బీఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన ఎంబీఏ విద్యార్థి
ముంబై:
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో తొలి సారి యువకులు గెలిపొందారు. సంప్రదాయ రాజకీయాలను వెనక్కునెట్టి యువకులు ముందంజలో నిలిచారు. దీంతో బీఎంసీ పాలనలో మార్పు చోటుచేసుకోనుంది. 23 ఏళ్ల హర్షాల్ కక్కర్ 6వ వార్డు నుంచి శివసేన అభ్యర్థిగా విజయం సాధించారు. దీంతో అత్యంత పిన్న వయస్కుడిగా కక్కార్ బీఎంసీలో అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం కక్కార్ ఎంబీఏ చదువుతుండటం విశేషం.
కక్కార్ బీజేపీ అభ్యర్థి నీలా రాథోడ్‌పై 11,365 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. వయసు దృష్ట్యా పోటిచేయాలంటే భయపడ్డానని, కానీ, ప్రజలు యువత వైపే మొగ్గు చూపారని కక్కార్ తెలిపారు. యువకుడిగా కొత్త ఆలోచనలతో ప్రజలకు మేలు చేస్తానన్నారు. బీజేపీ నుంచి ఏంపీ కిరిత్ సోమాయియా కొడుకు 26 ఏళ్ల నీల్ సోమాయియా వార్డు నెం 108 నుంచి గెలుపొందారు. ప్రజలు ఇంటి పేరు చూసి ఓటెయ్యలేదని, యువకుడిని కావడం వల్లే తనకు ఓటేశారని తెలిపారు. సీనియర్ నాయకులు హామీలు నెరవేర్చకపోవడంతో, ప్రజలు యువతరాన్ని కోరుకున్నారని నీల్ పేర్కొన్నారు.