Sai Praneeth
-
గోపీచంద్ అకాడమీకి బైబై..!.. అమెరికాకు పయనం!
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాలుగా పుల్లెల గోపీచంద్ అకాడమీలో కోచ్‌గా పని చేస్తున్న మొహమ్మద్ సియాదతుల్లా సిద్దిఖి అకాడమీని వీడనున్నాడు. అమెరికాలోని ఒరెగాన్ బ్యాడ్మింటన్ అకాడమీలో సియాదతుల్లా కోచ్‌గా చేరనున్నాడు. 40 ఏళ్ల సియదతుల్లా భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్ తదితరుల వెంట పలు అంతర్జాతీయ టోర్నీల్లో కోచ్‌గా వెళ్లాడు. ‘నా బావ మరిది అమెరికాలో ఉంటున్నాడు. అతను ఈ ప్రతిపాదన తెచ్చాడు. ప్రతిపాదన బాగుండటంతో అంగీకరించాను. ఈనెల 7వ తేదీన అమెరికాకు వెళుతున్నాను. జూన్‌లో కుటుంబసభ్యులు అమెరికాకు వస్తారు’ అని సియాదతుల్లా తెలిపాడు. అమెరికాలో బ్యాడ్మింటన్ అకాడమీ హెడ్ కోచ్‌గా సాయిప్రణీత్ భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుల్లో ఒకడైన భమిడిపాటి సాయిప్రణీత్ ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. త్వరలో హెడ్ కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. వచ్చే నెలలో అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న ట్రయాంగిల్ బ్యాడ్మింటన్ అకాడమీ హెడ్ కోచ్‌గా 31 ఏళ్ల సాయిప్రణీత్ బాధ్యతలు తీసుకోనున్నాడు. 2008 నుంచి అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయిప్రణీత్ చివరిసారి గత ఏడాది డిసెంబర్లో గువాహటి మాస్టర్స్ టోర్నీలో పోటీపడి రెండో రౌండ్లో ఓడిపోయాడు. పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకున్న సాయిప్రణీత్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి లీగ్ దశలో నిష్క్రమించాడు. 2019లో కేంద్ర ప్రభుత్వం నుంచి సాయిప్రణీత్ ‘అర్జున అవార్డు’ అందుకున్నాడు. ►కెరీర్ మొత్తంలో సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో కలిపి సాయిప్రణీత్ 417 మ్యాచ్‌లు ఆడాడు. 243 మ్యాచ్‌ల్లో నెగ్గి, 174 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ►2020లో కెరీర్ బెస్ట్ 10వ ర్యాంక్‌ను అందుకున్న సాయిప్రణీత్ ప్రస్తుతం 106వ ర్యాంక్‌లో ఉన్నాడు. ►2019లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గడం సాయిప్రణీత్ కెరీర్లో హైలైట్. 2017లో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కూడా సాధించాడు. ►2016లో కెనడా గ్రాండ్‌ప్రి, 2017లో థాయ్‌లాండ్ గ్రాండ్‌ప్రి టోర్నీల్లోనూ విజేతగా నిలిచాడు. ►2016, 2020లలో జరిగిన ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ►2010లో మెక్సికోలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో, 2008లో కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో సాయిప్రణీత్ కాంస్య పతకాలు గెలిచాడు. ►బ్యాడ్మింటన్‌లో మేటి క్రీడాకారులైన లిన్ డాన్, చెన్ లాంగ్ (చైనా), లీ చోంగ్ వె (మలేసియా), తౌఫిక్ హిదాయత్ (ఇండోనేసియా), కెంటో మొమోటా (జపాన్), టామీ సుగియార్తో (ఇండోనేసియా), ఆంథోని జిన్‌టింగ్ (ఇండోనేసియా)లపై సాయిప్రణీత్ విజయాలు నమోదు చేశాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ షట్లర్
హైదరాబాద్‌కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను ఇన్‌స్టా వేదికగా ఇవాళ (మార్చి 4) వెల్లడించాడు. 31 ఏళ్ల సాయి ప్రణీత్ అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ఎన్ని పతకాలు సాధించిపెట్టాడు. 2019లో అతను వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ అనంతరం గాయాలతో సతమతమైన ప్రణీత్.. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. ప్రణీత్ తన కెరీర్లో సింగపూర్ ఓపెన్, కెనడా ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ టైటిళ్లను సాధించాడు. కెరీర్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రణీత్.. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించలేకపోయానని బాధపడ్డాడు. ప్రణీత్‌ను భారత ప్రభుత్వం 2019లో అర్జున అవార్డుతో సత్కరించింది. ప్రణీత్ రిటైర్మెంట్ సందేశంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. View this post on Instagram A post shared by Sai Praneeth (@saipraneeth92) ప్రణీత్ తన కెరీర్ మొత్తంలో 225 విజయాలు సాధించి, 151 పరాజయాలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 46 స్థానంలో ఉన్న ప్రణీత్.. 2019లో అత్యుత్తమంగా 10వ ర్యాంక్‌కు సాధించాడు. రిటైర్మెంట్ అనంతరం ప్రణీత్ కోచ్‌గా సేవలించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. యూఎస్‌లోని నార్త్ కరోలినా క్లబ్లో అతను కోచ్‌గా సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
సైనా, సాయిప్రణీత్ ఓటమి
న్యూఢిల్లీ: ఓర్లియాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్, సాయిప్రణీత్ నిరాశ పరిచారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా 16–21, 14–21తో తుర్కియే షట్లర్ నిష్లిహాన్ యిగిట్ చేతిలో... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిప్రణీత్ 20–22, 17–21తో లీంగ్ జున్ హావో (మలేసియా) చేతిలో ఓడిపోయారు. -
Malaysia Masters: అదరగొట్టిన సింధు, ప్రణయ్
మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళ సింగిల్స్‌లో ఏడో సీడ్ పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సాయిప్రణీత్ ఓటమి పాలయ్యారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–12, 21–10తో ప్రపంచ 32వ ర్యాంకర్ జంగ్ యి మన్ (చైనా)పై అలవోక విజయం సాధించింది. కేవలం 28 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. పురుషుల ఈవెంట్లో ప్రణయ్ 21–19, 21–16తో వాంగ్ జు వి (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. సాయిప్రణీత్ 14–21, 17–21తో లి షె ఫెంగ్ (చైనా) చేతిలో, కశ్యప్ 10–21, 15–21తో ఆరో సీడ్ ఆంథోని సినిసుక (ఇండోనేసియా) చేతిలో వరుస గేముల్లో కంగుతిన్నారు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో సింధు... రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో, ప్రణయ్... జపాన్‌కు చెందిన సునెయామతో తలపడతారు. చదవండి: IND vs ENG 1st T20: హార్దిక్ ఆల్‌రౌండ్ షో.. టీమిండియా ఘన విజయం -
Malaysia Open: తొలి రౌండ్లోనే అవుట్.. పోరాడి ఓడిన సాయి ప్రణీత్
కౌలాలంపూర్: భారత అగ్రశ్రేణి షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ మలేసియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 19వ ర్యాంకర్ సాయిప్రణీత్ 15–21, 21–19, 9–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ సీజన్లో సాయిప్రణీత్ ఏడు టోర్నీలలో పాల్గొనగా, ఆరింటిలో తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. మరోవైపు సమీర్ వర్మ కూడా తొలి రౌండ్లోనే ఓడిపోగా, ప్రణయ్ శుభారంభం చేశాడు. 2018 ఆసియా క్రీడల చాంపియన్ క్రిస్టీ (ఇండోనేసియా) 21–14, 13–21, 21–7తో సమీర్ వర్మను ఓడించగా... ప్రణయ్ 21–14, 17–21, 21–18తో డారెన్ లూ (మలేసియా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–18, 21–11 తో మాన్ వె చోంగ్–కయ్ వున్ టీ (మలేసియా) జోడీపై గెలి చింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని (భారత్) జంట 15– 21, 11–21తో మత్సుయామ–చిహారు (జపాన్) జోడీ చేతిలో ఓడింది. చదవండి: Wimbledon 2022: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు -
Malaysia Open Badminton: తాడో పేడో తేల్చుకోనున్న సాయిప్రణీత్
కౌలాలంపూర్: కొంతకాలంగా నిలకడలేమితో ఇబ్బంది పడుతోన్న భారత అగ్రశ్రేణి షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ మరో టోర్నీకి సిద్ధమయ్యాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన ఈ హైదరాబాద్ ప్లేయర్‌కు ఈ ఏడాదీ కలసి రావడంలేదు. ఈ సంవత్సరం ఆరు టోర్నీలలో బరిలోకి దిగిన సాయిప్రణీత్ ఐదు టోర్నీలలో తొలి రౌండ్లోనే వెనుదిరగ్గా... మరో టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. నేడు మొదలయ్యే మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీలో 30 ఏళ్ల సాయిప్రణీత్‌కు తొలి రౌండ్లోనే క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ సినిసుక జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో ప్రపంచ 19వ ర్యాంకర్ సాయిప్రణీత్ తలపడనున్నాడు. సాయిప్రణీత్‌తోపాటు హెచ్ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ మలేసియా ఓపెన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలో ఉన్నారు. చదవండి: Wimbledon: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. జకోవిచ్ శుభారంభం.. -
సాయిప్రణీత్‌కు కరోనా పాజిటివ్
బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్ ఇండియా ఓపెన్ నుంచి భారత అగ్రశ్రేణి ప్లేయర్, హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ వైదొలిగాడు. ఆదివారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో సాయిప్రణీత్‌కు పాజిటివ్ రావడంతో... మంగళవారం నుంచి న్యూఢిల్లీలో జరిగే ఈ టోర్నీ నుంచి అతను తప్పుకున్నాడు. ‘రెండు రోజుల నుంచి నాకు దగ్గు, జలుబు ఉంది. కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను’ అని సాయిప్రణీత్ తెలిపాడు. -
శ్రీకాంత్ శుభారంభం.. తొలి రౌండ్లోనే సాయిప్రణీత్‌కు షాక్
World Badminton Championship: Kidambi Srikanth Wins First Round (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేయగా... 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–12, 21–16తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో 16వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–17, 7–21, 18–21తో 28వ ర్యాంకర్ మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమిత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 16–21, 15–21తో జోయెల్ ఎల్పీ–రస్ముస్ జార్ (డెన్మార్క్) జంట చేతిలో పరాజయం పాలైంది. చదవండి: KS Bharat Century: విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం.. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ భారీ ధర కన్ఫర్మ్ -
క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21–12, 21–18తో వైవోన్ లీ (జర్మనీ)పై అలవోక విజయం సాధించింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో టోర్నీ మూడో సీడ్ సింధు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను ముగించి టోర్నీలో ముందంజ వేసింది. నేడు జరిగే క్వార్టర్స్ పోరులో సిమ్ యుజిన్ (కొరియా)తో సింధు ఆడనుంది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 21–17, 14–21, 21–19తో క్రిస్టో పోపొవ్ (ఫ్రాన్స్)పై పోరాడి గెలిచాడు. అయితే మరో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు మాత్రం ప్రిక్వార్టర్స్‌లో నిరాశ ఎదురైంది. శ్రీకాంత్ 14–21, 18–21తో టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–15, 19–21, 23–21తో కంగ్ మిన్‌హ్యూక్– సియో సెంగ్‌జే (కొరియా) జంటపై నెగ్గి ముందంజ వేసింది. చదవండి: IND Vs NZ: మొదటి రోజు దుమ్ములేపిన భారత బ్యాటర్లు.. తొలి మ్యాచ్‌లోనే అయ్యర్ అర్ధ సెంచరీ -
PV Sindhu: సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం...
Indonesia Open- PV Sindhu Kidambi Srikanth Sai Praneeth Enters 2nd Round: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ శుభారంభం చేశారు. బుధవారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టోర్నీ మూడో సీడ్ సింధు 17–21, 21–17, 21–17తో జపాన్ షట్లర్ అయా ఒహోరిపై గెలిచింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–15, 19–21, 21–12తో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్)పై, సాయి ప్రణీత్ 21–19, 21–18తో టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. మహిళల డబుల్స్‌లో మాత్రం భారత్‌కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి ద్వయం 27–29, 18–21తో గ్యాబ్రియెల్ స్టొయెవా– స్టిఫాని స్టొయెవా (బల్గేరియా) జంట చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్–అశ్విని పొన్నప్ప (భారత్) 24–22, 12–21, 19–21తో టకురో హోకి– నమి మత్సుయమ (జపాన్) చేతిలో, ధ్రువ్ కపిల–సిక్కి రెడ్డి (భారత్) జోడీ 7–21, 12–21తో యమషిటా–నరు షినోయ (జపాన్) జంట చేతిలో ఓడారు. చదవండి: IPL 2022 Auction: ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునేది వీళ్లనే..! -
Uber Cup: 11 ఏళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్స్‌కు
అర్హుస్ (డెన్మార్క్): థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో 11 ఏళ్ల తర్వాత భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. తాహితి జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఘనవిజయం సాధించింది. వరుసగా రెండో గెలుపుతో ఈ టోర్నీలో 2010 తర్వాత భారత్‌కు నాకౌట్ బెర్త్ ఖరారైంది. ఇదే గ్రూప్ నుంచి చైనా కూడా క్వార్టర్స్‌కు చేరింది. నేడు భారత్, చైనా మధ్య జరిగే మ్యాచ్ విజేత గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది. తాహితి జట్టుతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో సాయిప్రణీత్ 21–5, 21–6తో లూయిస్ బిబోయిస్‌ను ఓడించాడు. రెండో మ్యాచ్‌లో సమీర్ వర్మ 21–12, 21–12తో రెమి రోస్‌పై, మూడో మ్యాచ్‌లో కిరణ్ జార్జి 21–4, 21–2తో మౌబ్లాంక్‌పై గెలవడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తర్వాత రెండు డబుల్స్ మ్యాచ్‌ల్లో కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్; సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీలు తమ ప్రత్యర్థి జంటలపై గెలుపొందాయి. మరోవైపు ఉబెర్ కప్‌లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో 0–5తో థాయ్‌లాండ్ జట్టు చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్‌తో భారత్ ఆడనుంది. -
చేతులు కలుపుదాం.. కలిసి సాగుదాం
న్యూఢిల్లీ: అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘నేషన్ ఫస్ట్.. ఆల్వేస్ ఫస్ట్’అనే నినాదంతో దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. టోక్యో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మన క్రీడాకారులు విజయులై తిరిగిరావాలని ఆకాంక్షించారు. భారత ఆటగాళ్లకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మన్ కీ బాత్‌లో ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. ► భారతదేశానికి పరాయి పాలన నుంచి స్వాతంత్య్ర లభించి ఈ ఆగస్టు 15వ తేదీ నాటికి 74 ఏళ్లు పూర్తయ్యి 75వ సంవత్సరం రాబోతోంది. ఏడాది తర్వాత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా దేశమంతటా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకుంటున్నాం. ► జాతి అభివృద్ధి దిశగా కలిసి పనిచేయడం ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. ► జాతిపిత మహాత్మాగాంధీ భారత్ చోడో ఆందోళన్ (క్విట్ ఇండియా ఉద్యమం) చేపట్టారు. అదే స్ఫూర్తితో ప్రతి భారతీయుడు భారత్ జోడో ఆందోళన్ (ఐక్య భారత ఉద్యమం)లో పాలు పంచుకోవాలి. వైవిధ్యం, భిన్న సంస్కృతులు కలిగిన భారతదేశంలో ఐక్యంగా ఉండడం అందరి బాధ్యత. ► అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారత జాతీయ గీతం జనగణమనను సాధ్యమైనంత ఎక్కువ మంది కలిసి ఆలపించేలా కేంద్ర సాంస్కృతిక శాఖ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం http://rarhtrafan.in అనే వెబ్‌సైట్‌ను సృష్టించింది. ఈ వెబ్సైట్ ద్వారా జాతీయ గీతాన్ని ఆలపించి, రికార్డు చేసుకోవచ్చు. జాతీయ గీతం ఆలాపనతో మీరంతా అనుసంధానమై ఉంటారని ఆశిస్తున్నా. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో మన ముందుకు రాబోతున్నాయి. ► ఒలింపిక్ క్రీడల్లో మన ఆటగాళ్లను ప్రోత్సహించండి. ఇందుకోసం ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రారంభమైన ‘విక్టరీ పంచ్’ ప్రచార కార్యక్రమంలో పాల్గొనండి. భారత ఆటగాళ్లకు మద్దతు కొనసాగించండి. మీ విక్టరీ పంచ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు. ► ఈ నెల 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. 1999లో మన దేశం గర్వించేలా అపూర్వ పోరాటం సాగించిన అమర జవాన్లకు నివాళులర్పించాల్సిన సందర్భమిది. ► ఇక మన్ కీ బాత్ అనేది ప్రతినెలా సానుకూలత, సామూహికతకు సంబంధించిన వేడుకలాంటిది. దీనిపై ప్రజల నుంచి వస్తున్న అన్ని సలహాలు సూచనలను నేను పాటించలేకపోవచ్చు కానీ వాటిలో చాలావరకు సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపిస్తున్నా. ► మన్ కీ బాత్‌కి సందేశాలు, సలహాలు అందజేస్తున్న వారిలో దాదాపు 75 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని ఒక అధ్యయనంలో తేలింది. ఇదొక మంచి పరిణామం. ఈ కార్యక్రమంలో సానుకూలత, సున్నితత్వం ఇమిడి ఉన్నాయి. ఇందులో సానుకూల అంశాలే మాట్లాడుకుంటాం. ► దేశంలో వలస పాలన కొనసాగుతున్నప్పుడు దేశ ప్రజలు స్వాతంత్య్రం కోసం ఒక్కతాటిపైకి వచ్చారు. ఉమ్మడి లక్ష్య సాధన కోసం చేతులు కలిపారు. ఇప్పుడు దేశ అభివృద్ధి కోసం ప్రజలంతా చేతులు కలపాలి. ► స్థానిక వ్యాపారులకు, కళాకారులకు, వృత్తి నిపుణులకు, చేనేత కార్మికులకు అండగా నిలవడం ద్వారా జాతి నిర్మాణంలో భాగస్వాములు కావొచ్చు, ► ఆగస్టు 7వ తేదీ మనకు జాతీయ చేనేత దినోత్సవం. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో చాలామందికి అతిపెద్ద ఆదాయ వనరు చేనేత ఉత్పత్తులే. అందుకే వాటిని కొనుగోలు చేయండి. ► 2014 నుంచి మన దేశంలో ఖాదీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడం హర్షించదగ్గ పరిణామం. సాయిప్రణీత్‌కు ప్రత్యేక అభినందనలు దేశంలో వివిధ కీలక రంగాల్లో పలువురు కొనసాగిస్తున్న కృషిని ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ప్రశంసించారు. వాతావరణ నిపుణుడిగా (వెదర్ మ్యాన్) గుర్తింపు పొందిన సాయిప్రణీత్‌ను ప్రత్యేకంగా అభినందించారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన సాయిప్రణీత్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. వాతావరణ సంబంధిత అంశాలను క్షుణ్నంగా విశ్లేషించడంలో దిట్టగా ప్రఖ్యాతి పొందారు. సాయి ప్రణీత్ తన ఆసక్తి, ప్రతిభను రైతుల సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నారని మోదీ కితాబిచ్చారు. వాతావరణ వివరాలను వివిధ మార్గాల ద్వారా సేకరించి విశ్లేషిస్తూ, స్థానిక భాషలో రైతులకు సలహాలు, సూచనలు పంపడం అభినందనీయమన్నారు. -
టోక్యో ఒలింపిక్స్‌కు కోచ్ గోపీచంద్ దూరం
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఈసారి ఒలింపిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే శిక్షణ సహాయ సిబ్బందిని అనుమతిస్తుండటంతో ఆయన గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. జాతీయ కోచ్‌గా ఆయనకు అవకాశమున్నప్పటికీ సింగిల్స్ ప్లేయర్ సాయిప్రణీత్ వ్యక్తిగత కోచ్ అగుస్ వి సాంటోసాకు చాన్స్ ఇవ్వాలని గోపీ తప్పుకున్నారు. ఒక్కో క్రీడాంశానికి గరిష్టంగా ఐదుగురు (ముగ్గురు కోచ్‌లు, ఇద్దరు ఫిజియోలు) సహాయ సిబ్బంది మాత్రమే టోక్యోకు వెళ్లేందుకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అనుమతిస్తోంది. పీవీ సింధు వెంట వ్యక్తిగత కోచ్ తే సాంగ్ పార్క్... డబుల్స్ జంట సాతి్వక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి వెంట కోచ్ మథియాస్ బో... ఇద్దరు ఫిజియోలు (సుమాన్ష్ శివలంక, బద్దం ఇవాంజలైన్) వెళ్లనున్నారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఏడుగురు కోచ్‌లు వెళ్లేందుకు అవకాశమివ్వాలని ఐఓఏకు లేఖ రాసింది. కానీ ప్రస్తుత కరోనా ప్రొటోకాల్ ప్రకారం ఆటగాళ్ల సంఖ్యలో 33 శాతానికి మించి సహాయ సిబ్బందిని పంపే వీలులేకపోవడంతో ‘బాయ్’ వినతిని ఐఓఏ తోసిపుచ్చింది. -
ఖేల్‌రత్న రేసులో తెలుగు తేజాలు
చెన్నై: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ కోసం ఈసారి భారీగానే దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తులు స్వీకరించేందుకు మరో మూడు రోజులు ఉన్నందున ఆయా జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలు తమ అత్యుత్తమ క్రీడాకారుల పేర్లను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కోసం నామినేట్ చేస్తున్నాయి. తాజాగా అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) భారత మహిళా చెస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి పేరును ‘ఖేల్‌రత్న’ కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 34 ఏళ్ల హంపి 2019 డిసెంబర్లో ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ షిప్లో విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా గతేడాది అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్‌లోనూ టైటిల్ సాధించింది. మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో భాగంగా 2019లో రష్యాలో జరిగిన తొలి టోర్నీలో చాంపియన్‌గా, మొనాకో లో జరిగిన రెండో టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా గ్రాండ్‌ప్రి సిరీస్‌లో రెండో స్థానంలో నిలిచి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది. ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టులోనూ హంపి సభ్యురాలిగా ఉంది. హంపికి 2003లోనే అర్జున అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబుతోపాటు ఇతర ప్లేయర్లు విదిత్ గుజరాతి, ఆధిబన్, సేతురామన్, భక్తి కులకర్ణి, పద్మిని రౌత్ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ఏఐసీఎఫ్ గౌరవ కార్యదర్శి భరత్ సింగ్ చౌహాన్ నామినేట్ చేశారు. బ్యాడ్మింటన్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్... తెలంగాణకు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ పేర్లను ‘ఖేల్‌రత్న’ కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సిఫారసు చేసింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో సాయిప్రణీత్ ఒక్కడే అర్హత సాధించాడు. మరోవైపు 2017లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన శ్రీకాంత్ ఆ తర్వాత చెప్పుకోతగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. హెచ్ఎస్ ప్రణయ్, ప్రణవ్ చోప్రా, సమీర్ వర్మ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ‘బాయ్’ ప్రతిపాదించింది. ‘ధ్యాన్‌చంద్ అవార్డు’ కోసం ఒలింపియన్ పీవీవీ లక్ష్మి, లెరాయ్ డిసా పేర్లను... ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం భాస్కర్ బాబు, మురళీధరన్ పేర్లను ‘బాయ్’ పంపించింది. అవార్డీల కమిటీ మొత్తం దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు తొలి వారంలో తుది అవార్డులు గెల్చుకున్న వారి జాబితాను ప్రకటించే అవకాశముంది. -
'ఖేల్‌రత్న' రేసులో కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్
న్యూఢిల్లీ: భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డు కోసం స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్‌ల పేర్లను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) ప్రతిపాదించింది. అలాగే మరో ముగ్గురు షట్లర్ల పేర్లను అర్జున అవార్డుకు ప్రతిపాదించింది. హెచ్ఎస్ ప్రణయ్, ప్రణవ్ జెర్రీ చోప్రా, సమీర్ వర్మలను అర్జున అవార్డు బరిలో నిలిపింది. ద్రోణాచార్య అవార్డు కోసం ఎస్ మురళీధరన్, పీయూ భాస్కర్ల పేర్లను కేంద్ర క్రీడా శాఖకు సిఫార్సు చేసింది. వీరిలో మురళీధరన్‌కు ఇప్పటికే ద్రోణాచార్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే, 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన సాయి ప్రణీత్.. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు పురుషుల సింగిల్స్ విభాగంలో క్వాలిఫై అయిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇక కిదాంబి శ్రీకాంత్ విషయానికొస్తే.. ఈ స్టార్ షట్లర్ ఇటీవల కాలంలో ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో అతను టోక్యో బెర్తు కూడా సాధించలేకపోయాడు. కిదాంబి శ్రీకాంత్ చివరిసారిగా 2017లో నాలుగు టైటిల్స్ సాధించాడు. కాగా, ఈ అవార్డు కోసం క్రికెట్ విభాగంలో మిథాలీ రాజ్, రవిచంద్రన్ అశ్విన్ నామినేట్ కాగా, ఆర్చరీలో వన్నెం జ్యోతి సురేఖ, ఫుట్‌బాల్‌లో సునీల్ ఛెత్రీ, టీటీలో శరత్ కమల్, జావలీన్ త్రోలో నీరజ్ చోప్రా తదితరులు నామినేట్ అయ్యారు. -
సారథులుగా శ్రీకాంత్, సింధు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొనే 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టును గురువారం ప్రకటించారు. పురుషుల జట్టును ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ నడిపించనున్నాడు. డెన్మార్క్‌లోని అర్హస్ వేదికగా అక్టోబర్ 3నుంచి 11వరకు జరుగనున్న ఈ టోర్నీలో కశ్యప్, లక్ష్యసేన్, శుభాంకర్, సిరిల్ వర్మ, మను అత్రి, సుమీత్ రెడ్డి, అర్జున్, ధ్రువ్ కపిల, కృష్ణ ప్రసాద్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. మోకాలి గాయం కారణంగా ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచ చాంపియన్ పీవీ సింధుతో పాటు సైనా నెహ్వాల్, అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డిలతో పాటు మాల్విక బన్సోద్, ఆకర్షి కశ్యప్, పూజ, సంజన సంతోష్, పూర్వీషా రామ్, జక్కంపూడి మేఘన జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేసి జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ మేరకు సెప్టెంబర్ 3–27 వరకు శిబిరం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో అకాడమీలోనే ఉంటూ ప్రాక్టీస్ చేసేందుకు కొందరు ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. పైగా క్యాంప్ ప్రారంభానికి ముందు నిబంధనల ప్రకారం వారం రోజుల క్వారంటీన్ తప్పనిసరి కావడంతో అంత సమయం లేదని భావించిన ‘బాయ్’ మొత్తం శిబిరాన్నే రద్దు చేసింది. థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ అనంతరం జరుగనున్న డెన్మార్క్ ఓపెన్ (అక్టోబర్ 13–18), డెన్మార్క్ మాస్టర్స్ (అక్టోబర్ 20–25) టోర్నీల్లోనూ శ్రీకాంత్, లక్ష్యసేన్, సింధు, సైనా, అశ్విని, సిక్కిరెడ్డి ఆడనున్నారు. -
టీకా వస్తేనే ఆటలకు మేలు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వైరస్‌కు టీకా అందుబాటులోకి వచ్చాకే క్రీడా ఈవెంట్లను ప్రారంభించాలని భారత స్టార్ షట్లర్ సాయిప్రణీత్ అభిప్రాయపడ్డాడు. ఆ టీకాకు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఆమోదం ఉంటే క్రీడాకారులు ధైర్యంగా పోటీల్లో పాల్గొనగలరని పేర్కొన్నాడు. పరిస్థితులు సద్దుమణిగినా కూడా... వ్యాక్సినేషన్ లేకుంటే అందరిలో కరోనా భయం తొలగిపోదన్నాడు. ‘వాడా నిషేధించిన డ్రగ్స్ లేకుండా టీకా ఉంటే క్రీడాకారులకు మంచిది. లేకపోతే ప్లేయర్ల భవిష్యత్ కష్టాల్లో పడుతుంది. టీకా లేకుండా పరిస్థితులు కచ్చితంగా మన చేతుల్లోకి రావు. ఆటగాళ్లు తరచూ విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. కరోనా మొత్తం తగ్గిన తర్వాత కూడా చైనా, కొరియా లాంటి దేశాలకు వెళ్లాలంటే ఆటగాళ్లు ఆందోళన చెందుతారు. ఎందుకంటే ప్రయాణాల్లో, బ్యాడ్మింటన్ కోర్టుల్లో ప్రతీసారి, ప్రతీచోటా సామాజిక దూరం పాటించడం కుదరదు. కొన్నిచోట్ల వైరస్ తగ్గినట్లే తగ్గి తిరగబెడుతోంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో టీకా లేకుండా టోర్నీలు ఆడటం సాహసమే. ఇప్పుడిప్పుడే టీకా ప్రయోగాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ వరకు బ్యాడ్మింటన్ టోర్నీలు ఉండకపోవచ్చు’ అని ఈ హైదరాబాదీ ప్లేయర్ వివరించాడు. -
సాయిప్రణీత్ విరాళం రూ. 4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనాపై పోరాటానికి మద్దతుగా భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి ఆటగాడు, హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ తనవంతుగా రూ. 4 లక్షలు విరాళం ఇచ్చాడు. గతేడాది ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన సాయిప్రణీత్... ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 3 లక్షలు... తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 1 లక్ష వితరణ చేశాడు. కరోనా కట్టడి కోసం ఇప్పటి వరకు బ్యాడ్మింటన్ క్రీడాంశం నుంచి చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ (రూ. 26 లక్షలు), పీవీ సింధు (రూ. 10 లక్షలు), శ్రీకృష్ణప్రియ (రూ. 5 లక్షలు), కశ్యప్ (రూ. 3 లక్షలు) విరాళాలు ఇచ్చారు. హాకీ ఇండియా (హెచ్ఐ) ఇప్పటికే పీఎం–కేర్స్ రిలీఫ్ ఫండ్ కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించగా... తాజా ఒడిశా సీఎం సహాయనిధికి రూ. 21 లక్షలు ఇచ్చింది. చెస్ క్రీడాకారుల దాతృత్వం కోవిడ్–19పై పోరాటానికి చెస్ క్రీడాకారులందరూ ఏకమయ్యారు. ఆన్లైన్ టోర్నీల్లో పాల్గొనడం, విరాళాల ద్వారా రూ. 3 లక్షలకు పైగా నిధుల్ని సమకూర్చారు. తమిళనాడుకు చెందిన చెస్ కోచ్ ఆర్బీ రమేశ్‌కు చెందిన చారిటబుల్ ట్రస్ట్ ‘చెస్ గురుకుల్’కు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రూ. 2 లక్షలు, కార్తికేయన్ మురళి రూ. 25,000 విరాళం ఇచ్చారు. -
బెంగళూరుకు చుక్కెదురు
చెన్నై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్‌కు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 3–4తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ చేతిలో ఓడింది. ఒకదశలో 1–3తో ఆధిక్యంలో నిలిచిన బెంగళూరు... అనంతరం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి పరాజయాన్ని మూట గట్టుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో చాన్ పెంగ్–యోమ్ హే వోన్ (బెంగళూరు) ద్వయం 15–8, 15–11తో లీ యంగ్ డే–కిమ్ హన (నార్త్ ఈస్టర్న్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ (బెంగళూరు) 14–15, 9–15తో లే చియుక్ యు (నార్త్ ఈస్టర్న్) చేతిలో ఓడటంతో... ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (బెంగళూరు) 15–7, 15–5తో అస్మిత (నార్త్ ఈస్టర్న్)పై గెలుపొందింది. ఈ పోరులో బెంగళూరు ‘ట్రంప్ కార్డు’ ఉపయోగించడంతో రెండు పాయింట్లు లభించాయి. దాంతో బెంగళూరు 3–1తో ఆధిక్యంలోకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో బరిలో దిగిన నార్త్ ఈస్టర్న్ జోడీ బొదిన్ ఇసారా–లీ యంగ్ డే ద్వయం 15–12, 15–6తో అరుణ్ జార్జ్–రియాన్ అగుంగ్ సపుర్తో (బెంగళూరు) జంటను చిత్తు చేసింది. దీంతో మరోసారి ఇరు జట్ల స్కోర్లు 3–3తో సమం అయ్యాయి. ఇక విజేతను నిర్ణయించే చివరి మ్యాచ్ అయిన పురుషుల రెండో సింగిల్స్‌లో సెన్సోమ్బూన్సుక్ (నార్త్ ఈస్టర్న్) 15–7, 15–8తో లెవెర్డెజ్పై గెలుపొందడంతో నార్త్ ఈస్టర్న్ విజయం ఖాయమైంది. -
సాయిప్రణీత్, శ్రీకాంత్ ఇంటిముఖం
కౌలాలంపూర్: టోక్యో ఒలింపిక్స్ రేసులో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్ కొత్త సీజన్‌ను పరాజయంతో ప్రారంభించారు. మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నమెంట్లో సాయిప్రణీత్, శ్రీకాంత్‌లతోపాటు మరో తెలుగు షట్లర్ పారుపల్లి కశ్యప్ కూడా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సాయిప్రణీత్ 11–21, 15–21తో ప్రపంచ 19వ ర్యాంకర్ రస్ముస్ జెమ్కె (డెన్మార్క్) చేతిలో... ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 17–21, 5–21తో రెండో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో... ప్రపంచ 23వ ర్యాంకర్ కశ్యప్ 17–21, 16–21తో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. రస్‌ముస్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ ఏదశలోనూ పోటీనివ్వలేకపోయాడు. గతేడాది ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్యం గెలిచిన ఈ హైదరాబాద్ ప్లేయర్ రెండు గేముల్లోనూ ఆరంభంలోనే ఆధిక్యం కోల్పోయి ఆ తర్వాత కోలుకోలేకపోయాడు. మరోవైపు చౌ తియెన్ చెన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ కేవలం 30 నిమిషాల్లో చేతులెత్తేశాడు. తొలి గేమ్‌లో గట్టిపోటీనిచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రెండో గేమ్‌లో మాత్రం కేవలం ఐదు పాయింట్లు సాధించాడు. అయితే భారత్‌కే చెందిన సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సమీర్ వర్మ 21–16, 21–15తో వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్)పై... ప్రణయ్ 21–9, 21–17తో కాంటా సునెయామ (జపాన్)పై గెలిచారు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కెంటో మొమోటాతో ప్రణయ్; లీ జి జియా (మలేసియా)తో సమీర్ వర్మ తలపడతారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహా్వల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సింధు 21–15, 21–13తో ఎవ్‌గెనియా కొసెత్‌స్కాయ (రష్యా)పై... సైనా 21–15, 21–17తో లియాన్ తాన్ (బెల్జియం)పై విజయం సాధించారు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అయా ఒహోరి (జపాన్)తో సింధు; ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో సైనా పోటీపడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 10–21, 10–21తో టాప్ సీడ్ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
శ్వేతను పెళ్లాడిన సాయిప్రణీత్
సాక్షి, కాకినాడ: భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, హైదరాబాద్ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం కాకినాడలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్వేత జయంతితో సాయిప్రణీత్ వివాహం జరిగింది. సాత్విక్ సాయిరాజు సహా పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ పెళ్లికి హాజరయ్యారు. సాయిప్రణీత్-శ్వేత జంటకు సోషల్ మీడియా ద్వారా వివిధ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సాయిప్రణీత్ అంతర్జాతీయస్థాయిలో అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో కాంస్యం గెలిచిన భారత ప్లేయర్‌గా నిలిచాడు. కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న సాయిప్రణీత్‌ను ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ‘అర్జున అవార్డు’తో సత్కరించింది. -
సాయిప్రణీత్ శుభారంభం
లక్నో: బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్ సయ్యద్ మోదీ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ భమిడిపాటి సాయిప్రణీత్‌తోపాటు ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 2116, 2220తో ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా)పై... శ్రీకాంత్ 2112, 2111తో మల్కోవ్ (రష్యా)పై... ప్రణయ్ 1821, 2220, 2113తో లి షి ఫెంగ్ (చైనా)పై... సౌరభ్ వర్మ 2111, 2116తో జియోడాంగ్ షెంగ్ (కెనడా)పై గెలుపొందారు. హైదరాబాద్ కుర్రాడు సిరిల్ వర్మ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. సిరిల్ వర్మ 1221, 2115, 213తో హువాంగ్ పింగ్ సెయిన్ (చైనీస్ తైపీ)ను ఓడించాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడిన హైదరాబాద్ ఆటగాడు చిట్టబోయిన రాహుల్ యాదవ్ 1621, 821తో కున్లావుత్ వితిత్‌సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. వృశాలి, ఉత్తేజిత ఓటమి మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలుగమ్మాయిలు గుమ్మడి వృశాలి 1621, 1621తో అష్మిత చాలిహా (భారత్) చేతిలో... సాయి ఉత్తేజిత 1021, 2119, 1521తో చోల్ బిర్చ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడారు. సాత్విక్‌చిరాగ్ జంటకు షాక్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ ఫేవరెట్ జోడీ, రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ శెట్టి (భారత్) తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. డి జి జియాన్‌వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం 2112, 2321తో సాత్విక్‌చిరాగ్ జంటను ఓడించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డిఅశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 2113, 1621, 2119తో ఎన్జీ సాజ్ యావుయువెన్ సిన్ యింగ్ (హాంకాంగ్) జంటపై నెగ్గింది. -
నిన్న మహిళల సింగిల్స్.. నేడు పురుషుల సింగిల్స్
ఫుజౌ (చైనా): చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మంటన్ టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భారత షట్లర్ సాయి ప్రణీత్ 20-22, 22-20, 16-21 తేడాతో ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సాయి ప్రణీత్.. రెండో గేమ్‌లో గెలిచి రేసులోకి వచ్చాడు. కాగా, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆండెర్స్ ర్యాలీలు, స్మాష్‌లతో ప్రణీత్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ప్రణీత్ తాను చేసి తప్పిదాల నుంచి తేరుకునే లోపే ఆండెర్స్ గేమ్‌తో మ్యాచ్‌ను కూడా గెలిచి మూడో రౌండ్‌కు చేరాడు. తొలి గేమ్‌లో పోరాట స్పూర్తిని ప్రదర్శించిన ప్రణీత్.. రెండో గేమ్‌లో జోరును కొనసాగించాడు. ఆండెర్స్‌కు అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను గెలిచాడు. కాగా, మూడో గేమ్‌లో ఆండెర్స్ తిరిగి పుంజుకున్నాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ ప్రణీత్‌ను ఒత్తిడిలోకి నెట్టి పైచేయి సాధించాడు. చివర్లో ప్రణీత్ పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రణీత్ ఓటమితో భారత్ సింగిల్స్‌లో పోరాటాన్ని ముగించింది. నిన్న మహిళల సింగిల్స్ పోరాటం ముగిస్తే, ఈరోజు పురుషుల సింగిల్స్ పోరాటం సైతం ముగిసింది. -
సాయిప్రణీత్ శుభారంభం
ఫుజౌ (చైనా): ఆరంభంలో తడబడ్డా... వెంటనే తేరుకున్న భారత స్టార్ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సాయిప్రణీత్ 15–21, 21–12, 21–10తో ప్రపంచ 16వ ర్యాంకర్ టామీ సుగియార్తోపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సుగియార్తోపై సాయిప్రణీత్కిది వరుసగా మూడో విజయం. 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాయిప్రణీత్ తొలి గేమ్‌ను చేజార్చుకున్నా... తదుపరి రెండు గేముల్లో పూర్తి ఆధిపత్యం చలాయించాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో సాయిప్రణీత్ ఆరంభంలో 0–3తో వెనుకంజలో నిలిచాక... ఒక్కసారిగా విజృంభించి వరుసగా 10 పాయింట్లు స్కోరు చేసి 10–3తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఇద్దరు 1–1తో సమంగా ఉన్నారు. సాయిప్రణీత్‌తోపాటు హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... సమీర్ వర్మ తొలి రౌండ్లోనే ని్రష్కమించాడు. ప్రపంచ 25వ ర్యాంకర్ కశ్యప్ 44 నిమిషాల్లో 21–14, 21–13తో ప్రపంచ 21వ ర్యాంకర్ సిథికోమ్ థమాసిన్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. ఈ విజయంతో ఇటీవల డెన్మార్క్ ఓపెన్‌లో థమాసిన్ చేతిలో ఎదురైన ఓటమికి కశ్యప్ బదులు తీర్చుకున్నాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ సమీర్ వర్మ 18–21, 18–21తో ప్రపంచ 28వ ర్యాంకర్ లీ చెయుక్ యియు (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, మాజీ విశ్వవిజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో కశ్యప్ ఆడతాడు. 23 నిమిషాల్లోనే... మహిళల సింగిల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. మంగళవారం ప్రపంచ చాంపియన్ పీవీ సింధు తొలి రౌండ్లో ఇంటిముఖం పట్టగా... సింధు సరసన సైనా నెహ్వాల్ కూడా చేరింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా కేవలం 23 నిమిషాల్లో 9–21, 12–21తో ప్రపంచ 22వ ర్యాంకర్ కాయ్ యాన్ యాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. గత నెలన్నర కాలంలో సైనా ఐదు టోర్నీలు ఆడగా... ఫ్రెంచ్ ఓపెన్ మినహా మిగతా నాలుగు టోరీ్నల్లో తొలి రౌండ్లోనే ని్రష్కమించడం గమనార్హం. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) 14–21, 14–21తో వాంగ్ చి లిన్–చెంగ్ చి యా (చైనీస్ తైపీ) చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) 21–23, 19–21తో ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
శభాష్ సాయిప్రణీత్
ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాను సాధించిన కాంస్య పతకం గాలివాటంగా వచ్చినది కాదని తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్ నిరూపించాడు. తనదైన రోజున ఎంతటి మేటి క్రీడాకారులనైనా బోల్తా కొట్టిస్తానని ఈ హైదరాబాద్ ప్లేయర్ మరోసారి రుజువు చేశాడు. మంగళవారం ఆరంభమైన డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో సాయిప్రణీత్ తొలి రౌండ్లో పెను సంచలనం సృష్టించాడు. రెండు సార్లు ఒలింపిక్ చాంపియన్‌గా, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన చైనా దిగ్గజం లిన్ డాన్‌ను వరుస గేముల్లో ఓడించి సాయిప్రణీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఒడెన్స్ (డెన్మార్క్): ఈ ఏడాది లోటుగా ఉన్న వరల్డ్ టూర్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో... డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్ పీవీ సింధు... ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సాయిప్రణీత్ 36 నిమిషాల్లో 21–14, 21–17తోప్రపంచ 18వ ర్యాంకర్, మాజీ నంబర్‌వన్, 36 ఏళ్ల లిన్ డాన్ (చైనా)పై... మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 38 నిమిషాల్లో 22–20, 21–18తో ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై విజయం సాధించారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో సింధు ఆడనుండగా... ప్రపంచ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్), వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్) మధ్య జరిగే తొలి రౌండ్ మ్యాచ్ విజేతతో సాయిప్రణీత్ తలపడతాడు. గతంలో లిన్ డాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన సాయిప్రణీత్ ఈసారి మాత్రం అదరగొట్టాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ, నిలకడగా పాయింట్లు సాధించాడు. మొదట్లో 3–0తో ఆధిక్యం సంపాదించిన సాయిప్రణీత్ ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కొనసాగించి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. 16–16తో స్కోరు సమంగా ఉన్నదశలో సాయిప్రణీత్ రెండు పాయింట్లు సాధించి 18–16తో ముందంజ వేశాడు. ఆ తర్వాత లిన్ డాన్ ఒక పాయింట్ నెగ్గగా... ఆ వెంటనే సాయిప్రణీత్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి చైనా స్టార్ ప్లేయర్ ఓటమిని ఖాయం చేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 25వ ర్యాంకర్ కశ్యప్ 13–21, 12–21తో సితికోమ్ తమాసిన్ (థాయ్‌లాండ్) చేతిలో... సౌరభ్ వర్మ 21–19, 11–21, 17–21తో మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 24–22, 21–11తో కిమ్ జి జంగ్–లీ యోంగ్ డే (దక్షిణ కొరియా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 23–25, 18–21తో టాప్ సీడ్ మాయు మత్సుమోతో–వకానా నాగాహార (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో కిడాంబి శ్రీకాంత్; కాంటా సునెయామ (జపాన్)తో సమీర్ వర్మ; మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సయాక తకహాషి (జపాన్)తో సైనా నెహా్వల్ తలపడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మార్విన్ సిడెల్–లిండా ఎఫ్లెర్ (జర్మనీ)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; వాంగ్ యి లియు–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా)లతో సాతి్వక్ సాయిరాజ్–అశి్వని పొన్నప్ప పోటీపడతారు. ►1 ప్రపంచ మాజీ చాంపియన్స్ లేదా ఒలింపిక్ మెడలిస్ట్లైన ఆరుగురు ఆటగాళ్లను (తౌఫిక్ హిదాయత్–ఇండోనేసియా; లీ చోంగ్ వీ–మలేసియా; చెన్ లాంగ్–చైనా; విక్టర్ అక్సెల్సన్–డెన్మార్క్; కెంటో మొమోటా–జపాన్; లిన్ డాన్–చైనా) కనీసం ఒక్కసారైనా ఓడించిన ఏకైక భారత క్రీడాకారుడు సాయిప్రణీత్. ►4 చైనా దిగ్గజం లిన్ డాన్‌ను కనీసం ఒక్కసారి ఓడించిన నాలుగో భారత ప్లేయర్ సాయిప్రణీత్. గతంలో హెచ్ఎస్ ప్రణయ్ మూడుసార్లు లిన్ డాన్‌పై నెగ్గగా... పుల్లెల గోపీచంద్ రెండుసార్లు (2002లో) ఓడించగా... శ్రీకాంత్ (2014లో) ఒక్కసారి గెలిచాడు.