Vasundhara Raje
-
సీఎం ఎంపికపై మల్లగుల్లాలు.. ఢిల్లీకి వసుంధర రాజే!
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. ఈ నేపధ్యంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. రాజే బుధవారం రాత్రి 10:30 గంటలకు ఇండిగో ఎయిర్వేస్ విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వసుంధర రాజే గురువారం ఉదయం జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ కానున్నారు. రాజస్థాన్‌లో అధికారాన్ని వసుంధర రాజేకు అప్పగించాలని పార్టీ హైకమాండ్ మరోసారి భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. డిసెంబరు 3న రాజస్థాన్‌లో బీజేపీకి మెజారిటీ వచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి ఎవరనేదానిపై చర్చ మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. ఈ జాబితాలో వసుంధర రాజే, అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్ షెకావత్, రాజేంద్ర రాథోడ్, దియా కుమారి, బాబా బాలక్‌నాథ్, ఓం బిర్లా పేర్లు ఉన్నాయి. సీఎం రేసులో అనేక మంది పేర్లు ఉండటంతో వసుంధర రాజే చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలను ఆమె విందుకు ఆహ్వానించారు. ఈ నేపధ్యంలో దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఆమెను ముఖ్యమంత్రిని చేసేందుకు అంగీకరించారని వసుంధర మద్దతుదారులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో రాజే ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ఎంపీ పదవికి 10 మంది రాజీనామా -
రాజస్తాన్ రాజెవరో?
రాజస్తాన్ శాసనసభ ఎన్నికల్లో విపక్ష బీజేపీ ఘన విజయం సాధించింది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి పరాభవం ఎదురైంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై అందరి దృష్టి కేంద్రకృతమైంది. రాజస్తాన్ రాజు ఎవరవుతారో మరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. ప్రధానంగా నలుగురు ముఖ్యనేతలు సీఎం రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మరోసారి పదవి ఆశిస్తున్నారు. పార్లమెంట్ సభ్యురాలు దియా కుమారి(ఈ ఎన్నికల్లో విద్యాధర్‌నగర్ స్థానం నుంచి గెలిచారు), కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, మహంత్ బాలక్‌నాథ్ యోగి సైతం సీఎం పోస్టు కోసం పోటీపడుతున్నారు. ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే.. వసుంధర రాజే వసుంధర రాజే గతంలో రెండుసార్లు రాజస్తాన్ సీఎం చేశారు. ఈ ఎన్నికల్లో జాల్రాపటాన్ స్థానం నుంచి భారీ మెజారీ్టతో గెలుపొందారు. ఆమె బీజేపీ అధిష్టానాన్ని విభేదిస్తున్న నేతగా పేరుగాంచారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పెద్దగా సత్సంబంధాలు లేవన్న సంగతి బహిరంగ రహస్యమే. బీజేపీలో పాతతరం నేత అయిన వసుంధర రాజేను మూడోసారి గద్దెనెక్కించడానికి పార్టీ అగ్రనేతలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం ఆశీస్సులు లేకపోవడంతో ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కుదించుకుపోయాయి. దియా కుమారి రాజ్‌సమంద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దియా కుమారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి నెగ్గారు. జైపూర్ దివంగత మహారాణి గాయత్రి దేవి మనవరాలైన దియా కుమారి బీజేపీలో వసుంధర రాజేకు ప్రత్యామ్నాయ నేతగా ఎదిగారు. రాచరిక నేపథ్యం, రాజ్‌పుత్ వర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు కలిసివచ్చాయి. చాలాఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. గతంలో సవాయ్‌మాధోపూర్ ఎమ్మెల్యేగా ఆమె చేసిన అభివృద్ధి పనులు ప్రశంలందుకున్నాయి. రాజస్తాన్‌లో నూతన ముఖ్యమంత్రిని నియమించే విషయంలో పార్టీ అధిష్టానం దియా కుమారి వైపు మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మహంత్ బాలక్‌నాథ్ యోగి రాజస్తాన్‌లోనూ ఉత్తరప్రదేశ్ తరహా ప్రయోగం చేయాలనుకుంటే ముందుగా గుర్తొచ్చే పేరు మహంత్ బాలక్‌నాథ్ యోగి. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్ మఠాధిపతి అయిన ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యారు. బాలక్‌నాథ్ ప్రస్తుతం రాజస్తాన్‌లో అల్వార్ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. గతంలో సన్యాసం స్వీకరించారు. మహంత్ చాంద్‌నాథ్ మఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. రాష్ట్రంలో బలమైన అనుచరవర్గం ఉంది. నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం దృష్టిలో ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గజేంద్రసింగ్ షెకావత్ రాజస్తాన్ బీజేపీలో మరో సీనియర్ నేత గజేంద్రసింగ్ షెకావత్. ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అవినీతి వ్యవహారాలపై పలు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ దూకుడుగా పనిచేశారు. ముఖ్యమంత్రిపై పలు ఆరోపణలు గుప్పించారు. తదుపరి సీఎం రేసులో తాను ఉన్నానంటూ ఇప్పటికే సంకేతాలు పంపించారు. కొందరు బీజేపీ ముఖ్యనేతలు ఆయనకు మద్దతిస్తున్నారు. సీఎం పోస్టుపై గజేంద్రసింగ్ ఆశలు పెట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇది మోదీ సునామీ: సీఎం రేసులో బీజేపీ రేసు గుర్రాలు
రాజస్థాన్‌లో బీజేపీ ఆధిక్యం అప్రతి హతంగా కొనసాగుతోంది. కీలక నేతలు భారీ మెజారిటీతో విజయం సాధించి గెలుపు గుర్రాలు నిలిచారు. ముఖ్యంగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝల్రాపటన్ అసెంబ్లీ స్థానంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే 53,193 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించారు. దీంతో ఆమె మళ్లీ రాజస్థాన్ ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించాలని ఆమె మద్దతుదారులు కోరుకుంటున్నారు. మరోవైపు బీజేపీ ఎంసీ దియా కుమారి విద్యాధర్ నగర్లో 71,368 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై విజయం సాధించారు. రాజకుటుంబానికి చెందిన కుమారికూడా సీఎం రేసులో ఉన్న సంగతి తెలిసిందే. తన విజయం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె దేశవ్యాప్తంగా మోదీ సునామీ వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ గెలుపు ప్రధాని మోదీ, అమిత్ షా జీ, జేపీ నడ్డా జీ, రాష్ట్ర నాయకులు పార్టీ కార్యకర్తలకే చెందుతుంతన్నారు. రాజస్థాన్‌తో పాటు ఎంపీ ,ఛత్తీస్‌గఢ్‌లో కూడా మోదీజీ మ్యాజిక్ పనిచేసింది, రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధిని అందిస్తాం.. ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు కనిపిస్తున్నాయి.. ఇక సీఎం ఎవరనేది పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయిస్తుందని దియా వ్యాఖ్యానించారు. మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జోత్వారా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌదరిపై ఆయన సునాయాసంగా విజయాన్ని నమోదు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ, బీజేపీ శ్రేణులకు, జోత్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాము చెప్పేది చేసే పార్టీకి చెందిన వారమని ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. #WATCH | Rajasthan BJP MLA candidate Diya Kumari, in Jaipur says, "The credit for this win goes to PM Modi, Amit Shah ji, JP Nadda ji, state leaders and party workers. Modi ji's magic worked in Rajasthan and also MP & Chhattisgarh...We will ensure good governance and development… pic.twitter.com/3stn8l8Vj1 — ANI (@ANI) December 3, 2023 VIDEO | Rajasthan elections 2023: "I would like to thank PM Modi, BJP workers and the people of Jhotwara. People know that we belong to a party that do what it says," says @Ra_THORe, BJP candidate from Jhotwara, as party continues to maintain lead in Rajasthan.… pic.twitter.com/BO2v3PCmu1 — Press Trust of India (@PTI_News) December 3, 2023 -
ఆధిక్యంలో ఉన్న వసుంధర రాజే..ముచ్చటగా మూడోసారి ఆమెనా..?
రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్‌తో బీజేపీ దూసుకుపోతోంది. ఝల్రాపతన్ నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే 25వ రౌండ్ కౌంటింగ్ 53,193 ఓట్లతో ఆధిక్ష్యంలో కొనసాగుతున్నారు. ఎలాగైన కాంగ్రెస్‌ని మట్టికరిపించి పాగా వేయాలనుకున్న బీజేపీ చేసిన గట్టి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక వసుంధర రాజే పోటీ చేసిన నియోజక వర్గం నుంచే రామ్‌లాల్ చౌహాన్ సవాల్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం. ఇక వంసుధ రాజే 2003 నుంచి ఝలావర్ జిల్లాలోని ఝల్రాపతన్ అసెంబ్లీ సీటును గెలుస్తూ ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న వసుంధర రాజే మళ్లీ సీఎం కావావలని ఆ కుర్చీని ఆశిస్తున్నారు. రాజస్థాన్‌లో గెలిచిన బీజేపీ అభ్యర్థులు.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పిండ్వారా అబూ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి సమరం 13,094 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి లీలారామ్ గ్రాసియా కంటే ముందంజలో ఉన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి గోవింద్ ప్రసాద్ కూడా 24,865 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి కైలాష్ చంద్ మనోహర్ థానా కంటే ఆధిక్యంలో ఉన్నారు. అలాగే విద్యాధర్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై బీజేపీ నాయకురాలు దియా కుమారి ఆధిక్యంలో ఉన్నారు. ఇక దియా కుమారి 17వ రౌండ్ కౌంటింగ్ తర్వాత 56,025 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఇప్పటివరకు మొత్తం 1,30,231 ఓట్లను సాధించారు. బీజేపీ ఎంపీ, ఝోత్వారా అభ్యర్థి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌదరిపై ఆధిక్యంలో ఉన్నారు. పదిహేనవ రౌండ్ కౌంటింగ్ తర్వాత రాథోడ్ 36723 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఇప్పటివరకు మొత్తం 123312 ఓట్లను సాధించారు. మధ్యాహ్నాం వరకు సాగిన కౌంటింగ్‌లో.. బీజేపీ కాంగ్రెస్ ఇతరులు 114 71 15 ఇక వసుంధర రాజే రెండు పర్యాయాలు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక ముచ్చటగా మూడోసారి ఆమె సీఎం అవతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఐతే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన మహంత్ బాలక్‌నాథ్ కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, రాజస్థాన్‌లో నవంబర్ 25న 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మెజారిటీ మార్కు 100 కాగా, ఆ మార్కుని బీజేపీ క్రాస్ చేసి ముందంజలో ఉండటం విశేషం. (చదవండి: ఏళ్లుగా సాగుతున్న 'పరంపర" సంప్రదాయానికే కట్టుబడిన రాజస్థాన్! సీఎం ఎవరంటే..?) -
రాజస్థాన్‌లో గెలిస్తే సీఎం ఎవరు? దియా కుమారి స్పందన
రాజస్థాన్ పీఠం ఎవరికి దక్కనుంది అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 199 స్థానాలకు నవంబర్ 25నాటి పోలింగ్‌లో ప్రజలు తమ తీర్పును నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించు కుంటుందా లేక బీజేపీ విజయం సాధిస్తుందా అనేది పెద్ద ప్రశ్న. అయితే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలో ఎవరు బీజేపీ సీఎం ఎవరు అవుతారనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు సీఎం అభ్యర్థిని బీజేపీ ప్రతిపాదించ లేదు. ప్రధానంగా సీఎం పదవిరేసులో బీజేపీ ఎంపీ, విద్యాధర్ నగర్ అభ్యర్థి దియా కుమారి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ ఊహగానాలపై తాజాగా స్పందించారు. ఫలితాల తర్వాత పార్లమెంటరీ బోర్డు, పార్టీ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. పార్టీ తనకు ఏ పని ఇచ్చినా, దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా మద్దతున్న దియాకుమారి పోటీ రాజస్థాన్ బీజేపీలో కలకలం రేపింది. అయిదు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి , సింధియా విధేయుడు ,మాజీ ఉపాధ్యక్షుడు భైరాన్ సింగ్ షెకావత్ అల్లుడు నర్పత్ సింగ్ రాజ్వీని కాదని దియాను ఎంపిక చేయడం పార్టీలో వివాదం రేపింది. దీంతో రాజ్వీకి పాత నియోజకవర్గం చిత్తోర్గడ్ను కేటాయించడంతో ఇది సద్దుమణిగింది. అయితే 15 ఏళ్ల తర్వాత చిత్తోర్‌గఢ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర సింగ్ జాదావత్పై మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, సీనియర్ నేత రెండు సార్లు రాజస్థాన్ సీఎంగా పనిచేసిన వసుంధర రాజే కూడా సీఎం పీఠంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే సంఘ్ నేతలు, బీజేపీ హైకమాండ్‌తో విభేదాలు, అసంతృప్తితో ఈ అవకాశాలు తక్కువే అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఒకవేళ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుంటే అపుడు వసుందర రాజే పేరేను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల అంచనా. అటు అర్జున్ రాఘ్ మేఘ్వాల్ సీఎం పదవికి ప్రముఖంగా వినిపిస్తున్న మరో కీలక పేరు.ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది అనే చర్చ జోరందుకుంది. #WATCH | Rajasthan: On the face of CM in Rajasthan, BJP MP and candidate from Vidhyadhar Nagar, Diya Kumari says, "This will be decided by the parliamentary board and top leadership of the party after the results... Whatever work the party gives me, I always complete it..." pic.twitter.com/nroHLxHiZq — ANI (@ANI) December 2, 2023 -
పొమ్మనలేక పొగ!
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుతోంది. ఆ రాష్ట్రాల్లో బీజేపీలో ముగ్గురు కీలక నేతల పరిస్థితి ఆసక్తికరంగా మారింది. శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధర రాజె సింధియా, రమణ్‌సింగ్ గతంలో అన్నీ తామై ఒంటి చేత్తో ఎన్నికల భారం మోసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. బీజేపీ అధిష్టానం కొత్తగా తెరపైకి తెచ్చిన సమష్టి నాయకత్వ సూత్రాన్ని మూడు రాష్ట్రాల్లోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. దీని అసలు ఉద్దేశం వారు ముగ్గురినీ పక్కన పెట్టడమేనని చెబుతున్నారు. అక్కడ సీఎం అభ్యర్థులుగా ఎవరినీ ప్రకటించకపోవడం అందులో భాగమేనని అంటున్నారు. శివరాజ్‌కు బై బై...! మధ్యప్రదేశ్‌లో శివరాజ్ రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. బీజేపీలో తిరుగులేని నేతగా ఎదిగారు. ముఖ్యంగా సీఎంగా ఉమాభారతి దారుణమైన పనితీరు అనంతరం బాబూలాల్ గౌర్‌కు అవకాశమిచ్చి భంగపడ్డాక చివరికి శివరాజ్‌కు ప్రభుత్వ పగ్గాలను పార్టీ అప్పగించింది. దాన్ని ఆయన రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. వరుసగా రెండుసార్లు పార్టీని గెలిపించి 13 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. నరేంద్ర మోదీ ప్రాభవానికి ముందు జాతీయ స్థాయిలో బీజేపీలో కీలక నేతగా ఎదిగేలా కనిపించారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైంది. కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు కుప్పకూలి 2020లో నాలుగోసారి శివరాజ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇమేజీ, ఆదరణ ఈ మూడు సంవత్సరాల్లో క్రమంగా తగ్గుముఖమే పడుతూ వచ్చాయి. దాంతో మోదీ–అమిత్ షా ద్వయం ఆయనపై బాగా అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అందుకే ఈసారి శివరాజ్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లరాదని నిర్ణయించారని తెలుస్తోంది. ఈసారి ఎన్నికలకు కొద్ది నెలల ముందునుంచే శివరాజ్ ప్రాధాన్యం మరింత తగ్గుతూ వచి్చంది. పలువురు కేంద్ర మంత్రులతో పాటు సీనియర్ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడం ఆ దిశగా మరింత బలమైన సంకేతాలే అని చెప్పొచ్చు. ► ఈసారి బీజేపీ నెగ్గినా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ వర్గీయ ముఖ్యమంత్రి అభ్యర్థులవుతారని చెబుతున్నారు. ► లేదంటే మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం ద్వారా కమల్‌నాథ్ సర్కారు పుట్టి ముంచిన జ్యోతిరాదిత్య సింధియాకు కుర్చీ దక్కినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. వసుంధరకు వీడ్కోలే..! రాజస్తాన్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకురాలు వసుంధర రాజె సింధియాదీ దాదాపు అదే పరిస్థితిలా ఉంది. భైరాన్‌సింగ్ షెకావత్ అనంతరం రాష్ట్రంలో పార్టీని సమర్థంగా నడిపిన నాయకురాలిగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. వాస్తవానికి ఈ రోజుకూ రాజస్తాన్ బీజేపీలో కరిష్మా ఉన్న నాయకురాలు వసుంధరా రాజె మాత్రమే. అంతేగాక ప్రజాదరణ విషయంలో ఇప్పటికీ ఆమెకు తిరుగులేదనే చెప్పాలి. ఆమెకు ప్రత్యామ్నాయంగా బీజేపీ నాయకత్వం తెరపైకి తెస్తున్న అర్జున్‌రామ్ మెఘ్వాల్, సతీశ్ పునియా, సీపీ జోషీ, గజేంద్ర సింగ్ షెకావత్, ఓం బిర్లా తదితరులెవరూ సామాన్య ప్రజానీకంలో మంచి ప్రజాదారణ ఉన్న నాయకులు కాదు. పైగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వారికి పెద్ద ఆదరణ లేదు. అయినా సరే, బీజేపీ ఈసారి వసుంధరకు పెద్దగా ప్రాధాన్యమివ్వకుండానే ఎన్నికల బరిలోకి దిగింది! కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, ఆయన మంత్రివర్గ సహచరులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలకు ప్రధానిగా మోదీ కరిష్మా తోడై సులువుగా గెలుస్తామని నమ్ముతోంది. అనంతరం రాష్ట్రంలో కొత్త నాయకులను తీర్చిదిద్దుకోవడం కష్టమేమీ కాదనే భావనలో ఉంది. రమణ పర్వానికి తెర! కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ పరిస్థితి మరీ ఆశావహంగా ఏమీ లేదు. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ దూకుడు మీదున్నారు. రకరకాల సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల హామీల సమర్థ అమలు ఆయనకు మరింతగా కలిసొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా 15 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా చేసిన రమణ్‌సింగ్‌ను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టినట్టుగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగించేదే. ఫలితంగా బీజేపీకి ఒకరకంగా రాష్ట్రాస్థాయి కీలక నాయకత్వమంటూ లేకుండా పోయింది. ఏదేమైనా రాష్ట్రంలో పారీ్టకి కొత్త రక్తాన్ని ఎక్కించడమే మోదీ–అమిత్‌షా ద్వయం ఉద్దేశంగా కనిపిస్తోంది. ఫలితంగా ఇక్కడ కేవలం మోదీ కరిష్మా మీదే భారం వేసి బీజేపీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. కానీ హిమాచల్ ప్రదేశ్‌లోనూ, అనంతరం కర్ణాటకలోనూ ఇదే ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్న వైనాన్ని తలచుకుని బీజేపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజస్థాన్‌లో బీజేపీ ముఖచిత్రం ఎవరంటే..?
చిత్తోఢ్: రాజస్థాన్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీల్లో అంతర్గత పోరు రచ్చకెక్కుతోంది. సీటు దక్కించుకోవడానికి నాయకుల అలకలు బయటపడుతున్నాయి. ఇటీవల బీజేపీ నిర్వహించిన పలు సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వసుందర రాజేతో పాటు మరికొందరు సీనియర్ నాయకులు గౌర్హాజరైన నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సీఎం అభ్యర్థిపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చిత్తోఢ్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. నేరాల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రథమ స్థానంలో నిలిపిందని ఆరోపించారు. సీఎం అశోక్ గహ్లోత్ హయంలో రాష్ట్రంలో అల్లర్లు, రాళ్లదాడులు, మహిళలపై ఆకృత్యాలు, దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఇందుకే ఓటేశారా..? అని ప్రశ్నించారు. బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు చెలరేగుతున్న క్రమంలో సీఎం అభ్యర్థి ఎవరని ప్రధాని మోదీని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు..' బీజేపీకి ముఖచిత్రం కమలమే. ప్రజలు కమలాన్ని మాత్రమే చూస్తారు. బీజేపీ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. రాజస్థాన్ అభివృద్ధికే కేంద్ర ప్రభుత్వం ప్రధాన్యతనిస్తుంది.' అని అన్నారు. ఈ మేరకు చిత్తోఢ్‌లో రూ.7000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. మాజీ సీఎం వసుంధర రాజే, సీనియర్ నాయకుల మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయి. సీఎం అభ్యర్థిగా తమను ప్రకటించాలని సీనియర్ నాయకులు అధిష్ఠానాన్ని అభ్యర్థిస్తున్నారు. మళ్లీ రాజేకే పట్టం కట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్ షాతో సహా బీజేపీ చీఫ్ నడ్డా రాష్ట్ర నాయకులతో ఇప్పటికే సమావేశమయ్యారు. ఇదీ చదవండి: విపక్షాలకు విజన్ లేదు, రోడ్‌మ్యాప్ లేదు -
వసుంధర రాజేకు షాకిచ్చిన బీజేపీ
జైపూర్: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ రాజస్థాన్‌లో వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు సన్నాహకంగా ఏర్పాటు చేయనున్న రెండు కమిటీ సభ్యులను ప్రకటించింది. కానీ ఈ కమిటీల్లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే పేరు లేకపోవడం విశేషం. రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆ రాష్ట్రంలో సంకల్ప్ మ్యానిఫెస్టో కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ పేరిట రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. 21 మంది సభ్యుల ఎన్నికల నిర్వహణ కమిటీకి మాజీ ఎంపీ నారాయణ్ లాల్ పంచారియా నేతృత్వం వహిస్తుండగా 25 మంది సభ్యుల సంకల్ప్ కమిటీకి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నాయకత్వం వహించనున్నారు. ఈ కమిటీల్లో ఎంపీ కిరోడీ లాల్ మీనా, మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు చోటు లభించగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తోపాటు రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్ ల పేర్లను ఈ కమిటీ జాబితాల్లో చేర్చకపోవడం చర్చనీయాంశమంది. గత కొన్నాళ్లుగా వీరంతా రాష్ట్రంలో బీజేపీ ప్రచార బాధ్యతలను భుజాన మోస్తున్నారు. మాజీ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాజీ రాష్ర అధ్యక్షుడు సతీష్ పూనియాలకి కూడా ఈ కమిటీల్లో చోటు దక్కలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి తోపాటు మహిళలపై జరుగుతున్న అరాచకాలనే ప్రధానాస్త్రాలుగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మహిళా మోర్చా అయితే మరో అడుగు ముందుకేసి 'నహీ సహేగా రాజస్థాన్' పేరిట పేపర్ లీకేజీ, రైతు సమస్యలపై నిరసన తెలుపుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎలా చూసినా గెహ్లాట్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలను తిప్పికొట్టడమే బీజేపీకి పెను సవాలుగా మారింది. కాంట్రాక్టు ఉద్యోగుల బిల్లు, ఆరోగ్య హక్కు బిల్లు వంటి ప్రజాహితమైన పథకాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊతంగా నిలవనున్నాయి. కర్ణాటకలో కూడా ఇదే విధంగా ఐదు గ్యారెంటీలతో రూపందించిన పథకాలు అక్కడ ఆ పార్టీ అధికారంలో రావడానికి దోహద పడ్డాయి. రాజస్థాన్‌లో కూడా అదే పాచిక పారుతుందని కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉండగా బీజేపీ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది. అందుకోసమే కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది కూడా చదవండి: కొడుకు చేసిన పనికి తండ్రికి శిక్ష.. పార్టీ సభ్యత్వం రద్దు.. -
కాంగ్రెస్‌లో సరికొత్త ముసలం.. సచిన్ పైలట్‌కు కోపం ఎందుకు వచ్చింది?
ఎస్.రాజమహేంద్రారెడ్డి సచిన్ పైలట్‌కు హఠాత్తుగా కోపం వచ్చింది. నాలుగున్నరేళ్లుగా లోలోపల రగిలిపోతున్న అసంతృప్తిని ఒకే ఒక్క చర్యతో బలంగా బహిర్గతం చేశారు. ఎంత బలంగా అంటే, కాంగ్రెస్ అధిష్టానం కంగుతినేంతగా! రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఉక్కిరిబిక్కిరయ్యేంతగా! మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె అవినీతిపై విచారణకు ఆదేశించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ గహ్లోత్ తీరును బాహాటంగానే దుయ్యబట్టిన పైలట్ ఈ నెల 11న ఏకంగా ఒక రోజు నిరసన దీక్షకు కూడా కూర్చున్నారు! అధిష్టానం హెచ్చరించినా, బుజ్జగించినా ఆయన ససేమిరా అన్నారు. దీన్ని ఏమీ పట్టించుకోనట్టుగా గహ్లోత్ పైకి గాంభీర్యం ప్రదర్శించినా లోలోపల తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. స్వపక్షీయుడే అయిన మాజీ కేంద్ర మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం అయిన పైలట్ ప్రతిపక్షంలా తనపైనే దాడికి దిగడం గహ్లోత్‌కు అసలు మింగుడు పడలేదు. ఎవరేమనుకున్నా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి కావాలన్న తన లక్ష్యాన్ని పైలట్ కాస్త గట్టిగానే వినిపించారు. ఒకవిధంగా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టారన్నమాట! సీఎం పదవిపై ఉన్న కాంక్షను వెలిబుచ్చడం ఒకటైతే, ప్రస్తుత ముఖ్యమంత్రి గహ్లోత్, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజెల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని వేలెత్తిచూపడంరెండోది. అంతా బాగుందనుకున్న రాజస్తాన్ కాంగ్రెస్‌లో ఇది సరికొత్త ముసలం...! ► గహ్లోత్–పైలట్ తలనొప్పిని ఎలా పరిష్కరించాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకు కూర్చుంది. ఇలాంటి అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో ఆరితేరిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం ఎవరినీ ఏమీ అనలేక, మధ్యేమార్గంగా ‘మేజర్ సర్జరీ’తో వివాదం సద్దుమణిగేలా చేస్తామన్నారు. అయితే ఆ శస్త్రచికిత్స ఎప్పుడు, ఎలా అన్నది మాత్రం దాటవేశారు. బహుశా సోనియా, రాహుల్‌గాంధీల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టుంది. పైలట్‌లో ఈ రీతిన అసంతృప్తి పేరుకుపోవడానికి అధిష్టానం వైఖరే కారణం. రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా 2018లో పార్టీని విజయపథాన నడిపించిన పైలట్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినట్టే పెట్టి, గహ్లోత్ చాణక్యానికి తలవంచడం అసంతృప్తిని రాజేసింది. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న ఆనందం ఆవిరవకుండా పైలట్‌ను బుజ్జగించి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మమ అనిపించారు. సందర్భాన్ని బట్టి అప్పట్లో ఆ పదవితో పైలట్ సంతృప్తి పడినట్టు కనిపించినా రెండేళ్లు తిరిగేసరికి తనను తాను సర్దిబుచ్చుకోలేక రాజీనామా చేసి అసంతృప్తిని వెళ్లగక్కారు. తాజాగా దీక్షకు దిగి గహ్లోత్తోనూ, అధిష్టానంతోనూ అమీతుమీకే సిద్ధమయ్యానన్న సంకేతాలను పంపగలిగారు. క్రమశిక్షణ చర్యలు తప్పవని రాజస్తాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఎస్.ఎస్.రణ్‌ధవా నేరుగానే హెచ్చరించారు. అయితే పైలట్ మాత్రం ఇవన్నీ పట్టించుకునే స్థితిలో ఉన్నట్టు లేదు. ఈసారి సీఎం పదవి చేజారితే మరో ఐదున్నరేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందని ఆయన భయం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ గహ్లోత్‌నే సీఎంగా చూడటం పైలట్‌కు సుతరామూ ఇష్టం లేదు. మరోవైపు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతున్న రాజస్తాన్ పడవ వివాదాల సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోవడం కాంగ్రెస్ అధిష్టానానికి రుచించడం లేదు. గహ్లోత్‌ను మళ్లీ సీఎం పదవి నుంచి తప్పించడానికి అధిష్టానం విముఖంగా ఉంది. ఎన్నికల ముందు సీఎంను మార్చి ఓటర్లను గందరగోళంలో పడేయడం తప్పుడు సంకేతాలను పంపినట్టవుతుందని భావిస్తోంది. గహ్లోత్‌పై పైలట్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చడం కూడా కాంగ్రెస్‌కు సుతరామూ ఇష్టం లేదు. పంజాబ్‌లో సిద్ధూ ఉదంతం అక్కడి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్నిచ్చిందో కాంగ్రెస్‌కు అనుభవమే కాబట్టి మరోసారి అదే తప్పును పునరావృతం చేయడానికి సాహసించడం లేదు. అయితే ఈ సాకులన్నీ తనను మోసగించడానికేనని పైలట్ గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అంతర్గత పోరును తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేయడం గమనార్హం. ఇప్పటికిప్పుడు బీజేపీ పరిస్థితి అమాంతం మెరుగయ్యేలా లేకపోయినా కులం కార్డు తమకు ఈసారి లాభిస్తుందని కమలనాథుల ఆశ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీపీ జోషి (బ్రాహ్మణ్), బీజేపీ పక్ష నాయకుడిగా రాథోడ్ (రాజ్‌పుత్), ఉప నాయకుడిగా సతీశ్ పునియా (జాట్)లను నియమించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. పథకాలను నమ్ముకున్న గహ్లోత్ 2018 నుంచి ఇప్పటిదాకా తను ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలు 2023లో మరోసారి విజయం అందిస్తాయని గహ్లోత్ దృఢంగా నమ్ముతున్నారు. పార్టీలకు అతీతంగా ఇతర నాయకులతో తనకున్న సత్సంబంధాలు కూడా విజయావకాశాలను ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తున్నారు. ఇటీవలే వందేభారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఒక అడుగు ముందుకేసి గహ్లోత్ గుణగణాలను ప్రశంసించడం గమనార్హం. అయితే మరో ఆరేడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే గహ్లోత్–పైలట్ తమ విభేదాలను పక్కన పెట్టి సామరస్యంగా పనులు చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే కోరుకుంటోంది. కానీ వారు బహిరంగంగానే సై అంటే సై అనుకోవడం కాంగ్రెస్‌పై ఓటర్లకున్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉంది. వివాదాలను తెగేదాకా లాగడం కాంగ్రెస్ అధిష్టానానికి అలవాటుగా మారింది. సెప్టెంబరులోనే అధికార మార్పిడికి ఒకసారి విఫలయత్నం చేసి చేతులెత్తేసిన గాంధీలు మరోసారి అలాంటి సాహసానికి దిగే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. ఖర్గే కూడా గాంధీల మార్గంలోనే పయనిస్తున్నారు. ఉన్నపళంగా పైలట్‌ను సీఎం చేసే దుస్సాహసానికి ఒడిగట్టే స్థితిలో ఆయన కూడా లేరు. పైలట్ కూడా ఇప్పటికిప్పుడు సీఎం పీఠం అధిష్టించాలన్న ఆలోచనలో లేరు. తాను వచ్చే ప్రభుత్వానికి ‘పైలట్’ కావాలని మాత్రమే కోరుకుంటున్నారు. 2020లో తిరుగుబాటు చేసినప్పుడు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడంలో పైలట్ విఫలమై ఉన్న డిప్యూటీ సీఎం పదవి కూడా వదులుకున్నారాయన. ప్రస్తుతం ఆయన ముందున్న లక్ష్యం మరోసారి ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షునిగా ఎంపికై తన మద్దతుదార్లకు ఎక్కువ టికెట్లు ఇప్పించుకోవడం ఒక్కటే! అదీ అధిష్టానం అనుకూలంగా ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ తాజా దీక్షతో ఆ అవకాశం కూడా పైలట్ చేజారినట్టు కన్పిస్తోంది! ఇక పైలట్‌కు మిగిలింది... ► చిన్న పార్టీలైన హనుమాన్ బెనీవాల్ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీలతో జతకట్టి స్వతంత్రంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం. ► సొంతంగా ప్రాంతీయ పార్టీ స్థాపించి భావసారూప్యం గలవారిని చేర్చుకోవడం. ► పైలట్ గుజ్జర్ వర్గానికి చెందిన వారు కాబట్టి గుజ్జర్ల ఓట్లతో గెలవగలిగిన మొత్తం 30 అసెంబ్లీ సీట్లపైనా పూర్తిగా పట్టు బిగించడం. ► ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయడం. అయితే రాజకీయాల్లో తనకన్నా జూనియర్ అయిన కేజ్రీవాల్‌తో కూడటం ఆయనకు రుచించకపోవచ్చు. ► కాంగ్రెస్‌లోనే ఉంటూ పోరాటం కొనసాగిస్తూనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం. కొసమెరుపు.. రాజస్తాన్ ప్రభుత్వాన్ని పైలట్‌గా ముందుండి నడిపించాలన్న సచిన్ ఆశ నెరవేరుతుందో లేదో ఇప్పటికిప్పుడే చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం. కాంగ్రెస్ గనక ఈసారి ఆయన లేకుండా ఎన్నికల బరిలోకి దిగితే 2013లో వచ్చిన 21 సీట్లు కూడా రాకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా. అంటే సచిన్ కాస్త కష్టపడితే రాష్ట్రానికి ‘పైలట్’ అవుతారనే కదా!! -
అనివార్యతే వారిని ఏకం చేసిందా..?
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్గత కలహాలకు అడ్డాగా మారిన రాజస్థాన్ రాజకీయాల్లో ఉప ఎన్నికలు కాస్త మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. అయితే మార్పు అనేది కేవలం అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితమైందని తాజా పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న మూడు స్థానాల ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు మంగళవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా తమ మధ్య ఉన్న మనస్పర్థలను సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లు పక్కనబెట్టి ఒకే వేదికపై కలిసి ఉన్నారనే సంఘీభావ సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే అజయ్ మాకెన్ అనేక ప్రయత్నాల తర్వాత అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్లను ఒకే వేదికపైకి తీసుకురావడంలో విజయవంతమయ్యారు. కానీ ఇరువర్గాల ఎమ్మెల్యేలు, మద్దతుదారులు ఒకరికొకరు దూరంగా ఉన్నారు. ఎన్నికల ప్రచార బాధ్యతను సచిన్ పైలట్ మద్దతుదారులకు అశోక్ గహ్లోత్ అప్పగించలేదు. కానీ ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లోని రెండు స్థానాల్లో గుజ్జర్లు కీలకంగా ఉండడంతో పైలట్‌ను తమతో కలుపుకోవడం సీఎం గహ్లోత్‌తో పాటు పార్టీకి అనివార్యంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ప్రకటన అనంతరం కొత్త తలనొప్పి మొదలైంది. సహదా, రాజ్సమండ్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన తరువాత అంతర్గత కలహాలు బయటపడ్డాయి. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ కాస్త నష్టపోవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మరోసారి బయటపడ్డ కమలదళ అంతర్గత కలహాలు విపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో నాయకుల మధ్య ఎలాంటి సయోధ్య కుదిరే పరిస్థితి కనిపించట్లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి తానే అని అనుయాయులతో ప్రకటింపచేసుకున్న వసుంధరా రాజేను రాష్ట్ర పార్టీలో పట్టించుకొనే నాథుడే కరువయ్యాడనిపిస్తోంది. ఎందుకంటే ఉప ఎన్నికల కోసం కేంద్ర నాయకత్వం విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ సీఎం వసుంధర రాజేను ఐదవ స్థానానికి నెట్టేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జ్ అరుణ్ సింగ్ మొదటి స్థానంలో ఉండగా, కో–ఇంఛార్జ్ భారతి బెన్ను రెండవ స్థానంలో ఉంచారు. రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియా 3వ స్థానంలో, ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా నాలుగో స్థానంలో నిలిచారు. ముగ్గురు కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెఖావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కైలాష్ చౌదరిలతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ను స్టార్ క్యాంపెయినర్ల జాబితా చేర్చారు. మొత్తం 30 మంది నాయకుల జాబితాలో వసుంధర మద్దతుదారుల్లో కేవలం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి పేరు చేర్చారు. కానీ వసుంధరా రాజేను తీవ్రంగా వ్యతిరేకించే ప్రత్యర్థులను పలువురిని క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు. వీరిలో పార్టీ జాతీయ కార్యదర్శి అల్కా గుర్జర్, రాజ్యసభ సభ్యుడు కిరోడి లాల్ మీనా, ఎమ్మెల్యే రాజేంద్ర రాథోడ్, మదన్ దిలావర్, జోగేశ్వర్ గార్గ్‌లు ఉన్నారు. ప్రచారానికి నో ఛాన్స్ మంగళవారం మూడు స్థానాలకు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తరువాత వసుంధరా రాజే ప్రత్యర్థుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి హాజరుకాలేదు. అయితే ఆ సమావేశంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ల్లో పార్టీకి సంబంధించిన 10 మంది నాయకుల ఫోటోలు ఉంచినప్పటికీ, వసుంధరా రాజే ఫోటోను చేర్చలేదు. రాష్ట్ర నాయకత్వమే కాకుండా పార్టీ కేంద్ర నాయకత్వం ఆమెపై శీతకన్ను వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రి హోదాలో పలువురు నాయకులను ప్రచారం కోసం పంపించినప్పటికీ రాజేను కావాలనే పక్కనపెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాల నుంచి దాదాపు దూరం పెడుతూ వస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కీలక నేతగా ఉన్న వసుంధరా రాజే రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించే ఏ ఒక్క నిర్ణయాన్ని, చర్యను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.సతీష్ పూనియా, ఆయన మద్దతుదారులు వదులుకోవట్లేదు. -
రాజస్తాన్ కమలంలో వర్గపోరు !
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ కమలదళంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్ర పార్టీ నిర్ణయాలను పెడచెవిన పెడుతూ కీలక నిర్ణయాల్లోనూ తమ అభిప్రాయాలను తీసుకోవట్లేదంటూ వసుంధరా రాజే వర్గ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. నాయకుల మధ్య ఉన్న వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా రంగంలోకి దిగారు. రాష్ట్ర నాయకుల మధ్య పెరుగుతున్న వర్గపోరు, అసమ్మతితో పాటు విబేధాలను తగ్గించేందుకు నడ్డా రాజస్థాన్‌లో పర్యటించారు. రాష్ట్రంలోని నాయకులు తమ మధ్య ఉన్న విభేదాలను మరచి ఐక్యంగా ఉండాలని నడ్డా ఇచ్చిన సందేశం కాస్తా గాలికి కొట్టుకుపోయినట్లు కనిపిస్తోంది. నడ్డా పర్యటన ప్రభావం రాష్ట్ర నాయకుల మధ్య కనిపించకపోగా, వర్గపోరు మరింత పెరిగేందుకు కారణంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శిబిరాలుగా విడిపోతూ... అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే వర్గం ఒకవైపు, ఆమె ప్రత్యర్థి, బీజేపీ రాజస్తాన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియా, ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా, ఉప నాయకుడు రాజేంద్ర రాథోడ్ శిబిరాలుగా విడిపోయినట్లు కనిపించింది. శాసనసభలో పార్టీ విప్‌ను నియమించాలని వసుంధర రాజే చేసిన విజ్ఞప్తిని పునియా, కటారియా, రాథోడ్ పట్టించుకున్న దాఖలాలు లేవు. గత రెండున్నరేళ్ళుగా ఖాళీగా ఉన్న విప్ పదవిని భర్తీ చేయాలని రాజే కోరుతున్నారు. అయితే పార్టీలోని అంతర్గత కుమ్ములాటల కారణంగా పునియా, కటారియా అందుకు సిద్ధంగా లేరు. రాష్ట్ర నాయకులు అందరూ కలిసి పనిచేయాలని జేపీ నడ్డా ఇచ్చిన సందేశాన్ని ఖాతరు చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా దేవ్ దర్శన్ యాత్రకు వసుంధరా రాజే శిబిరం సిద్ధమైంది. నడ్డా పర్యటన ముగిసిన తర్వాత వసుంధర యాత్రకు దూరంగా ఉండా లని పునియా, రాథోడ్, కటారియాలు తమ వర్గ అనుచరులకు ఆదేశాలు ఇవ్వడం ప్రారంభించారు. వసుంధర యాత్రకు దూరంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా స్థాయి కార్యాలయాలకు ఇప్పటికే సమాచారాన్ని అందించారని పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నాయకులు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పైకి ఎత్తినప్పటికీ, వారి మధ్య ఉన్న దూరం ఏమాత్రం తగ్గలేదని స్పష్టమైంది. రెండున్నరేళ్ళ క్రితం సీఎం పేరు ప్రకటన విషయంలో అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లను దగ్గరికి చేస్తూ రాహుల్ గాంధీ బలవంతంగా కలిపే ప్రయత్నం చేశారు కానీ ఆ వివాదం ఇంకా అలానే కొనసాగుతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ రాజస్తాన్‌లో నాయకుల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు ప్రభావం త్వరలో జరగబోయే 4 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలపై పడకూడదనే ఆయన జైపూర్ వెళ్లాల్సి వచ్చింది. కానీ నడ్డా పర్యటన అనంతరం పరిస్థితులు సానుకూల దిశలో పయనిస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. గతంలో పార్టీకి సంబంధించి జరిగిన అనేక కీలక సమావేశాలకు వసుంధరా రాజే డుమ్మా కొట్టారు. ఇటీవల జరిగిన శాసనసభా పక్ష సమావేశానికి ఆమె మాత్రమే కాకుండా రాజే వర్గంలోని ఎమ్మెల్యేలు చాలామంది హాజరుకాలేదు. వసుంధర రాజేకు మద్దతు ఇస్తున్న సుమారు 15మందికి పైగా ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వంపై ఫిర్యాదు చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు లేఖ పంపారు. పార్టీ నాయకత్వం తమకు అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదని, తమ నియోజకవర్గాల్లో సమస్యలను లేవనెత్తేందుకు అవకాశం ఇవ్వట్లేదని ఆరోపించారు. వాస్తవానికి, రెండేళ్ల క్రితం బీజేపీ అధికారం నుంచి వైదొలిగినప్పటినుంచి వసుంధర రాజే, ఆమె అనుచర బృందం రాష్ట్ర నాయకత్వ నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాల్లోనూ వారి అభిప్రాయాన్ని తీసుకోవట్లేదు. కమలదళం పెద్దలతో వసుంధరా రాజేకు మధ్య సత్సంబంధాలు లేని కారణంగా ఇటీవల ఏర్పాటైన రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో ఆమె వర్గానికి ప్రాధాన్యత దక్కలేదు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, డివిజనల్ స్థాయి వరకు జరిగిన పార్టీ నియామకాల్లో రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా.. వసుంధర ప్రత్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నా మినహా రాజే సన్నిహితులు అనేకమందిని పక్కనబెట్టి 14 మందికి మాత్రమే అవకాశం కల్పించడాన్ని సింధియా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్రంలో పార్టీకి సమాంతరంగా రాజే మద్దతుదారులు పనిచేస్తున్నారని, దీని కారణంగా ప్రజల్లో పార్టీపై భరోసా కోల్పోతామంటూ షెకావాత్, కటారియా, రాథోడ్, పునియా ఇటీవల అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సింధియా వర్గీయులు తమ దూకుడును తగ్గించుకోవట్లేదు. దీంతో రాజస్తాన్‌లో కమలం వికసిస్తుందనే భావనలో ఉన్న పార్టీ అధిష్టానానికి వర్గపోరు తలనొప్పి వ్యవహారంలా మారింది. చదవండి: బెంగాల్లో ‘దీదీ’నే: టైమ్స్ నౌ– సీ ఓటర్ సర్వే తమిళనాట కొలిక్కివస్తున్న పొత్తులు -
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు..
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీలో అంతర్గత రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు సందర్భోచితంగా బహిర్గతమవుతుంటాయి. పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీ వంటి మహిళానేతను ధీటుగా ఎదుర్కొని దేశవ్యాప్తంగా తమ సత్తా చాటుకోవాలని ఉవ్విళూరుతున్న కమలదళ పెద్దలకు, సొంత పార్టీలోని ఇతర రాష్ట్రాల మహిళానేతల ప్రణాళికలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత అధిష్టాన నిర్ణయాలతో రాజస్తాన్ రాజకీయాల్లో నిశ్శబ్దంగా ఉన్న వసుంధరా రాజే మరోసారి యాక్టివ్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నారు. రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ గడువు ఉన్నప్పటికీ పార్టీలో మరోసారి తన పట్టును పెంచుకొనేందుకు, తన బలాన్ని హైకమాండ్ ముందు నిరూపించుకొనేందుకు వసుంధరారాజే ఏ అవకాశాన్ని వదులుకొనేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. అందులో భాగంగానే మార్చి 8న తన పుట్టినరోజున రాష్ట్రవ్యాప్తంగా దేవ్ దర్శన్ యాత్రను ప్రారంభించి తమ బలాన్ని నిరూపించుకోవాలని వసుంధరా రాజే సింధియా వర్గం నిర్ణయించింది. దీంతో రాబోయే రోజుల్లో రాజస్తాన్ బీజేపీలో పైచేయి సాధించే గొడవ తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మౌన ముద్రలో వసుంధర.. ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వైఫల్యానికి మాజీ సీఎం వసుంధరారాజేపై విధేయత కారణంగా జిల్లాల్లో పార్టీకి సమాంతరంగా పార్టీ యూనిట్లు పనిచేయడమే కారణమని పలువురు బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు జరిగిన 90 మున్సిపల్‌ల్లో బీజేపీ 38 గెలుచుకోగా, అధికార కాంగ్రెస్ పార్టీ 50 గెలుచుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వసుంధరా రాజేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆమె వర్గం నాయకులు అధిష్టాన పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. 2019లో కమలదళం అధిష్టానం వసుంధరా రాజే అనుయాయులను పక్కనబెట్టి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సతీష్ పూనియాను నియమించడంతో పాటు, రాష్ట్ర నాయకులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘవాల్, కైలాష్ చౌదరి వంటి వారికి కేంద్ర ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత కల్పించినప్పటి నుంచి ఆమె మౌనముద్రలో ఉన్నారు. గతేడాది జూలైలో సీఎం గహ్లోత్‌కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభ సమయంలోనూ ఆమె మౌనంగా ఉన్న కారణంగా కమలదళం ఆ సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంతో పూర్తిగా విఫలమైంది. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాజే మద్దతుదారులు ఇప్పుడు ఆమె మళ్ళీ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవడంలో ముందుండాలని కోరుకుంటున్నారు. గత ఆదివారం వసుంధరా రాజేకు గట్టి పట్టున్న కోటాలో జరిగిన ఒక అంతర్గత సమావేశానికి సింధియా వర్గ బీజేపీ ఎమ్మెల్యేలు హాజరై, 2023 ఎన్నికల్లో ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించేలా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అధికార గహ్లోత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పార్టీని పునరుద్ధరించే సామర్థ్యం, ఛరిష్మా ఉన్న లీడర్ కేవలం వసుంధరా రాజే అని ఆమె వర్గ ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. ఏప్రిల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ర్యాలీని నిర్వహించాలని, ఆ ర్యాలీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజే మౌనంగా ఉన్న కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగిందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 8న ప్రారంభమయ్యే గోవర్ధన్ యాత్ర కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే యూనుస్ ఖాన్ సమన్వయం చేస్తారని రాజే వర్గం తెలిపింది. రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో దక్కని ప్రాధాన్యత.. సతీష్ పునియాను రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం నియమించిన తర్వాత పార్టీలో అంతర్గత సమస్యలు బహిర్గతం అవుతున్నాయి. రాజే మనస్తత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు అధికార పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం ఇష్టపడదని, అధిష్టాన పెద్దలతో సఖ్యత లోపించినకారణంగా అంతర్గతంగా పరిస్థితులు సర్దుకోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీలోని అంతర్గత సమస్యల కారణంగా రాజేను అధిష్టానం పక్కనబెట్టినప్పటికీ, రాష్ట్రంలో గహ్లోత్‌ను ఎదుర్కోగలిగి, ఓడించగలిగే బలమైన నాయకులు ఎవరూలేరనే అంశాన్ని అధిష్టానం అంగీకరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. కమలదళం పెద్దలతో వసుంధరా రాజేకు మధ్య ఏమాత్రం సత్సంబంధాలు లేని కారణంగా ఇటీవల ఏర్పాటైన రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో ఆమె వర్గానికి ఏమాత్రం ప్రాధాన్యత దక్కలేదు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి సహా రాజే సన్నిహితులు అనేకమందిని పక్కనబెట్టి కేవలం 14మందికి మాత్రమే అవకాశం కల్పించడాన్ని సింధియా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అయితే 2012, 2018ల్లో జరిగిన పరిణామాల సమయంలో అధిష్టానంపై పైచేయి సాధించిన పరిస్థితులు ప్రస్తుతం లేవన్న విషయాన్ని వసుంధరా రాజే అర్థంచేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మద్య నిషేధాన్ని కోరుతూ ప్రచార యాత్ర మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సొంత పార్టీ ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకొని పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి రంగంలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి మద్యపాన నిషేధం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె మార్చి 8న ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో కమలదళ పెద్దలకు మరో తలనొప్పి ఎదురుకానుంది. ఇప్పటికే మద్యపాన నిషేధం విషయంలో నిర్ణయం తీసుకోకపోవటంపై సొంత పార్టీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై ఆమె ఆరోపణలు చేశారు. మరోవైపు గత నెల 21న పార్టీ పాలిత అన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమాభారతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లో జరిగిన విపత్తు నేపథ్యంలో కేంద్రప్రభుత్వ విధానాలపై నేరుగా దాడి చేశారు. మోదీ ప్రభుత్వ మొదటి పదవీకాలంలో జల వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ మంత్రిగా గంగానది, దాని ప్రధాన ఉపనదులపై విద్యుత్ ప్రాజెక్టులను తాను వ్యతిరేకించారని ఉమాభారతి ఇటీవల వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ హైకమాండ్‌కు సవాలు విసురుతూ ఆమె రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధ అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, పార్టీ అధిష్టానం తనను పక్కనపెట్టేయడాన్ని ఉమాభారతి జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
వసుంధరా రాజెపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణలు
జైపూర్ : అశోక్ గహ్లోత్ సారథ్యంలోని పాలక కాంగ్రెస్ సర్కార్‌పై ఆ పార్టీ నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్తాన్‌లో నెలకొన్న రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఎమ్మెల్యేల బేరసారాల వెనుక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధరా రాజె పాత్ర ఉందని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. బీజేపీ నేత సంజయ్ జైన్ ఎనిమిది నెలల కిందట తనను కలిసి వసుంధర రాజెతో పాటు ఇతరులను సంప్రదించాల్సిందిగా కోరాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గుడా పేర్కొన్నారు. జైన్‌తో పాటు మరికొందరు మధ్యవర్తులు కూడా గహ్లోత్ సర్కార్‌ను కూల్చేందుకు ప్రయత్నించారని, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. సంజయ్ జైన్ చాలాకాలంగా ఇదే పనిలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై సంజయ్ జైన్‌ను రాజస్తాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు అరెస్ట్ చేశారు. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు వసుంధర రాజే సాయపడుతున్నారని బీజేపీ మిత్రపక్షం నుంచి ఆరోపణలు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, వసుంధర రాజే తనకు సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉంటూ గహ్లోత్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారని రాష్ర్టీయ లోక్తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బెనివల్ ట్వీట్ చేశారు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు దూరంగా ఉండాలని సికర్, నగౌర్లకు చెందిన జాట్ ఎమ్మెల్యేలందరికీ వసుంధరా రాజే సూచిస్తున్నారని, ఇందుకు తన వద్ద ఆధారాలున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కాగా రాజస్తాన్‌లో పాలక కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షోభంలోకి బీజేపీ నేతలను ఎందుకు లాగుతున్నారని ఈ విమర్శలపై వసుంధర రాజే మండిపడ్డారు. ఇక తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సహా ఆయన వర్గానికి చెందిన 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు రాజస్ధాన్ అసెంబ్లీ స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై పైలట్ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. మరోవైపు పైలట్‌ను తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు కాంగ్రెస్ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. చదవండి : పైలట్‌తో 18 నెలలుగా మాటల్లేవ్.. -
నేను బీజేపీతోనే..
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ పరిణామాలపై కొందరు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని బీజేపీ నేత, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వ్యాఖ్యానించారు. తాను బీజేపీలోనే కొనసాగుతాననీ, పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తానని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, తిరుగుబాటు వర్గం నేత, మాజీ డిప్యూటీ సీఎం పైలట్ మధ్య విభేదాలతో తలెత్తిన సంక్షోభంలో గహ్లోత్‌కు వసుంధరా రాజే అంతర్గతంగా మద్దతిస్తున్నారంటూ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ నేత, ఎంపీ హనుమాన్ బెణివాల్ శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలతో గహ్లోత్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. బీజేపీ నేతలు, అధిష్టానంపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందన్నారు. రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ నేతల ఫోన్లను చట్ట విరుద్ధంగా ట్యాప్ చేయిస్తే సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని గహ్లోత్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితర బీజేపీ నేతల హస్తం ఉందంటూ కాంగ్రెస్ ఆడియో టేపులు విడుదల చేయడంపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర శనివారం స్పందించారు. ‘ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని, గహ్లోత్‌ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయా? ఒక వేళ జరిగితే, నిర్దేశిత నిబంధనల మేరకే చేశారా? తమ గుట్టు బయటపడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిందా?’అని ప్రశ్నించారు. బీజేపీ తప్పు చేసినట్లే: కాంగ్రెస్ ఆడియో టేపుల వ్యవహారంలో బీజేపీ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అలాగైతే, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై సచిన్ పైలట్ తదితరుల తిరుగుబాటు వెనుక తమ ప్రమేయం ఉన్నట్లు బీజేపీ ఒప్పుకున్నట్లే అవుతుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. బీజేపీ నేతల ప్రమేయమే లేకుంటే హరియాణాలోని ఓ రిసార్టులో ఉన్న కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను ప్రశ్నించడానికి వెళ్లిన రాజస్తాన్ పోలీసులను ఎందుకు అనుమతించలేదని రాజస్తాన్ పీసీసీ నూతన అధ్యక్షుడు గోవింద్ సింగ్ ప్రశ్నించారు. గహ్లోత్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పన్నిన కుట్రకు సంబంధించినవిగా చెబుతున్న రెండు ఆడియో క్లిప్పులపై చీఫ్ విప్ మహేశ్ జోషి ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో(ఏసీబీ) కేసు నమోదు చేసింది. -
వసుంధర రాజేపై సంచలన ఆరోపణలు
జైపూర్: రాజస్తాన్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎల్పీకి హాజరుకాని తమపై అనర్హతను వేటువేస్తామంటూ స్పీకర్ జారీచేసిన నోటీసులపై సచిన్ పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే.. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై బీజేపీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్తాంత్రిక్(ఆర్ఎల్టీ) పార్టీ విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ను ఈ గండం నుంచి గట్టెక్కించడానికి వసుంధర రాజే ప్రయత్నిస్తున్నారని ఆర్ఎల్టీ ఎంపీ హనుమాన్ బేనీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు వర్గాన్ని దెబ్బతీయడానికి వసుంధర రాజే ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.(సంతోషంగా ఉంది: వసుంధరా రాజే) ఈ సందర్భంగా హనుమాన్ బేనీవాల్ ‘వసుంధర రాజే తనకు సన్నిహితులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పిలిచి వారితో మాట్లాడుతున్నారు. అశోక్ గహ్లోత్‌కు మద్దతు ఇవ్వాలని ఆమె ఎమ్మెల్యేలను కోరుతున్నారు. సచిన్ పైలట్‌కు దూరంగా ఉండాలని సికార్, నాగౌర్‌లోని ప్రతి ఒక్క జాట్ ఎమ్మెల్యేకు చెప్పారు. ఇందుకు ఆధారాలున్నాయి’ అని హనుమాన్ బేనీవాల్ ట్వీట్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘గహ్లోత్‌కు వసుంధర రాజే సహకరిస్తున్నట్టు ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి మేము సహకరించము’ అని అన్నారు. అయితే, వసుంధర రాజేపై హనుమాన్ విమర్శలు గుప్పించడం ఇదే తొలిసారి కాదు. తొలుత బీజేపీలో ఉన్న ఆయన 2018 ఎన్నికల ముందు ఆ పార్టీని వీడారు. (హైకోర్టుకు సచిన్ వర్గం) హనుమాన్ బేనీవాల్ విమర్శలపై రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా స్పందిస్తూ.. వసుంధర రాజేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. ఆమెతో అధిష్ఠానం మాట్లాడుతుందని, ఆమె తమ గౌరవ నేతని అన్నారు. ఇదిలా ఉండగా.. రాజస్తాన్ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభంపై వసుంధర రాజే ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మధ్యప్రదేశ్ తరహాలో సచిన్ పైలట్ తిరుగుబాటుకు బీజేపీ మద్దతు ఇస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో వసుంధర రాజే మౌనంగా ఉన్నారు. ఇది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని బీజేపీ కూడా ఆచితూచి స్పందిస్తోంది. (పైలట్ మనవాడైతే విమానం హైజాక్ ఎందుకు?) -
సంతోషంగా ఉంది: వసుంధరా రాజే
జైపూర్: తన, తన కుమారుడికి సంబంధించిన కరోనా వైరస్ పరీక్షల ఫలితాల్లో నెగటివ్ అని తేలిందని రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే హర్షం వ్యక్తం చేశారు. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో జరిగిన ఓ పార్టీలో వసుంధరా రాజే, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన కనికాకు కరోనా సోకినట్లు వెల్లడికాడంతో వీరిద్దరి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అంతేగాకుండా దుష్యంత్ సింగ్ వివిధ రాజకీయ నాయకులు, ఎంపీలను కలిసిన క్రమంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కనికా హాజరైన పార్టీకి వెళ్లిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.(ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కనిక!) ఈ క్రమంలో వసుంధరా రాజే, దుష్యంత్ సింగ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ‘‘ కోవిడ్-19 పరీక్ష నిర్వహించిన తర్వాత.. నెగటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. అయితే ఫలితాలు నెగటివ్‌గా వచ్చినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా మేం మరో 15 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటాం’’అని వసుంధరా రాజే ట్వీట్ చేశారు. అదే విధంగా తన కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక వైద్యుల సూచన మేరకు తాము నిర్బంధంలో ఉంటామంటూ దుష్యంత్ సింగ్ కూడా ట్విటర్లో పేర్కొన్నారు. కాగా వీరితో పాటు పార్టీకి వెళ్లిన ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రికి కూడా కరోనా నెగటివ్‌గా తేలడంతో అధికార వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా కనికా కపూర్‌పై యూపీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (మాస్కు ధర రూ. 8, శానిటైజర్ ధర రూ.100) After conducting a #Covid19 test, I’m happy to inform you that the results came back negative. However, as a preventive measure, my son and I will continue to be in isolation for 15 days. — Vasundhara Raje (@VasundharaBJP) March 21, 2020 -
కనికా కపూర్‌కు కరోనా
బాలీవుడ్ ప్రముఖ గాయని కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఏకంగా ఎంపీలు సెల్ఫ్ క్వారంటైన్ విధించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. వివరాల్లోకి వెళితే గాయని కనికా కపూర్ ఇటీవల లక్నోలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్‌లు పాల్గొన్నారు. ఇప్పుడు కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వసుంధర రాజే, దుష్యంత్ సింగ్‌లు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. రాజస్తాన్ నుంచి ఎంపీగా ఉన్న దుష్యంత్ పార్లమెంటులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్, ఎంపీ అనుప్రియా పటేల్‌లతో సన్నిహితంగా మెలిగారు. దీంతో వారివురు కూడా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేగాక మార్చి 18న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన ఉపాహార విందుకు పలువురు ఎంపీలతోపాటు దుష్యంత్ కూడా హాజరయ్యారని, బుధవారం రవాణా, సాంస్కృతిక శాఖలు నిర్వహించిన సమావేశంలోనూ దుష్యంత్ 20 మంది ఎంపీలతో కలిసి ఉన్నారని డెరెక్ వివరించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని ఆయన కోరారు. -
హోమ్ క్వారంటైన్లోకి వసుంధరా రాజే కుటుంబం
-
మేనల్లుడిని స్వాగతించిన మేనత్త
జైపూర్ : కేంద్రమాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంపై రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే స్పందించారు. సింధియా బీజేపీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన స్వభావం, బలం, ధైర్యాన్ని తాను ఎప్పటికీ గౌరవిస్తానని రాజే తెలిపారు. కాగా జ్యోతిరాదిత్య సింధియాకు వసుంధర స్వయానా మేనత్త అన్న విషయం తెలిసిందే. బుధవారం జేడీ నడ్డా సమక్షంలో సింధియా బీజేపీలో చేరిన అనంతరం ఆమె ట్విటర్ వేదికగా స్పందించారు. ‘మా అమ్మ (రాజమాత విజయ రాజే సింధియా) ఆరోజు ఉండి ఉంటే ఈ ఆనందక్షణాలను చూసి ఎంతో గర్వించేంది’ అని వ్యాఖ్యానించారు. చివరికి ఇద్దరం ఒకే పార్టీలో ఉండటం ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. మరో మేనత్త, మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే యశోధర రాజే సైతం సింధియా చేరికపై సంతోషం వ్యక్తం చేశారు. మహారాజ్‌కు స్వాగతం అంటూ తన నిర్ణయాన్ని స్వాగతించారు. -
రాగా తంత్రమా ? నమో మంత్రమా ?
రాజస్తాన్‌లో ప్రధాని మోదీ గాలి వీస్తోందా ? 2014 ఎన్నికల మాదిరిగా ప్రభంజనం సృష్టించకపోయినా భారీగానే సీట్లు కొల్లగొడతారా ? గత అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధరా రాజెపై వ్యతిరేకతతో రాణిగారి కోటను కూలగొట్టిన ఓటర్లు ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలనేసరికి మళ్లీ నమో మంత్రమే జపిస్తారా ? పాక్‌కు సరిహద్దు రాష్ట్రంలో దేశభక్తే ఉప్పొంగుతుందా ? స్థానిక సమస్యలనే ఎన్నికల అస్త్రంగా మలచుకున్న కాంగ్రెస్ తంత్రం నెగ్గుతుందా ? మొత్తం 25 స్థానాలకు గాను 13 సీట్లలో నాలుగోదశలో పోలింగ్ జరిగింది. మిగిలిన పన్నెండు సీట్లలో మే 6న పోలింగ్ జరగబోతోంది. ఈ దశలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో పరిస్థితులేంటి ? రాజస్తాన్ ప్రజల మొగ్గు ఎటు ? ఓట్లు, సీట్లు లెక్కలు ఏం చెబుతున్నాయ్ ? 2014 ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో బీజేపీ 25కి 25 సీట్లు క్లీన్ స్వీప్ చేసింది. ఓట్లు కూడా ఇంచుమించుగా 56 శాతం వచ్చాయి. కానీ అయిదేళ్లలో పరిస్థితుల్లో భారీగా మార్పులు వచ్చాయి. ప్రధానంగా వసుంధరా రాజెపై వ్యతిరేకత, కొన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చి భారీగా ఓట్లను చీల్చడం, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీతో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. 38.8శాతం మాత్రమే ఓట్లతో 73 స్థానాలను దక్కించుకుంది. అలాగని కాంగ్రెస్ పార్టీ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. రాజేపై నెలకొన్న వ్యతిరేకతకి భారీగా సీట్లు, ఓట్లు కొల్లగొట్టాలి. కానీ 39.3 శాతం ఓట్లతో 100 స్థానాల్లో మాత్రమే గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్లలో తేడా కేవలం 0.5శాతం మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చి ఓట్లను భారీగా చీల్చాయి. కొత్త పార్టీలే 9 శాతం ఓటు షేర్‌తో 12 స్థానాల్లో గెలుపొందాయి. బీజేపీకి గుడ్‌బై కొట్టేసి కొత్త పార్టీ పెట్టిన రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) హనుమాన్ బేనీవాల్ 2.4శాతం ఓట్లతో మూడు అసెంబ్లీ స్థానాలను సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్‌సభ ఎన్నికలు వేరు అన్న చైతన్యం ఈ మధ్య ఓటర్లలో బాగా పెరుగుతోంది. అదే ఈ సారి బీజేపీకి కలిసి వస్తుందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయత వర్సస్ స్థానికత పాకిస్థాన్‌కు సరిహద్దు రాష్ట్రం కావడంతో రాజస్తాన్‌లో బీజేపీ ప్రధానంగా సర్జికల్ స్ట్రయిక్స్, దేశభక్తినే ప్రచార అస్త్రాలుగా మార్చుకుంది. జై జవాన్, జైకిసాన్, జై విజ్ఞాన్ అన్న నినాదంతో ప్రచారం చేస్తోంది. ఈ రాష్ట్రం నుంచి యువకులు ఎక్కువగా సైన్యంలో చేరుతూ ఉండడంతో పుల్వామా దాడులు, అభినందన్‌ని వెనక్కి తీసుకురావడం వంటి అంశాలతో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ అమలు సరిగా జరగకపోవడం కూడా బీజేపీకి కలిసివస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్థానిక సమస్యలపై దృష్టి పెడుతూ ప్రచారం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించారు. సీఎం పదవికి పోటీ ఉండడంతో కలిసికట్టుగా పనిచెయ్యలేదు. కానీ ఈ సారి ఉమ్మడిగా వ్యూహాలు రచించారు. కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ పథకం (న్యాయ్) సరిగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమైనప్పటికీ, గ్రామీణ సంక్షోభం, రైతు సమస్యలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అల్వార్, అజ్మీర్ పరిస్థితులు మారుతున్నాయా ? రాజస్తాన్ లోక్‌సభ ఎన్నికల్లో ఈ సారి అందరి దృష్టి అల్వార్, అజ్మీర్ నియోజకవర్గాలపైనే ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ ఆ తర్వాత తన హవాను నిలబెట్టుకోలేక 2018 జనవరిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను కోల్పోయింది. ఎవరికీ అందుబాటులో ఉండకుండా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న నాటి బీజేపీ సీఎం వసుంధర రాజె వ్యవహారశైలిపై నెలకొన్న అసంతృప్తి సెగలు ఉప ఎన్నికల్లోనే తగిలాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అల్వార్, అజ్మీర్‌ల నుంచి బీజేపీ తరఫున నెగ్గిన చాంద్‌నాథ్, సన్వర్‌లాల్ జాట్ మృతి చెందడంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన రఘుశర్మ అజ్మీర్ నుంచి 84 వేల ఓట్ల తేడాతో, కరణ్ సింగ్ యాదవ్ అల్వార్ నుంచి ఇంచుమించుగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఈ సారి ఈ స్థానాల్లో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారుతున్నాయని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హవా పనిచేస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థుల్ని మార్చేసిన కాంగ్రెస్ అల్వార్, అజ్మీర్ ఈ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో నెగ్గిన అభ్యర్థుల్ని మార్చేసింది. అజ్మీర్‌లో రఘుశర్మని తప్పించిన కాంగ్రెస్ పార్టీ కొత్త ముఖమైన రిజు ఝున్‌ఝున్‌వాలాకు టికెట్ ఇచ్చింది. ఆయన స్థానికుడు కాకపోవడంతో కొంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, 2014 ఎన్నికల్లో సన్వర్‌లాల్ చేతిలో ఓటమిపాలైన సచిన్‌పైలట్ మద్దతు కలిగిన ఝన్‌ఝన్‌వాలా పైలట్‌కున్న పాపులారిటీనే నమ్ముకున్నారు. ఇక బీజేపీ తరపున స్థానిక వ్యాపారవేత్త, కశింగఢ్ ఎమ్మెల్యే భగీరథ్ చౌ«ధరీ పోటీ చేస్తున్నారు. లోకల్ అభ్యర్థి కావడం ఆయనకు కలిసివస్తోంది. ఇక అల్వార్ మూకదాడులతో దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కిన ప్రాంతం. హరియాణాకు చెందిన పాలవ్యాపారి పెహ్లూఖాన్‌ను హిందూ మతోన్మాదులు కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నియోజకవర్గంలో యాదవుల ఓట్లే కీలకం. ఆ తర్వాత మియో ముస్లింలు కూడా గణనీయ సంఖ్యలోనే ఉన్నారు. గోసంరక్షణ పేరిట జరిగిన మూక దాడుల ప్రభావం ఉప ఎన్నికల్లో బీజేపీపై పడింది. అయినప్పటికీ ఈ సారి కూడా మతపరమైన విభజననే ఆ పార్టీ నమ్ముకుంది. గత ఎన్నికల్లో నెగ్గి మృతిచెందిన చాంద్‌నాథ్ శిష్యుడు, బాబా బాలక్‌నాథ్‌ను బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున భన్వర్ జితేంద్ర సింగ్ ఆయనకి గట్టిపోటీయే ఇస్తున్నారు. బీఎస్పీ ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఇమ్రాన్‌ఖాన్‌కు టికెట్ ఇవ్వడంతో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి బీజేపీకి లాభం చేకూరే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దౌసా లోక్‌సభ ఎంపీ హరీశ్ మీనా బీజేపీకి గుడ్ బై కొట్టేసి కాంగ్రెస్ శిబిరానికి చేరుకోవడం కమలనాథులకి ఎదురు దెబ్బే. పింక్ సిటీ జైపూర్‌లో ఒక మహిళా అభ్యర్థికి 48 ఏళ్ల తర్వాత పోటీ చేసే అవకాశం రావడం ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకత. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామ్‌చరణ్ బొహ్రా ఏకంగా 5.40 లక్షల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ నేత మహేశ్ జోషిని మట్టికరిపించారు. క్లీన్ ఇమేజ్ కలిగిన బొహ్రాకు కార్యకర్తల్లో కూడా మంచి ఆదరణ ఉంది. . పార్లమెంటు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. 110 చర్చల్లో పాల్గొన్ని 312 ప్రశ్నలు వేశారు.అయితే నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదన్న విమర్శలూ ఉన్నాయి. అలాంటి గట్టి అభ్యర్థిని ఢీకొనడానికి ఏరికోరి ఒక మహిళకు సీటు ఇవ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ నగర మాజీ మేయర్ జ్యోతి ఖండేల్వాల్ను బరిలో దింపింది. దీంతో ఇక్కడ హోరాహోరి పోరు నెలకొంది. చివరిసారిగా1971లోజైపూర్ మాజీ మహారాణి గాయత్రిదేవి స్వతంత్రపార్టీ తరఫున ఎన్నికయ్యారు. బ్రాహ్మణులు, రాజపుత్రుల ఓట్లే ఇక్కడ కీలకం.రాజస్థాన్‌లోని జైపూర్ (రూరల్) నియోజకవర్గంలో ఇద్దరు క్రీడాకారుల మధ్య పోరాటానికి తెరలేచింది. బీజేపీ ఎంపీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ గురితప్పని షూటర్. 2014లో మోదీ హవాతో రాథోడ్ జయపూర్ రూరల్ నుంచి సులభంగా నెగ్గారు. ఆ వెంటనే మంత్రి పదవి వరించింది. కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ పూనియా డిస్కస్ త్రోలో అంతర్జాతీయంగా భారత కీర్తిపతాకను రెపపలాడించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయిదేళ్లలో సీన్ మారిపోయింది. వసుంధర రాజెకి వ్యతిరేక పవవాలు వీయడంతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పూనియా సదూల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారు. ఇప్పటికే కేంద్ర క్రీడా మంత్రిగా రాథోడ్ మంచిపేరే సంపాదించుకున్నారు. ఆయనపై పోటీకి నిలబడడమే ఒక సాహసం. అలాంటి సాహసాన్ని ఒక క్రీడాకారిణి చేయడంతో కృష్ణ పూనియాపై కూడా అంచనాలు పెరిగాయి. బీజేపీ, ఆరెస్సెస్ అండదండలు, మోదీ ఇమేజ్ రాథోడ్‌కు కలిసి వస్తే, జాట్ సామాజిక వర్గానికి చెందిన పూనియాకు కులసమీకరణలు అనుకూలం. రాథోడ్‌ని ఎదుర్కోవడానికి చేతికి గ్లౌజులు ధరించి సిద్ధంగా ఉన్నానంటూ పంచ్ డైలాగ్‌లతో పూనియా ప్రచారంలో ఆకట్టుకుంటున్నారు. ‘‘నేను రైతు బిడ్డని. నాకు గ్రామీణుల పడే బాధలేంటో తెలుసు. క్రీడల్లో కూడా నేను గ్రామీణ ప్రాంతాల్లో యువత ఆడే డిస్కస్ త్రోనే ఎంచుకున్నా. ఏసీ హాళ్లలో కూర్చొని ఆటలాడే గేమ్స్ నాకు తెలీవు‘‘అని రాథోడ్ పైకి మాటల తూటాలు పేల్చారు.. మరోవైపు గత అయిదేళ్లలో నియోజకవర్గానికి తాను ఎంత చేస్తున్నారో చెబుతున్న రాథోఢ్ యువతరం ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. బికనీర్ అన్నదమ్ముల సవాల్ బికనీర్ నియోజకవర్గం (ఎస్సీ రిజర్వ్డ్) బీజేపీకికంచుకోట. గత 15 ఏళ్లుగా ఈ సీటు బీజేపీకే దక్కుతోంది. 2004లో బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ప్రాతినిధ్యం వహించిన స్థానం. ఈ సారి ఒక మాజీ ఐఎఎస్ మాజీ ఐపీఎస్ మధ్య ఉత్కంఠభరిత పోరాటానికి తెరలేచింది. వీళ్లిద్దరూ బంధువులు కూడా కావడం విశేషం. గత రెండు దఫాలుగా బీజేపీకిచెందిన అర్జున్ రామ్ మేఘవాల్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ఐఎఎస్ అధికారి, కేంద్ర మంత్రి అయిన అర్జున్ రామ్‌కు నియోజకవర్గంలో మంచిపేరు ఉంది. చేనేత కుటుంబానికి చెందిన ఆయన కష్టపడిచదువుకొని ఐఎఎస్ అయ్యారు. చురు జిల్లాకు కలెక్టర్‌గా పని చేసిన అర్జున్‌రామ్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా భూ వివాదం కేసు ఆయన పర్యవేక్షణలోనే సాగింది. నీటివనరులు, గంగాప్రక్షాళన శాఖ సహాయ మంత్రిగా ఉన్న అర్జున్‌రామ్ ఇప్పటికీ పార్లమెంటుకి సైకిల్‌పై వచ్చే అతి కొద్ది మంది ఎంపీల్లో ఒకరు. ఈయనపై పోటీకి కాంగ్రెస్ పార్టీ ఆయన పిన్ని కుమారుడు ఐపీఎస్అధికారి అయిన మదన్‌గోపాల్‌ను రంగంలోకి దింపింది. ‘‘అర్జున్‌రామ్ మా పెద్దమ్మ కొడుకు. నా కన్నా పెద్దవాడు. కానీ మా ఇద్దరి భావజాలంలో చాలా తేడాలున్నాయి. నేనుఎన్నికల్లో పోటీపడడం . అయినా దీనిని సవాల్‌గా తీసుకున్నా‘అని మదన్ అంటున్నారు. జాట్లు ఆధిక్యం కలిగినబికనీర్లో ముస్లింలు, రాజపుత్రులు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. మే6న పోలింగ్ జరిగే స్థానాలు(మొత్తం – 12) ►గంగానగర్, బికనీర్, చురు, ఝున్ఝునూ, సీకర్, ►జైపూర్ (రూరల్), జైపూర్, అల్వార్, భరత్పూర్, ►కరౌలీ–ధోల్పూర్, దౌసా, నాగౌర్ ►‘‘ఉప ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశాను. ఎందుకంటే ఆ ఓటు ప్రధానిని ఎన్నుకోవడానికి కాదు. కేవలం వసుంధరా రాజెను ఇంటికి పంపించడానికే. మా లక్ష్యం నెరవేరింది. మోదీపై మాకు ఎప్పుడూ వ్యతిరేకత లేదు’’ – జితేంద్ర చౌదరి, ధర్మపుర గ్రామస్తుడు ►‘‘అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో జరగకపోతే పదకొండో రోజునే సీఎంను మారుస్తానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు. మా రుణాలు మాఫీ కూడా కాలేదు. ఆయన సీఎంనూ మార్చలేదు. ఇక కాంగ్రెస్‌కి మేమెందుకు ఓటు వేయాలి‘‘ – బుద్ధరామ్ జాట్, అల్వార్ రైతు ►‘‘మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని మోదీ చెప్పారు. గుజరాత్ మోడల్ అంటూ ఊదరగొట్టారు. కానీ గత అయిదేళ్లలో మాకు ఒక్క రోజు కూడా పని దొరకలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి’’ – రాహుల్ మీనా, గమ్రీ గ్రామస్తుడు ►‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగాన్నే మార్చాలని చూస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలను మార్చేసి, ఆదివాసీలను అటవీ ప్రాంతాల నుంచి ఖాళీ చేయిస్తారు. సుప్రీం తీర్పుల్ని కూడా ఆయన లెక్కచేసే పరిస్థితి ఉండదు’’ – కన్నయ్యలాల్ భుజ్, ఆదివాసీ యువకుడు -
వసుంధర రాజేకు ఘోర అవమానం...
జైపూర్ : రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజేను దారుణంగా అవమానించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ లీడర్ రామ్‌లాల్ మీన మాజీ సీఎం వసుంధర రాజే ప్రస్తుతం అభివృద్ధి పనులను పక్కన పెట్టి మద్యం బాటిళ్లు ఒపెన్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన మీనా మాట్లాడుతూ.. ‘నూతన ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఆయన చాలా కృషి చేస్తున్నారు. కానీ మాజీ సీఎం రాజే మాత్రం పని పక్కన పెట్టి లిక్కర్ బాటిళ్లు ఒపెన్ చేయడంలో బిజీగా ఉన్నారం’టూ వ్యాఖ్యనించారు. రామ్‌లాల్ మీనా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమరాన్ని రేపుతున్నాయి. -
నువ్వు ఏదో ఒకరోజు సీఎం అవుతావు!
జైపూర్ : రాజస్తాన్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. చరిత్రాత్మక ఆల్బర్ట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజే సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా, వసుంధర రాజేల మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వసుంధర రాజే, జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరూ కూడా రాజవంశీకులన్న విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా సింధియాను పలకరించిన రాజే.. రాజవంశీకుల ఆచారం ప్రకారం ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో... రాజకీయ పరంగా సిద్ధాంత విభేదాలు ఉన్నప్పటికీ రక్తసంబంధీకుల మధ్య ఉన్న ఆప్యాయతల్లో ఎటువంటి తేడా ఉండదు అనేందుకు ఇదొక చక్కని ఉదాహరణ అంటూ వీరి అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు గాసిప్ రాయుళ్లు మాత్రం...’ ఈ వేడుకలో భాగంగా మేనత్త వసుంధర.. తన మేనల్లుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆనందపడుతూనే.. నువ్వు ఏదో ఒకరోజు తప్పకుండా మధ్యప్రదేశ్ సీఎం అవుతావంటూ ఆశీర్వదించి ఉంటారు’ అంటూ కథనాలు అల్లేస్తున్నారు కూడా. కాగా సింధియా కుటుంబం దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మొదట జన్ సంఘ్ నుంచి పోటీ చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు. కాగా అదే కుటుంబానికి చెందిన బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయ రాజే సింధియా, ఆమె కుమార్తెలు వసుంధరా రాజే(రాజస్తాన్ మాజీ సీఎం), యశోదర రాజే(మధ్యప్రదేశ్ ఎంపీ) బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ సింధియాలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు పోటీకి నిలబడలేదు. -
ప్రజా విశ్వాసం పొందని ‘రాణి’
రాజస్తాన్‌లో వసుంధరా రాజే స్వయం కృతాపరాధమే పార్టీ ఓటమికి దారి తీసింది. బీజేపీపై వ్యతిరేకత కంటే కూడా వసుంధరాపై ప్రజల్లో ఉన్న ఆగ్రహమే ఈ పరిస్థితికి దారి తీసింది. వసుంధరా రాజే ఈ ఎన్నికలను తన చుట్టూనే తిప్పుకున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసినా తాను ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా వంటి పథకాలే పార్టీని గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఆ అతి విశ్వాసంతోనే అధిష్టానంతో ఢీ అంటే ఢీ అంటూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారు. టిక్కెట్ల పంపిణీ దగ్గర్నుంచి ప్రచారం వరకూ అంతా తానై వ్యవహరించారు. చివరి నిమిషంలో కుల సమీకరణలపై రాజే ఆశలు పెట్టుకున్నప్పటికీ రాజ్పుట్లు, జాట్లు కలిసిరాలేదు. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకున్న అధిష్టానం 100 మంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు నిరాకరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో వసుంధర రాజే మెజారిటీ సైతం బాగా తగ్గిపోయింది. యూనస్ ఖాన్, రాజ్‌పాల్ సింగ్ షెకావత్, అరుణ్ చతుర్వేది, శ్రీచంద్ క్రిప్లానీ వంటి మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు. సొంత పార్టీ నేతలే కలిసిరాలేదు.. అన్నదాతల ఆక్రోశాన్ని వసుంధరా రాజే సర్కార్ ఎన్నడూ పట్టించుకోలేదు. వారి అసంతృప్తిని చల్లార్చడానికి వీసమెత్తు ప్రయత్నం చేయలేదు. కుల సమీకరణలు అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఈ సారి ఎన్నికలు రాజ్పుత్రులు వెర్సస్ రాజేగా మారిపోయాయి. రాజ్‌పుత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ఆనందపాల్ సింగ్ ఎన్కౌంటర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్‌పుత్ నాయకుడికి అవకాశం దక్కకుండా రాజే అడ్డుకోవడం వంటివి వసుంధరపై ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. రహదారుల వెడల్పు, సుందరీకరణ అంటూ రోడ్డు పక్కనున్న చిన్న గుడుల్ని తొలగించడం, గోరక్షకుల పేరుతో జరిగిన మూకదాడులు కూడా బీజేపీపై వ్యతిరేకతను పెంచాయి. రాజే నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న ఆరెస్సెస్ కూడా ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పనిచేయలేదు. ఆరెస్సెస్ యంత్రాంగం రాజే సర్కార్‌ను గెలిపించడానికి పెద్దగా కృషి చేయలేదు. ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా బీజేపీని ముంచినా, తేల్చినా అందుకు రాజేదే బాధ్యత అన్నట్టుగా వదిలేశారు. మహిళా సీఎం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఆగలేదు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీలను రాజే ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. పైలెట్+ గెహ్లాట్= కాంగ్రెస్ గెలుపు బీజేపీ సర్కారుపై ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించింది. ముఖ్యంగా..అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రుణ మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇచ్చిన హామీ బాగా పనిచేసింది. పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌లు సమన్వయంతో పనిచేయడం కాంగ్రెస్‌కి ప్లస్ పాయింట్ అయింది. సీనియర్ నేత గెహ్లాట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో మంచి అనుబంధం ఉంది. వారిలో ఉత్సాహం నింపి కష్టించి పనిచేసేలా చేయడం లో గెహ్లాట్ సక్సెస్ అయ్యారు. ఇక సచిన్ పైలెట్ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర్రవ్యాప్తంగా బలపం కట్టుకొని తిరిగారు. ఉద్యోగాలు రాక అసహనంతో ఉన్న యువ ఓటర్లను ఆకర్షించేలా సచిన్ వ్యూహరచన చేశారు. వారి సమష్టి కృషి కాంగ్రెస్ విజయానికి కారణమైంది. కాంగ్రెస్‌కు సవాలే రాజస్తాన్‌లో కష్టపడి సాధించుకున్న ఈ విజయం కాంగ్రెస్‌కు ఏమంత ఆశాజనకంగా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించు కోవాలన్న ఆ పార్టీ ఆశలు నెరవేరేది అనుమానంగానే మారింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన రాష్ట్రీయ లోక్తంత్ర పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ వంటివి గణనీయమైన ఓట్లను సంపాదించుకోవడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరమే. టిక్కెట్ల పంపిణీ సరిగా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ రెబెల్స్ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటారు. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారిందని భావిస్తున్నారు. ఇప్పుడైనా సీఎంగా సరైన నేతను ఎంపిక చేయకపోతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయం వినవస్తోంది. -
వసుంధరా రాజె రాజీనామా
జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి వసుంధరా రాజె తన పదవికి రాజీనామా చేశారు. హోరాహారీగా సాగిన పోరులో కాంగ్రెస్ పార్టీ పాలక బీజేపీని మట్టికరిపించింది. కాగా, నూతన ప్రభుత్వం రాజస్ధాన్ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని వసుంధరా రాజె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు సన్నాహాలు చేపట్టింది. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్ర అభ్యర్ధుల సహకారం కూడా తీసుకుంటామని సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ తెలిపారు. రాజస్ధాన్ సీఎం రేసులో అశోక్ గెహ్లాట్‌తో పాటు యువ నేత సచిన్ పైలట్ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారు. -
ఒకడే ఒక్కడు.. అతడే కేసీఆర్
న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమి ఫైనల్స్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. మిజోరాంలో మాత్రం ఎమ్ఎన్ఎఫ్ గెలుపొందింది. మిజోరాం ఓటమితో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఇక తెలంగాణలో మాత్రం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు భారీ షాక్ తగిలింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. దాదాపు 76 స్థానాల్లో గెలుపొంది సిగిల్ మెజారిటీ పార్టీగా నిలిచింది. అయితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, చత్తీసగఢ్ రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఓటమి పాలు కాగా.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ పార్టీనే మరోసారి ప్రభంజనం సృష్టించింది. ఆ వివరాలు.. తెలంగాణ : కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ ప్రభంజనం సృష్టించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ధ్యేయంగా పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ముందస్తుకెళ్లి 2018 ఎన్నికల్లో కూడా ప్రభంజనం సృష్టించారు. కూటమిని కోలుకోలేని విధంగా దెబ్బ తీశారు. ప్రస్తుతానికి 65 స్థానాల్లో గెలుపొంది.. 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది టీఆర్ఎస్. అయితే ఈ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేసీఆర్ తన సమీప ప్రత్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మీద 51,546 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మధ్యప్రదేశ్ : శివరాజ్ సింగ్ చౌహన్ ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ - కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోటీ కొనసాగుతుంది. రెండు పార్టీలు దాదాపు 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్‌లో 116 స్థానాల్లో గెలుపొందిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సీహోర్ జిల్లా బుధ్ని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2005 నుంచి శివరాజ్ సింగ్ ఈ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి అరుణ్ యాదవ్, శివరాజ్ సింగ్‌పై పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అరుణ యాదవ్ చాలా దూకుడగా వ్యవహరించారు. ముఖ్యంగా విదిశలో జరిగిన ఇసుక మాఫీయా గురించి ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. అరుణ్ యాదవ్ ఎంత ధీటుగా ప్రచారం నిర్వహించినప్పటికి.. శివరాజ్ సింగ్ చౌహనే ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. రాజస్తాన్ : వసుంధర రాజే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఝలావర్ పట్టణంలోని ఝలపతాన్ నుంచి ఎన్నికల బరిలో ఈ పాల్గొన్నారు. 2003, 2008, 2013 ఎన్నికల్లో రాజే ఇక్కడి నుంచి గెలిచారు. ప్రస్తుతం నాలుగో సారి అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు రాజే. అయితే ఈ సారి రాజే గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేత జస్వంత్ సింగ్ కుమారుడు మాన్వేంద్ర సింగ్, రాజేకు గట్టి పోటీ ఇస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మాన్వేంద్ర సింగ్ తండ్రి జస్వంత్ సింగ్ బీజేపీ తరఫున గెలిచారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మాన్వేంద్ర సింగ్ కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ వసుంధర రాజేనే అధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ పార్టీ ఓడిపోయింది. చత్తీస్‌గఢ్ : రమణ్ సింగ్ రమణ్ సింగ్ 2003 నుంచి చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో రమణ్ సింగ్ లోక్‌సభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. 2004 లో చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్ జిల్లాలో దొంగార్గావ్ నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు రమణ్ సింగ్. 2008 లో అసెంబ్లీ ఎన్నికలో ఆయన రాజ్నాంద్గావ్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో రమణ్ సింగ్ గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ఇక్కడ రమణ్ సింగ్ ప్రత్యర్థిగా కరుణ శుక్లా పోటీ చేస్తున్నారు. ఈమె మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మేనకోడలు. 2013 వరకూ బీజేపీలో ఉన్నారు కరుణ. జంజిగిర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి 2004, 2009లో గెలుపొందిన కరుణ.. 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. మోదీ, బీజేపీ నాయకులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అటల్ బిహారి వాజ్‌పేయి పేరును వాడుకుంటున్నారని ఆరోపించిన కరుణ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఇమె కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ్‌నందగావ్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ రమణ్ సింగ్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ ఓటమి వైపు అడుగులేస్తోంది మిజోరాం : లాల్ తన్హావాలా మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా సెర్చిప్, చంపాయి స్థానాల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లోనూ ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం మిజోరాంలో ఎంఎన్ఎఫ్ 26, కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధించింది.