సమైక్య ఉద్యమ కేసులన్నీ ఎత్తేస్తున్నాం: పరకాల
హైదరాబాద్: సమైక్య ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులన్నీ ఎత్తేస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. 952 కేసుల్లో 106 కేసులు ఇప్పటికే ఎత్తేశామని ఆయన మీడియాకు వెల్లడించారు. కేసుల ఎత్తివేత వలన 4482 మందికి ఊరట లభించిందని ఆయన తెలిపారు. మిగిలిన కేసుల్ని పరిశీలించి త్వరలో ఎత్తివేస్తామన్నారు.
రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ అవాంతరాలు సృష్టిస్తుందని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆర్బీఐ సహకరించకపోయినా రుణమాఫీ చేస్తామన్నారు. రుణాలు రీషెడ్యూల్ జరగకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు.
ఆర్బీఐకి కరువు, వరదలపై లేఖ రాయకుండా గత ప్రభుత్వం విస్మరించిందని, కొత్త రుణాలపై స్పష్టత ఇవ్వలేమని, నిధులు సమీకరణకు కొంత సమయం పడుతుందని పరకాల ప్రభాకర్ వెల్లడించారు.