అయ్యవార్ల ఎన్నికలకు వేళాయె...
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 24 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
● ఉదయం 8 నుంచి ఓటింగ్ ప్రారంభం
● జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,885 మంది టీచర్లు
● జీవీఎంసీ హైస్కూల్ నుంచి ఎన్నికల సామగ్రి తరలింపు
సాక్షి, అనకాపల్లి :
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది, పోలీస్ బలగాలు చేరుకున్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన నిఘా కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఇన్, అవుట్ సబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేసి..ఎన్నికల సరళి, అదేవిధంగా ఓటర్ల క్యూలైన్లను పరిశీలించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 24 పోలింగ్ కేంద్రాల పోలింగ్ సరళి పరిశీలించడానికి కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూంను కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలో 2885 ఉపాధ్యాయులు(ఓటర్లు) ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 2,885 మంది టీచర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. వారిలో 1,789 మంది పురుషులు, 1,096 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.
భద్రత కట్టుదిట్టం
పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్ట భద్రతకు చర్యలు తీసుకున్నారు. ఒక్కొక్కరికీ ఓటు వేయడానికే మూడు నుంచి ఐదు నిమిషాలు పట్టే అవకాశం ఉంది. అందుకు 300 ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రంలో రెండో కంపార్ట్‌మెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రాధాన్యతా క్రమంలో ఎన్నుకోవాలి. ఇందుకు ఆయా అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉన్న గడిలో 1, 2, 3 అంటూ నంబర్లు వేయాలి. ఈ లెక్కన గంటకు 12 నుంచి 20 మందికి మించి ఓటు వేయడం అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు..
జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, పోలింగ్ కేంద్రం వద్ద ఎండ వేడిమి తగలకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. టాయిలెట్ సదుపాయం లేని దగ్గర బయోటాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఓటర్లు సులభంగా పోలింగ్ కేంద్రంలోకి చేరుకునే విధంగా మహిళలకు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వికలాంగులకు, అనారోగ్య సమస్యలున్న ఓటర్లకు ప్రత్యేక అవసరాలు గల ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ ఛైర్లు అందుబాటులోకి ఉంచారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇన్, అవుట్ వెబ్‌కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు వేళయింది. ఎన్నికల పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాలకు చేరాయి. ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
జీవీఎంసీ హైస్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు..
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు గానూ బుధవారం ఉదయం 8 గంటలకు అనకాపల్లి టౌన్‌లో గల జీవీఎంసీ హైస్కూల్లో 10 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా ఎన్నికల సామగ్రి అందజేశారు. జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలకు 10 రూట్‌లుగా డివైడ్ చేసి 10 మంది సెక్టార్ అధికారులను, మరో 10 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. 10 రూట్‌లకు 10 బస్సుల్లో ఎన్నికల సమాగ్రి, సిబ్బందిని కేంద్రాలకు తరిలించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద పీవో, ఏపీవో, మరో ఇద్దరు అధికారులు, ఒక్కో మైక్రో అబ్జర్వర్‌తో పాటు ఒక ఎస్‌ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్, స్ట్రైకింగ్ ఫోర్సు ఉంటుంది. జిల్లాలో మొత్తం 145 మంది ఎన్నికల సిబ్బంది, పోలీసులు ఇప్పటికే కేంద్రాలకు చేరుకున్నారు.
అయ్యవార్ల ఎన్నికలకు వేళాయె...
అయ్యవార్ల ఎన్నికలకు వేళాయె...
Comments
Please login to add a commentAdd a comment