Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Supreme Court overturns High Court verdict on Mithun Reddy bail Issue1
ఆధారాలు లేకుండా అరెస్టులా..?

‘‘అరెస్ట్‌ అనేది.. పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది. అరెస్ట్‌ అన్నది.. వ్యక్తి గౌరవాన్ని, ప్రతిష్టను, సమాజంలో వారి స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల అరెస్ట్‌ విషయంలో దర్యాప్తు అధికారి తనకున్న అధికారాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది..’’– సుప్రీంకోర్టు ధర్మాసనం..సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అరెస్టులపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు, కారణాలు లేకుండా అరెస్టులు చేయడం సరికాదని పేర్కొంది. కేసు పెట్టిన వెంటనే కారణాలు లేకుండా అరెస్ట్‌లు చేయడం తగదంది. ‘ఏదైనా కేసులో అరెస్టు చేయడానికి సహేతుక కారణాలు చూపించాలి. కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్‌ చేసి తీరాలన్న ఆలోచన ఎంతమాత్రం సరికాదు. ఇలాంటి యాంత్రిక అరెస్ట్‌లు సబబు కాదు...’ అని గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అరెస్ట్‌ చేసే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ విచారణకు స్వీకరించదగ్గ ప్రతి నేరంలో నిందితుడిని అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అరెస్టుల విషయంలో పోలీసులు తమ అధికారాన్ని జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ఉపయోగించాలని పునరుద్ఘాటించింది.హైకోర్టు తీర్పును రద్దు చేసిన ‘సుప్రీం’...మద్యం కేసులో రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై తిరిగి విచారణ జరిపి తగిన నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు తీర్పును పరిశీలిస్తే.. ఆధారాలను పూర్తిస్థాయిలో పరిశీలించలేదన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. దర్యాప్తు అధికారి సేకరించిన ఆధారాలను మరోసారి జాగ్రత్తగా పరిశీలించి నాలుగు వారాల్లో ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. మిథున్‌రెడ్డి పరువు, ప్రతిష్టలను కూడా కేసు విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. హైకోర్టు నిర్ణయం వెలువరించేంత వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జంషేడ్‌ బుర్జోర్‌ పార్ధీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.హైకోర్టు తీర్పుపై సుప్రీంకు మిథున్‌రెడ్డి...గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మి«థున్‌రెడ్డి తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు విచారణ జరిపారు. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ గత నెల 3న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్‌ పార్ధీవాలా ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది.దర్యాప్తునకు సహకరిస్తున్నారు...మిథున్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, రంజిత్‌ కుమార్‌లు వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ ఇప్పటికే దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరయ్యారని తెలిపారు. మద్యం కేసులో మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చామని రాష్ట్ర ప్రభుత్వ తరపు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు తీర్పును ఆక్షేపించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆదేశించింది. తీర్పు వెలువరించేంత వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయబోమన్న రాష్ట్ర ప్రభుత్వ హామీని ధర్మాసనం రికార్డ్‌ చేసింది.

Pakistan Army Announce Death On Operation SIndoor2
మా సైనికులు చనిపోయారు.. మరణాలపై పాక్‌ ప్రకటన

ఇస్లామాబాద్‌: భారత్, పాక్‌ పరస్పర సైనిక చర్యలో తమ సైనిక సిబ్బందిలో కేవలం 11 మంది చనిపోయారని పాకిస్తాన్‌ మంగళవారం ప్రకటించింది. వీరిలో స్క్వాడ్రాన్‌ లీడర్‌ ఉస్మాన్‌ యూసుఫ్‌ సైతం ఉన్నట్లు పేర్కొంది. భారత వైమానిక, క్షిపణి, డ్రోన్‌ దాడుల్లో సాయుధ బల గాలకు సంబంధించి 78 మంది గాయపడ్డారని పాకిస్తాన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా మే ఆరో తేదీ అర్ధరాత్రి తర్వాత భారత్‌ జరిపిన దాడుల్లో 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, 121 మంది పౌరులు గాయపడ్డారని తెలిపింది. చీఫ్‌ టెక్నీషియన్‌ ఔరంగజేబ్, సీనియర్‌ టెక్నీషియన్‌ నజీబ్, కార్పోరల్‌ టెక్నీషియన్‌ ఫరూఖ్, సీనియర్‌ టెక్నీషియన్‌ ముబాషిర్‌ సైతం ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. వీళ్లంతా ఏ పరిస్థితుల్లో మరణించారో, మరణానికి కారణాలను పాకిస్తాన్‌ బయటపెట్టలేదు. ఒక యుద్ధవిమానం పాక్షికంగా ధ్వంసమైందని తెలిపింది.అయితే అది ఏ సంస్థ తయారీ, ఏ రకానికి చెందినది అనే వివరాలనూ పాక్‌స్తాన్‌ వెల్లడించలేదు. ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారంగా ‘మర్కా–ఇ–హక్‌ (ఘన విజయం)’ లక్ష్యంగా ‘ఆపరేషన్‌ బుని యాన్‌ అల్‌ మర్సుస్‌’ను చేపట్టామని ఆ ప్రకటన తెలిపింది. గాయపడిన సైనికులు, పౌరులను పరామర్శించేందుకు సోమవారం పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ రావల్పిండిలోని కంబైన్డ్‌ మిలటరీ ఆస్పత్రిని సందర్శించడం తెల్సిందే. గాయపడిన సైనికాధికారులు, జవాన్లను ఓదార్చేందుకు లాహోర్‌లోని కంబైన్డ్‌ మిలటరీ ఆస్పత్రిని పంజాబ్‌ మహిళా ముఖ్యమంత్రి మర్యం నవాజ్‌ సందర్శించారు.

India Wants additional S-400 missiles from Russia3
పాకిస్తాన్‌కు చుక్కలే.. రష్యాకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌ డ్రోన్లు, క్షిపణులను సమర్థంగా తిప్పికొట్టడంలో ఎస్‌–400 గగనతల రక్షణ వ్యవస్థలు కీలకంగా పనిచేశాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ వ్యవస్థలు ‘సుదర్శన చక్ర’గా భారతదేశ రక్షణ శాఖకు తురుపుముక్కగా మారాయి. శత్రుదేశాల క్షిపణులను నేలకూల్చడంలో వీటికి తిరుగులేదు.ఈ నేపథ్యంలో మరిన్ని ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అందజేయాలని రష్యాకు భారత ప్రభుత్వం తాజాగా విజ్ఞప్తి చేసింది. అత్యంత విశ్వసనీయ వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. భారత్‌ వినతిని అతిత్వరలోనే రష్యా అంగీకరించే సూచనలు కనిపిస్తున్నట్లు తెలిపాయి. ఇటీవలి పరిణామాల తర్వాత గగనతల రక్షణ వ్య వస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. రష్యా నుంచి ఐదు ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల కొనుగోలు కోసం 2018లో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌ విలువ 5.43 బిలియన్‌ డాలర్లు. 2021 నుంచి దశలవారీగా ఐదు వ్యవస్థలు రష్యా నుంచి భారత్‌కు చేరుకున్నాయి. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ఎస్‌-400 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని ఓ వాహనంపై అమర్చవచ్చు. ఒకేసారి మల్టిపుల్‌ టార్గెట్స్‌ని ధ్వంసం చేస్తుంది. ఒకేసారి 36 టార్గెట్‌లను ట్రాక్‌ చేసే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే, 12 టార్గెట్స్‌పై ఒకే సారి దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాక్‌ చేస్తూ.. 400 కిలోమీటర్ల పరిధిలోనే శత్రువుల మిస్సైల్స్‌ను కూల్చే సత్తా వీటి సొంతం. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్‌, బాలిస్టిక్ మిసైల్స్‌ ఇలా వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్‌ చేసి ఛేదిస్తుంది. వీటిని రియాక్షన్‌ టైమ్‌ చేలా వేగంగా ఉంటుంది. ఎస్‌-400 యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఫైర్‌ చేసేందుకు ఐదు నిమిషాల్లోనే రెడీ చేయొచ్చు. ఇందులో 3డీ ఫేజ్‌డ్ అరే రాడార్‌ ట్రాకింగ్ సిస్టమ్‌ ఉంటుంది.

pm modi salutes indian armed forces4
అపూర్వం.. అనూహ్యం.. అద్భుతం.. వాయుసేనకు వందనం

ఇది నవయుగ భారతం. దేశం శాంతినే కోరుకుంటుంది. కానీ శాంతిమయ మానవత్వంపై దాడి చేస్తే ఊరుకోం. అవసరమైనప్పుడు సమరమూ చేస్తాం. యుద్ధక్షేత్రంలో శత్రువును ఎలా అణగదొక్కాలో భారత్‌కు బాగా తెలుసు. వాయుసేన వేగం, సత్తా చూసి పాకిస్తాన్‌ నిద్రలేని రాత్రులు గడిపింది. సమరంలో నేరుగా పోరాడే దమ్ములేక వైమానిక స్థావరంలో పౌరవిమానాలను ముందు నిలిపి పాక్‌ వక్రబుద్ధిని ప్రదర్శించింది. అయినా వాయుసేన కచ్చితత్వంతో పాక్‌ సాయుధ సంపత్తి, వైమానిక స్థావరాలనే గురిచూసి కొట్టింది. – ప్రధాని మోదీన్యూఢిల్లీ: దుష్టదేశ గగనతలాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లి ముష్కర మిన్నాగుల పుట్టలను నేలమట్టంచేస్తూ, దాయాదిదేశం యుద్ధం ఆపాలని కాళ్లబేరానికి వచ్చే స్థాయిలో శత్రువుల వైమానిక స్థావరాలను తుత్తునియలు చేసి తిరుగులేని ధైర్యసాహసాలను ప్రదర్శించిన భారత వాయుసేనను ప్రధాని మోదీ పొగడ్తల్లో ముంచెత్తారు. పాక్‌ సరిహద్దుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోని పంజాబ్‌లోని ఆదంపూర్‌ వైమానిక స్థావరానికి స్వయంగా వెళ్లి అక్కడి వాయుసేన బలగాలపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. వారి అసమాన పోరాట పటిమను భుజం తట్టి ప్రోత్సహించి పొగిడారు.తర్వాత అక్కడి ఎయిర్‌ఫోర్స్‌ జవాన్లనుద్దేశించి దాదాపు అరగంటపాటు ప్రసంగించారు. మరోసారి తెగించేందుకు దుస్సాహసం చేయొద్దని సరిహద్దు వెంట భారతవాయుసేన బలగాలు లక్ష్మణరేఖ గీశాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆదంపూర్‌ వైమానిక స్థావరంలోని భారత అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ అయిన సుదర్శన చక్ర(ఎస్‌–400) మిస్సైల్‌ లాంఛర్లను ముక్కలుచెక్కలు చేశామని పాక్‌ పలికిన ప్రగల్భాలన్నీ ఉత్తమాటలని నిరూపిస్తూ మోదీ మంగళవారం ఆ ఎయిర్‌డిఫెన్స్‌ సిస్టమ్‌ ఎదుటే నిలబడి ప్రసంగించారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై జాతినుద్దేశించి ప్రసంగించిన మరుసటి రోజే మోదీ ఎయిర్‌ఫోర్స్‌నుద్దేశిస్తూ మాట్లాడటం గమనార్హం. త్రిశూలం చిహ్నంతో ఉన్న ఎయిర్‌ కమాండ్‌ క్యాప్‌ ధరించి భారత్‌ మాతా కీ జై అంటూ ప్రధాని ప్రసంగం ప్రారంభించారు. అనుపమాన పరాక్రమం ‘‘పాక్‌ గడ్డపై మీరు చేసిన యుద్ధం అనుపమానం. అపూర్వం. అసాధారణం. అద్భుతం. పాకిస్తాన్‌ నడిబొడ్డున బాంబులు పేల్చారు. కేవలం 20–25 నిమిషాల్లో లక్ష్యాలను నేలమట్టంచేశారు. మీ మెరుపువేగం, కచ్చితత్వం శత్రువులను నిశ్చేష్టులను చేసింది. చూసుకునేలోపే ఛాతీని చీల్చేశాం. మీ పోరాటంతో ప్రతి ఒక్క భారతీయుడు గౌరవంతో ఉప్పొంగిపోయాడు. మేం మీకు రుణపడిపోయాం. ఇది ఎన్నటికీ తీర్చుకోలేని రుణం. ఊహకందనంతటి శక్తియుక్తుల్ని ప్రదర్శించి దేశానికి విజయం చేకూర్చిన మీ నుంచి ఆశీస్సులు తీసుకోవడానికే నేను వచ్చా.ఆపరేషన్‌ సిందూర్‌ ధాటికి ఇక లక్ష్మణరేఖ దాటొద్దని పాకిస్తాన్‌కు బాగా అర్థమైంది. తరచూ అణుబాంబులతో బెదిరించాలని చూస్తున్న దాయాదికి మన బలగాలు భారత్‌ మాతాకీ జై నినాదంలోని అపారశక్తిని బయటకు తీసి చూపారు. భారత్‌ మాతాకీ జై అనేది కేవలం నినాదం కాదు. దేశం కోసం తమ ప్రాణాలనైనా పణంగా పెడతామని బలగాలు చేసిన ప్రతిజ్ఞ. మన డ్రోన్లు, క్షిపణుల మోత పాక్‌ గడ్డపై ప్రతిధ్వనించిన ప్రతిసారీ పాకిస్తాన్‌ సైనికుల చెవుల్లో భారత్‌ మాతాకీ జై అనే నినాదమే మార్మోగింది. వాయుసేన శౌర్యం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మన సైనిక, వాయు, నావికా దళాలకు నా సెల్యూట్‌’’ అంటూ మోదీ సెల్యూట్‌ చేశారు. కన్నేస్తే కనుమరుగు ఖాయం ‘‘భారత గడ్డపై కన్నేస్తే తాము కనుమరుగు అవడం ఖాయమని ఉగ్రపోషకులకు ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత బాగా గుర్తుంటుంది. మీ పరాక్రమంతో ఆపరేషన్‌ సిందూరం నినాదం ప్రపంచమంతా మార్మోగుతోంది. శత్రువులు ఈ ఎయిర్‌ఫోర్స్‌ను నాశనంచేద్దామని కంకణం కట్టుకుని ఎడాపెడా దాడులు చేశారు. వాళ్ల ప్రయత్నాలను మీరు సులభంగా వమ్ముచేశారు. మన వైమానిక స్థావరాలు, రక్షణ మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో వాళ్ల 9 కీలక ఉగ్రస్థావరాలను సమాధులుగా మార్చేశాం. 100 మందికిపైగా ముష్కరులను మట్టుపెట్టాం. పాక్‌కు చెందిన ఎనిమిది సైనిక స్థావరాలను నాశనం చేశాం. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్‌ గీసిన లక్ష్మణరేఖ ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అన్నారు. ధర్మ సంస్థాపనకు యుద్ధం ‘‘ధర్మ సంస్థాపనే లక్ష్యంగా శత్రు సంహారం కోసం ఆయుధం చేతబట్టి యుద్ధంచేయడం భారతీయుల సంప్రదాయం. మన అక్కచెల్లెళ్ల, కుమార్తెల పసుపు కుంకుమలు, సిందూరాన్ని తుచ్ఛమైన ముష్కరులు తుడిచేయగానే మనం వాళ్ల నట్టింట్లోకి వెళ్లి మరీ నాశనం చేశాం. కనీసం పారిపోయే అవకాశం కూడా ఇవ్వలేదు. పహల్గాంలో వాళ్లు దొంగదెబ్బ తీస్తే మనం మాత్రం నేరుగా వెళ్లి, ఎదురునిలిచి పోరాడాం. పాకిస్తాన్‌ సైన్యం చంకనెక్కి భద్రంగా ఉండొచ్చని ఇన్నాళ్లు ఉగ్రవాదులు భావించారు. కానీ మన బలగాలు ఇక పాక్‌లో ఉగ్రవాదానికి సురక్షిత స్థలమంటూ ఏదీ లేదని నిరూపించాయి.సూర్యోదయం వేళ మీ సుందర దర్శనం చేసుకునేందుకే నేను ఇక్కడికొచ్చా. మీరు ఈ తరానికే కాదు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాతలు. మరోసారి సాహసిస్తే నాశనం, వినాశనం అని శత్రువులకు సందేశం ఇచ్చారు. భారత్‌ మాతాకీ జై అన్నప్పుడల్లా భయంతో శత్రువుల గుండెలు జారిపోయాయి. పరాక్రమవంతుల అడుగులతో నేల కూడా పులకిస్తుంది. అంతటి ధైర్యవంతులను నేరుగా చూడటంతో జన్మ ధన్యమవుతుంది. ఆ భాగ్యం కోసమే నేను ఇక్కడికొచ్చా. వీరుల నేలపై నిలబడి ఇప్పుడు నేను ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌లోని యోధులకు సలామ్‌ చేస్తున్నా. మీ వీరత్వంతో ఆపరేషన్‌ సిందూర్‌ నినాదం నేల నలుచెరుగులా ప్రతిధ్వనిస్తోంది’’ అంటూ బలగాలను మోదీ పొగిడారు.త్రికరణ శుద్ధితో..‘‘ఇప్పుడు భారత్‌ మూడే సూత్రాలతో ముందుకెళ్తోంది. ఒకటి.. ఉగ్రదాడి జరిగితే మనదైన శైలిలో సమయం చూసి దీటుగా బదులిస్తాం. రెండు.. అణుబాంబులకు భయపడేదే లేదు. మూడు.. ఉగ్రవాదాన్ని పెంచిపోíÙంచే వాళ్లను, ఉగ్రవాదాన్ని జాతీయవాదంగా మార్చేసిన ప్రభుత్వాలను ఇకపై భారత్‌ వేర్వేరుగా చూడబోదు’’ అని మోదీ స్పష్టంచేశారు. ఆదంపూర్‌ ఎయిర్‌బేస్‌ అనేది దేశంలోని రెండో అతిపెద్ద వైమానిక స్థావరం. ఇక్కడ అత్యంత అధునాతన రఫేల్, మిగ్‌–29 యుద్ధవిమానాల స్క్వాడ్రన్‌ దళాలు ఉంటాయి. 1965, 1971 యుద్ధాల్లోనూ ఆదంపూర్‌ వైమానిక స్థావరం అత్యంత కీలకపాత్ర పోషించింది. మానవ యుక్తి.. మెషీన్‌ శక్తి‘‘వాయుసేన ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల వేగం, సత్తా చూసి పాకిస్తాన్‌ నిద్రలేని రాత్రులు గడిపింది. సమరంలో నేరుగా పోరాడే దమ్ములేక వైమానికస్థావరంలో పౌరవిమానాలను ముందు నిలిపి పాక్‌ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. అయినాసరే మన వాయుసేన అత్యంత కచ్చితత్వంతో పాక్‌ సాయుధ సంపత్తి, వైమానిక స్థావరాలనే గురిచూసి కొట్టింది. అమాయక పౌరులకు ఏ హానీ తలపెట్టలేదు. ఒక్క పౌరవిమానాన్నీ మీరు ధ్వంసంచేయలేదు. ఈ విషయంలో నేను నిజంగా గర్వపడుతున్నా. దాడుల్లో మీరు శత్రు స్థావరాలు, ఉగ్రశిబిరాలనే కాదు మరోసారి దుస్సాహసం చేయాలనే దుర్బుద్ధినీ దెబ్బతీశారు.గగనతల, భూతల యుద్ధ వ్యవస్థల మధ్య అద్భుతమైన సమన్వయం సాధించారు. మానవ యుక్తిని మెషీన్‌ శక్తిని చక్కగా మేళవించారు. మీరు భారత్‌ మాతా కీ జై అన్న ప్రతిసారీ శత్రువుల వెన్నులో వణుకుపుట్టింది. మీ సారథ్యంలో దేశీయ తయారీ ఆకాశ్‌ మిస్సైళ్లు, అధునాతన సుదర్శన చక్ర(ఎస్‌–400) వ్యవస్థలు శత్రు దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా మీరు దేశ ఆత్మవిశ్వాసం, సమైక్యత, ప్రతిష్టను నూతన శిఖరాలపై నిలిపారు. అణుబూచికి ఏమాత్రం భారత బలగాలు బెదరవని నిరూపించారు. మన శక్తియుక్తుల ముందు పాకిస్తాన్‌ అన్ని డ్రోన్లు, యూఏవీలు, క్షిపణులన్నీ దిగదుడుపే. నమ్మశక్యంకాని రీతిలో రణతంత్రం ప్రదర్శించారు.గత దశాబ్దకాలంలో అత్యంత అధునాతన సమర సాంకేతికతలన్నింటినీ మన బలగాలు అందిపుచ్చుకున్నాయి. టెక్నాలజీ వాడకంలో, యుద్ధం వచ్చినప్పుడు ఎలా వినియోగించుకోవాలో మీకు బాగా తెలుసు. రియల్‌ గేమ్‌లో మీరు అదరగొట్టారు. మీరు ఆయుధాలతో మాత్రమే యుద్ధం చేయలేదు. భారత్‌ ఇప్పుడు డ్రోన్లు, డేటా, టెక్నాలజీ సహిత రణాల్లో రాటుదేలింది. మీరు దమ్ము చూపించి శత్రువులను దుమ్ములో కలిపేశారు’’ అని మోదీ అన్నారు. మహారాణా ప్రతాప్‌ అశ్వమైన చేతక్‌ చూపిన తెగువ, సాహసం ఇప్పుడు మన ఆధునిక యుద్ధవిమానాలకు పాటవానికి సరిగ్గా సరిపోతుంది అంటూ నాటి వచనాలను మోదీ గుర్తుచేశారు. ‘‘కదలికల్లో నైపుణ్యం కనబరిచాయి. మెరుపువేగంతో దూకుడు చూపాయి. శత్రుసైన్యం మధ్యల్లోంచే శ్రస్తాలు సంధించాయి’’ అని మోదీ ఆ వచనాలను వల్లెవేశారు. శాంతంగా ఉంటాం.. సమరమూ చేస్తాం‘‘ఇది నవయుగ భారతం. దేశం శాంతినే కోరుకుంటుంది. శాంతంగా ఉంటాం. శాంతిమయ మానవత్వంపై దాడి చేస్తే ఊరుకోం. యుద్ధ క్షేత్రంలో శత్రువును ఎలా అణగదొక్కాలో భారత్‌కు బాగా తెలుసు. శాంతంగా ఉంటాం. అవసరమైనప్పుడు సమరమూ చేస్తాం. ఆపరేషన్‌ సిందూర్‌ అంటే పోరాటానికి పెట్టుకున్న పేరు కాదు. భారత విధాననిర్ణయ పతాక. దృఢ సంకల్పానికి, శక్తిసామర్థ్యాలకు ప్రతీక. శాంతిమయ జీవనం సాగించాలని ప్రపంచానికి బోధించిన బుద్ధుని నేల మాత్రమేకాదు శత్రువులను చీల్చి చెండాడిన గురు గోవింద్‌ సింగ్‌ లాంటి వీరపరాక్రముల పవిత్రభూమి’’ అని అన్నారు.

Rasi Phalalu: Daily Horoscope On 14-05-2025 In Telugu5
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. భూలాభాలు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.విదియ రా.12.35 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: అనూరాధ ఉ.10.24 వరకు,తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: సా.4.29 నుండి 6.13 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.31 నుండి 12.22 వరకు,అమృత ఘడియలు: రా.2.51 నుండి 4.26 వరకు.సూర్యోదయం : 5.32సూర్యాస్తమయం : 6.19రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం.... ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరుత్సాహవంతంగా ఉంటుంది.వృషభం.... నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యత. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.మిథునం.... పనుల్లో విజయం. ఆప్తుల నుంచి ముఖ్య సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారం. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి.కర్కాటకం... వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.సింహం... రుణదాతల ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. సోదరులు, మిత్రులతో విభేదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.కన్య.... పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు ప్రారంభం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.తుల..... శ్రమ తప్పకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తుంది.వృశ్చికం... సోదరుల నుంచి ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. భూలాభాలు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది.ధనుస్సు.... రాబడికి మించి ఖర్చులు. కుటుంబంలో ఒడిదుడుకులు. దూరప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మకరం.... సన్నిహితుల నుంచి ధనలాభం. భూములు, వాహనాలు కొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గుతాయి.కుంభం... కొత్త పనులు చేపడతారు. ఊహించని ఆహ్వానాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ప్రత్యేక గౌరవం. ధన,వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.మీనం... వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

Sakshi Guest Column On India Pakistan Water Issues6
నీళ్ల కోసం ఇక పాక్‌ కాళ్లబేరం!

ఇండియా, పాకిస్తాన్‌ మే 10న కాల్పులను విరమించాయి. దీనికి అమెరికా చొరవ చూపి నట్టుగా వార్తలొచ్చాయి. ఏప్రిల్‌ 22 పహల్‌ గామ్‌ దాడి నుంచి మే 10 కాల్పుల విరమణ వరకు గడచిన ఈ స్వల్పకాలంలో ఇరు దేశాల సంబంధాలు మౌలికంగా కొత్త రూపు సంతరించుకున్నాయి. ఉగ్రదాడికి ముందు ఇండియా–పాకి స్తాన్‌ సంబంధాలు ఎలా ఉండేవో ముందుగా తెలుసుకోవాలి. రెండు దేశాల నడుమ పరిష్కారం కాని సమస్యలపై ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, కాల్పుల విరమణ సజావుగా కొనసాగుతోంది. సింధూ నదీ జలాల ఒప్పందానికి (ఇండస్‌ వాటర్‌ ట్రీటీ– ఐడబ్ల్యూటీ) ఇండియా కట్టుబడి ఉంది. పరిమిత కాల పర్యటనలకు వీలుగా అటారీ–వాఘా సరిహద్దు తెరిచే ఉంటోంది. రాజధానుల్లో హై కమిషనర్లు మినహా సీనియర్‌ దౌత్యాధికారులు పనిచేస్తున్నారు. ఏదో ఒకరోజు కశ్మీర్‌ మీద చర్చలు సాధ్యమేనన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి మరునాడు, అంటే ఏప్రిల్‌ 23న, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ఇండియా ప్రకటించింది. అటారీ– వాఘా సరిహద్దును మూసేసింది. రక్షణ సహాధి కారుల పోస్టులను రద్దు చేసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ భగ్నమైంది. పాకిస్తాన్‌ ఒకడుగు ముందుకేసి 1972 సిమ్లా ఒప్పందం రద్దు చేస్తానని బెదిరించింది. ఉగ్రవాదాన్ని అంతం చేస్తేనే నీళ్లు!కట్‌ చేస్తే... మే 11న అకస్మాత్తుగా వైరాలు నిలిచిపోయాయి. మళ్లీ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీంతో మారిన పరిస్థి తులు ఏవి? దీని తర్వాతా మారనివేమిటి? మే 10న రెండు దేశాల డీజీఎంఓ (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌)లు టెక్నికల్‌ అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. దీని ప్రకారం, నియంత్రణ రేఖ (లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌–ఎల్‌ఓసీ) పొడవునా కాల్పులు జరగవు. డ్రోనులు, క్షిపణులు ప్రయోగించుకోరు. ఇతర లాంగ్‌ రేంజ్‌ ఆయు ధాల ప్రయోగం జరగదు. పరస్పర సైనిక దాడులు నిలిచిపోతాయి. ఇక కాల్పుల విరమణ ఒప్పందం వమ్ము చేయలేనివి ఏమిటో చూద్దాం. ఏప్రిల్‌ 23న ఇండియా, ఆ తర్వాత పాకిస్తాన్‌ తీసుకున్న చర్యలను మే 10 ఒప్పందం రద్దు చేయలేదు. ఇది టెక్నికల్‌ స్థాయి పత్రం తప్ప రాజకీయ ఒప్పందం కాదు. డీజీఎంఓలకు రాజకీయ ఒప్పందాలు చేసుకునే అధికారం లేదు. వీటిని విదేశీ వ్యవహారాల శాఖలు మాత్రమే కుదుర్చుకోగలవు. మరో విధంగా చెప్పాలంటే, ఏప్రిల్‌ 22 నాటి పరిస్థితిని ఇరు దేశాలూ పునరుద్ధరించలేదు. అందుకే, ఇండియా, పాకిస్తాన్‌ నడుమ ఇప్పుడున్నది నయా స్టేటస్‌ కో! అంటే, ఐడబ్ల్యూటీ ఇక ముందు కూడా నిలుపుదలలోనే ఉంటుంది. సింధు జలాలు ఇండియా ఇష్టానుసారం ప్రవహిస్తాయి. ఈ జలాల గణాంకాలను పాకిస్తాన్‌తో పంచుకోవడానికి ఇండియా సుముఖంగా లేదు. దాయాది దేశ ఆర్థిక వ్యవస్థను, అంతర్గత రాజకీయాలను దీర్ఘ కాలంలో ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఐడబ్ల్యూటీ నిలిపివేత ఇండియా–పాకిస్తాన్‌ దౌత్య సంబంధాల రూపురేఖలను మౌలికంగా మార్చేసిన తీవ్ర చర్య. పాక్‌ టెర్రరిజానికి స్వస్తి పలికితే తప్ప సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించబో మని ఇండియా తేల్చిచెప్పింది. ఏకపక్షంగానో, లేదా ద్వైపాక్షిక చర్చల అనంతరమో దీన్ని పునరుద్ధరించడం పూర్తిగా ఇండియా చేతిలో ఉంది. మే 10 కాల్పుల విరమణ ఒప్పందం పరిధిలోకి ఈ అంశం రాదు.భవిష్యత్‌ చర్చల్లో పాకిస్తాన్‌ మెడలు వంచడానికి ఈ ఐడబ్ల్యూటీ సస్పెన్షన్‌ గొప్ప అస్త్రం అని చెప్పాలి. పాకిస్తాన్‌కు సింధూ బేసిన్‌ నీళ్లు కావాలంటే, టెర్రరిజం విషయంలో ఇండియా డిమాండ్లకు అది తలొగ్గాల్సిందే. కశ్మీర్‌ అనేది భావోద్వేగాలకు సంబంధించిన అంశం. అయితే, పాకిస్తాన్‌ ప్రజలకు నీరు జీవన్మరణ సమస్య. పాకిస్తాన్‌ ఇకముందు కూడా కశ్మీర్‌ పాట పాడుతుంది. కానీ, ఐడబ్ల్యూటీ విషయంలో ఇండియాను సానుకూలం చేసుకోడమే మున్ముందు వారి అసలు లక్ష్యం అవుతుంది. ఉభయ పక్షాల చర్చల్లో కశ్మీర్‌ అంశం ప్రాముఖ్యం కోల్పోతుంది. దాని స్థానంలో ఐడబ్ల్యూటీ కీలకాంశంగా మారుతుంది. మరో విధంగా చెప్పాలంటే, ఇండియా తీసు కున్న ఐడబ్ల్యూటీ సస్పెన్షన్‌ అనే ఒకే ఒక్క చర్యతో... ఇరు దేశాల సంబంధాల్లో ఇప్పటి వరకు కేంద్రబిందువుగా ఉన్న కశ్మీర్‌ స్థానాన్ని ఇప్పుడు నీరు ఆక్రమించింది. నిగ్రహం బాధ్యత పాక్‌ మీదే...1971 బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధం అనంతరం, 1972లో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేసినప్పుడు కూడా ఇండియా ఇలానే వ్యవహరించింది. యుద్ధం ముందు ఉన్న ప్రాదేశిక స్థితిని (1965 యుద్ధానంతరం మాదిరిగా) యథాతథంగా అంగీకరించలేదు. కశ్మీర్‌ సరిహద్దు పేరును ‘కాల్పుల విరమణ రేఖ’ నుంచి ‘నియంత్రణ రేఖ’ (ఎల్‌ఓసీ)గా మార్చింది. ఇలా చేయడం ద్వారా కశ్మీర్‌లో తృతీయ పక్షం జోక్యాన్ని వ్యతిరేకించగలిగింది. అప్పటి నుంచి జమ్ము– కశ్మీర్‌లో యూఎన్‌ పరిశీలకుల ఉనికి నామమాత్రమైంది. సారాంశం ఏమిటంటే, పహల్‌గామ్‌ ఉగ్రదాడి, దాని పర్యవ సానాలు ఇండియా–పాకిస్తాన్‌ సంబంధాలను రెండు విధాలుగా ప్రభావితం చేశాయి. మొదటిది: పాకిస్తాన్‌ కోరుకున్నట్లు కశ్మీర్‌ అంశం కొంతవరకు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. అయితే ద్వైపాక్షిక చర్చల నుంచి కశ్మీర్‌ను తప్పించడంలో ఇండియా విజయం సాధించింది. పాకిస్తాన్‌ ఇప్పుడు సర్వశక్తులూ ఐడబ్ల్యూటీ మీదే కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్‌కు నీళ్లు కావాలి.ఇండియాకు టెర్రరిజం అంతం కావాలి. ఇప్పటి వరకు, టెర్రరిజం అంతానికి పాకిస్తాన్‌ అంగీకరించాలంటే ఇండియా కశ్మీర్‌పై చర్చలు జరపాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడది మారింది.రెండవది: ఇరు దేశాల నడుమ సంఘర్షణ తలెత్తినప్పుడు, వైరాన్ని ఉప–సాంప్రదాయిక (సబ్‌–కన్వెన్షనల్‌) స్థాయిని దాటనివ్వ లేదని ఇండియా తన చర్యలు, ప్రతిచర్యల ద్వారా చాటిచెప్పింది. భవిష్యత్తులో మాత్రం ఇది కుదరదని, సబ్‌–కన్వెన్షనల్‌ దాడులకు సాంప్రదాయిక స్థాయిలోనే ప్రతి చర్యలు ఉంటాయని ప్రకటించింది. అంటే, ఇండియాతో పూర్తిస్థాయి యుద్ధం వద్దనుకుంటే, ఉప–సాంప్రదాయిక స్థాయిలోనూ పోరు ప్రారంభించకుండా నిగ్రహం పాటించాల్సిన బాధ్యత పాకిస్తాన్‌ మీదే ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే, టెర్రరిజానికి ఇక సాంప్రదాయిక యుద్ధంతోనే జవాబు చెబుతామని ఇండియా స్పష్టం చేయగలిగింది. ఇందుకోసం భారీ మిలిటరీ సంక్షోభం ఉత్పన్నమై అనేక మంది బలి కావలసి రావడం దురదృష్టకరం. వైరి దేశం ఉగ్ర దాడులకు తెగబడ కుండా నిరోధకత సాధించడానికి, దాన్ని కొనసాగించడానికి ఈ పాటి మూల్యం చెల్లించక తప్పదు.హ్యాపీమాన్‌ జాకబ్‌ వ్యాసకర్త జేఎన్‌యూలో ఇండియా ఫారిన్‌ పాలసీ బోధకులు (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Before-After Satellite Pics Show Damage To Pak Bases After Indian Strikes7
బద్దలైన బేస్‌లు

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగింపులో భాగంగా పాకిస్తాన్‌ వైమానిక స్థావరాలపై భారత్‌ జరిపిన క్షిపణి, డ్రోన్‌ దాడుల్లో కీలక మౌలిక సదుపాయాలు తుడిచిపెట్టుకుపోయాయని స్పష్టమైంది. తాజాగా విడుదలైన శాటిలైట్‌ ఉపగ్రహాల స్పష్టమైన ఫొటోలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మే 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భారత్‌ చేసిన దాడుల్లో పాకిస్తాన్‌ వ్యాప్తంగా 11 మిలటరీ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయి. వైమానిక స్థావరాల్లోని విమాన రన్‌వేలు, విమానాలను నిలిపి ఉంచే హ్యాంగర్లు ధ్వంసమైనట్లు ఈ శాటిలైట్‌ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఒక ప్రైవేట్‌ వాణిజ్య ఉపగ్రహ సంస్థ ఈ హై–రెజల్యూషన్‌ ఫొటోలను తీసింది. ఏమాత్రం అటూఇటూగా కాకుండా, గురిచూసి సరిగ్గా వాయుసేన స్థావరాల మీదనే బాంబులు పడేసినట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. భారత్‌పై మరింతగా దాడులకు తెగిస్తే ఆకాస్త స్థావరాలనూ పూర్తిగా నేలమట్టం చేస్తారనే భయంతోనే మూడ్రోజులకే పాకిస్తాన్‌ కాళ్లబేరానికి వచి్చందనే వాదనకు పూర్తి బలం చేకూర్చేలా ఫొటోలు ఉన్నాయి. మాక్సార్‌ అనే శాటిలైట్‌ సంస్థ తీసిన ఈ ఫొటోలు ఇప్పుడు జాతీయమీడియాలో మంగళవారం ప్రత్యక్షమయ్యాయి. సింధ్‌లోని సిక్కూర్, రావర్పిండిలోని నూర్‌ ఖాన్, దక్షిణ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని రహీం యార్‌ ఖాన్, సర్గోధాలోని ముషాఫ్, ఉత్తర సిం«ద్‌లోని జకోబాబాద్, ఉత్తర థటా జిల్లాలోని భోలారీ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమైన తీరు ఫొటోలో వివరంగా తెలుస్తోంది. దాడి తర్వాత కీలక మిలటరీ బేస్‌లలో రన్‌వేలపై భారీ గొయ్యి, కార్యనిర్వాహక భవనాలు, నిల్వ కేంద్రాల పైకప్పులకు పెద్ద రంధ్రాలు పడటం, భవంతుల గోడలు కూలి శిథిలాలు, శకలాలు సమీప ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిన వివరాలు ఫొటోల్లో తెలుస్తున్నాయి. పస్రూర్, సియాల్‌కోట్‌లోని రాడార్‌ కేంద్రాలు క్షిపణుల దెబ్బకు పేలిపోయాయి. సుక్కూ ర్‌ ఎయిర్‌బేస్‌లో రెండు విమాన షెల్టర్‌లు కూలిపోయాయి. చక్లాలాలోని నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌లో భారీ సైనిక, సరకు రవాణా వాహనాలు రెండు బాగా దెబ్బతిన్నాయి. రహీం యార్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌లో ఒక్కటే రన్‌వే ఉంది.దానిపై బాంబులేయడంతో 19 అడుగుల విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడింది. 43 అడుగుల పరిధిలో రన్‌వే పాక్షికంగా ధ్వంసమైంది. ముషాఫ్‌ ఎయిర్‌బేస్‌ రన్‌వేపై రెండు పేద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. ఒకటి 10, మరోటి 15 అడుగుల విస్తీర్ణంలో ఏర్పడ్డాయి. దీంతో ఇక్కడి విమానాల రాకపోకలు ఆగిపోయాయి. సమీప రవాణా వాహనాలూ దెబ్బతిన్నా యి. జకోబాబాద్‌లోని షాబాజ్‌ ఎయిర్‌బేస్‌తోపాటు భోలారీ ఎయిర్‌బేస్‌లో చెరో విమాన హ్యాంగర్‌కు భారీ నష్టం జరిగింది. హ్యాంగర్‌లో నిలిపిఉంచిన విమానాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

YSRCP chief visits Murali Nayaks family8
మురళీ నాయక్‌ కుటుంబానికి అండగా ఉంటాం: వైఎస్‌ జగన్‌

సాక్షి, పుట్టపర్తి: ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్‌లో ఈనెల 8న పాకిస్తాన్‌తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్‌ మురళీ నాయక్‌ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మురళీ నాయక్‌ వయసులో చిన్నవాడే అయిన­ప్పటికీ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని కొని­యాడారు. యావత్‌ భారత్‌ గర్వపడేలా వీరోచితంగా పోరాడి.. దేశ రక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించిన వీరుడన్నారు. మంగళవారం మురళీ నాయక్‌ కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఉదయం బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన మురళీనాయక్‌ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకున్నారు. మురళీనాయక్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్‌ నాయక్‌లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. ‘మురళీ.. లే మురళీ.. జగన్‌ సార్‌ వచ్చారు.. లేచి సెల్యూట్‌ చేయి మురళీ’ అంటూ తండ్రి శ్రీరామ్‌ నాయక్‌ భావోద్వేగంతో పలికిన మాటలు అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. యావత్‌ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్‌ దేశం రుణపడి ఉంటుందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.మురళీ కుటుంబానికి రూ.25 లక్షల సాయంకల్లి తండాలో వీర జవాన్‌ మురళీ నాయక్‌ తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మురళీ నాయక్‌ త్యాగానికి వెల కట్టలేమని చెప్పారు. దేశం కోసం పోరాడుతూ.. తన ప్రాణ త్యాగంతో మిగిలిన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు రక్షణ ఇచ్చార­న్నారు. యావత్‌ భారత్‌ దృష్టిని ఆకర్షించిన మురళీని మన మధ్యలోకి తేలేం కానీ.. ఆయన త్యాగానికి రుణపడి ఉంటామన్నారు. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్‌ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. దేశం కోసం పోరాడుతూ.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేసే సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా మురళీ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించడం పట్ల అభినందించారు.దారి పొడవునా స్వాగతంకర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్‌ ప్లాజా నుంచి కొడికొండ చెక్‌పోస్టు, కోడూరు, పాల సముద్రం, గుమ్మయ్యగారిపల్లి, కల్లి తండా వరకు దారి పొడవునా ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. దేశ సరిహద్దులో వీరమరణం పొందిన మురళీనాయక్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు, పార్టీ శ్రేణులు భారీసంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారు. జాతీయ జెండాలతో చిన్నారులు మార్గం మధ్యలో స్వాగతం పలికారు. వాహనంపై నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

Sakshi Editorial On USA China Trade Deal9
వెనక్కి తగ్గిన అమెరికా – చైనా

వేలంపాట తరహాలో అమెరికా, చైనాలు ఒకరిపై ఒకరు సుంకాలు పెంచుకుంటూ పోయిన వైనంతో బెంబేలెత్తిన ప్రపంచ మార్కెట్లూ, ఆర్థిక వ్యవస్థలూ నేల చూపులు చూస్తున్న వేళ జెనీవా నుంచి సోమవారం ఒక చల్లని కబురు వినబడింది. ఆర్థికంగా ప్రపంచంలోనే ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న ఇరు దేశాలూ ప్రస్తుతానికి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాయన్నదే దాని సారాంశం. ఇది బుధవారం నుంచి అమల్లోకొచ్చి తొంభై రోజులపాటు... అంటే మూణ్ణెల్లపాటు అమల్లో వుంటుందనీ, రెండు దేశాల ప్రతినిధులతో ఏర్పడిన సలహా యంత్రాంగం ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తుందనీ ఉమ్మడి ప్రకటన వివరిస్తోంది. ఈ సలహా యంత్రాంగంలో చైనా తరఫున ఆ దేశ ఉపప్రధాని హో లిఫాంగ్‌ , అమెరికా తరఫున ఆర్థికమంత్రి స్కాట్‌ బిసెంట్, వాణిజ్య ప్రతినిధి జెమిసన్‌ గ్రీయర్‌లుంటారు. మూర్ఖత్వంలో ఎవరికెవరూ తీసిపోని ఈ రెండు పక్షాలూ చివరికేం చేస్తాయన్నది ఇంకా చూడాల్సేవున్నా ఇప్పటికైతే ఒక ముప్పు తాత్కాలికంగానైనా ఉపశమించిందని సంతోషించక తప్పదు. మొన్న జనవరిలో అమెరికాలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ప్రపంచాన్ని హడలెత్తిస్తూ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న వరస నిర్ణయాల్లో ఈ సుంకాల పెంపు వ్యవహారం అతి పెద్దది. గత నెల 2 నుంచి అమల్లోకొచ్చిన ఈ పెంపు చైనా మినహా వేరే దేశాలపై తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు ట్రంప్‌ ఆ వెంటనే ప్రకటించారు. కానీ కోడెల పోట్లాటల మధ్య లేగల కాళ్లు విరిగినట్టు అమెరికా–చైనా సుంకాల యుద్ధంతో ప్రపంచమంతటికీ సమస్యలు తలెత్తాయి. తాజా ఒప్పందం పర్యవసానంగా అమెరికా విధించిన 145 శాతం సుంకాలు కాస్తా 30 శాతానికి తగ్గుతాయి. అలాగే అమెరికా దిగుమతులపై చైనా విధించిన 125 శాతం సుంకాలు 10 శాతానికి దిగొస్తాయి. ఈ వారం ఆఖరులోగా తాను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చిస్తానని ట్రంప్‌ చెప్పటం కూడా సంతోషించదగ్గది. చైనాతో సుంకాల విషయమై చర్చలు సాగుతున్నాయని ఆ మధ్య ట్రంప్‌ పదే పదే ప్రకటించగా చైనా ఖండించింది. చివరకు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో చర్చలు సాకారమయ్యాయి. చైనాను దెబ్బతీసే ఉద్దేశం తమకు మొదణ్ణించీ లేదని ట్రంప్‌ ప్రకటించారు. ఇది స్వాగతించ దగ్గదే అయినా బడాయి మాటనే చెప్పాలి. ఎందుకంటే ఆ దేశాన్ని దెబ్బతీయటం సంగతలా వుంచి అమెరికాలోని తయారీరంగ పరిశ్రమలు ముడిసరుకులు దొరక్క ఇబ్బందులుపడుతూ దివాలా దశకు చేరాయి. ఉద్యోగాలకు కోతబెట్టాయి. వినియోగదారులు సైతం ఉత్పత్తులు అందుబాటులో లేకపోవటంతో పాటు, లభ్యమైన సరుకు ధర ఆకాశాన్నంటడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయి సతమతమవుతుంటే సరుకును రెట్టింపు, అంతకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి రావటం వారిని కుంగదీసింది. చైనాలోనూ పరిస్థితి ఏమంత సజావుగా లేదు. అనేక కంపెనీలు మూతబడ్డాయి. కొన్ని సంస్థలు ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతులపై దృష్టి సారించాయి. ట్రంప్‌ అధికారంలోకొస్తూనే దేశంలో యువత ప్రాణాలు తీస్తున్న మత్తు పదార్థం ఫెంటానిల్‌ విచ్చలవిడిగా దొరకటంలో చైనా పాత్రవుందని ఆరోపిస్తూ ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై 20 శాతం అదనంగా సుంకాలు పెంచారు. గత నెల 2 నుంచి దానికి మరో 34 శాతం జోడించారు. ఇలా తమ నుంచి వెళ్లిన సరుకులపై 54 శాతం సుంకాలు విధించటాన్ని జీర్ణించుకోలేని చైనా దానికి ప్రతీ కారంగా అమెరికా దిగుమతులపై 34 శాతం మేర అదనపు సుంకాలు విధించింది. ఇక అక్కడి నుంచి ఇద్దరిమధ్యా ‘చంపుడు పందెం’ మొదలైంది. నిజానికి ట్రంప్‌కు ముందు ఫెంటానిల్‌తో చైనాకు లంకె పెట్టినవారెవరూ లేరు. అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆయన దాన్ని ఎక్కువచేసి చూపారు. మొత్తానికి అమెరికా 145 శాతం, చైనా 125 శాతం సుంకాల దగ్గర ఆగాయి. ఇప్పుడు కుదిరిన ఒప్పందం పర్యవసానంగా గంపగుత్తగా అన్ని రకాల సరుకులపైనా సుంకాలు తగ్గిపోవు. చైనా సరుకులపై అమెరికా విధించిన 30 శాతం సుంకాలు కొనసాగుతాయి. అలాగే విద్యుత్‌ వాహనాలు, ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ఇంతకన్నా ఎక్కువగానే సుంకాలున్నాయి. అవన్నీ గత కొన్ని సంవత్సరాల్లో విధించినవి కనుక ఈ ఒప్పందం వాటి జోలికిపోదు.అవతలిపక్షం నుంచి ఎలాంటి రాయితీలూ పొందకుండా, తమకనుకూలమైన ముగింపు వైపుగా చర్యలేమీ కనబడకుండా ఒప్పందానికి రావటం బలహీనతను సూచిస్తుంది తప్ప బలాన్ని కాదు. ప్రస్తుత ఒప్పందం వ్యూహాత్మకమైనదని చెప్పుకున్నా, మున్ముందు దేశానికేదో ఒరుగుతుందని అంటున్నా... అధిక సుంకాల మోత నుంచి వెనక్కి తగ్గమని ట్రంప్‌పై దేశంలో అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు వచ్చాయన్నది వాస్తవం. నిరుటి గణాంకాలు గమనిస్తే రెండు దేశాలూ వాణిజ్య పరంగా పరస్పరం ఆధారపడినవేనని తెలుస్తుంది. చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా 12.9 శాతం. అలాగే అమెరికా మొత్తం ఎగుమతుల్లో చైనా వాటా 14.8 శాతం. కెనడా, మెక్సికోల తర్వాత స్థానం చైనాదే. అధిక సుంకాల యుద్ధం చివరకు ప్రపంచ ఆర్థికాభివృద్ధిని మందగింపజేస్తుందని, ఉత్పత్తుల కొరతను సృష్టించి ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని... ఇదంతా చిట్టచివరకు అమెరికాను మాంద్యం ఊబిలోకి నెడుతుందని నిపుణులు మొదణ్ణించీ హెచ్చరిస్తూనే ఉన్నారు. సర్వజ్ఞుణ్ణని భావించేవారికి చెప్పటానికి ప్రయత్నించటం వృథా ప్రయాస. ఏదైనా అనుభవంలోకొస్తే తప్ప తత్వం బోధపడదు. మొత్తానికి ఈ చర్చల వల్ల ఇప్పటికైతే అర్థవంతమైన పరిష్కారం లభించలేదు. మున్ముందు ఏమవుతుందన్నది రెండు దేశాల విజ్ఞతకూ పరీక్ష.

Miss World contestants heritage walk in Hyderabad Old City10
వయ్యారి భామ.. నీ హంస నడక!

సాక్షి, హైదరాబాద్‌: నిజాం వారసత్వ వైభవానికి, ఇప్పటికీ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్న హైదరాబాద్‌ పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద వివిధ దేశాల సుందరీమణులు సందడి చేశారు. చార్మినార్‌ను ఆసక్తిగా తిలకించారు. ఫొటోలకు పోజులిచ్చారు. మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ హెరిటేజ్‌ వాక్‌ ఉత్సాహంగా సాగింది. చార్మినార్‌ వద్ద, లాడ్‌బజార్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్‌ కార్పెట్‌పై అందాల భామలు వయ్యారంగా నడుస్తూ స్థానికులను అలరించారు. వీరికి పాతబస్తీలో పాపులర్‌ అయిన అరబ్బీ మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలకగా..కొందరు మార్ఫా వాయిద్యాల సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేశారు. అనంతరం లాడ్‌ బజార్‌కు వెళ్లారు. చుడీ బజార్‌ (గాజుల మార్కెట్‌)లో షాపింగ్‌ చేశారు.సెల్‌ ఫోన్లలో చార్మినార్‌..గ్రూప్‌ ఫొటోప్రపంచ సుందరి పోటీల నేపథ్యంలో నగరానికి చేరుకున్న దాదాపు 109 దేశాలకు చెందిన మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా మంగళవారం ప్రభుత్వం హెరిటేజ్‌ వాక్‌లో భాగంగా వారు చార్మినార్‌ను సందర్శించారు. విశిష్టమైన నగర వారసత్వ వైభవానికి ఈ అందాల ముద్దుగుమ్మలు ఫిదా అయిపోయారు. చార్మినార్‌ను తిలకించడమే కాకుండా దాని ముందు ఏర్పాటు చేసిన వేదికపై గ్రూప్‌ ఫోటో దిగారు. చార్మినార్‌ చరిత్ర, గొప్పదనం గురించి టూరిజం శాఖ గైడ్‌లను అడిగి తెలుసుకున్నారు. కొందరు తమ ఫోన్‌లలో చార్మినార్‌ అందాలను బంధించారు. గాజులు, ముత్యాల హారాల షాపింగ్‌నగర జీవనశైలి, ఇక్కడి విభిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రపంచ సుందరీమణులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో చార్మినార్‌ సమీపంలోని లాడ్‌ బజారులో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో హెరిటేజ్‌ వాక్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ బ్యాంగిల్స్, ముజీబ్‌ బ్యాంగిల్స్, కనహయ్యలాల్, మోతీలాల్‌ కర్వా, గోకుల్‌ దాస్‌ జరీవాల, కేఆర్‌ కాసత్, జాజు పెరల్స్, ఏ హెచ్‌ జరీవాల, అఫ్జల్‌ మియా కర్చోబే వాలే దుకాణాల్లో ఈ మిస్‌ వరల్డ్‌ తారలు అందమైన గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువులు తీసుకున్నారు. నగర విశిష్టతను చాటాలన్న వ్యాపారులులాడ్‌ బజార్‌ వ్యాపారులు కొందరు సుందరీమణుల వద్ద డబ్బులు తీసుకోవడానికి నిరాకరించారు. మీమీ దేశాల్లో హైదరాబాద్‌ విశిష్టతను, చార్మినార్‌ లాడ్‌ బజార్‌ ప్రత్యేకతను చాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లాడ్‌ బజార్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిక్షాలు, రంగురంగుల అలంకరణలు ఆకట్టుకున్నాయి. సుందరీమణుల హెరిటేజ్‌ వాక్‌ సందర్భంగా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement