పాక్ లో వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్నారు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో సూర్యప్రతాపానికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అక్కడి వడదెబ్బ మృతుల సంఖ్య 1200 కు చేరిందని కరాచీలో అధికారులు బుధవారం వెల్లడించారు. సింధూ దక్షిణ ప్రాంతంలో భానుడి భగభగలకు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలు తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి ఆస్పత్రులు వడదెబ్బ బాధితులతో నిండిపోయాయని డాక్టర్లు చెబుతున్నారు. కేవలం కరాచీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 1000 మంది మృతిచెందారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.
మంగళవారం ఒక్కరోజే 350 మందికి పైగా మృతిచెందారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ వడదెబ్బ నేపథ్యంలో ఎమర్జన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. కరాచీలోని జిన్నత్ పీజీ వైద్య కళాశాలలోనే 4000 మందికి పైగా బాధితులకు చికిత్స అందించినట్లు ఎమర్జన్సీ ఇన్ ఛార్జీ సిమి జమాలి తెలిపారు.