Ramadan
-
Sania Mirza Eid Photos: స్పెషల్ అట్రాక్షన్‌గా సానియా మీర్జా.. అచ్చం ఆ హీరోయిన్లా ఉందంటూ కామెంట్లు (ఫొటోలు)
-
Cricketers Celebrate Eid: రంజాన్ వేడుకల్లో క్రికెటర్లు.. ఫొటోలు చూశారా? (ఫొటోలు)
-
రంజాన్ : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక ప్రార్థనలు (ఫొటోలు)
-
బంజారాహిల్స్ : ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు (ఫొటోలు)
-
ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెం. 12 సయ్యద్‌నగర్‌లో పూండ్ల వెంకు రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భారీగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛారిటుబుల్ ట్రస్ట్ అధినేత పూండ్ల వెంకురెడ్డి, ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతియేటా తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని అందులో భాగంగా ఈసారి 3 వేలమందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఫిరోజ్‌ఖాన్, రశీద్‌ఖాన్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
India Mosques: రంజాన్ స్పెషల్ దేశంలో ప్రముఖ మసీదుల ఫొటోలు
-
రంజాన్ స్పెషల్ : విద్యుత్ కాంతులతో జిగేల్మంటున్న చార్మినార్ (ఫొటోలు)
-
Ramadan 2024: సమతా మమతల పర్వం ఈదుల్ ఫిత్ర్!
అల్లాహు అక్బర్ .. అల్లాహు అక్బర్ .. లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్ ..! ఈ రోజు ఎటువిన్నా ఈ స్తోత్ర గానమే, ఆ దయామయుని కీర్తిగానమే వినిపిస్తూ హృదయాలను పులకింపజేస్తూ ఉంటుంది. ఊరు, వాడ, పల్లె, పట్నం, చిన్నా పెద్దా, ఆడా మగా, ముసలీ ముతకా అనే తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఈ అమృత వచనాలే జాలువారుతూ ఉంటాయి. కొత్తబట్టలు, కొత్తహంగులు, తెల్లని టోపీలు మల్లెపూలలా మెరిసిపోతుంటాయి. అత్తరు పన్నీరు పరిమళాలు, అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్‌లు, చిరునవ్వుల కరచాలనాలు, ఆలింగనాల ఆనంద తరంగాలు, అలయ్ బలయ్ లతో విశ్వాసుల హృదయాలు సంతోషసాగరంలో ఓలలాడుతూ ఉంటాయి. సేమ్యాలు, షీర్ ఖుర్మాలు, బగారా, బిర్యానీల ఘుమఘుమలతో, ఉల్లాస పరవళ్ళ హడావిడితో ముస్లిముల లోగిళ్ళు కిలకిల నవ్వుతూ, కళకళలాడుతూ ఉంటాయి. ఇళ్ళలో ఆడాళ్ళ హడావిడికి, పిల్లల సందడికి హద్దులే ఉండవు. ఎందుకంటే ఇది ఒక్కనాటి పండుగ కాదుగదా! నెల్లాళ్ళపాటు భక్తిప్రపత్తులతో జరుపుకున్న పండుగకు అల్విదా చెబుతున్న ముగింపు ఉత్సవం. రమజాన్ నెలరోజులూ ముస్లింల వీధులు ‘సహెరీ’,‘ఇఫ్తార్’ ల సందడితో నిత్యనూతనంగా కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ వింత అనుభూతుల్ని పంచుతుంటాయి. భక్తులు పవిత్ర గ్రంథ పారాయణా మధురిమను గ్రోలుతూ వినూత్న అనుభూతులతో పరవశించి పోతుంటారు. అవును.., ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు, అనుభవాలు, అనుభూతుల సమ్మేళనమే పండుగ. ఇలాంటి ఓ అద్భుతమైన, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్ ’. దీన్నే రమజాన్ పండుగ అంటారు. ముస్లిం సమాజం జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగల్లో ఇది మొదటిదీ, అతి పవిత్రమైనదీను. ఈ నెలలో ముస్లింలు అత్యంత నియమనిష్టలతో రోజావ్రతం పాటిస్తారు. భక్తిశ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్రఖురాన్ గ్రంథాన్ని భక్తితో పారాయణం చేస్తూ, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారిపై సలాములు పంపుతూ ఉంటారు. దైవనామస్మరణలో అనునిత్యం వారి నాలుకలు నర్తిస్తూ ఉంటాయి. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయులవుతుంటారు. దానధర్మాలు చేస్తారు, ఫిత్రాలు చెల్లిస్తారు. ఈ విధంగా రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాసదీక్షలు నెలరోజుల తరువాత షవ్వాల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి. షవ్వాల్ మొదటితేదీన జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. ఈ పండుగ సంబంధం రమజాన్ నెలతో ముడివడి ఉన్న కారణంగా ఇది రమజాన్ పండుగగా ప్రసిద్ధి చెందింది. రమజాన్ ఉపవాస దీక్షలు, పవిత్ర ఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకు పోయి ఉంది. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాన్ని, మానవీయ విలువల్ని జనింపజేయడానికి సృష్టికర్త ఉపవాస వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు. దైవాదేశ పాలనకు మనిషిని బద్దునిగా చేయడమే ఉపవాస దీక్షల అసలు లక్ష్యం. ఒక నిర్ణీత సమయానికి మేల్కొనడం, సూర్యోదయం కాకముందే భుజించడం(సహెరి), సూర్యాస్తమయం వరకూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా, రోజూ ఐదుసార్లు దైవారాధనచేస్తూ సూర్యాస్తమయం తరువాత రోజా విరమించడం(ఇఫ్తార్), మితాహారం తీసుకోవడం, మళ్ళీ అదనపు ఆరాధనలు అంటే తరావీహ్ నమాజులు చేయడం, మళ్ళీ తెల్లవారు ఝామున లేవడం – ఈవిధంగా రమజాన్ ఉపవాస వ్రతం మనిషిని ఒక క్రమశిక్షణాయుతమైన, బాధ్యతాయుతమైన, దైవభక్తి పరాయణతతో కూడుకున్న జీవనవిధానానికి అలవాటు చేస్తుంది. మానవుల్లో ఇంతటి మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే వ్రతాన్ని పరాత్పరుడైన అల్లాహ్ వారికి అనుగ్రహించినందుకు, వాటిని వారు నెలరోజులూ త్రికరణ శుద్ధిగా పాటించ గలిగినందుకు సంతోష సంబరాల్లో తేలిపోతూ కృతజ్ఞతాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, పవిత్ర రమజాన్ నెలలోనే సమస్త మానవాళి సన్మార్గ దీపిక అయిన మహత్తర గ్రంథరాజం ఖురాన్‌ను దేవుడు మానవాళికి ప్రసాదించాడు. సమస్త మానవజాతికీ మార్గదర్శక జ్యోతి పవిత్ర ఖురాన్. సన్మార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథరాజం మానవులందరికీ సన్మార్గ బోధన చెయ్యడానికి అవతరించిన ప్రబోధనా జ్యోతి. దైవ ప్రసన్నతను చూరగొనడానికి రోజా పాటించడం,‘తరావీహ్ ’లు ఆచరించడం, దానధర్మాలు చేయడంతో పాటు, ఈ నెల చివరిలో‘లైలతుల్ ఖద్ర్’ అన్వేషణలో అధికంగా ఆరాధనలు చేస్తారు. లైలతుల్ ఖద్ర్ అంటే అత్యంత అమూల్యమైన రాత్రి అని అర్థం. ఉపవాసం పాటించడంవల్ల పేదవాళ్ళ ఆకలి బాధలు అర్థమవుతాయన్నారు. సంపన్నులకు, ముప్పూటలా సుష్టుగా తినేవారికి నిరుపేదల ఆకలికేకలు వినబడవు. అలాంటివారు గనక ఉపవాసం పాటించినట్లయితే ఆకలి బాధ ఎలా ఉంటుందో వారికీ తెలుస్తుంది. తద్వారా పేదసాదలను ఆదుకోవడం, వారికి పట్టెడన్నం పెట్టడం ఎంతగొప్ప పుణ్యకార్యమో వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా రమజాన్ నెల ఆరంభంనుండి అంతం వరకు ఒక క్రమపద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో ఈనెలను గడిపినవారు ధన్యులు. నిజానికి ఇలాంటివారే పండుగ శుభకామనలకు అర్హులు. అందుకే ’ఈద్ ’(పండుగ)ను శ్రామికుని వేతనం(ప్రతిఫలం)లభించే రోజు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా రమజాన్ పర్వదినం మనిషిని ఒక ఉన్నతమానవీయ విలువలుకలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదర భావాలకు పునాదివేస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఇదే ఈదుల్ ఫిత్ర్ – రమజాన్ పర్వదిన పరమార్ధం. సదాచరణల సంపూర్ణప్రతిఫలం లభించిన సంతోషంలో అంబరాన్నంటేలా సంబురాలు జరుపుకొని ఆనంద తరంగాల్లో తేలియాడే రోజు ఈదుల్ ఫిత్ర్ . – ఆరోజు ముస్లిములందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన సేమియా పాయసాన్ని తమ హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిఖ్ఖు సోదరులందరికీ ఆప్యాయంగా రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు.‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు. పవిత్ర ఖురాన్ రూపంలో అవతరించిన సృష్టికర్త మహదనుగ్రహం దానవుడి లాంటి మానవుణ్ణి దైవదూతగా మలిచింది. అజ్ఞానం అంధకారాల కారు చీకట్లనుండి వెలికి తీసి, విజ్ఞానపు వెలుగుబాటకు తీసుకు వచ్చింది. నైచ్యపు అగాథాలనుండి పైకిలాగి పవిత్రతా శిఖరాలపై నిలిపింది. మానవుల్లోని పశుప్రవృత్తిని మానవీయ పరిమళంతో పారద్రోలింది. ఆటవికతను నాగరికతతో, అజ్ఞాన తిమిరాన్ని జ్ఞానదీపికతో, అవివేకాన్ని వివేకంతో పారద్రోలి మనుషుల్ని మానవోత్తములుగా సర్వతోముఖంగా తీర్చిదిద్దింది. మానవాళికి ఇంతటి మహదానుగ్రహాలు ప్రసాదించి, వారి ఇహపరలోకాల సఫలతకు పూబాటలు పరిచిన నిఖిల జగన్నాయకునికి కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకోవడమే ఈ పండుగ ఉద్దేశ్యం. ఈదుల్ ఫిత్ర్ పర్వదిన శుభాకాంక్షలు – మదీహా అర్జుమంద్ -
హలీం రుచికి గులాం
నరసరావుపేట ఈస్ట్: హలీం తయారీ ప్రత్యేకంగా ఉంటుంది. దాదాపు ఆరు నుంచి ఏడు గంటల పాటు పడుతుంది. తయారీలో స్వచ్ఛమైన నెయ్యి, వెన్న, గోధుమలు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, యాలకులు, నల్ల మిరియాలు, కస్తూరి మేతి, గులాబ్ పత్తి, నల్ల మిరప తదితర రుచికర, బలవర్ధకమైన దినుసులను ఉపయోగిస్తారు. హలీంలో చికెన్, మటన్, వెజిటబుల్ అనే మూడు రకాలు ఉన్నాయి. ప్రస్తుతం చికెన్, మటన్ హలీం మాత్రమే తయారు చేస్తున్నారు. తయారీకి ప్రత్యేక బట్టీల ను ఏర్పాటు చేస్తారు. తొలుత రెండు పెద్ద గిన్నెలు పట్టే పొయ్యిలు ఏర్పాటు చేస్తారు. వీటిపై గిన్నెలు పెట్టి వాటిలో చికెన్, మటన్‌లను మూడు నుంచి నాలుగు గంటలు ఉడికించి మెత్తటి పేస్ట్‌లా వచ్చే వరకు వండుతారు. గోధుమ రవ్వ, గరం మసాలా దినుసులను ఉడకబెట్టిన అనంతరం మెత్తటి పేస్ట్‌లా మారిన చికెన్, మటన్ వంటకాన్ని కలిపి మరోమారు కలయతిప్పుతూ గంట నుంచి రెండు గంటల పాటు వండుతారు. దీంతో రుచికరమైన హలీం సిద్ధమవుతుంది. కొనుగోలుదారులకు చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలలో వేసి దానిపై సన్నగా తరిగి నేతిలో వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసి వడ్డిస్తారు. కొలుగోలుదారుని స్తోమతును బట్టి ధర ఉంటుంది. చికెన్ హలీం ప్రారంభ ధర రూ.90లు నుంచి ఉంటుంది. మటన్ హలీం ధర చికెన్ కంటే అధికంగా ఉంటుంది. జిల్లాలో జోరుగా అమ్మకాలు జిల్లాలో హలీం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఏడాదిలో ఒక్క రంజాన్ మాసంలోనే లభించే ప్రత్యేక వంటకం కావడంతో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 11గంటల వరకు బట్టీల వద్ద రద్దీ కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, సతైనపల్లి వంటి పట్టణాలలో బట్టీలను ఏర్పాటు చేశారు. గ్రామాలకు పార్సిల్స్ తీసుకవెళ్లే వారి కోసం వేడి తగ్గకుండా ఉండేందుకు ప్రత్యేక ప్యాకింగ్ చేసి ఇస్తారు. తయారీలో చేయితిరిగిన వంట మాస్టర్లను హైదరాబాద్ నుంచి రప్పించి రుచికరమైన హలీంను అందిస్తున్నారు. కొన్ని బిర్యాని పాయింట్లలో బట్టీలను ఏర్పాటు చేసి బిర్యానీలతో పాటు హలీంలను విక్రయిస్తున్నారు. వీటితో పాటు రకరకాల చికెన్, మట న్ ఐటమ్స్‌తో పాటు ఖద్ధూర్ (కీర్), స్వీట్లు అందిస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో మాత్రమే లభించే ప్రత్యేక వంటకం హలీం. రంజాన్ నెలలో ప్రతిరోజు తెల్లవారుజాము సహరి నుంచి సాయంత్రం ఇఫ్తార్ వరకు ఉపవాస దీక్షలు చేసే ముస్లింలు తక్షణ శక్తి కోసం హలీం తీసుకొని శరీరంలో శక్తిని పెంచుకుంటారు. హలీంలో హైప్రొటీన్లు, కాల్షియం, కేలరీలు పుష్కలంగా లభిస్తాయి. దీక్ష కారణంగా శరీరంలో లోపించే విటమిన్లు అందించేందుకు అనువైన ఆహారమే హలీం. అందుకే ఇది కేవలం రంజాన్ మాసంలోనే అందుబాటులో ఉంటుంది. ఏడాది పొడవునా అనేక రుచులను ఆస్వాదించే నాలుక హలీం కోసం అర్రులుచాస్తుంటుంది. హలీం తయారీకి నైపుణ్యం కావాలి హలీం తయారీ చెప్పినంత సులువు కాదు. అందు కు నైపుణ్యం అవసరం. దినుసులను సమపాళ్లలో కలపడంతో పాటు చికెన్, మటన్‌లను బట్టీపై మెత్తగా ఉడికించాలి. వంట పూర్తయ్యే వరకు కలయతిప్పుతూ ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అడుగంటి రుచిలో తేడాతో పాటు నాణ్యత లోపిస్తుంది. నా చిన్నతనం నుంచి హైదరాబాద్‌లో హలీం తయారీలో పని చేస్తున్నా. గత రెండేళ్లుగా రంజాన్ మాసంలో ఇక్కడికి వచ్చి తయారు చేస్తున్నా. – షేక్ హర్షద్, వంట మాస్టర్, హైదరాబాద్ -
రంజాన్ మాసం : ఘనంగా ఇఫ్తార్ విందు (ఫొటోలు)
-
విజయవాడ : రంజాన్ ఘుమఘుమలు (ఫొటోలు)
-
పండుగ వేళ పాకిస్తానీలకు కొత్త కష్టాలు..
ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందే పాకిస్తాన్లో కూరగాయలు, పాలు, పంచదార, వంటనూనెలు, నెయ్యి, మాంసం, గుడ్లు, పప్పుల ధరలు మూడు రెట్ల మేరకు పెరిగాయి. దీంతో బడుగు, మధ్య ఆదాయవర్గాల వారు పలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో కేజీ ఉల్లి ధర రూ. 150 (పాకిస్తానీ రూపాయిలు) నుండి 300 రూపాయలకు పెరిగింది. అయితే కొంతమంది విక్రేతలు తగ్గింపు ధరలో కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. బంగాళదుంప ధర కేజీ 50 పీకేఆర్ నుండి 80 రూపాయలకు పెరిగింది. క్యాబేజీ ధర కిలో 100 పీకేఆర్ నుండి 150 పీకేఆర్‌కు పెరిగింది. పచ్చిమిర్చి కిలో 200 పీకేఆర్‌ల నుంచి 320 రూపాయలకు పెరిగింది. క్యాప్సికం కూడా కిలో 400 పీకేఆర్‌లకు చేరింది. సాధారణంగా రంజాన్ మాసంలో పండ్ల విక్రయాలు పెరుగుతాయి. చిన్న సైజు అరటి పండ్ల ధర డజను 80 పీకేఆర్‌ల నుంచి 120 రూపాయలకు పెరిగింది. మంచి నాణ్యమైన పెద్ద అరటిపండ్లు డజన్‌కు 200 పీకేఆర్‌లకు విక్రయిస్తున్నారు. పుచ్చకాయ ధర కూడా 150 నుంచి 200 పీకేఆర్‌లకు అమ్ముతున్నారు. -
భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు (ఫొటోలు)
-
రంజాన్ పర్వదినం.. అలీ దంపతుల ఆహ్వానం వీరికే! (ఫొటోలు)
-
ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ముస్లింలు పవిత్ర మాసంగా పాటించే రంజాన్ నెల చివరి రోజైన ‘ఈద్ ఉల్ ఫితర్’పండుగ సందర్భంగా హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ నివాసంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అక్కడ కేసీఆర్‌కు మహమూద్ అలీ, ఆయన కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అందరికీ కేసీఆర్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. మహమూద్ అలీ ఆతిథ్యాన్ని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి కేసీఆర్ స్వీకరించారు. రంజాన్ మాసంలో ఆచరించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, క్షమాగుణం, కరుణ తదితర ఆధ్యాతి్మక భావనలు తదితర అంశాలపై కేసీఆర్ తన వెంట వచ్చిన మంత్రులు ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తనను కలిసేందుకు వచ్చిన పలువురు మత పెద్దలు, ఇతరులను పేరుపేరునా పలకరించి అలాయ్ బలాయ్ తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమకాలం నుంచీ నేటి వరకు తనతో కొనసాగుతున్న సీనియర్ కార్యకర్త సత్తార్ గుల్షనీనీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కేసీఆర్ వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్ విజయలక్ష్మీ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మసీఉల్లాఖాన్, సలీం, రవీందర్ సింగ్, మేడె రాజీవ్ సాగర్, సీనియర్ నేతలు మొయిత్ ఖాన్, రాయిడన్ రోచ్ తదితరులు పాల్గొన్నారు. తమ ఆతిథ్యం స్వీకరించిన సీఎంకు మహమూద్ అలీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలుపుతూ జ్ఞాపికను బహూకరించారు. -
రంజాన్ స్పెషల్: చిరంజీవిని కలిసిన అలీ..ఫోటోలు వైరల్
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా సినీ నటుడు అలీ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇక రంజాన్ పర్వదినాన్ని చిరంజీవితో పంచుకోవడం ఎంతో అందంగా ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. కాగా అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. -
ఆఫ్ఘన్ మటన్ బిర్యానీ తయారు చేసుకోండిలా!
ఆఫ్ఘన్ మటన్ బిర్యానీ తయారీ ఇలా! కావలసినవి: ►మటన్– కిలో ►బాసుమతి బియ్యం – ముప్పావు కిలో ►లవంగాలు– పది ►దాల్చిన చెక్క – మూడంగుళాల ముక్కలు రెండు ►ఉప్పు – 2 టీ స్పూన్లు ►అల్లం వెలుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ►నీళ్లు– 8 కప్పులు ►నూనె– కప్పు ►ఉల్లిపాయ ముక్కలు – 100 గ్రా ►యాలకులు – 8 ►జీలకర్ర– టీ స్పూన్ ►క్యారట్ తురుము– పావు కేజీ ►కిస్మిస్ – అర కప్పు ►పైన్ నట్స్ లేదా బాదం – అరకప్పు ►ఖర్జూరాలు ; పది. తయారీ: ►మటన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. ►బియ్యాన్ని కడిగి మునిగేటట్లు నీటిని పోసి పక్కన ఉంచాలి. ►మందపాటి పెద్ద పాత్రలో మాంసం ముక్కలు, ఒక దాల్చిన చెక్కను పలుకులు చేసి వేయాలి. ►సగం లవంగాలు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి నీటిని పోసి ఉడికించాలి. ►ముక్క ఉడకడానికి దాదాపు ముప్పావు గంట పడుతుంది. ►బియ్యంలో నీటిని వడపోసి చిల్లుల పాత్రలో వేసి రెండు నిమిషాల సేపు ఉంచాలి. ►మరొక పెనంలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి పైన్ నట్స్ లేదా బాదం, కిస్మిస్, క్యారట్లను వేయించి పక్కన ఉంచాలి. ►ఇప్పుడు పెద్ద పెనం పెట్టి నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించి అందులో మరో దాల్చిన చెక్క పలుకులు, మిగిలిన సగం లవంగాలు, యాలకులు, జీలకర్ర వేయాలి. ►ఇవి కొద్దిగా వేగిన తరవాత ఉడికించిన మాంసాన్ని నీరు ఇతర దినుసులతో సహా ఇందులో వేయాలి. ►ఉడకడం మొదలైన తర్వాత బియ్యాన్ని వేసి కలిపి మూత పెట్టాలి. ►మీడియం మంట మీద ఉడికించాలి. పది నిమిషాల్లో ఉడుకుతుంది. ►మధ్యలో ఓ సారి జాగ్రత్తగా మసాలా దినుసులు సమంగా కలవడం కోసం బియ్యం విరగకుండా కలపాలి. ►ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న క్యారట్, కిస్మిస్ మిశ్రమాన్ని, ఖర్జూరాలను బిర్యానీ మీద సమంగా పరిచినట్లు అమర్చి గట్టిగా మూత పెట్టి, మంట తగ్గించాలి. ►ఏడెనిమిది నిమిషాలకు బిర్యానీ రెడీ అవుతుంది. ►వేడిగా ఉన్నప్పుడే రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. -
భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు (ఫొటోలు)
] -
సమతా మమతల పర్వం రమజాన్.. ప్రాముఖ్యత ఇదే..
మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. వాటిలో పండుగలు ప్రధానమైనవి. అనాదిగా ఇవి చలామణిలో ఉన్నవే. ముస్లిం సోదరులు జరుపుకునే ఈ పండుగ (ఈద్ ) అలాంటిదే. రమజాన్ నెలతో దీనికి సంబంధం ఉండడంతో అదే పేరుతో ప్రసిధ్ధి గాంచింది. నిజానికి రమజాన్ అన్నది సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. దీనికింతటి ప్రత్యేకత ప్రాప్తం కావడానికి కొన్ని కారణాలున్నాయి. సర్వ మానవాళకి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రమజాన్ మాసంలోనే అవతరించింది. మానవజాతికి వెలుగును, జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి రమజాన్ మాసంలో అవతరించిన కారణంగా దీనికింతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయి. మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ (ఉపవాసవ్రతం) అనే గొప్ప ఆరాధనను కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జనహృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ విలువలను, సుగుణాలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపు మనసు పోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది. జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలు అలవడతాయి. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను వారు అనుభవ పూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇలా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటు చేసిన విశ్వప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ నెల మొదటి తేదీన ఈద్ జరుపుకుంటారు. ఇకపోతే, వెయ్యి నెలలకంటే విలువైన రాత్రి అని చెప్పబడిన ‘లైలతుల్ ఖద్ర్’ కూడా రమజాన్‌లోనే ఉంది. అందుకని శక్తివంచన లేకుండా ఆరాధనలు, సత్కార్యాలు ఆచరిస్తారు. దానధర్మాలు చేస్తారు. రమజాన్ మాసాంతంలో ఫిత్రాలు చెల్లించి ఈద్ నమాజుకు వెళతారు. ఆ రోజు దైవం తన భక్తులకు నెలరోజుల సత్కార్యాలకు అనంతమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ‘ఈద్ ’ దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం. మనిషి ఎలాంటి స్థితిలోనైనా పశ్చాత్తాప హృదయంతో దైవం వైపు మరలితే, అలాంటి వారిని దైవం తన కారుణ్య ఛాయలోకి తీసుకుంటాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు. ఈద్ తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయబోమని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని, సన్మార్గం వైపుకు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా, దానికి అనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి.ఈ నెల్లాళ్ళూ ఎంతటి నియమ నిష్ఠలతో గడిపారో ఇకముందు కూడా ఇదే çస్ఫూర్తి కొనసాగిస్తామని ప్రతిన బూనాలి. ఈద్ పర్వదినం సందర్భంగా ఇలాంటి దృఢ సంకల్పం చెప్పుకుంటే అది నిజమైన పండుగ రోజు అవుతుంది. జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసే శుభదినం అవుతుంది. ఒకవేళ ఈ విషయాల పట్ల శ్రధ్ధ వహించకపోతే ఈద్ సౌభాగ్యానికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పవిత్ర జీవితం గడిపే ప్రయత్నం చెయ్యాలి. ఈ విధంగా నెల్లాళ్ళ పాటు అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ, రమజాన్ శుభాలతో పునీతమయ్యే మహాభాగ్యాన్ని కలిగించినందుకు ఈద్ రోజున దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటారు. పండుగ రోజు వేకువ ఝామునే నిద్రలేచి, స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్ నమాజు చేస్తారు. ఉన్నంతలోనే మంచి దుస్తులు ధరించి, అత్తరులాంటి సువాసనలు వినియోగిస్తారు. ఈద్ గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేస్తారు. తమ అపరాధాలను మన్నించమని, సన్మార్గాన నడపమని దుఆ (వేడుకోలు) చేస్తారు. సమస్త మానవాళి సుఖసంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు ఆచరిస్తారు. వ్యాధుల బారినుండి, అప్పుల బారినుండి, శత్రువు బారినుంచి, దుష్టపాలకుల బారినుంచి, కరవుకాటకాల నుంచి, దారిద్య్రం నుంచి తమను, తమ దేశాన్ని, యావత్ భూప్రపంచాన్ని రక్షించమని, విశ్వమానవాళినంతటినీ కాపాడమని కడు దీనంగా విశ్వప్రభువును వేడుకుంటారు. స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు, పరిచితులు, అపరిచితులందరితోనూ సంతోషాన్ని పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈవిధంగా ఈదుల్ ఫిత్ర్ పండుగ సమాజంలో ఒక చక్కని సుహృద్భావపూర్వకమైన, ప్రేమపూరితమైన, సామరస్య కుసుమాలను వికసింపజేస్తుంది. మానవీయ విలువల పరిమళాన్ని వెదజల్లుతుంది. దైవభక్తిని, దైవభీతిని, బాధ్యతాభావాన్ని, జవాబుదారీతనాన్ని, ఇంకా అనేక సుగుణాలను జనింపజేస్తుంది. ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలతో... – యండి. ఉస్మాన్ ఖాన్ ఈద్ నమాజ్ ఇలా... అందరూ ఈద్ గాహ్‌కు చేరుకున్న తరువాత వరుస క్రమంలో బారులు తీరి నిలబడతారు. ఇమాం అగ్రభాగంలో నిలబడి ఆరు, లేక పన్నెండు అదనపు తక్బీర్లతో రెండు రకతులు నమాజ్ చేయిస్తాడు. ప్రారంభంలో రెండు రకతుల ఈద్ నమాజ్ సంకల్పం చేసుకున్న తరువాత, ‘అల్లాహు అక్బర్’ అని రెండు చేతులూ పైకెత్తి నాభిపై, లేక గుండెలపై కట్టుకోవాలి. తరువాత ‘సనా’ పఠించి, మళ్ళీ ‘అల్లాహు అక్బర్’ అని పలికి చేతులు పైకెత్తి కిందికి వదిలెయ్యాలి. ఇలా రెండుసార్లు చేసి మూడవసారి చేతులు కట్టుకోవాలి. ఇప్పుడు ఇమాం సూరె ఫాతిహా తరువాత, మరొక చిన్న సూరానో, లేక కొన్ని వాక్యాలో పఠించి రుకూ, సజ్దాలు చేస్తాడు. తరువాత రెండవ రకతు కోసం నిలబడి మళ్ళీ సూరె ఫాతిహా, మరికొన్ని వాక్యాలు పఠించి, మూడుసార్లు ‘అల్లాహు అక్బర్’ అంటూ మూడుసార్లూ చేతులు పైకెత్తి కిందికి వదిలేస్తారు. నాలుగోసారి ‘అల్లాహు అక్బర్’ అంటూ రుకూ చేస్తారు. తరువాత సజ్దాలు చేసి, అత్తహియ్యాత్, దురూద్‌లు పఠించి ముందు కుడి వైపుకు, తరువాత ఎడమ వైపుకు సలాం చెప్పడంతో, ఆరు అదనపు తక్బీర్లతో రెండు రకతుల ఈద్ నమాజ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈ అన్ని సందర్భాల్లో వెనుక బారులు తీరిన భక్తులంతా ఇమాంను అనుసరిస్తారు. ఈద్ నమాజులో అజాన్ , అఖామత్లు ఉండవు. తరువాత ఇమాం మింబర్ (వేదిక) ఎక్కి ఖురాన్, హదీసుల వెలుగులో ప్రస్తుత పరిస్థిలను అన్వయిస్తూ సమాజానికి మార్గదర్శక సందేశం ఇస్తాడు. తరువాత దుఆతో ఈద్ ప్రక్రియ సంపూర్ణమవుతుంది. ‘ఫిత్రా’ పరమార్థం పవిత్ర రమజాన్ మాసంలో ఆచరించబడే అనేక సత్కార్యాల్లో ‘ఫిత్రా’ ఒకటి. ఫిత్రా అన్న పదం ఇఫ్తార్ నుండి వచ్చింది. ఫిత్ర్ అంటే ఉపవాస విరమణ అన్నమాట. ‘సదఖయే ఫిత్ర్’ అంటే రోజా విరమణకు సంబంధించిన దానం అని అర్థం. ధర్మశాస్త్ర పరిభాషలో ‘సదఖయే ఫిత్ర్ ’ అంటే ఉపవాస దీక్షలు పాటించేటప్పుడు జరిగిన లోపాలకు, పొరపాట్లకు పరిహారంగా రమజాన్ నెలలో విధిగా చెల్లించవలసిన దానం అన్నమాట. రోజాలు విధిగా నిర్ణయించిన నాటినుంచే ఫిత్రాలు కూడా తప్పనిసరిగా చెల్లించాలని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఆదేశించారు.మారిన కాలాన్ని, నేటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలు, వస్త్రాలు, నగదు ఏ రూపంలో అయినా ఫిత్రా చెల్లించవచ్చు. కనుక పవిత్ర రమజాన్ మాసంలో చిత్తశుద్ధితో అన్నిరకాల ఆరాధనలు ఆచరిస్తూ , ఫిత్రాలను కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చాలి. ఈ పవిత్ర మాసంలో ఏదో ఒక రకంగా, ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చి, తమ పరిధిలో కొందరి మోముపైనైనా చిరునవ్వులు చూడగలిగితే అంతకంటే మహాభాగ్యం ఇంకేముంటుంది! అల్లాహ్ అందరికీ రమజాన్‌ను సద్వినియోగం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. -
Ramzan Special: 10 లక్షల బిర్యానీలు.. 4 లక్షల హలీమ్‌లు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసంలో హైదరాబాదీలు అభి‘రుచి’తీరా పండుగ చేసుకున్నారు. తరచూ తినే బిర్యానీల నుంచి పండుగ స్పెషల్ హలీమ్, మిఠాయి వంటకాల దాకా భారీగా లాగించేశారు. కేవలం ఒక్క ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారానే ఏకంగా పది లక్షల బిర్యానీలు, 4 లక్షల హలీమ్‌లు ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. అన్ని రకాల వంటకాలు కూడా గతేడాదితో పోలిస్తే 20% ఎక్కువగా తెప్పించుకుని తిన్నారు. గురువారం స్విగ్గీ ఈ వివరాలను వెల్లడించింది. ఒక్క యాప్ ద్వారానే ఇంత ఫుడ్ లాగించేస్తే.. మిగతా యాప్‌లు, నేరుగా హోటళ్లలో తిన్న బిర్యానీలు, హలీమ్‌లు లెక్క ఇంకెంత పెద్దగా ఉంటుందో అర్థమవుతోందని నగరవాసులు చెప్తున్నారు. హలీమ్‌కు గులామ్.. రంజాన్ మాసంలో ఎప్పటిలాగే హలీమ్ కోసం ఆర్డర్లు వెల్లువెత్తాయి. తమ యాప్ ద్వారా 4 లక్షలకుపైగా హలీమ్‌లను ఆర్డర్ చేశారని స్విగ్గీ తెలిపింది. పండుగ స్పెషల్ హలీమ్ ఉన్నా బిర్యానీకి క్రేజ్ తగ్గలేదని పేర్కొంది. బిర్యానీ రాజధానిగా పేరును నిలబెట్టుకుంటూ తమ యాప్ ద్వారా 10 లక్షల బిర్యానీలను ఆర్డర్ చేశారని.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20% ఎక్కువని వెల్లడించింది. చికెన్, పాలమూరు పొట్టేల్, పర్షియన్ స్పెషల్, ఇరానీ, డ్రైఫ్రూట్ వంటి హలీమ్‌లు అమ్ముడయ్యాయి. మరిన్ని వంటకాలకూ డిమాండ్ రంజాన్ సందర్భంగా మల్పువా, ఫిర్నీ, రబ్రీ వంటి మిఠాయి వంటకాలకూ డిమాండ్ పెరిగింది. ఈ స్పెషల్ ఐటమ్స్‌కు సంబంధించిన ఆర్డర్లు 20% పెరిగాయని స్విగ్గీ తెలిపింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఖర్జూరంతో చేసిన ఇఫ్తార్ వంటకాలు, సమోసాలు, భాజియాలు ఉన్నాయని వివరించింది. రుచులకు చిరునామాలివీ.. హైదరాబాద్‌లో బిర్యానీ, హలీమ్ తదితర రుచులకు పేరొందిన ప్రముఖ రెస్టారెంట్లు పిస్తాహౌస్, ప్యారడైజ్, మెహఫిల్ తదితరాలకు భారీగా ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఇక దాదాపు 5లక్షల వరకు డ్రైఫ్రూట్స్, ఖర్జూరాలకు సంబంధించిన ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. -
ఈ పదార్థాలు ఉంటే చాలు.. షీర్ కుర్మా ఇంట్లో తయారు చేసుకోవచ్చు!
అమావాస్య వెళ్లిపోయింది... నెలవంక కోసం ఎదురు చూపు మొదలైంది. చంద్ర దర్శనం నేడు కావచ్చు... లేదా రేపు కావచ్చు. ‘ఈద్ ఉల్ ఫిత్ర్’ వేడుకకు ఇంటిని సిద్ధం చేద్దాం. పాకిస్థానీ షీర్ కుర్మా కావలసినవి: ►సన్న సేమ్యా – పావుకేజీ ►వెన్న తీయని పాలు – లీటరు ►చక్కెర – పావుకేజీ ►నెయ్యి – కప్పు ►జీడిపప్పు – అర కప్పు ►బాదం – అర కప్పు ►పిస్తా – పావు కప్పు ►గులాబీ రెక్కలు– గుప్పెడు ►యాలకులు – పది. తయారీ: ►ఏ జీడిపప్పు, బాదం, పిస్తాలను తరగాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి వీటన్నింటినీ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ►వేగిన తర్వాత గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ►మిగిలిన నెయ్యిలో సేమ్యా వేసి వేగిన తరవాత పాలు పోసి కలుపుతూ మరిగించాలి. ►యాలకులను నలగ్గొట్టి పాలలో వేయాలి. పదిహేను నిమిషాల పాటు మరిగిన తర్వాత చక్కెర వేసి అడుగు పట్టకుండా గరిటతో కలుపుతూ మరిగించాలి. ►ఖీర్ చిక్కబడిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గింజలను, పూలరెక్కలను వేసి కలిపి దించేయాలి. -
Ramadan 2023: పాతబస్తీ, సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసం ఆఖరి శుక్రవారమైన జమాత్ అల్ విదా ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీతో పాటు సికింద్రాబాద్ ప్రాంతంలోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్) జి.సుదీర్‌బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మక్కా మసీదులో జరిగే ప్రార్థనల కారణంగా ఆ సమయంలో చార్మినార్–మదీనా, చార్మినార్–ముర్గీ చౌక్, చార్మినార్–రాజేష్ మెడికల్ హాల్ (శాలిబండ) మధ్య రోడ్లు పూర్తిగా మూసి ఉంటాయి. ఈ మార్గాల్లోకి ఎలాంటి వాహనాలు అనుమతించరు. ప్రార్థనలకు హాజరయ్యే వారి కోసం గుల్జార్ ఫంక్షన్ హాల్, చార్మినార్ బస్ టెర్మినల్ పార్కింగ్, సర్దార్ మహల్ సహా ఏడు ప్రాంతాల్లో పార్కింగ్ కేటాయించారు. అదే సమయంలో సికింద్రాబాద్‌లోని సుభాష్ రోడ్ కూడా మూసేస్తారు. వాహనాలను ప్రత్యా మ్నాయ మార్గాల్లో మళ్లిస్తారు. ఈ ఆంక్షలు, మళ్లింపులు ఆర్టీసీ బçస్సులకు వర్తిస్తాయని, సహాయ సహకారాలు అవసరమైన వాళ్లు 9010203626 నంబర్లో సంప్రదించాలని సుధీర్‌బాబు సూచించారు. చదవండి: Hyderabad: ఏమా జనం!.. కిక్కిరిసిన మెట్రో.. అడుగుపెట్టే జాగ లేదు -
రంజాన్ స్పెషల్ స్టోరీ : నాకు కావలసినదల్లా అక్కడుండేది..
అప్పుడు పంతొమ్మిదివందల ఎనభై రోజులు. అపుడు దేవుడు ఉన్నాడో లేదో తెలీదు కానీ పండగలు మాత్రం ఖచ్చితంగా ఉండేవి. మా ఇళ్లల్లో జరుపుకునే పండగలు కొన్నయితే, బయట కనపడేవీ మరికొన్ని. మా ఇంటికి ఆనుకునే కమ్యూనిస్ట్ మార్కిస్ట్ పార్టీ ఆఫీస్ ఉండేది. వీలు కుదిరినపుడల్లా నేనస్తమానం అక్కడే ఉండేవాణ్ణి. నాకెప్పుడు చూసినా వీలు కుదిరేది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్‌లో నాకెంతో ఇష్టంగా అనిపించే పుస్తకాలు ఉండేవి, తెలుగులో వచ్చే అన్ని దినపత్రికలు అక్కడ దొరికేవి. సాయంకాలాలు కామ్రేడ్స్ మీటింగులు ఉండేవి. ప్రతి సమావేశం ప్రారంభంలోనూ, ముగింపులోనూ పాటలు ఉండేవి. వారితో కలిసి గొంతు కలపడానికి ఎంతో ఉత్సాహంగా ఉండేది. కలుపుతుంటే సంతోషంగా ఉండేది. మధ్యాహ్నాలు పార్టీ ఆఫీస్ ఖాళీగా ఉండేది. అక్కడ నీలిమందు రంగు, రెడ్ ఆక్సైడ్ కలిపిన జగ్గులు ఉండేవి, కుంచెలు ఉండేవి, తెల్లని గోడలు ఉండేవి. నేనక్కడే గోడల మీద బొమ్మలు వేసుకుంటూ ఉండేవాణ్ణి. నిద్ర తగిలినపుడు చల్లని ఫ్యాన్ కింద విశాలాంధ్రో, ప్రజాశక్తో, ఆంధ్రప్రభో పేపరు పరుచుకుని నిదుర తీసే కాలం ఉండేది. తరుచుగా సామాజిక స్పృహ కలిగిన సాంఘిక నాటకాల, బుర్ర కథల, విప్లవ గీతాల రిహార్సల్స్ జరుగుతూ ఉండేవి. నేనన్నిటికీ హాజరయ్యేవాణ్ణి, నాటకాల డైలాగులు, బుర్రకథల భళానంటి భాయి తమ్ముడా మేల్ భళానోయ్ తందానాలన్నీ నాలుక చివర పాఠాల్లా అతుక్కుపోయేవి. మా నూనెపల్లె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ మనుష్యుల్లో గొప్ప గుణం ఏమిటంటే చిన్న పిల్లవాడినని, ఏమీ తెలియనివాడిని కదాని నన్నెప్పుడూ దూరం పెట్టేవారు కాదు. నాకు కావలసినదల్లా అక్కడుండేది, నాకు ఆ వాతావరణం నచ్చేది. వారు నాకు అయినవారు అయ్యారు. వారు దేవుడు లేడనేవారు. నేనూ దేవుడు లేడనే అనుకునేవాణ్ణి. లేడని ఎవరితో అనేవాణ్ణి కాదు. దేవుడు ఎవరికి ఉన్నా లేకున్నా టంచనుగా మాత్రం పండగలు వస్తూ ఉండేవి. మేము జరుపుకునే ముస్లిమ్ పండగలు, మేము జరుపుకోకున్నా ఇరుగూ పొరుగులతో జరుపుకున్నంత జరిగే ఇతర పండగలు. అతి ముఖ్యంగా ఆగష్ట్ పదహైదు, జనవరి ఇరవై ఆరు, అక్టోబర్ రెండు, నవంబర్ పద్నాలుగు… మొదలైన జాతీయపండగలు కూడా అంతే ఉత్సాహంగా జరుపుకోడానికి నిద్రలేచేవాళ్లం. అసలు పండగలంటేనే తెల్లవారు ఝామునుండే మొదలయేవి. ఇంటి బయట పెద్ద డేగిసా పెట్టి కట్టెల పొయ్యి మీద నీళ్ళు నిరంతరాయంగా కాగుతూనే ఉంటాయి, కాగిన నీళ్ళు కాగినట్లుగా పట్టుకుపోయి జాలాట్లో గంగాళంలో పోస్తూనే ఉంటారు. జనాలు స్నానాలు చేస్తూనే ఉంటారు. మొదట ఇంట్లో ఉన్న మగవాళ్ళు, పిల్లలు స్నానాలు కానిస్తారు, నమాజులకు వెళ్లాలి కదా. గంగాళంలో ఆ ఉడుకుడుకు నీటిలో ఇత్తడి చెంబు ముంచుకుని స్నానం చేయ్యడమనే అనుభవాన్ని ఆ గోల్డన్ ఓకర్ ఎల్లో రంగుని తలుచుకుంటుంటే గతజన్మ జ్ఞాపకాల్లా అనిపిస్తున్నాయి అవన్నీ. స్నానాలు కాగానే కొత్త బట్టలు తొడుక్కోవాలి కదా! మా మేనత్త భర్త మా కుటుంబానికి ఆస్థాన దర్జి, కాబట్టి మాకెప్పుడూ సమయానికి కొత్త బట్టలు కుట్టి రెడీగాలేవు అనే చింతే రాసిపెట్టి లేదు. ఆ రోజుల్లో పండగలకు కొత్త బట్టల ముచ్చట ఏమో కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కొత్త బట్టలకు పండగా, పుణ్యకార్యాల ప్రాప్తత లేదు. జనం దగ్గర డబ్బులు, అప్పులు ఎక్కువయిపోయి ఎప్పుడు పడితే అప్పుడు అవసరమున్నా, లేకున్నా బట్టలు కొనేయడం, వేసేసుకోడమే. అసలు కొత్త బట్టలంటేనే తాను నుండి గుడ్డ చింపించి, చక్కగా కొలతలు తీపించి, కుట్టించి, నలభైసార్లు దర్జీ షాపు చుట్టూ తిరిగి, చొక్కాయ్ సాధించి దానిని బొగ్గుల పెట్టెతో ఉల్టా పల్టా ఇస్త్రీ లాగించి మన చొక్కాని తొలిసారిగా వాడెవడో కాక మనమే తొడుక్కోడం. ఇప్పుడు మనం కొత్తంగి అని తొడుక్కునేది ఎక్కడని కొత్తది? ఆ రెడీమేడ్ షో రూమ్ ట్రైల్ రూమ్‌లో ఎంతమంది దానిని వేసుకుని, విడిచి, నలగ్గొట్టి బాలేదని బయట పడేసింది వచ్చి మన వాటాకు దక్కిందో! ఇట్లా వచ్చే పండగలకు, మన పుట్టిన రోజు పండగలకు ఆ దగ్గరికాలం రోజుల్లో మన స్కూల్ యూనిఫామ్ కనుక చినగడమో, పొట్టి కావడమో జరగరాదని దేవుడు ఉన్నా లేకపోయినా దేవుడికి దండం పెట్టుకోవాలి. లేకపోతే దుబారా అవుతుందని ఒక్కోసారి పండగలకు, పుట్టినరోజులకు మనకు స్కూలు డ్రస్సును కొత్తబట్టలుగా కుట్టించడం పెద్దల జాగ్రత్త. పండగనాడు కూడా బడి యూనిఫామ్ ఏమిరా! పైన తెలుపు, కింద ఖాకీ. ఏవయినా రంగులా అవి? స్నానాలు కానించి, కొత్త బట్టలు వేసుకుని, తలకు నూనె పట్టించి, సుబ్బరంగా తల దువ్వుకుని, రెడీ రెడీ అనుకున్నాకా పెద్దలూ పిల్లలూ అందరూ తిక్కస్వామి దర్గా దగ్గర ఈద్గాకు బయలుదేరేవాళ్లం. చక్కగా మడత పెట్టిన దుప్పట్లను మేము పెద్ద పిల్లలం చంకలో పెట్టుకుంటే, మాకంటే చిన్నవాళ్లయిన మా బుల్లి బుల్లి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మా చిన్నాయనగార్లవో, మావో చిటికెనవేళ్ళు పట్టుకుని దారికంతా అత్తరు వాసన అద్దిస్తూ నడిచేవాళ్లం. మామూలుగా ఏ రోజు కూడా అయిదుపైసాలు కూడా పిల్లల చేతిలో పెట్టని మా మాబ్బాషా చిన్నాయన రోజు మా చేతికి, మా జేబుకు నిండుగా రూపాయలు, అర్ధరూపాయల బిళ్లలు నింపేవాడు (అంటే మా చిన్నాయన మూడువందల అరవైనాలుగు రోజుల పిసినారి అని కాదు, డబ్బు పిల్లలను చెడగొడుతుంది అని ఆయన నియమం, అదే అవసరమైన ఖర్చుపెట్టే దగ్గర ఆయనది ధారాళమైన చేయే) ఆ చిల్లర డబ్బులంతా ఎందుకంటే నమాజు ముగిశాకా దారికి రెండు పక్కలా బీదా బిక్కీ జనం ఉంటారు కదా, వారికి ధర్మం చేయడానికి. ఒక్క నాణెం మిగిలిపోకుండా అన్ని బిళ్ళలు అక్కడే పంచి వచ్చేసేవాళ్ళం. అలా నమాజు నడకకు బయలుదేరితే దారి నిండా నమాజులకు వెళ్ళే జనమే. మామూలు రోజుల్లో నిత్యం లుంగీ, కట్ బనీయన్ల మీద కనపడే టీ బంకు లాలూభయ్ గాని, రిక్షా తొక్కే బాషా భయ్ వంటి అనేకం ఆరోజు అమిత శుభ్రంగా, కళకళ్లాడుతూ ముచ్చటగా కొత్తబట్టల్లో కొత్తగా కనపడేవారు. ఈద్గా దగ్గర నా స్కూలు ప్రెండ్స్ కూడా చాలామంది కనపడేవారు. వాడు కనపడగానే వీడు, వీడు అగుపడగానే వాడు పళ్ళికిలించుకోడమే తప్పా, ఆదాబ్ అనో, అస్సలామలైకుం అంటూ లేని గడ్డాన్ని నిమురుకుంటూ గంభీరంగా తెలుగు సినిమా వేషాలు ఏమీ పడేవాళ్లం కాదు. మాకు తెలిసిన అస్సలామలైకుం అల్లా ‘సలాములేకుం సాయబుగారు భలే జోరుగా ఉన్నారు’ అనే గులేబకావళి సినిమా పాట మాత్రమే. ఎక్కువ ఆలస్యం చేయకుండా పండగ నమాజు చేసే ఈద్గాకు త్వరగా చేరుకుంటే స్థలం కోసం అటూ ఇటూ వెదుక్కోకుండా మా దుప్పట్లు పరుచుకునేంత చల్లని నీడని ఏ చెట్టుకిందో చూసుకోవచ్చు. ప్రార్థనలు త్వరగానే ముగిసేవి. ప్రార్థానానంతర ఉపన్యాసాలు ఉంటాయి కదా, అవి చాలా సమయం తీసుకుంటాయి. అప్పటికీ ఎండ చురుకెక్కుతుంది. ఉదయం ఏమీ తినకుండానే వస్తాము కదా, పిల్లలు బెట్ట పోతారని మా చిన్నాయన దిగులు. అందుకే మంచి చెట్టుకింద జాగాలో మా దుప్పట్లు పరుచుకుంటాం. కాసేపటి తరువాత నమాజు మొదలవుతుంది. కుడివాడు కుడికి తల తిప్పితే కుడికి, ఎడమవాడు ఎడమకు తిప్పితే ఎడమ. ఎదుటివాడు ముందుకు వంగితే మనమూ వంగడమే తప్పా దేనినీ శాస్త్రోక్తంగా నేర్చుకున్నది లేదు. చిన్నపుడు పర్లేదు కానీ కాస్త పెద్దయ్యాక మనం చేసేది దొంగ నమాజు. కళ్ళు మూసుకుని ప్రార్థనలు చేసే తోటివాళ్ళు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తుంటాడు కదా! మన మనసు గమనిస్తుంటుంది కదా! సిగ్గుగా ఉండదూ? మనమీద మనకు అసహ్యం వేయదూ? అందుకని ఆ దొంగ పని ఎందుకని అదీనూ మానేశా. (ఆ తరువాత్తరువాత ఈద్గాలో సామూహిక ప్రార్థన వదిలేసి మునిసిపల్ హైస్కూలు గ్రవుండ్‌లో చాచిన చేతులు అల్లా దువా కోసం కాక ఎర్రని కార్కు బంతిని పట్టడం కోసం విచ్చుకునేవి. మధ్యాహ్నం నమాజులు ముగిసే సమయానికి పది ఓవర్ల మ్యాచు ముగిసి రంజాను నమాజు జనాల గుంపు మధ్య కాళ్ళు దూర్చి ఇల్లు చేరుకునేవాడ్ని. మాసిన బట్టలు, చెరిగిన తల, దోక్కుపోయిన మోచేయి అందాక చేసిన ఘనకార్యం చెబుతున్నా నాయనమ్మ, మేనత్తలు, పిన్నులు ఏమీ అనేవారు కాదు. వేడి పాల సేమియాలో నానిన కిస్మిస్‌లకు మాదిరి మెత్తని నవ్వుతో తియ్యగా కనిపించేవారు.) నమాజు ముగిశాకా ఈద్గా దగ్గరి నుండి ఇంటికి చేరే వరకు దారిన తగిలిన ప్రతి ఒకరిని మా పెద్దవాళ్ళు ఆలింగనాలు చేసుకుంటూ వచ్చేవారు. ఏమిటీ నడిరోడ్డు మీద కావిలింతల ఆలస్యం అని విసుక్కుంటూ పిల్లలం మేము మాత్రం గబగబా పరిగెత్తుకు ఇంటికి వెళిపోయేవాళ్లం. వచ్చాం కదాని సరాసరి ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. గుమ్మం దగ్గర మా పిన్నిగార్లల్లో ఎవరో ఒకరు పళ్ళెంలో ఎర్ర నీళ్ళు పట్టుకు నిలబడితే అందులో అయిదు పైసాలో, పది పపైసాలో బిళ్ళ పడేసేవాళ్లం. పిలల్ల తల చుట్టూ ఆ పళ్ళెం తిప్పి దిష్టి తీసేసేవారు. అప్పుడు కాళ్ళు మొహం శుభ్రంగా కడుక్కుని ఇంటి లోపలికి వస్తే చక్కగా కూచోబెట్టి నోటి నిండా తీపిగ సేమియా పాయసం తినపెట్టేవారు. ఈ హైద్రాబాద్ మహానగరానికి వచ్చాకా పత్రికల భాషలాగా పండగ వంటకాలు కూడా మారిపొయినై! క్యా భాయ్! షీర్ కూర్మా నహీ హైక్యా? హలీం నహి ఖిలాతే? ఇఫ్తార్ విందు ఎప్పుడు ఇస్తాయి హై? వంటి విపరీత ఓవరాక్షన్ మాటలు వినపడేవి. అసలు రంజాన్‌ను రంజాన్ అని కూడా అనకూడదట రమ దాన్ అనాలని మళ్ళీ అదొక రుద్దుడు జ్ణానము. వద్దురా దేవుడా! ప్రాంతం ప్రాంతంకి కల్చర్, ఆహార విహారాలు, ఆచార వ్యవహారాలు మారిపోతాయిరా స్వామి. మాకసలు పత్రికా పదకోశ పాకముల వంటి బిరియాని, మిర్చ్ కా సాలన్, షీర్ ఖూర్మా, హలీం, హరీస్ లేనే లేవు. మాదంతా నంద్యాల జిల్లా, నూనెపల్లె ఆత్మకింపుగా వండబడిన సేమియా పాయసం, డబల్ కా మీఠా, బగరా ఖానా, దాల్చా, భాజి బోటి, పెరుగు పచ్చడి. అంతే! చాలు! ఇదే మా పండగల జీవితాదర్శం. ఆ విధంగా పండగ పాయసం మీద వేసిన మేవా మెక్కేసి పాయసం లోపల ఉన్న కిస్మిస్, గోడంబి పలుకులు తినేసి, మెత్తని పాయసం తీగల్ని జుర్రేసేలోగా మా చిన్నాయనలు, మా మేనత్తల భర్తలు వచ్చేసేవాళ్ళు. ఇంటి లోపల అందరికీ చక్కగా పొడగాటి సిరి చాపలు, బొంతలు పరిస్తే ఇంటిల్లపాది కూచుని హాయిగా అన్నాలు తినేవాళ్లం. నాకైతే రంజాన్ నాడు వండే పలావు కన్నా మహత్తరమయిన రుచిగల మరో పండగ పలావు ఉండేది. అది పెద్దలపండగ అని వస్తుంది ఆ రోజున వండే పలావుకు రుచే ప్రత్యేకం. అది ఎలా అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్దల రాత్రి అని ఒక దినం ఉంటుంది. ఆ దినాన మా ఇంట్లో మరణించిన వారినందరిని గుర్తు చేస్తుకుంటూ, వారు తమ జీవితకాలంలో దేన్నయితే ఇష్టపడేవాళ్ళో ఆ పదార్దాలను నైవేద్యంగా పెట్టేవారు. వారి కొరకు కొత్తబట్టలు తెచ్చేవారు. మా జేజినాయనకు గణేష్ బీడి ఇష్టమని బీడి కట్ట ఒకటి, గళ్ళుగళ్ళు గల లుంగి, మా అమ్మకు చీర, చిన్నతనానే చనిపోయిన చిన్నపిల్లల కోసం లడ్డు, బాదుషా, మినపగారెలు, ఇంకా అవీలు ఇవీలు. ఎవరికి ఏది ఇష్టమేదయితే అది అన్నమాట. సాయంత్రం కాగానే మౌలానాగారు వచ్చి ఫాతెహ్ జరిపిన తరువాత ఇంట్లో ఉన్న చిన్నా పెద్దా అందరూ శుభ్రంగా స్నానాలు కానించి, ఈ కొత్త బట్టలు, నైవేద్యాలు దేవుని గూడు ముందు పెడతాం కదా అక్కడకు చేరి, ఆడవాళ్ళు అయితే నెత్తిన కొంగు కప్పుకుంటారు, పిల్లల నెత్తి మీద ఒక టవల్ వేసి, ఉత్త మోకాళ్ళు కనపడకుండా ప్యాంటో, తువ్వాలో, లుంగీనో కట్టపెట్టి, ఇంట్లో చనిపోయిన వారి పేరుపేరిట జేజినాయనకని, అమ్మకని, చిన్నమ్మకని, చిన్న చిన్నాయనకని వారిని తలుచుకుంటూ నిప్పుల్లో సాంబ్రాణి ధూపం వేయిస్తారు. నేను ఈ హైద్రాబాదు నగరానికి వలస వచ్చిన తరువాత కూడా గత రెండు సంవత్సరాల క్రితం వరకు మా మేనత్త మాబున్ని అమ్మ ప్రతి సంవత్సరం మాకు పెద్దల పండగ రాబోతుందని గుర్తు చేసేది. మా ఆవిడ లావణ్య ఇంట్లో పెద్దలకని బట్టలు కొని తెచ్చేది. సాయంకాలం కమ్మగా ఇంత పలావు, మాంసం కూర, పాయసం వండి పెడితే – మాకు ఆ కల్మాలు, సూరాలు తెలీవుగా! అయినా బుర్ర తక్కువయినా, మనసు నిండుతో వారందరి పేర్లను తలుచుకుంటూ సాంబ్రాణి పొగను, మా భక్తితో పాటే ఆకాశం వైపు పంపించేవాళ్ళం. వారందరితో పాటు ఆమధ్యే మాకు దూరమయిన బాపుగారు, పతంజలిగారు, నాయుని కృష్ణమూర్తిగారు, మోహన్‌గారికి కూడా సాంబ్రాణి భక్తిని వేసేవాళ్ళం. మా మేనత్త ఆ మధ్యే పోయారు. ఆవిడతో పాటే ఈ పండగల మంచీ చెడూనూ. సంవత్సరం సంవత్సరం మాతో ఈ పనులు చేయించిన మా మేనత్తకే మా సాంబ్రాణి తాకే ప్రాప్తం లేకపోవడం పెద్ద దుఃఖం. పెద్దలందరి పేరిట సాంబ్రాణి ధూపాలు వేసిని తరువాత ఇంటిల్లిపాది అంతా తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసి కాసేపు బయట కూచోవాలి. అప్పుడు మా పెద్దలు అందరూ దివినుండి దిగి వచ్చి మేము తెచ్చిపెట్టిన బట్టలు ఇష్టంగా కట్టుకుని, వండిన అన్నాలు తిని వెళ్ళిపోతారని చెప్పేవారు. అవన్నీ మనం చూడకూడదని అందుకే తలుపులు మూయాలని చెప్పెవారు. ఇట్లాంటి మాటలు అన్నీ భలే ఉండేవి. అదే చిన్నతనాన అప్పుడప్పుడూ మా ఇంట్లోకి ఝుమ్మంటూ కందిరీగ వచ్చేది. దాన్ని చూసి ఎక్కడ కుడుతుందోని భయంతో దూరం తోలడానికి విసనకర్రో, చేటో పుచ్చుకుంటామా, దానిని కొట్టవద్దని, పాపమని మా మేనత్త చేప్పేది. అది కందిరీగ కాదట. చనిపోయిన మా జేజినాయన అలా వచ్చాడని చెప్పింది. ఆ మాటను ఇప్పటికీ అలాగే పుచ్చేసుకున్నా. ఈ రోజుకు మా ఇంటి బాల్కనీలో మొక్కల మీదికి ఒక కందిరీగ వస్తుంది, దానికేసి అలానే గమ్మున చూస్తాను. మా పిల్లవాడు వచ్చి అరే! జేజినాయన వచ్చినాడే! అంటాడు. జీవితంలో చాలావాటికి హేతువులు, సమాధానాలు, తెలివితేటలు వాడనక్కరలేదు. కొన్ని విషయాలపై ప్రేమ కలిగి ఉంటే చాలు. చాలా బావుంటుంది. మీరూ ఎప్పుడయినా వాడి చూడవచ్చు. పెద్దల పండగనాడు మూసిన తలుపుల వెనుక మూయని పళ్ళాల మీది పలావు అన్నం, కూర గిన్నె, దాల్చా పాత్రల్లోకి ఇల్లంతా నిండిన సాంబ్రాణి పొగ కాస్త తగిలి కాస్త, కాస్త ములిగి, కాస్త అల్లుకుని ఆ పదార్థాలన్నీ రుచి అవుతాయి చూడండి, అబ్బా అంత రుచయిన తిండి నా వరకు మళ్ళీ ఏ పండగలోనూ తగలదు! అందుకని నాకు రంజాను అంటే తిండి కన్నా పెద్దలామాశ పండగ తిండే గొప్ప. చిన్నతనాన పిల్లల ప్రాణానికి రంజాను అంటే తిండి పండగ కాదు. ఈనాము డబ్బుల పండగ. మాది అప్పట్లో ఉమ్మడి కుటుంబం. మా జేజెమ్మా-జేజినాయనల మగ సంతానం అంతా ఒకే చోట, ఒకే ఇంట్లో ఉండేవారు. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయి బయటికి కాపురానికి వెడతారు కదా. నమాజు ముగిశాకా మా మేనత్తలు, మామలు, వాళ్ల పిల్లలూ అందరూ మా ఇంటి దగ్గరికే వచ్చేవారు. పెద్దవాళ్ళు ఈద్ ముబారక్ ఆలింగనాలూ చేసుకుంటే మా వంటి పిల్లలం వంగి పెద్దల కాళ్లకు దండాలు పెట్టుకుని, లేచి ఈనాము డబ్బులు అడిగేవాళ్ళం. ఈనాము కదా డబ్బులు అంటే, సంపద అంటే, ఆస్తి అంటే. వసూలయిన డబ్బుని వచ్చింది వచ్చినట్లుగా ప్రతిసారీ గలగలమని లెక్కలు పెట్టుకుంటుంటే ఎంత బావుండేది! అటూ ఇటూ నడుస్తూ, పరిగెడుతూ, నిక్కర్ జేబులో నాణేల బరువు, ఘల్లు ఘల్లు చప్పుడు అవుతుంటే అచ్చం లక్ష్మీదేవి మా చిల్లర జేబుల్లో కొలువు తీరినట్లుగా ఉండేది. రావాలసిన వాళ్ళు అంతా వచ్చేశారు, ఇవ్వవలసినది ఇచ్చేశారు, ఇక రాలేదేం లేదు అనుకున్నాకా అన్నాదమ్ములం, బావా మరుదులం అంతా సినిమాకని టవున్ దారి పట్టేవాళ్లం. మొదటి ఆట అయిపోయేసరికి రంజాను పండగ ముగిసేది. వయసు పెరిగేకొద్ది పండగ కూడా ముసలిదవుతుందని తెలీదు, విషయం తెలిసిన పెద్దలు ఎవరూ మాకు చెప్పలేదు. కరిగిపోతుందని తెలుసు కాబట్టి పుల్ల ఐసుని కొంచెం కొంచెం కొరుక్కుతిన్నట్టుగా పండగలని ఆ రంగులని నిముషానికి ఆరు లక్షల తొంబై మూడు వేల నాలుగువందల పదహారు సెకండ్ల చొప్పున అనుభవించాలని తెలీదు. అన్నిటికీ తొందరే! ఎప్పుడెప్పుడు సాయంత్రమవుతుందని ఉదయం, ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందాని సొమవారం, ఎప్పుడెప్పుడు పెరిగి పెద్దయిపోయి జిప్పున్న ప్యాంట్ తొడుక్కుంటామని త్వరపడిపోయి బాల్యాన్ని విడిచేశాం. మా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ దేవుడు లేడని నాకు చెప్పింది కానీ పండగలు మాత్రం ఉన్నాయని నా చిన్ననాటి ఇల్లు నేర్పింది నాకు. ఇపుడు పెరిగి పెద్దయ్యినాకా ఆఫీసు నుండి ఉదయపు వయసు అలసటతో ఇంటికి వచ్చి సాయంకాలం దీపం వంక చూస్తే దీప జ్యోతిః పరబ్రహ్మ దీప జ్యోతిర్ జనార్దనః దీపో హారతు మే పాపం దీప జ్యోతిర్ నమోస్తుతే. అని మనసుకు శాంతి అనిపిస్తే జనార్దనుడో, జీససుడో, అల్లా మాలికుడో ఎవరో ఒకరు మనకు ఆయన లేడు అని మనమనుకున్నా మీరంతా నాకు ఉన్నార్రా పిల్లలూ అని దేవుడు దీపంలా తలాడించినట్లు ఉంటుంది. దీపం దేవుడు రంజాను రోజున ఆకాశమెక్కుతుంది. నెలవంకగా మారుతుంది. నా బాల్యంలో ఆకాశంలో కనబడిన రంజాన్ నెలవంకను చూసి వెంటనే కళ్ళు మూసుకుని గోడలు తడుముకుంటూ గొంతెత్తి నా పేరు పిలుస్తూ నా కోసం వచ్చేది మా జేజి. తన చేతుల్లోకి నా మొహన్ని తీసుకుని అప్పుడు కళ్ళు తెరిచి నన్ను చూసేది. నెలవంక తరువాత నా గుండ్రని మొహం. అంతే! నా తరువాతే పండగ. చందమామను, ప్రేమని, పండగని ఎలా అహ్వానించాలో నేర్పిన మొదటి మనిషి మా జేజి, ఆ పై మా మేనత్తలు, పిన్నిగార్లు. ఇప్పుడు పండగ సంవత్సరానికి ఫలానా రోజు వచ్చే ఒక తారీఖు మాత్రమే. ఆ మనుషులూ వాళ్ళ జ్ణాపకాలు, ఆ గోరింట పండే రాత్రుళ్ళు, తెల్లని అరచేతిలో ఉదయించిన ఎర్రని సూరీడు, నెలవంక, నక్షత్రాలు ఆరిపోయాయి. ఇప్పుడు మావాళ్ళు వారు లేని ఊరు జీవితంలోకి ఏ కొత్త చందురుడు వెలగలేడని అర్థం అయ్యింది. జీవితంలోని అసలైన కొన్ని ఉదయాలు, మధ్యాహ్నాలు, సాయంత్ర రాత్రుళ్ళు, నక్షత్రాలు నశించాయి. ఇక అవి ఎప్పటికీ లేవు. ఇప్పుడు పండగ లేదు. భగవంతుడే ఉన్నాడు. ఆయన దయ వలన జ్ఞాపకాల్లో పండగ మిగిలి ఉంది. అన్వర్, ఆర్టిస్టు, సాక్షి దినపత్రిక -
రంజాన్ ఉపవాసంపై సింగర్ అనుచిత వ్యాఖ్యలు.. నటి ఫైర్
మోడల్, నటి గౌహర్ ఖాన్ త్వరలో తల్లి కాబోతోంది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో తను ఉపవాసం ఉంటుందా? లేదా? అని అభిమానులు సందేహం వ్యక్తం చేశారు. దీనికి గౌహర్ స్పందిస్తూ.. గర్భంతో ఉన్నందున ఈ ఏడాది రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం లేదని తెలిపింది. దానికి బదులుగా నిరుపేదలకు ఆహారం పంపిణీ చేయాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఇకపోతే హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ దంపతులు రంజాన్ మాసంలో ఉపవాసం చేయడంపై సెటైర్లు విసిరారు. 'మేమైతే ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు. మా శరీరాలకు పోషకాలు కావాలి. అందుకే ఆ ఆలోచన కూడా చేయం. అయినా ఇలా కడుపు మాడ్చుకుని ఉపవాసాలు చేయడమేంటో మాకిప్పటికీ అర్థం కాదు. అంతగా అవసరమైతే టీవీ చూడటం, సెల్‌ఫోన్ వాడటం మానేయండి. అంతే తప్ప తిండి మానేయడమేంటి? మరీ తెలివి తక్కువ వాళ్లలా ఉన్నారనిపిస్తోంది' అని వెకిలిగా మాట్లాడారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన గౌహర్ ఖాన్ సింగర్ జంటపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మీకేం తెలుసని మాట్లాడుతున్నారు. దాని వెనక ఉన్న సైన్స్ గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి కాస్తైనా తెలుసా? ముందు అవి తెలుసుకోండి. మీకంటూ ఓ అభిప్రాయం ఉండటం తప్పనడం లేదు. కానీ వాటిని ఎలా వ్యక్తీకరించాలనే తెలివి కూడా ఉంటే బాగుంటుంది' అని చురకలంటించింది. ఇక గౌహర్ ఖాన్ విషయానికి వస్తే.. ఆమె సరుకులు కొనడానికి షాపింగ్‌కు వెళ్లినప్పుడు జైద్ దర్బార్‌ను కలిసింది. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది స్నేహానికి దారి తీసింది. కొంత సమయానికే అది ప్రేమగా మారింది. 2020 నవంబర్ 5న వీరి నిశ్చితార్థం జరగ్గా డిసెంబర్ 25న పెళ్లి చేసుకున్నారు. 2022 డిసెంబర్లో తాను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది నటి. ఆమె చివరగా శిక్షా మండల్ సినిమాలో నటించింది. -
హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)