perumal murugan
-
పెరుమాళ్ గెలిచారు
ప్రముఖ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ గెలిచారు. తాను చూసిన సమాజాన్ని ప్రజలకు వివరించిన పెరుమాళ్ ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. తాను చేసింది తప్పు కాదని నిరూపించుకోవడానికి న్యాయస్ధానం మెట్లు కూడా ఎక్కారు. కోర్టు తీర్పుతో వ్యతిరేక గొంతుకలు వినిపించడం ఆగిపోయినా.. మొన్నటి వరకూ ఆయనపై చేసిన విమర్శలు తమిళనాట ఘోల్లు మన్నాయి. వాటిని కూడా తుడిచిపెట్టేస్తూ పెరుమాళ్ రచన 'మతొరుభగన్' ఇంగ్లీషు అనువాదం 'వన్ పార్ట్ విమన్'కు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ నవల విడుదల తర్వాత తమిళనాట చెలరేగిన వివాదాలకు లెక్కేలేదు. తమిళనాడులో గల తిరుచెన్ గోడ్ ప్రాంతంలో నివసించిన ఓ పూర్వీకుల ఆచారం గురించి పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించారు మురుగన్. మతాచారాన్ని ప్రస్తావిస్తూ పెరుమాళ్ చేసిన రచనపై రైట్ వింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రచయితలకు ఉండే స్వేచ్చపై రాష్ట్ర వ్యాప్తంగా రసవత్తర చర్చలు జరిపింది. చాలా మంది తమిళులు, స్వచ్చంధ సంస్ధలు మురుగన్ మత విశ్వాసాలను కించపరిచారని, మహిళల గురించి అశ్లీల భావనలను నవలలో రాసి అవమానించారని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మురుగన్ నవలపై వ్యతిరేకత అక్కడితో ఆగిపోలేదు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ముందు పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్ని మురుగన్ పై చర్యలు తీసుకోవాలని కోరితే.. మరికొన్ని నవలపై నిషేధం విధించాలని కోరాయి. దీ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ మురుగన్ పై క్రిమినల్ చార్జీలు దాఖలు చేసి అరెస్టు చేయడానికి పోలీసులకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్లను విచారణకు తీసుకున్న మద్రాసు హైకోర్టు.. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా భావ ప్రకటనా స్వేచ్చా హక్కుకు ఉన్న పరిధిని నొక్కి వక్కాణించింది. మురుగన్ కు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. కోర్టు ఇచ్చిన తీర్పు భవిష్యత్తులో రానున్న ఎన్నో రచనలకు ఆత్మ ధైర్యాన్ని ఇచ్చినట్లయింది. నవలలో అసలేముంది.. పెరుమాళ్ మురుగన్ సొంత గ్రామం తిరుచెన్ గొడ్. వన్ పార్ట్ విమన్ కాళి, పొన్న అనే ఇద్దరు దంపతుల కథ. పెళ్లై ఏళ్లు గడుస్తున్న పొన్న బిడ్డకు జన్మనివ్వక పోవడంపై కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వాళ్లు ఆమెను ఆక్షేపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన విషయాలను పెరుమాళ్ ఆసక్తికరంగా మలుస్తూ వివరంగా చెప్పారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో లింగమార్పిడి చేసుకున్న వారి సమస్యలపై పీహెచ్ డీ చేస్తున్న అనిరుద్దన్ వాసుదేవన్ పెరుమాళ్ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై స్పందించిన వాసుదేవన్.. ఇది రచయిత మురుగన్ మరో విజయమని అన్నారు. -
‘నాలోని రచయిత మేల్కొంటాడు’
కోర్టు తీర్పుపై వివాదాస్పద రచయిత పెరుమాళ్ హర్షం చెన్నై : మద్రాసు హైకోర్టు తనకు బాసటగా నిలవటంపై తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు తనలోని రచయితను మళ్లీ మేలుకొలుపుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. ‘భయంతో కుచించుకుపోయిన గుండెకు ఈ తీర్పు సాంత్వన కలిగించింది. నేను తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈయన రచించిన నవల మధోరుభాగన్ (ఇంగ్లీషులో వన్ పార్ట్ ఉమన్) హిందూమతానికి వ్యతిరేకంగా ఉందని కొందరు బెదిరించి క్షమాపణలు చెప్పించటంపై కోర్టు మండిపడింది. ఈ నవల ప్రతులు వెనక్కు తీసుకోవాలన్న పిటిషన్‌ను కొట్టేసింది. రచయితగా పెరుమాళ్‌కు తన భావాలను వ్యక్తపరిచే హక్కుందని, ఇకపైనా ఎలాంటి భయమూ లేకుండాతన రచనలు కొనసాగించవచ్చని తెలిపింది. ‘ఇష్టం లేకపోతే పుస్తకం చదవకండి. అంతేకాని రాయటంలో రచయితకున్న హక్కును, భావ ప్రకటన స్వేచ్ఛను హరించకండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(ఏ) ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరూ తమ భావాలను వ్యక్త పరచొచ్చు’ అని పేర్కొంది. -
రచయితకు మరణం సరే.. మరి అక్షరానికీ..?
‘‘రచయితగా పెరుమాళ్ మురుగన్ మరణించా డు. అతడేమీ దేవుడు కాదు. కావున అతని పునరు త్థానం ఏమీ ఉండదు. ఇక నుంచి పెరుమాళ్ మురుగన్ ఒక ఉపాధ్యాయుడుగా మాత్రమే బతికి ఉంటాడు’’. ప్రసిద్ధ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్‌పై, ఆయన నవల మాదురో బాగన్‌పై (వన్ పార్ట్ విమన్) ఇటీవలే దాడి జరిగి, నమ్మక్కల్ జిల్లా అధికార యంత్రాంగం ఆయనకు రక్షణ ఇవ్వ డంలో విఫలమవడంతో ఫేస్బుక్లో ఆయన చేసిన ప్రకటన అది. అణగారిన కులాల పట్ల ఆత్మీయత చూపిన రచయితపై ఎందుకు దాడి జరిగింది? మాదురో బాగన్ తమిళ నవల 2010లోనే ప్రచురితమై, ఆదరణ పొంది పునర్ముద్రణలు పొం దింది. ఆ నవలను అనిరుథ్ వాసుదేవన్ ఆంగ్లం లోకి అనువదించాడు. పెంగ్విన్ ప్రచురణగా 2013 లో వెలువడింది. మరి ఇప్పుడెందుకు దాడిని యెంచుకున్నారు? ప్రైవేటు విద్యారంగ మాఫియా శక్తులు, వాటికి అండగా నిలిచిన హిందూత్వ, అగ్రకుల పెత్తందారీ శక్తులు ఈ దాడికి బాధ్యులు. నవలలో దానిని వ్యతిరేకించే వారికి అభ్యంతర కరమైనవిగా తోచిన భాగాలను తరువాతి ముద్రణ లో తొలగిస్తానని, వారితో చర్చకు తాను సిద్ధమేనని పెరుమాళ్ మురుగన్ ప్రతిపాదించినా ఖాతరు చేయకుండా దాడి కొనసాగిం చారు. నవల కాపీలను తగలబెట్టి, రచయితను భయపెట్టి రచనారంగం నుండి తప్పు కోవాలనే నిర్ణయానికి నెట్టి న అభ్యంతరకర అంశాలు మాదురో బాగన్ నవలలో ఏమున్నాయి? ఈ నవల తిరుచెంగోడు ప్రాంతం లో గౌండర్ కులానికి చెందిన వ్యవసా య కుటుంబంలోని కాళి, అతని భార్య పొన్నల కథ. పెళ్లయి పన్నెండేళ్లయినా సంతానం కలగలేదు. దీని వల్ల సమాజం వాళ్లను కించపరుస్తూ ఉంటుం ది. పెళ్లయినా సంతానం కలగకపోవడంతో అవహే ళనకు గురయ్యే పరిస్థితి మన సమాజంలో నేటికీ ఉంది. ఈ నవల కథా సందర్భం వందేళ్ల నాటిది అని గుర్తుంచుకుంటే దాని తీవ్రత అర్థమవుతుంది. కాళి, పొన్నల సంతానలేమికి కారణం వంశాగల్ శాపమనీ, తిరుచెంగోడు కొండల మీద వెలసిన పవల్ అనే దుష్టదేవత విగ్రహం కూడా ఒక కారణ మనీ వారి ఇరువురి తల్లులూ భావిస్తుంటారు. శాంతిపూజ చేయిస్తారు. వంశాకురం లేకపోవడం తీవ్ర అవమానంగా భావి స్తారు. చివరకు ఆ ప్రాంతంలో వాడుక లో ఉన్న ఒక సంప్రదాయంలో పరిష్కా రం వెతుకుతారు. ఆ ప్రాంతంలో ఉన్న అర్ధనారీశ్వర దేవాలయం వద్ద జరిగే రథోత్సవాలలో పదునాల్గవ రోజు సం తానంలేని వివాహిత స్త్రీలు (దైవరూప) పరపురుషునితో సంగమించే ఆచారం వందేళ్ల క్రితం ఉండేది. తద్వారా సంతానం కలిగితే ఆ సంతానానికి సామి పిళ్లై (దేవుని బిడ్డ) అని నామకరణం చేస్తారు. ఆ ఆచారాన్ని అనుసరిం చాలా వద్దా అన్న మీమాంస కాళి, పొన్నల మధ్య, ఆ ఇద్దరి కుటుంబాల నడుమా, వారి లోలోపల తీవ్ర మానసిక సంఘర్షణ రేపుతుంది. సంతాన లేమికి కారణం కాళిలో ఉందని భావిస్తారు. దానికి రుజువులేమీ లేవు. ఆ సంఘర్షణను అత్యంత సున్ని తంగా చిత్రించాడు రచయిత. భూస్వామ్య సమాజ భావజాల సంక్లిష్టతలను వాటికి వాస్తవికతను, పాటించి, కళాత్మ కతను జోడించి అద్భుతంగా చిత్రించాడు. సమాజం లోని భావజాల వత్తిళ్లు, వ్యక్తుల్ని కుటుంబాలను ఎలా పీడిస్తాయో మనకర్థ మవుతాయి. పొన్న అత్త, కాళి తల్లి తండ్రి, పొన్న సోదరుడు ఆ పద్నాల్గవ రోజు ఉత్సవానికి పొన్నను పంపుతారు. పొన్న సోదరుడు కాళిని ఒక కొబ్బరి తోటకు తీసుకుపోయి తాగించి మైకంలో ఉంచుతా డు. రథోత్సవంలో పొన్న సంగమంలో పాల్గొందా లేదా అన్నదాన్ని రచయిత చిత్రించలేదు. కాళీ మైకం నుండి బయటపడిన తర్వాత భార్య పొన్న తనను మోసం చేసిందని కుప్పకూలుతాడు. దీనితో నవల ముగుస్తుంది. ఈ చిత్రణ హిందూమత వ్యతిరేకమై నదన్న వాదనతో నవలను నిషేధించాలని, రచయి తను అరెస్టు చేయాలని హిందూత్వశక్తులు అల్లరి చేశాయి. సకల విషయాలకీ మానవుడే ప్రమాణం అన్నదే మానవీయ జీవన తాత్వికత. రచయిత సృజనాత్మక స్వేచ్ఛ, మానవ స్వేచ్ఛకు ప్రగతికి అంకితమైనంత కాలమూ ఉత్తమ సాహిత్యం వెలువడుతూనే ఉంటుంది. ఎన్ని వత్తిడులు వచ్చినా పెరుమాళ్ మురుగన్ కలం ఆగిపోదనే ఆశిద్దాం. ఆయనకు సంఘీభావంగా నిలుద్దాం. డా॥బి. సూర్యసాగర్ జనసాహితి మొబైల్ : 94411 46694 -
అక్షరాలను అడ్డగించొద్దు!
పెరుమాళ్ మురుగన్ అనే తమిళ రచయిత తనపై అమలవుతున్న కనబడని ఆంక్షలకు నిరసనగా తన రచనలను తానే వాపస్ తీసుకోవల సివచ్చింది. ఇలాంటి పరిస్థితిని ఏకకంఠంతో ఖండించాలి. ప్రజలవైపు నిలిచిన సాహిత్యం, కళలను తొక్కేయడానికి ప్రతికాలంలో ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు రాజ్యమే కాదు. దాని తాబేదారులు సైతం మునుపెన్నడూ లేనివిధంగా అక్షరాలపై ఆంక్షలు విధిస్తున్నారు. మతం, కులం, ధనం, ప్రాంతం పెత్తనాల మధ్య అక్షరం గజగజలాడింది. ఈ నేపథ్యంలో అంతటా అనైక్యత, అక్షరాల మధ్య విడబాటు సరికాదని ఐక్య కార్యాచరణ నేటి అవసరంగా గుర్తించాలని విన్నవిస్తున్నాం. అం దుకే ‘ఎరుక’ సాహిత్య సామాజిక సాంస్కృతిక వేదిక తన వంతు బాధ్య తగా తన తొలి కార్యక్రమంగా ‘అక్షరాలను అడ్డగించొద్దు’ అనే సభను ఏర్పాటు చేస్తోంది. అందరినీ ఈ సభకు ఆహ్వానిస్తోంది. (నేడు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో సాయంత్రం 5 గంటలకు ఎరుక సభ) దాసోజు కృష్ణమాచారి కన్వీనర్, ‘ఎరుక’ మొబైల్: 9542869968 -
‘పుస్తకం’ రచ్చ
మాదోరు భాగం పుస్తకం వ్యవహారం చర్చనీయాంశంగా మారి రచ్చకెక్కింది. తీవ్ర వేదనకు గురైన రచయిత పెరుమాల్ మురుగన్‌కు మద్దతు పెరుగుతోంది. చెన్నై వళ్లువర్ కోట్టం వద్ద సంతకాల సేకరణ జరిగింది. ఈ పుస్తకం వ్యవహారం మంగళవారం మద్రాసు హైకోర్టుకు చేరింది. సాక్షి, చెన్నై:నామక్కల్‌కు చెందిన తమిళ ప్రొఫెసర్, రచయిత పెరుమాల్ మురుగన్ 2010లో మాదోరు భాగం పేరిట పుస్తకాన్ని తీసుకొచ్చారు. నవల రూపంలో వచ్చిన ఈ పుస్తకంలో తిరుచెంగోడు సమీపంలోని ఓ గ్రామంలో సాగుతున్న వ్యవహారాల్ని ఇతి వృత్తాంతంగా తీసుకున్నారు. నాలుగేళ్ల అనంతరం ఈ పుస్తకం మీద వ్యతిరేకత మొదలైంది. కొన్ని హిందూ సంఘాలు ఈ పుస్తకానికి వ్యతిరేకంగా నిరసనల బాట పట్టాయి. ఆందోళనలు, బంద్‌ల రూపంలో నిరసలు వ్యక్తం చేస్తూ, ఆ పుస్తకాన్ని నిషేధించాలన్న డిమాండ్ తెర మీదకు తెచ్చాయి. కొందరి మనోభావాల మీద ప్రభావం చూపించే రీతిలో ఈ పుస్తకం ఉందంటూ ఆ సంఘాలు చేసిన వాదనలకు రచయిత వివరణ ఇచ్చుకున్నా ఫలితం శూన్యం. మందలింపు: ఆ సంఘాల నిరసనలు రాజుకోవడంతో ఈ పుస్తకం రచ్చకెక్కింది. నామక్కల్ జిల్లా యంత్రాంగం రచయితను పిలిచి మందలించింది. ఆ పుస్తకం ముద్రణను నిలుపుదల చేయించే రీతిలో ఒత్తిడి తెచ్చింది. ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి తీర్మానం సైతం చేశారు. ఇది ఆ రచయితను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఆ పుస్తకం లేకుంటే తాను మరణించినట్టేనంటూ పెరుమాల్ ప్రకటన కూడా చేశారు. ఈ వ్యవహారం రచయితల్ని ఆవేదనకు గురి చేసింది. ఓ రచయితకు ఎదురైన మనో వేదనను తమకు ఎదురైనట్టుగా భావించి ఆయనకు మద్దతుగా నిలిచే పనిలో పడ్డారు. మద్దతు వెల్లువ : కొన్ని సంఘాలు పని గట్టుకుని నాలుగేళ్ల అనంతరం రచయిత మీద బురద జల్లాయంటూ సంకేతాలు వెలువడడంతో పెరుమాల్‌కు మద్దతు పెరిగింది. పెరుమాల్ మాదోరు భాగం పుస్తకానికి మద్దతుగా నిరసనలు బయలు దేరాయి. రచయితలందరూ ఏకమవుతున్నారు. చెన్నై వళ్లువర్ కోట్టంలో ఉదయం నిరసన కార్యక్రమంతోపాటుగా రచయితకు మద్దతుగా సంతకాల సేకరణ జరిగింది. వీసీకే నేత తిరుమావళవన్, శ్రీలంక తమిళుల పరిరక్షణ కమిటీ సమన్వయ కర్త పల నెడుమారన్, సీపీఐ నేత నల్లకన్నుతోపాటుగా రచయితలు తరలి వచ్చి పెరుమాల్‌కు మద్దతుగా నిలిచారు. సంతకాలు చేశారు. పెద్ద ఎత్తున యువకులు, యువతులు, పుస్తక ప్రియులు సైతం సంతకాలు చేసి పెరుమాల్‌కు తమ సంఘీభావం తెలియజేశారు. జాతి, మత కుల విద్వేషాలను రెచ్చ గొడుతున్న సంఘాల తీరును తీవ్రంగా ఖండించారు. కోర్టుకు వ్యవహారం : ఈ పుస్తకం వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. రచయిత పెరుమాల్‌కు ఎదురైన తీవ్ర పరాభావం, మనో వేదనను వివరిస్తూ రచయితల సంఘం పిటిషన్‌ను దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు. పిటిషన్‌లోని అంశాలను పరిశీలించిన బెంచ్ నాలుగేళ్ల అనంతరం ఈ వివాదం ఏమిటోనని పెదవి విప్పారు. ఈ పుస్తకంలో ఓ వర్గం మనో భావాలు దెబ్బ తినే విధంగా ఉంటే, ఇంత కాలం ఏమి చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సోమయాజులు సమాధానం ఇస్తూ, ఆ పుస్తకాన్ని ఇప్పుడే ఆ వర్గం చదివారంటూ వ్యాఖ్యలు చేశారు. అరుుతే ఈ వ్యాఖ్యలతో ఏకీభవించని బెంచ్, కోర్టును ఆశ్రయించి ఉండాలని సూచించారు. రచయితలు ఏదేని తప్పు చేసి ఉంటే, కోర్టుకు తీసుకొచ్చి పరువు నష్టం దావాతో నష్ట పరిహారం రాబట్టి ఉండాలే గానీ, జిల్లా అధికార యంత్రాంగం హుకుం జారీ చేయడం ఏమిటో, ముద్రణను నిలుపుదల చేయించడమేమిటోనని ప్రశ్నలు సంధించారు. పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది సెంథిల్‌ను ఉద్దేశించి బెంచ్ వ్యాఖ్యాలు చేస్తూ, పెరుమాల్‌ను సైతం ఈ పిటిషన్లో చేర్చాలని సూచించారు. ఆ పుస్తకంపై ఇప్పుడు వివాదం రాజుకోవడం, ఆందోళనలు చోటు చేసుకోవడం, చట్టాన్ని తమ చేతిలో కొందరు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంటూ, తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.