మహిళల పాట్లు!
పొందూరు: సీఎం సభ మహిళల పాలిట శాపంలా పరిణమించింది. రణస్థలం మండలం నెలివాడలో సీఎం పర్యటనకు వచ్చేందుకు బయల్దేరిన వారు అష్టకష్టాలు పడ్డారు. తాగేందుకు మంచినీరు లేదు. తిందామంటే..ఆహారం అందలేదు. కూర్చునేందుకు బస్సులో సక్రమంగా సీటూ దొరకలేదు. బస్సు ఫుట్‌పాత్‌లపైనే ప్రయాణాలు సాగించారు. దీనికి తోడు పొందూరు నుంచి కిలోమీటరు మేర రాపాక నుండి చిలకపాలెం వెళ్లే రహదారిలో బస్సులు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులో కూర్చొనేందుకు సీట్లు లేక..బయటకు వచ్చి సేద దీరుదామంటే..ఎండ వేడిమికి తాళలేక అవస్థలు పడ్డారు. బస్సుల్లోనే మగ్గిపోయారు.
పొందూరు, జి.సిగడాం, రాజాం, సంతకవిటి తదితర మండలాల నుంచి విడతల వారీగా బస్సుల్లో వచ్చిన మహిళలకు పొందూరు మండలం రాపాక కూడలిలో వాటర్ సప్లై, ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. దీంతో వందల సంఖ్యలో బస్సులు రోడ్డుకు ఇరువైపులా, మధ్యలోనూ నిలిచిపోయాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్‌జామ్‌తో ప్రయాణికులు, విద్యార్థులు, మహిళలు ఇబ్బందుల పాలయ్యారు. బస్సులో ఉన్న మహిళలు బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. అతి కష్టం మీద బస్సులో నుంచి మహిళలు దిగి మంచినీటి ప్యాకెట్లు, ఆహార పొట్లాలకు వెళ్లి..ఇబ్బంది పడ్డారు. అవి కూడా కొందరికే దొరికాయి..మరి కొందరికి శ్రమే మిగిలింది. సొంత డబ్బులతో కొబ్బరి బోండాలు, మంచినీటి ప్యాకెట్లు, ఆహార ప్యాకెట్లను కొనాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మహిళలు అవస్థలు పడ్డారు.