మత్స్యగెడ్డ మృత్యు పంజా
♦ నాటు పడవ మునక
♦ దంపతుల దుర్మరణం.. ఒకరి గల్లంతు
♦ ఇటుకల పండగకు వెళ్లి మృత్యు ఒడిలోకి
పెదబయలు: విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలంలోని అడుగులపుట్టు పంచాయతీ తమరడ గ్రామ సమీపంలోని మత్స్యగెడ్డలో శనివారం మధ్యాహ్నం నాటు పడవ మునిగి ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. మృతులిద్దరూ దంపతులు. మరో మహిళ గల్లంతయింది. తమ కుమార్తె ఊరిలో జరుగుతున్న ఇటుకల పండుగకు వెళ్లి తిరిగివస్తూ పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల సరిహద్దు మత్స్యగెడ్డ దాటడానికి నాటు పడవ ఎక్కి ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగి భార్యా భర్తలు మృ తిచెందారు. స్థానికులు అందించిన స మాచారం మేరకు వివరాలు ఇలా ఉ న్నాయి. పెదబయలు
మండలం గలగండ పంచాయితీ సిరశపల్లి గ్రామానికి చెందిన కొర్రా ఊర్మిళ (65), కొర్రా కొండమ్మ (62) ముంచంగిపుట్టు మండలం దారెల పంచాయతీ పెద్దపేట గ్రామంలో ఉన్న తన రెండో కుమార్తె రత్నాలమ్మ ఇంటికి ఇటుకల పండుగకు ఈ నెల 10న వెళ్లారు. వారితో పాటు వారి సమీప బంధువు పాంగి కొండ మ్మ(45)ను కూడా తీసుకెళ్లారు. శనివారం భోజనాలు చేసి ముగ్గురూ బయలు దేరారు. మధ్యలో ఉన్న మత్స్యగెడ్డను దాటడానికి ఒడ్డున ఉన్న నాటుపడవ ఎక్కారు. గెడ్డ మధ్యలోకి రాగానే నాటు పడవకు రంధ్రం ఏర్పడి పడవలోకి నీరు చేరి మునిగిపోయింది. ఆ సమయంలో సంఘటన స్థలంలో ఎవరూ లేకపోవడంతో రక్షించలేకపోయారు.
అయితే గెడ్డకు కొంత దూరంలో క్రికెట్ ఆడుతున్న చిన్న పిల్లలు నాటు పడవ మునక విషయం గ్రామస్తులకు చేరవేశారు. గ్రామస్తులు వచ్చే లోపలే వారు మృత్యువాతపడ్డారు. వీరు గెడ్డ దాటడానికి ఉపయోగించిన నాటుపడవ రంధ్రాలు పడి ఎంతో కాలంగా నిరుపయోగంగా ఉందని, గెడ్డదాటాలనే తొందరలో ఆ పడవను ఉపయోగించడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. వెంటనే దంపతుల మృతదేహాలు లభ్యంకాగా, పాంగి కొండ మ్మ ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతిచెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. తల్లి దండ్రులు మృతి చెందడంలో పిల్లలు బోరున విలపించారు. మరణంలోనూ వీరు తోడుగానే వెళ్లడం అందరినీ కలిచివేసింది.
పోలీసుల సేవాభావం
ప్రమాద స్థలానికి బంధువులు ఎవరూ సకాలంలో చేరుకోకపోవడంతో పాడేరు సీఐ సాయి, పెదబయలు ఎస్ఐ మల్లేశ్వరరావు మృతదేశాలను ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి రోడ్డు వరకు చేర్చి, అంబులెన్స్‌లో పాడేరు ఏరియ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. గల్లంతైన మహిళ కోసం గాలిస్తున్నామని తెలిపారు. సంఘటన స్థలంలో స్థానిక ఎంపీపీ సల్లంగి ఉమామహేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు పాంగి పాండురంగస్వామి, డివిజన్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కూడ బొంజుబాబు, ఎంపీటీసీ సభ్యులు పోయిబ కృష్ణారావు, కాతారి సురేష్‌కుమార్, ఆర్ఐ వెంకటరమణ, వీఆర్వో కొండపడాల్, దడియా రాంబాబు, దారెల సర్పంచ్ టి. తిలోత్తమ తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.