
కరెన్సీ సేకరణే హాబీగా..
● విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు
లక్సెట్టిపేట: మండలంలోని లక్ష్మీపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న అనిల్ కరెన్సీ సేకరణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. విదేశాల నుంచి ఎవరైనా వచ్చినట్లు తెలిసినా, వివిధ ప్రదేశాలకు వెళ్లినప్పుడు విదేశీయులు కనిపించినా వెంటనే వారి వద్దకు వెళ్లి కరెన్సీని సేకరించి భద్రపరుస్తున్నాడు. ఇప్పటి వరకు తాండూర్, సీతారాంపల్లి, ఆస్నాద్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించగా అక్కడి విద్యార్థులకు వివిధ దేశాల కరెన్సీపై అవగాహన కల్పించారు. కరెన్సీతో పాటు ప్రకృతి, పక్షులు, అందమైన ఫొటోలు తీయడం అతని హాబీగా మార్చుకున్నాడు.
31 దేశాల కరెన్సీ సేకరణ
2008 నుంచి ఇప్పటి వరకు 31 దేశాల కరెన్సీ సేకరించి సేకరించాడు. వివిధ దేశాల కరెన్సీ పేర్లు, వాటి విలువలు విద్యార్థులకు తెలియపర్చేందుకు కరెన్సీని సేకరిస్తున్నట్లు ఆయన పేర్కొంటున్నాడు. విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లినా కాంపిటేటివ్ పరీక్షల్లో ఉపయోగకరంగా ఉండేందుకు భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న పాత, కొత్త కరెన్సీలను భద్రపరుస్తున్నాడు. ఖాళీగా ఉన్న సమయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లి కరెన్సీ సేకరించడం, ఫొటోలు తీయడంపై దృష్టి పెడుతున్నాడు. విద్యార్థులకు పాఠాలతో పాటు ప్రకృతి, వాటి విలువలు, కరెన్సీ, ఇతర విషయాలపై అవగాహన కల్పిస్తున్నాడు.
అవగాహన కల్పించేందుకే..
విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే వివిధ దేశాల కరెన్సీ సేకరిస్తున్నా. కరెన్సీ సేకరణ, ఫొటోలు తీయడం హాబీగా ఎంచుకున్నా. విద్యార్థులకు పాఠాలతో పాటు కరెన్సీపై అవగాహన కల్పిస్తున్నా.
– అనిల్, ఉపాధ్యాయుడు