మాస్టర్ ప్లాన్ల విషయంలో సర్కార్ సీరియస్
సింహాచలం, న్యూస్‌లైన్: ప్రధాన దేవాలయాల్లో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించి చేసిన మాస్టర్ ప్లాన్లు దీర్ఘకాలం అప్రూవల్‌కి నోచుకోక పోవడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని రాష్ట్ర దేవాదాయశాఖ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వారిని గురువారం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ప్రముఖ దేవాలయాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నా చాలా దేవాలయాల మాస్టర్ ప్లాన్లు అప్రూవల్ కాలేదన్నారు.
ఇందులో దేవాలయాల అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. ఈనెల 20న ప్రధాన దేవాలయాల ఈఓలతో హైదరాబాద్‌లోని దేవాదాయాశాఖ కమిషనర్ కార్యాలయంలో దీనిపై చర్చ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్లాన్ లేకుండా పనులు చేపడుతుండడంతో ఖర్చు పెరుగుతోందని, ఈఓలు మారినప్పుడల్లా ప్లాన్ మారిపోతోందన్నారు. సింహగిరి దివ్యక్షేత్రం ప్లాన్ కూడా ఆమోదానికి నోచక పోవడంపై స్పందిస్తూ త్వరలోనే ఆమోదం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఈ కోటి తులసి పూజల్లో పాల్గొన్నారు. ఏఈఓ ఆర్.వి.ఎస్.ప్రసాద్ ఆయనకు ప్రసాదం అందజేశారు. దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు శ్రీనివాసరాజు, మల్లేశ్వరరావు, రాంబాబు ఏర్పాట్లు పర్యవేక్షించారు.