
రైవాడ జలాశయంలో భారీ చేపలు
దేవరాపల్లి: రైవాడ జలాశయంలో మత్స్యకారుల వలలకు భారీ చేపలు చిక్కుతున్నాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో భారీగా చేపలు దొరుకుతున్నాయి. సాధారణంగా ఇక్కడ ఐదు కేజీల లోపు బరువున్న చేపలు మాత్రమే లభిస్తాయి. ప్రస్తుతం వరద నీరు వచ్చి చేరడంతో సుమారు 10 కేజీల బరువున్న బొచ్చు, శీలావతి తదితర రకాల చేపలు వలకు చిక్కుతున్నాయి. కేజీ ధర రూ.200 పలికినా చేపల ప్రియులు పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు. రైవాడ జలాశయంలోని చేపలు రుచికరంగా, తాజాగా ఉండటంతో డిమాండ్ ఎక్కువ.
నిండుకుండలా రైవాడ జలాశయం
రైవాడ జలాశయం నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 111.70 మీటర్లకు చేరుకుంది. జలాశయంలోకి సుమారు 200 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉండటంతో రబీలో సాగు నీటికి ఢోకా ఉండబోదని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలాశయానికి ఎగువ భాగంలో వర్షాలు కురిస్తే జలాశయంలోకి మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉందని జలాశయ డీఈఈ జి.సత్యంనాయుడు తెలిపారు.
వరద నీరు వచ్చి చేరడంతో ఇబ్బడి ముబ్బడిగా మత్స్యాలు
ఎగబడి కొనుగోలు చేసిన చేపల ప్రియులు