
పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని ధర్నా
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు
అనకాపల్లి: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్.శంకరరావు డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై బాదుడు ప్రారంభించిందన్నారు. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రూ.50 పెంచి గ్యాస్ వినియోగదారుల నడ్డివిరిచిందన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులు, విద్యుత్ చార్జీలు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పుండు మీద కారం చల్లిన చందంగా మళ్లీ గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని, పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత గ్యాస్ పథకంపైన భారం పడుతుందని, పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చేప్పేరోజులు దర్గర పడ్డట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వి.వి.శ్రీనివాసరావు, అల్లు రాజు, జి.నాయనబాబు, కె.ఈశ్వరరావు, కె.తేల్లయ్యబాబు, నూకఅప్పారావు తదితరులు పాల్గొన్నారు.