rayavaram
-
మహిళదే ఆ మృతదేహం
సాక్షి, అమరావతి/రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం–పసలపూడి గ్రామాల మధ్య గడ్డివాములో పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న వ్యక్తి మృతదేహం మహిళదని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నెల 24న మండపేట–కాకినాడ ప్రధాన రహదారిని ఆనుకుని పంట పొలం దిమ్మపై ఉన్న గడ్డివాములో మృతదేహం బయటపడింది. మంటల్లో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం మహిళదా... పురుషుడిదా... అనే విషయంలో పోలీసులు తొలుత నిర్ధారణకు రాలేదు. అయితే, దీనిపై రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి నేతృత్వంలో మండపేట రూరల్ సీఐ శివగణేష్ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలంలో క్షుణ్ణంగా పరిశీలించగా, మహిళ తలకు పెట్టుకునే క్లిప్ కాలిన స్థితిలో కనిపించింది. గడ్డివాము సమీపంలో పగిలిన గాజు ముక్కలు, కొద్దిదూరంలో చెప్పులు దొరికాయి. వీటి ఆధారంగా ఆ మృతదేహం మహిళదేనని నిర్ధారణకు వచ్చారు. ఈ ఆధారాలతోనే కేసు చిక్కుముడి వీడాల్సి ఉంది. మరోవైపు పోలీసులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మిస్సింగ్ కేసుల వివరాలను సేకరిస్తున్నారు. మృతదేహం వివరాలతో మిస్సింగ్ కేసులను సరిపోల్చుకుని చూస్తున్నారు. అయితే, శనివారం సాయంత్రం వరకు ఎటువంటి క్లూ దొరకలేదని సమాచారం. నేరస్తులను గుర్తించి అరెస్ట్ చేయండి : జయశ్రీరెడ్డి మాచవరం–పసలపూడి గ్రామాల మధ్య గడ్డివాములో పూర్తిగా కాలిన మహిళ మృతదేహం ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుధీర్‌బాబుతో మహిళా కమిషన్ సభ్యురాలు కర్రి జయశ్రీ రెడ్డి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మహిళ పట్ల అంత కర్కశత్వానికి పాల్పడిన నేరస్తులను గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారని, ప్రత్యేక బృందాలతో విచారణను ముమ్మరం చేసినట్లు ఎస్పీ వివరించారు. నేరస్తులను త్వరగా పట్టుకుంటామన్నారు. కేసు సమగ్ర విచారణ నివేదికను మహిళా కమిషన్‌కు సమర్పిస్తామని తెలిపారు. -
రాయవరం హైస్కూల్లో ప్రేమోన్మాది నిర్వాకం
సాక్షి, తూర్పుగోదావరి: విద్యార్థినికి ఓ ప్రేమోన్మాది తాళి కట్టేందుకు ప్రయత్నించిన ఘటన జిల్లాలోని మండపేట నియోజకవర్గం రాయవరం హైస్కూల్లో చోటు చేసుకుంది. శివారెడ్డి అనే యువకుడు విద్యార్థినికి తాళ్లికట్టేందుకు ప్రయత్నించగా, పాఠశాల సిబ్బంది గ్రహించడంతో ఆ యువకుడు పరుగులు తీశాడు. అక్కడ నుంచి అనపర్తి మండలం మహేంద్రవాడకు చెందిన విద్యార్థిని ఇంటిముందుకెళ్లిన శివారెడ్డి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన ఆ యువకుడు రాయవరం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. -
పాటే నా ప్రాణం.. నా ప్రపంచం
సాక్షి, తూర్పుగోదావరి: ఆయనో ప్రముఖ సంగీత దర్శకుడి కుమారుడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఈ క్షణం ఒకే ఒక కోరిక.. కళ్లల్లోకి కళ్లుపెట్టి చూడవెందుకు.. ఇటువంటి ఎమోషనల్ పాటలు, గువ్వ గోరింకతో.. జివ్వుమని కొండగాలి.. అందమా అందుమా ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్, కోకిల కోకిల కో అన్నది.. ప్రియరాగాలే గుండెలోన వంటి మెలోడీలు చేయడం స్వర కిరీటి సాలూరి కోటేశ్వరరావు(కోటి)కే చెల్లింది. తెలుగులోనే కాదు, తమిళం, కన్నడంలో 500కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన కోటి సాలూరి రాజేశ్వరరావు కుమారుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాటే నా ప్రాణం.. నా ప్రపంచం అని, ప్రతి సినిమాను తొలి సినిమాగా, ప్రతి పాటను తొలి పాటగానే భావిస్తానని, అందుకే సక్సెస్‌ను అందుకోగలిగానంటున్నారు సంగీత దర్శకుడు కోటి. రాయవరం మండలం పసలపూడి వచ్చిన సందర్భంగా సంగీత దర్శకుడు కోటి పంచుకున్న సంగీత దర్శకత్వ స్వానుభవాలు.. ఆయన మాటల్లోనే.. నేను మెచ్చిన బాణీలు నేను చేసిన సినిమాలన్నీ సంగీతపరంగా హిట్ అయ్యాయి. అన్ని పాటలను మనస్సు పెట్టి చేశా. ప్రియరాగాలే.. ముఠామేస్త్రి.. బావలు సయ్యా.. కోకిల కోకిల.. కదిలే కాలమా.. ఇదేలే తరతరాల చరితం ఇలా అనేక పాటలు నాకు నచ్చినవే. తొలిసారి నటుడిగా... ఇప్పటి వరకు సంగీత దర్శకత్వం వహిస్తున్న నేను తొలిసారిగా సినిమాలో నటిస్తున్నా. నాన్న కోరిక నన్ను ఐపీఎస్‌గా చూడాలని ఉండేది. అనుకోకుండానే సంగీతం ఆవహించింది. ఇప్పుడు సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ‘దేవినేని’ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ వేదవ్యాస్ క్యారెక్టర్ చేశాను. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత స్ట్రిక్ట్ పోలీసాఫీసర్ పాత్రతో సుగ్రీవ అనే సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆప్యాయత, అనురాగాలకు పెట్టింది పేరు గోదావరి జిల్లావాసులు ఆప్యాయత, అనురాగాలకు పెట్టింది పేరు. ఇక్కడి పచ్చటి వాతావరణం, గోదావరి అందాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు మనసును పరవశింపజేస్తాయి. గోదావరి జిల్లావాసులతో ఉన్న అనుబంధం మరువలేనిది, మరపురానిది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత జిల్లాలో పర్యటిస్తా. మనసుకు హత్తుకుంటేనే.. ప్రజల మనస్సుకు హత్తుకుంటేనే జీవం ఉన్న పాటగా మిగిలి పోతుంది. ఇప్పుడు వస్తున్న సంగీత దర్శకులు కూడా బాగానే చేస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యే పాటలకు బాణీలు కట్టాలని కొత్తగా వచ్చే సంగీత దర్శకులకు సూచిస్తున్నా. తండ్రి నుంచి వారసత్వంగా... నా తండ్రి సాలూరు రాజేశ్వరరావు నుంచి సంగీతాన్ని వారసత్వంగా తీసుకున్నా. ఆయన తనయుడిగా పుట్టడమే నా అదృష్టం. సంగీత వారసత్వాన్ని నా రెండో కుమారుడు రోషన్ తీసుకున్నాడు. ప్రజలు మెచ్చిన బాణీలను చేయడం వల్లే సక్సెస్ పొందగలిగా. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడంలో 500కు పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశా. ప్రతి ఒక్కరిదీ బాధ్యత కరోనా నియంత్రణ బాధ్యత ప్రభుత్వానిదే కాదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. స్వీయ జాగ్రత్తలతోనే కరోనాను దూరం చేయగలం. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే అనవసరంగా బయట తిరగడం మానుకోవాలి. దీన్ని ఒక హెచ్చరికగా అందరూ భావించాలి. పాట రూపంలో చెబితే మనస్సును హత్తుకుంటుందనే కరోనాను తరిమికొట్టాలని పాట రూపొందించా. యావత్ ప్రపంచం కనిపించని శత్రువుతో పోరాడుతున్న విషయాన్ని అందరూ గమనించాలి. -
209వ రోజు ముగిసిన పాదయాత్ర
-
ముగిసిన 209వ రోజు ప్రజాసంకల్పయాత్ర
-
ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్ జగన్ హామీ
-
‘అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తాం’
సాక్షి, రాయవరం : అధికారంలోకి రాగానే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సీపీఎస్)ను రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇళ్ల స్థలంతో పాటు, ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంతో సోమవారం 209వ రోజు ఆయన తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై మండి పడ్డారు. ఎన్నికలకు ఆరు నెలల ముందుగా డ్రామాతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సభలో జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. నాలుగేళ్లుగా మోసాలు.. అవినీతి ‘నాలుగేళ్ల చంద్రబాబు పాలన అవినీతిమయం, మోసాలతో ముగిసింది. మట్టి, ఇసుకతో సహా అన్నింటిలోను దోపిడీ చేశారు. నీరు-చెట్టు పథకం ద్వారా మట్టిని కూడా దోచేశారు. పేదలను కూడా వదలకుండా దోచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు. దివంగత నేత వైఎస్సార్ హయంలో మండపేట నియోజక వర్గంలో 14 వేల ఇళ్లు కట్టించారు. ఇళ్లస్థలాలను అందించారు. వైఎస్సార్ పేదల కోసం సేకరించిన స్థలాలలో ఇప్పుడు బాబు అవినీతి ప్లాట్లు నిర్మిస్తామంటున్నారు. అడుగుకు రూ. వెయ్యి అయ్యే ప్లాటును బాబు 2వేల రూపాయలకు అమ్ముతాడట. మూడు లక్షలు అయ్యే ప్లాటును బాబు 6లక్షలకు అమ్ముతాడట. మూడు లక్షలు ప్రభుత్వం మాఫీ చేయగా.. మరో 3 లక్షలు పేద ప్రజలు 20 ఏళ్ల వరకూ నెలకు రూ.3 వేలు కట్టాలట. మీకు ప్లాటు ఇస్తే కాదనకుండా బంగారంలా తీసుకోండి. అధికారంలోకి రాగానే ఆ డబ్బులను మాఫీ చేస్తాం. ఎన్నికల సమయంలో రూ. 87వేల 612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ బాబు ఇచ్చిన డబ్బుతో వడ్డీలు కూడా మాఫీ కాలేదు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నారు..కానీ రూపాయి కూడా మాఫీ చేయలేదు’ అని ఆరోపించారు. వారికి మాత్రమే ఇసుక ఫ్రీ రాష్ర్ట వ్యాప్తంగా ఇసుకదోపిడీని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పోలీసులు దగ్గర ఉండి మరీ లారీలలో ఇసుకను రవాణ చేయిస్తున్నారు. ఏ కలెక్టరూ వాటిని అడ్డుకోరు. కోట్ల కొద్ది లంచాలు తీసుకుంటూ ఇసుకను తరలిస్తున్నారు. పేరుకేమో ఇసుక ఫ్రీ అంటుంన్నారు. ఎవరికైనా ఫ్రీగా వస్తుందా..? ప్రతి పేదవాడు లారీ ఇసుకను 7వేల నుంచి 12వేలకు పెట్టి కొంటున్నాడు. కేవలం చంద్రబాబుతో లంచాలను పంచుకునేవారికి మాత్రమే ఫ్రీగా వస్తోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇసుక ప్రక్షాళన చేస్తామని మాయ మాటలు చెబుతున్నారు. కోడి కూర పెడతాడట నాలుగేళ్లుగా మెస్ ఛార్జీలను పెంచలేని చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు విద్యార్థులకు కోడి కూర పెడతామని అంటున్నారు. అదిగో అన్నాక్యాంటీన్లు అంటూ ప్రజలను మళ్లీ మోసం చేయడానికి రెడీ అవుతున్నారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం రావాలంటే బాబు అధికారంలోకి రావాలి అన్నారు. వచ్చాయా ఇప్పుడు..? ఆయన అధికారంలోకి వచ్చారు కానీ అక్కా చెల్లెళ్ల మంగళసూత్రాలు మాత్రం ఇంటికి రాలేదు. బ్యాంకుల్లోని బంగారం రాలేదు కానీ ఇంటికి మాత్రం నోటీసులు వచ్చాయి. హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేయాలి నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశాం. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎలాంటి నాయకుడు అవసరమో ఆలోచించండి. అబద్ధాలు చెప్పేవాడు, మోసాలు చేసే వాడు మనకు నాయకుడుగా కావాలా? చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత తీసుకు రావాలి. నిజాయితీ తీసుకు రావాలి. ప్రజలు ఇచ్చిన హామీలను నాయకుడు నెరవేర్చకుంటే సిగ్గుతో రాజీనామా చేసే వ్యవస్థను రూపొందించాలి. ఇవి జరగాలంటే జగన్ ఒక్కడి వల్లే సాధ్యం కాదు. నాకు మీ అందరి తోడు కావాలి. మీ అందరి దీవెనలు కావాలి. అపుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారుతుంది. విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది. చంద్రబాబును క్షమిస్తే.. తాను ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశానని చెప్పి మన చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టే యత్నం చేస్తారు. చిన్న అబద్ధాలు, మోసాలకు నమ్మరని ఇంటికి కేజీ బంగారం, ఒక బెంజీ కారు ఇస్తానని వాగ్దానం చేస్తారు. కానీ అది మీరు నమ్మరని ప్రతి ఇంటికీ మహిళా సాధికార మిత్రలను పంపుతాడు. వారు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసిందే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓట్లేయండి. అబద్ధాలు చెప్పే వాళ్లను, మోసాలు చేసే వాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులు తీసుకు రండి. మన ప్రభుత్వం రాగానే నవరత్నాలతో పేదలందరినీ ఆదుకుంటాం’’ అని వైఎస్ జగన్ అన్నారు. మన ప్రభుత్వం రాగానే ఇలా చేస్తాం.. సీపీఎస్‌ను రద్దు చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లను ఇస్తాం డీఏలు సమయానికి అందేలా చూస్తాం ఇళ్ల ప్లాట్‌కు కట్టాల్సిన డబ్బును మాఫీ చేస్తాం పేదవాడి పిల్లలకు ఉచిత విద్యను అందిస్తాం హాస్టల్ మెస్ ఛార్జీకోసం ఏడాదికి రూ.20వేలు అందిస్తాం పాఠశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఏడాదికి రూ.15వేలు అందిస్తాం -
‘ఆలు’ టైం రికార్డ్
820 గ్రాముల బంగాళాదుంప సాధారణంగా ఒక ఆలుగడ్డ 200 నుంచి 400 గ్రాముల బరువు ఉంటుంది. అయితే మంగళవారం రాయవరంలోని పేకేటి వెంకటేశ్వరరావు హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చిన బంగాళాదుంపల్లో ఓ దుంప ఏకంగా 820 గ్రాముల బరువు తూగి అందరినీ ఆశ్చర్యపరిచింది. – రాయవరం -
విరులకు లేవు పరిమితులంటూ...
‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అన్న సామెతను ఈ చామంతికి వర్తింపజేస్తూ.. ‘కుదురు కొంచెం.. విరులు ఘనం’ అని మార్చుకోవచ్చు. సాధారణంగా ఒక చామంతి మొక్కకు ఎక్కువ అనుకుంటే 50 వరకూ పూలు పూస్తాయి. రాయవరంలో పెంకే రాజు ఇంటి వద్ద ఉన్న చామంతి పూల మొక్క మాత్రం తనకలాంటి ‘విరి పరిమితులు’ లేవు అన్నట్టు 440కి పైగా పూలు పూసింది. ఈ మొక్కకు మరో 100కు పైగా మొగ్గలు ఉన్నాయి. రాజు భార్య మంగ కుండీలో పెంచిన ఈ మొక్క ‘తానొక్కటే పెక్కు మొక్కల పెట్టు’ అన్నట్టు ‘పూలకం’ వచ్చినట్టు విరగబూసి చూసే వారికి ఆనందాశ్చర్యాల్ని పుష్కలంగా ఇస్తోంది. – రాయవరం -
చిట్టి బురల్రు..గట్టి ఆలోచనలు
∙సాయితేజాలో ఆకట్టుకున్న స్టడీ ఎక్స్పో ∙వివిధ అంశాలపై విద్యార్థుల ప్రదర్శనలు రాయవరం : తమ చిట్టి మెదడుతో పెద్ద ఆలోచనలు చేయడమే కాక సమాజంలోని అనేక సమస్యలకు తమదైన శైలిలో పరిష్కార మార్గాల్ని చూపించారు ఆ చిన్నారులు. తమను ప్రోత్సహించి, ప్రతిభను వెలికి తీస్తే అద్భుతాలు సృష్టించగలమని చాటారు.. రాయవరం సాయితేజా విద్యానికేత¯ŒS విద్యార్థులు. పాఠశాలలో రెండు రోజులుగా కొనసాగిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారంతో ముగిసింది. పాఠశాలకు చెందిన ఎల్కేజీ నుంచి 10వ తరగతి విద్యార్థులు 250 మంది పవర్ హబ్, బయోడైవర్సిటీ, మన పరిసర విజ్ఞానం, భాషావిభాగం, మినీ మోడల్స్, కిడ్స్ జో¯ŒSగా విభజించి 90 ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గురు, శుక్రవారాల్లో 800 మంది తల్లితండ్రులు, రాయవరం, వెదురుపాక, పందలపాక, రామవరం, సోమేశ్వరం హైస్కూళ్లు, పలు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనలను తిలకించారు. కదిలే వాహనాల ద్వారా విద్యుదుత్పత్తి.. కదిలే వాహనాల ద్వారా విద్యుత్‌ను ఏ విధంగా ఉత్పత్తి చేయవచ్చు అనే అంశాన్ని పదవ తరగతికి చెందిన కె.దుర్గాప్రశాంత్, భవాని సుధాకర్, వికాస్, మోహ¯ŒSభవాని ప్రయోగపూర్వకంగా వివరించారు. దీని వలన అతితక్కువ ఖర్చుతో విద్యుత్‌ను ఎలా ఉత్పత్తి చేయవచ్చనే అంశం సందర్శకులను ఆకట్టుకుంది. జెనెటిక్ ఇంజినీరింగ్.. వంశపారంపర్యంగా వచ్చే చక్కెర వ్యాధిని తర్వాత తరాల వారికి రాకుండా ఎలా చేయవచ్చనే అంశాన్ని పదవ తరగతికి చెందిన కె.సుచిత్ర, సౌమ్య వివరించారు. పిండదశలో ఉండగానే డీఎ¯ŒSఏ స్ట్రక్చర్‌ను మార్చడం ద్వారా ఇది సాధ్యమని నిరూపించారు. ఆటోమేటిక్ రైల్వేగేట్.. సెన్సర్స్‌తో మానవరహితంగా రైలు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా గేటు పడే విధానంపై తొమ్మిదవ తరగతికి చెందిన బి.శివరామ్, ప్రణయ్, దుర్గారెడ్డి, నిఖిల్ ప్రాజెక్టును తయారు చేశారు. రైల్లే గేట్ల వద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఈ ప్రాజెక్టు సందర్శకులను ఆలోచింపజేసింది. ఇలా పలు ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. రాయవరం, బిక్కవోలు ఎంపీడీవోలు ఎ¯ŒS.వి.వి.ఎస్.మూర్తి, విజయభాస్కర్, ఎస్సై వెలుగుల సురేష్, ఎంఈవో ఎ.నాగరాజు, కొమరిపాలెం సొసైటీ అధ్యక్షుడు తాడి అరవిందం, కేపీఆర్ ఫైర్టిలైజర్స్ డైరెక్టర్ కొవ్వూరి సత్యనారాయణరెడ్డి(సత్తిబాబు) తదితరులు ప్రదర్శనలను తిలకించారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏటా స్టడీ ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు పాఠశాల అకడమిక్ డైరెక్టర్ కర్?ర భానురేఖ సందీప్‌రెడ్డి తెలిపారు. -
లారీ ఢీకొని తల్లీకూతుళ్లు మృతి
రాయవరం (తూర్పు గోదావరి) : తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతురు మృత్యువాతపడ్డారు. స్థానికంగా నివాసం ఉండే లంక రత్నం.. తన కుమార్తె హనీ(9 నెలలు) అనారోగ్యానికి గురి కావటంతో సోదరునితో కలసి బైక్‌పై ఆస్పత్రికి బయలుదేరింది. వారి బైక్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనటంతో రత్నం అక్కడికక్కడే చనిపోగా హనీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటికి పాప కూడా కన్నుమూసింది. రత్నం సోదరుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. -
రాళ్లు మీద పడి ఇద్దరు కూలీల మృతి
మార్కాపురం (ప్రకాశం జిల్లా) : మార్కాపురం మండలం రాయవరంలో ఉన్న ఓ క్వారీలో రాళ్లు మీద పడి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతులు తుర్లుపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందిన గోగు బాలగురవయ్య(25), ఈర్ల గురవయ్య(26)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘మరో జన్మ ఉంటే జిల్లాలోనే జన్మిస్తా’
నాటకరంగమే సినిమా రంగానికి పునాది నవరసాలు పండించాలన్నదే నా లక్ష్యం కామెడీ నటుడు గౌతంరాజు ‘గోదావరి జిల్లాల ప్రజలకు అనుబంధం, ఆత్మీయత ఎక్కువ. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి ఆత్మీయత, అనుబంధం దొరకదు. ఈ జిల్లావాసిని కావడం నా అదృష్టం. మరో జన్మంటూ ఉంటే ఈ జిల్లాలోనే పుట్టాలని ఉంది’’ అని అన్నారు ప్రముఖ హాస్య నటుడు గౌతంరాజు. మంగళవారం రాయవరంలో ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన స్థానిక విలేకరులతో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పుట్టింది రాజోలులోనే.. నేను పుట్టింది రాజోలైనా.. విద్యాభ్యాసం మాత్రం కాకినాడలోనే. కాకినాడ పీఆర్ కళాశాలలో బీఎస్సీ చదివాను. విద్యాభ్యాసం అనంతరం ఇంటర్మీడియేట్ బోర్డు హైదరాబాద్‌లో ఉద్యోగం చేశాను. సినీ రంగంపై ఉన్న ఆసక్తితో దీర్ఘకాలిక సెలవులో వెళ్లి, 1991లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. స్కూల్ టైమ్ నుంచి నాటకాలంటే ఇష్టం. కాకినాడలో ఉండగా నాటకాలు వేశాను. దాదాపుగా 42 నాటక ప్రదర్శనలు వేశాను. పశ్చాత్తాపం, లాభం, ఏక్‌దిన్‌కా సుల్తాన్, ఆగండి ఆలోచించండి తదితర నాటకాల్లో నటించాను. నాటకరంగం పునాది.. నటులకు నాటకరంగం పునాదిరాయి వంటిది. ఎందరో మహానటుల్లానే.. నేనూ నాటకరంగం నుంచే సినిమా రంగానికి వెళ్లాను. సింగితం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో వచ్చిన వసంతగీతం సినిమాలో తొలిసారిగా నటించాను. ఇప్పటి వరకు 200కు పైగా సినిమాల్లో నటించాను. ఘరానామొగుడు, కూలీ నెం-1, ప్రేమకు వేళాయెరా! ఉగాది, తదితర సినిమాలు గుర్తింపునిచ్చాయి. జైశ్రీరామ్ సినిమాలో తొలిసారిగా విలన్ వేషం వేశాను. వెయ్యి అబద్ధాలు సినిమాలో తేజ మరోసారి విలన్ వేషం ఇచ్చారు. నవరసాలు పోషించాలని ఉంది.. తెలుగులో పరాయి భాష విలన్లను తెచ్చుకోవడం అలవాటైంది. ఇక్కడ నటులున్నా ఎందుకో విలన్లు విషయంలో పరాయి నటులను తెచ్చుకుంటున్నారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాాయణ మాదిరిగా నవరసాలు ఉన్న పాత్రలు పోషించాలన్నదే నా ధ్యేయం. ముఖ్యంగా సెంటిమెంట్ ఉన్న క్యారక్టర్లు పోషించాలని ఉంది. విడుదలకు సిద్ధంగా తనయుడి సినిమా.. మా అబ్బాయి పేరు కృష్ణంరాజు, కృష్ణ పేరుతో హీరోగా పరిచయం చేస్తున్నాం. ‘లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి’ సినిమాలో కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. మరో సినిమా నాలుగు భాషల్లో చేస్తున్నాడు. నా కుమారుడు కృష్ణ మంచి డ్యాన్సర్ కావడంతో అనుకోకుండా హీరో అవకాశం వచ్చింది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... తెలుగులో ఉన్నంత మంది కమెడియన్స్ ప్రపంచంలో ఎక్కడా లేరు. ప్రతి కమెడియన్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ‘ఓ స్త్రీ సంకెళ్లు తెంచుకో’ సీరియల్లో హీరోగా నటించినందుకు బంగారు నంది గెల్చుకున్నాను. రాజబాబు అవార్డు, భరతముని అవార్డు, రేలంగి అవార్డు వచ్చింది. గజల్ ట్రస్ట్ అందించే నవ్వులరారాజు అవార్డును అందుకున్నాను. -
డ్యాన్సర్ కాబోయి యాక్టరయ్యా
క్యారెక్టర్ నటునిగా గుర్తింపు పొందాలనుంది హాస్య నటుడు బంటి మనోగతం రాయవరం : డ్యాన్సర్ అవ్వాలనుకుని యాక్టరయ్యానని అంటున్నారు నటుడు బంటి. ప్రస్తుతం పలు సినిమాల్లో హాస్యనటుడిగా చేస్తున్న బంటి ఆదివారం రాయవరంలో విజ్ఞాన్ పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చాడు. ఈ సందర్భంగా డాన్సర్‌గా రాణిస్తూ.. నటుడిగా మారిన విషయాన్ని ఆయన విలేకరులకు తెలిపారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. నా స్వస్థలం విజయవాడ. నా అసలు పేరు ఎం.నాగసతీష్కుమార్. బీఏ ఎకనామిక్స్ చదివా. బేసిక్‌గా డాన్స్ర్ను. సినిమాల్లో యత్నించాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. డాన్సర్‌గా పలు స్టేజ్ షోల్లో ప్రదర్శనలిచ్చా. 2000 సంవత్సరంలో హైదరాబాద్‌లో జరిగిన డాన్స్ పోటీల్లో ప్రథమ బహుమతి పొందాను. సినిమాల్లో నటించాలనే పట్టుదలతో హైదరాబాద్ వెళ్లాను. డాన్స్ ఇనిస్టిట్యూట్‌లో చేరి సినిమా అవకాశాల కోసం యత్నించాను. స్నేహితుల సహకారంతో ఆడిషన్స్‌కు వెళ్లగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ 100% లవ్ సినిమాకు నన్ను ఎంపిక చేశారు. అంత్యాక్షరి గుర్తింపునిచ్చింది ఇప్పటి వరకు 100% లవ్, హ్యాపీ హ్యాపీగా, పిల్ల జమీందార్, గబ్బర్‌సింగ్, రామయ్య వస్తామయ్యా, పిల్లా..నువ్వులేని జీవితం, రన్‌రాజారన్ సినిమాల్లో నటించాను. గబ్బర్‌సింగ్ సినిమాలో కేవలం హీరో పవన్‌కళ్యాణ్ నిర్వహించే అంత్యాక్షరి సీన్లో మాత్రమే నటించాను. ఆ సీన్ నాకు గుర్తింపు తీసుకుని వచ్చింది. ఆ సినిమాలో అవకాశం కోసం 45కేజీల బరువు పెరిగాను. ప్రస్తుతం హరిశంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రామ్ హీరోగా చేస్తున్న పండుగ చేస్కో, ఉలవచారు బిర్యానీ హీరో ప్రకాష్‌రాజ్ హీరోగా నటిస్తున్న కేటుగాడు తదితర ఏడు సినిమాల్లో నటిస్తున్నాను. ప్రస్తుతం జిల్లాలోని రాజవొమ్మంగి ప్రాంతంలో లక్ష్మణ్‌వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న హర్రర్ సినిమాలో నటిస్తున్నా. మంచి క్యారక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందాలని ఉంది..ఇప్పటి వరకు కామెడీ తరహా పాత్రలు చేశాను. హీరో స్నేహితుడి పాత్రల చేస్తున్నాను. మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందాలని ఉంది. అలాగే స్వతహాగా డాన్సర్‌ని కావడంతో డాన్సర్‌గా కూడా సినిమాల్లో రాణించాలని ఉంది. నా తండ్రి చేస్తున్న స్టోన్ క్రషర్ వ్యాపారం చూసుకుంటూనే సినిమాల్లో వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాను. -
జిల్లా విద్యా సమాచార వ్యవస్థే యు డైస్
రాయవరం :పాఠశాలల్లో మౌలిక, భౌతిక అవసరాలను తీర్చేందుకు రూపొందించే ప్రణాళికలకు మూలాధారం ఆయా పాఠశాలల నుంచి సేకరించిన సమాచారం. ఆ సమాచార వ్యవస్థే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యు డైస్). దీని ఆధారంగా పాఠశాలలకు వసతుల కల్పనకు నిధులు మంజూరవుతుంటాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా మన జిల్లాలో మాత్రమే మండల స్థాయిలోనే యు డైస్ వివరాలను కంప్యూటరీకరణ చేస్తున్నారు. సమాచార సేకరణ ఇలా... 2000 సంవత్సరం నుంచి యు డైస్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రతీ ఏటా సెప్టెంబర్ 30వ తేదీని ప్రాతిపదికగా తీసుకుని ఇందులో పాఠశాలల సమాచారాన్ని సేకరిస్తారు. ఈ సమాచార సేకరణకు విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ కృషి చేస్తుంటాయి. గతేడాది యుడైస్ ద్వారా ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పాఠశాలల్లోని వివిధ అవసరాలకు రూ. 272 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మూడేళ్లుగా జూనియర్ కళాశాలల నుంచి కూడా యు డైస్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. పాఠశాలకు ఉపాధ్యాయ పోస్టులు మంజూరు, పోస్టుల రేషనలైజేషన్, నూతనంగా అదనపు తరగతి గదులు, తాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ర్యాంపులు, వంటగదులు, లేబరేటరీ గదులు, ప్రత్యేక అవసరాల గల చిన్నారులకు ఉపకరణాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు.. ఇలా ఏది మంజూరు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం యు డైస్ ద్వారా పంపే సమాచారాన్నే ప్రాతిపదికగా తీసుకుంటుంది. ఈ సమాచారం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం)కు నిధులు కేటాయిస్తుంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్రికగ్నైజ్డ్, మదర్సాలు, మైనార్టీ ఎడ్యుకేషన్ తదితర సంస్థలకు చెందిన 6,055 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి యు డైస్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు. మన జిల్లాలో ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా కలిసిన నాలుగు మండలాలకు సంబంధించిన 374 పాఠశాలల నుంచి కూడా యు డైస్ సేకరిస్తారు. యు డైస్ ఫారం నింపే సమయంలో ఉపాధ్యాయుల ఆధార్ నంబరును ఈ ఏడాది తప్పనిసరి చేశారు. యు డైస్ షెడ్యూల్ ఇదే.. యు డైస్‌పై అక్టోబర్ తొమ్మిదో తేదీ ఉదయం 10 గంటలకు అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులకు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. 16 నుంచి 19వ తేదీలోపు పూర్తిచేసిన యు డైస్ ఫారాలను కాంప్లెక్స్, మండల స్థాయిల్లో పరిశీలన చేస్తారు. ఆ తర్వాత ఆర్వీఎం కార్యాలయంలో నిర్దేశించిన సమయంలో పరిశీలన చేస్తారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఆర్వీఎంకు, అక్కడ నుంచి కేంద్రప్రభుత్వానికి ఈ నివేదికను పంపిస్తారు. ప్రణాళికా బద్ధంగా పూర్తి చేస్తాం యు డైస్‌పై హెచ్ఎంలకు శిక్షణ ఇచ్చి సమర్ధవంతంగా యు డైస్ ఫారాలు పూర్తి చేసేలా చూస్తాం. యు డైస్ ద్వారా సేకరించిన సమాచారంతో బడ్జెట్‌ను రూపొందిస్తాం. - వై. నాగేశ్వరరావు, ఏఎంఓ, సర్వశిక్షా అభియాన్, కాకినాడ -
యాంకర్ ఉదయభాను అభినందించారు
పాటలు మధురంగా ఆలపించడమే కాదు ఒకేసారి రెండు స్వరాలను పలికించడంలో ఆయన దిట్ట. ఆయన పేరు దండుమేను గోవిందరాజు. రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన గోవిందరాజు వృత్తిరీత్యా కార్మికుడు. ఆయన చూపిస్తున్న ప్రతిభను ఎందరో ప్రముఖులు అభినందించారు. గోవిందరాజును ‘న్యూస్‌లైన్’ పలకరించగా, సాధన వల్ల గుర్తింపు లభిస్తోందని వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. చెల్లూరు(రాయవరం) సంగీతంపై ఆసక్తితోనే.. చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే నాకు ఎంతో ఆసక్తి. ప్రతి పాటనూ అనుకరిస్తూ పాడేవాడిని. నా ఆసక్తిని గమనించిన సంగీత గురువు వెన్నేటి సత్యనారాయణ ప్రోత్సహించారు. ఆయన వద్ద శిష్యరికం చేశా. నాకు సంగీతంలో మెలకువలు నేర్పుతూ పాటలను పాడడంలో శిక్షణ ఇచ్చారు. అప్పటి నుంచి పలు చోట్ల పాటలు పాడుతున్నా. కార్మికుడిగా పనిచేస్తూనే.. చెల్లూరు సర్వారాయ చక్కెర కర్మాగారంలో టర్బైన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా. ఖాళీ సమయాల్లో సంగీత విభావరుల్లో పాడతాను. సాంఘిక నాటకాలు, వివిధ శుభకార్యాల్లోనూ పాడుతుంటా. ఓ టీవీచానల్ కార్యక్రమంలో నేను పాడిన పాటకు ముగ్దురాలైన యాంకర్ ఉదయభాను అభినందించారు. బహుమతి కూడా అందజేశారు. పలువురు ప్రముఖుల మెప్పు కూడా పొందాను. మురళీమోహన్, జయసుధ సమక్షంలో రామచంద్రపురంలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాటలు పాడా. వారి ప్రశంసలను నేను ఎన్నటికీ మరువలేను. సాధనతోనే.. పురుష గొంతుతోపాటు స్త్రీ స్వరాన్ని ఒకే సమయంలో పలికించడంలో సాధన చేశా. చక్కెర కర్మాగారంలో పనిచేసే వెంకట్రావు, మరో కార్మికుడు స్త్రీ గొంతుతో కూడా పాడడం చూసి సాధన చేశా. అది ఫలించింది. ఒకే పాటలోని స్త్రీ, పురుష చరణాలను మధురంగా పలికించగలను. ఇదే నాకు గుర్తింపు తెచ్చిపెట్టింది. -
వరకట్న వేధింపులపై కేసు
రాయవరం : వరక ట్న వేధింపుల కేసులో అదుపులోకి తీసుకున్న ప్రధాన నిందితుడిని ఆదివారం రాత్రి ఇంటికి పంపడంపై ఫిర్యాది కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. రెండు గంటల పాటు నిందితుడిని పోలీస్టేషన్‌లోకి తీసుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సోమవారం ఉదయం రాయవరం పోలీస్టేషన్ వద్ద జరిగిన ఈ సంఘటనలో బాధితురాలి కథనం ఇలా... అనపర్తి మండలం కొత్తూరుకు చెందిన కర్రి అచ్యుతరామారెడ్డి కుమారుడు భరత్‌రెడ్డికి రాయవరం గ్రామానికి చెందిన పడాల వెంకటరామారెడ్డి కుమార్తె శ్రీమౌనికకు 2011 మే 15న వివాహమైంది. వివాహ సమయంలో ఎనిమిది ఎకరాల భూమి, వంద కాసుల బంగారంతో పాటు అచ్యుతరామారెడ్డి కోరిక మేరకు ఆడపడుచు లాంఛనాలు, కారుకొనుగోలుకు రూ. 35 లక్షలు ఇచ్చారు. ఇంకా అదనపు కట్నం కావాలని భర్త వేధిస్తుండంతో మరో రూ.ఐదు లక్షల నగదు, ఎనిమిది కేజీల వెండిని తన తల్లిదండ్రులు ఇచ్చినట్టు శ్రీమౌనిక తెలిపారు. భర్తతో పాటు అత్తమామలు సంధ్య, అచ్యుతరామారెడ్డి, ఆడపడుచు సుదీప్తి కూడా తనను వేధించే వారని ఆమె పేర్కొంది. ఇవి భరించలేక రాయవరం పుట్టింటికి వచ్చినట్టు ఆమె తెలిపింది. ఈ మేరకు రాయవరం పోలీసులకు పిర్యాదు చేసినట్టు తెలిపింది. నిందితుడిని వదిలేయడంపై ఆందోళన.. ఇదిలా ఉండగా శ్రీమౌనిక ఫిర్యాదుపై పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీస్టేషన్‌కు ప్రధాన నిందితుడైన కర్రి భరత్‌రెడ్డిని తీసుకుని వచ్చి, కొద్దిసేపటికి తిరిగి ఇంటికి పంపించేశారు. విషయం తెలుసుకున్న శ్రీమౌనిక తండ్రి వెంకటరామారెడ్డి, బంధువులు సోమవారం ఉదయం ఆరు గంటలకు స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితుడిని ఇంటికి ఎందుకు పంపించారని పోలీసులను ప్రశ్నించారు. నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇంటి వద్ద నుంచి స్టేషన్లోకి వెళుతున్న నిందితుడు భరత్‌రెడ్డిని శ్రీమౌనిక, ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. 8.30 గంటల సమయంలో రాయవరం, బిక్కవోలు, అనపర్తి ఎస్సైలు కట్టా శ్రీనివాసరావు, దొరరాజు, విజయ్‌కుమార్‌లు స్టేషన్ వచ్చి ఆందోళనకారులకు సర్దిచెప్పారు. ఆ సమయంలో శ్రీమౌనిక తాతయ్య వీర్రాఘవరెడ్డి పోలీసుల తీరును ప్రశ్నించారు. కేసులో ఉన్న నిందితులందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి స్టేషన్‌కు వచ్చి ఘటనపై పోలీసులను ఆరా తీశారు. బాధితురాలికి న్యాయం చేయాలని పోలీసులకు సూచించారు. ఆదివారం రాత్రి ఈ సంఘటనపై 498, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడు భరత్‌రెడ్డిని అరెస్టు చేసి, సోమవారం కోర్టులో హాజరుపరిచినట్టు ఎస్సై కట్టా శ్రీనివాసరావు తెలిపారు. -
‘బడి దూరమవుతోంది’..పో
రాయవరం :‘ఊళ్లోనే ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఏడో తరగతి పూర్తయ్యే వరకూ బిడ్డలు పొరుగూళ్లకు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన బాధ ఉండదు’ అనుకున్న పలువురు తల్లిదండ్రుల నిశ్చింతకు తెరపడనుంది. జిల్లాలో 43 ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిని ప్రాథమిక పాఠశాలకు కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు (ఆర్సీ నం:36) జారీ చేసింది. ఆరు, ఏడు తరగతుల్లో తగినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. బడి ఈడు వచ్చినాచదువుకు దూరంగా ఉంటున్న బాలల కోసం ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వమే.. పలువురు బాలలకు అకస్మాత్తుగా చదివే బడిని దూరం చేస్తూ.. ‘బడి పొమ్మంటోంది’ అన్న బాపతు నిర్ణయం తీసుకోవడాన్ని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు తప్పు పడుతున్నాయి.ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా, ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఉన్న వాటిని ప్రాథమికోన్నత పాఠశాలలు (యూపీ స్కూళ్లు)గా పరిగణిస్తారు. జిల్లాలో 174 ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిని పెంచుతూ వాటిలో ఎనిమిదో తరగతిని ప్రవేశ పెడుతూ ప్రభుత్వం గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది. (ఆ పాఠశాలలకు ఒక్క పోస్టును కూడా మంజూరు చేయక పోవడం గమనార్హం.) 20 లోపు విద్యార్థులుంటే 6, 7 తరగతులకు ఎసరు అయితే ఇంతలోనే.. ఆరు, ఏడు తరగతుల విద్యార్థులు 20 లోపు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిని కుదించి, ఆరు, ఏడు తరగతులను సమీపంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. వాటి ప్రకారం జిల్లా ఆరు, ఏడు తరగతుల్లో 20 లోపు విద్యార్థులున్న 43 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆ తరగతులను దగ్గరలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు జిల్లా విద్యా శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లను కూడా సమీపంలోని ఉన్నత పాఠశాలలకు బదిలీ చేస్తారు. ఆ రెండు తరగతుల విలీనం అనంతరం ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలుగా మారనున్నాయి. ఆరు, ఏడు తరగతులోల 20 లోపు విద్యార్థులున్నా.. మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల లేక పోతే అలాంటి పాఠశాలలను ప్రస్తుతానికి ప్రాథమికోన్నత పాఠశాలలుగానే ఉంచుతారు. జిల్లాలో 28 మండలాల్లో 43 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతులు సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి. అయినవిల్లి, ఆలమూరు, అల్లవరం, అమలాపురం, అంబాజీపేట, గోకవరం, కడియం, కాజులూరు, కోటనందూరు, మలికిపురం, పి.గన్నవరం, రాజమండ్రి అర్బన్, రంపచోడవరం, రావులపాలెం, రాయవరం, తాళ్లరేవు, యు.కొత్తపల్లి మండలాల్లో ఒక్కో ప్రాథమికోన్నత పాఠశాల, గొల్లప్రోలు, ఐ.పోలవరం, కాట్రేనికోన, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం, సఖినేటిపల్లి, తొండంగి, ఉప్పలగుప్తం మండలాల్లో రెండేసి, దేవీపట్నం మండలంలో మూడు, ముమ్మిడివరం మండలంలో ఐదు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య క్షీణిస్తుంది.. విద్యార్థులు లేరనే సాకుతో ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిని తగ్గించడం ఎంతవరకు సబబని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించక పోతే విద్యార్థులు ఎలా చేరతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మూడు కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాలలు ఉన్న కొన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు లంక ప్రాంతాల్లో ఉన్నాయని, అలాంటి వాటి నుంచి ఆరు, ఏడు తరగతులను తొలగిస్తే పలువురు విద్యార్థులు నదులు దాటి పాఠశాలలకు వెళ్లకుండా.. అయిదో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పే అవకాశం ఉందని విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ నిర్ణయం వలన ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోవడంతో పాటు రాబోయే డీఎస్సీలో పోస్టులు కూడా తగ్గిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చిగురంత ఆశ
రాయవరం : రెండేళ్లుగా ఊరిస్తున్న డీఎస్సీ సెప్టెంబర్ ఐదున జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. టెట్‌లో క్వాలిఫై అయినవారికి మాత్రమే డీఎస్సీలో అవకాశం కల్పిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. డీఎడ్, బీఎడ్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న నూతన బ్యాచ్ విద్యార్థులు డీఎస్సీకి అవకాశం కల్పించాలని ఆందోళన బాటపట్టారు. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. జిల్లాలో సుమారు 1,800 మంది డీఎడ్ చేస్తున్న వారు ఉండగా సుమారుగా 4,200 మంది బీఎడ్ శిక్షణ పూర్తి చేసుకుని పోటీ ప్రపంచంలో అడుగిడబోతున్నారు. గత మార్చి 16న జరిగిన టెట్‌లో 19,921 మంది బీఎడ్ పూర్తి చేసినవారు పాల్గొనగా డీఎడ్ పూర్తి చేసినవారు 2,234 మంది పాల్గొన్నారు. ఎస్జీటీ పోస్టుల్లో బీఎడ్‌కు అవకాశం ఉంటుందా?... డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటనతో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీఎడ్ విద్యార్థులకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. డీఎస్సీ 2014 నోటిఫికేషన్లోఎస్జీటీ పోస్టుల భర్తీలో తమకు అవకాశం కల్పిస్తారని బీఎడ్ అభ్యర్థులు ఆశిస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక విద్య బోధించేందుకు కనీసం రెండేళ్లు కాలపరిమితి ఉన్న ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన వారే అర్హులనే నిబంధన ఉండడంతో సెకండరీ గ్రేడ్ పోస్టుల భర్తీలో బీఎడ్ విద్యార్థులకు ఎలా అవకాశం కల్పిస్తారని డీఎడ్ అభ్యర్థ్ధులు ప్రశ్నిస్తున్నారు. ఎస్జీటీ పోస్టులను డీఎడ్ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. ఆ తీర్పును పునః సమీక్షించాలంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) నియమ నిబంధనలను మార్చాల్సి ఉంటుందని బీఎడ్ అధ్యాపకుడు బొడ్డపాటి సురేష్‌కుమార్ తెలిపారు. ఆమేరకు చర్యలు చేపడితేనే బీఎడ్ చేసినవారికి ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకొనే అవకాశం లభిస్తుంది. పెరిగిన ఖాళీల భర్తీ ఉంటుందా ? జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు నోటిఫికేషన్ సమయానికి ఏర్పడిన ఖాళీలను కూడా భర్తీ చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది 184 ప్రాథమికోన్నత పాఠశాలలను ఇంటిగ్రేటెడ్ పాఠశాలలుగా మార్చి ఎనిమిదో తరగతిని నూతనంగా ప్రవేశపెట్టారు. ఆయా పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఖాళీలు 1,211 ఈ ఏడాది మే నెలాఖరు నాటికి జిల్లాలో 1,211 పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా సమాచారం. 190 స్కూల్ అసిస్టెంట్లు, 884 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 118 భాషా పండితులు, 19 వ్యాయాయ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిసింది. -
బాబు వచ్చారు.. జాబు తీశారు
రాయవరం : ‘జాబు కావాలంటే.. బాబు రావా’ లంటూ తెలుగుదేశం ఎన్నికలకు ముందు ఊదరగొట్టింది. తీరా బాబు వచ్చాక ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతున్నారు. హౌసింగ్ శాఖలో సంవత్సరాల తరబడి పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి విధులకు హాజరు కావద్దని వచ్చిన ఆదేశాలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు హతాశులయ్యారు. హౌసింగ్‌శాఖ ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఆ సమయంలో 2006-07 సంవత్సరాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నారు. వర్క్ ఇన్స్పెక్టర్లతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంటెంట్ అసిస్టెంట్లు, హౌసింగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిపై తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎంకేఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా వీరి నియామకం జరిగింది. అప్పటి నుంచి వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం చేయించడం, ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణ ప్రగతిని ఉన్నతాధికారులకు తెలపడంతో ఆ శాఖలో కీలకంగా మారారు. జిల్లాలో సుమారు 218 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని సోమవారం నుంచి తొలగించారు. వీరిలో 150 మంది వరకు వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నట్టు సమాచారం. పనులెలా నడుస్తాయి.. రాయవరం హౌసింగ్ శాఖలో ఒక ఏఈ, ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. మండలంలో ఇందిర మ్మ ఇళ్ల ప్రగతిని వీరు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తు తం తొలగించిన వారిలో ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండడంతో ఏఈ ఒక్కరే మిగిలారు. డీఈఈ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌం టెంట్ అసిస్టెంట్ పోస్టులను తొలగించడంతో డీఈఈ ఒక్కరే మిగిలారు. మంగళవారం నుంచి తొలగించిన సిబ్బందిని విధులకు హాజరు కావద్దంటూ తెలుపుతూ వారి వద్ద ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మంగళవారం నుంచి విధులు ఎలా నిర్వర్తించాలా అని రెగ్యులర్ ఉద్యోగులు మథనపడుతున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వద్ద కీలక సమాచారం ఉండడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆ శాఖ ఏఈలు పేర్కొంటున్నారు. రెగ్యులర్ సిబ్బందిని ఇవ్వకుండా వీరిని తొలగిస్తే పనులు ఎలా జరుగుతాయంటున్నారు. ఉరుములేని పిడుగులా.. ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించడం లేదం టూ రాష్ట్ర మంత్రి చేసిన ప్రకటనతో అందరితో పాటు హౌసింగ్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది కొనసాగింపునకు ఇచ్చిన ఉత్తర్వుల్లో హౌసింగ్ శాఖను చేర్చక పోవడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు వారి తొలగింపు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. సోమవారం ఉదయం ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఈ వార్త ఉరుములేని పిడుగులా చేరింది. హౌసింగ్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జూన్ 28 సాయంత్రానికి రెగ్యులర్ ఉద్యోగుల సెల్ఫోన్లకు ఉన్నతాధికారులు మెసేజ్ పంపించారు. చంద్రబాబు వస్తే ఇంటికో జాబు మాట ఎలా ఉన్నా ఉన్న జాబులు తొలగించడంతో రోడ్డున పడుతున్నామని హౌసింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు గత నెల 30తో ముగిసిందని హౌసింగ్‌శాఖ ఇన్చార్జ్ జిల్లా మేనేజర్ విజయ్‌కుమార్ చెప్పారు. జూలై ఒకటి నుంచి వారిని విధుల్లోకి తీసుకోవద్దంటూ ఆదేశాలు వచ్చాయన్నారు. -
కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాను..
లెక్కించలేనన్ని వన్నెలను ప్రకృతిలో పొదిగిన విధి అతడికి ఒక్కగానొక్క వన్నె కూడా తెలియకుండా చేసింది. అయితేనేం.. ‘నీ జీవితాన్ని ఏడువన్నెల ఇంద్రధనువుగా మార్చడానికి నేనున్నాను. నీకు తెలియని రంగుల్ని నా స్పర్శగా, ప్రేమగా అనువదించి అందిస్తా’నంది ఓ యువతి. ‘చూపు లేని నీ బతుకునావకు చుక్కానిని అవుతాను’ అన్న ఆ యువతి వేలికి ఉంగరం తొడిగే వేళ అతడు.. ఇన్నాళ్లూ తనను చిన్నచూపు చూసిన విధినే చిన్నబుచ్చినంత పరమానందభరితుడయ్యాడు. పుట్టంధుడైన వేల్పూరి రవిబాబు, స్వరూపరాణిల కులాంతర వివాహం శనివారం తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో జరిగింది. వెదురుపాకకు చెందిన వీరబాబు పుట్టుకతోనే అంధుడు. ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే తల్లి మంగ, తండ్రి వెంకన్న అనారోగ్యంతో మృతిచెందారు. కంటిచూపు లేదని, కన్నవారు లేరని అతడు కుంగిపోలేదు. మండపేటలోని ప్రత్యేక అంధుల పాఠశాలలో చేరాడు. మొక్కవోని సంకల్పంతో డిగ్రీ, డీఈడీ చదివిన వీరబాబు 2012 డిసెంబర్లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. ప్రస్తుతం కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి ఎంపీయూపీ పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా సమిశ్రగూడెంకు చెందిన స్వరూపరాణి డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి ఆశ వర్కర్ కాగా తండ్రి చిరుద్యోగి. కులాలు వేరైనా వీరబాబు, స్వరూపరాణిల వివాహం చేయడానికి పెద్దలు ప్రతిపాదించారు. అందుకు అంగీకరించిన స్వరూపరాణి ‘నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవయ్యా...అందుకే నా కన్నులతో లోకం చూడయ్యా’ అంటూ వీరబాబు జీవితంలో ప్రవేశించింది. అంధుల పాఠశాలలో వీరబాబు సహాధ్యాయులు, అతడి గురువులు వివాహానికి హాజరయ్యారు. వీరబాబు సహాధ్యాయులు తమకు కళ్లులేక పోయినా.. ఆనందకాంతులు నిండిన ముఖాలతో నవదంపతులను ఆశీర్వదిస్తుంటే చూసేవారి కళ్లు భావోద్వేగంతో చెమ్మగిల్లాయి. ఎంతోమంది స్నేహహస్తం అందించారు.. నేను చదువుకునే సమయంలో మండపేట ప్రత్యేక అంధుల పాఠశాల యాజమాన్యంతో పాటు స్నేహితులు సహకరించారు. నేను చదవడానికి ఆర్థికంగా స్నేహితులు చేసిన సహాయం, అందించిన ప్రోత్సాహం మరువలేనిది. - వేల్పూరి వీరబాబు కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాను.. మనిషికి దేవుడిచ్చిన వరం ఈ ప్రకృతి. దానిని చూడలేని వీరబాబుకు నా కళ్లతో ఈ ప్రపంచాన్ని చూపిస్తాను. అతడిని నా కళ్లలో పెట్టుకుని చూసుకుంటాను. - స్వరూపరాణి -
బహు‘మతులు’ పోతున్నాయ్..!!
రాయవరం, న్యూస్‌లైన్ :‘కంగ్రాట్స్.. మీ సెల్ నంబర్ మేము తీసిన లక్కీ డ్రాలో రూ.3.50 కోట్లు గెలుపొందింది. మీ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, వృత్తి వివరాలు మాకు ఈ మెయిల్ చేయండి.’ ఇది ఒక సెల్‌ఫోన్ వినియోగదారుడికి వచ్చిన ఎస్ఎంఎస్. ‘వావ్.. మీరు కోకా-కోలా ప్రోమో ఇండియా/లండన్ నుంచి లక్ష పౌండ్లను గెల్చుకున్నారు. మీ వివరాలను ఈ మెయిల్ చేయండి.’ ఇది మరొక వినియోగదారుడికి వచ్చిన ఎస్ఎంఎస్. ఇలా రోజూ సెల్‌ఫోన్ వినియోగదారులకు ఏవేవో బహుమతులంటూ ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. ఆ మాయలో పడితే అంతే.. బహుమతుల పేరుతో వస్తున్న మెసేజ్‌లకు ఆకర్షితులైతే చేతి చమురు వదుల్చుకోవలసిందే. మనం ఫోన్ చేసినా..మెసేజ్ ఇచ్చినా.. మెయిల్ పంపినా.. వెంటనే ‘మీ బ్యాంకు ఖాతా నంబర్ తెలపండి. మీరు గెలుపొందిన సొమ్మును ఆ ఖాతాలో వేస్తాం’ అంటూ మరో మెసేజ్ వస్తుంది. అలాగే రూ. పదివేలు ప్రోసెసింగ్ చార్జీలుగా చెల్లించండంటూ మెసేజ్ పెడుతున్నారు. రూ. కోట్లు వస్తుంటే, రూ. 10వేలు ఇస్తే పోయేదేమిటని భావించి కొందరు సొమ్ము చెల్లించి మోసపోతున్నారు. ఇలా పలువురు వినియోగదారులకు నిత్యం మెసేజ్‌లు వస్తున్నాయి. తార్కికంగా ఆలోచించే వారు ఇది మోసమని గ్రహించి ఊరుకుంటున్నారు. కొందరు మాత్రం ఏదో ఆశతో ముందుకెళ్లి చేతిచమురు వదిలించుకుంటున్నారు. డబ్బు పోగొట్టుకున్న వారు బయటకు తెలిస్తే పరువు పోతుందని మిన్నకుండిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ‘వెంకటేష్ ఎవరు? నటుడా? లేక క్రికెటరా? మీ సమాధానం పంపించి మేమిచ్చే బహుమతి అందుకోండి.’ ‘జుట్టు రాలుతోందా? కంప్యూటర్ ద్వారా తక్కువ ఖర్చుతో నయం చేసుకోండి. ఈ నంబరుకు ఫోన్ చేయండి.’ ‘మీకు మీ జీవిత భాగస్వామితో ఎంత శాతం ప్రేమానుబంధం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా రా? అయితే మీ భాగస్వామి పేరు టైపు చేసి ఈ నంబరుకు ఎస్ఎంఎస్ చేయండి.’ ... ఇలా ఒకటీ రెండూ కాదు.. పలు రకాల ఎస్ఎంఎ స్లు వినియోగదారులకు వస్తున్నాయి. అలసి ఇంటికి వచ్చి భోజనం చేసేటపుడో, నిద్రకు ఉపక్రమించేటపుడో ఇవి వస్తున్నాయి. కొన్ని ఎస్ఎంఎస్లకు స్పందిస్తే సెల్ బ్యాలెన్స్ మటుమాయం అవుతోంది. బీమా కంపెనీలూ అంతే.. ప్రైవేటు బీమా కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ‘హలో..ప్రసాద్‌గారూ ఈ రోజు 20 మంది లక్కీడీప్ విజేతలను ఎంపిక చేశాం. అందులో మీ సెల్ నంబర్ ఉంది. మీరు రాజమండ్రి వస్తే బహుమతి పట్టుకువెళ్లవచ్చు. అంటూ బీమా కంపెనీలు మెసేజ్‌లు పంపుతున్నాయి. తెలివైన వాళ్లు మేము ఏమైనా డబ్బు చెల్లించాలా? అని అడిగితే మేము ఒక బాండ్ ఇస్తాం. ప్రీమియం చెల్లిస్తే చాలని సమాధానం వస్తుంది. అలా అడగని అమాయకులు, నిరక్షరాస్యులు రాజమండ్రి, కాకినాడ వంటి నగరాలకు వెళ్లి డబ్బు నష్టపోతున్నారు. ఇది బీమా పాలసీలపెంపు కోసం ఇచ్చిన మెసేజ్ అని అక్కడికి వెళ్లాకే అర్థం అవుతోంది. మాచవరం లో ఒక కూలీకి ఇలాగే ఫోన్ రాగా రూ.వెయ్యి అప్పు చేసి రాజమండ్రి వెళ్లాడు. తీరా అక్కడ బీమా ప్రీమియం చెల్లించాలని చెప్పడంతో ఉసూరంటూ వెనుదిరిగాడు. మోసపోవద్దు.. లక్షలు, కోట్లు గెలుపొందారంటూ వచ్చే బోగస్ మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దు. ఎవరికి వారు ప్రాక్టికల్‌గా ఆలోచించుకోవాలి. - గొలుగూరి వరలక్ష్మి, టెలికామ్ సలహా మండలి సభ్యురాలు, రాయవరం. అనవసర ఎస్ఎంఎస్లతో ఇబ్బందులు పడే వినియోగదారులు 1909 నంబరుకు డయల్ చేసి వాటిని నిలుపుదల చేసుకోవచ్చు. - ఎం.శివప్రసాద్‌రాజు, ఎస్డీఈ, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, రాజమండ్రి. -
నిలిచిన బాల్య వివాహం
రాయవరం, న్యూస్‌లైన్ :అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంపై అధికార యంత్రాంగం సకాలంలో స్పందించడంతో ఓ బాల్య వివాహం నిలిచిపోయింది. రాయవరంలో ఆదివారం ఈ సంఘటన జరగ్గా, బాలిక తల్లిదండ్రులకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. రాయవరం గ్రామానికి చెందిన యువకుడికి, కె.గంగవరం బట్లపాలిక గ్రామానికి చెందిన బాలికకు ఆదివారం రాయవరంలో వివాహం చేసేందుకు వారి పెద్దలు నిర్ణయించారు. మైనర్ అయిన బాలికకు వివాహం చేస్తున్నారని, దీనిని నిలుపుదల చేయాలని ఓ అజ్ఞాత వ్యక్తి కాకినాడలోని స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయానికి సమాచారం అందించాడు. దీంతో ఈ వివాహాన్ని నిలుపుదల చేయాలని ఐసీడీఎస్ పీడీ జె.నిర్మలాకుమారి.. రాయవరం ఐసీడీఎస్ సీడీపీఓ సుశీలాకుమారికి ఆదేశించారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి వెంకట్, సీడీపీఓ సుశీలాకుమారి కలిసి రాయవరంలోని ఆ యువకుడి ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. ఆ యువకుడు మేజర్ అని నిర్ధారించుకున్నారు. కపిలేశ్వరపురం సీడీపీఓ జెస్సీని ఫోన్లో సంప్రదించగా.. బట్లపాలికలో ఉన్న వధువు బాలిక అని తెలిపారు. మైనర్ అయిన బాలికను వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరమని సుశీలాకుమారి, వెంకట్ కౌన్సెలింగ్ చేశారు. దీంతో పెళ్లి నిలుపుదల చేసేందుకు యువకుడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. అయితే అప్పటికే వివాహ ఏర్పాట్లు చేసుకున్న వరుడి బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేసుకున్నారు. బాలికకు వివాహం చేసే యత్నాలను విరమించుకున్నట్లు ఇరుపక్షాల కుటుంబ సభ్యుల వద్ద అంగీకార పత్రాలను అధికారులు తీసుకున్నారు. బాలికలకు వివాహం చేయరాదు బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని వెంకట్, సుశీలా కుమారి తెలిపారు. 18 ఏళ్లు నిండని బాలికలకు వివాహం చేసే చర్యలను తల్లిదండ్రులు విడనాడాలన్నారు. 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. బాలికలకు వివాహం చేసేందుకు ప్రయత్నించే వారి సమాచారాన్ని తమకు తెలియజేయాలని సూచించారు. -
ఆ పథకం చేపని పొదుగే..
రాయవరం: పాలిచ్చే గొడ్డు.. కష్టసుఖాల్లో పాలు పంచుకోగల ఎదిగొచ్చిన బిడ్డతో సమానమే. అలాంటి పాడి పశువును కోల్పోతే.. ఆ కుటుంబానికి పెద్ద దెబ్బే. అలాంటి దెబ్బను రైతులు తట్టుకోవడానికే కేంద్ర ప్రభుత్వం పశు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే పాడిరైతుల్లో అవగాహన లేకపోవడం, ప్రభుత్వం తగినంతగా ప్రచారం చేయకపోవడం, వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న నిబంధనలతో ఈ పథకం.. ‘పొదుగు కుండంత.. పాలు పిడతంత’ అన్నట్టు అంతంత మాత్రంగానే ఉపయోగపడుతోంది. జిల్లాలో మూడు లక్షల పాడి పశువులుండగా ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం రెండు వేలకు మాత్రమే బీమా జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పథకం లక్ష్యమిదీ.. పాడి పశువులు సీజనల్ వ్యాధులు, ఇతర కారణాలతో చనిపోతే రైతు నష్టపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం 2006లో పశు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. సంకర జాతి, దేశవాళీ ఆవులు, గేదెలకు ఈ పథకం కింద బీమా చేయించవచ్చు. బీమా ప్రీమియంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. చూడి పశువులు, పాలిచ్చే పశువులు, ఒక్కసారైనా ఈనిన ఆవులు, గేదెలకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక రైతు రెండు పాడి పశువుల వరకు బీమా చేయించొచ్చు. ప్రీమియాన్ని ఏడాది, మూడేళ్ల కాల పరిమితికి చెల్లించే వీలుంటుంది. బీమా చేసిన ప్రతి పశువుకూ పశువైద్యాధికారి ఎదుట చెవి పోగు వేస్తారు. ప్రమాదాలు, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పశువులు మరణిస్తే రైతు పశువు విలువ ఆధారంగా బీమా పరిహారం పొందవచ్చు. అంతేకాక పాడిపశువుకు బీమా చేయించిన రైతు ప్రమాదం బారిన పడి మరణిస్తే ఆ కుటుంబానికి రూ.50 వేల పరిహారం చెల్లిస్తారు. దీని కోసం అదనపు ప్రీమియం చెల్లించనక్కరలేదు. ఈ బీమా పథకంలో 30 శాతం మహిళలకు కేటాయించాలి. 15 శాతం ఎస్సీలకు, 8 శాతం ఎస్టీలకు ఖర్చు పెట్టాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో బీమా ప్రీమియంగా రూ.20 లక్షలు సెప్టెంబర్‌లో రాగా ఇప్పటి వరకు రూ.12 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. జిల్లాలో అన్ని రకాల పశువుల సంఖ్య తొమ్మిది లక్షలుంది. వీటిలో సంతానోత్పత్తి వయస్సుకు వచ్చిన పశువులు 5,15,200 కాగా పాలిచ్చేవి సుమారు మూడు లక్షలు ఉన్నాయి. వీటిలో బీమా చేయించిన పశువులు కేవలం రెండు వేలే. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బీమా పరిహారం చెల్లించాలంటూ 115 క్లెయిములు నమోదు కాగా 95 క్లెయిములకు పరిహారం చెల్లించారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ‘కంతలున్న కంచె’.. ఈ పథకం నిబంధనలు కూడా పాడి రైతులు తమ పశువులకు బీమా రక్షణ పొందలేకపోవడానికి అడ్డంకులవుతున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏ) నిబంధనల ప్రకారం పశువు విలువ రూ.30 వేలు దాటినా, ఒక కుటుంబానికి రెండు పశువులకు మించినా బీమా చేయడానికి లేదు. దీంతో జిల్లాలో అధిక శాతం రైతులు బీమా పరిధిలోకి రావడం లేదు. వాస్తవానికి ప్రస్తుతం రైతులు కొనే ఒక్కో పాడి పశువు విలువా రూ.50 వేల పైగానే ఉంటోంది. దీంతో..కంతలున్న కంచెలా ఈ పథకం పాడి రైతుల ప్రయోజనాలకు రక్షణ కల్పించడం లేదు. రైతులకు అక్కరకు రాని ఈ నిబంధనలను సడలించాలని, బీమా చేసే పశువు విలువను రూ.50 వేలకు, పశువుల సంఖ్యను నాలుగుకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ఐఆర్డీఏకి రెండేళ్ల క్రితమే విజ్ఞప్తి చేసింది. అయితే నేటికీ సానుకూల స్పందన రాలేదు. -
అంగన్వాడీలకు కొత్త షెడ్యూల్
రాయవరం, న్యూస్‌లైన్ : పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలు కూడా పక్కాగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి శనివారం వరకు అంగన్వాడీ కేంద్రాలు ఎలా నిర్వహించాలో రూపొందించిన టైమ్‌టేబుల్ అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయాలకు చేరుకుంది. అందులో చిన్నారుల మానసిక వికాసానికి ఆటపాటలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఉదయం 9 నుంచి 9.20 గంటల వరకు అంగన్వాడీ టీచర్, చిన్నారులు, చిన్నారుల మధ్య పరస్పర సంభాషణలు. 9.20గంటల నుంచి 9.40 వరకు ప్రార్థన అనంతరం స్నాక్స్ అందజేత. 10 నుంచి 10.30 వరకు మూడేళ్లు నిండిన చిన్నారులకు ఆటలు, నాలుగేళ్లు పైబడిన చిన్నారులకు పాఠశాల కార్యక్రమాలకు సంసిద్దులను చేయడం. 10.30 నుంచి 10.50 వరకు కేంద్రం లోపల, బయట ఆటపాటలు. 10.50 నుంచి 11 గంటల వరకు చిన్నారులు ఆటలు ఆడాక చేతులు ఎలా శుభ్రపర్చుకోవాలో తెలియపర్చడం. ఉదయం 11 నుంచి 11.20 వరకు ఆటవస్తువులు, చార్టులు, పరికరాల ద్వారా చిన్నారులకు కథలు చెప్పడం. చిన్నారులు తమకు తాముగా సంఘటనలు చెప్పుకునేలా అలవాటు చేయడం. ఉదయం 11.20 నుంచి 11.30 వరకు ఇష్టమైన ఆటలు ఆడుకునేందుకు స్వేచ్ఛ ఇవ్వడం. ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు పుస్తకాలతో కూడిన కార్యకలాపాల నిర్వహణ. మధ్యాహ్నం 12 నుంచి 12.15 గంటల వరకు ఇష్టమైన ఆటలు ఆడుకునేందుకు అవకాశం, మధ్యాహ్న భోజనానికి సిద్ధం చేయడం. 12.15 నుంచి ఒంటి గంట వరకు మధ్యాహ్న భోజనం. ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు చిన్నారులను నిద్రపుచ్చడం. మధ్యాహ్నం 2.30 నుంచి 2.50 వరకు ఆటలతో కూడిన పాటలు నేర్పడం. 2.50 నుంచి 3 గంటల వరకు విద్యార్థులకు అల్పాహారం అందజేయడం. 3 నుంచి 3.30 వరకు చిన్నారులకు పాఠశాలకు అలవాటయ్యేలా బోధనా కార్యక్రమాలు నిర్వహించడం. 3.30 నుంచి 4 గంటల వరకు చిన్నారులను అంగన్వాడీ కేంద్రం ఆవరణలో ఆటలు ఆడించిన అనంతరం ఇళ్లకు పంపడం. ఐసీడీఎస్ ప్రాజెక్టులు జిల్లాలో 25 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. ఆరు గిరిజన ప్రాంతాలైన అడ్డతీగల, రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగిలలో ఉన్నాయి. మిగిలినవి కాకినాడ, రాజమండ్రి, సామర్లకోట, తుని, రూరల్ ప్రాంతాల్లో ఉన్నాయి. జిల్లాలో 4,830 అంగన్వాడీ కేంద్రాలు, 270 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 2.57 లక్షల మంది చిన్నారులు నమోదు కాగా, 2.39 లక్షల మంది వస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. సక్రమంగా అమలయ్యేలా చూస్తా కొత్తగా వచ్చిన టైంటేబుల్ అమలు చేస్తే చిన్నారులకు ఎంతో మంచిది. దీన్ని సక్రమంగా, సమర్ధవంతంగా కార్యకర్తలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటాను. టైంటేబుల్ నిర్వహణపై త్వరలో డివిజన్, ప్రాజెక్టు స్థాయిలో వర్క్షాపులుంటాయి. - వై.సుశీలాకుమారి, పీవో, ఐసీడీఎస్, రాయవరం.