stokes
-
స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
మౌంట్ మాంగనీ: ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అదరగొట్టడంతో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ సునాయస విజయం సాధించింది. తొలి వన్డేలో ఓడిన ఇంగ్లండ్ బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1–1తో సమంచేసింది. స్టోక్స్ (63 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), బెయిర్‌స్టో (37; 5 ఫోర్లు, 1 సిక్స్), బట్లర్ (36 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగడంతో 37.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసి గెలుపొందింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. గప్టిల్ (50; 7 ఫోర్లు), సాన్‌ట్నర్ (63; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో స్టోక్స్, వోక్స్, మొయిన్ అలీలకు రెండేసి వికెట్లు దక్కాయి. బౌలింగ్, బ్యాటింగ్‌లలో రాణించడంతో పాటు రెండు రనౌట్లలో పాలుపంచుకున్న స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్లు మధ్య మూడో వన్డే శనివారం వెల్లింగ్టన్లో జరుగనుంది. -
హిప్.. హిప్.. పుణె
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌పై రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. గుజరాత్ బ్యాట్స్మన్లలో మెక్కల్లమ్ 45(27 బంతులు, రెండు సిక్సులు, ఐదు ఫోర్లు), దినేశ్ కార్తీక్ 29(26 బంతులు, మూడు ఫోర్లు) సమయోచిత బ్యాటింగ్‌కు గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణె 42/4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో స్టోక్స్ 103 నాటౌట్(63 బంతులు, ఆరు సిక్సులు)కు జత కలిసిన ధోని 26(33 బంతులు, ఒక సిక్సు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ధోని అవుటయ్యే సమయానికి గెలుపుకు ఇంకా 40కు పైగా పరుగుల అవసరం ఉంది. దీంతో ఒక్కసారిగా విజృంభించిన స్టోక్స్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇదే సమయంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో మరో బంతి మిగిలివుండగానే పుణె లక్ష్యాన్ని చేధించింది. కాగా, ఐపీఎల్లో పుణెకు గుజరాత్‌పై ఇదే తొలి విజయం. -
ముంబైపై ‘రైజింగ్’ పుణే
-
ముంబైపై ‘రైజింగ్’ పుణే
►చివరి ఓవర్లో స్మిత్ సేన ►ఉత్కంఠ విజయం ►రాణించిన బౌలర్లు ►రోహిత్ శర్మ పోరాటం వృథా వరుసగా ఆరు విజయాలతో భీకర ఫామ్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ జోరుకు బ్రేక్ పడింది. ప్రత్యర్థి ఎవరైనా... ఎలాంటి లక్ష్యమైనా అవలీలగా సాధిస్తూ వస్తున్న రోహిత్ సేన రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌ను మాత్రం అధిగమించ లేకపోతోంది. తక్కువ స్కోరు అయినా పుణే బౌలర్లు చివరికంటా పోరాడి జట్టుకు చక్కటి విజయాన్ని అందించగలిగారు. లీగ్‌లో ఇప్పటిదాకా ముంబైకి ఎదురైన రెండు పరాజయాలూ పుణే చేతుల్లోనే కావడం విశేషం. అటు ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న కెప్టెన్ రోహిత్ అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై: ఐపీఎల్ పదో సీజన్లో ముంబై ఇండియన్స్‌కు మరోసారి రైజింగ్ పుణే సూపర్ జెయింట్ అడ్డుకట్ట వేసింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పుణే మూడు పరుగుల తేడాతో నెగ్గింది. ఈ జట్టుకిది వరుసగా మూడో విజయం. ముంబై విజయం కోసం కెప్టెన్ రోహిత్ శర్మ (39 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రహానే (32 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. పార్థివ్ (27 బంతుల్లో 33; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. స్టోక్స్, ఉనాద్కట్లకు రెండేసి వికెట్లు దక్కాయి. స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. శుభారంభం అందినా: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణేకు ఓపెనర్లు రహానే, రాహుల్ త్రిపాఠి శుభారంభం అందించారు. తొలి ఓవర్లోనే సిక్స్ బాదిన రహానేకు తోడు త్రిపాఠి కూడా వేగంగా ఆడడంతో పవర్‌ప్లేలో జట్టు 48 పరుగులు చేసింది. ఎనిమిదో ఓవర్లో రహానే రెండు ఫోర్లు, త్రిపాఠి ఓ ఫోర్ కొట్టడంతో 14 పరుగులు వచ్చాయి. అయితే తన వరుస రెండు ఓవర్లలో కరణ్ శర్మ వీరిద్దరిని పెవిలియన్‌కు చేర్చడంతో స్కోరులో వేగం తగ్గింది. మొదట రహానేను రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేయగా తొలి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత త్రిపాఠి పనిపట్టాడు. అయితే మరుసటి ఓవర్లోనే హర్భజన్ కెప్టెన్ స్మిత్ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు)ను బౌల్డ్ చేయడంతో పాటు టి20ల్లో 200 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా పుణే ఇన్నింగ్స్‌లో మెరుపులు లేకపోగా స్టోక్స్ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు), ధోని (7) వరుస ఓవర్లలో అవుటయ్యారు. ఆఖర్లో మనోజ్ తివారి (13 బంతుల్లో 22; 4 ఫోర్లు) చెలరేగడంతో జట్టు ఓ మాదిరి స్కోరైనా చేయగలిగింది. రోహిత్ హవా: తొలి ఓవర్లో మూడు పరుగులే వచ్చినా ఆ తర్వాతి రెండు ఓవర్లలో బట్లర్ రెండు ఫోర్లు.. పార్థివ్ పటేల్ మూడు ఫోర్లు బాది జోరు కనబరిచారు. అయితే ఐదో ఓవర్లో స్టోక్స్.. బట్లర్‌ను అవుట్ చేశాడు. కొద్దిసేపటికే నితీశ్ రాణా (3), పార్థివ్ వరుస ఓవర్లలో అవుట్ కావడంతో పుణే పైచేయి సాధించింది. కానీ కెప్టెన్ రోహిత్ జట్టు విజయం కోసం అద్భుతంగా పోరాడాడు. 14వ ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన తను 33 బంతుల్లో ఈ సీజన్లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అయితే చివరి ఓవర్లో 17 పరుగులు కావాల్సిన దశలో హార్దిక్ (11 బంతుల్లో 13; 2 ఫోర్లు) తొలి బంతికే వెనుదిరిగాడు. రెండో బంతిని రోహిత్ సిక్సర్‌గా మలిచినా నాలుగో బంతికి ఉనాద్కట్ రిటర్న్ క్యాచ్ తీసుకోవడంతో ముంబై పరాజయం ఖాయమైంది. ఐపీఎల్లో నేడు బెంగళూరు & హైదరాబాద్ వేదిక: బెంగళూరు, రా. గం. 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
పుణే ‘రైజింగ్’ విక్టరీ
-
పుణే ‘రైజింగ్’ విక్టరీ
బెంగళూరుపై ఘనవిజయం బెంగళూరు: ఐపీఎల్లో తొలుత బ్యాటింగ్ చేసిన తొమ్మిదిసార్లు పుణేకు పరాజయమే ఎదురైంది. అయితే ఈసారి మాత్రం తక్కువ స్కోరు చేసి కూడా మ్యాచ్‌లో గెలవడం విశేషం కాగా... చిన్నస్వామిలాంటి పరుగుల స్టేడియంలో హోమ్ టీమ్ బెంగళూరును ఓడించడం మరో విశేషం. స్టోక్స్ (3/18), శార్దుల్ ఠాకూర్ (3/35)ల సూపర్ బౌలింగ్‌తో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ మురిసింది. ‘హ్యాట్రిక్’ పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను 27 పరుగుల తేడాతో కంగుతినిపించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి ఓడింది. పుణేకు రహానే (25 బంతుల్లో 30; 5 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. అయితే తర్వాత వచ్చిన స్మిత్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు), ధోని (25 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గానే ఆడినా... స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగం తగ్గింది. చివర్లో మనోజ్ తివారి (11 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు ఇన్నింగ్స్ చప్పగా సాగింది. మన్దీప్ (0) డకౌట్ కాగా... కోహ్లి (19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), డివిలియర్స్ (29 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలింగ్‌కు తలొగ్గారు. బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఏకంగా 11 ఓవర్ల పాటు బౌండరీ కొట్టలేకపోవడం గమనార్హం. ఐపీఎల్లో నేడు ►ఢిల్లీ & కోల్‌కతా వేదిక: న్యూఢిల్లీ, సా.గం. 4.00 నుంచి ►హైదరాబాద్ & పంజాబ్ వేదిక: హైదరాబాద్, రాత్రి .గం. 8.00 నుంచి ► సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
తొలి వన్డేలో ఇంగ్లండ్ గెలుపు
అంటిగ్వా: కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (116 బంతుల్లో 107; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) ‘రికార్డు’ సెంచరీ సహాయంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. శుక్రవారం రాత్రి జరిగిన తొలి వన్డేలో పర్యాటక జట్టు 45 పరుగుల తేడాతో గెలిచింది. నేడు (ఆదివారం) రెండో వన్డే జరుగుతుంది. ముందుగా ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 296 పరుగులు చేసింది. 112 బంతుల్లో కెరీర్లో పదో సెంచరీ చేసిన మోర్గాన్.. ఇంగ్లండ్ కెప్టెన్‌గా అత్యధిక సెంచరీ (5)లు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతం లో స్ట్రాస్, కుక్ నాలుగేసి సెంచరీలతో ఉన్నారు. ఓపెనర్ బిల్లింగ్స్ (56 బంతుల్లో 52; 7 ఫోర్లు), స్టోక్స్ (61 బంతుల్లో 55; 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. గాబ్రియెల్, నర్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత విండీస్ 47.2 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వోక్స్, ప్లంకెట్ నాలుగేసి వికెట్లు తీశారు. -
క్రికెట్ సంత
-
తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు
-
శతక్కొట్టారు
తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు స్టోక్స్, మొయిన్ సెంచరీలు ధీటుగా స్పందించిన భారత ఓపెనర్లు ఒకరిని మించి మరొకరు... రూట్ చూపించిన దారిలో మొరుున్ అలీ, స్టోక్స్ కూడా చెలరేగిపోయారు. అద్భుతమైన నిలకడతో సెంచరీలు చేశారు. భారత గడ్డపై బ్యాటింగ్ చేయడం ఇంత సులభమా అని మిగిలిన జట్లు అసూయ పడేలా ఇంగ్లండ్ పరుగుల వర్షం కురిపించింది. ఫలితంగా భారత్‌తో తొలి టెస్టులో భారీస్కోరుతో ఇంగ్లండ్ బలమైన స్థితికి చేరింది. తొలి రోజు మూడు క్యాచ్‌లు వదిలేసినా రెండో రోజూ భారత జట్టు తప్పులు దిద్దుకోలేదు. మరో రెండు క్యాచ్‌లు వదిలేయడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ నత్తల్లా కదిలారు. ఒక్క పరుగు వచ్చే చోట మనోళ్లు రెండేసి ఇచ్చేశారు. ఫలితంగా కోహ్లి కెప్టెన్ అయ్యాక స్వదేశంలో భారత్ తొలిసారి ఆత్మరక్షణలో పడింది. మన ఓపెనర్లు ఆచితూచి ఆడి వికెట్ పడకుండా ఓ సెషన్‌తో ధీటుగా స్పందించినా... పిచ్‌పై అప్పుడే టర్న్ మొదలైంది. ఇక మూడో రోజు భారత బ్యాట్స్‌మెన్ ఏం చేస్తారనే అంశంపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. రాజ్‌కోట్: భారత గడ్డపై తమ రికార్డులు తామే అందుకుంటూ ఇంగ్లండ్ జట్టు దూసుకుపోతోంది. నాలుగేళ్ల క్రితం కోల్‌కతా టెస్టులో 500 పైచిలుకు పరుగులు చేసిన ఇంగ్లండ్... మరోసారి సులభంగా ఐదొందలు చేసింది. ఈ మధ్య కాలంలో మరే జట్లూ భారత్‌పై భారత్‌లో ఐదొందలు చేయలేదు. స్టోక్స్ (235 బంతుల్లో 128; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ తో సెంచరీ చేయగా... ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ మొయిన్ అలీ (213 బంతుల్లో 117; 13 ఫోర్లు) కూడా సెంచరీ చేశాడు. తొలి రోజు రూట్ కూడా సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురి శతకాలతో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీస్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో కుక్‌సేన 159.3 ఓవర్లలో 537 పరుగులు చేసి ఆలౌటరుుంది. బెరుుర్‌స్టో (57 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడగా... టెరుులెండర్ అన్సారీ (83 బంతుల్లో 32; 3 ఫోర్లు) కూడా ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా... షమీ, ఉమేశ్, అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. గంభీర్ (68 బంతుల్లో 28 బ్యాటింగ్; 4 ఫోర్లు), విజయ్ (70 బంతుల్లో 25 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులు వెనకబడి ఉంది. సెషన్ 1: వేగంగా పరుగులు కొత్త బంతి తీసుకుని భారత్ రోజును ప్రారంభించగా... ఆడిన మూడో బంతిని సింగిల్ తీసి మొరుున్ అలీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత అలీ ఒక్కసారిగా వేగం పెంచి ఉమేశ్ వేసిన ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. రెండో ఎండ్‌లో స్టోక్స్ జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బంతుల్ని వదలకుండా బౌండరీకి పంపాడు. షమీ ఓ చక్కటి బంతితో మొరుున్ను అట్ చేశాడు. స్టోక్స్, మొరుున్ ఐదో వికెట్‌కు 62 పరుగులు జత చేశారు. బెరుుర్‌స్టో ఆరంభంలో నెమ్మదిగా ఆడి కుదురుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మిశ్రా బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో ఇన్నింగ్స వేగం పెంచాడు. మరో ఎండ్‌లో స్టోక్స్ 89 బంతుల్లో అర్ధసెంచరీ మార్కును చేరుకున్నాడు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఉమేశ్ బౌలింగ్‌లో స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ సాహా వదిలేశాడు. ఉమేశ్ తర్వాతి ఓవర్లోనూ స్టోక్స్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను సాహా మరోసారి జారవిడిచాడు. బెరుుర్‌స్టో మరో సిక్సర్‌తో పాటు చకచకా బౌండరీలతో దూసుకుపోతున్న సమయంలో షమీ ఈ జోరుకు బ్రేక్ వేశాడు. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి బెరుుర్‌స్టో వెనుదిరిగాడు. స్టోక్స్, బెరుుర్‌స్టో ఆరో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ఈ సెషన్లో నాలుగుకు పైగా రన్‌రేట్‌తో ఇంగ్లండ్ వేగంగా పరుగులు చేసింది. ఓవర్లు: 30 పరుగులు: 139 వికెట్లు: 2 సెషన్ 2: ఎట్టకేలకు ఆలౌట్ లంచ్ తర్వాత తొలి ఓవర్లోనే జడేజా బౌలింగ్‌లో వోక్స్ అవుటయ్యాడు. అదే జోరులో జడేజా... రషీద్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. అరుుతే ఈ దశలో స్టోక్స్‌కు స్పిన్నర్ అన్సారీ అండగా నిలిచాడు. జడేజా బౌలింగ్‌లో బౌండరీతో స్టోక్స్ 173 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్లో ఇది తనకు నాలుగో సెంచరీ. అన్సారీ నెమ్మదిగా ఆడినా స్టోక్స్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యంలో భాగమయ్యాడు. ఉమేశ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇవ్వడం ద్వారా స్టోక్స్ వెనుదిరిగాడు. దీంతో విరామం ఇవ్వకుండా కొంతసేపు సెషన్‌ను పొడిగించారు. ఆ తర్వాత కొద్దిసేపు భారత బౌలర్ల ఓపికను పరీక్షించిన అన్సారీ... చివరకు మిశ్రా బౌలింగ్‌లో ఎల్బీగా అవుటయ్యాడు. ఈ సెషన్లో పరుగులు చాలా నెమ్మదించారుు. ఓవర్లు: 36.3 పరుగులు: 87 వికెట్లు: 4 సెషన్ 3: ఓపెనర్ల జాగ్రత్త ప్రత్యర్థి భారీ స్కోరు చేయడంతో భారత ఓపెనర్లు గంభీర్, విజయ్ కూడా జాగ్రత్తగా ఇన్నింగ్‌సను మొదలుపెట్టారు. ఇద్దరూ ఆరంభంలో చెరో బౌండరీ కొట్టినా... ఆ తర్వాత జోరు తగ్గింది. ముఖ్యంగా స్పిన్నర్లు బౌలింగ్‌కు వచ్చాక బౌండరీలు రావడం కష్టమరుుంది. చివర్లో కాస్త టర్న్ కనిపించినా... బ్యాటింగ్ చేయడం కష్టంగా మాత్రం లేదు. అరుుతే వికెట్ పడకుండా రోజును ముగించాలనే లక్ష్యంతో భారత ఓపెనర్లు ఆడినట్లు కనిపించారు. ఓవర్లు: 23 పరుగులు: 63 వికెట్లు: 0 ‘కొన్నిసార్లు క్యాచ్‌లు జారిపోతుంటారుు. అది ఆటలో భాగంగా చూడాలి. ఇది అందరి వైఫల్యం. దీనికి అశ్విన్ ఒక్కడినే బాధ్యుడిని చేయకూడదు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం దురదృష్టం. మూడో రోజు నుంచి స్పిన్నర్లకు పిచ్ సహకారం లభిస్తుందని అనుకుంటున్నా. మేం ఆశావహ దృక్పథంతో ఆడతాం’ - రవీంద్ర జడేజా ► 4 భారత గడ్డపై 1990 తర్వాత ఒక విదేశీ జట్టులోని ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి. 2002లో వెస్టిండీస్, 2003లో న్యూజిలాండ్, 2009లో శ్రీలంక మాత్రమే ఈ ఘనత సాధించారుు. ► 5 ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ముగ్గురు ఒకే ఇన్నింగ్సలో సెంచరీ చేసి ఐదేళ్లరుుంది. చివరిసారిగా స్వదేశంలో శ్రీలంకపై 2011లో ఈ ఘనత సాధించారు. ► 31 భారత్‌లో ఇంగ్లండ్‌కు గత 31 సంవత్సరాలలో ఇదే అత్యధిక స్కోరు. 1985లో ఆ జట్టు చెన్నైలో జరిగిన టెస్టులో ఏడు వికెట్లకు 652 పరుగులు చేసింది. -
మైదానంలో, బయటా... అతను సీరియస్!
వెస్టిండీస్ గెలిచిన రెండు టి20 ప్రపంచకప్‌లలో కలిసి శామ్యూల్స్ చేసిన స్కోరు వికెట్ నష్టానికి 163 పరుగులు... ఇతర వెస్టిండీస్ ఆటగాళ్లంతా చేసింది 11 వికెట్ల నష్టానికి 121 పరుగులు... ఇది చాలు ఈ రెండు టైటిల్స్ గెలవడంలో అతని పాత్ర ఏమిటో చెప్పడానికి. వన్డేలనుంచి టి20ల వరకు వరల్డ్ కప్ జట్ల విజయాలలో భాగమైన స్టార్ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ వారెవరికీ రెండు ఫైనల్స్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రదర్శన ఇవ్వడం సాధ్యం కాలేదు. సరదాగా కనిపించడంలో విండీస్ జట్టులోని ఇతర ఆటగాళ్లతో పోలిస్తే కాస్త తక్కువగానే కనిపించినా ఆవేశం మాత్రం ఎక్కువే. పేరుకు పదహారేళ్ల కెరీర్ ఉన్నా స్వయంకృతం కారణంగా సీన్లో కనిపించని శామ్యూల్స్ మరోసారి ప్రపంచకప్ ద్వారా హీరోగా మారాడు. కోల్‌కతానుంచి సాక్షి క్రీడా ప్రతినిధి :- ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మీడియా సమావేశానికి మార్లోన్ శామ్యూల్స్ వచ్చాడు. ఎప్పుడో మ్యాచ్ ముగిసినా అతను తన ప్యాడ్స్‌ను విప్పలేదు. అయితే వాటి వల్ల కుర్చీలో సరిగ్గా కూర్చోలేక నేరుగా టేబుల్‌పైనే కాళ్లు పెట్టేశాడు. ఆ ప్రవర్తనకు పొగరు అనేది కూడా చాలా చిన్న పదమేమో. అయితే జట్టుకు టైటిల్ అందించిన ఆనందంలో అతను ప్రపంచాన్ని లెక్క చేసే పరిస్థితిలో లేడు. అక్కడ ఉన్న ఐదే ఐదు నిమిషాల్లో స్టోక్స్‌ను, వార్న్‌ను ఏకిపారేశాడు. ఇంకా అక్కడే ఉంటే ఏం జరిగేదో కానీ, ఐసీసీ అధికారులు అర్ధాంతరంగా తీసుకెళ్లిపోయారు. శామ్యూల్స్ వ్యవహారశైలికి ఇదో ఉదాహరణ. పేరుకు పదహారేళ్ల కెరీర్ ఉన్నా... అప్పుడప్పుడు వరల్డ్ కప్ మెరుపులే అతడిని గుర్తించేలా చేశాయి. ఈడెన్తోనే మొదలు... 2000లో శామ్యూల్స్ అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించాడు. రెండేళ్ల పాటు అంతంత మాత్రంగానే ఆడిన అతనికి 2002లో భారత పర్యటనకు అవకాశం లభించింది. అయితే కోల్‌కతాలో టెస్టుకు ముందు క్లబ్‌కు హాజరై నిబంధనలు ఉల్లంఘించడంతో విండీస్ బోర్డు అతడిని వెనక్కి పిలిచింది. అయితే చచ్చీ చెడి బతిమాలడంతో చివరకు వదిలేసింది. వెంటనే మ్యాచ్ అవకాశం దక్కించుకున్న అతను ఈడెన్ గార్డెన్స్‌లోనే తన తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు. నాటినుంచి మళ్లీ ఈడెన్‌లో టి20 విజయం అందుకునే వరకు ఎన్నో మలుపులు, వివాదాలు. సరిగ్గా 2007 టి20 ప్రపంచకప్ సమయంలో అతనిపై ఫిక్సింగ్ ఆరోపణలు. అదీ భారత పోలీసులు బయటపెట్టిందే. అయితే విచారణ కొనసాగుతుండగానే విండీస్ టోర్నీలో ఆడించింది. చివరకు తప్పు చేసినట్లు రుజువు కావడంతో రెండేళ్ల నిషేధం. నిజానికి ఇలాంటి ఘటన తర్వాత ఆటగాడు తిరిగి రావడం కష్టం. కానీ శామ్యూల్స్ కూడా గట్టిగానే పోరాడాడు. తనలో సత్తా ఉందని, నిరూపించుకుంటానని పట్టుదలగా వచ్చి అతను ఆ తర్వాత ఎంతో మెరుగయ్యాడు. ఐపీఎల్లో పుణే వారియర్స్ తరపున ఆడినప్పుడు అతను 730 జెర్సీ నంబర్ ధరించాడు. దానికి కారణం చెబుతూ 730 రోజులు తాను నిషేధంతో క్షోభను అనుభవించానని, అది గుర్తు చేసుకుంటే తనలో పట్టుదల పెరుగుతుందని చెప్పుకోవడం అతని శైలి. 2012 ప్రపంచకప్ గెలిపించడంతో శామ్యూల్స్ స్థాయి పెరిగింది. అయితే ఆ తర్వాత మళ్లీ అతను చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. ఈ మధ్యలో అతని బౌలింగ్‌పై అంపైర్లు రెండు సార్లు సందేహాలు లేవనెత్తారు. చివరకు అది చకింగ్గా తేలడంతో రెండేళ్ల క్రితమే బౌలింగ్ మానేయాల్సి వచ్చింది. బ్యాట్‌తోనే జవాబు... విమర్శలు వచ్చినప్పుడు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి చూశారా నా ఆట అన్నట్లుగా ఒక జవాబివ్వడం చాలా మంది ఆటగాళ్లు చేసేదే. అయితే మర్యాద కోసం కొంత మంది పేరు ఎత్తకుండా దానిని దాటవేస్తారు. అయితే శామ్యూల్స్ అలాంటి వ్యక్తి కాదు. అందుకే వేదికపైనే ఇది వార్న్ కోసం అంటూ నేరుగా తిట్టి పోశాడు. మూడేళ్ల క్రితం బిగ్‌బాష్ సందర్భంగా గొడవ ముదిరి వార్న్‌పై అతను బ్యాట్ విసిరేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు సమయంలో శామ్యూల్స్ రన్నింగ్‌ను తీవ్రంగా విమర్శించిన వార్న్... ఈసారి టి20 ప్రపంచకప్ సెమీస్‌లో అవుటయ్యాక ఆట చేత కాదన్నాడు. దాంతో నేను మైక్‌తో కాదు బ్యాట్‌తో జవాబిస్తానని మ్యాచ్ తర్వాత ఘాటుగా శామ్యూల్స్ వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌లో ఒక సారి స్టోక్స్‌తో వాదన జరగ్గా... చివరి ఓవర్లో కూడా మాటల యుద్ధం సాగింది. గెలిచిన తర్వాత షర్ట్ విప్పి ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూం ముందు డ్యాన్స్ చేశాడు. నాతో ఆడేటప్పుడు మాటలతో పెట్టుకోవద్దు అని ముందే అతనికి చెప్పాను. ఎందుకంటే నేను బాగా ఆడబోతున్నాను అని తెలుసు. అయినా అతను మారలేదు. అతడి బౌలింగ్‌లో ఒక్క బంతి కూడా ఎదుర్కోక ముందే మాటలతో దాడి చేస్తే ఊరుకుంటానా అని శామ్యూల్స్ వ్యాఖ్యానించాడు. గేల్, సిమన్స్ విఫలమైనా.... మరో సారి తన అనుభవం రంగరించి అమూల్యమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు రెండో టైటిల్ అందించిన అతని స్థానం విండీస్ క్రికెట్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత కూడా నేను ఇంత కాలం కొనసాగుతున్నానంటే నా పట్టుదల, పోరాడేతత్వమే కారణం. ఇక నన్ను ఎవరైనా మాటలతో ఏమైనా అంటే మాత్రం నేను మరింతగా రెచ్చిపోతాను. గత ఐదేళ్లలో నా జీవితం ఎంతో మారింది. ఈ స్థాయిలో ఆడగలుగుతున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు - శామ్యూల్స్ జరిమానా ఆదివారం జరిగిన ఫైనల్ చివరి ఓవర్లో ఇంగ్లండ్ బౌలర్ స్టోక్స్‌ను అసభ్యపదజాలంతో శామ్యూల్స్ దూషించాడు. దీనిపై ఐసీసీ విచారణ జరపగా శామ్యూల్స్ తప్పు అంగీకరించాడు. దీంతో అతడి మ్యాచ్‌లో ఫీజులో 30 శాతం కోత విధించినట్లు ఐసీసీ ప్రకటించింది. -
వెంటాడే ‘స్ట్రోక్స్’..!
ఒక్క ఓవర్‌తో మారిన రాత స్టోక్స్ కెరీర్లో చేదు జ్ఞాపకం వెస్టిండీస్ సంబరాలు ఒక వైపు సాగుతుంటే మరో వైపు నేలపై కూలబడిన ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్‌ను చూస్తే క్రికెట్లో హీరోలు విలన్లు అయ్యేందుకు ఒక్క ఓవర్ కూడా సరిపోతుందని మరోసారి రుజువయింది. బ్రాత్‌వైట్ గర్జనతో అందరికీ విండీస్ విజయం కనిపిస్తుంటే, నాణేనికి మరో వైపు స్టోక్స్ వేదన వర్ణించరానిది. ఇటీవలి కాలంలో ఒక్కసారిగా దూసుకొచ్చి అసలైన ఆల్‌రౌండర్‌గా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నంలో స్టోక్స్ ఉన్నాడు. దూకుడైన బ్యాటింగ్‌తో పాటు మెరుగైన పేస్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ మీడియా దృష్టిలో మరో బోథమ్లా కనిపించాడు. దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో చేసిన మెరుపు డబుల్ సెంచరీ అతడిని స్టార్‌ను చేసింది. అయితే ఇప్పుడు దానికంటే స్టోక్స్ చివరి ఓవర్ బాధితుడిగానే ఎక్కువగా గుర్తుండిపోతాడు. నమ్మకం నిలబడలేదు ప్రపంచకప్‌లో ఫైనల్‌కు ముందు రెండు మ్యాచ్‌లలో స్టోక్స్ ప్రదర్శన అతనితో ఆఖరి ఓవర్ వేయించేలా మోర్గాన్‌ను ప్రోత్సహించింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో చక్కటి యార్కర్లతో అతను బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలిగాడు. చివరి ఓవర్లో విజయానికి శ్రీలంకకు 15 పరుగులు కావాల్సి ఉండగా స్టోక్స్ కేవలం 4 పరుగులే ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో అయితే చివరి 2 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అయితే బ్రాత్‌వైట్ విధ్వంసానికి అతను బలి అయ్యాడు. తొలి సారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్న ఒత్తిడిని అతను దాటలేకపోయాడు. ఫలితమే ఎప్పటికీ బాధించే నాలుగు సిక్సర్ల బాదుడు. అతను తీవ్ర నిరాశలో కూరుకుపోయిన మాట వాస్తవం. రాబోయే కొన్ని రోజులుఇది అతడిని వెంటాడుతుందనడంలో సందేహం లేదు. అయితే మేం జట్టుగా విజయానందాన్ని పంచుకున్నాం కాబట్టి అతని బాధను కూడా సమష్టిగా పంచుకుంటున్నాం అని కెప్టెన్ మోర్గాన్ సాంత్వన ఇచ్చే ప్రయత్నం చేశాడు. నువ్వు గొప్ప క్రికెటర్ కావాలి స్టోక్స్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి వెస్టిండీస్‌ను గెలిపించిన బ్రాత్‌వైట్... తమ ప్రత్యర్థి బౌలర్ గొప్ప క్రికెటర్ కావాలని ఆకాంక్షించాడు. ‘యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టిన తర్వాతే బ్రాడ్ గొప్ప బౌలర్‌గా ఎదిగాడు. స్టోక్స్ గత రెండు నెలలుగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌ను మరచిపోయి తను ముందుకు సాగాలి. భవిష్యత్‌తో ఓ దిగ్గజంలా ఎదగాలి’ అని బ్రాత్‌వైట్ ఆకాంక్షించాడు. తనకోసం బ్యాట్ తయారు చేసి ఇచ్చిన ఎర్రోల్ ఎడీ అనే వ్యక్తికీ కృతజ్ఞతలు చెప్పాడు. బ్రాడ్ తరహాలోనే... 2007 ప్రపంచకప్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టినప్పుడు కూడా బౌలర్‌పై అంతా జాలి పడ్డారు. బ్రాడ్ కోలుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. ఎప్పుడు భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ జరిగినా అంతా అతనికి అదే గుర్తు చేయడం ఆవేదనకు గురి చేసేది. నాడు అది ఒక లీగ్ మ్యాచ్ మాత్రమే. ఇప్పుడు ఇది ప్రపంచకప్ ఫైనల్. ఈ ఓవర్ వల్ల స్టోక్స్ కెరీర్‌పై ఇప్పటికిప్పుడు నేరుగా ప్రభావం చూపించకపోయినా, అది అతడిని జీవితాంతం వెంటాడుతుంది. ఆ నాలుగు బంతులు కలలో కూడా వెంటాడుతాయి. అతనిపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మాత్రం సానుభూతి చూపిస్తోంది.