
భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
అనకాపల్లి: భార్యపై అనుమానంతో కోపోద్రిక్తుడైన భర్త ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆపై పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన మంగళవారం మండలంలోని తోటాడలో చోటు చేసుకుంది. గ్రామంలో దళితవాడకు చెందిన కొత్తలంక నూకప్పారావు స్థానికంగా సీలింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి పదేళ్ల క్రితం గొలుగొండ మండలం గుండపాలకు చెందిన దీనమ్మ(26)తో వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. పిల్లలు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
ఈ విషయమై భార్యతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల్లో వేరే కాపురం ఉంటూ వచ్చారు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో అసహనానికి గురయ్యాడు. ఇంతలో ఇరువురి మధ్య గొడవలు పెరిగిపోవడంతో ఈ నెల 23న పెద్దల వద్ద పంచాయితీ పెట్టించారు. దీనిలో భాగంగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తమ పిల్లలు బడికి వెళ్లిపోయాక మరోసారి ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో భర్త కోపోద్రిక్తుడై భార్య మెడకు చున్నీ బిగించాడు. ఈ పెనుగులాటలో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది.
అతడు నేరుగా అనకాపల్లి దిశ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న యలమంచిలి రూరల్ సీఐ గఫూర్ నూకప్పారావును అదుపులోకి తీసుకున్నారు. వీఆర్వో సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గఫూర్ తెలిపారు. నిందితుడి ఇంటిని క్లూస్ టీమ్ పరిశీలించింది. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఉదయం ఎంతో సరదాగా స్కూల్‌కు వెళ్లిన పిల్లలు తమ తల్లికి జరిగిన ఘోరాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి లేని పిల్లలు ఎలా బతుకుతారో అని స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.