వాగులోపడి అన్నదమ్ముల మృతి
బాలానగర్, న్యూస్‌లైన్: వాగులోకి స్నానం చేసేందుకు వెళ్లిన అన్న గల్లంతయ్యాడు. అతని రక్షించేందుకు వెళ్లిన తమ్ముడు కూడా అన్నతో పాటే వాగులోపడి మృత్యువాతపడ్డాడు.
ఈ విషాదకర సంఘటన సోమవారం మండలంలోని ముదిరెడ్డిపల్లి పంచాయతీ నందిగామ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన జంగయ్య(35)ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని దుందుబీ వాగులో బట్టలు ఉతికి స్నానం చేసేందుకు వెళ్లాడు. అతనికి ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు అందులోనే మునిగిపోయాడు.
చీకటిపడుతున్నా ఇంటికి రాకపోవడంతో అతని భార్య కొండమ్మతో పాటు తమ్ముడు అంజయ్య కుటుంబసభ్యులు ఆందోళనకు గురై ఆచూకీ కోసం పరిసరప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పొరుగు గ్రామం మల్లేపల్లి వైపు వెళ్లాడేమోనని భావించి అనుమానంతో సోమవారం ఉదయం వెతుకుతుండగా కనిపించలేదు. సమీపంలోని దుందుబీవాగు ఒడ్డుపై జంగయ్య బట్టలు ఉండటంతో చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. వాగులోపడి చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత జంగయ్య సోదరుడు అంజయ్య(28) గ్రామస్తులంతా చూస్తుండగానే వాగులోకి దూకాడు. ఎంతసేపటికీ బయటికిరాకపోవడంతో కంగారుపడ్డ గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు.
దీంతో బాలానగర్ ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో వాగులో గాలింపుచేపట్టారు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో గద్వాల, బీచుపల్లి నుంచి జాలర్లు, గత ఈతగాళ్లను రప్పించి గాలింపుచర్యలు చేపట్టి చివరికి జంగయ్య మృతదేహాన్ని వెలికితీశారు. మరో మృతదేహంకోసం గాలించేందుకు వీలుపడకపోవడంతో మంగళవారం ఉదయం గాలించి అంజయ్య మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం కేసునమోదు చేసుకుని పోస్టుమాస్టం కోసం మృతదేహాలను షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
నందిగామలో విషాదం
నందిగామ గ్రామానికి చెందిన అన్నదమ్ములు జంగయ్య, అంజయ్యలు ప్రమాదవశాత్తు వాగులో మునిగి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగరోజు అన్నదమ్ములు మృత్యువాతపడటంతో మరణంలోనూ అన్నదమ్ముల బంధం విడిపోలేదని వారు కన్నీరు మున్నీరయ్యారు. భిక్షాటన చేసుకుని జీవనం గడిపే వీరి కుటుంబాల్లో ఇంటియజమానులు ఇద్దరు ఒకేసారి మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.