psyco attack
-
కాల్ చేస్తే మాట్లాడడం లేదని.. నమ్మించి.. మైకో లేఔట్‌కి పిలిపించి..
కర్ణాటక: వేరే సంస్థలో చేరిన ప్రియురాలు తనతో ఫోన్లో మాట్లాడడం లేదనే ఆక్రోశంతో ఉన్మాదిగా మారిన ప్రియుడు ఆమెను చావబాదాడు. ఈ ఘటన బెంగళూరు మైకోలేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. గాయాలైన యువతి స్నేహసిక్త చటర్జీ (26) నిమ్హాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సైకో ప్రియుడు రవికుమార్ (28)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఐటీ ఇంజినీర్లు. రవికుమార్ ఇందిరానగరలో ఓ సంస్థలో పని చేస్తుండగా స్నేహ అక్కడ శిక్షణకు వచ్చింది. వారి మధ్య పరిచయమై ప్రేమకు దారి తీసింది. ఇటీవల స్నేహకు మరో కంపెనీలో ఉద్యోగం రాగా అక్కడకు వెళ్లిపోయింది. అప్పటినుంచి రవికుమార్ కాల్ చేస్తే సరిగా మాట్లాడడం లేదు. ఈ నెల 3న తెల్లవారుజామున స్నేహను మైకో లేఔట్‌లోని తను ఉంటున్న హాస్టల్ వద్దకు పిలిపించాడు. ఎందుకు నాతో మాట్లాడడం లేదని ఆమెతో ఘర్షణ పడి ఇనుప రాడ్‌తో తలపై బాదటంతో గట్టి గాయాలయ్యాయి. కొందరు చూసి బాధితురాలిని నిమ్హాన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. మైకోలేఔట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
బాలుడిపై సైకో టీచర్ దాష్టీకం..
అలీఘడ్ : ఏడేళ్ల బాలుడిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది. బాలుడిని దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరు నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియోలో టీచర్ బాలుడిని జుట్టు పట్టుకుని లాగుతూ షూతో కొడుతున్న దృశ్యాలు భీతిగొలిపేలా ఉన్నాయి. భయంతో బాలుడు ఏడుస్తున్నా వినకుండా టీచర్ దారుణంగా హింసించాడు. ఇది చాలదన్నట్టు బాలుడి వేళ్లను కొరికాడు. బాలుడిని చిత్రహింసలకు గురిచేసిన అనంతరం బాధితుడికి మంచినీరు ఇచ్చి నవ్వమంటూ సైకోలా వ్యవహరించాడు. తలుపులు మూసి ఉన్న గదిలో జరిగిన ఈ తతంగం సీసీటీవి ఫుటేజ్ ఆధారంగా బయటపడింది. బాలుడి తండ్రి తన వర్క్‌షాప్‌లో నుంచి తీసుకువచ్చిన సీసీటీవీని ఆ గదిలో అమర్చారు. తమ చిన్నారిపై టీచర్ దారుణంగా వ్యవహరించడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని బాధిత బాలుడి తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఇంట్లో హార్డ్‌వేర్ వర్క్‌షాప్ ఉందని, ఆ యంత్రాల ధ్వనితో బాలుడి అరుపులు ఎవరూ వినిపించుకోలేదన్నారు. సీసీటీవీ ఫుటేజ్ బయటపడిన మీదట బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న టీచర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అశుతోష్ ద్వివేది తెలిపారు. -
సైకో వీరంగం: ఒకరి మృతి
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలో మంగళవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. మండలంలోని జాకారం గ్రామంలో వృద్ధుడిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. అంతే కాకుండా సమీపంలోని బాలికల వసతిగృహంపైనా దాడికి దిగాడు. ఈ దాడిలో కాపలాగా ఉన్న వాచ్మెన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు సైకోను బంధించి పోలీసులకు సమాచారం అందించారు. సైకోను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతి చెందిన వృద్ధుడిని అబ్బాపూర్ గ్రామస్తుడు కొంగొండ నర్సయ్య(75) గా గుర్తించారు. గాయపడిన వాచ్‌మెన్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఇనుపరాడ్డుతో సైకో వీరంగం
అడ్డగుట్ట (హైదరాబాద్): తుకారాంగేట్‌లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. కనిపించిన వారిపై ఇనుపరాడ్డుతో దాడికి దిగాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేపాల్‌కు చెందిన ఐతే రామ్‌కుమార్(46) సికింద్రాబాద్‌లో నివాసముంటున్నాడు. ఆదివారం రాత్రి అతిగా మద్యం సేవించిన రామ్‌కుమార్ సమీపంలో ఉన్న నలుగురిపై దాడి చేశాడు. అదే విధంగా ఇనుపరాడ్డు పట్టుకొని పలువురు స్థానికులపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడితో సునీల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో సైకో రామ్కమార్కు కూడా పలు గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆ సైకోను అదుపులోకి తీసుకున్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో ఉన్మాది వీరంగం
-
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్మాది వీరంగం
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. వార్డులోని డాక్టర్లు, అటెండర్లపై దాడి చేసి ఓ గంటపాటు విధ్వంసం చేశాడు. తమిళనాడుకు చెందిన ముదివానంద్ అనే వ్యక్తి సోమవారం రాత్రి బాపట్ల సమీపంలో రైలు నుంచి జారి కిందపడ్డాడు. గాయపడిన అతడ్ని చికిత్స కోసం జీఆర్పీ పోలీసులు గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం తెల్లవారుజామున ముదివానంద్ ఓ నర్సు చేయి పట్టుకున్నాడు. ఆ సమయంలో అక్కడున్న వైద్యులు రజనీకాంత్, ఆదిత్య అతడ్ని వారించారు. దీంతో ముదివానంద్ వైద్యులపై చేయి చేసుకున్నాడు. అడ్డొచ్చిన అటెండర్లు మల్లయ్య, శ్రీనుపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత చేతికి దొరికిన వస్తువులతో అద్దాలు పగులగొట్టి గంటపాటు విధ్వంసం సాగించాడు. చివరికి అక్కడున్న వారు అతడ్ని పట్టుకుని ఓ ఆటోకు తాళ్లతో కట్టేశారు. ఘటనపై హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.