వ్యయసాయ రంగాన్ని పరిరక్షించుకుందాం
అనకాపల్లి: వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని, జిల్లాలో గత ఏడాది లక్ష హెక్టార్లలో చెరకు పంట వేశారని, ఈ ఏడాది 7 వేల హెక్టార్ల చెరకు పంట తగ్గిందని గుంటూరు అంగూర్ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు జి.శివనారాయణ అన్నారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయంలో 65వ కిసాన్ మేళా కార్యక్రమం శుక్రవారం ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ సీహెచ్ ముకుందరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో అన్ని శాఖలు సమష్టిగా పని చేయాలన్నారు. రానున్న రోజుల్లో రైతాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా జిల్లాలో చెరకు పంట తగ్గిందని, జిల్లాలో ప్రస్తుతం ఒకే ఒక చెరకు ఫ్యాక్టరీ ఉండడంతో రైతులు చెరకు పంట కంటే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. మరో ముఖ్య అతిథి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయం ఖర్చుతో కూడుకుందని, రైతులకు లాభసాటిగా లేకపోవడంతో వారు విముఖత చూపుతున్నారని అన్నారు. మన రాష్ట్రం జాతీయ స్థాయిలో పాలు, గుడ్లు, పశుసంపద, వరి వివిధ రకాల కూరగాయల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందన్నారు. చెరకు పంటకు పూర్వ వైభవం కల్పించేందుకు ప్రయత్నించాలన్నారు. ఏడీఆర్ సీహెచ్ ముకుందరావు మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటిగా మారేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌లో రైతులకు వరి, చెరకు, చిరుధాన్యాలపై దశల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రైతులు పంటలు వేసుకునే సమయంలో నేలసారాన్ని పరీక్షించి, అక్కడ ఏ పంట వేసుకుంటే లాభాలు ఆర్జించవచ్చో దానిపై దృష్టి సారించాలన్నారు. గత ఏడాది ఆర్‌ఏఆర్‌ఎస్ సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 10 మందిని అవార్డులతో సత్కరించారు. రైతులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కిసాన్ మేళాలో రైతులకు ఉపయోగపడే వివిధ స్టాళ్లను ఎమ్మెల్యే, విస్తరణ సంచాలకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్తలు పి.వి.కె.జగన్నాథరావు, డి.ఆదిలక్ష్మి, కె. రమణమూర్తి, డి.ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, రైతులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
అంగూర్ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు శివనారాయణ
ఆర్‌ఏఆర్‌ఎస్‌లో 65వ కిసాన్ మేళా
వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 10 మందికి అవార్డులు
Comments
Please login to add a commentAdd a comment