నేటి నుంచి అంతర్జాతీయ త్రోబాల్ టెస్ట్ మ్యాచ్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: నగరంలో తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ త్రోబాల్ టెస్ట్ మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. హైదరాబాద్ జిల్లా త్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత్, శ్రీలంక పురుషుల జట్ల మధ్య శనివారం నుంచి ముషీరాబాద్ జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్స్‌లో టెస్ట్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో మొత్తం మూడు మ్యాచ్‌లు జరుగుతాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.బి.నర్సిములు తెలిపారు. ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకు 13 మంది సభ్యులు గల శ్రీలంక జట్టు శుక్రవారం నగరానికి చేరుకుంది.
హర్యానా నుంచి భారత జట్టు ఇప్పటికే వచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు శుక్రవారం సాయంత్రం ప్రాక్టీస్ చేశారు. నేడు జరిగే పోటీల ప్రారంభ వేడుకలకు సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఆదివారం సాయంత్రం జరిగే ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి వి. సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.ఎస్.విద్యాసాగర్, జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ డెరైక్టర్ డాక్టర్ ఎస్.ఆర్. ప్రేమ్‌రాజ్, అంతర్జాతీయ వాలీబాల్ మాజీ ఆటగాడు సి.మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.
సత్తా చాటుతాం: భారత కెప్టెన్ అఖీబ్
భారత జట్టుకు విజయావకాశాలున్నాయని కెప్టెన్ మహ్మమద్ అఖీబ్ (కర్ణాటక) చెప్పారు. మన జట్టులో అపారమైన అనుభవం గల నలుగురు అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారని అతను తెలిపాడు. భారత జట్టు ఈ టెస్ట్ మ్యాచ్ కోసం హార్యానా, బెంగళూరులో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో పాల్గొంది. గతంలో మహారాష్ట్రలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు 2-1తో శ్రీలంక పై విజయం సాధించిన విషయాన్ని అతను గుర్తు చేశాడు.
శ్రీలంక యువ జట్టు కెప్టెన్ అథుకొరల
శ్రీలంక జట్టు కుర్రాళ్లకు పెద్ద పీట వేసిందని కెప్టెన్ ఎ.టి.ఎన్.అథుకొరల తెలిపాడు. త్రోబాల్ అభివృద్ధికి భారత్ వచ్చిన తమ జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అన్నాడు. తమ జట్టులో పలు అంతర్జాతీయ త్రోబాల్ టోర్నీ అడిన ఇద్దరు ఆటగాళ్లున్నారని అతను తెలిపాడు. దుబాయ్‌లో జరిగే ఆసియా త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే శ్రీలంక జట్టు ఆటగాళ్లు అనుభవం కోసం భారత్‌తో టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్నట్లు అతను వివరించాడు.