సారూ.. ఇదేం తీరు..! | - | Sakshi
Sakshi News home page

సారూ.. ఇదేం తీరు..!

Published Sun, Jun 16 2024 1:16 AM | Last Updated on Sun, Jun 16 2024 1:16 AM

సారూ.. ఇదేం తీరు..!

● డీఎస్సీ–98 ఉపాధ్యాయులకు అశనిపాతం ● పాతకేళ్ల తరువాత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ● గత ఉత్తర్వులకు భిన్నంగా పోస్టింగ్‌లు ● రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నవారూ అడవిబాట ● ఆందోళనలో ఉపాధ్యాయులు, కౌన్సెలింగ్‌ కోసం డిమాండ్‌

‘నగరానికి చెందిన హరినారాయణకు డీఎస్సీ–98 ద్వారా టీచర్‌(ఎంటీఎస్‌) ఉద్యోగం లభించింది. గతేడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనందున తప్పనిసరి పరిస్థితుల్లో విశాఖ నుంచి అల్లూరి జిల్లా ఏజెన్సీలో పోస్టింగ్‌ తీసుకున్నారు. జులై 31న ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. తాజాగా కొనసాగింపు ఉత్తర్వులు అందినా, నెలన్నర రోజుల కోసమని కుటుంబాన్ని వదిలి అటవీ ప్రాంతానికి వెళ్లక తప్పటం లేదు. ఈ ఏడాది కాలంలో ఇలా చాలా మంది రిటైర్‌ అవుతున్నారు. ఏజెన్సీకి పంపించటమే కాకుండా, రూ.110లు జ్యూడిషియల్‌ ఒప్పంద పత్రం సమర్పించాల్సిందనే ఉత్తర్వుల్లో పేర్కొనటంపై ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు.’

విశాఖ విద్య: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులతో ప్రెండ్లీగా ఉంటుందని చెబుతున్నా ఆచరణలో మాత్రం మరోలా నిర్ణయాలు వెలువడుతున్నాయి. డీఎస్సీ–98 ఉపాధ్యాయుల విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేస్తున్న వారు సైతం విశాఖ నగరం నుంచి ఏజెన్సీ ప్రాంతానిని వెళ్లక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలు కాబట్టి, ఎక్కడ కొలువులు ఊడిపోతాయోననే ఆందోళనతో తమ సమస్యను చెప్పుకోలేక డీఎస్సీ–98 ఉపాధ్యాయులు లోలోన మదనపడుతున్నారు.

పాతికేళ్లకు దక్కిన ఉద్యోగాలు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పాతికేళ్ల సమస్యకు మోక్షం కలగటంతో గతేడాది జూన్‌ నెలలో డీఎస్సీ–98 వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. మినిమమ్‌ టైం స్కేల్‌(ఎంటీఎస్‌) కింద నెలకు రూ.32,670లు వేతనం పొందుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్హత సాధించిన 288 మందికి నాడు ఉపాధ్యాయులుగా పోస్టింగ్‌ ఇచ్చారు. అయితే విశాఖ జిల్లాలో ఖాళీలు లేవనే కారణంతో 200 మంది వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా(ఏజెన్సీ ప్రాంతం)కు కేటాయించారు.

సొంత ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఇమ్మన్నా..

మినిమమ్‌ టైం స్కేల్‌ కింద పనిచేస్తున్నందున శ్రీస్థానిక నివాసాలకు సమీపంలో పోస్టింగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని 15–06–2023న పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సైతం ఉత్తర్వులు జారీ చేసినా, విశాఖ జిల్లాలో ఖాళీలు లేవని విద్యాశాఖాధికారులు తెలుపటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో డీఎస్సీ–98 ఉపాధ్యాయులు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. ఈ ఏడాది తమకు న్యాయం చేస్తారని అంతా భావించారు.

కౌన్సెలింగ్‌ కోసం ఆరాటపడినా..

డీఎస్సీ–98 కాంట్రాక్టు టీచర్స్‌కు 2024–25 విద్యా సంవత్సరంలోనూ కొనసాగిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీ–2008 వారితో కలిపి అందరినీ 11 నెలల కాలానికి విధుల్లోకి తీసుకుంటూ, గత ఏడాది పనిచేసిన స్థానాల్లోనూ పోస్టింగ్‌లు కేటాయిస్తూ ఉమ్మడి జిల్లా స్థాయిలో సర్వీసు పరమైన వ్యవహారాలు చూసే విశాఖ డీఈవో ఎల్‌.చంద్రకళ ఈ నెల 13న ఆదేశాలు ఇచ్చారు. 2024–25 విద్యా సంవత్సరానికి 1998, 2008 డీఎస్సీల వారికి కలిపి కౌన్సెలింగ్‌ ప్రాతిపదికన పోస్టింగ్‌ ఇస్తారని అంతా భావించినా, ఏ ఒక్కరూ తమ గోడు పట్టించుకోకపోవటం సరైంది కాదని ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రస్తుతం డీఎస్సీ కోసం ఖాళీల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నందున గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా సొంత గ్రామాలకు దగ్గరలో ఉన్న ఖాళీల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement