Telugu Desam Party
-
టీడీపీ నేతల అరాచకం
సాక్షి నెట్వర్క్: తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్మార్గానికి తెగబడ్డారు. భార్యాభర్తల గొడవ విషయంలో తల దూర్చి కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. కేసు కోర్టులో ఉన్నప్పటికీ రాత్రివేళ అపార్ట్మెంట్లోని ఇంట్లోకి చొరబడి మూకుమ్మడిగా దాడి చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందంటూ హల్చల్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంలో కలెక్టరేట్ వెనుక ఉన్న అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఓ కుటుంబంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. నగరంలో రామానాయుడుపేటకు చెందిన టీడీపీ నాయకుడు వాడపల్లి మహేష్ కుమార్తెకు గాంధీనగర్‌లోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న నూకల బాబూరావు కుమారుడికి కొంతకాలం క్రితం వివాహం జరిగింది. వివాహమైన కొంతకాలానికి భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇరు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఈ వివాదంపై కోర్టులో కేసు నడు స్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి టీడీపీ నాయకుడు వాడపల్లి మహేష్ కుటుంబ సభ్యులు, కొంతమంది టీడీపీ డివిజన్ ఇన్‌చార్జ్‌లు, నాయకులతో కలిసి బాబూరావు ఇంటిపై మూకుమ్మడి దాడి చేశారు. బాబూరావు కుటుంబ సభ్యులను దుర్భాషలాడటంతో పాటు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీ దొరకకూడదని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కొన్ని సీసీ కెమెరాల్లో నాయకులు అపార్ట్మెంట్లో ప్రవేశించటం, బయటకు వెళ్లటం మాత్రం రికార్డు అయింది. ఘటన అనంతరం బాబూరావు చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలు స్తోంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించకపోవటంతో బుధవారం ఉదయం అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వారంతా ఎస్పీ ఆర్.గంగాధరరావును కలిసి జరిగిన సంఘటనను వివరించినట్లు సమాచారం. అయితే ఈ కేసును చిలకలపూడి సీఐకు రిఫర్ చేసినట్లు తెలిసింది. ఈ ఫిర్యాదులో పోలీసులు నాయకుల పేర్లు తప్పించి ఒకరిద్దరి పేర్లు నమోదు చేస్తామని బాధితులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనపై చిలకల పూడి సీఐ అబ్దుల్ నబీని ‘సాక్షి’ వివరణ కోరగా బాధితులు ఘటన విషయం చెప్పారని, అయితే ఇంతవరకు ఫిర్యాదు అందలేదని, అందిన వెంటనే కేసు నమోదు చేస్తామన్నారు. -
అమరావతిలో భూమాయ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నదిలో ఉన్న భూమి సాగు భూమి అవుతుందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే రాజధాని అమరావతిలో మాత్రం కచ్చితంగా అవుతుంది. లేని భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చి, భారీగా లబ్ధి పొందుతారు. గతంలోనూ టీడీపీ హయాంలో ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. ఆ విషయం తెలిసిపోవడంతో తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు అదే తరహా కుంభకోణం ఫైలు మరొకటి ఉన్నతస్థాయి నుంచి చకచకా కదిలి రెవెన్యూ అధికారుల వద్దకు వచ్చింది. అసలు రెవెన్యూ రికార్డుల్లో లేని నదీ ప్రవాహంలోని సర్వే నంబర్లు పేర్కొంటూ దానిని పూలింగ్‌కు తీసుకోవాలంటూ 65 మంది రైతుల పేర్లతో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు రావడం.. అక్కడి నుంచి సీఆర్డీఏకి వెళ్లి తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడం వేగంగా జరిగిపోయింది. దానిని క్లియర్ చేసేయాలంటూ ఉన్నతస్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లూ వస్తున్నాయి. అయితే, ఇంత దారుణమైన మాయ చేయలేమంటూ అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇదిగో ఇది ఆ మాయాభూమి కథ.. ఇటీవల తుళ్లూరు మండలం రాయపూడి సర్వే నంబర్ 1–ఎ1, 1–ఎ2 నుంచి 1–ఎ67 వరకూ ఉన్న 104.82 ఎకరాలకు సంబంధించిన రైతుల భూమి వర్గీకరణ, భూ స్థితి, అసైన్మెంట్ జరిగిందీ లేనిదీ వెంటనే వివరాలివ్వాలంటూ సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుంచి తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయి. అందులో ఆ భూమి యజమానులుగా 65 మంది రైతుల పేర్లు ఉన్నాయి. దీనిపై స్పందించిన తహసీల్దార్ కార్యాలయం లాండ్ పూలింగ్ వివరాల కోసం ఆ రైతులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న తమ వద్దకు వచ్చి ఆధారాలు చూపించాలని కోరుతూ రాయపూడిలో, తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా నోటీసులు అంటించింది. అయినా ఒక్క రైతూ ముందుకు రాలేదు. రెవెన్యూ అధికారులు విచారణ చేయగా.. ఆ దరఖాస్తులో ఉన్న రైతులు ఎవరూ ఆ ప్రాంతాల్లోనే లేనట్లు తేలింది. మైక్‌లో ప్రచారం చేసినా ఎవరూ రాలేదు. 19వ తేదీన ఒక్క వ్యక్తి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అతని వద్ద కూడా ఆధారాలు లేవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.పూర్తిగా విచారణ చేయగా రైతులు తమ భూమి అని పేర్కొన్న భూమి మొత్తం కృష్ణా నదీ గర్భంలో ఉన్నట్లు తేలింది. అది నదిలో ఉన్న భూమి. రాయపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1, 1/12–2బీ2ఏ, 16–ఏ2, 16–బీ2, 71–ఏ, 15–ఏ, 15–బీ, 17–ఏ, 225–1, 72, 96లో నదీ ప్రవాహం వెళ్తుంది. వీటిలో మరికొన్ని నదిలోనే దిబ్బలుగా ఉన్నాయి. నదీ ప్రవాహంలో ఉన్న భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధం.అక్రమంగా లబ్ధి పొందేందుకే..! అడంగల్‌లో ఆ సర్వే నంబర్లే లేవని, ఎవరికీ పాస్ పుస్తకాలు ఇ చ్చినట్లు కూడా లేదని రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. అయినా అమరావతి రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ ప్లాట్ల విలువ కోట్లలో ఉండటంతో అక్రమంగా లబ్ధి పొందేందుకు కొందరు వ్యక్తులు రాయపూడి నదీ ప్రవాహాన్ని సాగు భూమిగా సృష్టించారు. ఇప్పుడు దాన్ని లాండ్ పూలింగ్‌కు తీసుకొమ్మని సీఆర్డీఏ అధికారులను ఒత్తిడి చేస్తున్నారు. అసలు రైతులు, భూమి లేకుండా తామేమీ చేయలేమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. అయితే వారికి ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. అడంగల్ లేని, పాసు పుస్తకాలు కూడా లేని భూమికి అనుమతులెలా ఇస్తామని అధికారులు అంటున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ తహసీల్దార్ ఇలానే ఇరుక్కొన్నారన్న విషయాన్ని గుర్తు చేసి, ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఇదీ పాత కథ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నదీ ప్రవాహాన్ని వారి సాగు భూములుగా రికార్డులు పుట్టించి మండల రెవెన్యూ అధికారి సహకారంతో ఆడంగల్లో చేర్చారు. 20 ఎకరాల ఈ భూముల విలువ అప్పట్లోనే రూ.30 కోట్లకు పైగా ఉండేది. తొలుత 1/12–2బీ, 2ఏ, 71–ఏ సర్వే నంబర్లలో ఉన్న నదీ పరివాహక ప్రాంతాన్ని సాగు భూములుగా, ఆ తర్వాత 16–ఏ2, 16–బీ2, 15–ఏ, 15–బీలో ఉన్న కృష్ణా నదిని ఇద్దరి పేర్లతో ఆడంగల్లో చేర్చారు. వీటిని వేరే వారికి అమ్మేసి మ్యుటేషన్ ద్వారా వేర్వేరు రిజి్రస్టార్ కార్యాలయాల్లో రిజి్రస్టేషన్ కూడా చేయించేశారు. వాస్తవానికి రెవెన్యూ అధికారులు ఆ భూములు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి, నివేదిక ఇచ్చాకే రిజి్రస్టేషన్ పూర్తవుతుంది. అయితే, అప్పటి అధికారులు టీడీపీ నేతలతో కుమ్మక్కవడంతో నదిని కూడా సాగు భూమిగా చూపించారు. ఈ అక్రమాన్ని సక్రమం చేసినందుకు రెవెన్యూ అధికారి కొడుకులు, కారు డ్రైవర్‌కు కొంత భూమిని పంచారు. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా తెలిసిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పట్లో తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు.ఆ భూములకు రైతులే లేరు సర్వే నంబర్ 1–ఎ1 నుంచి 1–ఎ67 వరకు ఉన్న భూమిలో 65 మంది రైతులు ఉన్నారని, వారి భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చారా లేదా వివరాలు కావాలని సీఆర్డీఏ నుంచి ఆదేశాలు మాకు వచ్చాయి. రైతులు వారి వద్ద ఉన్న వివరాలు అందచేయాలని నోటీసులు ఇచ్చి, మైక్ ప్రచారం చేసినా ఎవరు రాలేదు. అసలు వారు చెప్పిన సర్వే నంబర్లు మా రికార్డుల్లోనూ లేవు. – సుజాత, తహసీల్దార్, తుళ్లూరు -
మీపైనా పెట్రోల్ పోసి తగలబెడతాం
సాక్షి, నంద్యాల: అధికారం అండ చూసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా విచక్షణ రహితంగా హత్యకు తెగించారు. ఇష్టానుసారం దాడులకు పాల్పడ్డారు. కొడవళ్లు, కర్రలు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. ‘అడ్డు వస్తే మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి తగలబెడతాం..’ అంటూ పోలీసులను సైతం బెదిరించారు. సీతారామాపురం గ్రామంలో టీడీపీ ముఖ్యనేత బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి సుమారు 30 మంది అనుచరులతో శనివారం రాత్రి విధ్వంసం సృష్టించిన తీరు నివ్వెర పరుస్తోంది. ‘రెడ్డిబుక్’ పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది. శనివారం రాత్రి 11.30 గంటలకు శ్రీనివాసరెడ్డి సమీప బంధువైన బుడ్డారెడ్డి గారి పెద్దిరెడ్డి ఇంట బీభత్సం సృష్టించారు. శేఖర్‌రెడ్డి ముందుండి దౌర్జన్యకాండను నడిపించాడు. పెద్దిరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లి లక్ష్మిదేవిని దుర్భాషలాడుతూ దాడి చేశారు. వాడు (పెద్దిరెడ్డి) ఎక్కడున్నాడో చెప్పండి లేదంటే మిమ్మల్ని కూడా చంపేస్తామని హెచ్చరించారు. ఇంట్లోనే ఉన్న ఆమె కుమార్తె పద్మజపైనా చేయి చేసుకున్నారు. వాడిని వదిలేసే ప్రసక్తే లేదని, కచి్చతంగా చంపేస్తామంటూ హెచ్చరికలు చేస్తూ పెద్దిరెడ్డి ఇంటి నుంచి బయటికి వచ్చారు. తర్వాత 12 గంటల ప్రాంతంలో పల్లపు శేఖర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో శేఖర్ ఇంట్లో లేడు. ఆయన తండ్రి పల్లపు సుబ్బరాయుడు పెరాలసిస్‌తో బాధ పడుతున్నాడు. మంచంలో ఉన్న అతన్ని ఇంట్లో నుంచి బయటికి లాక్కెళ్లి పడేశారు. ఇంటి ముందున్న బైక్‌ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత 12.20 గంటలకు పసుపులేటి సుబ్బరాయుడు ఇంటికి శ్రీనివాస్‌రెడ్డి, మరో 30 మంది వెళ్లారు. ఆ సమయంలో ఆయన భార్య పసుపులేటి బాలసుబ్బమ్మ సోపాలో పడుకుని ఉంది. ఆమెను బలవంతంగా బయటికి లాక్చొచ్చారు. భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పాలని బెదిరిస్తూ దాడికి పాల్పడ్డారు. ఇంటి తలుపులు గట్టిగా తట్టడంతో ఇంట్లో నిద్రిస్తున్న సుబ్బరాయుడు తలుపులు తెరవగానే వెంట తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. రోడ్డు మీదకు లాక్కొచ్చి మరోసారి కొడవలి, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తలకు దెబ్బలు తగలడంతో తీవ్రంగా రక్తస్రావం కావడంతో స్పృహ తప్పిపడిపోయాడు. చనిపోయాడనుకుని వెళ్లిపోతూ.. మళ్లీ వెనక్కి వచ్చి పరీక్షించి చూశారు. ‘వీడు చావలేదు’ అంటూ పక్కనే ఉన్న బండరాయితో తల మీద గట్టిగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత ఇంట్లో నిద్రిస్తున్న రెండో కుమారుడు జమాలయ్య, మూడో కుమారుడు నాగ ప్రసాద్‌తో పాటు ఇంట్లో ఉన్న ఇద్దరు కోడళ్లను చంపేందుకు ప్రయతి్నస్తే వాళ్లు తప్పించుకుని పారిపోయారు. దీంతో ఎవరిని వదిలేసే ప్రసక్తే లేదని ఈ ఐదేళ్లలో అందరినీ అంతమొందిస్తామని హెచ్చరిస్తూ వెళ్లిపోయారు. పోలీసులకూ హెచ్చరిక సుబ్బరాయుడిని హత్య చేసే సమయంలో మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే ఉన్నారు. శ్రీనివాసరెడ్డి ముఠాకు వారు నచ్చజెప్పేందుకు ప్రయతి్నంచగా.. ‘మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. లేదంటే మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి తగలబెడతాం’ అని హెచ్చరించారు. వారిని పక్కకు తోసేసి ముందుకెళ్లారు. కాగా, దాడిలో గాయపడిన పసుపులేటి బాలసుబ్బమ్మను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుబ్బరాయుడి మృతదేహాన్ని ఆదివారం ఉదయం 7.30 గంటలకు పోస్టుమార్టం కోసం నంద్యాలకు తీసుకొచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ నేత బుడ్డారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బుడ్డారెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంగాల లక్ష్మిరెడ్డి, బుడ్డారెడ్డి శేఖర్‌రెడ్డి, వంగాల పుల్లారెడ్డి, కంటరెడ్డి భరత్‌రెడ్డి, తాలూరి శ్రీనివాస్, మరికొంత మందిపై హత్య, హత్యాయత్నం, ఆస్తి ధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం కలి్పంచడం తదితరాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.టీడీపీకి ఓటెయ్యలేదని చంపేశారు నా భర్త సుబ్బరాయుడు ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. తన మాట వినకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేసినందుకు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి మాపై కక్ష పెంచుకున్నాడు. శనివారం రాత్రి 30 మంది టీడీపీ గూండాలు మా ఇంటి వద్దకు వచ్చి బయట నిద్రిస్తున్న నన్ను లేపి నీభర్త ఎక్కడున్నాడు అని అడిగారు. లేడని చెప్పడంతో నాపై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. చేతిని కత్తితో నరికారు. ఇంట్లోకి దూసుకెళ్లి నిద్రిస్తున్న నా భర్తను నడిరోడ్డుపై పడేసి ఇష్టం వచ్చినట్లు కర్రలతో, రాళ్లతో, కత్తులతో దాడి చేశారు. నా భర్త తలపై పెద్ద బండరాయి వేసి అక్కడికక్కడే ప్రాణాలు తీశారు. వదిలేయాలని కాళ్లావేళ్లా పడినా వినిపించుకోలేదు. – పసుపులేటి బాలసుబ్బమ్మ (మృతుడి భార్య)ఊళ్లో భద్రత కరువైంది వైఎస్సార్సీపీకి ఓటు వేసినందుకు మా ఇంటిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. బయట నిద్రిస్తున్న మా తల్లి బాలసుబ్బమ్మపై దాడి చేసి గాయపరిచారు. ఇంట్లో నిద్రిస్తున్న మా నాన్నను దుర్భాషలాడుతూ బయటకు లాక్కెళ్లారు. రోడ్డుపై పడేసి కొడవళ్లు, రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. పథకం ప్రకారం కొట్టి హతమార్చారు. ‘మాకు వ్యతిరేకంగా చేస్తారా.. మీ అంతు చూస్తాం’ అని బెదిరించారు. ఊళ్లో అందరికీ భద్రత కరువైంది. – జమాలయ్య, మృతుడు సుబ్బరాయుడు కుమారుడు -
టీడీపీ నేతల వేధింపులు తాళలేక ‘అంగన్వాడీ’ ఆత్మహత్యాయత్నం
రాయచోటి: తెలుగుదేశం పార్టీ నాయకులు, ఓ విలేకరి (సాక్షి, ఈనాడు కాదు) వేధింపులు భరించలేక అంగన్వాడీ కార్యకర్త పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన శనివారం అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, భర్త వీరభద్ర కథనం మేరకు.. దుద్యాల పంచాయతీ పెద్దజంగంపల్లికు చెందిన అంగన్వాడీ కార్యకర్త జె. నాగరత్నకు గత ప్రభుత్వంలో జగనన్న ఇల్లు మంజూరైంది. ఆమె భర్త వీరభద్ర వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడనే నెపంతో.. తమ ఇంటిని కూల్చివేస్తామని భార్యాభర్తలను టీడీపీ నేతలు, సదరు విలేకరి వేధింపులకు గురి చేస్తూండేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజూ కుటుంబంపై జరుగుతున్న ఘటనలకు బతుకు మీద విరక్తి చెందడంతో పురుగుల మందు తాగిందని భర్త వీరభద్ర కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంగన్వాడీల నిరసన.. అంగన్వాడీ వర్కర్ నాగరత్నమ్మకు మద్దతుగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట అంగన్వాడీలు నిరసన ప్రదర్శన చేశారు. సీఐటీయూ నేతలు రామాంజనేయులు, శ్రీనివాసులు, భాగ్యలక్ష్మి, సీపీఎం , సీపీఐ నాయకులు , ఐసీడీఎస్ పీడీ శశికళ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న టీడీపీ నాయకులు, ఓ పత్రిక విలేకరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.తాళ్లతో బంధించి దళిత యువకుడిపై దాడికాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో ఘటన ప్రేమ పేరుతో అల్లరి చేశాడని యువకుడిపై యువతి ఫిర్యాదుసామర్లకోట: ప్రేమిస్తున్నానని చెప్పిన ఓ దళిత యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసి తాళ్లతో బంధించి చిత్రహింసలు పెట్టారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పీబీ దేవం గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. సామర్లకోట సీఐ ఆర్.అంకబాబు కథనం ప్రకారం..గ్రామానికి చెందిన దళిత యువకుడు చాపల అజయ్ కుమార్.. అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ ఆమె ఇంట్లోకి వెళ్లి అల్లరి చేశాడు. దీనిపై ఆ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిని ప్రేమిస్తున్నానని చెప్పిన నేరానికి ఆమె కుటుంబ సభ్యులు ఆ యువకుడి చేతులు కట్టి, చిత్రహింసలకు గురి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డాడని దళిత సంఘాలు చెబుతున్నాయి. ఈ ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తామని సీఐ చెప్పారు. దళిత యువకుడిని చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. కాగా, దళిత యువకుడిపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ డిమాండ్ చేశారు. అజయ్, ఆ యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని, ఈ నెల 1న ఇద్దరూ కలసి బయటకు వెళ్లారని, రాత్రి సమయంలో ఆ యువతిని అజయ్ కుమార్ ఇంటి వద్ద క్షేమంగా దింపాడని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను చిత్రహింసలు పెడుతున్నారనే విషయం తెలిసి, అజయ్ శనివారం ఆమె ఇంటికి వెళ్లాడని దీంతో యువతి కుటుంబీకులు అతడిని తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. బందీగా ఉన్న అజయ్ కుమార్‌ను పోలీసులు విడిపించి, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పారు. -
టీడీపీ సమర్పించు కేబుల్ వార్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ సమర్పించు ‘కేబుల్ వార్’ ప్రస్తుతం ప్రదర్శితమవుతోంది. సంపాదనే పరమావధిగా, పార్టీ అండ చూసుకొని నియోజకవర్గంలో కేబుల్ ప్రసారాలపై ఆధిపత్యం కోసం నల్లపాటి, కోడెల వర్గీయులు పోరుకు కాలు దువ్వుతున్న తీరు ఆ పార్టీలో కాక రేపుతోంది. తండ్రి దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అధికారాన్ని అడ్డుపెట్టుకొని 2016లో కోడెల శివరాం కేబుల్ వ్యవస్థను తన గుప్పెట్లోకి తీసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో మరోసారి తన పట్టు నిలుపుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా కేబుల్ ఆపరేటర్లను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అండతో కేబుల్ ప్రసారాలు ప్రారంభించిన నల్లపాటి రాము కూడా విస్తరణకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత ఎన్సీవీ కేబుల్ వైర్లను కత్తిరించి అగ్గి రాజేశారు. ఈ వ్యవహారంతో నల్లపాటి వర్సెస్ కోడెల వర్గీయులు మరోమారు ఘర్షణకు దిగడంతో ఇరువర్గాలపై కేసుల నమోదు వరకు వ్యవహారం వెళ్లింది.ఎన్‌సీవీపై దాడి చేసి కబ్జా...ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నల్లపాటి రామచంద్రప్రసాద్(రాము) నరసరావుపేట నియోజకవర్గంలో నల్లపాటి కేబుల్ విజన్(ఎన్సీవీ) పేరిట ప్రసారాలను గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ప్రతినెలా రూ. లక్షల్లో ఆదాయం వస్తుండటంతో 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కోడెల శివరాం కేబుల్ వ్యవస్థను తన గుప్పెట్లో తీసుకునేందుకు కుట్ర పన్నారు. తన అనుచరులతో అప్పుడు వైఎస్సార్ సీపీలో ఉన్న నల్లపాటి రాముపై దాడి చేయడంతోపాటు ఎన్సీవీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేబుల్ వ్యవస్థను హస్తగతం చేసుకొన్న శివరాం రాజాగారి కోటలోని తన ఇంటి నుంచి కే–ఛానల్ పేరిట కేబుల్ కార్యకలాపాలు నిర్వహించారు. జీసీటీవీ కార్యాలయాన్నీ ధ్వంసం చేసి ఆ వ్యవస్థను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంత అరాచకం సృష్టించినా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి కేసులు, పరిహారం లేకుండా వ్యవహారాన్ని చక్కదిద్దారుఅగ్రవర్ణ వ్యక్తి ఫిర్యాదుతో అట్రాసిటీ కేసు...కే–ఛానల్లో భాగస్వామి అయిన విజయవాడకు చెందిన గన్నపనేని నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదుతో నల్లపాటి వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడమేంటని నల్లపాటి రామచంద్రప్రసాద్ దీనిపై గుంటూరు రేంజ్ ఐజీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఓ వైపు నా కేబుల్ వ్యవస్థను నాశనం చేస్తూనే, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అయిన తనపైనే అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారట. ఈ కేసు నమోదు వ్యవహారంలో కోడెల శివరాం తెరవెనుక ఉండి చక్రం తిప్పారనే చర్చ పేటలో నడుస్తోంది.మరోసారి పట్టు కోసం పోరు.. తలపట్టుకుంటున్న ఎమ్మెల్యే...తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నాయకులు కేబుల్ వ్యవహారంలో పోరుకు దిగడం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబుకు సంకటంగా మారింది. ఎటూ చెప్పలేని పరిస్థితుల్లో ఉండటంతో చేతులెత్తేశారు. అయితే ఎన్నికల ముందు కేబుల్ వ్యవస్థను అప్పగిస్తానని నల్లపాటి రాముకు ఆయన హామీ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల అనంతరం ఎన్సీవీ కేబుల్ ప్రసారాలను ప్రారంభించారు. కోడెల శివరాం మాత్రం కేబుల్ వ్యవస్థ తనకే కావాలంటూ ముందుకు రావడంతో ఎమ్మెల్యే ఎవరికి సర్దిచెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. 2016లో కేబుల్ అధిపత్యంలో జరిగిన పోరులో పెద్ద ఎత్తున ఆస్తుల ధ్వంసంతోపాటు వ్యక్తిగత దాడులు జరిగాయి. ప్రస్తుతం రెండు వర్గాలు ఒకే పార్టీలో ఉండి మరోసారి పోరుకు సిద్ధమవుతుండటంతో ఈ పరిణామం ఎటువైపు దారితీస్తోందన్న ఆందోళన టీడీపీలో నెలకొంది.టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లపాటి రాము నియోజకవర్గంలో కేబుల్ ప్రసారాలను రెండు నెలలుగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబు మద్దతు తెలపడంతో ప్రస్తుతం రాముకు చెందిన ఎన్సీవీ కేబుల్ ప్రసారాలు నడుస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేని కోడెల శివరాం భాగస్వామి నరసింహారావు తన సిబ్బందితో ఎన్‌సీవీకి చెందిన కేబుల్ వైర్లను కత్తిరించి ప్రసారాలకు అంతరాయం కలిగించారట. గత శుక్రవారం అరండల్‌పేటలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఎన్‌సీవీకి చెందిన కేబుల్ వైర్లను కోడెల వర్గానికి చెందిన కొందరు కత్తిరించారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్సీవీ సిబ్బంది అక్కడికి చేరుకొని వైర్ల కత్తిరించిన ముగ్గురు యువకులను పట్టుకుని కార్యాలయానికి తరలించారు. యువకులు దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని విడిపించారు. -
తెలంగాణలో బాబు రాజకీయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుపెట్టి బీజేపీ రాజకీయం ప్రారంభించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆడిన విధంగానే ఇక్కడ బీజేపీతో కలిసి నాలుగు స్తంభాలాట ఆడాలనేది చంద్రబాబు వ్యూహమని, ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల శక్తిని నిర్వీర్యం చేయలేరని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు బి.లింగం యాదవ్, గజ్జి భాస్కర్లతో కలసి ఆయన మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు హైదరాబాద్ ఎన్నోసార్లు వచ్చి వెళ్లారని, అయినా ఎవరికీ తెలిసేది కాదని, ఇప్పుడు విభజన సమస్యల పేరుతో మళ్లీ హైదరాబాద్‌లో బాబు ప్రవేశించారని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి బీజేపీ వేస్తున్న ఎత్తుగడలో చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ డైరెక్షన్లోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారని విమర్శించారు. అందుకే చంద్రబాబు వ్యాఖ్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా సమరి్థంచారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీకి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ అని, హైటెక్‌సిటీకి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలోనే పునాదులు పడ్డాయని, ఇప్పుడు చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చేసిన అభివద్ధినే బాబు, కేసీఆర్ కొనసాగించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తాను నామినేటెడ్ పదవులు ఆశించే వాడిని కాదని స్పష్టం చేశారు. రాజుయుద్ధం చేసి గెలిచినట్టు సంగారెడ్డి రాజ్యానికి మళ్లీ ప్రజలు గెలిపించి తనను రాజును చేస్తారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
Sanjay Raut: టీడీపీ స్పీకర్ పదవికి పోటీ చేస్తే.. ఇండియా కూటమి మద్దతిస్తుంది
ముంబై: లోక్‌సభ స్పీకర్ పదవికి అధికార ఎన్డీఏ పక్షంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోటీ చేస్తే ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతిచ్చే అవకాశముందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. లోక్‌సభ స్పీకర్ పోస్టు చాలా కీలకమైందని, ఈ పదవి బీజేపీకి దక్కితే, ప్రభుత్వానికి మద్దతిచ్చే టీడీపీ, జేడీయూలతో పాటు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరిలకు చెందిన పార్టీలను ముక్కలు చేస్తుందని ఆరోపించారు. బీజేపీని నమ్మి మోసపోయిన అనుభవం తమకు కూడా ఉందని రౌత్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌సభ స్పీకర్ పదవిని టీడీపీ కోరుతున్నట్లుగా విన్నాను. అదే జరిగితే, ఇండియా కూటమి ఈ విషయాన్ని చర్చిస్తుంది. మా భాగస్వామ్య పక్షాలన్నీ టీడీపీకి మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తాయి’అని చెప్పారు. నిబంధన ప్రకారం ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు కేటాయించాలన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అగ్ర నేతలు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్.. గతంలో బీజేపీ చేసిన తప్పిదాలను ఆర్ఎస్ఎస్ సరిచేయాలనుకోవడం మంచి పరిణామమేనని పేర్కొన్నారు. జూన్ 7వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన భేటీలో ప్రధాని మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభలో బీజేపీ నేతగా ఎన్నికయ్యారని రౌత్ అన్నారు. ‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రత్యేకంగా జరగలేదు. అలా జరిగిన పక్షంలో నేత ఎవరనే ప్రశ్న ఉదయిస్తుంది, అప్పుడిక పరిణామాలు వేరుగా ఉంటాయి’అని అభిప్రాయపడ్డారు. మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా మాత్రమే ఎన్నికవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని రౌత్ వ్యాఖ్యానించారు. -
సీనియర్లకు నిరాశే
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు చంద్రబాబు తీవ్ర నిరాశ కలిగించారు. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ నాయకులను కాదని కొత్త వారికి చోటు కల్పించారు. తొలి నుంచి పార్టీ కోసం పని చేసిన వారు, గతంలో మంత్రులుగా పని చేసి, పార్టీలో, జిల్లాల్లో కీలకంగా ఉన్న వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడంపై ఆ పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. 24 మంది మంత్రుల్లో 17 మంది తొలిసారిగా మంత్రి పదవులు చేపడుతున్నారు. 2014–2019 మధ్య కాలంలో మంత్రులుగా పనిచేసి ఇప్పుడు గెలిచిన వారికీ అవకాశం ఇవ్వలేదు. అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో అచ్చెన్నాయుడు, నారాయణ, లోకేశ్‌కు మాత్రమే మళ్లీ మంత్రి పదవులు వచ్చాయి. మిగతా వారికి పదవులు దక్కలేదు. గంటా, అయ్యన్నకు దక్కని పదవులు ఉమ్మడి విశాఖ జిల్లాలో సూపర్ సీనియర్లయిన అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యన్నారాయణమూర్తిని పక్కనపెట్టి జూనియర్ అయిన వంగలపూడి అనితకు మంత్రి పదవి ఇచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజును కాదని తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్, మరో నేత సంధ్యారాణిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడికి మాత్రమే మంత్రి పదవి దక్కగా కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్లకు మొండిచేయి చూపారు. తూర్పులో జనసేనకు ప్రాధాన్యం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు ప్రాధాన్యత లభించింది. ఆ జిల్లా నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ మంత్రులయ్యారు. టీడీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాసంశెట్టి సుభాష్‌కి అనూహ్యంగా మంత్రి పదవి లభించింది. ఈ జిల్లకే చెందిన సీనియర్లు జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై టీడీపీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముందుగా అనుకున్నట్లుగానే నిమ్మల రామానాయుడికి కేబినెట్ బెర్త్ దక్కింది. ఈ జిల్లాలో సీనియర్ నేతలు చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, రఘురామకృష్ణరాజుకు నిరాశే ఎదురైంది. ఎన్నికలకు ముందు పార్టీలోకొచ్చి మంత్రి అయిన పార్ధసారథి ఉమ్మడి కృష్ణా జిల్లాలో గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరాం తాతయ్య వంటి వారికి కాకుండా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి నూజివీడు నుంచి గెలిచిన కె. పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వడం గమనార్హం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబుకు నిరాశ తప్పలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏలూరి సాంబశివరావు, నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికీ అవకాశం రాలేదు. సీమలో సీనియర్లకు మొండి చేయి చిత్తూరు జిల్లా నుంచి ఒక్కరిక్కూడా మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఈ జిల్లాకు చెందిన అమర్నాథ్రెడ్డి, పులివర్తి నాని నిరాశకు లోనయ్యారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజుల రెడ్డి మంత్రి పదవులు ఆశించగా, మండిపల్లి రామప్రసాద్రెడ్డికి పదవి ఇచ్చారు. కర్నూలు జిల్లా నుంచి సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి మొండిచేయి చూపారు. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులును పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా వచ్చిన సవితకు మంత్రి పదవి ఇచ్చారు. సుజనా చౌదరికి ఎదురు దెబ్బ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం విశేషం. బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. గతంలో చంద్రబాబు కోటరీలో కీలక నేతగా ఉండి, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన్ని చంద్రబాబు కాదనలేరనే చర్చ జరిగింది. కానీ బీజేపీలోని ప్రధాన వర్గం, టీడీపీలోని మరో వర్గం ఆయన్ని వ్యతిరేకించడంతో మంత్రి పదవి దక్కలేదు. ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి పొందలేకపోవడం సుజనాకు తీవ్ర నిరాశ కలిగించే విషయమే. ఉత్తరాంధ్రకు తగ్గిన ప్రాధాన్యం మంత్రి పదవుల్లో ఉత్తరాంధ్రకు సరైన ప్రాధాన్యం లభించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 24 మంత్రి పదవుల్లో ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలకు కలిపి నాలుగు పదవులే దక్కాయి. ఆర్థిక రాజధానిగా భావించే విశాఖ జిల్లాకు ఒకే మంత్రి పదవి ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోనూ ఒక్కరికే అవకాశం రాగా, విజయనగరం జిల్లాలో మాత్రం ఇద్దరికి అవకాశం లభించింది. ఉమ్మడి తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు మూడు చొప్పున మంత్రి పదవులు లభించాయి. విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెండేసి చొప్పున పదవులు ఇచ్చారు. శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరి, కడప, చిత్తూరు జిల్లాలకు ఒకటి చొప్పున మంత్రి పదవులు దక్కాయి. జనసేనకు మూడే జనసేన తరఫున నలుగురైదుగురికి మంత్రి పదవులు లభిస్తాయని ఆ పార్టీ నేతలు ఆశించారు. కానీ మూడు మాత్రమే దక్కాయి. జనసేన నుంచి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు మాత్రమే అవకాశం దక్కింది. దీంతో మంత్రి పదవులు ఆశించిన కొణతాల రామకృష్ణ, పంతం నానాజీ, పులపర్తి రామాంజనేయులు అసంతృప్తిలో ఉన్నారు. -
ఎంతో కష్టపడ్డాం.. మంత్రి పదవి ఇవ్వండి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులపై ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంతో రాష్ట్ర మంత్రివర్గంపై ఇంకా పూర్తిస్థాయి కసరత్తు జరపలేదని చెబుతున్నారు. మంత్రులుగా ఎవరిని తీసుకోవాలనే దానిపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినా ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డామని, ఎంతో చేశామని తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పలు జిల్లాలకు చెందిన సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. నేరుగా ఆయన్ను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరడంతోపాటు వివిధ మార్గాల ద్వారా ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారు. లోకేశ్ చుట్టూ చక్కర్లు..చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్ పార్టీలో కీలకంగా ఉండడంతో అనేకమంది ముందు ఆయన్ను కలుస్తున్నారు. ఎన్నికలకు ముందు లోకేశ్ పలువురికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు వారంతా తమకిచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. నిత్యం ఆయన్ను కలుస్తూ తమ గురించి ఆలోచించాలని విన్నవించుకుంటున్నారు. అయితే, ఫలితాల తర్వాత ఇప్పటివరకు ఎవరికీ చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ మంత్రి పదవి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. జనసేన, బీజేపీకి మంత్రి పదవులు ఇవ్వాల్సి వుండడం, టీడీపీలోనే ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఎవరికీ ఏ విషయం చెప్పకుండా ఇంకా ఏమీ ఆలోచించలేదని సర్దిచెబుతున్నారు. తమ సంగతి చూడాలంటున్న సీనియర్లు..ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై దృష్టిపెడతారని చెబుతున్నారు. భవిష్యత్తులో తాము పోటీచేసే అవకాశం ఉండకపోవచ్చని, ఈసారి ఎలాగైనా మంత్రిగా అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి నేతలు ఈ కోవలో ఉన్నారు. సామాజికవర్గ నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని బొండా ఉమామహేశ్వరరావు వంటి నేతలు గట్టిగా అడుగుతున్నట్లు సమాచారం. క్లిష్ట సమయంలో పార్టీ కోసం పనిచేసిన తమకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఒత్తిడి తెస్తున్నారు.లోకేశ్‌పై ఆశలు పెట్టుకున్న జూనియర్లు..మరోవైపు.. లోకేశ్ అండతో పార్టీలో ఎదిగిన నేతలు, ఆయన ద్వారా సీటు దక్కించుకుని గెలిచిన జూనియర్లు తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అడుగుతుండడం చర్చనీయాంశమైంది. పెదకూరపాడు నుంచి గెలిచిన భాష్యం ప్రవీణ్ వంటి నేతల ఇలాంటి వారిలో ఉన్నారు. అయితే, అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేమని చూస్తామని మాత్రమే లోకేశ్ చెబుతున్నట్లు తెలిసింది. సీనియర్ నాయకులకు సైతం ఇప్పటివరకు మంత్రి పదవుల హామీ లభించలేదు. సాధారణంగా అయితే చంద్రబాబు ఈపాటికి మంత్రి పదవుల కోసం అభిప్రాయ సేకరణ, సామాజిక సమీకరణలు, సీనియారిటీ వంటి అంశాల ప్రాతిపదికగా కసరత్తు చేయాల్సి వుంది. కానీ, ఇప్పుడు అదేమీ లేకపోవడంతో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో, ఆయన మనసులో ఏముందోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీనియర్లు తమకు అవకాశం వస్తుందా? లేదా? అని చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే వారి నుంచి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మంత్రివర్గం, కీలక పదవుల గురించి ఎలాంటి విషయాలు బయటకు చెప్పకపోవడంతో పార్టీ నేతలు ఉత్కంఠకు లోనవుతున్నారు. -
మంత్రులుగా అనిత, పల్లాకు చాన్స్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో అమాత్య యోగం సీనియర్లకు దక్కే సూచనలు కనిపించడం లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో తమకు మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న సీనియర్లకు నిరాశే ఎదురుకానున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా సామాజికవర్గాల వారీగా ఎస్సీ, బీసీ కోటాలో ఇద్దరికి అవకాశం కల్పించాలని టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎస్సీ కోటాలో పాయకరావు పేట నియోజకవర్గం నుంచి గెలుపొందిన అనితతో పాటు గాజువాక నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన పల్లా శ్రీనివాసరావులకు బీసీ (యాదవ) కోటాలో మంత్రి హోదా దక్కనున్నట్టు తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వీరిద్దరికీ కూడా సమాచారం అందినట్టు ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, అయ్యన్న మాత్రం పట్టువదలకుండా తనకు మంత్రి పదవి కావాల్సిందేనని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా మంత్రి పదవుల కోసం తెలుగుదేశం పార్టీలో భారీగా పోటీ నెలకొంది. ఇక జనసేన తరపున అనకాపల్లి నుంచి గెలుపొందిన కొణతాల రామకృష్ణ పోటీలో ప్రాధాన్యత క్రమంలో ముందు వరుసలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు ఆశిస్తున్నారు. అయితే ఆయనకు కష్టమేనని తెలుస్తోంది.సీనియర్లను పక్కన పెట్టి...మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీగా సీట్లను సాధించింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీ నుంచి మినహా మిగిలిన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. దీంతో మంత్రి పదవుల కోసం భారీగా పోటీ నెలకొని ఉంది. అయితే ఈ సారి మంత్రి వర్గంలో తన మార్క్ స్పష్టంగా కనిపించేందుకు వీలుగా పూర్తిస్థాయిలో సీనియర్లను పక్కన పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్లగా ఉన్న గంటా శ్రీనివాసరావు, అయ్యన్న, బండారులను పరిగణనలోనికి తీసుకునే అవకాశం లేదని సమాచారం. ఇందులో బండారు, గంటాలకు సీటు కేటాయించే సమయంలోనే మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు అయ్యన్నకు మాత్రం కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. అయితే సీనియర్లను పక్కన పెట్టే ఉద్దేశంతో శ్రీకాకుళంలో కూడా అచ్చెన్నాయుడుకు ఇవ్వడం లేదని సమాచారం. ఇదే కోవలో ఇక్కడ కూడా అయ్యన్న పాత్రుడిని పరిగణనలోనికి తీసుకోవడం లేదని పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో కాకుండా మరో విధంగా గౌరవం కల్పిస్తానని అయ్యన్నను బుజ్జగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా సీనియర్లను పక్కన పెట్టి తన మార్క్ పూర్తిస్థాయిలో ఉండే విధంగా చంద్రబాబు వ్యవహరించనున్నట్టు మాత్రం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.జనసేనలోనూ పోటా పోటీ...జనసేన నుంచి కూడా మంత్రి పదవుల కోసం పోటీ నెలకొని ఉంది. ప్రధానంగా ఎమ్మెల్యేలుగా గెలిచిన కొణతాలతో పాటు పంచకర్ల, సుందరపు విజయ్‌కుమార్, వంశీకృష్ణలు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇప్పటికే యాదవ సామాజికవర్గం నుంచి పల్లాకు బెర్తు ఉండటంతో వంశీకృష్ణకు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు మొదటిసారిగా గెలిచిన సుందరపు విజయ్‌కుమార్‌కు కూడా కష్టమేనని సమాచారం. ప్రధానంగా కొణతాలతో పాటు పంచకర్ల రమేష్‌బాబుల మధ్య పోటీ ఉంది. అయితే గవర సామాజికవర్గానికి చెందిన కొణతాల వైపే పవన్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. కాపు కోటాలో పంచకర్ల కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు ఎవరికి యోగం వరించనుందో మరో రెండు, మూడు రోజుల్లో తేలనుంది. మొత్తంగా అధికారపక్షంలో అమాత్యుల కోసం భారీగా పోటీ నెలకొని... ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమై ఉన్నారు. -
అసైన్డ్ భూములపై రామోజీవి రోత రాతలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే దుగ్ధతో రామోజీరావు, పచ్చ మీడియా అసైన్డ్ భూములపై రోత రాతలు రాస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దళితులకు వారి భూములపై హక్కులు కల్పించాలనే సీఎం జగన్ చట్టం తెచ్చారని, అది కూడా 2003కు ముందు ఉన్న భూములపైనే హక్కులు కల్పించారని తెలిపారు. ఇదంతా పారదర్శకంగానే చేశారన్నారు. అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడింది తెలుగుదేశం పార్టీ నేతలు, పచ్చ మీడియానే అని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిలో దళితుల భూములు ఎకరం కేవలం రూ.5 లక్షలకు కొని రూ. కోట్లు దోపిడీ చేశారని చెప్పారు. రామోజీరావు దళితుల భూములు దోచుకుని ఫిలిం సిటీని నిర్మించింది వాస్తవం కాదా.. అని నిలదీశారు. అందరి గురించి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు పిచ్చి రాతలు రాసే రామోజీరావు ఈ విషయాలను ఈనాడులో ఎందుకు రాయలేదన్నారు. ఆయన అక్రమాలు చేసినా మంచి, ఇతరులు మంచి చేసినా అక్రమమా.. అని నిలదీశారు. వయస్సు పెరిగినా రామోజీ బుద్ధి మారలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. చంద్రబాబు దళితవ్యతిరేకి అని చెప్పారు. దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అన్న చంద్రబాబును ప్రజలు ఎప్పుడో చెత్తబుట్టలో పడేశారని తెలిపారు. చంద్రబాబుకు, రామోజీకి దళితుల అభ్యున్నతి ఇష్టంలేదని, అందుకే దళితులకు లబ్ధి చేకూర్చే సీఎం జగన్ నిర్ణయంపై విషం కక్కుతున్నారని చెప్పారు. తాము చంద్రబాబులా దళితుల భూములను కొట్టేసి తప్పుడు పనులు ఎన్నటికీ చేయబోమన్నారు. రామోజీ వాస్తవాలు గ్రహించాలని, సీఎం జగన్ ప్రభుత్వంపై పిచ్చి రాతలు మానుకోవాలని అన్నారు. -
పల్నాడుపై పగబట్టిన బాబు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, నరసరావుపేట : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు పల్నాడుపై పగపట్టారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్న వరుస పరిణామాలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా వరుసగా చావు దెబ్బ తింటున్న తెలుగుదేశం ఎలాగైనా పల్నాడులో ఫ్యాక్షనిజాన్ని ఎగదోసి, వర్గ వైషమ్యాలను పెంచి పోషించడం ద్వారా తన ఉనికిని నిలబెట్టుకునేందుకు శతధా ప్రయత్నిస్తోంది.అందులో భాగంగా వరుస దాడులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు పల్నాడు ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మాచర్ల నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ తరఫున పోటీ చేసిన జూలకంటి దుర్గాంబ గెలుపొందారు. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి గెలుపొందారు. 2009, 2012 (ఉప ఎన్నిక), 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తున్నారు. కాగా దుర్గాంబ కుమారుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో మాచర్లలో సైకిల్ మూలన పడింది. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. టీడీపీ బలోపేతమంటూ...మాచర్లలో టీడీపీని బలోపేతం చేయాలంటే పిన్నెల్లిని అడ్డు తొలగించడమే మార్గం అని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు.. అందుకు అనుగుణంగా దాడుల ప్రణాళిక రచించారు. అందులో భాగంగా 2020 జనవరి ఏడో తేదీన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మంగళగిరికి సమీపంలోని కాజ టోల్‌ప్లాజా వద్ద టీడీపీ శ్రేణులతో భారీ ఎత్తున దాడి చేయించారు. ఎమ్మెల్యే వాహనాన్ని రాళ్లతో ధ్వంసం చేశారు. గన్‌మెన్ గాయాలపాలయ్యారు. అయితే ఆ రోజు ఎమ్మెల్యే బయటపడ్డారు. ఆ క్రమంలో భాగంగా రౌడీలు, గూండాలనే గుర్తింపున్న బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలకు మందీ మార్భలాన్ని తోడిచ్చి విజయవాడ నుంచి 2020 మార్చి 11న మాచర్లకు పంపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు, స్థానికులు తిరగబడి బొండా, బుద్దా బృందాలను వెంటపడి తరిమేశారు. దీంతో చంద్రబాబు.. ఫ్యాక్షనిజం, హత్యల నేపథ్యమున్న జూలకంటి బ్రహ్మానందరెడ్డిని మళ్లీ రంగంలోకి దింపుతూ 2021 డిసెంబర్లో మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. 2010 మార్చి పదో తేదీన ఆత్మకూరు వద్ద ఏడుగురి హత్య కేసులో జూలకంటి ప్రథమ ముద్దాయి. చివరకు తన బాబాయి కుమారుడైన సాంబిరెడ్డి పొలాల్లో దాక్కుని ఉండగా హత్య చేయించారని అందరూ చెప్పుకుంటారు. పోలేపల్లి శివారెడ్డి హత్య కేసులోనూ జూలకంటిది ప్రధాన పాత్ర అని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మాచర్ల ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వరుస దాడులు, దొమ్మీలు, హత్యా ప్రయత్నాల పరంపర కొనసాగుతోంది. ఈ ఎన్నికల తర్వాత అది శ్రుతి మించింది. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై విచ్చలవిడిగా టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. వినుకొండ, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లోనూ టీడీపీ దాడులకు తెగబడింది. మాచర్ల నియోజకవర్గంలో అశాంతికి ప్రధాన కారణం పోలీసులేనని, ప్రధానంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కారంపూడి సీఐ నారాయణస్వామి తీరు వల్లే గొడవలు పెరిగాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బహిరంగా నిప్పులు చెరగడం పల్నాడులో పరిస్థితికి అద్దం పడుతోంది. పదుల సంఖ్యలో ఊళ్లలో విధ్వంసం» మాచర్ల రూరల్ మండలంలోని కొత్తూరు, కంబంపాడు, భైరవునిపాడు, వెల్దుర్తి మండలం లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సంపేట, రెంటచింతల మండలం రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు, కారంపూడి మండలం ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి, దుర్గి మండలం ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి తదితర గ్రామాల్లో టీడీపీ దాడులు కొనసాగాయి.» దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లోని కేశానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, బ్రాహ్మణపల్లి, పెద అగ్రహారం, జానపాడు, వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం, సత్తెనపల్లి నియోజకవర్గంలోని పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుంట్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్లలోనూ వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేశారు.» నరసరావుపేట టౌన్, దొండపాడు, పమిడిపాడు, పెదకూరపాడు మండలం యర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు, చిలకలూరిపేటలోని అప్పాపురం గ్రామాల్లో టీడీపీ దాడులకు తెగబడింది. అభివృద్ధిలో పోటీ పడలేకే విధ్వంసంచంద్రబాబు ఏలుబడిలో అభివృద్ధి ఊసే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పల్నాడులో అభివృద్ధి పరుగెత్తుతోంది. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటైంది. పిడుగురాళ్లలో మెడికల్ కాలేజీ రూపు దిద్దుకుంటోంది. వరికపూడిసెలకు మోక్షం కలిగింది. గురజాల నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో తాగునీటి వసతి కలిగింది.నరసరావుపేటలో జేఎన్టీయూ కాలేజీకి శాశ్వత భవనాలు ఒనగూరాయి. రొంపిచర్ల, మాచర్లలో కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. పులిచింతల ప్రాజెక్టు దిగువన మాదిపాడు వద్ద వంతెన నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. తద్వారా అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, గుంటూరు వరకు, మరోవైపు జగ్గయ్యపేటకు రవాణా వసతి మెరుగు పడనుంది.కొండమోడు–పేరేచర్ల, సాగర్– దావుపల్లి, మాచర్ల– దాచేపల్లి, నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు.. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి గొడవలు చేయిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
రఘురామ, గంటాకు బ్యాంకుల షాక్
సాక్షి, అమరావతి: రుణాలు తీసుకొని ఎగవేసిన కేసుల్లో ఉండి, భీమిలి అసెంబ్లీ స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావుకు ఎన్నికలకు రెండు రోజుల ముందు బ్యాంకులు గట్టి షాక్ ఇచ్చాయి. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఎగవేసిన కేసుల్లో ఆస్తులను వేలం వేయడానికి నోటీసులు జారీ చేశాయి. ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఇందులో రూ. 826.17 కోట్ల రుణాన్ని కంపెనీ అవసరాలకు వాడకుండా వేరే ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసగించారు. వడ్డీ కూడా చెల్లించలేదు. ఈ వ్యవహారం తెలిసి బ్యాంకులు సీబీఐని ఆశ్రయించడంతో ఆయన మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బ్యాంకులు దివాళా పిటిషన్ దాఖలు చేయడంతో రూ.361.96 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టి) హైదరాబాద్ శాఖ పత్రికా ప్రకటనలు జారీ చేసింది. ఇండ్ భారత్ థర్మల్‌కు చెందిన బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఆస్తులు రూ.180.98 కోట్లు, తమిళనాడు టూటికోరిన్లో ఉన్న 311.72 ఎకరాల ఫ్యాక్టరీ స్థలాలు రూ.164.73 కోట్లు, కర్ణాటకలోని కార్వార్ ప్రాంతంలో ఉన్న 129.73 ఎకరాలు రూ.11.74 కోట్లు, ఇతర సెక్యూరిటీలు, ఆర్థిక ఆస్తులకు రూ.4.51 కోట్లు రిజర్వ్ ప్రైస్‌గా నిర్ణయించింది. ఈ ఆస్తులకు సంబంధించిన జూన్ 13న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం వేయనున్నట్లు ఎన్సీఎల్టీ ఆ ప్రకటనలో పేర్కొంది.రూ.400.37 కోట్లు ఎగవేసిన గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి, భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుమారు రూ.400.37 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఆయన ఆస్తులను స్వా«దీనం చేసుకోవడానికి బ్యాంకులు ఐదేళ్లుగా పోరాడుతున్నాయి. గంటాకు చెందిన ప్రత్యూష గ్రూపు కంపెనీలు ఈ రుణం తీసుకొని, ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. దీంతో ఇండియన్ బ్యాంకు ఆస్తుల స్వా«దీనానికి రంగంలోకి దిగింది. విశాఖ నగరం గంగుల వారి వీధిలోని సర్వే నెంబర్ 13లో ఉన్న వాణిజ్య భవనాన్ని వేలానికి పెట్టింది. జూన్ 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు వేలం జరుగుతుంది. ఈ భవనం రిజర్వు ధరను రూ.2.84 కోట్లుగా బ్యాంకు నిర్ణయించింది. -
టీడీపీ దిగజారుడు రాజకీయం
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు ఈస్ట్: ఓటమి తప్పదని తేలిపోవడంతో చంద్రబాబు, లోకేశ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలు దిగజారుడు రాజకీయానికి పాల్పడుతున్నారు. ఓటర్లను గందరగోళానికి గురి చేసి, వైఎస్సార్సీపీ ఓట్లను తగ్గించాలన్న కుట్రతో మంగళగిరి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల పేర్లతో ఉన్న మహిళలతో నామినేషన్లు వేయించారు. మంగళగిరిలో ఇద్దరితో ఇలా నామినేషన్లు వేయించారు. గుంటూరు పశ్చిమలో ఓ దళిత మహిళ పేరిట నామినేషన్ వేయించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి, రచ్చయింది. ఆ వీడియో బయటకు వచ్చింది. టీడీపీ నాయకులు తన కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె పేరుతో టీడీపీ నాయకులే నామినేషన్ వేశారు. టీడీపీ నేతలు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆ దళిత మహిళ స్పష్టం చేయడంతో వారి కుట్ర బట్టబయలైంది.గుంటూరు పశ్చిమలో కుట్ర బెడిసి కొట్టిందలా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఓటర్లను అయోమయానికి గురి చేసేందుకు అదే పేరుతో ఉన్న మరో మహిళ పేరిట నామినేషన్ వేయించారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి భర్త రామచంద్రరావు స్వయంగా ఈ వ్యవహారం నడిపించిన వీడియో బయటకు వచ్చింది. ఆయన శ్రీనివాసరావుపేటలో ఉంటున్న దళిత మహిళ విడదల రజిని ఇంటికి వెళ్లి నామినేషన్ వేసేలా ప్రలోభ పెట్టారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఆమె భర్తకు ఉద్యోగంతో పొటు సొంత ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నామినేషన్ వేసే వరకూ తమతోనే ఉండాలని, స్కూృటినీ అయిన వెంటనే తమిళనాడులోని వేళంగిణి మాత టెంపుల్‌కు పంపిస్తామని, ఎన్నికలు ముగిసే వరకూ అక్కడే ఉండి రావాలని, ఖర్చంతా తాము పెట్టుకుంటామని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆమెను తీసుకువెళ్లి టీడీపీ అభ్యర్థి ఉండే అపార్ట్మెంట్లోనే ఉంచారు. తన కుమార్తెను టీడీపీ నాయకులు తీసుకువెళ్లడాన్ని చూసిన మహిళ తండ్రి దేవరాజ్ తన కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంపాలెం సీఐ లోకనాథం, సిబ్బంది గాలించి నగరంపాలెం మెయిన్ రోడ్డులోని అపార్ట్మెంట్లో ఉందని గుర్తించారు. ఆమెను అక్కడి నుంచి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమె తండ్రికి పోలీసులు అప్పగించారు. ఆమె తన తండ్రితో వెళ్లిపోవడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. ఆమెను వైఎస్సార్సీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ కార్యకర్తలతో కలిసి నగరంపాలెం పోలీసు స్టేషన్ ముందు హడావుడి చేశారు. అప్పటికే ఆమె నుంచి నామినేషన్ పత్రాలపై సంతకాలు తీసుకున్న టీడీపీ నాయకులు ఆమె తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారమంతా తెలుసుకున్న వైఎస్సార్సీపీ లీగల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి, లీగల్ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు ఝాన్సి, కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, ఇతర నాయకులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని దళిత మహిళ రజినిని కిడ్నాప్ చేసిన టీడీపీ నాయకులపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.రాజకీయాల్లోకి తనను లాగొద్దన్న దళిత మహిళఈ రాజకీయాల్లోకి తనను లాగొద్దని దళిత మహిళ విడదల రజిని కోరారు. ఈమేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. తనకు నామినేషన్ వేయడం ఇష్టంలేదని, టీడీపీ నాయకులు తన వద్ద నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని స్పష్టం చేశారు.మంగళగిరిలో ఇద్దరు లావణ్యలతో నామినేషన్లుఈసారి మంగళగిరిలో గెలుస్తానంటూ లోకేశ్ ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఆయనపై రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన బీసీ వర్గాలకు చెందిన మురుగుడు లావణ్య పోటీ చేస్తుండటంతో ఆయన ఓటమి ముందే ఖాయమైపోయింది. దీంతో ఓటర్లను గందరగోళానికి గురి చేసేందుకు అదే పేరు ఉన్న మరో ఇద్దరు మహిళలతో ఇండిపెండెంట్లుగా చివరిరోజున నామినేషన్లు వేయించారు. వీరిలో ఓ మహిళ ఇంటిపేరు కూడా మురుగుడే కావడం గమనార్హం. రాజీవ్ గృహకల్పలో ఉండే బంగారం పని చేసే మురుగుడు సాంబశివరావు భార్య మురుగుడు లావణ్య గురువారం నామినేషన్ వేశారు. లావణ్య అనే పేరుతో ఉన్న మరో మహిళతో కూడా నామినేషన్ వేయించారు. -
అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన టీడీపీ అభిమానులనూ ఆకట్టుకుంటోంది. గతంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అభిమాని అయిన సీనియర్ జర్నలిస్ట్ రేణుక పోతినేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనిక పాలనపై ప్రత్యేకంగా ఓ పుస్తకం రూపొందించారు. ‘జగన్ విజన్.. ట్రాన్స్ఫార్మింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ’ శీర్షికతో ఆమె రచించిన ఈ పుస్తకం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. సీఎం జగన్ నాయకత్వంలో ఏపీలో కనిపిస్తున్న అద్వితీయ మార్పులను ఎలుగెత్తి చాటుతూ, మాజీ సీఎం చంద్రబాబు హయాంలోని అవినీతి కోణాలను ఈ పుస్తకం తూర్పారపట్టింది.ఏపీలో అభివృద్ధి, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయం, విద్య, ఆక్వా రంగం అభివృద్ధి, వైద్యం, సంక్షేమం, భూ సంస్కరణలు, ఇళ్ల నిర్మాణం, మేనిఫెస్టో విశ్వసనీయత, సీఎం జగన్ స్కీములు, చంద్రబాబు స్కాములను వివరిస్తూ, అప్పటి.. ఇప్పటి అప్పులపై ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా సమగ్ర వివరాలు అందించిన ఈ పుస్తకం అందరినీ ఆకట్టుకుంటోంది.సీఎం జగన్ సమగ్ర పాలనా స్వరూపాన్ని ఆవిష్కరించింది. ఒకప్పుడు చంద్రబాబు అభిమాని అయిన రేణుక పోతినేని.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచుతున్న ప్రజా సంక్షేమ పథకాలను చూసి ఈ పుస్తకాన్ని రూపొందించడమే కాకుండా, సీఎం జగన్ పాలనను సామాజిక మాధ్యమాల్లో ప్రశంసిస్తున్నారు.చరిత్ర ఎరుగని దుర్మార్గపు దాడి..ఏపీ అభివృద్ధి, సంక్షేమంపై గత ఐదేళ్లుగా ప్రధాన మీడియాల్లో పదేపదే తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు రేణుక తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు. ‘నిజం రెండు అడుగులు వేసేలోపు.. అబద్ధం వెయ్యి అడుగులు వేస్తుంది’ అనే నినాదాన్ని టీడీపీ, దాని అనుబంధ మీడియా సంస్థలు నమ్ముకున్నాయయి’ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్‌తో ప్రధాన, సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోయాయన్నారు.తెలుగుదేశం పార్టీ, న్యూట్రల్ ముసుగులో ఉన్న రెండు పత్రికలు, ఐదారు మీడియా సంస్థల అసత్య ప్రచార దాడిలో ఎన్నో వాస్తవాలు మరుగున పడిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ తరఫున 1.50 లక్షల వాట్సాప్ గ్రూప్‌లు, 100కు పైగా పెయిడ్ మీమర్స్, వెయ్యికి పైగా ఫేస్బుక్ పేజీలను నడిపిస్తూ నిత్యం ప్రజా పాలనపై చరిత్రలో ఎన్నడూ లేనంతగా దుర్మార్గపు దాడికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు.ఐదేళ్లలో ఏపీ సాధించిన అభివృద్ధి, సంక్షేమం వివరాలు ప్రజలకు గణాంకాలతో సహా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పారు. సీఎం జగన్ తీసుకునే నిర్ణయాల వెనుక ఏపీ భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా మారుతుందో, ఎంతటి గొప్ప మార్పులు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ అవగతం చేసుకోవడానికే కచ్చితమైన సమాచారంతో ‘జగన్ విజన్’ పుస్తకాన్ని తీసుకొచ్చినట్టు’ తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. ఆమె చెప్పిన అక్షర సత్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. -
గంటా.. ఒక భార్య.. రెండు పాన్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు చట్టం తెలియదా? లేకపోతే తననెవరేం చేస్తార్లే అన్న ధీమానా? ఎందుకంటే ఏ వ్యక్తికైనా రెండు పాన్ నెంబర్లుండటం చట్టరీత్యా నేరం. శిక్షార్హులు కూడా. కానీ గంటాది కళ్లు మూసేసుకుని... తననెవ్వరూ చూడటం లేదనుకునే బాపతు. అందుకే... గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు తన భార్య పాన్ నంబరును మార్చేశారు. భార్య శారద పేరుతో గత ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్‌కు, ఈ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్‌కు సంబంధం లేకపోవటంతో దీనివల్ల ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమోనని ఆయన అనుచరులే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు.... నాటి అఫిడవిట్లో తన సతీమణి శారద పాన్ నంబరు ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. ప్రతిసారీ నియోజకవర్గాన్ని మార్చే అలవాటున్న గంటా ఈ సారి పట్టుబట్టి, చంద్రబాబు నాయుడిని ఎదిరించి మరీ భీమిలి టికెట్టు సాధించుకున్నారు. శుక్రవారం నామినేషన్ వేస్తూ... అఫిడవిట్ దాఖలు చేశారు. దీన్లో భార్య శారద పాన్ నంబరును మాత్రం ఏబీపీపీజీ2216ఏగా పేర్కొన్నారు. అంటే... 2215ఏ, 2216ఏ నంబర్లతో దాదాపు ఒకేసారి రెండు పాన్ నంబర్లను తీసుకున్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. అంతా నగదు రూపంలోనే...! ఆదాయపన్నుశాఖ చట్టం ప్రకారం నగదు లావాదేవీలు రూ.2 లక్షలకు మించి జరగకూడదు. ఒకవేళ జరిగితే అది నేరం అవుతుంది. అయితే, గంటా శ్రీనివాసరావు తన సతీమణి పేరుతో 2018లో భీమునిపట్నం పరిధిలో భూమిని కొన్నపుడు పెద్దమొత్తంలో నగదు రూపంలోనే చెల్లించడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. రూ.92,98,000ను నగదు రూపంలోనే ఇచ్చినట్టు చూపించారు. అంతేకాకుండా మరో రూ.25 లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపి సర్వే నంబరు టీఎస్ నంబరు 1,490, బ్లాక్ నంబరు 17, వార్డు నంబరు 24లోని 1,936 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్ నంబరును పేర్కొనడంతో పాటు ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ గంటా శారద 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు ఏ ఒక్క సంవత్సరంలోనూ ఐటీ రిటర్న్‌లు దాఖలు చెయ్యలేదు. వాస్తవానికి ఆ పాన్ నెంబర్లను చూసినపుడు రెండూ ఒకే సమయంలో తీసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఐటీ రిటర్నుల కోసం ఒకటి, భారీ నగదు లావాదేవీల కోసం మరొకటి వినియోగిస్తూ ఉండవచ్చని, ఆ రెండింటినీ చెక్ చేస్తే ఆదాయపు పన్నును మోసం చేసిన వ్యవహారాలు చాలావరకూ బయటపడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇలా రెండు పాన్ నెంబర్లను కలిగి ఉండటం నేరమని, మంత్రిగా పనిచేసిన గంటాకు ఇది తెలియనిదేమీ కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా అఫిడవిట్ ప్రకారం గంటాపై ఏడు కేసులున్నాయి. భార్యాభర్తలిద్దరి పేరిటా మొత్తం రూ.23.36 కోట్ల స్థిర, చరాస్తులున్నాయని, కాకపోతే సొంత కారు మాత్రం లేదని గంటా పేర్కొన్నారు. ఆస్తుల కొనుగోలుకు మరో పాన్ అసలు కథేమిటంటే... 2018లో తన సతీమణి పేరుతో కొనుగోలు చేసిన ఆస్తి కోసం పాన్ నంబర్‌ను ఏబీపీపీజీ2216ఏగా గంటా పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా 2019 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. అంటే... అప్పట్లో కొన్న ఆస్తిని గత ఎన్నికల్లో చూపించలేదు. పైపెచ్చు 2018లో కొనుగోలు చేసిన భూ లావాదేవీలన్నీ నగదు రూపంలోనే సతీమణి పేరుతో కొనసాగించిన గంటా.. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ రిటర్న్స్‌ను కూడా దాఖలు చెయ్యలేదు. ఈ వ్యవహారాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి భూ లావాదేవీల కోసం పేర్కొన్న పాన్ నంబర్‌ను అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. నిజానికి ఒకే వ్యక్తికి రెండు పాన్ నంబర్లు ఉండటం చట్టరీత్యా నేరమని, అంతేగాకుండా ఒక్కోసారి ఒక్కో విధంగా ఎన్నికల అఫిడవిట్లో వివరాలివ్వటం కూడా ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. -
కాపీ కొట్టిన మేనిఫెస్టోనే అంతా చెబుతోంది!
తెలుగు దేశం పార్టీ కోసం పనిచేస్తున్న ‘కన్సల్టెన్సీ’ హెడ్ రాబిన్ శర్మ ‘‘ఎన్నికల్లో టీడీపీ గెలుపు దుర్లభమనీ, తాము చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదనీ, చంద్రబాబుకు ఏమాత్రం విశ్వసనీయత లేక పోవడమే అసలు సమస్య’’ అనడం రేపు ‘పోలింగ్ బూత్’లో తటస్థ ఓటరుపై గట్టి ప్రభావం చూపి స్తుంది. ఎందుకంటే, ఇది మరొక ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటున్న మాట కాదు. మన కోసం మనం ‘ఫీజు’ కట్టి పెట్టుకున్న ‘సర్వీస్ ప్రొవైడర్’ వ్యక్తం చేసిన నిస్సహాయత. ఇది ఎటువంటిది అంటే, మన ‘ఫ్యామిలీ డాక్టర్’– ‘‘మీ జబ్బును నేను తగ్గించ లేకపోతున్నాను’’ అని పెదవి విరవడం వంటిది. వాళ్ళు అటువంటి ముగింపుకు రావడానికి కారణం, ఆరు నెలల క్రితం ‘మేనిఫెస్టో’లో నుంచి ‘బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ’ పేరుతో ‘సూపర్ సిక్స్’ పథకాలు ‘ట్రయిల్’ కోసం విడుదల చేశారు. ఆ తర్వాత దానికి విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజల నుండి స్పందన లేదు. ఈ ‘టీం’ ఇటువంటి అభిప్రాయానికి రావడానికి ఇదే ప్రధాన కారణం అయింది. ఈ దశలో ‘రిస్క్ మేనేజ్మెంట్’ కోసం ప్రశాంత్ కిషోర్ తెరపైకి వచ్చి, తన ప్రకటనకు ముందూ వెనుకా ఎటువంటి వివరణ లేకుండా, ‘ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవదు’ అని ఏకవాక్య ప్రకటన చేసి మళ్ళీ ఎక్కడా కనిపించకుండా నిష్క్రమించారు. ఈ ప్రకటన మనం నమ్మడం కోసం ముందుగా – ‘ఈ ఎన్నికల్లో నేను టీడీపీ కోసం పనిచేయడం లేదు’ అని ప్రకటించాక, ‘వైఎస్సార్సీపీ గెలవదు’ అన్నారు. ఇది జరిగాక కావొచ్చు, చివరి ప్రయత్నంగా ప్రశాంత్ కిషోర్– ‘వదలొద్దు మరో ప్రయత్నం చేయండి’ అని రాబిన్ శర్మ బృందానికి సూచించారు. ఇప్పుడు టీడీపీ పూర్తి స్థాయిలో ‘మేనిఫెస్టో’ వెల్లడించిన తర్వాత కూడా అన్ని ‘సర్వే’ నివేదికలు జగన్‌కు అనుకూలంగా ఉన్నాయి. సరిగ్గా ఈ కాలంలోనే, చంద్రబాబు తన ప్రసంగాల్లో ‘బ్యాలెన్స్’ కోల్పోవడం మొదలయింది. సభకు వచ్చినవాళ్లను ‘మీ ఊళ్లో గంజాయి దొరుకుతోందా’ అని గుచ్చి గుచ్చి అడుగుతూ తనకు అనుకూలమైన సమా ధానం పొందేందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థిని సాధారణంగా శత్రు వుగా చూడరు. జగన్ విషయంలో బాబు ఆ హద్దు ఎప్పుడో దాటారు. ఎప్పుడైనా ఎన్నికల ‘నోటిఫికేషన్’ అంటే చంద్ర బాబుకు ఆయన పార్టీ అభ్యర్థులకు అది ‘టెండర్ నోటీస్’ వంటిది. అందుకే ఎన్నికల సమయానికి ఆర్థిక నేరస్థులూ, ‘ఎన్నారై’లూ అ పార్టీలో అభ్య ర్థులుగా ఉంటారు. వీరి వద్ద నుంచి నిధులను సమీకరించి ముందుగా వాటిని తన నేలమాళిగలో దాచి, అప్పుడు తన పార్టీ ‘మేనిఫెస్టో’ అంటూ బాబు ప్రజల ముందు ‘టెండర్’ దాఖలు చేస్తారు. గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఐదేళ్ళ సంపాదనముందుగా దాచిన దానికి అదనం. ప్రతి ఎన్నికలో బాబుది ఇదే ‘ఫార్ములా’. అందుకే, ప్రతిపక్ష నాయ కుడిగా బాబు ఎలాగోలా నెట్టుకుంటూ తన పార్టీ ఉనికిని ఎన్నికల వరకు దొర్లించి, చివరిలో ఎవరో కొందరి మద్దతు తీసుకుని; మళ్ళీ తన టోపీని ఎన్నికల ‘ఎరీనా’లోకి విసురుతారు. గెలిస్తే, ‘డబల్ బెనిఫిట్’; ఓడిపోతే, ‘సింగిల్ బెనిఫిట్’. బాబుకు ఎన్నికలు అంటే, ఇంత ‘సింపుల్’.అందుకే గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను తప్పు పట్టిన బాబు, ఎన్నికల ముందు ‘సూపర్ సిక్స్’ అంటూ అరువు తెచ్చుకున్న అంశాలతో ‘కిచిడీ’ మేనిఫెస్టో’ ప్రకటించారు. అందులోని అంశాలు: టీడీపీ అధికారంలోకి వస్తే ‘మహా శక్తి’ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు ‘స్త్రీనిధి‘ కింద నెలకు 1500 రూపాయలు, ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే.. వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున, ‘దీపం‘ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయడం, స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. జగన్ సంక్షేమ పథకాలను తప్పు పట్టి, మళ్ళీ వాటినే పేర్లు మార్చి అమలుచేస్తాననే ఈ ‘యూ టర్న్’ ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు మనం మూడు చోట్ల వెతకాలి. మొదటిది అమరావతి. బాబును నమ్మి అక్కడ భూములు కొన్న ‘ఎన్నారై’లకు ఈ ఎన్నికల్లో బాబు గెలుపు అవసరం. అది వారికి జీవన్మరణ సమస్య. అందుకే వాళ్ళు స్వయంగా నెల ముందుగా ఇండియా వచ్చి టీడీపీ కోసం ఇక్కడ ప్రచారం చేసే పనిలో ఉన్నారు. రెండవది – ‘మార్గదర్శి’ రామోజీరావు భవిష్యత్తు. మూడవది – పై రెండింటి కంటే సంక్లిష్టమైన కొడుకు లోకేష్ చుట్టూ అల్లుకుని ఉన్న కుటుంబ చట్రంలో నుంచి బాబు క్షేమంగా బయటపడటం. బయట నుంచి దీన్ని చూస్తున్న మనకే వీటికి పరిష్కారం ఉందని అనిపించడం లేదు. ఇంకా మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయో వాటి సంగతి ఏమిటో... మరో నెల రోజులు కాలం తర్వాత తెలుస్తుంది. - వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు మొబైల్: 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
పచ్చ పార్టీ ప్రలోభాలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల/చీరాల: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్‌కు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి బెంబేలెత్తిపోతున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇక తమకు ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చి అడ్డదారులకు తెరలేపారు. ఓటర్లపై వారికి నమ్మకం సన్నగిల్లడంతో ఇబ్బడిముబ్బడిగా డబ్బులు వెదజల్లి ప్రత్యర్థి పార్టీకి చెందిన చోటామోటా నేతలను, కార్యకర్తలను లోబర్చుకునేందుకు బరితెగిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో నేతకు రూ.5 లక్షల నుంచి రూ.పది లక్షల వరకూ చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థాయి కార్యకర్తలకైతే రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు ఎరవేస్తున్నట్లు సమాచారం. ఈ కొనుగోళ్ల వ్యవహారం వారం రోజులుగా ఊపందుకున్నట్లు తాజాగా చోటుచేసుకున్న ఘటనల బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే.. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మకు చెందిన రూ.56 లక్షల డబ్బు కట్టలను గురువారం ఆయన మెరైన్ కంపెనీకి చెందిన కంటైనర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో టీడీపీ నేతల అక్రమాలు నిజమేనని స్పష్టమవుతోంది. అధికార పార్టీ నేతలకు రూ.లక్షల్లో చెల్లింపులు.. ఇదిలా ఉంటే.. బాపట్ల నియోజకవర్గంలో నామమాత్రంగా కూడా బలంలేని టీడీపీ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మ కేవలం డబ్బు బలంతోనే టీడీపీ టికెట్ సంపాదించారని అందరికీ తెలిసిన విషయమే. ఆ బలంతోనే ఎన్నికల్లో నెగ్గేందుకు వర్మ సిద్ధమయ్యారు. కానీ, కొంతకాలంగా ఓటర్లకు చీరలు పంపిణీ చేసినా ప్రజల నుంచి స్పందన కరువవడంతో ఆయన డబ్బు రాజకీయానికి తెరతీశారు. గ్రామాల్లో ఉన్న చోటామోటా నేతలు, కార్యకర్తలను ప్రలోభపెట్టి డబ్బులు ముట్టజెప్పి కొనుగోళ్లకు తెరతీశారు. అధికార పార్టీలో పదవులున్న నేతకు రూ.10 లక్షలు, చోటా నేతకు రూ.5 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. గ్రామస్థాయిలో అయితే రూ.లక్ష నుంచి రెండు లక్షలు ఇస్తున్నారు. పార్టీలో చేరిన వారికి రూ.పదివేలు చెల్లిస్తూ కండువాలు వేస్తున్నారు. అదే అధికార పార్టీ నుంచి పచ్చ పార్టీలో చేరితే మండల స్థాయి ప్రజాప్రతినిధులకు రూ.25 నుంచి 30 లక్షల ఆఫర్ చేస్తున్నారు. అద్దంకి, పర్చూరు, రేపల్లె, వేమూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపిన వేగేశన నరేంద్ర వర్మపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారపార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా కంటైనర్ల ద్వారా తరలింపు? రాయల్ మెరైన్ అధినేత నరేంద్రవర్మ గత ఎన్నికల్లోనూ పోటీచేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారన్న ఆరోపణలకు ఈ కంటైనర్ వ్యవహారం బలం చేకూరుస్తోంది. కంటైనర్ల ద్వారా రొయ్యల బాక్సుల మధ్యలో డబ్బు తీసుకొస్తే ఎటువంటి అనుమానం రాదని, అందుకు పక్కా ప్లానుతో రాయల్ మెరైన్‌కు కంటైనర్ ద్వారా పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇక ఆక్వా రంగంలో ప్రాసెసింగ్ యూనిట్లు నడిపే టీడీపీ నాయకులు చాలామంది ద్వారా ఇదే విధంగా నగదు అక్రమ రవాణా జరుపుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అసలు పట్టుబడ్డ నగదును నేరుగా తెచ్చుకోవాలి. కానీ, కంటైనర్లలో రొయ్యల బాక్సులలో మధ్యలో పెట్టి రహస్యంగా తీసుకురావడమే అనుమానాలకు తావిస్తోంది. ఇది ఒక్కసారి జరిగింది అయితే కాదని, ముందుగానే డబ్బును మెరైన్ కంపెనీలకు తరలించి అక్కడి నుంచి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా నరేంద్ర వర్మ ఒక్కరే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రంగంలో ఉన్న టీడీపీ నేతల ద్వారా అక్రమమార్గాన విచ్చలవిడిగా నగదు రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. రొయ్యల బాక్సుల మధ్యలో నోట్ల కట్టలు.. ఇదిలా ఉంటే.. బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీకి నిజాంపట్నం నుంచి చీరాల పరిధిలోని ఈ సంస్థకు ఓ రొయ్యల కంటైనర్ చేరుకుంది. దీనికి సంబంధించి అప్పటికే సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ రాయల్ మెరైన్ వద్ద కాపు కాశారు. వచ్చిన కంటైనర్‌ను కస్టడీలోకి తీసుకుని పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేశారు. కంపెనీ ప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ, ఇన్‌కంటాక్స్, ట్రెజరీ అధికారులు గురువారం ఉ.11 గంటల సమయంలో సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. కంటైనర్‌లో అన్నీ రొయ్యల బాక్సులు ఉండగా, ఒక బాక్సులో మాత్రం రూ.500 నోట్లు 112 కట్టలతో మొత్తం రూ.56 లక్షలు దొరికాయి. దీంతో అధికారులు ఈ డబ్బు ఎక్కడ నుంచి తరలించారు, వీటికి సరైన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా లేదా అని విచారణ చేస్తున్నారు. ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో డబ్బును ఐటీ అధికారులకు అప్పగించారు. మీడియా సహా ఎవరినీ ఆ కంపెనీలోకి అనుమతించకపోవడంతో డబ్బు కోట్లలోనే పట్టుబడి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డబ్బుతోనే వర్మ ఓటర్లను, నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఐటీ అధికారులు వర్మ సంస్థ ఆర్థిక లావాదేవీలపై లోతుగా విచారణ చేపట్టారు. -
ఎల్లో కల్లోలం
సాక్షి, అమరావతి/రెడ్డిగూడెం/శ్రీకాకుళం/ద్వారకా తిరుమల/ఏలూరు (టూటౌన్): రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అసమ్మతితో అట్టుడుకుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు విడతల్లో 138 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటివరకూ 30కి పైగా నియోజకవర్గాల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఆయా నియోజకవర్గాల్లో సీట్లు దక్కని నేతలు అధినేతపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. వాళ్ల అనుచరులు ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. పలుచోట్ల అసమ్మతి నాయకులు స్వతంత్రంగా బరిలోకి దూకేందుకు వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు చంద్రబాబు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ... సీనియర్ నేతలను వారి వద్దకు పంపుతూ... కొందరితో రాయబారాలు నడుపుతూ... సర్దిచెప్పేందుకు శత విధాలుగా యత్నిస్తున్నారు. కొందరైతే అధినేతను కలిసేందుకు కూడా ఇష్టపడటంలేదు. కాదూకూడదని వెళ్లినవారు ఆయన ముందు పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నా బయటకు వచ్చాక తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇవి కాకుండా జనసేన, బీజేపీకి కేటాయించిన 31 స్థానాల్లోనూ అనేక చోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులను ఓడిస్తాం... మా సత్తా చూపిస్తాం... టికెట్లు దక్కించుకున్నవారిని ఓడించి తమ సత్తా చూపిస్తామని పలువురు నేతలు బాహాటంగానే సవాల్ విసురుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, ఏలూరు జిల్లా నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్‌గా ప్రచారం ప్రారంభించగా... విజయనగరం జిల్లా గజపతినగరంలో కె.అప్పలనాయుడు, విజయనగరంలో మీసాల గీత, కురుపాంలో వైరిచర్ల వీరేశ్‌దేవ్, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కలమట వెంకటరమణ, తునిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. చింతలపూడి, తిరువూరు, పెడన, పామర్రు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు పూర్తి స్థాయి మద్దతు దొరకడంలేదు. కొవ్వూరు సీటు తనకు కేటాయించకపోవడంతో మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. గోపాలపురం సీటును మద్దిపాటి రాజుకు ఇవ్వడాన్ని అంగీకరించని అక్కడి పార్టీ సీనియర్ నేతలు ముళ్లపాటి బాపిరాజు తదితరులు తమను కాదని టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరిస్తున్నారు. దెందులూరు సీటును చింతమనేని ప్రభాకర్‌కు ఇవ్వడం చలుమోలు అశోక్‌గౌడ్, ఈడ్పుగంటి నాగేశ్వరరావు, మాగంటి రవళితోపాటు అక్కడి పార్టీ సీనియర్ నేతలకు సుతరామూ ఇష్టం లేదు. వారంతా చింతమనేనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దేవినేనిపైనా పెరుగుతున్న అనుమానాలు ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం సీటును ఫిరాయింపు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కి ఖరారు చేయడంతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సహించలేకపోతున్నారు. పార్టీకి కట్టుబడి ఉన్నట్లు పైకి చెబుతున్నా వసంతను ఓడించడమే తన ధ్యేయమని ఆయన అంతర్గతంగా పార్టీ క్యాడర్‌కూ సంకేతాలు ఇస్తున్నారు. అంతేనా... ఆదివారం రాత్రి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం గ్రామంలో బల ప్రదర్శన నిర్వహించారు. రెండు రోజుల క్రితం జక్కంపూడి వైఎస్సార్ కాలనీలోనూ బలప్రదర్శన చేపట్టారు. అంటే ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రాత్రి రెడ్డిగూడెం వచ్చిన దేవినేని ఉమా టీడీపీ మండల పార్టీ కార్యాలయం నుంచి రాఘవాపురంలోని పద్దమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో సుమారు 500 మంది పాల్గొన్నారు. టీడీపీ జెండాలు లేకుండానే సాగిన ర్యాలీలో దేవినేని ఉమా నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకు టికెట్ ఇవ్వడాన్ని కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నర్సరావుపేటలో కడియాల వెంకటేశ్వరరావు, నల్లపాటి రాము తదితరులు అరవింద్‌బాబు అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోవడంలేదు. పెదకూరపాడు సీటును పారాచూట్ నేత భాష్యం ప్రవీణ్‌కు కేటాయించడంతో అక్కడి ఇన్చార్జి కొమ్మాలపాటి శ్రీధర్ అలకబూని పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తానని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో బూదాల అజితారావు, మన్నె రవీంద్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. అభ్యర్థులకు గడ్డు పరిస్థితి నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానాన్ని ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కి ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, ఆత్మకూరు సీటును ఫిరాయింపు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఇవ్వడాన్ని కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కావలి సీటును బడా కాంట్రాక్టర్ కావ్య కృష్ణారెడ్డికి దక్కడాన్ని మాలేపాటి సుబ్బానాయుడు, బీద రవిచంద్ర వ్యతిరేకిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా అసమ్మతి గట్టిగా పనిచేస్తోంది. శ్రీకాళహస్తిలో ఎస్.సి.వి.నాయుడు, సత్యవేడులో జె.డి.రాజశేఖర్ తమను చంద్రబాబు మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సీటును అక్కడి పార్టీ సీనియర్ నాయకులు ఉమామహేశ్వరనాయుడు, ఉన్నం హనుమంతరాయచౌదరికి కాకుండా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుకు ఇవ్వడంతో పార్టీ క్యాడర్ అంతా భగ్గుమంటోంది. కదిరిలో అత్తార్ చాంద్‌బాషా తనకు సీటు ఇవ్వలేదని తన అనుచరులతో చంద్రబాబు ఇంటి వద్దే ఆందోళన చేయించారు. చివరికి బాలకృష్ణకూ అసమ్మతి తప్పలేదు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో తిక్కారెడ్డి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, డోన్‌లో ధర్మవరం సుబ్బారెడ్డి, వైఎస్సార్ జిల్లా రాయచోటిలో రమేష్‌కుమార్‌రెడ్డి అలుక వీడటం లేదు. తంబళ్లపల్లె, అమలాపురం, గుంటూరు వెస్ట్, కోవూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి నియోజకవర్గాల్లోనూ అసమ్మతి బెడద ఎక్కవగానే ఉంది. శ్రీకాకుళం ఆగని ఆందోళనలు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టికెట్ రాని టీడీపీ నాయకులు అధిష్టానంపై దుమ్మెత్తిపోతున్నారు. శ్రీకాకుళంలో సమావేశం నిర్వహించిన గుండ లక్ష్మీదేవి, అప్పలసూర్యనారాయణ దంపతులు అచ్చెన్నకు తమపై ఎందుకంత కక్ష అని సూటిగా ప్రశ్నించారు. అధిష్టానం తీరు మారకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్పారు. అలాగే కొత్తూరు మండలం నివగాం వద్ద అనుచరులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ రాష్ట్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లపై పరోక్షంగా విమర్శలు చేశారు. సైట్లు ఇస్తామని చెప్పి కొన్ని వేలమంది నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఒక 420 అయిన మామిడి గోవిందరావుకు ఎమ్మెల్యేగా గెలిపించమంటే ఒప్పుకునేది లేదన్నారు. మద్దిపాటిపై సీనియర్ల మండిపాటు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం స్థానాన్ని గ్రాఫ్ పడిపోయిన మద్దిపాటికి కేటాయించడంపై అక్కడి సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లజర్లలోని ఒక ఫంక్షన్ హాల్లో నాలుగు రోజుల క్రితం నియోజకవర్గంలోని అసమ్మతి నాయకులు సమావేశమై మద్దిపాటి తప్ప వేరెవ్వరైనా తమకు ఓకే అని తేల్చిచెప్పారు. గ్రాఫ్ పడిపోయిన వ్యక్తిని గెలిపించమంటే తమ వల్ల కాదని వారు చేతులెత్తేశారు. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా తానేటి వనితను ప్రకటించారనీ, ఆమెను ఢీకొనాలంటే గట్టి క్యాండిడేట్ అవసరమని తెలిపారు. దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. ఇదే సందర్భంలో మద్దిపాటి వెంకట్రాజు నాలుగు రోజులుగా చేపట్టిన పాదయాత్రకు ఒక వర్గం నాయకులు, కార్యకర్తలు దూరంగానే ఉన్నారు. ఏలూరు ఎంపీ సీటుపై వెనక్కి తగ్గని బీజేపీ ఏలూరు పార్లమెంటు సీటు స్థానిక నేత గారపాటి చౌదరికే ఇవ్వాలని జిల్లా బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆదివారం చేరుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కడప నాయకుడికి అక్కడ సీటు కేటాయించడం సరికాదని వారు పట్టుపడుతున్నారు. రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిశోర్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బి.నిర్మలా కిశోర్, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కె.కృష్ణప్రసాద్, వివిధ అసెంబ్లీ కన్వీనర్లు శరణాల మాలతీరాణి, నడపన దాన భాస్కరరావు, నగరపాటి సత్యనారాయణ, గుమ్మడి చైతన్య, యేసు వరప్రసాద్, గాది రాంబాబు, రామకృష్ణ తదితరులున్నారు. -
TDP: డబ్బు కొట్టు... టికెట్ పట్టు!
కొవ్వూరు: తెలుగుదేశం పార్టీలో టికెట్లు అమ్ముకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టికెట్టు ఖరారు విషయంలో జరిగిన బేరసారాల సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.‘రూ.10 కోట్లు చూసుకోండి.. టికెట్టు ఇప్పిస్తాం’ అంటూ జిల్లాలోని నిడదవోలుకు చెందిన ఓ ఎన్ఆర్ఐ మహిళకు స్థానిక నాయకులు వర్తమానం పంపారు. ఆమె సొమ్ము రెడీ చేసుకుంటున్న తరుణంలోనే ముప్పిడి వెంకటేశ్వరరావుకు టికెట్ ఖరారు చేశారు. దీనిపై ఆమె ఆ ముఖ్య నాయకుడికి ఫోన్ చేసి ‘రూ.10 కోట్లు తెస్తే నాకు టిక్కెట్టు ఇప్పిస్తామంటే సరే అన్నాను. ఇప్పుడిలా చేశారేమిటి?’ అని ప్రశ్నించారు. ఆ నాయకుడు ‘డబ్బు లేకుండా రాజకీయం లేదు. అంతా కోట్ల మీదే పని’ అని ఆమెకు బదులిచ్చారు. ‘రూ.10 కోట్లు తెచ్చుకోమ్మా. మేం మాట్లాడతామని నాతో అన్నారు. టికెట్టు వచ్చిన వ్యక్తి ఎంత ఇచ్చారు?’ అని ఆ మహిళ ప్రశ్నిస్తే ‘రూ.15 కోట్లు ఇస్తేనే టికెట్టు ఇచ్చారు’ అని ఆయన చెప్పారు. ‘అంటే నాకంటే మరో రూ.5 కోట్లు పెంచారన్న మాట. ఇంత మాత్రం దానికి రూ.10 కోట్లు తెచ్చుకోమనడం దేనికి’ అంటూ ఆమె వాపోయింది. మండిపడుతున్న పార్టీ శ్రేణులు నియోజకవర్గ ప్రముఖ నాయకుడికి సన్నిహితుడైన చాగల్లుకు చెందిన ఓ నాయకుడు ఆ మహిళతో మాట్లాడిన ఈ ఫోన్ సంభాషణలు టీడీపీలోనూ దుమారం రేపుతున్నాయి. రూ.15 కోట్లిచ్చినవారికే టికెట్టిచ్చినట్టు గుప్పుమనడంతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. గెలుపు గుర్రాలను పక్కన పెట్టి డబ్బు సంచులకే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అతి సామాన్య కుటుంబాలకు చెందిన వ్యక్తులకు వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తుంటే టీడీపీ మాత్రం డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కేవలం సర్వేలను ప్రామాణికంగా తీసుకునే తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు చంద్రబాబు పదేపదే చెబుతున్న మాటలు వాస్తవం కాదని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తొలుత ముగ్గురు వ్యక్తులపై ఐవీఆర్ఎస్ విధానంలో సర్వే నిర్వహించి చివరకు ఆ ముగ్గురిని కాదని ముప్పిడికి టికెట్టు కేటాయించడం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. -
మహిళా నేతలనూ వంచించిన బాబు
సాక్షి, అమరావతి : చంద్రబాబు అంటేనే మోసం అన్న విషయం తెలుగుదేశం పార్టీలోని మహిళా నేతలకూ అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహిస్తానని, వారి పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందంటూ చంద్రబాబు చెప్పే మాటలన్నీ వంచనపూరితమేనని స్పష్టమైంది. టీడీపీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన పలువురు మహిళలకు ఆయన అవమానకర రీతిలో సీట్లు నిరాకరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పీతల సుజాతను అవమానకర రీతిలో పక్కన పెట్టారు. పార్టీ కోసం ఆమె సేవలను ఉపయోగించుకుని చింతలపూడి సీటు ఇవ్వకపోగా, ఆమె వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ అవమానించారు. చింతమనేని ప్రభాకర్, మాగంటి బాబు వంటి నేతల అహంకారానికి దళిత మహిళనైన తాను బలైనట్లు ఆమె వాపోతున్నారు. వారు చెప్పినట్టు నడుచుకోలేదనే కారణంతోనే చంద్రబా బు సీటు తిరస్కరించారన్న వాదన పార్టీలో ఉంది. పనబాకను మోసం చేసిన బాబు టీడీపీలో మరో కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి చంద్రబాబు మొండిచేయి చూపారు. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమెను తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయించారు. వైఎస్సార్సీపీ బలంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు మాట విని పార్టీ కోసం ఓటమికి సిద్ధమయ్యే పోటీకి దిగారు. వాస్తవంగా తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడానికి టీడీపీ నేతలెవరూ ముందుకు రాలేదు. ఉప ఎన్నికలో పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటుతోపాటు ఆమె భర్త కృష్ణయ్యకు ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తానని చంద్రబాబు మభ్యపెట్టి పనబాకను పోటీకి దింపారు. అసలు ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు ఆమెను వంచించారు. ఈ ఎన్నికల్లో పూర్తిగా పక్కనపెట్టేశారు. బాపట్ల, తిరుపతి ఎంపీ స్థానాల్లో ఏదో ఒక చోట అవకాశమివ్వాలని కోరినా పట్టించుకోలేదు. కష్టకాలంలో పార్టీ వెంట నిలబడ్డ తనను చంద్రబాబు మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభా భారతికి మొండిచేయి టీడీపీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతికీ బాబు సీటు నిరాకరించారు. ఆమె తన కుమార్తె గ్రీష్మకు శ్రీకాకుళం జిల్లా రాజాం సీటు ఇవ్వాలని కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు. గ్రీష్మ టీడీపీ మహానాడులో తొడకొట్టి మరీ వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడడం చర్చనీయాంశమైంది. అలాంటి నేతలకు పార్టీలో అవకాశాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ చివరికి రాజాం సీటును కొండ్రు మురళీమోహన్కి ఇచ్చారు. తన తండ్రి హయాం నుంచి టీడీపీని నమ్ముకున్న ఆమె కుటుంబానికి టీడీపీలో న్యాయం జరగలేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. శ్రీకాకుళంలోనూ ఆది నుంచి పార్టీకి దన్నుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి స్థానంలో ధనబలం ఉన్న గొండు శంకర్‌కు సీటిచ్చారు. అప్పుడు మభ్యపెట్టారు.. ఇప్పుడు మోసగించారు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పాడేరు, రంపచోడవరం, పామర్రు అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పనలను మభ్యపెట్టి చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆ ముగ్గురూ ఓడిపోయినా నియోజకవర్గాల్లో తిరుగుతూ పనిచేశారు. కానీ సమీకరణలు, ధన బలం లేదనే కారణంతో ఈ ఎన్నికల్లో వారికి సీట్లు ఇవ్వకుండా అవమానించారు. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కూడా మభ్యపెట్టి టీడీపీలో చేర్చుకుని ఇప్పుడు సీటు లేకుండా చేశారు. చంద్రబాబు మోసం చేశారనే ఉద్ధేశంతో రాజకీయాలు ఎలా ఉంటాయో తనకు ఇప్పుడు అర్థమైందంటూ ఆమె ఎక్స్(ట్విటర్)లో వాపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి ఈసారి సీటు లేకుండా చేశారు. భవానీ బదులు ఆమె భర్తకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరులో కోట్ల సుజాతమ్మకు కూడా హ్యాండిచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
ఎవరీ కొత్త హవాలా కొలంబస్?
గత సంవత్సరం బ్రెజిల్ అధ్యక్షునిగా లూల డసిల్వా ఎన్నిక య్యారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకుడు విజయ సాయిరెడ్డి అభినందనలు తెలియజేశారట! యెల్లో మీడియాఎంతో కష్టపడి శోధించి ఈ విషయాన్ని కనిపెట్టింది. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం కోటయ్య చౌదరి కంపెనీకి ఓ కంటెయినర్ పార్సెల్ వచ్చింది. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆ కంటెయినర్‌ను తనిఖీ చేసిన సీబీఐ అధికారులు జరిపిన మాదక ద్రవ్యాల పరీక్షలో ‘పాజిటివ్’ ఫలితాలొచ్చాయి. ఆ విషయాన్ని వారు విడుదల చేసిన ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. కోటయ్య చౌదరి కంపెనీకి (సంధ్యా ఎక్స్‌పోర్ట్స్) రొయ్యలు, చేపలకు సంబంధించిన ఎగుమతుల వ్యాపారం ఉన్నది. రొయ్య విత్తనాన్ని పొదిగే హేచరీ కూడా ఉన్నది. త్వరలో రొయ్యల దాణాను తయారు చేసే మరో కేంద్రాన్ని కూడా తెరవ బోతున్నారు. ఆ దాణా తయారీలో ఉపయోగించడానికి పొడి చేసిన యీస్ట్‌ను తెప్పించుకోవడానికి సంధ్య కంపెనీ బ్రెజిల్లో ఆర్డర్ పెట్టింది. ఈ పదార్థాన్ని చైనా నుంచీ, యూరప్ నుంచీ కూడా దిగుమతి చేసుకోవచ్చు. బ్రెజిల్‌తో పోలిస్తే దూరాభారం కూడా తక్కువ. కానీ బ్రెజిల్‌నే ఎంపిక చేసుకోవడం వెనుక ఆకంపెనీకి తనదైన ప్రత్యేక కారణం ఉండవచ్చు. ‘యీస్ట్’ అనే మాటకు తెలుగు అర్థం కోసం వెతికితే మన నిఘంటువుల్లో సంతృప్తికరమైన సమాధానాలు దొరకలేదు. మధు శిలీంధ్రం, పులియబెట్టినది అనే అర్థాలున్నాయి. పూర్వం మన వంటిళ్లలో అన్నం వార్చే రోజుల్లో కలి, గంజి ఉండేవి. కలో గంజో తాగి బతకాలని సామెత. అందులోని కలిని యీస్ట్గా పరిగణిస్తాము. రకరకాల అవసరాలకు యీస్ట్‌ను ఉపయోగించడం తెలిసిందే. బ్రూవరీలు, వైనరీలు, బేకరీల్లో ప్రధానంగా వాడుతారు. ఆక్వా దాణా కోసం కూడా వాడుతారట. కోటయ్య చౌదరి కంపెనీ తెప్పించిన పొడి యీస్ట్ డబ్బాల్లో డ్రగ్స్ బయటపడ్డాయనే వార్త లోకానికి ఇంకా తెలియకముందే లోకేశ్‌బాబుకు తెలిసిపోయింది. ‘ఎక్స్’ వేదికగా ఆయన ఉలిక్కి పడ్డారు. వైజాగ్‌ను నాశనం చేసేందుకు వైసీపీ వాళ్లు తెప్పించా రని ఆరోపణలు చేశారు. చినబాబు ఉలికిపాటు సరిపోలేదని చంద్రబాబు కూడా మరోసారి గట్టిగా ఉలిక్కిపడ్డారు. తెల్లారి లేచేసరికి ‘ఈనాడు’ పత్రిక మరింత గట్టిగా ఉలిక్కి పడింది. దాంతోపాటు మిగతా యెల్లో మీడియా కూడా! ఈ డ్రగ్స్ సరఫరా వెనుక కచ్చితంగా వైసీపీ హస్తం ఉందని వారు ఏకగ్రీవంగా తీర్మానించి పారేశారు. నెమ్మదిగా అసలు విష యాలు బయటకు రావడం మొదలైంది. కోటయ్య కంపెనీ చుట్టూ అల్లుకున్న తెలుగుదేశం, బీజేపీ నేతల బాంధవ్యాలు బయటపడ్డాయి. సామాజిక బాంధవ్యాలే కాదు, వ్యాపార భాగస్వామ్యాలు కూడా వెల్లడి కావడం మొదలైంది. దాంతో మన యెల్లో మీడియా ఉలికిపాటులోంచి తత్తరపాటులోకి మారింది. ఆ తత్తరపాటులోంచి వచ్చిందే లూల డసిల్వాకు విజయసాయిరెడ్డి అభినందనలు చెప్పారనే మోకాలు – బోడి గుండు సంబంధిత ఆరోపణ. విజయ సాయిరెడ్డి అభినందనలు ట్విట్టర్లో చెప్పారు కనుక కృతజ్ఞతగా బ్రెజిల్ అధ్యక్షుడు దగ్గరుండి డ్రగ్స్‌ను షిప్లో లోడ్ చేయించి ఉంటారని మన జనాల్ని నమ్మించాలనే వెధవా యిత్వం యెల్లో మీడియాలో కనిపించింది. సూర్యుడిపై ఉమ్మేయజూసే మూర్ఖత్వమంటే ఇదే! లూయీ ఇనాసియో లూల డసిల్వా ఒక కార్మికోద్యమనేతగా తన ప్రజా జీవితాన్ని ఆరంభించిన వ్యక్తి. ఒకనాటి చిలీ అధ్యక్షుడు డాక్టర్ సాల్వెడార్ అలెండీ, వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ల వరుసలోని లాటిన్ అమెరికా వామపక్ష యోధుడు. మొదటిసారి అధ్య క్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన అమలుచేసిన బొల్సా ఫామి లియా (పేద కుటుంబాలకు ఆర్థిక సాయం), ఫోమ్ జీరో (ఆకలి నిర్మూలన) పథకాలు కోట్లాది మంది బ్రెజిలియన్లను దారిద్య్రం నుంచి విముక్తం చేశాయి. కోట్లాది పేద కుటుంబాల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాయి. అమెరికా ఖండంలో అగ్రరాజ్య ప్రయోజనాలకు కంట్లో నలుసుగా డసిల్వా మారాడు కనుక ఆయన అధికారం నుంచి దూరం కావలసి వచ్చింది. అవినీతి ఆరోపణలు మోపి మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆరోపణలన్నీ శుద్ధ అభాండాలేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఆయన్ను జైలు నుంచి విడుదల చేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్షునిగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సకల దేశాధి నేతలు, లక్షలాది మంది రాజకీయ ప్రముఖులు, కోట్లాదిమంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందులో విజయ సాయిరెడ్డి ట్వీట్ ఒకటి. ఒక ప్రముఖ దేశానికి అధ్యక్షునిగా, జి–20 దేశాల కూటమికి ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిపైనే బురద చల్లడానికి వెనుకాడలేదంటే యెల్లో మీడియా బరితెగింపు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నారా అండ్ సన్స్‌తో పాటు యెల్లో మీడియా కూడా ఈ విషయంలో అతిగా స్పందించింది. రాజకీయ ప్రత్యర్థుల తలకు చుట్టడానికి వారు వేగిరిపడ్డారు. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు ఉగ్గబట్టలేకపోయారో తెలియదు. వారి తొందర పాటుకు తగినట్టుగానే కంపెనీ బాంధవ్యాలు, భాగస్వామ్యాలు తెలుగుదేశం కుటుంబాలనే వేలెత్తి చూపుతున్నాయి. విచారణ పూర్తయితే గానీ జరిగిందేమిటనే సంగతి నిర్ధారణ కాదు. అయితే కొత్త రాజకీయ పొత్తుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని విశ్వసించవచ్చునా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ ప్రశ్నతో పాటు మరికొన్ని సందేహాలకు కూడా సమాధానాలు రావలసి ఉన్నది. దాణా ఉత్పత్తి ప్రారంభం కాకముందే సంధ్యా సంస్థ 25 వేల కిలోల యీస్ట్‌కు ఎందుకు ఇండెంట్ పెట్టింది? యీస్ట్ దిగుమతికి ప్రత్యామ్నాయాలు అందు బాటులో ఉండగా అది బ్రెజిల్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నది? బ్రెజిల్ నుంచి బయల్దేరిన ఓడ విశాఖ రావడానికి ఎక్కువ సమయం తీసుకున్నదన్న పాయింట్‌ను సీబీఐ ముందు కంపెనీ ప్రతినిధులు ఎందుకు నొక్కి చెబుతున్నారు? మధ్యలో తమకు తెలియకుండా ఎవరో ఈ డ్రగ్స్‌ను బాక్సుల్లో పెట్టిఉంటారని బుకాయించడం కోసమా? అలా మధ్యలో దూర్చడం సాంకేతికంగా సాధ్యమవుతుందా? విచారణ తర్వాత డ్రగ్స్‌ను తెప్పించడం వెనుక బాధ్యత సంధ్య కంపెనీదే అని తేలితే ఆకంపెనీ ఎందుకు ఆ పని చేసినట్టు? స్వయంగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిందా? లేక ఎవరైనా కమీషన్ మీద ఈ పని అప్పగించారా? రెగ్యులర్‌గా దిగుమతులు చేసుకునే కంపెనీలతో డ్రగ్స్ వ్యాపారులు కమీషన్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ, సంధ్యా కంపెనీ దాణా ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు. అటువంటి ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తు న్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆక్వా అథారిటీకి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వనేలేదు. అప్పుడే యీస్ట్ దిగుమతికి ఎందుకు తొందరపడినట్టు? డ్రగ్స్ వ్యాపారంలో ఉన్న వారు కాకుండా మరేదో బలమైన శక్తి ప్రోద్భలం మేరకే ఈ కంపెనీ యీస్ట్ దిగుమతికి ఆర్డర్ చేసిందా? బ్రెజిల్ నుంచే దిగుమతి చేసు కోవాలని ఆ శక్తి నిర్దేశించిందా? తెలుగుదేశం, జనసేనలకు బీజేపీతో పొత్తు కుదురుతుందనే నమ్మకం కలిగిన తర్వాత బ్రెజిల్లో బయల్దేరిన ఓడ... పొత్తుకు తుదిరూపం వచ్చిన తర్వాతనే విశాఖ తీరం చేరుకోవడం కాకతాళీయమేనా? డ్రగ్స్ సరఫరా, పంపిణీ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవడం మనీ లాండరింగ్‌లో కొత్త పద్ధతిగా మారిందా? ఒకేసారి వందలు, వేలకోట్ల రూపాయలను చేతులు మార్చ డంలో సంప్రదాయ హవాలా పద్ధతుల కన్నా ఇది మెరుగైన పద్ధతిగా భావిస్తున్నారా? ఎందుకంటే ఇండియాలో డ్రగ్స్ దందా టర్నోవర్ లక్ష కోట్లు దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022 జూన్ నుంచి 2023 జూలై 15 వరకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్రాల బృందాలు కలిసి సుమారు 12 వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యా లను ధ్వంసం చేశాయి. ఇంతకు కనీసం పది రెట్లు ఎక్కువ వినిమయం దేశంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్‌కు ఇదో మార్గంగా పరిగణిస్తూ ఉండవచ్చు. అయితే బలమైన నెట్వర్క్ కలిగి ఉన్నవారే ఈ పద్ధతిని అనుసరించే అవకాశం ఉన్నది. బ్రెజిల్ సరిహద్దు దేశాల్లో కొలంబియా ఒకటి. ప్రపంచంలో అతిపెద్ద మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రం ఆ దేశం. అయితే కొలంబియా నుంచి రవాణా అయ్యే సరుకుల కన్సైన్మెంట్లపై దాదాపు అన్ని దేశాల్లో నిఘా తీవ్రంగా ఉంటుంది. నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. కనుక కొలంబియా డ్రగ్ లార్డ్స్ పక్క దేశాల నుంచి సరుకుల రవాణాలో డ్రగ్స్‌ను కలిపి పంపుతారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్ సహజంగానే వారి ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటుంది. అమెజాన్ అడవులు రెండు దేశాల సరిహద్దులను కలిపేస్తుండటంతో డ్రగ్స్‌ను బ్రెజిల్ రేవుల దాకా చేర్చడం వారికి సులువు. అమెరికా,ఇండియాల మధ్య ప్రైవేట్ ఆర్థిక సంబంధాలు చాలా ఎక్కువ. విరాళాల దందాలూ ఎక్కువే. ‘ఏపీ జన్మభూమి’ పేరుతో తెలుగుదేశం అభిమానులు ఓ కొత్త సంస్థను ప్రారంభించి పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేయడం ఈ మధ్య వివాదాస్పదంగా మారింది. వసూలు చేసిన విరాళాలకు సరైన లెక్కలు లేవని విరాళాలిచ్చినవారు వాపోతున్నారు. ఇదేకాకుండా ఎన్ని కల పేరుతోనూ విరాళాలు సేకరించడం ఇక్కడ మామూలే. టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరం నుంచి కొలంబియా తీరం 1500 మైళ్ల దూరమే! మనీలాండరింగ్ కోసం మాదక ద్రవ్యాల రూట్‌ను ఎంచు కోవడం నిజమేనని నిర్ధారణ అయితే దేశం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు కంపెనీ చెబుతున్న విషయాలు అనుమానాలను రేకెత్తి స్తున్నాయి. జనవరి 14న బయల్దేరిన కంటెయినర్ చాలా ఆలస్యంగా చేరిందని కంపెనీ ప్రతినిధి కూనం హరికృష్ణ వివరణ ఇచ్చారు. అంటే మధ్యలో ఎవరో ఈ పనిచేసి ఉండొచ్చని బుకా యించడానికి వీలుగా ఆయన ఈ పాయింట్‌ను ముందుకు తోస్తున్నారు. సంధ్యా కంపెనీ బ్రెజిల్ సంస్థ నుంచి పొడి యీస్ట్‌ను ఖరీదు చేసింది. దాన్ని ఆ సంస్థ కంటైనర్‌లో పెట్టి, సీల్ వేసి ఓడలోకి ఎక్కిస్తుంది. ఈ కంటెయినర్ ఎన్ని దేశాలు తిరిగివచ్చినా ఎవరికీ కంటెయినర్ తెరిచే అవకాశం ఉండదు. ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ కంటెయినర్ సీల్ నెంబర్లను ఇంపోర్ట్ చేసుకునే కంపెనీకి పంపిస్తుంది. ఈ నెంబర్లు చూపెడితేనే ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ సరుకును క్లెయిమ్ చేసుకోగలుగు తుంది. ఇది ప్రొటోకాల్. అందుకే సీబీఐ వారు తమంత తాము కంటెయినర్‌ను తెరవలేదు. కంపెనీ ప్రతినిధులను పిలిపించు కొని వారి సమక్షంలోనే తెరిపించారు. కనుక మధ్యలో ఎవరో డ్రగ్స్‌ను సరుకులో కలిపేయడం అబద్ధం. అనుమానాస్పద శాంపుల్స్‌ను పరీక్షకు పంపించారు. అవి మాదకద్రవ్యాలుగా రుజువై బాధ్యులను శిక్షించగలిగితే పెనుప్రమాదాన్ని నివారించి నట్లవుతుంది. రాజకీయ ఒత్తిళ్లు పైచేయి సాధిస్తే భవిత అంధ కారమవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఔను.. పుష్ప అంటే ఫ్లవరే!
సాక్షి, అమరావతి : అందరూ ఊహించినట్లుగానే కూటమి పేరుతో చంద్రబాబు అల్లిన సాలెగూటిలో బీజేపీ చిక్కుకుంది. పదేళ్లుగా ఎదురులేకుండా దేశాన్ని ఏలుతున్న బీజేపీ.. రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు మాయోపాయంలో చిక్కుకొని విలవిల్లాడుతోంది. బీజేపీకి రాష్ట్రంలో 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చారన్న మాటే కానీ, ఆ స్థానాలేమిటో ఇప్పటికీ ఖరారు కాలేదు. ఇప్పుడు బీజేపీకి ఇచ్చే సీట్లన్నింటిలో తన మనుషులే ఉండేలా చంద్రబాబు మంత్రాంగం చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాల కోసం, పార్టీ కోసం పనిచేస్తున్న అసలైన బీజేపీ నాయకులకు సీట్లు దక్కే అవకాశం కనిపించడంలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబు వదిన అయిన పురందేశ్వరి కూడా సహకరిస్తుండటంతో బాబు నేతలకే సీట్లు ఇస్తున్నారని, అభ్యర్థుల ప్రకటనే మిగిలి ఉందని అసలైన బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలు, ప్రాంతాలను కూడా మార్చేసి చంద్రబాబు తన మనుషులను బీజేపీ టికెట్లపై రంగంలోకి దింపుతున్నారు. బాబు ముందస్తు వ్యూహం బీజేపీని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి చంద్రబాబు గత దశాబ్దకాలంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన వాళ్లు అనుకొన్న వారిని ఆ పార్టీలోకి పంపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం మరికొందరు అనుంగులను బీజేపీలోకి పంపి, కోవర్టు రాజకీయాలు నడిపించారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరగానే తన సొంత నాయకులకే ఆ పార్టీ సీట్లు ఇప్పించుకొంటున్నారు. ఈ నాయకులు ప్రాంతం, జిల్లా కూడా చూడకుండా ఎక్కడ వీలైతే అక్కడ వాలిపోతున్నారు. చంద్రబాబు అనుంగు సీఎం రమేష్ ఏకంగా కడప జిల్లా నుంచి ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయనకు ఈ సీటు దాదాపు ఖరారు అయినట్టేనని కమలం పార్టీలో చర్చ సాగుతుంది. పొత్తు ఖరారు కాకముందు బీజేపీ ఒంటరిగా పోటీగా చేసేందుకు సిద్ధమైన సమయంలో అనకాపల్లి లోక్‌సభ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన్ని కాదని రమే‹Ùకే ఇప్పుడు టికెట్టు ఇస్తున్నారు. జీవీఎల్‌కు సీటు దక్కకుండా.. విశాఖపట్నం బీజేపీకి రాష్ట్రంలోనే అత్యంత బలమైన ప్రాంతం. బీజేపీ బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల వారు విశాఖ పరిధిలో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. విశాఖ లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలన్న సంకల్పంతో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రెండేళ్లకు పైగా అక్కడే ఉంటూ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అయితే, జీవీఎల్‌కు ఆ సీటు దక్కకుండా చంద్రబాబు, పురందేశ్వరి వ్యూహాత్మకంగా పక్కనే ఉన్న అనకాపల్లి స్థానాన్ని బీజేపీకి కేటాయించారన్న విమర్శలూ ఉన్నాయి. సోము వీర్రాజు సీటుకే ఎసరు పెట్టిన పురందేశ్వరి రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకే పురందేశ్వరి ఎసరు పెట్టారు. రాజమండ్రి వీర్రాజు సొంత నియోజకవర్గం. తొలి నుంచి బీజేపీలో ఉన్న నేత. ఈ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి వీర్రాజు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ చంద్రబాబు అండతో పురందేశ్వరి పోటీకి దిగుతున్నట్లు సమాచారం. ఒంగోలుకు చెందిన పురందేశ్వరి 2014 ఎన్నికలకు ముందు వెంకయ్యనాయుడు సమక్షంలో బీజేపీలో చేరారు. ఆమె మధ్యలో ఏడెనిమిది లోక్‌సభ స్థానాలు దాటుకొని రాజమండ్రి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఆమెకు టికెట్ ఖరారైనట్టేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ పోటీ చేసే మరో లోక్‌సభ స్థానం అరకు. ఇక్కడా మొదట నుంచి పార్టీని నమ్ముకున్న వారిని కాదని ఐదేళ్ల క్రితం బీజేపీలో చేరిన కొత్తపల్లి గీతకు టికెట్ ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నరసాపురం లోక్‌సభ స్థానంలోనూ వైఎస్సార్సీపీ తరపున గెలిచి, చంద్రబాబుకు కీలుబొమ్మగా మారిన రఘురామకృష్ణరాజును బీజేపీలో చేర్పించి, ఆయనకు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే రాజకీయం టీడీపీతో పొత్తు లేదని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీకి కూడా నిరాకరించిన కామినేని శ్రీనివాస్ ఇప్పుడు మళ్లీ పొత్తు కుదరగానే కైకలూరు అసెంబ్లీ నుంచి కమలం గుర్తుపైనే పోటీకి సిద్ధపడుతూ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కామినేని శ్రీనివాస్ కూడా బాబుకు దగ్గరైన నాయకుడే. 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ ఆ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరిపోయారు. ఆయన కోసమే జమ్మలమడుగు స్థానాన్ని బాబు బీజేపీకి కేటాయిస్తున్నట్లు సమాచారం. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వరదాపురం సూరి ఆ ఎన్నికల్లో ఓడిపోగానే బీజేపీలో చేరారు. బీజేపీతో పొత్తు ఖరారు కాకముందు ఆయన మళ్లీ ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారు. ఇప్పుడు సూరి కోసం ధర్మవరం సీటును బీజేపీకి చంద్రబాబు కేటాయిస్తున్నట్లు సమాచారం. బీజేపీలో ఉన్న చంద్రబాబు సన్నిహితుడు సీఎం రమేష్ గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళా నేతకు బద్వేలు అసెంబ్లీ టికెట్ ఇప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం బద్వేలును బీజేపీకి కేటాయించారు. సీఎం రమేష్ సూచించిన అభ్యర్థితో సహా బద్వేలు సీటు కోసం పురందేశ్వరి ప్రతిపాదించిన ముగ్గురు ఇప్పటికీ బీజేపీలో చేరలేదు. ఆమె ప్రతిపాదించిన వారిలో ఒకరికి అవకాశం ఇస్తే.. వారు పార్టీలో చేరి, పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా బద్వేలు అసెంబ్లీ సీటు కూడా పరోక్షంగా టీడీపీకి ఇచ్చినట్లేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. -
ధనబలం ఉన్న వారికే ఎంపీ సీట్లు
సాక్షి, అమరావతి : తెలుగుదేశంలో పార్టీలో అనుకున్నదే జరుగుతోంది. ధనస్వామ్యానికే చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. డబ్బున్నవారికే సీట్లు కట్టబెడుతున్నారు. తాజాగా.. శుక్రవారం ప్రకటించిన టీడీపీ మూడో జాబితాలో ఈ విషయం తేలిపోయింది. ఉదా.. విజయవాడ, గుంటూరు స్థానాలను అనుకున్నట్లుగానే ధనబలం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్‌కి ఎంపీ సీట్లు కేటాయించారు. నరసరావుపేట, నెల్లూరు స్థానాలను సైతం ఫిరాయింపు నేతలైన లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి కట్టబెట్టారు. ఇక బీజేపీ కోరుతున్న విశాఖ ఎంపీ స్థానాన్ని బాలకృష్ణ రెండవ అల్లుడు, లోకేశ్ తోడల్లుడు అయిన మోత్కుమిల్లి భరత్‌కు కట్టబెట్టారు. దీంతో ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావుకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. కడప నేతకు ఏలూరు సీటు.. ఏలూరు ఎంపీ సీటును మాత్రం అనూహ్యంగా యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌కి కేటాయించారు. కడప ప్రాంతానికి చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్ కుమారుడైన మహేష్‌కి ఏలూరు సీటు కట్టబెట్టడంతో ఆ ప్రాంత టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఆ సీటును ఆశించి అక్కడ పనిచేస్తున్న గోపాల్ యాదవ్, మాజీ ఎంపీ మాగంటి బాబులను పక్కనపెట్టి మహేష్‌కి ఇవ్వడమేమిటని అక్కడి నేతలు రగిలిపోతున్నారు. తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు.. బాపట్ల ఎంపీ సీటును ఆశ్చర్యకరంగా తెలంగాణకు చెందిన బీజేపీ నేత, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్‌కి ఇవ్వడం విశేషం. ఈ నిర్ణయంతో టీడీపీ శ్రేణులే అవాక్కయ్యాయి. ఆయన తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి కావడంతోపాటు పుట్టి పెరిగింది అంతా తెలంగాణలోనే. అలాంటి వ్యక్తికి చంద్రబాబు ఏపీలో సీటు ఇచ్చారు. బాపట్ల స్థానానికి అభ్యర్థి దొరక్క చంద్రబాబు చాలారోజులపాటు అన్వేషణ కొనసాగించారు. ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావుకు ఇవ్వాలని చూసినా ఆయనకు చిత్తూరు సీటు ఇచ్చి ఆఖరి నిమిషంలో కృష్ణప్రసాద్‌కు బాపట్ల సీటు ఇచ్చారు. నిజానికి.. వరంగల్ ఎంపీ సీటు కోసం బీజేపీ తరఫున పోటీచేసేందుకు కృష్ణప్రసాద్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఈయనకు చంద్రబాబు అనూహ్యంగా ఏపీలో సీటు ఇవ్వడం గమనార్హం. సోమిరెడ్డికే సర్వేపల్లి టికెట్.. అలాగే, నరసరావుపేట అసెంబ్లీ స్థానంలో పలువురి కొత్త నేతల పేర్లు తెరపైకి తెచ్చి హడావుడి చేసినా చివరికి అక్కడి ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్బాబుకే ఆ సీటు కేటాయించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వేపల్లిని ఎట్టకేలకు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కేటాయించారు. ఆ సీట్లో వరుసగా ఓడిపోతున్న సోమిరెడ్డి స్థానంలో కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ప్రయత్నించారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీలో చేరిన తర్వాత సోమిరెడ్డి స్థానంలో మరొకరికి ఇచ్చేలా రాజకీయం చేశారు. ఒక దశలో సోమిరెడ్డి కాకపోతే ఆయన కుటుంబంలో ఎవరికైనా సీటు ఇవ్వాలని చూశారు. కానీ, చివరికి సోమిరెడ్డికే సీటు ఖరారుచేశారు. ధర్మవరం, హిందూపురం.. గరం గరం.. ఇక ధర్మవరం సీటు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ ఓ వైపు పరిటాల శ్రీరాం, మరోవైపు వరదాపురం సూరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో.. హిందూపురం ఎంపీ సీటు టీడీపీకి కేటాయించడంతో ధర్మవరం సీటు బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే, హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా బీకే పార్థసారథి పేరు ఖరారు చేయడంతో నిమ్మల కిష్టప్ప, అంబికా లక్ష్మీనారాయణ ఆశలు ఆవిరయ్యాయి. ఎంపీ టికెట్ తనదేనని ప్రచారం చేస్తున్న బీజేపీ నేత పరిపూర్ణానందస్వామి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అలాగే, వైఎస్సార్ జిల్లా కమలాపురం టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డికి వాసు కారణంగానే టికెట్ దక్కలేదని అభిప్రాయపడుతున్నారు. వరుసగా మూడుసార్లు ఓడినోళ్లకు ఎన్నికల్లో టికెట్ లేదని గతంలో నారా లోకేశ్ ప్రకటించినా నెల్లూరు జిల్లా సర్వేపల్లి అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రకటించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని కూడా ఊరించి ఉసూరుమనిపించారు. దేవినేని ఉమాకు షాక్.. వసంతకే మైలవరం టికెట్ మరోవైపు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వివాదంగా మారిన పెనమలూరు, మైలవరం అసెంబ్లీ సీట్లకు బోడె ప్రసాద్, వసంత కృష్ణప్రసాద్ పేర్లను ఖరారుచేశారు. మైలవరం సీటు కోసం ఫిరాయింపు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావులు గట్టిగా పోటీపడ్డారు. ఈ స్థానాన్ని నిలుపుకునేందుకు దేవినేని ఉమా గట్టిగా పట్టుబట్టినా ఇటీవలే టీడీపీలో చేరిన కృష్ణప్రసాద్ ధనబలంతో దాన్ని చేజిక్కించుకున్నట్లు చెబుతున్నారు. మైలవరం టికెట్‌ను ఫిరాయింపు నేతకు ఇస్తున్న నేపథ్యంలో పెనమలూరు సీటుకు దేవినేని ఉమా పేరును పరిగణలోకి తీసుకుని అక్కడికి పంపుతున్నట్లు హడావుడి చేశారు. అక్కడి ఇన్‌ఛార్జి బోడె ప్రసాద్‌ను పక్కనపెడుతున్నట్లు హంగామా చేసినా చివరికి ఆయనకే సీటు ఇచ్చారు. దీనివెనుకా భారీగా డబ్బు దండుకునే వ్యూహం అమలైనట్లు తెలుస్తోంది. ఆ వ్యూహంలో చిక్కుకున్న బోడె ప్రసాద్ ఎలాగోలా టీడీపీ పెద్దలను సంతృప్తిపరచడంతో ఆయనకే సీటు ఖరారుచేశారు. దీంతో.. రెండు స్థానాల్లో ఏదీ దక్కక టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అభాసుపాలయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఉమాను అన్ని రకాలుగా వాడుకున్న చంద్రబాబు చివరికి కరివేపాకులా పక్కన పడేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
‘దేశ’ ముదుర్లు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ... కాంగ్రెస్ వేరువేరు కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను చంద్రబాబు నాయుడే డబ్బులిచ్చి మరీ నడిపిస్తున్నారని మరోసారి స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడింది. అవసరాల కోసం, కేసుల నుంచి రక్షణ కోసం చంద్రబాబు ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. అధికారికంగా జనసేనతోను, అనధికారికంగా కాంగ్రెస్‌తోను అంటకాగుతూనే ఉన్నారని స్పష్టంగా వెల్లడయింది. ఇందుకోసం చంద్రబాబు తన నమ్మిన బంటు సీఎం రమేశ్ ద్వారా... కాంగ్రెస్ పార్టీకి భారీ ప్యాకేజీ అందజేసినట్లు నేరుగా ఎలక్టొరల్ బాండ్లే వెల్లడించాయి. అది కూడా తెలంగాణలోను, కాంగ్రెస్‌లోను ఎన్నికలకు ముందు ఏకంగా 30 కోట్ల రూపాయలను అధికారికంగా పార్టీ ఫండ్ కింద చంద్రబాబు నాయుడు పంపించినట్లు వెల్లడయింది. ఇక అనధికారికంగా ఎంత ముట్టజెప్పారన్నది ఊహించటం కష్టమే. వీటన్నిటికీ తోడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎలా మోశారో... కాంగ్రెస్ కోసం తన పార్టీని ఎన్నికల్లో పోటీ చేయించకుండా ఎలా కట్టడి చేశారో తెలియనివేమీ కావు. నిజానికి కడప జిల్లాకు చెందిన సీఎం రమేశ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నా... నూటికి నూరుపాళ్లూ తెలుగుదేశం మనిషి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఆయన రిత్విక్ ప్రాజెక్టŠస్ సంస్థను ఆరంభించి... బాబు అండదండలతో భారీ కాంట్రాక్టులు పొందారు. బాబు మనిషిగా సింగపూర్, మారిషస్‌ల నుంచి నిధులు తెచ్చుకుని చాలా తక్కువ కాలంలోనే వేల కోట్లకు ఎదిగాడు. అందుకే... 2019లో తాను ఓడిపోగానే సీఎం రమేశ్‌ను బీజేపీలోకి పంపించేశాడు చంద్రబాబు నాయుడు. ఇక అప్పటి నుంచి బీజేపీలో ఉంటూనే... నారా వారి ప్రయోజనాల కోసం సకల కార్యాలూ చక్కబెట్టడం మొదలెట్టాడు సీఎం రమేశ్. అలాంటి సీఎం రమేశ్... బీజేపీలో ఉంటూ బీజేపీకి ఒక్క పైసా కూడా అధికారికంగా ఇవ్వకపోయినా... రూ.30 కోట్లను మాత్రం బీజేపీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్ ఖాతాలో వేయటం అందరినీ ఆశ్చర్యపరిచేదే. అంతేకాదు. చంద్రబాబు ఎవరెవరిని వాడాలని అనుకుంటున్నారో... వారందరికీ అవసరమైన ఖర్చులు పెట్టడం, ప్రత్యేక విమానాలు సమకూర్చటం ఇవన్నీ రమేశ్ విధులే. ఈయన విమానాన్ని ఇటీవల షర్మిల, పవన్ కల్యాణ్, ప్రశాంత్ కిషోర్ సహా బాబు బ్యాచ్ మొత్తం వాడేస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. జగన్ టార్గెట్‌గా బాబు పావులు... 2019లో ప్రజా క్షేత్రంలో దారుణంగా ఓడిపోయినప్పటి నుంచీ చంద్రబాబు ఎన్ని పాచికలు వేసినా పారటం లేదు. ఆ తరవాత జరిగిన స్థానిక ఎన్నికలతో సహా ప్రతి ఎన్నికలోనూ ఘోరమైన ఓటమి పాలవుతుండటంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ప్రజాక్షేత్రంలో ఢీకొనటం కష్టమని తెలుసుకుని మాయోపాయాలకు దిగాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఆసరాగా చేసుకుని ఆయన కుటుంబీకుల్లో చిచ్చు పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టవచ్చనే నిర్ణయానికి వచ్చి... ఆ దిశగా పావులు కదిపాడు. హత్య కేసులో తన భర్త పాత్ర బయటపడి ఇరుక్కుంటామేమోనని భయపడుతున్న సునీతను చేరదీయటంతో పాటు... అధికారం ఆశ చూపించి వైఎస్ షర్మిలనూ తమవైపు తిప్పుకున్నారు. వారు గనక తెలుగుదేశంలో నేరుగా చేరితే తమ మాటలెవరూ నమ్మరన్న ఉద్దేశంతో... తన సన్నిహితుడు రేవంత్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్‌లో ఆమె పార్టీని విలీనం చేయించటం వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా చేయించాడు. ఇదే సమయంలో ఈ కార్యక్రమాలన్నీ చేయటానికి కాంగ్రెస్‌కు తన బంటు సీఎం రమేశ్ ద్వారా రూ.30 కోట్లను ఎలక్టొరల్ బాండ్ల ద్వారా అందజేశారు. నిజానికి ఎలక్టొరల్ బాండ్ల విషయంలో చాలా కంపెనీలు 2019 ఎన్నికల ముందు కొనుగోలు చేసి ఆయా పార్టీలకు అందజేశాయి. సీఎం రమేశ్ మాత్రం 2023లోనే తన రిత్విక్ ప్రాజెక్ట్ ద్వారా రూ.45 కోట్ల మేర ఎలక్టొరల్ బాండ్లను కొనుగోలు చేసి, అందులో రూ.30 కోట్లను కాంగ్రెస్ ఖాతాలోకి, రూ.5 కోట్లను తెలుగుదేశం ఖాతాలోకి, మరో 10 కోట్లను కర్ణాటకకు చెందిన జనతాదళ్ (ఎస్) ఖాతాలోకి వేశారు. కాంగ్రెస్‌లో మారిన పరిణామాలు... తెలుగుదేశం తరఫున రాజ్యసభకు ఎన్నికై... బీజేపీలో కొనసాగుతూ... కాంగ్రెస్‌కు భారీగా నిధులిచ్చిన సీఎం రమేశ్... ఇటీవల చంద్రబాబు నాయుడిని ఢిల్లీలో బీజేపీ పెద్దలు కలవటానికి కూడా ఇష్టపడనప్పుడు మొత్తం వ్యవహారాన్ని వెనక ఉండి నడిపించారు. మొత్తానికి బీజేపీ పెద్దల అపాయింట్మెంట్లు సంపాదించి బాబును వారితో భేటీ అయ్యేలా చేశారు. ఇక వాళ్లేం చెబితే అది చేస్తానని చంద్రబాబు సాగిలపడటంతో వారు కూడా పొత్తుకు సరేనన్న విషయం బహిరంగ రహస్యమే. ఆ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా నేరుగానే చెప్పారు. బాబుకు బుద్ధొచ్చింది కనకనే తిరిగి తమ వద్దకు వచ్చాడని ఆయన చెప్పగా... గతంలో చంద్రబాబుజీ... నాయుడుజీ అన్న ప్రధాన మంత్రి మోదీ... ఇటీవల చిలకలూరిపేట సభలో మాత్రం నేరుగా చంద్రబాబు నాయుడు అని మాత్రమే... అదికూడా ఒక్కసారే సం¿ోదించడం గమనార్హం. బాబు మాత్రం మోదీజీ గారు అంటూ అతివినయం ప్రదర్శించటం ఎవ్వరి దృష్టినీ దాటిపోలేదు కూడా. కాకపోతే సీఎం రమేశ్ కాంగ్రెస్ పార్టీకి నిధులిచ్చాక పరిణామాలు వేగంగా మారాయి. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీని విలీనం చేయటంతో పాటు ఆమెను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమించారు. నాటి నుంచీ ఆమె నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్‌గా చేసుకుని రకరకాల విమర్శలు చేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతకు కూడా తాను అండగా ఉన్నానని చెబుతూ... వివేకా హత్య విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలకు దిగారు. ఒక దశలో వివేకా భార్యను గానీ, సునీతను గానీ కడపలో పోటీ చేయించాలని భావించి... ఇపుడు మాత్రం చంద్రబాబు సూచనలతో నేరుగా తానే పోటీక దిగే ప్రయత్నాలూ చేస్తున్నారు. కాకపోతే ఇప్పటిదాకా ఈ వ్యవహారాలపై ఎన్ని విమర్శలొచ్చినా కాంగ్రెస్‌తో తమకేం సంబంధమంటూ చంద్రబాబు దాటవేశారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే తరహాలో స్పందించేవారు. కాకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ ఎలక్టొరల్ బాండ్ల మొత్తం వివరాలన్నీ బయటపెట్టింది. ఎవరు కొన్నారు? ఏ పార్టీకి ఇచ్చారు? ఎంత ఇచ్చారు? అనే వివరాలన్నీ వెల్లడించటంతో... సీఎం రమేశ్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఇచ్చిన వ్యవహారం బట్టబయలయి... దొంగలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఇవీ.. బాండ్ నంబర్లు కాంగ్రెస్‌కు సీఎం రమేశ్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ఇచ్చిన బాండ్ల నంబర్లు. ఒక్కొక్కటీ రూ.కోటి విలువ గల 30 బాండ్లను... అంటే రూ.30 కోట్లను కాంగ్రెస్‌కు అందజేశారు. 14402, 14412, 14414, 14416, 14418, 14420, 14422, 14424, 14426, 14427, 14429, 14431, 14433, 14435, 14437, 14439, 14441, 14443, 14445, 14447, 14449, 14451, 14454, 14456, 14458, 14460, 14462, 14464, 14466, 14477.