
● మారనున్న రైల్వేస్టేషన్ రూపురేఖలు ● కొనసాగుతున్న ఆధున
సాక్షి,ఆదిలాబాద్: రాష్ట్రంలోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ఆదిలాబాద్ ఒకటి. దక్షిణమధ్య రైల్వే పరి ధిలోకి వచ్చే నాందేడ్ డివిజన్ పరిధిలో ఇది విస్తరించి ఉంది. ఇక్కడ పెరుగుతున్న రైలు వినియోగదా రుల అవసరాలను తీర్చే ఉద్దేశంతో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏబీఎస్‌ఎస్) కింద దీన్ని ఆధునికీకరిస్తున్నారు. 2023 ఆగస్టు 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పనులను వర్చువల్ పద్ధతిన ప్రారంభించారు. ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ..
కొన్నేళ్లుగా ఈ స్టేషన్ ప్రయాణికుల రద్దీలో గణనీయమైన వృద్ధి సాధించినట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రోజూ 4,300కు పైగా ప్రయాణికులు 16 రైళ్ల ద్వారా ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఇక్కడ పిట్‌లైన్ నిర్మాణం తుది దశకు వచ్చింది. రైల్వే కోచ్‌ల నిర్వహణ పిట్‌లైన్ ద్వారా జరిగేందుకు ఆస్కారం ఉంది. తద్వారా ఈ స్టేషన్ నుంచే రైలు గమ్యస్థానం ప్రారంభించేందుకు దోహద పడుతుంది. నాందేడ్ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రద్దీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడినుంచి పలు రైళ్లను పొడగించాలనే డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఇదే డివిజన్ పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్ స్టేషన్‌కు ఆ రైళ్లను పొడగించాలని పౌరసమాజం సభ్యులు పలుమార్లు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పిట్‌లైన్ పనులు తుది దశకు రావడం, రానున్న రోజుల్లో స్టేషన్ ఆధునికీకరణ కూడా పూర్తయ్యే పరిస్థితులు ఉండడంతో ఆదిలాబాద్ రైల్వే రూపురేఖలు పూర్తిగా మారనున్నాయన్న అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆరు రైల్వేట్రాక్‌లు ఉండగా, వాటిని తొమ్మిదికి పెంచుతున్నారు.
పనులు కొనసాగుతున్నాయి..
ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. అమృత్ స్కీమ్‌లో భాగంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా పలు వసతులను ఏర్పాటు చేస్తున్నాం.
– ప్రదీప్ కామ్లే, డీఆర్‌ఎం,
నాందేడ్ రైల్వే డివిజన్