లక్షన్నర శివలింగాలు
బ్రహ్మ మురారి సురార్చిత లింగం..
పుట్టమన్నుతో లక్షన్నర శివలింగాలు
మహా శివరాత్రి సందర్భంగా సోమవారం తుమకూరులోని కన్యకా పరమేశ్వరి మహిళా సంఘం సభ్యులు ఇక్కడి శంకర మఠంలో పుట్టమన్నుతో తయారు చేసిన లక్షా 50 వేల శివలింగాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఇంత మొత్తంలో శివలింగాలను తయారు చేయడానికి మూడు నెలలు సమయం పట్టిందని మహిళా సంఘం సభ్యులు తెలిపారు.
మహా శివరాత్రి పర్వదినాన రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ ‘హర’ నామ స్మరణతో మారుమోగాయి. శివరాత్రి పర్వదినాన నీలకంఠున్ని దర్శించుకునేందుకు సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాల వద్ద బారులు తీరారు. కోలారులోని కోటి లింగేశ్వర, ధర్మస్థలలోని మంజునాథేశ్వర, యడియూరులోని సిద్ధలింగేశ్వర, శివగంగలోని గవి గంగాధరేశ్వర, నంజనగూడులోని నంజుండేశ్వర, మురుడేశ్వర, గోకర్ణతో సహా అన్ని దేవాలయాల్లోను సోమవారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.