ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
నర్సీపట్నం : అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, కంపరేవుల గ్రామానికి చెందిన పి. చంద్రశేఖర్ అనే గిరిజన యువకుడు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టౌన్ ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు అందించిన వివరాలివి. ఉదయం వాకింగ్‌కు వచ్చిన వారు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం వద్ద బ్యాగ్ లభించింది. అందులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా నర్సీపట్నం అయ్యన్న కాలనీలో నివాసం ఉంటున్న మృతుడి సోదరుడు గోవిందరావుకు సమాచారం అందించారు. మృతుడు పట్టణంలోని బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. వారం క్రితం స్వగ్రామం వెళ్లి మంగళవారం సోదరుడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లిన అతను స్టేడియంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment