Sri Sathya Sai District Latest News
-
భద్రత కట్టుదిట్టం
పుట్టపర్తి టౌన్: సత్యసాయి జయంత్యుత్సవాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొననున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. శుక్రవారం ఆమె స్థానిక సాయిఆరామంలో బందోబస్తు విధుల్లో ఉంటున్న సిబ్బందితో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆరుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 48 మంది ఎస్ఐలు, 171 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 300 మంది కానిస్టేబుళ్లు, 26 మంది మహిళా పోలీసులు, 170 హోంగార్డులతోపాటు స్పెషల్ పార్టీ సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి లోపాలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. జయంత్యుత్సవాల్లో పాల్గొనే వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వర్తించాలన్నారు. పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. అందరూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించి వేడుకలను ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీలు విజయకుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఎస్ఐ ప్రదీప్‌కుమార్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్ఆర్బీ అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: ఆర్ఆర్బీ (రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24, 25, 26, 27వ తేదీల్లో హుబ్లీ–కర్నూలు సిటీ (07315) మధ్య నడిచే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు హుబ్లీ జంక్షన్ నుంచి రాత్రి 8.15 గంటలకు బయలుదేరి కర్నూలు రైల్వేస్టేషన్‌కు మరుసటి రోజు ఉదయం 6.00 గంటలకు చేరుతుందని పేర్కొన్నారు. తిరిగి ఈ నెల 25, 26, 27, 28వ తేదీల్లో ఈ రైలు కర్నూలు రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 7.30 గంటలకు బయలుదేరి హుబ్లీ జంక్షన్‌కు సాయంత్రం 4,15 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ రైలు గదగ్, కొప్పల్, హాస్పేట్, తోర్నగల్, బళ్లారి, గుంతకల్లు, డోన్ మీదుగా రాకపోకలు సాగిస్తుందని వివరించారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందుబాటులోకి మెగా సప్లి హాల్‌టికెట్లు అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ మెగా సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఈ నెల 23 నుంచి జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ మూడు, ఐదు, ఏడు సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మెగా సప్లిమెంటరీకి సంబంధించి మూడు, ఐదు సెమిస్టర్ అభ్యర్థులకు రెగ్యులర్ వారితో పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. మృత్యువులోనూ వీడని బంధం ముదిగుబ్బ: పెళ్లిలో ఏడడుగులు వేసినప్పటి నుంచి ఒకరికొకరు తోడుగా ఉంటూ బతుకు బండిని లాగుతూ వచ్చారు. రక్తసంబంధీకులు ఉన్నా.. ఎవరిపైనా ఆధారపడకుండా సొంత కష్టంతోనే జీవనం సాగిస్తున్నారు. అలా సాగిపోతున్న వారి దాంపత్య జీవితంలోకి మలిదశలో మృత్యువు తొంగిచూసింది. గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. వివరాలు... ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లికి చెందిన గంగన్న (80), నరసమ్మ (74) దంపతులు శుక్రవారం రాత్రి ముదిగుబ్బ నుంచి స్వగ్రామానికి ఆటోలో చేరుకున్నారు. రోడ్డుకు అటు వైపు దిగిన వారు గ్రామంలోకి వెళ్లేందుకు రహదారిని దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొంది. ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. కాగా, వృద్ధ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పట్నం ఎస్ఐ రాజశేఖర్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు అరికట్టండి
పుట్టపర్తి టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, మహిళలని కూడా చూడకుండా టీడీపీ నాయకులు దాష్టీకాలకు తెగబడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఎస్పీ రత్నను కోరారు. శుక్రవారం ఆయన బాధితులతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ రత్నను చాంబర్లో కలిసి వినతి పత్రం సమర్పించారు. రౌడీషీటర్, టీడీపీ హిందూపురం పార్లమెంట్ అఽధికార ప్రతినిధి సాలక్క గారి శ్రీనివాసులు కొత్తచెరువులో చెలరేగిపోతున్నాడన్నారు. భూ ఆక్రమణలతో సామాన్యులపై దౌర్జన్యం చేస్తున్నాడన్నారు. ఎవరైనా ప్రశ్నించినా, ఎదురు తిరిగినా దాడులకు తెగబడుతున్నాడన్నారు. అలాగే కొందరు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైఎస్సార్ సీపీ నేతలను అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టులు పెడుతున్నారని, వారందరిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కొత్తచెరువులో టీడీపీ నాయకుడు సాలక్కగారి శ్రీనివాసులు, మరికొంతమంది టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారన్నారు. ఇళ్లలోకి ప్రవేశించి మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని శ్రీధర్‌రెడ్డి తెలిపారు. పోలీసులకు అన్నీ తెలిసినా తెలియనట్టు ఉండిపోయారన్నారు. అసెంబ్లీలో మాత్రం గొప్పలు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత తమ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం చేస్తున్నామని అసెంబ్లీలో ఊదరగొడుతుండగా, క్షేత్ర స్థాయిలో మాత్రం కూటమి పార్టీల నాయకులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారన్నారు. ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్‌లోని ఒక స్థలం వివాదం ప్రస్తుతం కోర్టులో ఉందని, అయినా అధికార పార్టీ అండతో రామచంద్ర, వీరయ్య ఇంటి నిర్మాణం చేపడుతున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో పుట్టపర్తి నియోజవర్గంలో హింసాత్మక ఘటనలు, దౌర్జన్యాలు జరగలేదని, ఇప్పుడు మాత్రం అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దాడులను ప్రోత్సహిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరామన్నారు. దుద్ద్దుకుంట శ్రీధర్‌రెడ్డి వెంట మన్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, వైస్ చైర్మన్ తిప్పన్న, ఓడీచెరువు జెడ్పీటీసీ దామోదర్‌రెడ్డి, శ్యామ్ సుందర్‌రెడ్డి, గంగాద్రి, నరసారెడ్డితో పాటు బాధితులు ఉన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులకు అడ్డుకట్ట వేయాలి రౌడీషీటర్ సాలక్కగారి శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలి ఎస్పీ రత్నను కోరిన మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి -
నేడు సత్యసాయి జయంతి
● ఏర్పాట్లు పూర్తి చేసిన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ● సర్వాంగసుందరంగా ముస్తాబైన ప్రశాంతి నిలయం ● ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశాంతి నిలయం: ప్రేమ మూర్తిగా.. సేవా స్ఫూర్తిగా.. ఆధ్యాత్మిక చైతన్య దీప్తిగా భక్తుల మదిలో కొలువైన సత్యసాయి 99వ జయంతి వేడుకలకు ప్రశాంతి నిలయం ముస్తాబైంది. శనివారం సాయికుల్వంత్ సభా మందిరంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. సత్యసాయి సమాధిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. సాయికుల్వంత్ సభా మందిరాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ్చేస్తున్నారు. జయంతి వేడుకలు ఇలా ... సత్యసాయి 99వ జయంతి వేడుకలు సాయికుల్వంత్ సభా మందిరంలో శనివారం ఉదయం 8 గంటలకు వేదపఠనంతో ప్రారంభమవుతాయి. 8.20 గంటలకు సత్యసాయి విద్యార్థులు గురువందనం కార్యక్రమం ఉంటుంది. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానంద ట్రస్ట్ వార్షిక నివేదికను వెల్లడిస్తారు. సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ నిమిష్ పాండ్య ప్రసంగిస్తారు. ఆ తర్వాత ముఖ్య అతిథి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ భక్తులనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ దివ్యాంగుల సేవ కోసం చేపట్టిన సత్యసాయి దివ్యాంగ్జన్ పథకం ద్వారా వికలాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేస్తారు. సత్యసాయి ‘ప్రేమతరు’ పేరుతో 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహణ ఉంటుంది. అలాగే సత్యసాయి పూర్వపు ప్రసంగాన్ని డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు. సాయంత్రం స్వర్ణ రథోత్సవం సాయంత్రం 5 గంటలకు ప్రశాంతి నిలయం పురవీధుల్లో సత్యసాయి బంగారు రథం ఊరేగింపు, సాయికుల్వంత్ సభా మందిరంలో జోలోత్సవం నిర్వహిస్తారు. అనంతరం లాల్ గుడి కృష్ణ, లాల్ గుడి విజయలక్ష్మి దంపతుల వయోలిన్ కచేరీ ఉంటుంది. ఆ తర్వాత మహా మంగళ హారతితో వేడుకలు ముగుస్తాయి. గవర్నర్‌కు ఘన స్వాగతం సత్యసాయి 99వ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం రాత్రి పుట్టపర్తి చేరుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయంలోని సాయి శ్రీనివాస అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు కలెక్టర్ టీఎస్ చేతన్, జేసీ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న ఘన స్వాగతం పలికారు. శనివారం సాయికుల్వంత్ సభా మందిరంలో జరిగే సత్యసాయి జయంత్యుత్సవాల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. -
నిందలు వేయకండి
పెనుకొండ రూరల్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీని అమలు చేయకపోయినా పర్వాలేదు కానీ, ప్రజలపై నిందలు వేయడం సరికాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శాసన మండలిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో డీబీటీల ద్వారా సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన ప్రజలు గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు అలువాటు పడ్డారంటూ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. పార్టీలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్ సీపీదేనని అన్నారు, అమ్మఒడి, చేయూత, మహిళా సంఘాల ద్వారా లబ్ది పొందిన మహిళలు, వసతి దీవెన, విద్యా దీవెన పథకాల లబ్ధి చేకూరిన విద్యార్థులు, కులవృత్తులపై ఆధారపడిన వారికి, వృత్తిలో స్థిరపడాలనుకున్న న్యాయవాదులకు పారదర్శకంగా సంక్షేమ ఫలాలను అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేశారన్నారు. మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు అప్పటి సంక్షేమ ఫలాల లబ్ధి పొందిన వారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. మద్యానికి ప్రజలను బానిసలను చేసే నైజం టీడీపీకే చెల్లుతుందన్నారు. ఇందుకు సోమందేపల్లిలో మంత్రి సవిత భర్త స్వయంగా మద్యం షాపులను ప్రారంభించిన అంశాలే అద్దం పడుతున్నాయన్నారు. గంజాయి, మద్యం పేరుతో రైతులు, విద్యార్థులే మహిళలు, వృద్ధులు, న్యాయవాదులను అవమానించే రీతిలో మాట్లాడి బీసీల పింఛన్లపై స్పష్టత ఇవ్వకుండా దాట వేయడం బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా ఉన్న సవితకే చెల్లుబాటవుతుందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వకపోయిన పర్వాలేదు కానీ, ప్రజలను ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి బేషరత్తుగా వారందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ -
ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
గుంతకల్లు రూరల్: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. వివరాలు... గుంతకల్లు మండలం నెలగొండ గ్రామానికి చెందిన గోవిందు, శకుంతల దంపతులకు కుమారుడు చరణ్ (14), ఓ కుమార్తె ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో 9వ తరగతి చదువుతున్న చరణ్... శుక్రవారం తన స్నేహితులు ఈతకు వెళుతున్నారన్న విషయం తెలుసుకుని బడి ఎగ్గొట్టి వారితో పాటు సైకిల్‌పై గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్‌డ్యాం వద్దకు వెళ్లాడు. ఈత కొట్టేందుకు సిద్ధమవుతుండగా అక్కడే ఉన్న సమీప బంధువులైన గొర్రెల కాపరులు వారించారు. అయినా తనకు ఈత వస్తుందని బుకాయించాడు. వద్దని వాళ్లు గట్టిగా చెప్పడంతో చేసేదేమీ లేక చెక్‌డ్యాం వద్ద కూర్చొని కాళ్లు నీళ్లలో పెట్టి ఆడుకుంటూ కూర్చొన్నాడు. ఈ క్రమంలో బంధువుల దృష్టి ఏమార్చి నీళ్లలోకి దిగిన చరణ్ కాసేపు ఈత కొడుతూ లోతైన ప్రాంతానికి వెళ్లి నీట మునిగాడు. మిగిలిన పిల్లలు కేకలు వేయడంతో గొర్రెల కాపరులు నీటిలో దిగి గాలింపు చేపట్టినా చరణ్ జాడను పసిగట్టలేకపోయారు. దీంతో చుట్టుపక్కల పొలాల్లో పనుల్లో నిమగ్నమైన రైతుల సాయం తీసుకుని మరోసారి చెక్‌డ్యాంలోకి దిగి దాదాపు గంటన్నర సేపు గాలించిన అనంతరం చరణ్ మృతదేహాన్ని వెలికి తీశారు. అప్పటికే విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు భారీగా అక్కడకు చేరుకున్నారు. చరణ్ ప్రాణాలతో ఉన్నాడనే అనుమానంతో కుటుంబసభ్యులు గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెక్‌డ్యామ్‌లో నీట మునిగి విద్యార్థి మృతి -
అప్పులు తీర్చే మార్గం కానరాక రైతు ఆత్మహత్య
ఉరవకొండ: అప్పులు తీర్చే మార్గం కానరాక ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామానికి చెందిన రైతు వెంకటేష్ (51) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... తనకున్న 8 ఎకరాల పొలంలో గత రెండేళ్లుగా మిరప, వేరుశనగ, పప్పుశనగ తదితర పంటలను రైతు వెంకటేష్ సాగు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పంటల సాగుకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశాడు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టాలు చవిచూడడంతో అప్పులు తీర్చలేకపోయాడు. దీంతో ఎలాగైనా రుణ విముక్తి పొందాలనుకున్న ఆయన... మరి కొంత అప్పు చేసి గొర్రెల పోషణ చేపట్టాడు. అయితే అనారోగ్యం కారణంగా 20 గొర్రెలు మృతి చెందాయి. పంటల సాగు, గొర్రెల పోషణకు చేసిన అప్పులు రూ.10 లక్షలకు చేరుకోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ కుటుంబసభ్యులతో చెప్పుకుని గురువారం బాధపడ్డాడు. అనంతరం అదే రోజు రాత్రి పొలం వద్ద ఉన్న జీవాల దొడ్డిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భోజనం తీసుకుని వెళ్లిన కుటుంబసభ్యులు గమనించి వెంటనే వెంకటేష్‌ను ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. కాగా, వెంకటేష్‌కు భార్య గంగమ్మ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పత్తి నిల్వలు దగ్ధం
గుడిబండ: మల్బరీ షెడ్డులో నిల్వ చేసిన పత్తి దిగుబడులు ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. గుడిబండ మండలం తాళికెరలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సురేంద్ర తనకున్న రెండు ఎకరాల పొలంలో పత్తి పంటను సాగు చేశాడు. మార్కెట్లో ధర పెరిగిన తర్వాత పత్తిని విక్రయించాలనుకున్న ఆయన... తన పొలంలోనే నిర్మించిన మల్బరీ షెడ్డులో పత్తి నిల్వలను భద్రపరిచాడు. శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుని మంటలు చెలరేగడంతో పత్తితో పాటు మల్బరీ షెడ్డు కాలిపోయింది. దీంతో రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ కళ్యాణ్‌చక్రవర్తి, సెరికల్చర్ ఏడీ రాజు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పశువుల తరలింపును అడ్డుకున్న గో రక్షణ సమితి నల్లచెరువు: తెలంగాణా నుంచి కేరళకు అక్రమంగా తరలిస్తున్న 29 పశువులను శుక్రవారం నల్లచెరువు సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద తమిళనాడు గో రక్షణ సమితి సభ్యుడు ఆర్.రఘురాం శర్మ అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ మక్బూల్‌బాషా తెలిపిన మేరకు... ఐచర్ వాహనంలో పశువులను తరలిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన రఘురాంశర్మ నల్లచెరువు వద్ద అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఐచర్ వాహనాన్ని స్వాధీనం చేసుకొని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవులను అన్నమయ్య జిల్లా తంబాళ్లపల్లి గ్రామం వద్ద ఉన్న నవశక్తి పీఠం గోశాలకు తరలించారు. నేటి నుంచి కొనకొండ్లలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు వజ్రకరూరు: రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్ 17 బాలుర సాఫ్ట్‌బాల్ పోటీలకు వజ్రకరూరులోని జెడ్పీహెచ్ఎస్ సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు హెచ్ఎం వేణుగోపాల్, పీఈటీలు సత్యనారాయణ, కళాసుధాకర్ వెల్లడించారు. పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం వారు పరిశీలించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు హాజరు కానున్నారు. -
అలరించిన ‘తత్ త్వం అసి’
ప్రశాంతి నిలయం: సత్యసాయి 99వ జయంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 43 స్నాతకోవ్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల సందర్భంగా సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు స్నాతకోత్సవ నాటికను ప్రదర్శించారు. ‘తత్ త్వం అసి’ పేరుతో ప్రదర్శించిన రూపకం భక్తులను ఆలోచింపజేసింది. మానవుడు స్వార్థం, కోపం, అసూయ వంటి దుర్గుణాలను వీడినప్పుడే జీవితంలో సంపూర్ణ ఆనందాన్ని పొందుతాడంటూ సందేశాన్నిస్తూ సత్యసాయి బోధనలు చక్కగా వివరించారు. -
వ్యక్తి ఆత్మహత్య
చెన్నేకొత్తపల్లి: రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు... సీకేపల్లి మండలం దామాజిపల్లి – యర్రంపల్లి గ్రామాల మధ్య రైలు పట్టాలపై శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన కీమ్యాన్ సమాచారంతో హిందూపురం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం సమీపంలో పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లో లభించిన ఆధార్‌కార్డు ఆధారంగా మృతుడిని రామగిరి మండలం పోలేపల్లికి చెందిన చాకలి మురళి (32)గా గుర్తించారు. మృతునికి భార్య అంబిక, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బనానా రైలు ప్రారంభం తాడిపత్రి రూరల్: అరటి ఎగుమతులకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక గూడ్స్ రైలును (బనానా రైలు) తాడిపత్రి రైల్వే స్టేషన్లో శుక్రవారం కలెక్టర్ వినోద్‌కుమార్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, తదితరులు జెండా ఊపి రైలును ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా వ్యవసాయ, మార్కెటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, హర్టీకల్చర్ అండ్ సెరికల్చర్ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఏపీఈడీఏ జీఎం వినీత సుధాన్షు, కంటైనర్ కార్పొరేషన్ సీనియర్ జనరల్ మేనేజర్ అనిత బారిక్, జాయింట్ కలెక్టర్ శివనారాయణశర్మ, శ్రీకృష్ణ ఇంపెక్స్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అనీష్అగర్వాల్, ఆర్డీఓ కేశవనాయుడు, హర్టీకల్చర్ డీడీ నరసింహారావు, ఎపీఎంఐపీ డీడీ రఘునాథరెడ్డి, ఏడీ ఫిరోజ్‌ఖాన్, రైల్వే స్టేషన్ మాస్టర్ అనిల్‌కుమార్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ అనూప్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. -
వీఆర్ఏ జిల్లా అధ్యక్షుడిగా గంగాధర్
పుట్టపర్తి అర్బన్ : వీఆర్ఏల జిల్లా అధక్ష్యుడిగా గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఏపీజేఏసీ అధ్యక్షుడు మధునాయక్, ప్రధాన కార్యదర్శి మైనుద్దీన్ తెలిపారు. శుక్రవారం పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏల నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో ఎన్నికలను ఏకగ్రీవం చేశారు. అధ్యక్షుడిగా ఎ.గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా వినోద్‌కుమార్, సహ అధ్యక్షుడిగా కాంతరాజు, ఉపాధ్యక్షులుగా సుబ్రమణ్యం, ఆంజనేయులు, మారుతీప్రసాద్, కేశవప్రసాద్, నరసింహులు, ట్రెజరర్‌గా సుదర్శనరెడ్డి, జాయింట్ సెక్రెటరీగా అశ్వని, రెడ్డెప్ప, మణిపద్మ, రమణ, చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులుగా మల్లికార్జునరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, చిన్నాగప్ప, ఆంజనేయులు, ప్రభావతి, పోతులయ్య, బాబు, పాపయ్యను ఎంపిక చేశారు. ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. విద్యార్థి దుర్మరణం పెనుకొండ: ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని ఇస్లాపురం గ్రామానికి చెందిన వడ్డె నాగరాజు కుమారుడు అఖిల్ (13) పెనుకొండలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. రోజూ సైకిల్‌పై స్కూల్‌కు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్కూల్‌కు సైకిల్‌పై బయలుదేరిన అఖిల్ గ్రామ శివారులోని చెరువు కట్ట వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్‌కు దారి వదిలేందుకు రోడ్డు పక్కన ఆపిన ఘనగిరి పాఠశాల బస్సు వెనుక నిలబడ్డాడు. ట్రాక్టర్ వెళ్లడానికి దారి లేకపోవడంతో బస్సు డ్రైవర్ ఉన్నఫళంగా తన వాహనాన్ని వేగంగా రివర్స్ చేశాడు. సైకిల్‌పై నిల్చొన్న అఖిల్ ప్రమాదాన్ని గుర్తించేలోపు బస్సు వెనుక చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడున్న గ్రామస్తులు వెంటనే బాలుడిని పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అఖిల్ మృతి చెందినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా పోయింది. ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఎస్ఐ వెంకటేశ్వరు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
విలువల విద్యాలయం
ప్రశాంతి నిలయం: ప్రాచీన గురుకులు విద్యా విధానానికి మెరుగులు దిద్ది నేటి సమాజ అవసరాలకు అనుగుణంగా మానవతా విలువలు, భారతీయ సంస్కృతిని కలగలిపి తాను నెలకొల్పిన విద్యా సంస్థల ద్వారా చక్కటి విద్యాబోధనకు శ్రీకారం చుట్టారు సత్యసాయి. 1981 సంవత్సరంలో సత్యసాయి చాన్సలర్ హోదాలో సత్యసాయి యూనివర్సిటీని స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తోంది సత్యసాయి డీమ్డ్ టు బి యూనివర్సిటీ. 1986 శాశ్వత సభ్యత్వం సత్యసాయి యూనివర్సిటీకి 1986లోనే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్లో శాశ్వత సభ్యత్వం లభించింది. సత్యసాయి విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఙానంతో కూడిన పాఠాలతో పాటు మానవతా విలువలు, భారతీయ సనాతన సంస్కృతిపై అవగాహన పెంపొందేలా విద్యను బోధిస్తున్నారు. సత్యసాయి డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా క్యాంపస్‌లను నిర్వహిస్తోంది. ప్రశాంతి నిలయం క్యాంపస్‌తో పాటు అనంతపురంలో మహిళా క్యాంపస్ ఉంది. అలాగే ముద్దనహళ్లి, బృందావన్ క్యాంపస్‌లు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. ఈ క్యాంపస్‌ల ద్వారా ఏడు విభాగాల్లో అండర్ గ్యాడ్యుయేషన్ (యూజీ), ఐదు విభాగాలలో పోస్ట్ గ్రాడ్యూయేషన్ (పీజీ), మూడు ప్రొఫెషనల్ కోర్సులు నిర్వహిస్తున్నారు. దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణలతో నడుపుతున్న యూనివర్సిటీగా కొనసాగుతున్న సత్యసాయి యూనివర్సిటీకి 2002లో నేషనల్ అసోసియేషన్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) ఏ++ గ్రేడును కేటాయిస్తూ జాతీయస్థాయి అత్యున్నత విద్యాసంస్థగా గుర్తించింది. ఆ తర్వాత 2008లో సత్యసాయి డీమ్డ్ టు బి యూనివర్సిటీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. సత్యసాయి విద్యాసంస్థల ద్వారా పరిశోధనా రంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పరిశోధనా కేంద్రాన్ని స్థాపించారు. దేశంలోని అత్యున్నత వేదికలపై సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు అన్ని రంగాల్లో సత్తాచాటుతున్నారు. దేశ వ్యాప్తంగా సత్యసాయి యూనివర్సిటీకి అనుబంధంగా 99 విద్యాసంస్థలు పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నాయి. స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి సత్యసాయి 99వ జయంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో సత్యసాయి యూనివర్సిటీ 43వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 9:50 గంటలకు స్నాతకోత్సవ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 10.03 నిమిషాలకు సత్యసాయి విద్యార్థుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమవుతాయి. 10.06 నిమిషాలకు ఫౌండర్ చాన్సలర్ సత్యసాయి డిజిటల్ స్క్రీన్ ద్వారా స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తారు. 10.08కి వైస్ చాన్సలర్ ప్రారంభోపన్యాసం చేస్తారు. 10.32 గంటలకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తారు. 10.35కు ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్‌డీలు, పట్టాలను ముఖ్య అతిథి చేతులు మీదుగా పంపిణీ చేస్తారు. తర్వాత విద్యార్థులనుద్దేశించి స్నాతకోత్సవ సందేశాన్నిస్తారు. సత్యసాయి పూర్వపు ప్రసంగాలను డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు. 11.54 గంటలకు చాన్సలర్ స్నాతకోత్సవాన్ని ముగిస్తారు. సత్యసాయి విద్యాసంస్థల్లోని వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన 22 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 14 మందికి పరిశోధనా విద్యార్థులకు డాక్టరేట్లు, 480 మందికి పట్టాలను ముఖ్య అతిథి చేతుల మీదుగా పంపిణీ చేస్తారు. వేడుకలకు ముఖ్య అతిథి యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ సేతురామన్ పంచనాథన్ హాజరు కానున్నారు. ఆదర్శంగా నిలిచిన సత్యసాయి విద్యాసంస్థలు నేడు సత్యసాయి డీమ్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవం 22 మందికి బంగారు పతకాలు 14 మందికి డాక్టరేట్లు, 480 మందికి పట్టాల పంపిణీ -
No Headline
ధర్మవరానికి చెందిన 3వ తరగతి విద్యార్థి 46 కిలోల బరువు ఉన్నాడు. జంక్‌ఫుడ్ అతిగా తినడంతోనే బరువెక్కినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మిగతా విద్యార్థులతో సమానంగా క్రీడల్లో పాల్గొనలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊబకాయం కారణంగా చలాకీతనం కోల్పోయాడని అంటున్నారు. రెండు వారాల క్రితం తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థి బస్సులో ప్రయాణిస్తూ.. పుట్టపర్తి దాటిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. తోటి ప్రయాణికులు సాయం చేసి.. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు నిర్ధారించారు. ఊబకాయమే సమస్యకు కారణమని వైద్యులు తేల్చారు. బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నారంటారు. కానీ అధిక భారం అలాగే కొనసాగితే వారికి వారే భారం కావడం ఖాయం. అంతేకాదు పలు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదమూ ఉంది. జీవనశైలిలో మార్పుల కారణంగా భవిష్యత్తులో ఊబకాయుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాక్షి, పుట్టపర్తి: ఊబకాయం.. ప్రతి వందలో 20 మందిని తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్య. శారీరక వ్యాయామం తగ్గటం, ఆహార నియమాలు పాటించకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి విధానంతో ఇప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఊబకాయులుగా మారుస్తోంది. బాల్యంలోనే ఊబకాయం వస్తే చలాకీతనం కోల్పోతారు. చిన్న వయసులోనే అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. శారీరకంగా అనేక ఇబ్బందులు పడుతారు. వయసుకు తగిన బరువు ఉంటే చాలని.. అధిక బరువు అనర్థాలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయల్లో సమస్యలు ఇవే.. ● ఊబకాయం ఉన్న పిల్లలు సహచరుల నుంచి తరచూ అవహేళనకు గురవుతారు. ఫలితంగా మానసికంగా డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. ● ఊబకాయం ఉన్న పిల్లలు చలాకీతనం కోల్పోవడం కారణంగా క్రీడల్లో రాణించలేరు. కనీసం అవకాశాలు రావడం కూడా కష్టమే. ● అందరితో పాటు వ్యాయామం చేయాలనుకున్నప్పటికీ.. కాసేపటికే అలసిపోతారు. శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతారు. ● మానసిక ఒత్తిడి కారణంగా చదువులో వెనుకబడే అవకాశం ఉంది. విద్యలో ఉన్నత స్థానాలకు వెళ్లడం కష్టమే. ● టీనేజీలోకి వచ్చేసరికి మరింత డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఫలితంగా అందరిలో కలవకుండా ఒక్కరే ఉండేందుకు ఇష్టపడతారు. ● ప్రీ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ చిన్న వయసులోనే దరి చేరుతాయి. ఫలితంగా జీవితాంతం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన పరిస్థితి. ● ఊబకాయం కారణంగా స్కిన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా సోకే ప్రమాదం ఉంది. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు లోపిస్తున్న మానసిక ఎదుగుదల బాల్యంలోనే బీపీ, షుగర్ ముప్పు విద్యలోనూ రాణించలేక ఇబ్బందులు వ్యాయామం తప్పనిసరి ఊబకాయం ఉన్న వారిలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండవు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారంలో రెండు , మూడుసార్లు జంక్‌ఫుడ్ తింటే ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారం తినడమూ కారణంగా చెప్పవచ్చు. పిల్లల బరువు పెరుగుతున్నట్లు గుర్తిస్తే తల్లిదండ్రులు వారిని క్రమం తప్పకుండా వాకింగ్‌కు తీసుకెళ్లాలి. జంక్ ఫుడ్ బదులు ఆరోగ్యకర ఆహారం తీసుకునేలా చేయాలి. – డాక్టర్ ప్రతాప్, హిందూపురం జీవనశైలి మార్పులతో.. జంక్ ఫుడ్ బదులు ప్రత్యామ్నాయం ఆలోచించాలి. నిత్యం వ్యాయామం చేయలేని వారు ఇతర మార్గాల్లో శారీరక బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అవతలి వ్యక్తి అవహేళన చేసినప్పుడు డిప్రెషన్‌కు లోను కాకూడదు. పిల్లల బరువు తగ్గే విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం. జీవన శైలిలో మార్పులతో ఊబకాయం నుంచి బయట పడవచ్చు. – డాక్టర్ రాజశేఖర్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ -
వర్ధమాన క్రీడాకారుడి దుర్మరణం
పావగడ: కారు పల్లంలోకి పల్టీలు కొట్టిన ఘటనలో ఓ వర్ధమాన క్రీడాకారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... పావగడ తాలూకా వెంకటాపురం గ్రామానికి చెందిన నవీన్‌బాబు (22) రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టులో కీలక క్రీడాకారుడిగా ఖ్యాతిగాంచాడు. శిర తాలూకా లోని బుక్కపట్న గ్రామంలో తన స్నేహితుడి ఇంట బుధవారం సాయంత్రం జరిగిన ఓ విందుకు ఐదుగురు స్నేహితులతో కలసి నవీన్‌బాబు హాజరయ్యాడు. రాత్రి కారులో తిరుగు ప్రయాణమైన వారు జాతీయ రహదారిపై ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన లారీని తప్పించబోయి అదుపు తప్పి మోరీని ఢీకొన్నారు. ఘటనలో కారు పల్టీలు కొడుతూ పల్లంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో వెనుక తలుపు డోర్ విరిగి పోవడంతో పక్కనే కూర్చొన్న నవీన్‌బాబు బయటపడడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తుమకూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం నవీన్‌బాబు మృతదేహాన్ని గురువరం స్వగ్రామానికి చేర్చారు. ఒక్కగానొక్క కుమారుడి ఆకస్మిక మృతిని తట్టుకోలేక తల్లితండ్రులు ప్రకాష్, సుజాతమ్మ గుండెలవిసేలా రోదించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వెంకటేష్, గ్రామస్తులు... నవీన్‌బాబు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
డ్రోన్ కెమెరాలతో నేరాలు నియంత్రిస్తాం
పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులకు డ్రోన్లు ఎలా వినియోగించాలి? అన్న అంశాలను వివరించి అనంతరం పరేడ్ మైదానంలో సిబ్బంది కలిసి డ్రోన్ల ఆపరేటింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చైన్ స్నాచింగ్స్, ఈవ్‌టీజింగ్, రహదారి ప్రమాదాలు, కోడి పందాలు, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలను ముందుగా గుర్తించి ఆయా ప్రాంతాల్లోకి డ్రోన్ కెమెరాలను పంపి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ, మహిళలపై దాడులు నియంత్రించేందుకు, సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచేందుకు డ్రోన్స్ వినియోగించుకుంటామన్నారు. డ్రోన్స్ ఎలా వినియోగించాలనే అంశాలపై పోలీస్ సిబ్బంది శిక్షణ కూడా ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీలు విజయకుమార్, వెంకటేశ్వర్లు, ఏఆర్ డీఎస్పీ విజయ్‌కుమార్, ఎస్బీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఎస్ఐ ప్రదీప్‌కుమార్, ఆర్ఐలు వలి, మహేష్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ రత్న -
కొనసా..గుతున్న పనులు
పుట్టపర్తి అర్బన్: సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకలకు అవసరమైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 23వ తేదీన జయంతి వేడుకలకు ట్రస్ట్ సభ్యులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నా... పారిశుధ్య పనులు, రోడ్డు నిర్మాణ పనులు, విద్యుత్ పనులు ఇంకా కొనసాగుతుండడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేశ విదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు పుట్టపర్తికి చేరుకున్నారు. మరింత మంది వస్తున్నారు. డబ్బుకు కొదవ లేదని స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ప్రకటించినా సంబంధిత కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ సగం పనులు కూడా పూర్తికాకపోవడంతో భక్తులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బ్రాహ్మణపల్లి రోడ్డు , పెద్ద కమ్మవారిపల్లి రోడ్డు, వెస్ట్ గేట్ రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయలేదు. చిన్న గుంతలను పూడ్చినా పెద్ద గుంతలను అలాగే వదిలేశారని ప్రజలు వాపోతున్నారు. డివైడర్ల మధ్య , ప్రధాన రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించే పనులు ఇంకా పూర్తి కాలేదు. జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు అందుబాటులో ఉన్నా.. పిలిపించుకోకపోవడంతో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని అంటున్నారు. ఇక విద్యుత్ పనులు కూడా పూర్తికాలేదని చెబుతున్నారు. చిత్రావతి నది పరిసరాల్లో కూడా పారిశుధ్య పనులు పూర్తికాకపోవడంతో స్థానికులు పెదవి విరుస్తున్నారు. అలాగే ఎనుములపల్లి ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉన్న శిల్పారామం సమీపంలో ప్రధాన రోడ్డుపైకి మట్టి దిబ్బలు వచ్చినా నేటికీ తొలగించలేదు. ఇన్ని పనులు మరి ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి. రేపే సత్యసాయి బాబా జయంతి వేడుకలు -
ఊబకాయం ఇలా..
● జంక్‌ఫుడ్, బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం, పిజ్జా, బర్గర్, నూడిల్స్ తినడం కారణంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ● జంక్‌ఫుడ్ టేస్ట్ డిఫరెంట్‌గా ఉండటంతో ఎక్కువ మోతాదులో తీసుకుని బరువు పెరుగుతారని వైద్యులు చెబుతున్నారు. ● కదలిక లేని జీవన విధానంతో బరువు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. బిజీ షెడ్యూల్లో చాలామంది నడవడం తగ్గించి వాహనాలను వినియోగిస్తున్నారు. ● టీవీ, సెల్‌ఫోన్ చూస్తూ.. మోతాదుకు మించి భోజనం తినేస్తున్నారు. ఫలితంగా మనిషి సాధారణం కంటే బరువు పెరిగే అవకాశం ఉంది. ● తల్లిదండ్రులు ఊబకాయులైనా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు తేల్చాయి. జన్యుపరమైన కారణాల రీత్యా కూడా ఊబకాయం రావచ్చని అంటున్నారు. -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణతకు కృషి
రామగిరి: పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని డీఈఓ కిష్టప్ప పేర్కొన్నారు. రామగిరి మండలంలోని నసనకోట, కుంటిమద్ది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన వివరాలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పాఠశాలలో బోధనా విధానం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక హిందూపురం టౌన్: రాష్ట్రస్థాయి అండర్–16 త్రోబాల్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. గురువారం పట్టణంలోని ఎంజీఎం క్రీడామైదానంలో జిల్లా అండర్–16 బాల, బాలికల త్రోబాల్ క్రీడాకారుల ఎంపికను జిల్లా త్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి ప్రభుకుమార్ పాల్గొని ఎంపికను పర్యవేక్షించారు. బాలుర విభాగంలో సి.యశ్వర్ధన్, ఎం.దర్శన్, కే.ప్రభాస్ ఈశ్వర్, బాలికల విభాగంలో ఎస్.షిఫా అన్జుమ్, ఎన్.ప్రణీత, కే.భవ్యశ్రీ ఎంపికై నట్లు జిల్లా కార్యదర్శి సురేష్ తెలిపారు. వీరు ఈనెల 24న గుంటూరు జిల్లా తెనాలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎంజీఎం పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం రమణ, పీడీ లోక్‌నాథ్, సీనియర్ క్రీడాకారుడు సలీమ్లు పాల్గొన్నారు. సర్వేను వేగవంతం చేయండి ● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: జిల్లాలో ఎంఎస్ఎంఈల సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధితశాఖ అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగారాజుతో కలసి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మొబైల్ యాప్ ద్వారా ఎంఎస్ఎంఈల వివరాల నమోదు ప్రక్రియపై పలు సూచనలు చేశారు. డివిజన్‌స్థాయిలో ట్రేడ్ యూనియన్లతో సమావేశాలు నిర్వహించి సర్వేపై అవగాహన కల్పించాలన్నారు. పరిశ్రమలశాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సమన్వయంతో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలన్నారు. సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభపుట్టపర్తి అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వేదికగా జరిగిన అండర్–19 స్కూల్ గేమ్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పుట్టపర్తి మండలం ఎనుములపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాణించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన సాయిస్వరూప, హర్షిత, నందిని రాణించి జట్టును ద్వితీయ స్థానంలో నిలిపారు. అలాగే బాలుర విభాగంలో సాయి చంద్ర ఒంటరి పోరు సాగిస్తూ జట్టును నాల్గో స్థానంలో నిలిపేలా చేశాడు. ప్రతిభ చాటిన విద్యార్థులను ఆ పాఠశాల హెచ్ఎం సుధాకర్, పీడీ రమేష్‌బాబు తదితరులు అభినందించారు. -
వర్ధమాన క్రీడాకారుడి దుర్మరణం
పావగడ: కారు పల్లంలోకి పల్టీలు కొట్టిన ఘటనలో ఓ వర్ధమాన క్రీడాకారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... పావగడ తాలూకా వెంకటాపురం గ్రామానికి చెందిన నవీన్‌బాబు (22) రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టులో కీలక క్రీడాకారుడిగా ఖ్యాతిగాంచాడు. శిర తాలూకా లోని బుక్కపట్న గ్రామంలో తన స్నేహితుడి ఇంట బుధవారం సాయంత్రం జరిగిన ఓ విందుకు ఐదుగురు స్నేహితులతో కలసి నవీన్‌బాబు హాజరయ్యాడు. రాత్రి కారులో తిరుగు ప్రయాణమైన వారు జాతీయ రహదారిపై ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన లారీని తప్పించబోయి అదుపు తప్పి మోరీని ఢీకొన్నారు. ఘటనలో కారు పల్టీలు కొడుతూ పల్లంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో వెనుక తలుపు డోర్ విరిగి పోవడంతో పక్కనే కూర్చొన్న నవీన్‌బాబు బయటపడడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తుమకూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం నవీన్‌బాబు మృతదేహాన్ని గురువరం స్వగ్రామానికి చేర్చారు. ఒక్కగానొక్క కుమారుడి ఆకస్మిక మృతిని తట్టుకోలేక తల్లితండ్రులు ప్రకాష్, సుజాతమ్మ గుండెలవిసేలా రోదించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వెంకటేష్, గ్రామస్తులు... నవీన్‌బాబు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఆకట్టుకున్న సంగీత కచేరీ
ప్రశాంతి నిలయం: సత్యసాయి 99వ జయంతి వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం సత్యసాయి మహా సమాధి చెంత సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్‌కు చెందిన యువత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ‘ ఎస్ఎస్ఎస్ఓ – ది రాయల్ పాత్ టూ ట్రాన్స్ఫర్మేషన్’ పేరుతో చక్కటి ప్రదర్శన నిర్వహించారు. మానవతా విలువలు, ఆధ్యాత్మికత, సత్యసాయి బోధనలు అన్న అంశాలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో 5,517 విద్యాసంస్థలకు చెందిన 2,72,300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వ్యాసరచన పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన 20 మంది బాలికలు, ఐదుగురు బాలురకు బంగారు పతకాలు , సర్టిఫికెట్లను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యులు చక్రవర్తి, డాక్టర్ మోహన్, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ నిమిష్ పాండ్యా అందజేశారు. అనంతరం మాల్దోవాకు చెందిన వయోలిన్ పియానో వాయిద్య కళాకారిణులు అలెగ్జాండ్రా, లిడియా ఇచ్చిన ప్రదర్శ అందరినీ మంత్ర ముగ్దులను చేసింది. -
గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రశాంతి నిలయం: సత్యసాయి 99వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ఈ నెల 22న ఆయన పుట్టపర్తికి విచ్చేయనున్నారు. గవర్నర్ పర్యటించే స్థలాలను, ఆయన బస చేసే ప్రాంతాలను కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న గురువారం పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో, సాయి శ్రీనివాస గెస్ట్ హౌస్, ప్రశాంతి నిలయంలో కాన్వాయ్ నిర్వహణ, పుట్టపర్తి పట్టణంలో పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణకు చేట్టాల్సిన చర్యలపై చర్చించారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. షెడ్యూల్ ఇలా.. ఈ నెల 22న గవర్నర్ విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 11 గంటలకు బయలు దేరి బెంగళూరు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 10 గంటలకు కోడికొండ చెక్ పోస్ట్ వద్ద ఉన్న రక్షా అకాడమికి చేరుకుంటారు. అక్కడ కొంత సేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి బయలు దేరి రాత్రి 11 గంటలకు పుట్టపర్తిలోని సాయి శ్రీనివాస గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 23న ఉదయం 9 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకొని సత్యసాయి మహా సమాధిని దర్శించుకుంటారు. తర్వాత జయంతి వేడుకల్లో పాల్గొంటారని కలెక్టర్ చేతన్ తెలిపారు. అనంతరం ఉదయం 11.05 నిమిషాల నుంచి 11.20 వరకూ సాయి శ్రీనివాస అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి రోడ్డు మార్గంలో బయలు దేరి 12.20 నిమిషాలకు రక్షా అకాడమికి చేరుకుంటారు. అక్కడి నుంచి 12.35 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి బెంగళూరు చేరుకుంటారన్నారు. -
ఫలసాయంలో ‘పండు ఈగ’
అనంతపురం అగ్రికల్చర్: ఇటీవల పండ్ల తోటల్లో పండు ఈగ (ఫ్రూట్ ఫ్లై) ప్రధాన సమస్యగా మారిందని, దీని వల్ల రైతులకు నష్టం వాటిల్లుతున్నట్లు నేషనల్ పెస్ట్ సర్వైవలెన్స్ సిస్టమ్ (ఎన్పీఎస్ఎస్) గుర్తించినట్లు జాతీయ మొక్కల యాజమాన్య సంస్థ (ఎన్‌పీహెచ్‌ఎం), అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడా) ప్రతినిధులు తెలిపారు. పండు ఈగ అంశంపై గురువారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఉమ్మడి జిల్లా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి, రెండు జిల్లాల ఉద్యానశాఖ అధికారులు బీఎంవీ నరసింహారావు, జి.చంద్రశేఖర్, టెక్నికల్ హెచ్ఓ పల్లవితో పాటు ఎన్‌పీహెచ్‌ఎం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ప్యాలజ్యోతి, అపెడా బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పెద్దస్వామి తదితరులు పాల్గొన్నారు. గతంలో కేవలం మామిడిలో మాత్రమే కనిపించే పండు ఈగ ఇటీవల వాతావరణ మార్పులు, విచ్చలవిడిగా రసాయన మందులు వాడకం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం లాంటి కారణాలతో జామ, చీనీ, సీతాఫలం, దానిమ్మ లాంటి పండ్డ తోటలతో పాటు బీర లాంటి కూరగాయల పంటలోనూ ఎక్కువగా ఆశించి నష్టం కలుగుజేస్తోందన్నారు. ఈ నష్టంపై రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యాన పంటలు చేతికొచ్చే సమయంలో పండు ఈగ ఆశిస్తే దిగుబడులు తగ్గి రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. దీని నివారణకు పండు ఈగ ఎరలు, మిథైల్ యూజినాల్ ఎరలు ఎకరాకు 6 నుంచి 8 వరకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తోటలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. 1.5 గ్రాముల అసిఫేట్ లేదా 1 గ్రాము డెల్టామైత్రీన్ లేదా పిప్రోనిల్ లాంటి మందుల పిచికారీతో నివారించుకోవాలని సూచించారు. ఎరలు ఏర్పాటు చేసి పురుగు ఉనికి ఉధృతిని బట్టి మేలైన సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. రైతులు జాగ్రత్తలు పాటించకపోతే నష్టాలు అధికం అవగాహన సదస్సులో ఎన్‌పీహెచ్‌ఎం, ‘అపెడా’ ప్రతినిధులు -
గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికుడి మృతి
పరిగి:మండల కేంద్రంలోని ఓ గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్న శివకుమార్(29) గురువారం విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన ఆయన పరిగిలోని ఇండియన్ ఎక్స్‌పోర్టు డిజైన్స్ గార్మెంట్స్ వస్త్ర పరిశ్రమలో దుస్తులను ఇసీ్త్ర చేసే విభాగంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం విధులకు హాజరైన శివకుమార్ వస్త్రాలను ఇసీ్త్ర చేస్తున్న సమయంలో విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే శివకుమార్ మృతి చెందాడంటూ ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. హిందూపురంలోని ప్రభుత్వాసుపత్రిలో శివకుమార్ మృతదేహాన్ని సందర్శించిన అనంతరం ఏఐటీయూసీ, జైభీం భారత్, ఎంఎస్ఎఫ్ నేతలు వినోద్‌కుమార్, ఊటుకూరు నాగరాజు, రవి మాట్లాడారు. మృతుడి కుటుంబసభ్యులకు రూ.20 లక్షల పరిహారాన్ని చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. -
ఏప్రిల్‌లో వైద్య కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు
అనంతపురం మెడికల్: ప్రభుత్వ వైద్య కళాశాల 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2025, ఏప్రిల్ రెండో వారంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించబోతున్నట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డీన్ డాక్టర్ మాణిక్య రావు తెలిపారు. వేడుకల నిర్వహణపై సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కమిటీ సభ్యులతో గురువారం వైద్య కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన సంఘం సభ్యులు సమావేశమై చర్చించారు. డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రముఖులు, క్రీడ, వైద్య ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. మూడ్రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎంబీబీఎస్ విద్య పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులు అందరూ తప్పనిసరిగా పూర్వ విద్యార్థుల సంఘంలో సభ్యత్వం తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సభ్యత్వం కోసం రూ.5వేలను కనీస రుసుముగా నిర్ణయించారు. సమావేశంలో వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షారోన్ సోనియా, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు డాక్టర్ ఆత్మారాం, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ చైతన్య, డాక్టర్ నీలిమ, డాక్టర్ శ్రీహర్ష, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ దుర్గ, డాక్టర్ భీమసేనాచార్, డాక్టర్ వేముల శ్రీనివాసులు, డాక్టర్ శైలజ, డాక్టర్ స్వాతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. ● హవళిగి.. భక్తజన లోగిలివిడపనకల్లు: మండలంలోని హవళిగి గ్రామం గురువారం భక్తజన లోగిలిగా మారింది. కడ్లే గౌరమ్మ రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ప్రత్యేకంగా పూలతో ఎద్దుల బండిపై అలంకరించిన రథంపై కడ్లే గౌరమ్మను ప్రతిమను ఉంచి తెల్లవారుజామున గ్రామంలో ఊరేగించారు. జిల్లాలోని వివిధ మండలాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక నుంచి భక్తులు తరలిరావడంతో వీధులన్నీ జనసంద్రమయ్యాయి. రథోత్సవం ముందు 101 కలశాలతో బాలికలు, మహిళలు హారతులు పట్టారు. వివిధ రకాల వేషధారణలతో కళాకారులు ఆకట్టుకున్నారు. -
జీవాల సంరక్షణ చర్యలు చేపట్టండి
అనంతపురం అగ్రికల్చర్: చలికాలంలో జీవాలకు సంక్రమించే జబ్బులు, వాటి సంరక్షణపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెంపకందారులకు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జీపీ వెంకటస్వామి, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (ఏడీడీఎల్) ఏడీ డాక్టర్ ఎన్.రామచంద్ర సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలు, రాత్రి, ఉదయం పూట ఉష్ణోగ్రతలు తగ్గుతున్న నేపథ్యంలో గొర్రెలు మేకలు, వాటి పిల్లలకు వ్యాధులు సంక్రమించకుండా తీసుకోవాల్సిన చర్యలను వారు వివరించారు. ● చలిని తట్టుకునే శక్తి వచ్చే వరకూ తల్లి గొర్రె నుంచి పాలు అందేలా గొర్రె పిల్లలను చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల గొర్రె పిల్లల్లో ఎదుగుదల, వ్యాధి నిరోదకశక్తి పెరుగుతుంది. చిన్నవాటికి చలిగాలులు తగలకుండా, శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ● జీవాలు ఉండే ప్రాంతాల్లో భూమిలో తేమశాతం లేకుండా ఉండాలి. పొడి వాతావరణం, ఎత్తైన ప్రదేశాలను ఎంచుకోవాలి. లేదంటే తేమ వల్ల పరాన్నజీవులు, సూక్ష్మజీవుల బెడద ఎక్కువై వ్యాధులు ప్రబలి మరణాలు సంభవిస్తాయి. ● గొర్రె, మేక పిల్లలు మట్టిని నాకకుండా చూసుకోవాలి. లేకుంటే పారుడురోగం లాంటి వ్యాధులు సోకుతాయి. ఖనిజ లవణ మిశ్రమం (మినరల్ మిక్చర్) కలిగిన ఇటుకలను పిల్లల గూళ్లలో వేలాడదీయాలి. పిల్లలను ఎక్కువ సంఖ్యలో ఉంచితే ఒత్తిడి నెలకొంటోంది కాబట్టి విశాలంగా, శుభ్రంగా గాలి వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలి. రాత్రిళ్లు వెచ్చదనం ఉండేలా లైట్లను లేదంటే అడ్డుతెరలు ఏర్పాటు చేయాలి. ● చలికాలంలో ఈగలు, దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. గోమార్ల నివారణ చర్యలు చేపట్టాలి. చిన్న పిల్లలను బయట ప్రదేశాల్లో ఉంచితే దోమతెరలు వాడాలి. చిన్నపాటి షెడ్లలో పట్టలు కప్పి అందులో పెంచడం ఉత్తమం. ● జబ్బులు వ్యాపిస్తే మందలోని పిల్లలను వేరు చేయాలి. పిల్లలన్నింటీకీ ఎంసీ–ఈటీ టీకాను వేయించాలి. యాంటీబయోటిక్స్, బీ–కాంప్లెక్స్, లివర్ టానిక్‌లు, ఈస్ట్ కల్చర్లు, జీర్ణక్రియ మందులు, ఐరన్, క్యాల్షియం తదితర మందులు పశువైద్యుని సూచన మేరకు వాడాలి. ● ఇప్పటికే ముందస్తు జాగ్రత్త కింద 8.03 లక్షల జీవాలకు మూతిపుండ్ల, నీలినాలుక వ్యాది (బ్లూటంగ్) టీకాలు ఉచితంగా వేశారు. ఈ వ్యాధి సోకితే ఎక్కువగా జ్వరం, మూతివాపు, నోటిలో పుండ్లు, పెదవులు దద్దరించడం, ముక్కు నుంచి చీమిడి కారడం లాంటి లక్షణాలు ఉంటాయి. నివారణ చర్యలు చేపట్టకపోతే 30 శాతం వరకు మరణాలు ఉంటాయి. సాయంత్రం పూట గొర్రెల మందలో వేపాకు పొగ వేయడం, అపుడపుడు బ్యూటాక్స్ లేదా టిక్కెల్ లాంటి మందులు పిచికారీ చేయడం, పొడి ప్రాంతాల్లో మేపుకోవాలి. పశువైద్యున్ని సూచన మేరకు నివారణ చర్యలు చేపట్టాలి. ● కాలిగిట్టల మధ్య చీము చేరి చెడు వాసన రావడం, కుంటడం లాంటి లక్షణాలు ఉంటే కాలిపుండ్ల వ్యాధి (ఫుట్రాట్)గా గుర్తించి బురద ప్రాంతాల్లో మేపకుండా చూడాలి. నట్టల మందు తాపించాలి. కాలిపుండ్లు బాగా కడిగి పసుపు లేదా ఆయిట్మెంట్ రాసి మట్టి తగలకుండా రెండు రోజులు యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. పశుశాఖ జేడీ, ఏడీడీఎల్ ఏడీ సూచన -
24న బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక
అనంతపురం: జిల్లా మహిళలు, పురుషుల బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక ప్రక్రియ ఈ నెల 24 ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బాస్కెట్‌బాల్ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ కేఎం హబీబుల్లా, జనరల్ సెక్రటరీ కే. నరేంద్ర చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 6 నుంచి 9వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లా మార్తేరులో జరగనున్న ఏపీ సీనియర్ అంతర్ జిల్లా బాస్కెట్ బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో జట్లు ప్రాతినిధ్యం వహిస్తాయని పేర్కొన్నారు. చిరుత దాడిలో గొర్రెల మృతి కుందుర్పి: చిరుత దాడిలో రెండు గొర్రెలు మృతి చెందాయి. కుందుర్పి మండలం కెంచంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఈరన్న గొర్రెల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో పాకలోకి చిరుత చొరబడడంతో గొర్రెలు బెంబేలెత్తి గట్టిగా అరవసాగాయి. దీంతో అప్రమత్తమైన ఈరన్న గట్టిగా కేకలు వేస్తూ పాక వద్దకు చేరుకుంటుండగా ఓ చిరుత సమీపంలోని పొదల్లోకి పరుగు తీసింది. పాకలోకి వెళ్లి పరిశీలిస్తే మృతి చెందిన రెండు గొర్రెలు కనిపించాయి. ఘటనతో రూ.25వేల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరి వాపోయాడు. కాగా, రెండు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన రామాంజినేయులు పెంచుకున్న గేదెను చిరుత చంపి తినేసింది.