది. మేలు చేసిన వారికి కీడు తలపెట్టే కృతఘ్నుల సంఖ్య పెరిగిపోతోంది. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయడమే కాదు, చివరకు ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వారి ఉదంతాలు, జన్మకు మూలమైన పితృదేవతలకు, జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకు కృతజ్ఞతగా ఘనకార్యాలను సాధించిన వారి ఉదంతాలు మన పురాణాల్లో ఉన్నాయి. ‘కృతజ్ఞతాభావం సుగుణాలన్నింటిలోకి గొప్పది మాత్రమే కాదు, సుగుణాలన్నింటికీ మాతృక వంటిది కూడా’ అని రోమన్ తత్వవేత్త సిసిరో చెప్పడం విశేషం.మానవులకు ఉండే రకరకాల భావోద్వేగాలలో కృతజ్ఞతాభావం కూడా ఒకటి. సర్వమత గ్రంథాలు, ప్రాక్ పశ్చిమ పురాణేతిహాసాలలో కృతజ్ఞతాభావం గురించిన ప్రస్తావనలు చాలానే ఉన్నాయి. కృతజ్ఞతాభావాన్ని గొప్ప సుగుణంగా, మానవ విలువల్లో అతి ముఖ్యమైనదిగా మన పూర్వీకులు పరిగణించేవారు. ఒకనాటి ఆచార్యులు తమ శిష్యులకు కృతజ్ఞతాభావం ఆవశ్యకతను బోధించేవారు. శిష్యులు కూడా గురువుల పట్ల కృతజ్ఞతాభావంతో ఉండేవారు. ఆధునిక విద్యావ్యవస్థలో కృతజ్ఞతాభావాన్ని బోధించే గురువులూ, గురువుల పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉన్న శిష్యులూ అరుదైపోయారు. ఆధునిక మనస్తత్వ శాస్త్రం అభివృద్ధి చెంది శతాబ్దం గడిచినా, కృతజ్ఞతాభావంపై ఇటీవలి కాలం వరకు ప్రత్యేకంగా అధ్యయనాలు, పరిశోధనలు చేసిన దాఖలాల్లేవు. ఇరవై ఒకటో శతాబ్ది ప్రారంభమైన తర్వాతనే మనస్తత్వ శాస్త్ర నిపుణులు కృతజ్ఞతాభావంపై పరిశోధనలు ప్రారంభించారు. కృతజ్ఞతాభావానికి సంబంధించిన కొన్ని గాథలు, ఇంకొన్ని విశేషాలు ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం సందర్భంగా... ఆజన్మాంతం కృతజ్ఞత మరువని కర్ణుడు మన పురాణాల్లో కృతజ్ఞతాభావానికి నిలువెత్తు రూపంగా చెప్పుకోవాలంటే కర్ణుడి గురించే చెప్పుకోవాలి. తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన దుర్యోధనుడి పట్ల కృతజ్ఞతను ఆజన్మాంతం మరువలేదు. ద్రోణాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం ముగించుకున్న కౌరవ పాండవ రాకుమారులకు కురుసభలో క్షాత్రపరీక్ష జరిగింది. అందులో తాను కూడా పాల్గొంటానని వచ్చాడు కర్ణుడు. క్షత్రియులు తప్ప అన్యులకు ఆ పరీక్షలో పాల్గొనే అర్హత లేదని, సూతపుత్రుడైన కర్ణుడిని క్షాత్రపరీక్షలో పాల్గొనేందుకు అనుమతించలేనని కరాఖండిగా చెప్పాడు ద్రోణుడు. అప్పటికే పాండవులపై స్పర్థతో రగిలిపోతున్న దుర్యోధనుడు ఇదే తగిన అవకాశంగా తలచాడు. ఇది క్షాత్రపరీక్షే కాని కులపరీక్ష కాదంటూ గురువుకు ఎదురు చెప్పాడు. తన కుల పరంపరను ఏకరువు పెడుతూ ఇంతకీ క్షత్రియులంటే ఎవరనే ధర్మసందేహాన్ని లేవనెత్తాడు. క్షత్రియ కులంలోనైనా పుట్టి ఉండాలి లేదా రాజ్యం ఏలుతూనైనా ఉండాలి. అలాంటి వాళ్లనే క్షత్రియులుగా పరిగణించడం జరుగుతుందని సభలోని కురువృద్ధులు ముక్తకంఠంతో తీర్మానించారు. రాజ్యం లేకపోవడమే కర్ణుడికి అనర్హత అయితే, ఇప్పుడే అతడికి రాజ్యాభిషిక్తుడిని చేస్తానంటూ కురు సామ్రాజ్యంలోని భాగమైన అంగరాజ్యానికి అభిషిక్తుడిన చేస్తాడు దుర్యోధనుడు. నిండుసభలో తన ఆత్మగౌరవాన్ని కాపాడిన దుర్యోధనుడికి కర్ణుడు ఆనాటి నుంచి ఆత్మబంధువుగా మారాడు. దుర్యోధనుడు తన మీద పెట్టుకున్న ఆశలను ఎరిగిన వాడై అడుగడుగునా అతడికి తోడుగా నిలిచాడు. దుర్యోధనుడి కోరిక మేరకు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని అంతమొందించడానికి సర్వశక్తులూ సమకూర్చకున్నాడు. సహజ కవచ కుండలాలను తన నుంచి దానంగా తీసుకున్న ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధాన్ని చాలాకాలం అర్జునుడి కోసమే దాచిపెట్టుకున్నాడు. ఘటోత్కచుడు కురుసేనపై విరుచుకుపడి బీభత్సం సృష్టించడంతో కర్ణుడి తలరాత మారింది. ఇంద్రుడి శక్తిని ఘటోత్కచుడి మీద ప్రయోగించి, అతడిని అంతమొందించాల్సి వచ్చింది. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా కడవరకు యుద్ధక్షేత్రంలో నిలిచి పోరాడాడు. చివరకు అర్జునుడి చేతిలో ప్రాణాలు విడిచాడు. దానగుణ సంపన్నుడైన కర్ణుడు కృతజ్ఞతకు మారుపేరుగా మహాభారతంలో నిలిచిపోయాడు. జటాయువు పట్ల రాముడి కృతజ్ఞత పక్షిరాజైన జటాయువు దశరథుడికి మిత్రుడు. రావణుడు సీతను అపహరించి తీసుకుపోతుండగా చూసి అతడితో తలపడ్డాడు. రావణుడితో హోరాహోరీ పోరాడి అతడి రథాన్ని కూల్చేసి, సారథిని చంపాడు. వృద్ధుడు కావడంతో రావణుడి ధాటి ముందు నిలువలేకపోయాడు. రావణుడు కత్తిదూసి జటాయువు రెక్కలు తెగనరికేశాడు. జటాయువు కుప్పకూలగానే పుష్పకవిమానంలో సీతను తీసుకుని లంకకు వెళ్లిపోయాడు. సీత జాడ కోసం వెతుకుతున్న రామలక్ష్మణులు మార్గమధ్యంలో రెక్కలుతెగి నెత్తురోడుతూ నేలకూలి ఉన్న జటాయువును చూశారు. అతడి వద్దకు వెళ్లి పలకరించారు. రావణుడు సీతను ఎత్తుకుపోతుండగా అతడిని అడ్డగించానని, తన రెక్కలు నరికేసిన రావణుడు సీతను దక్షిణ దిశగా ఆకాశమార్గాన తీసుకుపోయాడని చెప్పాడు. రెక్కలు తెగిన జటాయువు రాముడి సమక్షంలోనే ప్రాణాలు విడిచాడు. సీతను కాపాడటం కోసం రావణుడిని ఎదిరించిన జటాయువు పట్ల కృతజ్ఞతాభావంతో రాముడు అతడికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపి, మోక్షాన్ని అనుగ్రహించాడు. తండ్రి దశరథుడికి స్వయంగా అంత్యక్రియలు జరిపించలేకపోయిన రాముడు తండ్రికి మిత్రుడైన జటాయువుకు అంత్యక్రియలు జరిపి తృప్తిచెందుతాడు. పాండవుల పట్ల మయుడి కృతజ్ఞత శరణు కోరినంతనే తనకు, తన మిత్రుడైన తక్షకుడికి కృష్ణార్జునులు అభయమిచ్చి కాపాడినందుకు కృతజ్ఞతగా మయుడు ఇంద్రప్రస్థంలో అద్భుతమైన మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు. మహాభారతంతో మయుడి ఉదంతానికి నేపథ్యం ఖాండవదహన ఘట్టం. అగ్నిదేవుడికి అజీర్తి చేయడంతో ఔషధమూలికలతో సమృద్ధమైన ఖాండవవనాన్ని దహనం చేసి రోగ విముక్తి పొందాలని అనుకుంటాడు. కృష్ణార్జునుల సహాయం కోరుకుంటాడు. ఖాండవవనంలో ఇంద్రుడి మిత్రుడైన తక్షకుడు నివాసం ఉంటాడు. తక్షకుడు అక్కడ ఉంటున్నందున ఖాండవవన రక్షణ బాధ్యతను ఇంద్రుడు స్వయంగా చూసుకుంటాడు. తక్షకుడికి ఇంద్రుడి అండ ఉందని, అందువల్ల తాను ఖాండవ వనాన్ని దహనం చేయలేకపోతున్నానని కృష్ణార్జునులకు చెబుతాడు అగ్నిదేవుడు. శరవేగంగా దౌడుతీసే రథాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తే కృష్ణుడి సహాయంతో తప్పకుండా ఖాండవ దహనానికి తోడ్పడతానని, వెయ్యిమంది ఇంద్రులు వచ్చినా వెనుకాడబోనని అర్జునుడు మాట ఇస్తాడు. అర్జునుడికి కపిధ్వజం గల రథాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని, అక్షయతూణీరాన్ని ఇస్తాడు అగ్నిదేవుడు. కృష్ణార్జునులు తోడు రాగా ఖాండవవనానికి చేరుకుని, ఆ వనాన్ని దహించడం ప్రారంభిస్తాడు.ఖాండవవనాన్ని అగ్నిదేవుడు దహిస్తున్న సంగతి తెలుసుకున్న ఇంద్రుడు తన పరివారాన్ని పంపించగా, అర్జునుడు గాండీవం తీసుకుని, శర పరంపరను కురిపించి వారిని తరిమి కొడతాడు. తన పరివారం అర్జునుడి చేతిలో ఓటమి చెంది తిరిగి రావడంతో కోపంతో రగిలిపోయిన ఇంద్రుడు అగ్నికీలలను ఆర్పివేసేందుకు ఖాండవ వనంపై కుండపోతగా వర్షం కురిపిస్తాడు. ఖాండవ వనంలోనికి పైనుంచి ఒక్క నీటి చుక్కైనా చొరబడని రీతిలో బాణాలతోనే పందిరి నిర్మిస్తాడు అర్జునుడు. అగ్ని యథేచ్ఛగా తన దహన కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. అగ్నిదేవుడి విజృంభణకు తాళలేక తక్షకుడు అక్కడి నుంచి పారిపోయి రాక్షస శిల్పాచార్యుడు, తన మిత్రుడు అయిన మయుడిని శరణు వేడుకుంటాడు. కృష్ణార్జునులను ఎదిరించలేనంటూ మయుడు తక్షకుడిని వెంటబెట్టుకుని కురుక్షేత్రం వైపు పారిపోతుండగా, కృష్ణార్జునులు వారిని వెంబడిస్తారు. ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలంటే కృష్ణార్జునులను శరణు వేడటమే దిక్కని తలచిన మయుడు తన రథం దిగి, వారికి ఎదురేగి శరణు వేడుకుంటాడు. అభయమిచ్చిన కృష్ణార్జునులు మయుడిని, అతడి మాట మీద తక్షకుడిని విడిచిపెడతారు. ఇందుకు కృతజ్ఞతగా మయుడు తన నైపుణ్యాన్నంతటినీ రంగరించి ముల్లోకాల్లో మరెక్కడా లేని రీతిలో చిత్ర విచిత్రమైన సొబగులతో చూపరులను విస్మయపరచే రీతిలో అత్యద్భుతమైన మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇస్తాడు. మహాభారతంలో మయసభ పోషించిన పాత్ర అందరికీ తెలిసిందే! కృతజ్ఞతాభావం కలిగించే లాభాలు కృతజ్ఞతాభావం వల్ల ఎన్నో లాభాలు ఉన్నట్లు ఆధునిక పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. సానుకూల భావనల్లో కృతజ్ఞతాభావం కీలకమైనదిగా ఆధునిక మనస్తత్వ శాస్త్ర నిపుణులు గుర్తించారు. ఇరవై ఒకటో శతాబ్ది ప్రారంభం నుంచి కృతజ్ఞతాభావంపై ప్రత్యేక దృష్టి సారించి జరిపిన పరిశోధనలు పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృతజ్ఞతాభావం వల్ల కలిగే లాభాలపై ఇటీవలి పరిశోధనలు వెల్లడించిన వాస్తవాలు ఇవీ... ♦ కృతజ్ఞతాభావం లేనివారి కంటే కృతజ్ఞతాభావం ఉన్నవారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వారి గుండె పనితీరు సక్రమంగా ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. రక్తపోటు అదుపులో ఉంటుంది. ♦ కృతజ్ఞతాభావం కలిగి ఉన్నవారు ఎప్పుడైనా మానసిక కుంగుబాటుకు లోనైనా, త్వరలోనే దాని నుంచి బయటపడగలుగుతారు. పనిభారం పెరిగినా త్వరగా అలసట చెందరు. ♦ కృతజ్ఞతాభావం ఉన్నవారు పరిస్థితుల పట్ల సానుకూలంగా స్పందించగలుగుతారు. అవసరమైనప్పుడు తోటివారికి సాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తారు. ♦ కృతజ్ఞతాభావం ఎక్కువగా ఉన్నవారు చిన్నచిన్న లోటుపాట్లకు పెద్దగా బాధపడకుండా జీవితంలో సంతృప్తిని పొందగలుగుతారు. ♦ కృతజ్ఞతాభావం ఎక్కువగా ఉన్నవారు తీపి పదార్థాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఇతరుల కంటే సంతోషంగా ఉంటారు. ♦ కృతజ్ఞతాభావం ఉన్నవారు ఇతరులతో త్వరగా కలిసిపోగలుగుతారు. తమపై నమ్మకం ఉంచిన వారితో దీర్ఘకాలం అనుబంధాన్ని కొనసాగించగలుగుతారు. గ్రాటిట్యూడ్ రాక్ ఇదేదో విలువైన రత్నమేమీ కాదు. మామూలు గులకరాయి. నదీ ప్రవాహాల ఒడ్డునైనా, వీధుల్లో మరెక్కడైనా కాస్త నునుపుదేరిన ఏదైనా చిన్న గులకరాయి. ‘ది సీక్రెట్’ అనే హాలీవుడ్ సినిమా పుణ్యాన ‘గ్రాటిట్యూడ్ రాక్’ ఒక సెంటిమెంటల్ వస్తువుగా మారింది. ‘ది సీక్రెట్’ సినిమాలోని నటుడు లీ బ్రూవర్ విలక్షణ పాత్ర పోషించాడు. ఆ పాత్రలో లీ బ్రూవర్ ఒక గులకరాయిని జేబులో వేసుకుని తిరుగుతూ ఉంటాడు. దానిని ఎప్పుడు తాకినా అతడికి కృతజ్ఞతాభావాన్ని రేకెత్తించే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ‘ది సైలెన్స్’ 2006లో విడుదలైంది. ఈ సినిమా వచ్చిన తర్వాత నునుపుదేరిన గులకరాళ్లను జేబులో వేసుకుని తిరగడం కొందరికి ఫ్యాషన్‌గా మారింది. అలా మొదలైంది ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం ఎలా మొదలైందంటే... హవాయిలోని ఈస్ట్–వెస్ట్ సెంటర్లో 1965లో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. ప్రపంచంలోని అద్భుతమైన విషయాల పట్ల, మేలు చేసిన వ్యక్తుల పట్ల కృతజ్ఞతలు వెల్లడించుకోవడానికి ఒక రోజు ఉంటే బాగుంటుందనే ఆలోచనకు ఆ సదస్సులోనే అంకురార్పణ జరిగింది. సదస్సుకు నాయకత్వం వహించిన భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీ చిన్మయ్ కృతజ్ఞతా దినోత్సవం ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ సరేనని సమ్మతించాయి. దాని ఫలితంగానే చాలా దేశాలు 1966 సెప్టెంబర్ 21న మొట్టమొదటిసారిగా ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం పాటించాయి. ఇది జరిగిన పదకొండేళ్లకు... అంటే 1977 సెప్టెంబర్ 21న ఐక్యరాజ్య సమితి మెడిటేషన్ గ్రూప్ శ్రీచిన్మయ్ను ఘనంగా సత్కరించింది. నాటి నుంచి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవాన్ని అధికారికంగా పాటించడం మొదలైంది. ప్రకృతిపై కృతజ్ఞతతోనే ఆ ఉద్యమం ప్రకృతి పట్ల అంతులేని కృతజ్ఞత చరిత్రలో నిలిచిపోయే ఉద్యమానికి దారితీసింది. అటవీ సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో జరిగింది. ఈ ప్రాంతం అప్పట్లో ఉత్తరప్రదేశ్‌లో ఉండేది. ఉత్తరప్రదేశ్ అటవీశాఖ 1973లో సైమన్ కంపెనీకి చమోలీ జిల్లా గోపేశ్వర్ ప్రాంతంలో ఉన్న మూడువందల భారీ వృక్షాలను నరికివేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇన్నాళ్లూ తమకు జీవనోపాధి కల్పిస్తూ వస్తున్న అటవీ సంపదను కాపాడుకునేందుకు బిష్ణోయి తెగకు చెందిన గిరిజన మహిళలు నడుం బిగించారు. కంపెనీ మనుషులు చెట్లను నరకడానికి వీలులేకుండా చెట్లను ఆలింగనం చేసుకున్నారు. ‘ఇక్కడి చెట్లను నరకాలంటే ముందు మమ్మల్ని నరకండి’ అంటూ ముక్తకంఠంతో నినదించారు. అహింసా మార్గంలో గిరిజన మహిళలు చేపట్టిన ఈ ఉద్యమం ‘అటవీ సత్యాగ్రహం’గా పేరుపొందింది. ఆలింగనం చేసుకోవడాన్ని అక్కడి భాషలో ‘చిప్కో’ అంటారు. అందువల్ల ఇది ‘చిప్కో ఉద్యమం’గా పేరుపొందింది. సుందర్‌లాల్ బహుగుణ ముందుకు వచ్చి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడంతో ఈ ఉద్యమం దేశమంతటా విస్తరించింది. అటవీ సంపదను కాపాడుకునేందుకు దేశం నలుమూలలా గిరిజనులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. సుందర్‌లాల్ బహుగుణ హిమాలయాల దిగువనున్న అటవీ ప్రాంతంలో దాదాపు ఐదువందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. హిమాలయ ప్రాంతంలో వృక్షాల నరకివేతను నిషేధించాలంటూ ఆయన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి విజ్ఞప్తి చేయడంతో, ఆమె పదిహేనేళ్ల పాటు చెట్ల నరికివేతను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వెండితెరపై కృతజ్ఞతాభావం కృతజ్ఞతాభావంతో త్యాగాలు చేసిన పాత్రలు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. మన తెలుగు సినిమాల్లో పాత్రల్లోని కృతజ్ఞతాభావమే కేంద్రంగా చేసుకున్న కథతో రూపొందిచిన వాటిలో ‘శంకరాభరణం’ మైలురాయిగా నిలిచిపోతుంది. ఇందులోని కథానాయకుడు శంకరశాస్త్రి సంగీత విద్వాంసుడు. వేశ్య కూతురైన తులసి ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. ఆమె తల్లి మాత్రం ఆమె వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఈలోగా ప్రతినాయకుడు తులసిపై అత్యాచారం చేసి, శంకరశాస్త్రిని తూలనాడతాడు. తులసి అతడిని హతమార్చేస్తుంది. దిక్కులేని స్థితిలో ఉన్న తులసికి శంకరశాస్త్రి అండగా నిలుస్తాడు. ఊరు ఊరంతా తనను చిన్నచూపు చూసినా వెనుకాడడు. తులసి ఒక కొడుకును కంటుంది. ఆ కొడుకును శంకరశాస్త్రి దగ్గర శిష్యుడిగా చేరుస్తుంది. తనకు అండగా నిలిచిన శంకరశాస్త్రిపై కృతజ్ఞతాభావంతో ఆమె ఆయనకు తెలియకుండా ఆయన కుటుంబాన్ని ఆదుకుంటుంది. తులసి కొడుకును తన సంగీత వారసుడిగా ప్రకటించి శంకరశాస్త్రి కన్నుమూస్తాడు. శంకరశాస్త్రి పాదాల చెంతనే తులసి ప్రాణాలు విడిచిపెడుతుంది. కృతజ్ఞతాభావం గురించి పెద్దల మాటలు సౌందర్యభరితమైన అన్ని కళలు, గొప్ప కళాఖండాల సారాంశం కృతజ్ఞతాభావమే! – ఫ్రెడెరిక్ నీషే, జర్మన్ తత్వవేత్త, సాంస్కృతిక విమర్శకుడు కృతజ్ఞతాభావం గొప్ప వ్యక్తిత్వాలకు ఆనవాలు. – ఈసోప్, ప్రాచీన గ్రీకు కథకుడు కృతజ్ఞతాభావం ఆత్మలో ఉద్భవించే దివ్యపుష్పం. – హెన్రీ వార్డ్ బీచర్, అమెరికన్ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు ఒక మనిషిలో కృతజ్ఞతాభావం లేకుంటే ఆ మనిషిలో మానవ లక్షణమేదో లోపించినట్లే! – ఎలీ వీసెల్, అమెరికన్ రచయిత సాయం చేసిన వారి జ్ఞాపకం మెదడులో కాకుండా మనసులో నిక్షిప్తమై ఉండటమే కృతజ్ఞతాభావం. – లయనెల్ హ్యాంప్టన్, అమెరికన్ సంగీతకారుడు, నటుడు కృతజ్ఞత ఒక బాధ్యత. దానిని నిర్వర్తించాల్సిందే. అయితే ఎవరికీ దానిని ఆశించే అధికారం లేదు. – రూసో, జర్మన్ తత్వవేత్త ప్రతీకారం లాభసాటిదే కావచ్చు. కృతజ్ఞత మాత్రం విలువైనది. – ఎడ్వర్డ్ గిబ్బన్, ఇంగ్లిష్ చరిత్రకారుడు, రాజనీతిజ్ఞుడు కృతజ్ఞతాభావాన్ని గొప్ప సంపదగా పరిగణిస్తాను. ఎవరిలోనైనా ఆ భావన లేకుంటే అది వారి వ్యక్తిత్వ లోపమే. – మార్షల్ గోల్డ్‌స్మిత్, అమెరికన్ రచయిత, నాయకత్వశిక్షకుడు కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసే చాలామంది మనుషులు భవిష్యత్తులో మరిన్ని ఉపకారాలను రహస్యంగా ఆశిస్తూ ఉంటారు. – ఫ్రాంకోయిస్ డి లా రోష్ఫుకాల్డ్, ఫ్రెంచి రచయిత – పన్యాల జగన్నాథదాసు -
పారద గణపతి
పాదరసంతో తయారుచేసిన గణపతినే ‘పారద గణపతి’ అంటారు. పాదరసంతో తయారు చేసిన శివలింగాలను విరివిగా పూజిస్తూ ఉంటారు. పారదలింగాల ఆరాధన విశేష ఫలప్రదమైనది. అలాగే పాదరసంతో తయారు చేసిన గణపతిని అర్చించడం కూడా గొప్ప ఫలితాలనిస్తుంది. జ్ఞానవృద్ధి, మనోస్థైర్యాల కోసం పారద గణపతి ఆరాధన చక్కని సులభమార్గం. వినాయక చవితిరోజున పూజమందిరంలో చేతి బొటనవేలి పరిమాణంలో ఉండే పారద గణపతిని ప్రతిష్ఠించి పూజించడం మంచిది. వినాయక చవితినాడు వీలు కాకుంటే ఏదైనా నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున పారద గణపతిని పూజమందిరంలో ప్రతిష్ఠించుకోవడం మంచిది. పాదరసంతో లక్ష్మీదేవితో కలసి ఉన్న గణపతి రూపాన్ని ఒకేమూర్తిగా తయారు చేయించిన పారద లక్ష్మీగణపతిని పూజించినట్లయితే ఆర్థిక ఇక్కట్లు, ఆటంకాలు తొలగిపోతాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో పారద లక్ష్మీగణపతిని పూజించడం వల్ల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారద గణపతిని లేదా పారద లక్ష్మీగణపతిని పూజమందిరంలో ప్రతిష్ఠించిన తర్వాత నిత్య ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. – పన్యాల జగన్నాథ దాసు -
హరిద్ర గణపతి
శ్వేతార్కమూల గణపతి మాదిరిగానే హరిద్ర గణపతి ఆరాధన కూడా చక్కని ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నవారు హరిద్ర గణపతిని ఆరాధించడం మంచిది. వ్రతాలు, పూజల్లో పసుపు ముద్దతో వినాయకుడిని రూపొందించి పూజించడం ఆనవాయితీ. పసుపుముద్దతో కాకుండా పసుపు కొమ్ముపైనే వినాయకుని ఆకారాన్ని పూజమందిరంలో ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవచ్చు. పసుపుకొమ్ముపై రూపొందించిన గణపతినే హరిద్ర గణపతి అంటారు. పసుపు కొమ్ముపై చెక్కించిన హరిద్ర గణపతిని పసుపు రంగు వస్త్రంపై ఉంచి పూజించాలి. ఏదైనా గురువారం రోజున హరిద్ర గణపతి పూజను ప్రారంభించవచ్చు. జీర్ణకోశ సంబంధమైన సమస్యలు సమసిపోవడానికి, వివాహ దోషాలు తొలగిపోవడానికి, పరీక్షలలో ఉత్తీర్ణతకు హరిద్ర గణపతి ఆరాధన ప్రశస్తమైనది. వ్యాపార సంస్థలు నడిపేవారు హరిద్రగణపతి మూర్తిని గల్లాపెట్టెలో ఉంచినట్లయితే, ఆటంకాలు తొలగి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హరిద్ర గణపతికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పించి, గణపతి మూల మంత్రాన్ని, గణేశ గాయత్రీ మంతాన్ని పదకొండు సార్లు చొప్పున పఠించాలి. పురోహితులకు శనగలు, పసుపు రంగు వస్త్రాలను ఇతోధిక దక్షిణతో కలిపి దానం చేయాలి. గురువులను తగిన కానుకలతో సత్కరించి, వారి ఆశీస్సులు పొందాలి. – పన్యాల జగన్నాథ దాసు -
శ్వేతార్క హనుమాన్
గణపతి స్వరూపమైన తెల్లజిల్లేడు వేరును యథాతథంగా శ్వేతార్క గణపతిగా పూజించడం తెలిసిందే. అరుదుగా శ్వేతార్క మూలంపై గణపతి ఆకారం సహజసిద్ధంగా ఏర్పడుతూ ఉంటుంది. అది మరింత విశేషమైనదిగా తలుస్తారు. వినాయకుని విశిష్టతలతో కూడిన శ్వేతార్కమూలంపై ఆంజనేయుని రూపు తీర్చిదిద్దించి, దానిని ఆంజనేయ మూల మంత్రంతో ప్రాణప్రతిష్ఠ జరిపి పూజించడం ద్వారా పిల్లలకు బాలారిష్ట దోషాలు తొలగిపోతాయి. జాతకరీత్యా ఏర్పడే బాలారిష్టాలు పన్నెండేళ్ల వయసు నిండేంత వరకు పిల్లలను పీడిస్తాయి. బాలారిష్టాల కారణంగా పిల్లలు తరచు ఆరోగ్య సమస్యలకు, ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు. లేనిపోని భయాలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి దోషాలను నివారించడానికి శ్వేతార్క హనుమాన్ ఆరాధన బాగా ఉపయోగపడుతుంది. తెల్లజిల్లేడు వేరుపై ఆంజనేయుని రూపును తయారు చేయించి, సిందూరంతో అలంకరించి, పూజ మందిరంలో ఉంచి నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించాలి. శ్వేతార్క హనుమాన్ అర్చనలో భాగంగా ఉభయ సంధ్యల్లోనూ హనుమాన్ చాలీసాను పదకొండుసార్లు చొప్పున పఠించాలి. – పన్యాల జగన్నాథ దాసు -
శ్వేతార్క గణపతి
అపురూపమైన ఆధ్యాత్మిక వస్తువులలో శ్వేతార్కమూలం చాలా విశిష్టమైనది. శ్వేతార్కమూలం అంటే తెల్ల జిల్లేడు వేరు. దీనిని సాక్షాత్తు గణపతి స్వరూపంగా పరిగణిస్తారు. అరుదుగా ఒక్కొక్కసారి శ్వేతార్కమూలం గణపతి ఆకారంలో లభిస్తూ ఉంటుంది. అది మరింత విశిష్టమైనది. శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల జాతకంలోని కేతు గ్రహ దోషాలు, వాటి వల్ల కలిగే అనవసర భయాలు తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు, శత్రుబాధలు, రుణబాధలు తొలగిపోతాయి. ఇంట్లోని దుష్టశక్తులు నశిస్తాయి. శ్వేతార్క మూలాన్ని ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలసి వచ్చేటప్పుడు సేకరించడం అత్యంత శ్రేష్టం. ఇవన్నీ ఒకేసారి కుదరడం చాలా దుర్లభం. అందువల్ల ఈ మూడింటిలో ఏ రెండు కలసి వచ్చిన రోజునైనా ఉదయం వేళలో శ్వేతార్కమూలాన్ని సేకరించడం మంచిది. శుచిగా స్నానం చేసిన తర్వాత మట్టి నుంచి తవ్వి సేకరించిన శ్వేతార్క మూలాన్ని మంచినీటితో శుభ్రం చేయాలి. తర్వాత దానిని ఇంట్లోని పూజమందిరంలో ఎర్రని వస్త్రంపై ఉంచి ధూప దీప నైవేద్యాలతో పూజించాలి. శ్వేతార్క గణపతిని పూజించడానికి ఎర్రని పూలు, ఎర్రని అక్షతలు, రక్తచందనం ఉపయోగించాలి. – పన్యాల జగన్నాథ దాసు -
ఇంట్లో పూజించే సాలగ్రామాలు...
సాలగ్రామాలు ఎక్కువగా నలుపు రంగులో దొరుకుతాయి. అరుదుగా కొన్ని సాలగ్రామాలు పసుపు, నీలం, ఎరుపు రంగుల్లో కూడా దొరుకుతాయి. సాధారణంగా ఇళ్లలో నల్లని సాలగ్రామాలనే పూజిస్తుంటారు. ఎరుపు తప్ప మిగిలిన రంగుల్లో ఉన్న సాలగ్రామాలను ఇళ్లలో పూజించవచ్చు. ఎరుపు రంగులో ఉండే సాలగ్రామాలను ఆలయాలు, మఠాల్లో మాత్రమే పూజించాలి. పరిమాణంలో చిన్నవిగా, మధ్యస్థంగా ఉండే వాటినే ఇళ్లలో పూజించాలి. అసాధారణ పరిమాణాల్లో ఉండే వాటిని ఆలయాల్లో మాత్రమే పూజించాలి. సాలగ్రామాలను పూజించేటప్పుడు ధూప దీప నైవేద్యాలతో పాటు తప్పనిసరిగా తులసిదళాలను సమర్పించాలి. ఒక్క తులసిదళమైనా సరిపోతుంది. సాలగ్రామాలను ప్రతిరోజూ అభిషేకించాలి. అభిషేకానికి మంచినీరు, ఆవుపాలు, పంచామృతాలలో ఏదైనా ఉపయోగించవచ్చు. ఇళ్లలోని పూజమందిరాల్లో బేసి సంఖ్యలో సాలగ్రామాలను పూజించాలి. రెండు, నాలుగు... ఇలా నూట ఎనిమిది ఇంకా ఆపై ఎన్నైనా శక్తిమేరకు పూజమందిరంలో ఉంచి పూజించుకోవచ్చు. సాలగ్రామాలను పూజించే వారు నియమబద్ధమైన జీవనం కొనసాగించాలి. లౌకిక వ్యవహారాల్లో అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసగించడం, కించపరచడం, దుర్భాషలాడటం, దురుసుగా ప్రవర్తించడం, అనవసర దర్పాన్ని ప్రదర్శించడం వంటి దుశ్చర్యలకు పాల్పడకూడదు. నియమబద్ధంగా ఉంటూ భక్తిశ్రద్ధలతో పూజిస్తేనే సాలగ్రామాల పూజ ఇహపర సౌఖ్యాలను అనుగ్రహిస్తుంది. – పన్యాల జగన్నాథదాసు -
సాలగ్రామ ప్రాశస్త్యం
సాలగ్రామాలను సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు. అద్వైత విశిష్టాద్వైత ద్వైతాలను బోధించిన త్రిమతాచార్యులు ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు సాలగ్రామాలను పూజించ వలసిన ఆవశ్యకతను తమ తమ రచనల్లో వివరించారు. నేపాల్‌లోని గండకీ నదీతీరంలో ఇవి విస్తారంగా లభిస్తాయి. వీటిపై ఉన్న గుర్తుల ఆధారంగా వీటిలోని రకాలను నిర్ణయిస్తారు. ఒక్కో రకమైన సాలగ్రామాన్ని ఒక్కో రకమైన పూజల కోసం వినియోగిస్తారు. నిత్యపూజలు, శ్రాద్ధ కర్మలు, గ్రహణ సమయాల్లో జరిపే ప్రాయశ్చిత్త క్రతువులు, యజ్ఞయాగాలు వంటివి సాలగ్రామాల సమక్షంలో జరిపినట్లయితే అనంత ఫలితాన్నిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. సాలగ్రామాలను శాస్త్రోక్తంగా పూజించడం ఎంతగా ఫలమిస్తుందో, సాలగ్రామాలను దానం చేయడం వల్ల అంతకు మించిన ఫలితం లభిస్తుంది. గిరులు, ఝరులు, సాగరులతో కూడిన సమస్త భూమండలాన్ని దానం ఇవ్వడం వల్ల లభించే ఫలితం కంటే ఒక్క సాలగ్రామ శిలను దానం చేయడం వల్ల ఎక్కువ ఫలితం లభిస్తుందని స్కంద పురాణం చెబుతోంది. సాలగ్రామాలను అభిషేకించిన జలం పవిత్ర నదీజలాలతో సమానం. అంతిమ క్షణాల్లో సాలగ్రామ అభిషేక జలాన్ని సేవించినట్లయితే, మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతాయి. ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, మనశ్శాంతి లోపించిన వారు, క్షుద్ర ప్రయోగాల బారినపడి ఇక్కట్లు పడేవారు సాలగ్రా మాలను పూజించినట్లయితే ఉపశమనం లభిస్తుంది. గ్రహదోషాల వల్ల ఏర్పడే సమస్యలు సాలగ్రామ దానం వల్ల తొలగిపోతాయి. – పన్యాల జగన్నాథ దాసు -
ఆదాయంలో అభివృద్ధి లేదా?
వృత్తి ఉద్యోగాల్లో ఎంతగా శ్రమిస్తున్నా ఉన్నతి సాధించలేకపోతుంటారు కొందరు. మెరుగైన పనితీరు, చిత్తశుద్ధి వంటి లక్షణాలను కలిగి ఉన్నా తగిన పదోన్నతులు, వేతన ప్రతిఫలాలను పొందలేకపోతుంటారు. జాతకంలో శని అనుగ్రహం లోపించినప్పుడు, రాజ్యాధిపతి, రాజ్య భావం బలహీనపడినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఈ స్థితిని అధిగమించడానికి తేలికపాటి పరిహారాలు... ♦ శనికి ప్రీతి కలిగించడం ద్వారా ఆశించిన ఫలితాన్ని సాధించవచ్చు. పదోన్నతులు, వేతన ప్రతిఫలాలు ఆశించిన స్థాయిలో దక్కనందుకు నిరాశ అనిపించినా, కుంగిపోవద్దు. పనితీరుపై శ్రద్ధ తగ్గించవద్దు. చిత్తశుద్ధితో విధి నిర్వహణ కొనసాగిస్తూనే, శని ప్రీతి కోసం ప్రతిరోజూ ఉదయం కాకులకు ఆహారం తినిపించండి. ఆ తర్వాతే మీరు ఆహార పానీయాలను తీసుకోండి. ♦ ఆర్థిక ఉన్నతికి గురుబలం అత్యంత కీలకం. వృత్తి ఉద్యోగాల్లోనైనా, వ్యాపారాల్లోనైనా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లయితే గురువును ప్రసన్నం చేసుకోవాలి. ఇందుకు ప్రతి గురువారం గోవులకు అరటిపండ్లు తినిపించండి. గురువులకు, గురుతుల్యులకు యథాశక్తి కానుకలు సమర్పించి, వారి ఆశీస్సులు పొందండి. ♦ ఆశలు అడుగంటిపోతున్న స్థితిలో గ్రహబలానికి మించి దైవబలం మిన్నగా పనిచేస్తుంది. ప్రతి మంగళవారం ఆంజనేయుని దర్శించుకుని, ఆంజనేయ విగ్రహం కుడికాలి బొటనవేలి వద్ద సిందూరాన్ని నుదుట తిలకంగా దిద్దుకోండి. ♦ ప్రతినెలా ఏదైనా గురువారం ఇంటికి దగ్గరలో ఉన్న ఆలయానికి తీపి గుమ్మడికాయను సమర్పించండి. అలాగే ఆలయ పూజారులకు లేదా పురోహితులకు వస్త్రదానం చేయండి. ♦ మేనత్తలకు, అక్కచెల్లెళ్లకు చిన్నపాటివైనా కానుకలు ఇచ్చి వారికి సంతోషం కలిగించండి. వారికి కానుకలు ఇవ్వడానికి సందర్భాలతో నిమిత్తం లేదు. చదువుకోసం సాయం కోరే ఆడపిల్లలకు ఆర్థిక సాయం చేయండి. – పన్యాల జగన్నాథ దాసు -
ప్రత్యర్థుల వల్ల సమస్యలు ఎదురవుతున్నాయా?
♦ వృత్తి ఉద్యోగాల్లో శ్రమదమాదులకోర్చి పురోగతి సాధించినంత మాత్రాన జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందని అనుకోలేం. జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకున్న వారి పురోగతికి ఓర్వలేని జనం ఉండనే ఉంటారు. ఈర్షా్యపరులైన ప్రత్యర్థుల వల్ల అనుకోని అవరోధాలు తలెత్తడమే కాదు, మనశ్శాంతి కూడా లోపిస్తుంది. ప్రత్యర్థుల వల్ల తలెత్తే సమస్యలను కట్టడి చేయాలంటే... ♦ తెల్లకాగితాల పుస్తకాన్ని, ఎర్రసిరా కలాన్ని తెచ్చుకోండి. ఎర్రసిరా కలంతో పుస్తకంలో శ్రీరాముని కీర్తిస్తూ ‘శ్రీరామ జయం’ అనే మాటను 12,500 సార్లు రాయండి. ఇలా రాయడం పూర్తయిన తర్వాత ఏదైనా ఒక మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి, ఆ పుస్తకాన్ని, శనగపిండితో తయారు చేసిన లడ్డూలను సమర్పించండి. ♦ అమ్మవారి ఆలయంలో ఏదైనా శుక్రవారం రోజున పదకొండు నేతి దీపాలను వెలిగించండి. ప్రతిరోజూ ఉదయం నిత్యపూజలో భాగంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. ♦ ప్రతి మంగళవారం ఉదయం నిత్యపూజ చేసే సమయంలో హనుమాన్ చాలీసాను పదకొండుసార్లు పఠించండి. ఆంజనేయ ఆలయాన్ని దర్శించుకుని నేతి దీపాన్ని వెలిగించి, బెల్లం నైవేద్యంగా సమర్పించండి. ♦ ఏదైనా శనివారం గోధుమ రొట్టెలను తయారు చేసి, వాటిపై ఒక పుల్లతో మీ ప్రత్యర్థుల పేరు లేదా పేర్లు రాయండి. ఆ రొట్టెను పెనం మీద కాల్చి, చల్లార్చిన తర్వాత వీధికుక్కకు తినిపించండి. – పన్యాల జగ న్నాథదాసు -
జీవితం సాఫీగా సాగిపోవాలంటే...
జాతకంలోని గ్రహాల బలాబలాల మేరకు కొన్ని కొన్ని దశలలో, కొన్ని కొన్ని గోచార పరిస్థితుల్లో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు బాధించకుండా ఉండాలంటే... ♦ రోజువారీ విధి నిర్వహణ కోసమే కావచ్చు లేదా ఏదైనా ప్రత్యేకమైన పనిమీదనే కావచ్చు... ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రావద్దు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పండ్లు లేదా పూలు లేదా మిఠాయిలు వంటివి తీసుకురావడం మంచిది. ♦ చిన్న రాగినాణేన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి, దానిని వీధిగుమ్మం దగ్గర తోరణానికి వేలాడదీయండి. ప్రతికూల శక్తుల నుంచి రక్షణగా ఉంటుంది. ♦ ప్రతిరోజూ ఉదయాన్నే పక్షులకు తృణధాన్యాలను ఆహారంగా వేయండి. ఆర్థిక సమస్యలు శీఘ్రంగా తొలగిపోతాయి. ♦ గురువారం రోజున ఇష్టదైవానికి చెందిన గుడికి వెళ్లడం మాత్రమే కాదు, ఆ రోజున గురువులను, గురు సమానులను కలుసుకొని వారికి మీ శక్తి మేరకు దక్షిణ తాంబూలాదులను సమర్పించి, ఆశీస్సులు తీసుకోండి. ♦ పూజ కోసం వినియోగించే అగరొత్తులు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలను శుక్రవారం లేదా ఆదివారం రోజుల్లో కొనుగోలు చేయండి. – పన్యాల జగ న్నాథదాసు -
పీడకలలు రాకుండా ఉండాలంటే...
ఎలాంటి ఆర్థిక సమస్యలూ, ఆరోగ్య సమస్యలూ లేకున్నా, ఒక్కోసారి ఏ అర్ధరాత్రి వేళలోనో గాఢనిద్రలో వచ్చే పీడకలలకు ఉలిక్కిపడి హఠాత్తుగా మేలుకుంటారు. ఇక ఆ తర్వాత నిద్రపట్టడమే గగనమవుతుంది. పీడకలలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే... ♦ మీకు అనుకూల నక్షత్రం చూసుకుని, ఏదైనా మంగళవారం రోజున మొదలుపెట్టి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పఠించండి. ప్రతిరోజూ నిత్య పూజలో భాగంగా ఈ పఠనం సాగించండి. ♦ మహామృత్యుంజయ యంత్రాన్ని తాయెత్తులో భద్రపరచి, దానిని ఏదైనా శనివారం రోజున నల్లదారంతో మెడలో ధరించండి. ♦ ఉదయం, సాయంత్రం ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయండి. ప్రతిరోజూ నిత్యపూజలో భాగంగా దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠించండి. ♦ పీడకలలకు పెద్దలే ఉలిక్కిపడతారు. పిల్లలకు ఇలాంటి అనుభవం ఎదురైతే మరింతగా భయాందోళనలు చెందుతారు. అలాంటప్పుడు పిల్లల తల వద్ద చిన్న పటిక ముక్కను ఉంచి వారిని నిద్రపుచ్చండి. వారు నిద్రలోకి జారుకుంటుండగా ఆంజనేయ దండకాన్ని పఠించండి. ♦ పిల్లలు పీడకలలో ఇబ్బంది పడుతుంటే, ఏదైనా మంగళవారం రోజున ఆంజనేయుడి ఆలయంలో అర్చన జరిపించండి. సంజీవని పర్వతం మోస్తున్నట్లుగా ఉండే ఆంజనేయుని వెండి లాకెట్‌ను పిల్లల మెడలో వేయండి. – పన్యాల జగ న్నాథదాసు -
నిరాశలో కూరుకు పోతున్నారా..?
చిన్న చిన్న ఇబ్బందులకే కొందరు విపరీతమైన నిరాశలో కూరుకుపోతుంటారు. ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతుంటారు. మానసిక అలజడి ఫలితంగా తరచు శారీరక రుగ్మతల బారిన పడుతుంటారు. వృత్తి ఉద్యోగాల్లో తగిన పనితీరు చూపలేక వెనుకబడిపోతుంటారు. సాధారణంగా జాతకంలో రవి బలహీనంగా ఉంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. రవి అనుగ్రహం కోసం ఏం చేయాలంటే... ♦ కాస్త బెల్లం కలిపి తయారు చేసిన గోధుమ రొట్టెలను గోవులకు తినిపించండి. ♦ కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు పానకం తాగి, దైవధ్యానం చేసుకుని పని మొదలుపెట్టండి. ♦ ఆదివారం రోజున ఉపవాసం పాటించండి. ఆ రోజున పేదలకు గోధుమలు, బెల్లం దానం చేయండి. వీలుంటే ఆ రోజున ఏదైనా ఆలయానికి రాగి వస్తువులను సమర్పించండి. ♦ ఆదివారం ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు వీలైనంతగా లౌకిక వ్యవహారాలకు దూరంగా ఉంటూ గాయత్రీ మంత్రాన్ని జపించండి. ఆదిత్యహృదయ పారాయణ చేయండి. ♦ ఆదివారం స్నానాదికాల తర్వాత సూర్యోదయ వేళ బిల్వ వృక్షం నుంచి చిన్న వేరు ముక్కను సేకరించి, దానిని శుభ్రపరచి పూజలో ఉంచండి. తర్వాత దానిని తాయెత్తులా ఎరుపురంగు దారంలో మెడలో ధరించండి. – పన్యాల జగన్నాథదాసు -
అన్నింటా అపజయాలా?
కొందరు తమ తమ రంగాల్లో ఎంతగా కృషి సాగిస్తున్నా వరుస అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. దీర్ఘకాలం ఇలాంటి పరిస్థితి కొనసాగడం వల్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ప్రతిష్ఠ మసకబారుతుంది. ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. చివరకు ఆరోగ్యం కూడా మందగిస్తుంది. ప్రతికూలతలను అధిగమించి, విజయాలు సాధించాలంటే... ♦ సూర్య ఆరాధన వల్ల అపజయాలు తొలగుతాయి. ఏదైనా ఆదివారం నుంచి ఆదిత్యహృదయం పఠించడం ప్రారంభించాలి. ప్రతిరోజూ పదకొండుసార్లు చొప్పున పదకొండు రోజుల పాటు అంతరాయం లేకుండా ఆదిత్యహృదయ పఠనం కొనసాగించాలి. సూర్య ప్రీతి కోసం పూజలో ఎర్రని పూలు ఉపయోగించాలి. రాగిపాత్రలో తీర్థాన్ని సమర్పించాలి. ♦ ఏదైనా సోమవారం లేదా శనివారం రోజున సూర్యోదయ వేళలో జమ్మిచెట్టు వేరును సేకరించాలి. ఆ వేరును శుభ్రపరచి పూజలో ఉంచాలి. పూజ ముగిసిన తర్వాత దానిని ఎరుపుదారంతో కట్టి మెడలో తాయెత్తులా ధరించాలి. ♦ పసుపు, కుంకుమపువ్వు ముద్దలా నూరి, దానిని పూజ సమయంలో తిలకంలా ధరించాలి. ♦ పేద బాలికలకు ఆర్థిక సహాయం చేయడం వల్ల ఫలితముంటుంది. ♦ చిన్న వెండిపూసలు రెండింటిని తయారు చేసి, వాటిని పూజలో ఉంచిన తర్వాత ఎల్లప్పుడూ పర్సులో భద్రపరచుకోవాలి. – పన్యాల జగన్నాథదాసు -
రుణబాధల నుంచి బయటపడాలంటే..?
కొందరు అనుకోని ఆర్థిక నష్టాలతోను, రుణబాధలతోను సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే... శనివారం ఉదయం స్నానం చేశాక మీ ఎత్తుకు సమానమైన పొడవు ఉన్న నల్లదారాన్ని తీసుకోండి. పూజలో ఒక కొబ్బరికాయను నైవేద్యంగా ఉంచి, దానికి ఆ నల్లదారాన్ని పూర్తిగా చుట్టండి. పూజ ముగిశాక ఆ కొబ్బరికాయను ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టండి. ఇలా ఏడు శనివారాలు చేయండి. ఇంట్లోని ఈశాన్యమూలను పరిశుభ్రంగా ఉంచండి. పనికిరాని సామగ్రిని ఈశాన్యమూలలో పడవేయవద్దు. ఏదైనా సోమవారం ఐదు ఎర్రగులాబీలను, కిలో బియ్యం, పావుకిలో బెల్లం, అంగుళం విస్తీర్ణంలోని పలుచని వెండిరేకుని తీసుకుని, తెల్లని వస్త్రంలో మూటగా కట్టి ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టాలి. ప్రతి బుధవారం ఆవులకు పచ్చగడ్డి తినిపించడం, ప్రతి మంగళవారం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించడం కూడా మంచి ఫలితాలనిస్తుంది. పూజగదిలో స్ఫటిక శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి పూజించాలి. ఇంట్లో డబ్బు భద్రపరచుకునే బీరువా లేదా లాకర్లో పదకొండు గోమతి చక్రాలను ఉంచి, వాటికి ప్రతిరోజూ ఉభయ సంధ్యల్లో ధూపం సమర్పించాలి. – పన్యాల జగన్నాథదాసు -
నట్టింట్లో పాపాయి పారాడాలంటే...
ఎన్ని సంపదలు ఉన్నా, ఇంట్లో పిల్లలు లేకపోతే లోటుగానే ఉంటుంది. కొందరికి పెళ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగదు. ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకుంటారు. అంతా బాగున్నట్లే వైద్యులు చెబుతారు. అయినా, కడుపు పండటం కష్టమవుతుంది. సంతానం కోసం వ్రతాలు, ఉపవాసాలు చేస్తున్నా ఫలితం కనిపించదు. అలాంటప్పుడు పాటించాల్సిన కొన్ని పరిహారాలు... ♦ నిత్యపూజలో ప్రతిరోజూ వినాయకుడిని ప్రత్యేకంగా పూజించాలి. ఉదయం పూట ముందుగా శునకాలకు ఆహారం తినిపించి, ఆ తర్వాతే ఏదైనా తినాలి ♦ సంతాన గోపాలుని ఆరాధన వల్ల కూడా ఫలితం ఉంటుంది. గురువుల వద్ద సంతాన గోపాలమంత్రం ఉపదేశం పొంది, నియమబద్ధంగా జపించాలి ♦ నైరుతి దిశలో పడక గది ఉండేలా చూసుకోవాలి. కుదరకపోతే, దంపతులు శయనించే మంచాన్ని నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవాలి. అయితే, గర్భం దాల్చిన తర్వాత మాత్రం గర్భిణులు నైరుతి గదిలో శయనించరాదు ♦ ఇంటి నడిమధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అంటారు. ఆ ప్రదేశాన్ని ఎల్లప్పుడూ ఖాళీగానే ఉంచాలి. ఎలాంటి వస్తువులను ఉంచకూడదు ♦ ఏదైనా గురువారం సూర్యోదయ సమయంలో దురదగొండి మొక్క వేర్లు సేకరించి, వాటిని శుభ్రపరచి తాయెత్తులో ఉంచి ఎర్రదారంతో దంపతులిద్దరూ మెడలో ధరించాలి. – పన్యాల జగన్నాథదాసు -
ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయా?
ఒక్కొక్కసారి ఎంత కష్టపడుతున్నా ఆర్థిక ఇక్కట్ల నుంచి గట్టెక్కడం కష్టంగా ఉంటుంది. కాలం పగబట్టిందేమో అనేంతగా గడ్డు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అసంతృప్తి, నిస్పృహ మనసును కుదురుగా ఉండనివ్వవు. అలాంటి పరిస్థితుల్లో ఈ పరిహారాలను పాటించండి. ♦ కాకులకు, కుక్కలకు, ఆవులకు ఆహారాన్ని పెట్టండి. ఇంట్లోని బీరువాలు, నగలు వంటి విలువైన వస్తువులను భద్రపరచుకునే పెట్టెలను ఖాళీగా ఉంచకండి. వాటిలో ఉంచడానికి ఏమీ లేనట్లయితే, కనీసం నాలుగు బాదం గింజలైనా వేసి ఉంచండి. ♦ అనైతిక కార్యకలాపాలకు, అవినీతికి, జూదానికి, స్పెక్యులేటివ్ లావాదేవీలకు దూరంగా ఉండండి. ♦ నిత్యపూజలో భాగంగా లక్ష్మీదేవిని తెల్లని పూలతో అర్చించండి. తెలుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టండి. ♦ కనీసం ఆరు ఆదివారాలు నిరుపేద అంధులకు అన్నదానం చేయండి. ♦ శనివారం పూర్తిగా మద్య మాంసాలకు దూరంగా ఉండండి. ♦ చిన్నారులు ఉండే ఇళ్లకు వెళ్లినప్పుడు వాళ్ల కోసం మిఠాయిలు తీసుకు వెళ్లండి. దక్షిణావర్త శంఖాన్ని సేకరించి, ఇంట్లోని పూజ గదిలో ఉంచి, దానికి నిత్యం ధూపదీపాలు సమర్పించండి. ♦ మీ కోసం పనిచేసే వారికి చెల్లించాల్సిన ప్రతిఫలాన్ని సకాలంలో చెల్లించడాన్ని అలవాటు చేసుకోండి. ఇతరుల వద్ద తీసుకున్న చేబదుళ్లను వీలైనంత త్వరగా తీర్చేయండి. ♦ ప్రతి శనివారం ఆలయాల వద్ద కనీసం పదకొండు మంది నిరుపేదలకు రొట్టెలు పంచిపెట్టండి. గోశాలలకు పెసలతో కూడిన దాణాను దానంగా ఇవ్వండి. ♦ ఇంట్లో ప్రతిరోజూ చేసే నిత్యపూజలో లక్ష్మీస్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీపూజను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీదేవి ఎదుట నేతిదీపం వెలిగించండి. – పన్యాల జగన్నాథదాసు -
సమస్యల సుడిగుండం నుంచి బయట పడటానికి...
లౌకిక జీవితంలో ఎన్నో ఈతిబాధలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కరికీ ఒక్కోరకం సమస్యలు ఉంటాయి. గ్రహబలం, దైవానుగ్రహం తోడైతే సమస్యలు కొంతకాలం ఇబ్బందిపెట్టినా తేలికగానే అవి సమసిపోతాయి. గ్రహబలం బాగులేకున్నా, దైవానుగ్రహానికి దూరమైనా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్లే అనిపిస్తుంది. భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. వీటిని అధిగమించడానికి... ♦ ఆత్మీయులతో విభేదాలు తొలగిపోవాలంటే, ఇంట్లో చదరంగం బల్లలు లేకుండా చూసుకోండి. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా చదరంగం ఆడే అలవాటు ఉంటే, ఆట ఆడే సమయంలో తప్ప మిగిలిన సమయంలో చదరంగం బల్ల బయటకు కనిపించకుండా దాచేయండి. ♦ ఇంట్లో ఎదిగిన పిల్లలు పనీపాటా లేకుండా వృథా కాలక్షేపం చేస్తుంటే తల్లిదండ్రులు వారి భవిష్యత్తుపై ఆందోళన చెందుతారు. పిల్లలపై ప్రతికూల శక్తుల ప్రభావం తొలగి, వారు క్రియాశీలంగా మారాలంటే... ఉడికించిన రాజ్మాలు, అన్నం ఆవులకు తినిపించాలి. మూడు గురువారాలు ఇలా చేయాలి. ఆ రోజుల్లో పరిహారం పాటించేవారు కూడా రాజ్మాలు, అన్నం మాత్రమే తినాలి. ♦ ఉద్యోగయత్నాలు వరుసగా విఫలమవుతున్నట్లయితే ఎంతో నిరుత్సాహంగా ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే, చవితి, నవమి, చతుర్దశి తిథులలో వచ్చే శనివారం రోజున ఉదయం రావిచెట్టు నుంచి చిన్న కొమ్మను సేకరించాలి. ఇలా సేకరించేటప్పుడు చంద్రబలం బాగుండేలా చూసుకోవాలి. ఇష్టదేవతా విగ్రహం ముందు ఆ కొమ్మను ఉంచి పంచోపచారాలతో పూజించాలి. తర్వాత దానిని ఎర్రని వస్త్రంలో చుట్టి మెడలో గాని, కుడిచేతి భుజానికి గాని ధరించాలి. – పన్యాల జగన్నాథదాసు -
శ్రమకు తగ్గ ఫలితం ఉండట్లేదా..?
వృత్తి ఉద్యోగాల్లో ఎంతగా శ్రమిస్తున్నా ఉన్నతి సాధించలేకపోతుంటారు కొందరు. మెరుగైన పనితీరు, చిత్తశుద్ధి వంటి లక్షణాలను కలిగి ఉన్నా తగిన పదోన్నతులు, వేతన ప్రతిఫలాలను పొందలేకపోతుంటారు. జాతకంలో శని అనుగ్రహం లోపించినప్పుడు, రాజ్యాధిపతి, రాజ్య భావం బలహీనపడినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఈ స్థితిని అధిగమించడానికి కొన్ని తేలికపాటి పరిహారాలు. శనికి ప్రీతి కలిగించడం ద్వారా ఆశించిన ఫలితాన్ని సాధించవచ్చు. పదోన్నతులు, వేతన ప్రతిఫలాలు ఆశించిన స్థాయిలో దక్కనందుకు నిరాశ అనిపించినా, కుంగిపోవద్దు. పనితీరుపై శ్రద్ధ తగ్గించవద్దు. చిత్తశుద్ధితో విధి నిర్వహణ కొనసాగిస్తూనే, శని ప్రీతి కోసం ప్రతిరోజూ ఉదయం కాకులకు ఆహారం తినిపించండి. ఆ తర్వాతే మీరు ఆహార పానీయాలను తీసుకోండి. ఆర్థిక ఉన్నతికి గురుబలం అత్యంత కీలకం. వృత్తి ఉద్యోగాల్లోనైనా, వ్యాపారాల్లోనైనా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లయితే గురువును ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ప్రతి గురువారం గోవులకు పచ్చటి గ్రాసం, అరటిపండ్లు తినిపించండి. గురువులకు, గురుతుల్యులకు యథాశక్తి కానుకలు సమర్పించి, వారి ఆశీస్సులు పొందండి. ఆశలు అడుగంటిపోతున్న స్థితిలో గ్రహబలానికి మించి దైవబలం మిన్నగా పనిచేస్తుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ ఆలయాన్ని దర్శించుకుని, ఆంజనేయ విగ్రహం కుడికాలి బొటనవేలి వద్ద సిందూరాన్ని సేకరించి, నుదుట తిలకంగా దిద్దుకోండి. ప్రతినెలా ఏదైనా గురువారం ఇంటికి దగ్గరలో ఉన్న ఆలయానికి తీపి గుమ్మడికాయను సమర్పించుకోండి. అలాగే ఆలయ పూజారులకు లేదా పురోహితులకు వస్త్రదానం చేయండి. మేనత్తలకు, అక్కచెల్లెళ్లకు చిన్నపాటివైనా కానుకలు ఇచ్చి వారికి సంతోషం కలిగించండి. వారికి కానుకలు ఇవ్వడానికి సందర్భాలతో నిమిత్తం లేదు. చదువు కోసం సాయం కోరే ఆడపిల్లలకు లేదనకుండా శక్తిమేరకు ఆర్థిక సాయం చేయండి. – పన్యాల జగన్నాథ దాసు