కూటమి కుట్రలు పటాపంచలు
● ఎట్టకేలకు రైతులకు నీటి తీరువా రశీదులు ● తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళన ● దిగివచ్చిన రెవెన్యూ యంత్రాంగం
నక్కపల్లి: నీటి సంఘాల ఎన్నికలను దొడ్డిదారిని నిర్వహించి ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ లేకుండా చేయాలని ప్రయత్నించిన కూటమి నాయకుల కుట్రలు పటా పంచలయ్యాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు నీటి తీరువా కట్టించుకోకుండా తప్పించుకు తిరుగుతున్న వీఆర్వోలు ఎట్టకేలకు దిగొచ్చారు. రైతుల నుంచి పన్ను కట్టించకుని రశీదులు అందజేశారు. ఎన్నికల్లో అనర్హత వేటుకు కూటమి కుయుక్తులు అనే శీర్షికన సాక్షి దినపత్రికలో కథనం వెలువడింది. దీనికి తోడు రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో రెవెన్యూ యంత్రాంగం దిగివచ్చింది. మండలంలో జరిగే నీటి సంఘాల ఎన్నికల్లో డైరెక్టర్లుగా పోటీ చేసే రైతుల నుంచి నీటి తీరువా కట్టించుకోకుండా కూటమి నాయకులు రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చారు. గత నాలుగు రోజుల నుంచి వీఆర్వోలు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అందుబాటులో ఉండకుండా పావులు కదిపారు. తహసీల్దార్ కూడా తనకేమీ సంబంధం లేదని, నీటి తీరువా వసూలు చేసే బాధ్యత వీఆర్వోలదేనని చేతులెత్తేశారు. ప్రధానంగా గొడిచర్ల, ఉద్దండపురంలో 200 ఎకరాల ఆయకట్టుపైబడి ఉన్న చెరువుల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ మూడు చెరువుల్లో ఆయకట్టు రైతుల్లో ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే ఉన్నారు. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొలేక కొంత మంది కూటమి నాయకులు రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చారు. డైరెక్లర్లుగా పోటీచేసే రైతుల నీటితీరువా కట్టించుకోకుండా పావులు కదిపారు. రైతులు నీటి తీరువా చెల్లిస్తామని రశీదులు ఇవ్వాలని కోరినప్పటికీ సదరు వీఆర్వోల నుంచి స్పందన లేదు. దీంతో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ బొల్లం బాబ్జి, వైస్ ఎంపీపీ వీసం నానాజీ, ఎంపీటీసీ సభ్యుడు బచ్చలరాజు, నిట్ల గోవిందు, సర్పంచ్ పొడగట్ల వెంకటేష్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పొడగట్ల పాపారావు తదితర రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమ రైతులకు రశీదులు ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించారు. దీంతోఽ అధికారులు దిగివచ్చారు. వీఆర్వోలు వచ్చి రైతుల నుంచి నీటితీరువా వసూలు చేసి రశీదులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment