పాఠశాలల్లో న్యూట్రీషన్‌ గార్డెన్లు | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో న్యూట్రీషన్‌ గార్డెన్లు

Published Fri, Sep 27 2024 3:18 AM | Last Updated on Fri, Sep 27 2024 3:18 AM

పాఠశా

అనంతపురం అర్బన్‌: పీఎం పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల ఆవరణలో న్యూట్రీషన్‌ గార్డెన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూట్రీషన్‌ గార్డెన్ల ఏర్పాటుతో విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించడంతో పాటు పర్యావరణంపై పరిజ్ఞానాన్ని పెంపొందించవచ్చన్నారు. పర్యావరణ సమస్యలు, సేంద్రియ పద్ధతులపై అవగాహన కల్పించవచ్చన్నారు. ఉపాధి పథకం ద్వారా పాఠశాల ఆవరణ చుట్టూ మునగ, కరివేపాకు మొక్కలు నాటాలన్నారు. ప్రతి స్కూలులో కిచెన్‌ గార్డెన్‌కు సంబంధించి ఉపాధ్యాయుడిని నోడల్‌ అధికారిగా నియమించాలని, హార్టికల్చర్‌ అసిస్టెంట్లు పర్యవేక్షించేలా చూడాలన్నారు. కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటుకు అవసరమైన పరికరాల కోసం సర్వ శిక్ష అభియాన్‌ నిధులు అందిస్తామన్నారు. దీంతో పాటు ఆయా పాఠశాలల్లో ఒక ఎకో–క్లబ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల స్థాయి ఎకో–క్లబ్‌లో టీమ్‌ లీడర్‌గా ప్రధానో పాధ్యాయుడు, సహాయకులుగా ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక తరగతి ఉపాధ్యాయుడు, కో–ఆర్డినేటర్‌గా ఒక విద్యార్థి, సభ్యులు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉండాలన్నారు. జిల్లాస్థాయి ఎకో–క్లబ్‌కు కలెక్టర్‌ లేదా జెడ్పీ సీఈఓ చైర్‌పర్సన్‌గా, కన్వీనర్‌గా జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రతినిధులుగా కృషి విజ్ఞాన కేంద్రం ఇన్‌చార్జి, అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ/ ఉద్యాన శాఖ, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు నుంచి ఒక్కొక్కరు ఉంటారని చెప్పారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.వినూత్న, డీఈఓ వరలక్ష్మి, ఏడీ నాగరాజు, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు అరికట్టాలి

జిల్లాలో బాల్యవివాహాలు అరికట్టాలని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్పరెన్స్‌ హాలులో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అధికారులందరూ చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ మేడా రామలక్ష్మి, డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, డీఆర్‌డీఏ పీడీ ఓబుళమ్మ, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, డీఈఓ వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ ఏర్పాటుకు చర్యలు

అనంతపురం కార్పొరేషన్‌: నగరంలో మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. గురువారం నగరంలోని టవర్‌క్లాక్‌ వద్ద ఓవర్‌ బ్రిడ్జ్‌ కింద వైపు స్థలంతో పాటు పాతూరులోని తాడిపత్రి బస్టాండ్‌ సర్కిల్‌ ప్రాంతాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో భాగంగా నగరంలో మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. 30 బైకులు, 10 నాలుగు చక్రాల వాహనాలు, 20 మిక్స్‌డ్‌ వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు స్థలాలను గుర్తించాలన్నారు. ఒక్కో మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ను రూ.50 లక్షలతో ఏర్పాటు చేయాలన్నారు. టవర్‌ క్లాక్‌ బ్రిడ్జ్‌ కింద ఖాళీ స్థలంలో గ్రీనరీ ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు నగరంలోని కోర్టు రోడ్డులో ఉన్న పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ కార్యాలయంలో నాలా ట్రాక్టర్‌ ట్రాలీని, జేసీబీలను కలెక్టర్‌ పరిశీలించారు. నేషనల్‌ క్లీన్‌నెస్‌ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని, రోజూ నివేదికలు అందించాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ నాగరాజు, ఈఈ సూర్యనారాయణ, డీఈ సుభాష్‌ చంద్రబోస్‌, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పాఠశాలల్లో న్యూట్రీషన్‌ గార్డెన్లు 1
1/1

పాఠశాలల్లో న్యూట్రీషన్‌ గార్డెన్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement