● 22,300 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేసిన అధికారులు ● డి–కృషి యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ● అందుబాటులో 11 రకాల వరి వంగడాలు ● అపరాలు, వేరుశనగ, నువ్వులు విత్తనాల్లో 40 శాతం రాయితీ ● అన్ని ఆర్బీకేల్లో నేటి నుంచిపంపిణీకి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

● 22,300 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేసిన అధికారులు ● డి–కృషి యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ● అందుబాటులో 11 రకాల వరి వంగడాలు ● అపరాలు, వేరుశనగ, నువ్వులు విత్తనాల్లో 40 శాతం రాయితీ ● అన్ని ఆర్బీకేల్లో నేటి నుంచిపంపిణీకి సిద్ధం

Published Sat, Jun 15 2024 1:24 AM | Last Updated on Sat, Jun 15 2024 1:24 AM

-

విత్తనాల రకాలు.. వాటి ధరలు

వరిలో రకాలు క్వింటాళ్లు రాయితీ పోను

బస్తా ధర

ఆర్‌జీఎల్‌ 2537 13,500 రూ.954

బీపీటీ 3291 1,092 రూ.834

బీపీటీ 5204 2,268 రూ.795

ఎంటీయూ 1061 592 రూ.894

ఎంటీయూ 1064 1800 రూ.894

ఎంటీయూ 1121 979 రూ.894

ఎంటీయూ 1224 940 రూ.894

ఎంటీయూ 7029 340 రూ.894

ఎంటీయూ 1318 800 రూ.894

ఎన్‌ఎల్‌ఆర్‌–34449 17 రూ.915

ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 48 రూ.834

సాక్షి, అనకాపల్లి: ఖరీఫ్‌ సాగుకు వ్యవసాయ అధికారులు విత్తనాలు సిద్ధం చేశారు. రైతులకు వరి, అపరాలు, వేరుశనగ, నువ్వుల విత్తనాలు సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. శనివారం నుంచి జిల్లాలో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రావు వెల్లడించారు. కావాల్సిన రైతులు డి–కృషి యాప్‌ ద్వారా గానీ, నేరుగా ఆర్‌బీకేల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. విత్తనాల ధరలు కూడా ప్రకటించారు. మరోవైపు గత ఖరీఫ్‌ కంటే ఈసారి సాగును పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. గత ఏడాది జిల్లాలో సకాలంలో పంటలు పండాయి. ఈసారి అదే తరహాలో ఖరీఫ్‌లో సాగును మరింత పెంచా లని వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో 84 వేల హెక్టార్లలో సాగు జరిగింది. ఇందులో 60 వేల హెక్టార్లలో వరి పంట, 15 వేల హెక్టార్లలో చెరకు, మిగిలినవి వేరుశనగ, చోళ్లు, గంటెలు, చిరుధాన్య పంటలు వేశారు. అదే తరహాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కూడా సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

అందుబాటులో 11 రకాల వరి వంగడాలు

విత్తనాలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నారు. వ్యవసాయ అధికారులు గోదాముల్లో విత్తనాలను, ఎరువులను సిద్ధం చేసి ఉంచారు. ఖరీఫ్‌లో రైతులకు అధిక దిగుబడి ఇచ్చే విధంగా 4 కొత్త వరి వంగడాలను ఈ ఏడాది అందుబాటులోకి అధికారులు తీసుకొచ్చారు. వరి విత్తనాల్లో మొత్తం 11 రకాలు ఆర్‌బీకేల్లో సిద్ధం చేశారు. వీటిలో మార్టేరు సాంబ(ఎంటీయూ1224) రకం, మార్టేరు మసూరి (ఎంటీయూ1262) రకం, ఎంటీయూ 1318 రకం, శ్రీధృతి (ఎంటీయూ 1121) రకం వరి విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో పాటుగా అపరాలు, వేరుశనగ, నువ్వులు విత్తనాలను 40 శాతం సబ్సిడీతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్‌బీకేల్లో అపరాలు 91 క్వింటాళ్లు, వేరుశనగ 143 క్వింటాళ్లు, నువ్వులు 11 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు.

కొత్త వంగడాల ప్రత్యేకతలు

మార్టేరు సాంబ (ఎంటీయూ 1224): ఇది సన్న బియ్యం రకం. ఈ రకం సాంబ మసూరి (బీపీటీ–5204) వంగడానికి ప్రత్యామ్నాయ రకం. ఇది ఖరీఫ్‌కు అనువైంది. ఇది 140 రోజుల కాలపరిమితిలో పంట పూర్తవుతుంది. చేను పడిపోదు. సుడి దోమని తట్టుకుని మంచి దిగుబడిని ఇస్తుంది. గింజ రాల్చే గుణం తక్కువగా ఉంటుంది. రెండు వారాలు నిద్రావస్థ దశలో ఉంటుంది. ఎకరానికి 2.6 టన్నుల (34 బస్తాలు) దిగుబడి ఇస్తుంది.

మార్టేరు మసూరి (ఎంటీయూ 1262): ఈ రకం వంగడం శ్రీకాకుళం సన్నాలు (ఆర్జీఎల్‌–2537) రకానికి ప్రత్యామ్నాయం. 155 రోజుల కాల పరిమితిలో పంట పూర్తవుతుంది. ఖరీఫ్‌కు అనువైన వంగడం. సుడి దోమని తట్టుకుంటుంది. ఎండు తెగులును తట్టుకుని అధిక దిగుబడి ఇస్తుంది. ఎకరానికి 2.6 నుంచి 2.8 టన్నుల(36 బస్తాలు) దిగుబడి నిస్తుంది.

ఎంటీయూ 1318: ఈ రకం స్వర్ణ (ఎంటీయూ 7029)కు ప్రత్యామ్నాయం. 150 రోజుల కాలపరిమితిలో పంట పండుతోంది. ఖరీఫ్‌కు అనువైన వంగడం. చేను పడిపోదు. అగ్గి తెగులును తట్టుకునే స్వభావం ఉంటుంది. ఇది సన్నబియ్య రకం. ఎకరానికి 3 టన్నులు (40 బస్తాలు) దిగుబడి నిస్తుంది.

శ్రీధృతి (ఎంటీయూ 1121): 125 రోజుల కాలపరిమితి. ఈ రకం నుంచి దోమ, అగ్గి తెగులు తట్టుకుంటుంది. ఎకరాకు 3 టన్నులు (40 బస్తాలు) దిగుబడినిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement