మనం ఏపాటి!
సూర్యుని పరిమాణం భూమి కన్నా వేల రెట్లు పెద్దది. ఇంకా చెప్పాలంటే పదమూడు లక్షల భూగోళాలు ఇమిడిపోయేంత పెద్దది సూర్యగోళం. భూగోళానికి అతి సమీపంలో ఉన్న నక్షత్రమే సూర్యుడు. సూర్యునికన్నా పెద్ద నక్షత్రాలు విశ్వంలో కోటానుకోట్లు ఉన్నాయి. అందుకే ఈ విశ్వం ఎత్తుగానీ, లోతుగానీ, వెడల్పు గానీ అంచనా వేయలేం. 360 డిగ్రీలలో ఎటువైపు చూసినా విశ్వం ముందుకు సాగుతూనే ఉంటుంది. అన్ని కోణాలలో విశ్వం ఒకే రీతిగా, అనంతంగా పయనిస్తూనే ఉంటుంది. కాబట్టే కీర్తనకారుడు అంటాడు: ‘‘దేవా, నువ్వు కలుగజేసిన చంద్ర నక్షత్రాలను చూస్తుంటే, నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకోడానికి వాడే పాటి వాడు?’’ అని. మనం జీవితకాలమంతా ప్రయాణించినా దగ్గర్లోని ఒక నక్షత్రాన్ని కూడా చేరలేం. ఇటీవల ‘నాసా’ వారు చేసిన పరిశోధనల్లో ఒక విషయం వెలుగులోకి వచ్చింది.
అంతరిక్షంలో ‘తార్కికంగా ఆలోచించే మేఘాలు’ ఉన్నాయట! మేఘం అంటే సాధారణ భూవాతావరణంలో వర్షించే మేఘం కాదు. కొన్ని లక్షల నెబ్యూలాలు (నక్షత్ర సమూహాలు), వాటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని.. అంటే గుంపుగా కనిపించే ఓ మహా నక్షత్ర సముదాయాన్ని ఖగోళ శాస్త్రంలో మేఘం అని అంటారు. మరి తార్కికంగా ఆలోచించే మేఘాలు అంటే? జీవం కలిగిన ఓ మహాశక్తి విశ్వంలో ఉన్నదని అంతరార్థం. అలా పరోక్షంగా దేవుని ఉనికిని ధృవీకరించారు ఖగోళ శాస్త్రజ్ఞులు. కనుక మనం ఏ మతస్తులమైనా, దేవుడు ఒక్కడేనన్న సత్యాన్ని గ్రహించాలి. ఆ మహాశక్తిమంతుడైన దేవుడిని మనసారా ఆరాధించి, ఆయన పట్ల భయభక్తులతో, చెడు మార్గాన్ని, తలంపులను విసర్జించి, సన్మార్గంలో పయనించాలి.
- యస్.విజయ భాస్కర్