29న కర్నూలులో జాతీయ వినియోగదారుల దినోత్సవం
–నేడు 13 జిల్లాల విద్యార్థులుకు రిడ్జ్ స్కూల్లో పోటీ పరీక్షలు
–రాష్ట్ర స్థాయి వేడుకలకు ముఖ్య అతిథిగా హజరు కానున్న మంత్రి పరటాల సునీత
కర్నూలు(అగ్రికల్చర్):
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు రాష్ట్ర స్థాయిలో ఈ నెల 29న కర్నూలులో నిర్వహించనున్నారు. ప్రతి యేటా డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేస్తుంది. జిల్లా స్థాయిలో ఈ నెల 24నే ఈ దినోత్సవం పూర్తయింది. రాష్ట్ర స్థాయి వేడుకలను కర్నూలులోనే ఈ నెల 29న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకోసం రూ.5.50 లక్షలు విడుదల చేసింది. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 13 జిల్లాలకు చెందిన హైస్కూల్, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు 28న అంటే బుధవారం కర్నూలు శివారులోని డోన్ రోడ్డులో ఉన్న లక్ష్మిపురం రిడ్జ్ స్కూల్లో నిర్వహించనున్నారు. దూరప్రాంతాల నుంచి విద్యార్థులు రావడంలో ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున మధ్యాహ్నం తర్వాత పోటీ పరీక్షలను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. పరీక్ష రాయడంతో పాటు రాత్రికి అక్కడే బస చేసేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షల్లో మొదటి స్థానాల్లో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు హాజరవుతారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. 13 జిల్లాల నుంచి 150 మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరువుతారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో గెలుపొందిన వారికి రూ.7వేలు, ద్వితీయ స్థానంలో గెలుపొందిన వారికి రూ.5వేలు, తృతీయ స్థానంలో గెలుపొందిన వారికి రూ.4వేలు నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలు అందిస్తారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి రాక....
ఈ నెల 29న కర్నూలులో నిర్వహించే జాతీయ వినియోగదారుల దినోత్సవం రాష్ట్ర స్థాయి వేడుకలకు ముఖ్య అతిథిగా పౌరసరఫరాల శాఖ మంత్రి పరటాల సునీత హాజరు కానున్నారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్, డైరెక్టర్ రవిబాబు, రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షులు నౌషద్ అలీ.. 13 జిల్లాల డీఎస్ఓలు, వినియోగదారుల సంఘాల రాష్ట్ర నేతలు తదితరులు పాల్గొంటారు.