గురుబ్రహ్మకు రిమ్మ తెగులు
చోడవరం రూరల్: స్థానిక పాత పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థినుల పట్ల అనుచిత ప్రవర్తనకు దిగిన కాంట్రాక్టు లెక్చరర్‌పై పోక్సో కేసు నమోదైంది. బాధితురాలి బంధువుల చేతిలో దెబ్బలు తిన్న నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై కూడా కేసు పెట్టారు. కళాశాలల ప్రాంతీయ సంచాలకులు ఎస్.శోభారాణి గురువారం విచారణ కూడా చేశారు. అయితే ఈ విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా గోప్యత పాటిస్తున్నారు. ఇక ఈ వివాదంపై ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు రెండు వర్గాలకు 41 ఎ నోటీసులు అందించి కేసులు నమోదు చేసి మిన్నకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కళాశాలలో కెమెస్ట్రీ విభాగంలో కాంట్రాక్టు లెక్చరర్‌గా చేస్తున్న సూరెడ్డి కనకారావు కళాశాల విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం కొంతకాలంగా సాగుతోంది. ఒక విద్యార్థిని ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో ఆమె కుటుంబీకులు, స్నేహితులు కలిసి లెక్చరర్ కనకారావుపై భౌతిక దాడికి దిగారు. దీంతో ఆయన చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాధిత విద్యార్థినులంతా కలసి లెక్చరర్ లైంగిక వేధింపుల పట్ల పోలీసులను ఆశ్రయించారు. లెక్చరర్‌పై పోక్సో కేసుతోపాటు, అతనిపై భౌతికంగా దాడికి దిగిన వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ అప్పలరాజు తెలిపారు. గురువారం కళాశాలకు చేరుకున్న ఆర్జేడీ కాంట్రాక్టు లెక్చరర్ నుంచి, బాధిత విద్యార్థినుల నుంచి వాంగ్మూలాలను సేకరించినట్టు తెలిసింది. కాగా కాంట్రాక్టు లెక్చరర్ కనకారావు ప్రమోషన్ లిస్టులో ఉండడంతో అతడిని ఈ గండం నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
విద్యార్థినులను వేధిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్
దేహశుద్ధి చేసిన ఒక బాలిక బంధువులు
నిందితుడిపై పోక్సో కేసు.. ఆర్జేడీ విచారణ
గోప్యంగా ఉంచిన చోడవరం పాత పాలిటెక్నిక్ కాలేజీ వర్గాలు
Comments
Please login to add a commentAdd a comment