ఆరు నెలలైనా సమస్యలు పట్టవా?
యలమంచిలి రూరల్: అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా విద్యార్థుల సమస్యలు మీకు కనిపించడం లేదా? అని కూటమి ప్రభుత్వాన్ని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థులకు మంచి జరుగుతుందని భావించి.. ఓట్లేసి గెలిపించామని, చంద్రబాబు ముఖ్యమంత్రి, పవన్‌కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి, పలువురు పార్టీల నాయకులు మంత్రులు అయ్యారు తప్ప జనానికి, విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ 3వ జిల్లా సభలు యలమంచిలి పట్టణంలో జరిగాయి. ముందుగా స్థానిక ఆర్టీసీ బస్టాండు నుంచి పాత సినిమా హాలు వరకు వివిధ కళాశాలలకు చెందిన ఇంటర్, డిగ్రీ విద్యార్థులతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి, వసతి గృహాల్లో మెస్ చార్జీలు పెంచాలి.. అంటూ అధిక సంఖ్యలో విద్యార్థులు నినాదాలు చేశారు. అనంతరం పాత సినిమా హాలు వద్ద జరిగిన బహిరంగ సభలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యలమంచిలిలో విద్యార్థులకు అందుబాటులో ఉండే స్టూడెంట్ బస్ పాస్ కౌంటర్ అనకాపల్లికి తరలిపోయిందన్నారు. జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులను వసూలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. జైళ్లలో ఉంచుతున్న నేరస్థులకు ఆహారం పెట్టడానికి రోజుకు రూ.80 కేటాయిస్తుండగా.. హాస్టళ్లలో ఉంటున్న పేద విద్యార్థులకు మాత్రం రోజుకు రూ.50 మాత్రమే చెల్లిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్మోహన్ ఆరోపించారు. పెరిగిన నిత్యావవసర వస్తువుల ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలను నెలకు రూ.3000కు పెంచాలన్నారు. నక్కపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో అనేక హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక విద్యార్థుల సమస్యల్ని మర్చిపోయి అందర్నీ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదన్నారు. ఇటీవల కలెక్టర్ల సమావేశం పెట్టిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు తమ 6 నెలల పాలన బాగుందంటూ వాళ్లకి వాళ్లే గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 7న ప్రభుత్వ స్కూళ్లలో నిర్వహించిన మెగా తల్లిదండ్రుల సమావేశంలో తల్లిదండ్రులు, విద్యార్థులను ప్రేక్షకులుగా కూర్చోబెట్టి నాయకులు ప్రసంగించారే తప్ప ఆయా స్కూళ్లలో సమస్యలపై చర్చించిన దాఖలాలు లేవన్నారు. నిరంకుశ విధానాలు విడనాడకపోతే ఏదో ఒక రోజు శ్రీలంక, బంగ్లాదేశ్ పరిస్థితులు రాకతప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమణ, జిల్లా అధ్యక్షుడు గీతాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు మైలపల్లి బాలాజీ, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు చింతకాయల శివాజీ, యలమంచిలి డివిజన్ ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి మణికంఠ, సోమునాయుడు, బాలాజీ, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి
మహాసభలో మండిపడ్డ ఎస్‌ఎఫ్‌ఐ నేతలు
ర్యాలీతో కదం తొక్కిన విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment